ప్రకృతి విలయంతో గాయపడిన కేరళ రాష్ట్ర ప్రజలు మానవతా స్పర్శ ఎలా ఉంటుందో స్వయంసేవక్ సంఘ్, సేవాభారతి కార్యకర్తల సేవలతో చవిచూస్తున్నారు. దయనీయమైన, విపత్కర పరిస్థితుల్లో ఉన్న బాధితులను కాపాడి, నిస్వార్ధంగా అక్కున చేర్చుకుని వారి సేవలో నిమగ్నమైన ఆర్‌ఎస్‌ఎస్, సేవా భారతి కార్యకర్తలు ఇతర సంస్థలకు, వ్యక్తులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
జులై 30వ తేదీన వాయనాడ్ జిల్లాలో కొండచెరియలు విరిగిపడి ముందక్కై, చూరల్మలా, అత్తమల, నూల్‌పూర్ గ్రామాలు విధ్వంసం అయ్యి వెయ్యిమందికి పైగా ప్రజలు కొట్టుకుపోగా, మరణించినవారి సంఖ్య సుమారు రెండువందలకు పైనే ఉండవచ్చని మీడియా చెప్తోంది. సహాయక, పునరావాస చర్యలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో మరణించిన వారి లెక్కలు ఇతిమత్థంగా తెలియరావడం లేదు.
తక్షణమే కార్యరంగంలోకి
ఈ విపత్కర సమయంలో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వందలాది మంది స్వయం సేవకులు బాధితులకు తోడ్పాటునందిచేందుకు తక్షణమే కార్యరంగంలోకి దూకారు. వారి నిస్వార్ధ సేవా కార్యక్రమాలు అందరి మన్ననలూ పొందుతున్నాయి. ఆరెస్సెస్, సేవా భారతి కార్యకర్తలు చూపుతున్న ప్రేమా భిమానాలు, ఆపద నుంచి బాధితులను కాపాడడంలో స్వయంసేవకుల నిబద్ధత, అకుంఠిత దీక్ష అక్కడి ప్రభుత్వాన్ని కూడా సిగ్గుపడేలా చేస్తున్నాయి. సేవ చేసేందుకు ముందువరుసలో నిలిచిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు మరణించిన వారిని గుర్తించడంలో, అన్నీ కోల్పోయిన వారికి ఆహారాన్ని, ఆశ్రయాన్ని అందించేందుకు ఆహార శిబిరాలను నిర్వహించడంలో, స్వంత వారిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు వారిని గుర్తించేందుకు తోడ్పడడంలో ఈ వాలెంటీర్లు ముందుంటున్నారు. అంతేకాదు, సమాజం వారిని మరువలేదనే విషయానికి సూచనగా మరణించిన వారికి గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు.
రహదారులు శుభ్రం
ఘటనలో గాయపడిన వారికి సమయానికి వైద్య సాయం అందేందుకు వీలుగా వారిని సమీపంలోని ఆసుపత్రులకు పంపేందుకు సురక్షిత రవాణా వ్యవస్థలను సమన్వయం చేస్తున్నారు. కొండ చెరియలు విరిగిపడడంతో రోడ్డు పై మట్టిపడి రహదారులలో రాకపోకలకు ఆటంకం ఏర్పడిన నేపథ్యంలో దానిని ఎత్తివేస్తూ అత్యవసర వాహనాలు మారుమూల, ప్రభావిత ప్రాంతాలను వేగంగా చేరుకునేందుకు మార్గాన్ని సుగమం చేస్తున్నారు. ఆసుపత్రులలో కూడా గాయపడిన వారికి కార్యకర్తలు ఆహారం, ఇతర మౌలిక సరఫరాలను పంపిణీ చేస్తూ, వారు తొందరగా కోలుకునేందుకు తోడ్పడుతున్నారు.
మొబైల్ మార్చురీ `‘చితాగ్ని’ని నిర్వహణ
సేవా భారతి మొబైల్ మార్చురీ వ్యవస్థ ‘చితాగ్ని’ మృతశరీరాలకు అంత్యక్రియలను నిర్వహించేందుకు చూరల్మలా వద్ద కార్యకలాపాలు ప్రారంభిం చింది. కేరళలో ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన కుటుంబాలకు సంప్రదా యబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించడం ఒక సవాలు. వనరులు, చోటు లేమి వల్ల తమ ఇళ్లలోనే వారికి అంత్యక్రియలు చేసి, సంప్రదాయ సమాధి కట్టడం కూడా కష్టం. వానాకాలంలో వరదలు ముంచెత్తే ఆ జన సమ్మర్ధ ప్రాంతంలో ఇటువంటివి చేయడం అంత తేలిక కాదు. మతపరమైన సంస్కారాలు నిర్వహించేం దుకు చర్చిలలో స్థలం లేకపోవడంతో క్రైస్తవులు కూడా సేవాభారతి మొబైల్ అంతిమసంస్కారాల వ్యవస్థను ఉపయోగించుకునేందుకు ముందుకు వస్తున్నారు.
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా సహాయక కార్యక్రమాలు కష్టమైన ప్పటికీ, సేవాభారతి కార్యకర్తలు మట్టి, నీటి ప్రవాహాలకు ఎదురీది మరీ చేయూతనం దిస్తున్నారు. ఇటువంటి విషాదకర పరిస్థితుల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కు చెందిన స్వయంసేవకులు, సేవాభారతి వాలెంటీర్లు తమ నిస్వార్ధ సేవలతో బాధితులకు ఎంతో కొంత ఊరటను అందించే ప్రయత్నం చేస్తున్నారు.
క్రైస్తవ మిషనరీ ప్రశంసల జల్లు
కాగా, వారి సేవలను గమనించిన క్రైస్తవ మెషినరీలు కూడా ఆరెస్సెస్, సేవా భారతి కార్యకర్తలు చేస్తున్న సేవలను ప్రశంసించకుండా ఉండలేకపో తున్నారు. సాధారణంగా సంఘపరివార్‌కు దూరంగా ఉండాలనే వైఖరి అవలంబించే మెప్పాడిలోని క్రైస్తవ సేవా సంస్థ ఆల్ క్రిస్టియన్ సర్వీస్ ఇనిస్టిట్యూషన్ (సిఎస్‌ఐ)కి చెందిన ఇమ్మాన్యుయేల్ చర్చి మతా చార్యుడు కూడా విపత్కర పరిస్థితుల్లో సేవలు అందించడంలో ప్రఖ్యాతి గాంచిన సంఘ ప్రేరిత సంస్థ సేవాభారతి చేస్తున్న మానవీయ సేవలను మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న తొలి సంస్థ సేవాభారతి. అప్పటి నుంచీ అవిశ్రాంతంగా పని చేస్తున్న కార్యకర్తలను సిఎస్‌ఐ మతాచార్యుడు ఫాదర్ పీవీ చెరియన్ బహిరంగంగా ప్రశంసల్లో ముంచెత్తారు. సేవాభారతి కార్యకర్తలు తాత్కాలికంగా ఉండేందుకు చర్చిలో ఆశ్రయమిచ్చా మని, వారి అసాధారణ క్రమశిక్షణ అభినంద నీయమైనదని ఫాదర్ చెరియన్ అన్నారు. కీలక సమయాల్లో ప్రొఫెషనలిజం, సంయమనం, మానవత్వమనే అరుదైన మిశ్రమంతో కూడిన కార్యకర్తల ఆదర్శవంతమైన ప్రవర్తనను గమనించిన ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకోవలసి వచ్చింది.
సహాయక కార్యక్రమాలలో భాగంగా, కొండచెరియలు విరిగిపడిన ప్రాంతంలో ఎవరైనా చిక్కుకుపోయారా, మరణించారా అని పరిశీలనకు వెళ్లిన ఇద్దరు సేవా భారతి కార్యకర్తలపై రెండవ కొండచెరియ విరిగిపడటంతో వారు అందులో చిక్కుపోయారు. ఇందులో ప్రజీష్ మృతదేహం లభించగా, శరత్ శరీరం లభ్యం కాలేదు.
– జాగృతి డెస్క్