సంపాదకీయం

శాలివాహన 1946 శ్రీ క్రోధి శ్రావణ బహుళ అష్టమి – 26 ఆగస్ట్‌ 2024, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


స్వాతంత్య్రోద్యమం తుదిదశలో జరిగిన ‘కలకత్తా హత్యలు’ చరిత్రను గగుర్పాటుకు గురి చేస్తాయి. అలాంటి గగుర్పాటుతోనే పశ్చిమ బెంగాల్‌ ఘనతను నిలబెట్టాలని నలభయ్‌ ఏళ్లుగా అక్కడి పాలకులు అనుకుంటున్న సంగతి వర్తమాన భారతం గమనించవలసిన విషయం. నిన్న సీపీఎం, ఇప్పుడు టీఎంసీ సాగిస్తున్న హత్యలు నాటి కలకత్తా హత్యల సంప్రదాయానికి కొనసాగింపే. పైగా ప్రభుత్వాలు బాధితుల వైపు ఉండకుండా, నేరంలోని తీవ్రతను, రాక్షసత్వాన్ని గమనించకుండా కరుడగట్టిన నేరగాళ్లను వెనుకేసుకువచ్చే తెంపరితనం కూడా ఆ రాష్ట్ర పాలకులలో ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తూనే ఉంది.

ఆమె బెంగాల్‌ ముఖ్యమంత్రి. పేరు మమతా బెనర్జీ. మానవత్వంతో వ్యవహ రించడం నేతలకు అవమానమన్న తీరుతో చరిత్రకెక్కిన ఇడీ అమీన్‌, పోల్‌పాట్‌ వంటి వ్యక్తుల కోవలోనిదామె. ప్రజాస్వామిక రాజకీయాలకు కళంకం. సగం మంత్రిత్వ శాఖలు ఆమె చేతులలోనే బందీలుగా ఉన్నాయి. అందులో హోంశాఖ  ఒకటి. అయినా ప్రఖ్యాత కోల్‌కతా నగరంలో ఆర్‌జీ కార్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో పీజీ డాక్టర్‌ను పరమ ఘోరంగా హత్య చేస్తే, ఆ వైద్యురాలికి న్యాయం జరగాలంటూ ముఖ్యమంత్రే నిరసన ప్రదర్శనకు దిగడం ఏమిటి? ఇంతకు మించిన దుండగీడుతనం ఉందా? ఆ అమానుషత్వం పట్ల ఇంతకు మించిన వెటకార ధోరణి ఉందా? ఒక రాజకీయ నేత నైతిక పతనానికీ, సిగ్గుమాలిన తనానికీ ఇది పరాకాష్ట కాదా? ఆ వైద్యురాలి హత్యకు సంబంధించి ఆది నుంచి అన్నీ అబద్దాలే. ప్రతి అడుగులోను బాధ్యతా రాహిత్యమే. ప్రభుత్వ ప్రతి చర్య ప్రజాద్రోహంతో కూడినదే. మొదట తల్లిదండ్రులకు ఆత్మహత్య అని చెప్పారు. తాను అధిపతిగా ఉన్న వ్యవస్థ ప్రాంగణంలోనే హత్య జరిగితే మొద్దు నిద్ర పోయిన ప్రిన్సిపాల్‌ను మెడపట్టి గెంటకుండా క్షణాలలో పదోన్నతి కల్పించారు. మొన్న ఫిబ్రవరిలో సందేశ్‌ఖాలి దురంతంలో షేక్‌ షాజహాన్‌ను ఏ విధంగా రక్షించే ప్రయత్నం జరిగిందో, అదే తీరులో ఈ హంతక ప్రిన్సిపాల్‌ను రక్షించే యత్నం సిగ్గూ లజ్జా లేని రీతిలో ఆ ప్రభుత్వమే చేసింది. అంటే, ముఖ్యమంత్రి మమత. తరువాత, సమయమే లేదన్నట్టు దుర్ఘటన జరిగిన స్థలంలో ఆగమేఘాల మీద కూల్చివేతలు చేపట్టారు. జరిగిన దారుణానికి నిరసనగా ధర్ణాలు చేపట్టిన విద్యార్థుల మీద అధికార గూండాలు ఆసుపత్రి ప్రాంగణంలోనే దాడులకు తెగబడ్డారు. దీనికి పరాకాష్ట`దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ, కేసును త్వరగా తేల్చాలంటూ, బాధితురాలి ఆత్మకు శాంతి చేకూరే విధంగా న్యాయం జరగాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి, తన తైనాతీ మహిళా కార్యకర్తలను వెంటేసుకుని నిస్సిగ్గుగా కోల్‌కతా వీధులలో ఊరేగడం. ఈ దారుణాలతో సమానమైనది` వైద్య సేవలు నిలిపివేయడం వల్ల ప్రజాగ్రహం పెల్లుబికితే డాక్టర్‌లని మేం మాత్రం రక్షించం అంటూ టీఎంసీ ఎంపీలు బెదిరించడం. మమత రాజీనామా చేయాలంటూ లేచే వేళ్లని విరిచేస్తామన్న హెచ్చరిక ఇంకొకటి.

ఎన్నికలు జరిగితే హింస. హిందువుల పండుగలు వస్తే రక్తపాతం. సొంత  పార్టీ నేతల చేతులలో లైంగిక అత్యాచారాలకు గురైన సొంత పార్టీ మహిళలు  గొంతెత్తితే పోలీసు అరాచకం. వైద్య కళాశాలలు అధికార పార్టీకి ఏటీఎంలుగా మారాయన్న విమర్శ. అవి ఆసుపత్రులో, మానవ అవయవాలు సరఫరా చేసే దుకాణాలో అర్ధం కాని పరిస్థితి అన్న ఆరోపణ. పోలీసు వ్యవస్థ అంటే అధికార పార్టీకి అధికారిక గూండా వ్యవస్థ. ఇదీ పశ్చిమ బెంగాల్‌ వాస్తవరూపం. అయినా ఈ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో రాజ్యాంగ రక్షణ పేరుతో చేసే విన్యాసాలకు లోటు లేదు. వారి వికారాలకు అదుపు లేదు. సర్కస్‌లో బఫూన్‌లూ, తోలుబొమ్మలాటలో గంధోళీగాడూ కూడా సిగ్గుపడే రీతిలో జుగుప్సాకర చేష్టలకు ఒడిగడుతున్నారు. ఒక సభ్యుడైతే అధ్యక్షస్థానం మీద పిచ్చికుక్కలా రెచ్చిపోవడం నిత్యకృత్యం. కానీ సొంత రాష్ట్రంలో ఏం జరుగుతోంది? అది మాత్రం అడగవద్దు. ఆ ఘోష వారికి వినపడదు. ఆ కన్నీళ్లు వీళ్లకి కనపడవు. దేశమంతా స్పందించినా, వైద్యసేవలు నిలిచిపోయినా టీఎంసీ నేతలకు మాత్రం బుద్ధి రావడం లేదు.

జరిగిన ఘోరాన్ని బట్టి కాదు సానుభూతి. కనిపిస్తున్న అమానవీయతను బట్టి కాదు కన్నీళ్లు. రాష్ట్రాన్ని బట్టి సానుభూతి. రాజకీయాలను బట్టి కన్నీళ్లు. ఇదీ ఇవాళ దేశంలోని విపక్ష నేతలు, ఉదారవాదులు, స్త్రీవాదులు, చాలామంది పత్రికా రచయితల, మేధావుల నీచత్వపు స్థాయి. పొరపాటున రాహుల్‌ గాంధీ ఈ దారుణం మీద నోరెత్తాడు. దీనికి మమత ప్రతిస్పందన`మీ సిద్ధరామయ్యను రాజీనామా చేయమని ఆదేశిస్తారా? అనే. మమతా బెనర్జీని బలమైన భాగ స్వామిగా భావించే రాహుల్‌ గాంధీకి సిద్ధరామయ్యను రాజీనామా చేయమనే దమ్ము ఎలా వస్తుంది? మమత, రాహుల్‌, కేసీఆర్‌, హేమంత్‌ సోరెన్‌, ఉద్ధవ్‌ ఠాక్రే, శరద్‌ పవార్‌, పినరయ్‌ విజయన్‌, ఎంకే స్టాలిన్‌` అందరిదీ ఒకటే దబాయింపు. ఎన్ని అకృత్యాలయినా చేయవచ్చు. ఎంత హిందూ వ్యతిరేకతనైనా ప్రదర్శించవచ్చు.  రాజ్యాంగాన్ని, పార్లమెంటును ఎంతైనా కించపరచవచ్చు. ఎంత అవినీతిలో అయినా కూరుకుపోవచ్చు. తప్పుకానేకాదు. ఎందుకంటే బీజేపీ ‘విభజన, మత రాజకీయాలని’ నిరోధించే పురోగాములట.

మమతా బెనర్జీ, అంతుకు ముందు ఉద్ధరించిన జ్యోతిబసు, భట్టాచార్య 1946 హత్యల కారకుడు సుహ్రావర్ధికి వారసులు. వీళ్లంతా హత్యలతో బెంగాల్‌ కీర్తిప్రతిష్టలను సర్వనాశనం చేసిన ఘనులు. గడచిన నలభయ్‌ ఏళ్లుగా పాలన పేరుతో అక్కడ సాగుతున్న హత్యాకాండ స్వతంత్ర భారతదేశ చరిత్రకే మాయనిమచ్చ. ఇంతకాలం అలాంటి ఏలికలకు అధికారం అప్పగించినందుకు బెంగాలీలు తలొంచుకోక తప్పదు. తమది వివేకానందుడు, అరవిందుడు, సీఆర్‌ దాస్‌, బంకించంద్రుడు, రవీంద్రుడు వంటి నేతలు పుట్టిన గడ్డ అన్న సంగతి బెంగాలీలకు గుర్తుంటే తలవంచుకోవడానికి సిగ్గు పడక్కరలేదు.

About Author

By editor

Twitter
YOUTUBE