ఆగస్ట్ 16 వరలక్ష్మీ వ్రతం
శ్రీమహావిష్ణువులానే శ్రీమహాలక్ష్మీదేవి సర్వవ్యాపితమై లోకజననిగా పేరు పొందింది. ‘సంసార సాగరంలో మునిగిపోయే వారు నన్ను పొందేందుకు లక్ష్మీదేవిని కటాక్ష రూపిణిగా మహర్షులు నిర్ణయించారు. అది నాకూ సమ్మతమే’ అని స్కంద పురాణంలో విష్ణు వాక్యంగా చెబుతారు. ధనం అంటే కేవలం సంపదే కాదు. మానవ మనుగడలో భాగమైన ఆరోగ్యం, ఆయుస్సు, విద్య, వివేకం,సౌభాగ్యం, ధైర్యం, స్థైయిర్యం, అభయం, విజయం తదితరాలు కూడా. వీటన్నిటికి అధిదేవత శ్రీమహాలక్ష్మిని అర్చిస్తే సర్వం సమకూరు తాయంటారు. సదాచార పరాయణత, స్త్రీలు మన్ననలు అందుకునే చోటు, కన్నవారిని గౌరవిస్తూ, బంధుప్రీతి, శుచీశుభ్రత, తులసీ తదితర మంగళకర వస్తువులు, మంగళవాద్యాలు, దీపకాంతులు, సర్వదేవతలను అర్చించే స్వరం, ఆనందం, ఉత్సాహం, క్రమశిక్షణ, కార్యశూరత్వం, సమయపాలన వంటి లక్షణాలు కల ప్రదేశాలు అమ్మవారి ఆవాసాలట.
సమస్త సంపదలకు మూలం అదిలక్ష్మి అని, ఆమె కృపాకటాక్షాలతోనే మానవ మనుగడ సాగుతోందని, ఆ దేవి దయ ఉంటే సంపదలు సమకూరుతాయని ఆధ్యాత్మికవేత్తల భావన, విశ్వాసం. ఆమె ప్రాణనాథుడు శ్రీమన్నారాయుణుడి జన్మ నక్షత్రం శ్రవణం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసంలో అర్చించడం మరింత విశేషమని చెబుతారు. లక్ష్మీనారాయణులది అవినాభావ సంబంధం. అమ్మవారు వాక్కు అయితే, ఆయన భావం. అమె సంతోషం అయితే, ఆయన సంతృప్తి, ఆమె కాంతి అయితే, ఆయన చంద్రుడు. ఆమె ధర్మపరత్వమైతే ఆయన ధర్మం. ఆ ఆదిదంపతుల అర్చనం ద్వారా మోక్షప్రాప్తి కలుగుతుంది. వైకుంఠ వాకిలి మోక్షద్వారం. అక్కడ అమ్మవారు ‘మోక్షలక్ష్మి’గా కొలువై ఉంటారని పెద్దలు చెబుతారు. ఆమె స్థితి కారకురాలు. ఆ తల్లి కరుణాకటాక్షాల కోసం తపించని వారు ఉండరు. మానవ జీవితంలో ఆనందమయ ప్రతి క్షణం లక్ష్మీకటాక్షమే. ఆమె ఐశ్యర్యానికి అధిష్ఠాన దేవత అయినా.. కేవలం ధన రూపంలోనే ఉండదు. సంపదగల వారంతా సుఖ సంతోషాలతో జీవించగలుగుతున్నారా? అని ప్రశ్నించుకుంటే లక్షీ‘కటాక్షం’ తత్త్వం అర్థమవు తుంది. అంతటి మహిమాన్విత తల్లిని సౌమాంగల్యం, సత్సంతానాభివృద్ధి కోసం, ప్రధానంగా శ్రావణ మాసంలో వరలక్ష్మిగా ఆరాధిస్తారు.
వైవాహిక జీవితం సవ్యంగా సాగాలని వివాహితలు, దీర్ఘ సౌభాగ్యం కోసం కొత్తగా పెళ్లయిన వారు, ఉత్తమ జీవిత భాగస్వాముల కోసం అవివాహితలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. సౌభాగ్యం, సత్సంతానం ద్వారా వంశాభివృద్ధిని ప్రతి మహిళ అభిలషిస్తుందనేందుకు ఈ వ్రతాన్ని ప్రత్యక్ష నిదర్శనంగా చెబుతారు.ఆషాఢంలో పుట్టినింట ఉండే నవవధువులు శ్రావణం ప్రవేశించాక, మొదటి మంగళవారం నోము జరుపుకుని మెట్టినింటికి చేరి వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం ఆచారంగా వస్తోంది. ఈ మాసంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తే దీర్ఘ సుమంగళీయోగం, అష్టైశ్వరాలు లభిస్తాయని విశ్వసిస్తారు. వివాహితలు శ్రావణం లోని శుక్రవారాలు లక్ష్మీపూజ, పెళ్లికాని యువతులు మంగళ వారాలు మంగళగౌరి వ్రతం ఆచరించడం సంప్రదాయం.
గృహిణ సలక్షణాలను వర్ణిస్తూ ‘రూపేచ లక్ష్మీ’ అన్నారు. అంటే సర్వాభరణ భూషితురాలని అర్థం కాదు. నవ్వు ముఖం, సౌమ్యత, ఆదరణ, ప్రేమాభి మానాలతో కూడిన పలకరింపు ఉత్తమ లక్షణాలని, లక్ష్మీదేవి ఆరాధనతోనే అవి సంక్రమిస్తాయన్నది పెద్దల మాట. లక్ష్మీదేవికి స్థిరత్వం ఉండదని, చంచల, చపలచిత్త.. అని లోకంలో వ్యాఖ్యానాలు ఉన్నాయి కాని అందుకు కారణాల గురించి మాత్రం యోచన చేయరు. సంపద (లక్ష్మి) రాకపోకల గురించి ప్రచారంలో ఉన్న పౌరాణిక గాథ ప్రకారం, ఇంద్రుడు అహంకరించి, విష్ణుప్రసాదాన్ని ధిక్కరించి, ఆ తర్వాత పశ్చాత్తాపంతో హరిని చేరగా, ‘విష్ణు`గోసేవలు, దైవారాధన, ధర్మనిష్ఠ, సత్య భాషణం, సదాచారం, శుచీశుభ్రత, ప్రేమానురాగాలు గల లోగిళ్లే లక్ష్మీ నివాసాలు. పరుష సంభాషకులు, సూర్యోదయ, సూర్యాస్తమయాల్లో నిద్రించేవారి, చిరిగిన దుస్తులు ధరించే వారి ఇంట లక్ష్మి క్షణమైనా ఉండదు’ అని చెప్పాడట. ఏనుగులతో అభిషేకం అందుకుంటున్న శ్రీమహాలక్ష్మిని ఉదయం నిద్రలేవగానే స్మరించడం వల్ల ఆరోగ్యానికి, ఇంటికి లోటు ఉండదని శంకర భగవత్పాదులు పేర్కొన్నారు.
అష్టలక్ష్ములుగా భక్తాజనావళిని అనుగ్రహించే శ్రీసతి గురించి కవిసార్వభౌముడు శ్రీనాథ మహాకవి..
‘కమల నయన!నీవు కలచోటు సరసంబు
నీవు లేని చోటు నీరసంబు
కంబుకంఠి!నీవు కలవాడు కల వాడు
లేనవాడు నీవు లేని వాడు’ అని చాటువు శైలిలో వ్యాఖ్యానించాడు.
వరలక్ష్మీ వ్రతం
‘లోకంలో పరమపావనమైన వ్రతం ఏది?’ అని అడిగిన జగన్మాత పార్వతీదేవికి మహాదేవుడు ఈ వరలక్ష్మీ వ్రత విశిష్టతను వివరించారని, ఆమె మొట్ట మొదటిసారిగా ఈ ఆచరించి నవరత్న ఖచితమైన లంకానగరాన్ని సంపదగా పొందిందని భవిష్యోత్తర పురాణం పేర్కొంటోంది.
దేవదానవులు అమృతం కోసం పాలకడలిని చిలికి నప్పుడు శుక్రవారం అవతరించిన అమ్మవారిని విష్ణు పురాణం ‘విశ్వమాత’గా అభివర్ణించింది. అందుకే లక్ష్మీదేవికి శుక్రవారం ప్రీతికరమైనదిగా చెబుతారు. భృగుప్రజాపతి తపస్సుకు మెచ్చి లక్ష్మీదేవి ఆయన తనయగా అవతరించినందున, ఆయన అధిపతిగా ఉన్న శుక్రవారం (భృగు వాసరం) లక్ష్మీపూజకు శ్రేష్ఠమని శాస్త్రం. శ్రావణ శుక్రవారాలు, వాటిలోనూ శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారమంటే అమ్మవారికి మరింత మక్కువట. కనుకనే ఆ రోజు ధనికపేద, చిన్నా పెద్దా తేడా లేకుండా సర్వులు భక్తశ్రద్ధలతో శక్తి మేరకు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరించాలని ‘వ్రతరత్నాకరం’ చెబుతోంది. అవకాశం లేనివారు ఈ మాసంలోనే ఇతర శుక్రవారం కూడా వ్రతం ఆచరించవచ్చని పెద్దలు ప్రత్యామ్నాయం సూచిం చారు. సత్సంకల్పంతో కోరే దేనినైనా అనుగ్రహించే తల్లి ‘వర’లక్ష్మిగా లోక ప్రసిద్ధమైంది. శ్రావణ శుక్రవారం వచ్చిందంటే ఇల్లాలు అష్టలక్ష్మికి ప్రతిరూప మవుతుంది. ఈ కాలంలో దొరికే అన్ని రకాలు పూవులు, పళ్లతో అమ్మవారిని అలంకరిస్తారు. నైవేద్యంగా సమర్పించే పదార్థాలన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. సెనగ, వేరుశనగ, మినప, పెసరపప్పుల్లో, బెల్లం, మిరియాలు, నెయ్యి, చింతపండు, ఇంగువ తదితర వస్తువుల్లో విటమిన్లు, కాల్షియం, ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయని వైద్య, వ్యయసాయ నిపుణులు చెబుతారు.
ఈ వ్రత ఆవిర్భావానికి సంబంధించిన గాథ ప్రకారం… చారుమతి సాధ్వికి కలలో కనిపించిన లక్ష్మీదేవి, శ్రావణ పున్నమికి ముందు వచ్చే శుక్రవారం తనను ఆరాధిస్తూ వ్రతం చేసేవారిని అనుగ్రహిస్తానని దీవించింది ఆనందంతో ఆమె.
‘నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే
శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణువక్ష స్తలాలయే’ అని కలలోనే నమస్కరించింది. మరునాడు భర్త, అత్త మామలకు ఈ విషయం తెలిపి, వారి అనుమతితో తోటి ముత్తయిదువులతో కలసి శ్రద్ధాభక్తులతో పూజ నిర్వహించి, ఆత్మప్రదక్షిణకు ఉపక్రమించింది. మూడు ప్రదక్షిణలకు గాను వారికి వరుసగా, బంగారు గజ్జెలు, హస్తకంకణాలు, సర్వభరణాలు లభించాయట. అడగకుండానే ఐశ్వర్యాన్ని ప్రసాదించిన ‘అమ్మ’ను నిరంతరం పూజించాలన్న ఆకాంక్షే ‘వ్రతం’గా మారిందని అంటారు.
వ్రతవిధానం
సర్వసంపదలకు, సర్వసౌభాగ్యహేతువైన వరలక్ష్మి వ్రతం ధ్యాన ఆవాహనలతో ప్రారంభమై షోడశోపచార పూజ, అంగపూజ, అష్టోత్తరశత (సహస్ర) నామాలతో కొనసాగి, వ్రతకథతో పరిసమాప్తమవుతుంది. ఇది వ్రతం కనుక శాశ్వత విగ్రహం కాకుండా, పాత్ర (బిందె/కలశం)మీద కొబ్బరికాయను పెట్టి, ఆసీనురాలైన లక్ష్మీదేవిలా ప్రతిమను సిద్ధం చేసుకోవాలి. గణపతి/విష్వక్సేనులను పంచోపచారాలతో (స్నానం,అర్చన, నైవేద్యం, ప్రదక్షిణం, నమస్కారం) అర్చించి, అమ్మవారిని విధివిధానాలతో ఆ కలశంలోకి అవాహనం చేస్తారు. సప్త మాతృకలను పూజిస్తూ (కౌమారి పూజ)వారిలో ఒకరైన స్కందమాతను ప్రధానంగా అర్చిస్తారు. వస్త్రాభరణాలతో అలంకృతjైున స్త్రీమూర్తిని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా సంభావించడం ఈ వ్రతం నాటి ప్రత్యేకత. వ్రత కథా శ్రవణం తరువాత మహిళలు మంగళహారతులు ఇస్తూ ఆలపించే…
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా
వరలక్ష్మీ తల్లీ..! ఎట్లా నిన్నెత్తుకొందూనమ్మా’ మంగళ హారతిపాట తెలుగు నాట అత్యంత ప్రసిద్ధం. ‘జగాలను మోసే తల్లివి. ఆయువృద్ద్ధి అష్టైశ్వర్యాలు, అయిదోతనం ప్రసాదించే అమ్మవు. ఏడేడే లోకాల భారాన్ని భరించే తల్లివి. సామాన్య మానవులం నిన్ను ఎలా ఎత్తుకుని మోయగలం’ అనే అర్థంలో పాట సాగుతుంది.
వ్రతకర్తలు ముత్తయిదువలకు…
‘ఇందిరా ప్రతిగృహ్ణాతి ఇందిరా వై దదాతి చ!
ఇందిరా తారికా ద్వాభ్యామ్ ఇందిరా వై నమో నమః’ (తోటి ముత్తయిదువా! ఈ వ్రత పరిసమాప్తితో మనిద్దరం లక్ష్ములమే. మనందరిలోనూ చేతి తోరా ల్లోనూ లక్ష్మి ఉందని గ్రహించాను. లక్ష్మీ స్వరూపిణీవై దీనిని స్వీకరించు) అని వాయనం ఇస్తారు.
సర్వసంపదలు అనుగ్రహించే వరలక్ష్మిని శ్రావణంలోనే కాదు… నిరంతరం అర్చించాలి. పసుపు, కుంకుమ, పూలు, సుగంధóద్రవ్యాలు, ఆవునేతితో వెలిగే జ్యోతి రూపంలోనూ గౌరీదేవి కొలువై ఉంటుందని, అందుకే ఇంటికి వచ్చిన ముత్తయిదువులకు మంగళకరమైన వస్తువులు ఇచ్చి ఆశీర్వాదం పొందుతుంటారు. ఈ వేడుకల వల్ల ఆధ్యాత్మికతే కాక పాటు సామాజిక బంధాలు పటిష్ట మవుతాయి. పేరంటం వేడుకలో ఇచ్చిపుచ్చు కోవడంతో పాటు స్నేహభావం, సహకార భావం పెంపొందే అవకాశం.
‘పద్మాసనే పద్మకరే సర్వలోక పూజితే
నారాయణప్రియే దేవి సుప్రీత భవసర్వదా’
– డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి : సీనియర్ జర్నలిస్ట్