‘‘‌స్వభావ సిద్ధంగా భారతీయ సమాజం సెక్యులర్‌. ‌కానీ, సెక్యులరిజం మాటున సనాతనధర్మం మతతత్వం గలదని ఆరోపిస్తూ, దానిని అనుసరించే వారిపట్ల శత్రుత్వభావం ఉన్నవారు ఎంత గొప్పవారైనా దేశద్రోహులే’’ అంటారు సీతారాం గోయెల్‌, ‘‌సెక్యులరిజం, దాని భావ వక్రీకరణ’ అన్న వ్యాసంలో. ఆయన చెప్పినట్టుగానే సనాతన ధర్మాన్ని దుమ్మెత్తిపోస్తూ, ఈ దేశంలో మైనార్టీలుగా చెప్పుకునేవారు రకరకాల రీతుల్లో చెలిరేగిపోతుంటారు. ఆ కోవలోకి వచ్చేదే ముస్లింలకు చెందిన ‘వక్ఫ్’ ‌బోర్డు. దానిని అడ్డుపెట్టుకుని చేస్తున్న అరాచకాలకు కళ్లెం వేసేందుకు కేంద్రం ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న వక్ఫ్ ‌సవరణ చట్టంలో ప్రతిపాదనలు ప్రభుత్వ వ్యతిరేకులందరి కోరికలనూ నెరవేరుస్తూ సెక్యులర్‌ ‌భావనలను కలిగి ఉండటం విశేషం.

వక్ఫ్ ‌ప్రస్తావన వారి పవిత్ర గ్రంథంలో లేదని ముస్లిం మతాన్ని అధ్యయనం చేసినవారు చెప్తున్నారు. ఈ భావనకు పునాది వారి ప్రవక్త మాటలు, చేతలను అభివర్ణించే పద్యాల అంతరార్థం మాత్రమేనని వారంటారు. ఏమైనప్పటికీ, గత పాలకులు తమ స్వార్ధం కారణంగా ఆమోదించిన వక్ఫ్ ‌బోర్డు బిల్లును అడ్డంపెట్టుకుని ఇస్లాం పుట్టక ముందు నుంచీ ఉన్న ప్రదేశాలను కూడా ఆక్రమించే యత్నం చేస్తున్న విషయం ఉత్తరాన ఉత్తరాఖండ్‌ ‌నుంచి దక్షిణాన తమిళనాడు వరకూ మనం చూస్తున్నాం. ఈ క్రమం లోనే దాని అడ్డగోలు వ్యవహారాలకు, అత్యాచారాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం వక్ఫ్ ‌సవరణ చట్టాన్ని రూపొందించింది.

వక్ఫ్ ‌చట్టంలో ప్రతిపాదిత సవరణలు ఊహించి నట్టుగానే విస్త్రత చర్చలకు దారి తీశాయి. పార్లమెంటు, మీడియా, వీధులలో కూడా దీనిని వ్యతిరేకించేందుకు తమను తాము సెక్యులరిస్టులుగా పిలుచుకునేవారు సిద్ధమయ్యారు. జాతీయవాదులలో ఒక వర్గం పూర్తిగా ఈ చట్టాన్నే రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేస్తున్నప్పటికీ, అలా చేస్తే భారత్‌లో మంటలు చెలరేగడానికి వారికి ఆయుధమిచ్చినట్టవు తుంది. అందుకే బీజేపీ ప్రభుత్వం సవరణల బాట పట్టిందన్నది నిర్వివాదం. ఈ సవరణ చట్టం అమలు వక్ఫ్ ‌బోర్డు నిర్వహణ, పాలన, ఆస్తుల పర్యవేక్షణలో అనూహ్యమైన మార్పులు తెస్తుంది. ముఖ్యంగా, పొరుగు దేశమైన బాంగ్లాదేశ్‌లో జరిగిన పరిణామా లతో వ్యతిరేక వర్గాలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ఓట్ల మీద ఆశతో అగ్నికి ఆజ్యం పోయకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ చట్టాన్ని జాయింట్‌ ‌పార్లమెం•రీ కమిటీకి పంపి వారి నోళ్లు ప్రస్తుతానికి మూయించింది. ఇంతకీ ఈ సవరణలు ఏమిటి? వాటి ప్రభావం భారత్‌పై ఎంత తీవ్రంగా ఉండనుందో పరిశీలిద్దాం.

వక్ఫ్ ‌చట్టం చారిత్రక పరిణామం

భారత్‌లో బ్రిటిష్‌ ‌ప్రభుత్వం ఉన్న సమయంలో రూపొందించిన వక్ఫ్ ‌చట్టంలో స్వాతంత్య్రానంతరం అనేక మార్పులు జరిగాయి. ఈ చట్టం ముస్లిం ఖాజాలు, ముల్లాలకు, వారిలో అగ్రవర్ణాలకు అసమానమైన అధికారాలను ఇస్తోంది. తర్వాత వచ్చిన సవరణలన్నీ కూడా నిత్యం ముస్లింల బుజ్జగింపు రాజకీయాలను కొనసాగించే గాంధీ కుటుంబం, కాంగ్రెస్‌ ‌పార్టీకి అనుకూలంగా చేపట్టినవే. వీటిలో అత్యంత ముఖ్యమైనవి 1995, 2014 (2013లోనే రూపొందించిన ముసా యిదాతో)లో చేసిన ప్రధాన సవరణలు. ఇవి వక్ఫ్ ‌బోర్డును భూకబ్జాలు చేసే తిమింగలంగా మార్చి వేశాయి. తాము అధికారం నుంచి వైదొలిగే ముందు కాంగ్రెస్‌ ‌పార్టీ 123 ఆస్తులను వక్ఫ్ ‌బోర్డుకు అప్పగించిందనే ఆరోపణలు ఉన్నాయి.

– వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు పునాదులు 1923లో బ్రిటిష్‌ ‌ప్రభుత్వం ఆమోదించిన అసలు చట్టంలో ఉన్నాయి. 1923లో రూపొందించిన ముసాయిదాను 1925లో చట్టంగా మార్చారు.

-స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, 1954లో నాటి ప్రధానమంత్రి జవాహర్‌లాల్‌ ‌నెహ్రూ వక్ఫ్ ‌బోర్డుకు చట్టపరమైన హోదా ఇచ్చారు. నూతనంగా రూపొందించిన రాజ్యాంగంలోకి ఈ బ్రిటిష్‌ ‌ప్రభుత్వ వ్యవస్థను జొప్పించారు.

–  ఆ తర్వాత ప్రభుత్వాలు వివిధ కారణాలు సాకుగా చూపి 1963, 1964, 1984లో వక్ఫ్ ‌చట్టానికి సవరణలు చేశాయి. అయితే, 1995, 2014లో కాంగ్రెస్‌ ‌నేతృత్వంలో చేసిన సవరణలకన్నా అరాచకమైనవి మరేవి ఉండవు.

ప్రధానిగా పివి నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం 1995లో విస్తృతమైన, గణనీయ మైన అంశాలను ఇందులో పొందుపరిచి, చట్టాన్ని తాజా పరిచింది. 1996లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ ‌తమ ప్రధాన, ప్రాథమిక ఓటు బ్యాంకును ఈ సవరణల ద్వారా బుజ్జగించే ప్యాకేజీని రూపొందించింది.

తర్వాత, 1995వంటి సంక్షోభాన్నే 2014లో ఎదుర్కొన్న కాంగ్రెస్‌ ‌పార్టీ నేతృత్వంలోని యూపీఏ కూటమి, తన శత్రువుగా భావించే బీజేపీ నేతృత్వంలో అభేద్యమైన మోదీ గాలిని ఎదుర్కొనవలసి వచ్చింది. అప్పటికే అభాసుపాలైన, తీవ్రంగా అవినీతిమయమైన యూపీఏ ప్రభుత్వం 2013 డిసెంబర్‌లో వక్ఫ్ ‌చట్టంలో దాదాపు భీకరమైన సవరణలను ప్రవేశ పెట్టింది. తమ విజయావకాశాల కోసం ఈ సవరణలు ఫిబ్రవరి 2014లో సరిగ్గా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చే ముందు చట్టంగా ఆమోదించింది. ఈ సవరణలు భారత్‌లో ఆస్తుల విషయంలో వక్ఫ్ ‌సమాంతరంగా పాలన చేసేందుకు దారి తీశాయి.

ప్రతిపాదిత సవరణ

దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న 2024 నాటి సవరణలు వక్ఫ్ ‌వ్యవస్థకు గల ఈ గుత్తాధిపత్య దంతా లను పీకివేసేందుకు ప్రతిపాదనలు చేస్తున్నాయి. ఈ సవరణలు సెక్యులర్‌, ‌ప్రగతిశీలమైనవే కాక ఇస్లామిక్‌ ‌చట్టంలోని నిబంధనలకు లోబడే ఉన్నాయి. ఈ సవరణలకు వ్యతిరేకంగా వక్ఫ్‌బోర్డు వాదించే అవకాశాన్ని వీటి స్వభావం నిర్వీర్యం చేస్తుంది. కనుక, వీధులలో అల్లర్ల ద్వారా లేదా దుష్ప్రచారం ద్వారా మాత్రమే ఇండి కూటమి ఈ సవరణలను అడ్డుకోగలదు. ఎందుకంటే, తమ శాశ్వత వోటు బ్యాంకును వారు బుజ్జగించకపోతే మొదటికే మోసం వచ్చే అవకాశాలున్నాయి.

వక్ఫ్ ‌చట్టంలో ప్రతిపాదించిన కీలక సవరణలు

ఈ సవరణలలో ఒకటి వక్ఫ్‌బోర్డును వంశ పారంపర్య వక్ఫ్‌లుగా విభజించింది. ఇది ‘ఉమ్మా’ (ఈ భూమి అంతా అల్లాకు చెందిందే అన్న భావన) పేరు తో ఏర్పడ్డ సున్నీ సంఘటనను విచ్ఛిన్నం చేస్తుంది. దీనితో, వక్ఫ్ ‌బోర్డు గతంలోలా అపరి మితంగా అధికారాలను అనుభవించలేదు. ఈ క్రమంలో వివిధ వక్ఫ్ ‌బోర్డుల మధ్య అంతర్గత కుమ్ము లాటలు జరిగే అవకాశాలున్నాయి. వైవిధ్యభరిత మైన ఇస్లామిక్‌ ‌సంప్రదాయాలను గుర్తిస్తూ, వక్ఫ్‌ను ‘ఆగాఖానీ వక్ఫ్, ‌బోహ్రా వక్ప్’ • అన్న కొత్త పేర్లతో విభజించనున్నారు. విరాళంగా ఇచ్చిన ఆస్తికి సరైన ప్రమాణ పత్రాలు లేకుండా, ఏ ఆస్తినైనా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించుకోవడానికి లేకుండా ఈ సవరణలు హామీ ఇస్తున్నాయి. నిర్దేశిత, పారదర్శక పద్ధతిలో ప్రకటన ద్వారా మాత్రమే వక్ఫ్‌కు ఇచ్చిన విరాళం వక్ఫ్ ఆస్తిగా మారుతుంది.

ప్రాచీన ఖాజీ నియంత్రిత వక్ఫ్ ఆధునీకరణ

మరొక కీలక సవరణ పర్యవేక్షణ, విచారణ అధికారాలను వక్ఫ్ ‌సర్వేయర్ల నుంచి ప్రభుత్వ నియమిత కలెక్టర్లకు మారుస్తుంది. ఇది వక్ఫ్ ‌చట్టం కింద దాఖలు చేసిన క్లెయిమ్‌లు, కౌంటర్‌ ‌క్లెయిమ్‌లపై సర్వేల నిష్పాక్షికతను నిర్ధారిస్తుంది. వక్ఫ్ ‌ముతావలీకి పరిమిత అధికారాలవల్ల, ఖాజీ ఆదేశాలపై ఆధారపడి ఉంటాడు. ఇప్పుడు, వక్ఫ్‌బోర్డు ప్రకటించే క్లెయిములను కలెక్టర్లు పర్యవేక్షించే అవకాశాన్ని ఈ నూతన సవరణ ఇస్తుంది.

అదనంగా, వక్ఫ్ ‌బోర్డు తన డాటాబేస్‌ను వ్యవస్థీకరించుకొని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థల కింద గల పోర్టల్‌లో అవసరమైన వివరాలు పొందుపరచవలసి ఉంటుంది. తద్వారా వక్ఫ్‌బోర్డు డేటాకు కేంద్రీకృత డిజిటల్‌ ‌వేదిక అందుబాటులో ఉండేలా నిర్ధారిస్తుంది. ఇది, పారదర్శకతను పెంచడమే కాదు, వక్ఫ్ ‌నిర్వహణను ప్రస్తుత పాలనా పద్ధతులతో సమలేఖనం చేస్తుంది. తద్వారా, వక్ఫ్ ‌ప్రత్యేకతను తగ్గించి అదే సమయంలో ఆధునీకరణకు హామీ ఇస్తుంది.

వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్‌

‌ప్రతిపాదిత సవరణలు వక్ఫ్ ఆస్తులను డిజిటల్‌ ‌పోర్టల్‌ ‌ద్వారా రిజస్ట్రేషన్‌ ‌చేయడాన్ని తప్పనిసరి చేస్తాయి. ఈ నిబంధన ఏకపక్షంగా వక్ఫ్ ‌భూములపై హక్కులను ప్రకటించకుండా అడ్డుకుంటుంది.

ముఖ్యంగా, నిర్దేశిత ఆరు నెలల కాలంలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ ‌జరగాలన్న నిబంధన, వక్ఫ్ ‌బోర్డు దోపిడీ చేసుకోవడానికి వీలుగా యూపీఏ ప్రభుత్వం చేసిన చట్టపరమైన లొసుగులను నిలిపివేస్తుంది.

 భారత దేశంలో ఆస్తుల నిర్వహణలో పారదర్శక తను పెంచి, మోసపూరిత క్లెయిములను అరికట్ట డాన్ని లక్ష్యంగా పెట్టుకుని రిజిస్ట్రేషన్లపై దృష్టిపెట్టడం జరిగింది. అంతేకాదు, ఈ సవరణ సీఏజీ (కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ ‌జనరల్‌) ‌నియమించిన ఆడిటర్లకు వక్ఫ్ ‌బోర్డును జవాబుదారీ చేస్తుంది. అంటే, నిధుల నిర్వహణలో జవాబుదారీతనాన్ని పెంచడానికి, ఆస్తుల క్రమబద్ధీకరణకు వక్ఫ్‌బోర్డేతరులు ఆమోదించిన ఆడిటర్ల ద్వారా ఆడిట్‌ ‌చేస్తారు.

తాము ఉపయోగిస్తున్న దానిని వక్ఫ్‌గా ప్రకటించుకునే అవకాశం తొలగింపు

ఈ ఉపయోగించుకోవడం అన్న నిబంధన, ‘ఒక్కసారి వక్ఫ్‌ది అయితే ఎప్పుడూ వక్ఫ్‌దే’ అన్న భావజాలాన్ని బలపరచింది. ఆస్తులను ఉపయో గిస్తున్నవారు దానిని వక్ఫ్‌గా పేర్కొనవచ్చని ఈ నిబంధన చెప్తుంది. ఒక్కసారి ఏదైనా ఆస్తిని వక్ఫ్‌గా ప్రకటిస్తే, దానిని తిరిగి పొందలేరని మరొక నిబంధన పేర్కొంటుంది.

అందుకే, 2024 సవరణలు ‘వక్ఫ్ ‌బై యూజ్‌’ అన్న నిబంధనను తొలగించింది. తద్వారా, దానిని చట్టబద్ధంగా విరాళంగా ఇస్తే తప్ప అది వక్ఫ్ ‌పరిధి లోకి రాదని, ఆ ఆస్తిపై యజమాని హక్కులను పునరుద్ధరించింది.

వక్ఫ్ ‌చట్టం నిర్వహణ, పాలన

మహిళలకు కూడా న్యాయం జరిగేలా, నూతన ప్రతిపాదన వక్ఫ్-అలాల్‌-ఔలాద్‌ ఆస్తులు మహిళలకు వారసత్వంగా వచ్చేలా నిర్ధారిస్తుంది. తద్వారా, పురుషాధిపత్య మతంలో జెండర్‌ ‌సమానతను ప్రోత్సహిస్తుంది.

దీనితోపాటుగా, ముస్లిం సమాజంలో బలహీన వర్గాలకు వక్ఫ్ ‌బోర్డులో ప్రాతినిధ్యం ఉండాలని ఈ సవరణలు సూచిస్తున్నాయి. తద్వారా, వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, పాలనలో ముస్లింలలో ఓబీసీలు, ఎస్‌సీలు సమ్మిళితం కావడాన్ని సవరణ నిర్ధారిస్తుంది.

ఈ వినూత్న నిబంధనలు ముస్లింలలోని అగ్రకులాల చేతుల్లోంచి వక్ఫ్ ‌బోర్డు నియంత్రణను తప్పించి, ముస్లిం సమాజంలోని అన్ని వర్గాలకూ అందులో గొంతుక ఉండేలా చూస్తాయి.

ప్రస్తుతం 1.2లక్షల కోట్ల విలువైన వక్ఫ్ ఆస్తులు సుమారు 200 వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. ఈ ఆస్తులు ఉత్పత్తి చేసే రెవిన్యూపై పన్నులు చెల్లించ నవసరం లేదు. మరి ఆ ఆదాయంపై జవాబుదారీ తనం కోసం వక్ఫ్ ‌బోర్డులో సమాన ప్రాతినిధ్యం ఉండేలా ఈ సవరణలు ఖరారు చేస్తాయి.

వక్ఫ్ ‌చట్టం- వివాదాల పరిష్కారం

ఈ నూతన సవరణల కారణంగా వక్ఫ్ ‌ట్రిబ్యూనల్‌ అధికారాలు నిర్వీర్యం కానున్నాయి. 2024లో చేసిన ప్రతిపాదనలలో సరైన న్యాయ పర్యవేక్షణ అంశాన్ని ప్రవేశపెట్టారు. వివాదాస్పద వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థల అభిప్రాయాలకు, నిర్ణయాలకు విలువుంటుంది. తద్వారా, వివాదాలు వేగంగా, న్యాయంగా పరిష్కారమయ్యే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఈ సవరణ వక్ఫ్ ‌ట్రైబ్యూనల్‌కు గల పాక్షిక న్యాయ హోదాను నిర్వీర్యం చేస్తుంది. అంతేకాదు, వక్ఫ్ ‌బోర్డును జాతీయ చట్టాల వ్యవస్థలో దృఢంగా ఉంచుతుంది.

కనుక, ఈ సెక్షన్‌లో సవరణలు వివాదాల్లో ముస్లిమేతరుల గొంతుకకు చోటును నిర్ధారిస్తాయి. అదనంగా, ప్రాంతీయ, జాతీయ చట్టాలకు కట్టుబడి, అందుకు అనుగుణంగా వక్ఫ్‌బోర్డులు పని చేసేలా ఖరారు చేస్తాయి.

ఈ సవరణల వల్ల దేశానికేం లాభం?

పారదర్శకత, జవాబుదారీతనం:

కేంద్రీకృత డిజిటల్‌ ‌డేటా బేస్‌ ‌సృష్టి, ఆన్‌లైన్‌ ‌రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయడం అన్నది పారదర్శ కత దిశగా ఒక పెద్ద అంగ. సమాచారం బహిరం గంగా అందుబాటులో ఉంచడం ద్వారా, దుర్విని యోగం, అనధికారిక క్లెయిములను నివారించి, ప్రజల విశ్వాసాన్ని ఈ సవరణలు పెంపొందిస్తాయి.

జెండర్‌ ‌సమానత్వం, కలుపుకుపోవడం:

మహిళల వారసత్వ హక్కులకు హామీ ఇవ్వడం, ముస్లిం మహిళల ప్రాతినిధ్యాన్ని తప్పనిసరి చేయడం ద్వారా, ఈ సవరణ ముస్లిం మహిళా ప్రపంచాన్ని సాధికారం చేస్తుంది. ముస్లిం సమాజంలోని బలహీనవర్గాలను కలుపుకోవడం ద్వారా వక్ఫ్ ‌బోర్డులలో మరింత సమ్మిళిత పాలనా నమూనాను ప్రోత్సహిస్తుంది.

ప్రభుత్వ ఆస్తులకు రక్షణ:

ప్రభుత్వ ఆస్తులపై వక్ఫ్ అనైతిక హక్కుల సమస్యలను ఈ సవరణలు నిర్ణయాత్మకంగా పరిష్కరిస్తాయి. ప్రభుత్వ ఆస్తులపై గత, ప్రస్తుత క్లెయిములన్నింటినీ నిష్ఫలం చేస్తాయి. ఈ ఆస్తులను వక్ఫ్ ‌కబంధహస్తాల నుంచి విడిపించిన తర్వాత ఈ వనరులను సరైన రీతిలో వినియోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అదనంగా, అది చట్టపర మైన, పాలనాపరమైన ఆటంకాలను నివారిస్తుంది.

కలెక్టర్ల పాత్ర పెంపు:

వక్ఫ్ ‌సర్వేయర్ల నుంచి పర్యవేక్షణ బాధ్యతను కలెక్టర్లకు బదిలీ చేయడం అన్నది నిష్పాక్షికతకు, ప్రభుత్వ జవాబుదారీ తనానికి దారితీస్తుంది. ప్రభుత్వ నియమిత అధికారులుగా కలెక్టర్లు వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో ఉన్నతస్థాయి పర్యవేక్షణను, నిజాయతీని తీసుకువస్తారు.

న్యాయ సామర్ధ్యం:

వక్ఫ్ ‌వివాదాల పరిష్కారానికి ఒక ప్రత్యేక న్యాయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం వల్ల అవి న్యాయంగా, వేగంగా పరిష్కారమయ్యేందుకు తోడ్పడుతుంది. కనుక, వక్ఫ్ ఆస్తులు భారతీయ చట్టాలకు అనుగుణంగా, సరైన చట్టపరమైన పరిధితో నిర్వహించేలా సవరణలు నిర్ధారిస్తాయి.

వక్ఫ్ ‌నిర్వహణలో నూతన అధ్యాయం

దేశంలోని వక్ఫ్ ఆస్తుల పారదర్శక, సమ్మిళి తత్వం, సమర్ధవంతమైన నిర్వహణ దిశగా వక్ఫ్ ‌చట్టంలో ప్రతిపాదించిన ఈ సవరణలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అటు ఇస్లామిక్‌ ‌సూత్రాలు, సమకాలీన పాలన ప్రమాణాలను సమలేఖనం చేయడం ద్వారా ఈ సవరణలు వక్ఫ్ ఆస్తుల నిర్వహణ దేశం మొత్తానికీ లాభదాయకంగా ఉండేలా నిర్ధారిస్తాయి.

ప్రభుత్వ ఆస్తుల అధ్రువీకృత హక్కులను ఈ మార్పులు ధ్వంసం చేస్తాయి. ఇవి ఉమ్మాలోని మహిళలను, బలహీనవర్గాలను సాధికారం చేస్తాయి. అదనంగా, సెక్యులర్‌ అల్లికను ముస్లిం సమాజంలో ఈ సవరణలు నకలు చేస్తాయి.

ఈ సవరణలు వక్ఫ్‌బోర్డు అనే గుత్తాధిపత్య వ్యవస్థను ముస్లిమేతరులు ఎదుర్కొనవలసిన అవసరం లేకుండా చేస్తాయి. ఈ న్యాయమైన, సమానమైన వక్ఫ్ ‌నిర్వహణను త్వరలోనే, ఆమోదించి అమలు చేయాలని ఆశిద్దాం.

-డి.అరుణ

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE