వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
బంగాళాఖాతంలో అల్పపీడనంవలన, రుతుపవనాలు త్వరగా ఆంధ్రాలో ప్రవేశించటం వల్ల నాలుగురోజులనుంచీ ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ట్రాఫిక్‌కి, ట్రాన్స్‌పోర్ట్‌కి, ప్రజలకి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎక్కడి వ్యాపారాలక్కడే ఆగిపోయాయి. రోడ్లన్నీ జలమయమయి వాహనాలకి ఎనలేని యిబ్బంది. టీ.వీ. ప్రతి ఛానల్లో వర్షాభావంవల్ల తీసుకో వలసిన జాగ్రత్తలు, హెచ్చరికలు వినిపిస్తున్నారు.
ఇవన్నీ మామూలే. దేనిదారిదానిదే, తమ ఇల్లు సకల సదుపాయాలతో నిర్మించుకున్నారు. ఈ తుఫాను ప్రభావంవల్ల తమకి ప్రమాదమేమీ లేదని, కాకపోతే ‘కరెంటు ప్రభావంచూపుతుంది. తమకి ఇన్వర్టర్‌ఉంది. నో ప్రోబ్లమ్ అనుకుంది లక్ష్మి.’
టైము రాత్రి పదకొండయింది. తెల్లవారితే ఆదివారం అందరికీ సెలవుదినం. పిల్లలకి రెండు రోజులనుండి సెలవులిచ్చారు. వర్షంవల్ల ఇబ్బందులు పడకుండా, భర్త వ్యాపారం పనిపై క్యాంప్‌కెళ్లాడు. మరో రెండు రోజులగ్గాని రాడు. రేపు ఆలస్యంగా లేవొచ్చు అనుకుంటూ ‘టి.వి. ఆఫ్ చేసి పిల్లల ప్రక్కన పడుకుంది లక్ష్మి. ‘స్టోర్ రూంలో సన్నగా దగ్గు వినిపించింది. ఈ ముస లావిడ ఒకత్తె తన ప్రాణానికి, ఎవరికైనా అత్త, ఆడపడుచు పోరుంటుంది. తనకి మాత్రం ఈ బామ్మ పోరు. అతిగా వాగడం, అన్నింట్లో వేలు దూర్చడం ఈవిడకి అతి పెద్దరోగం.భర్తకు చెపితే.
లక్ష్మీ మనకి పెద్ద దిక్కేవరున్నారు. ఈవిడ తప్ప. ఈవిడే నా చిన్నతనం నుంచి నన్ను చేర దీసింది. అమ్మ దగ్గరకంటే ఈ బామ్మ వద్దే చేరిక. అమ్మకంటే ఆలనాపాలనా ఎక్కువగా చూసేది. బతిమాలి గోరుముద్దలు తినిపించేది. అమ్మకి దూరంగా ఉన్నాం. నన్నొదల లేక నాతో వచ్చింది. కన్నవారికంటే పెంచిన ప్రేమ గొప్ప దంటారు. ఆవిడ్ని ఈ వయసులో వదల్లేను. ఏదోలా సర్దుకుపోదూ… అంటారు.
అద్దె ఇంట్లో నుంచి స్వంత ఇంట్లోకి మారారు. పాత వస్తువులు కొందరికిచ్చేశారు. రోలూ, రోకలీ వ్యానులో కెక్కించింది. మిక్సీగ్రేండర్ ఉన్నప్పటికీ నాతోపాటూ ఒక మూల పడి ఉంటాయి అంటూ వాటిని తెచ్చింది బామ్మ.
ఈ కొత్త ఇంట్లో ఓ మూల స్టోర్ రూం ఉంది. దానికి ఆనుకునేలా ఓ బాత్‌రూం ఉంది. ఆ గదిలో మంచం వేయించి , బామ్మాగదిలోకి రాకండి. మార్బల్ స్టోన్స్. కాలు జారిందంటే ఈ వయసులో కష్టం. మీకు కావలసినవి నేను ఆ గదిలోకి పంపుతాను అంటూ శ్రేయస్సు కోరేదానిలా బామ్మని గదిలోకి రాకుండా చేసింది. లేకపోతే వాగే నోరు `తిరిగే కాలు ఊరికే ఉండ దంటారు. వచ్చే వారందరితో ఏదో వాగుతుంది. ముందరి కాళ్లకు బంధం వేసింది లక్ష్మి. బామ్మ మీద ఏదో మూల కోపం. ఎందుకో తెలీదు.
టైము పన్నెండయింది. కళ్లు మూతలు పడు తున్నాయి. నిద్రలోకి జారుకుంది లక్ష్మీ వాతావరణ చల్లదనానికి. రాత్రి మూడయింది. సడెన్‌గా మెలకువ వచ్చింది. గాలికి కిటికి రెక్కలు కొట్టు కుంటుంటే వాటిని బంధించింది. వర్షం బాగా పుంజుకుంది. గాలి హోరు వర్షం చప్పుడు వినిపి స్తుంది. గాలి తీవ్రత ఎక్కువవుతుంది. తమ యింటికి దూరదూరంగా ఇళ్లు ఏర్పడుతున్నాయి ఇప్పుడిప్పుడే. స్థలం చౌకగా వచ్చింది. బ్యాంకు లోనిచ్చిందని ఇల్లు నిర్మించుకున్నారు. ఎక్కడో పిడుగుపడిరది. ఆ శబ్దానికి దివ్య లేచి ‘అమ్మా’ అని అరుస్తూ కళ్లు నులుముకుంటూ తన దగ్గరకి రాసాగింది. నిద్రమత్తులో నేలపై ఒలికిన నీరుపై కాలేసి జర్రున జారి పడిరది. చేతికి గాజులు గుచ్చుకున్నాయి. రక్తం కారసాగింది. లక్ష్మి తుళ్లి పడిరది. గభాలున లేచింది. కూతుర్ని దగ్గరకి తీసుకుని వంటింట్లోకి వెళ్లి టీ పొడి డబ్బా తెరచి యింత టీ పొడి తీసుకుని, అంతవరకూ పైట చెంగుతో రక్తాన్ని అద్ది పట్టుకున్న లక్ష్మి చెంగు తీసి ఆ టీ పొడి గాయంపై అద్దింది. ఈ లోపు హడా విడికి చిన్నమ్మాయి లత ఏడ్పు లంఘించుకుంది. సోఫాలో దివ్యని కూచోపెట్టి లతని దగ్గరకు తీసుకుని ఓదార్చసాగింది. కాస్సేపటికి పిల్లల్ని ఓదార్చి పాలు కలిపిచ్చింది. వంటింట్లోకి హడావిడిగా వెళ్తుండగా కాలు మడతపడిరది. లేవలేకపోయింది. పాదం మెలికపడి బాగా నొప్పి చేసి వాచిపోయింది. లేవలేక నేలపై కూర్చుండిపోయింది.
ఉదయం ఏడయింది. హాల్లో ఒక తొడపై దివ్య, ఒళ్లో లత పడుకున్నారు. బయట వర్షం చాలా భీకరంగా ఉంది.
ఎప్పుడూ కనీవినీ ఎరుగని రీతిలో గాలి, వర్షం ప్రజలపై ప్రభావం చూపుతుంది. వాయు దేవుడికి పూనకం వచ్చిందా, వరుణ దేవునికి ఆగ్రహం కలిగిందా? అన్న రీతిలో గాలివాన తమ ప్రతాపం చూపుతున్నాయి. కాలి పాదం మెలి తిరిగి విపరీతంగా సలుపుతోంది లక్ష్మికి.
ప్రళయం సంభవిస్తుందా! వినాశనం కలుగు తుందా! ఏమిటీ ప్రకృతి విలయతాండవం విశాఖ పట్నానికే రావాలా? ఈ సిటీ ప్రజల జీవితం అతలాకు తలంగా మారుతుంది. పాలు సరిగ్గా రావు. కరెంటు తీసేస్తారు. పిల్లలకి స్కూలు సెలవు. భీకర ధ్వనులతో చెట్లు పెళపెళ విరిగి పడుతున్నాయి. తెగించి అవసరాలకి వీధిలోకి వెళ్లిన మనుషులు తిరిగి క్షేమంగా, ఇళ్లకు చేరుతారో లేదో అన్న భయం ఏర్పడుతుంది. రోడ్లపై గుంతలు. మోకాలి లోతు నీరు. భయంకర జీవితాలు ఈ సిటీ జీవితాలు, లోలోన బాధపడసాగింది లక్ష్మి.
లత డల్‌గా ఉంది. లేచిన దగ్గర్నుండి నీరసంగా కనిపిసోస్తంది. దివ్య సరేసరి చేతి బాధతో, పెద్ద పిల్ల కాబట్టి ఓర్చుకుని నిద్ర పోకుండా సోఫాలో కూర్చుంది తెల్లవార్లూ.
అప్పుడు జ్ఞాపకం వచ్చింది స్టోర్‌రూంలో ఉన్న బామ్మ. మెల్లిగా ఓర్చుకుంటూ, కాలి బాధ భరిస్తూ అక్కడికి చేరింది. ఆ గది చాలావేడిగా ఉంది. గాలి, చలి చొరబడకుండా ఇనప్పెట్టిలా ఉంది పకడ్బందీగా.
బామ్మా! లేచారా! ఒక్కసారిలారండి! లతకి జ్వరం తగిలింది. దివ్యకి చేతికి గాయం. నా కాలికి నొప్పి. ఇంట్లో మందులు లేవు. బయటకి వెళ్లే పరిస్థితి లేదు. నాకు అయోమయంగా ఉంది. దాదాపు ఏడ్పు స్వరంతో తన బాధ మొరపెట్టుకుంది లక్ష్మి దీనంగా.
గబ గబా వచ్చింది బామ్మ. ఆ వయసులో కూడా ఆమె చురుకుతనానికి ఆశ్చర్యమేసింది. అందుకే అంటారు పూర్వకాలం ఆహారం ఎంత పటిష్ఠంగా ఉంటుందో, మనుషులు కూడా అంతే. తొంభై సంవత్సరాలు, వందేళ్లు, ఏ జబ్బు జ్వరాలు లేకుండా సునాయాసంగా బతుకు తున్నారు. మరి నేటితరం సకల రోగాలతో ఏభైయ్యేళ్లకే ఫట్‌మంటున్నారు నిట్టూర్చింది.
లత నుదుటిపై చెయ్యి వేసి చూసింది. ఆఁ! జ్వరం బాగానే తగిలింది. దీనికి మందు మన వంటింట్లో ఉంది. నువ్వేం గాభరాపడకు. జ్వరం గిరం ఎగిరిపోతాయంటూ వంటింట్లోకి వెళ్లింది. కాస్త శొంఠి తీసుకొచ్చింది. బామ్మకి కరెంటు లేదన్న ధ్యాసే లేదు. గబగబా వచ్చి తన మంచం క్రింద ఉన్న చిన్న రోలూ రోకలీ బయటకు లాగింది. దానిలో శొంఠి కొమ్ములేసింది. నిమిషంలో పొడిచేసింది. దాన్ని నీళ్లలో కలిపింది. లత నుదుటికి పట్టువేసింది. కాస్సేపటికి బామ్మ ఒళ్లోకి చేరి హాయిగా పడుకుంది లత.
వాతావరణం శాంతించలేదు. నిమిషం ఓ యుగంలా గడుస్తోంది. భీకర శబ్దాలు. పిడుగులు పడుతున్న శబ్దాలు. ఆ శబ్దాలుకి ‘అర్జునా, ఫల్గుణా, పార్థా అంటూ బామ్మ స్మరిస్తోంది పైకి. ఏమే తల్లీ ఏ కాలునొప్పి అంటూ మెంటో ప్లస్ తీసుకుని పాదానికి, జాయింటుకి రాసి నిమిరసాగింది. ఆ చేతిలో ఏ శక్తి ఉందో కాని కాస్త రిలీఫ్ కనిపించి ఆశ్చర్యపోయింది లక్ష్మి. పెద్ద శబ్దమయింది ఇంటి ముందు. కిటికీ తెరచి చూసింది లక్ష్మి. కరెంటు స్తంభం కూలిపోయింది. కరెంటు ఎప్పుడో కట్ అయింది. లక్ష్మి గుండె గుభేలుమంది. ఎప్పుడొస్తుందో ఏమిటో ఖర్మ! ఇప్పటి జీవితమంతా కరెంటుతోనే. ఇంట్లో వస్తువులు, వంటింట్లో గ్రైండర్, మిక్సీ, ఎలక్ట్రికల్ స్టౌ ఇలా ఎన్నో! ఎలారా భగవంతుడా! అనుకుంది గ్యాసు కూడా అయిపోయింది.
‘లక్ష్మీ! నువ్వేం గాభరా పడకు. పిల్లల్ని దగ్గరుంచుకో! వంట పని,ఇంటి పని నేనున్నానుగా, చూస్తాను’ అంటూ బామ్మ, మిక్కటిన్నులో పాలు కలిపింది. కిరసనాయిలు స్టౌ వెలిగించింది. పాలు వెచ్చచేసింది. డికాషన్ తయారుచేసి కాఫీ కలిపింది. తీసుకెళ్లి లక్ష్మికిచ్చింది. అప్పటికే మొహాలు కడుక్కున్న లక్ష్మి, దివ్య, లతలు బామ్మ కలిపిన కాఫీ, పాలు తాగారు. ప్రాణం లేచొచ్చింది. బామ్మని ప్రేమగా చూసారు. కళ్లల్లో అనురాగం మెరిసింది.
బామ్మ గబగబా కత్తిపీట దగ్గరకు వేసుకుని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు చకచకా తరిగింది. కిరసనాయిలు స్టౌపైనే కరాచీ నూక ఉప్మా చేసింది. అరగంటలో వేడివేడి ఉప్మా ప్లేట్లలో తెచ్చి ముగ్గురికీ అందించింది. లక్ష్మి చేష్టలుడికి చూస్తుండి పోయింది. ‘అమ్మా లక్ష్మి! నువ్వు టిఫిన్ చేసి స్నానం పూర్తిచేయి. వంటింట్లోకి రాకు. కాలునొప్పి ఎక్కువవుతుంది. వంట పని నేను చూస్తాను. అలా కూర్చో! ఏం భయపడకు నేను న్నానుగా!’ అంటూ ధైర్యం చెప్పింది. వాతావరణం కాస్సేపు రిలీఫ్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్లా భీకర రూపం దాల్చింది. గాలి దిశ మారింది. వడగళ్లు పడసాగాయి. ఇంటిపై ఎవరో రాళ్లు విసిరినట్లు మంచు గడ్డలు టప్, టప్ మంటూ చప్పళ్లు. కిటికీ తలుపు తెరచి వీధివైపు చూసిన లక్ష్మీ అవాక్కయింది. మల్లెపూలు పరచినట్లు వీధంతా వడగళ్లు. పిల్లలు వర్షాన్ని లెక్క చెయ్యక వడగళ్లు చేతిలో తీసుకుని ఒకరిపై ఒకరు విసురుకుంటు న్నారు. ఒకరికి తగలగానే పగలబడి నవ్వులు. పిల్లలచేష్టలకి వారి పెద్దలు సంతోషించినా వర్షంలో తడిస్తే జలుబు, జ్వరాలు వస్తాయని గాలికి ఏదైనా ఎగిరి మీద పడతాయేమోనని ఇళ్లల్లోకి రమ్మని హెచ్చరిస్తున్నారు. పిల్లలు వాళ్లని లెక్క చెయ్యటం లేదు. పెద్దలు చూస్తుండిపోవటం తప్ప ఏం చెయ్యలేకపోతున్నారు.
తలుపులు మూసివేసింది లక్ష్మి. పిల్లలిద్దరూ అల్పాహారం సేవించారేమో హుషారొచ్చింది. పుస్తకాలు తెచ్చుకుని చదువుతూ, తెలియనివి ఒకర్నొకరు అడిగి తెలుసుకుంటున్నారు. లక్ష్మి లేచి మెల్లిగా బాత్‌రూంలోకి వెళ్లింది. అండాల్లో పట్టి ఉంచిన నీరు పనికి వచ్చింది. హాయిగా స్నానంచేసి బట్టలు మార్చుకుంది. టెన్షన్ తగ్గి హాయిగా ఉంది శరీరానికి, మనసుకి.
తల విప్పి జడ వేసుకుంది. మొహానికి పౌడరు అద్ది బొట్టు నుదుట గోపురం కుంకుమతో అద్దుకుని ఫ్రెష్‌గా తయారయింది. సోఫాలో కూర్చుని ‘‘స్వాతి’’ పత్రిక తిరగ వేయసాగింది.
మామ్మ ఫ్రిజ్ తెరచి చూసింది. అందులో కాయగూరలేమీ లేవు. ఈ వర్షానికి బయటి ఏమీ రావు. వెళ్లటానికి వీలు లేదు. అష్టదిగ్బంధంలా అయింది ప్రతివారి పరిస్థితి. ‘కాలే కడుపుకి మండే బుగ్గని’ సామెత ఉంది. అలాగ ప్రతి ఇంట్లో ఉన్నవాటితోనే భోజనం చేస్తున్నారు. సరుకులుంటే కాస్త కాస్త వండుకుని తింటున్నారు. కిర్సనాయిలు స్టౌలుకి పని చెప్తున్నారు. ఎప్పటికి తగ్గేనో జనం ఎప్పుడు తమ నిత్య కృత్యాల్లో మునుగుతారో ప్రతివారి ముఖంలో దైన్యం గోచరిస్తుంది. ఏదో కోల్పోయినవారిలా ఉన్నారు. ఇంట్లోంచి ఎక్కడకీ కదలక కరెంటు లేదు. టీవీలు లేవు. ఇంట్లో కరెంటు సంబంధించినవి ఏవీ పని చేయటం లేదు. బాల్కానీలో, అరుగుల మీద కూర్చుందామంటే ఆగకుండా కురిసే వర్షం. ‘త్రిశంకు స్వర్గం’లా ఉంది ప్రతి వారి పరిస్థితి.
పన్నెండయింది టైం. లక్ష్మి సోపాలో కూర్చుని బామ్మనే చూస్తుంది. ‘దోశెడు కంది పప్పు రెండు ఎండు మిరపకాయలు, నాలుగు వెల్లుల్లి రెబ్బరలు, జీలకర్రా తీసుకుంది. పెనంలో వేసి దొరగా వేయించింది. వాటికి కొంచెం చింతపండు, ఉప్పు కలిపి బండ పచ్చడి చేసింది. ఉల్లిపాయలు కోసి పులుసు చేసింది. వేడిగా అన్నం వార్చింది.
బామ్మగారి చురుకు,తెలివి, నేర్పరితనం అలా కళ్లప్పగించి చూడసాగింది లక్ష్మి. తనేం చెయ్యలేని పరిస్థితి, కదిలి చెయ్యి కల్పించుకోలేని పరిస్థితి.
వంట పూర్తి చేసి స్నానంచేసి దైవానికో నమస్కారం చేసుకుని బట్టలు మార్చుకుని వచ్చి, లక్ష్మికి, పిల్లలకి వడ్డించింది. సుష్ఠుగా తిన్నారు. బామ్మ చేతి వంట అమృతంలాగా ఉంది. బామ్మ ఆ సమయంలో దైవంలా కన్పించింది. మనస్సులోనే నమస్కరించుకుంది.
ఒక గంట వర్షం ఆగింది. ఆ గంటలో జనం బయటకొచ్చి కావలసినవి, కొంచెం ఎక్కువే కొనుక్కున్నారు. కాలనీల్లో ఉన్న షాపు బలవంతాన తెరిపించి సరుకులు కొనుక్కున్నారు. అంతే మళ్లీ ఊపందుకుంది గాలివాన. ప్రళయం సంభవిస్తుందన్న చందాన తీవ్ర రూపం దాల్చింది. ఆ భీకర వర్షాగమనానికి ప్రతివారు భీతిల్లారు.
మర్నాటికి తుఫాను వెలిసింది. లక్ష్మిలో అంతర్లీనంగా ఉన్న అహంకారం తుడిచి పెట్టుకుపోయింది. తుఫాను ప్రారంభమయిన అయిదో రోజు. ప్రజలు మెల్లగా కోలుకుంటు న్నారు. క్యాంపు నుంచి కృష్ణసాయి ఇంట్లోకి అడుగుపెడుతూనే అక్కడి మార్పు గమనించాడు. ఆశ్చర్యానికి లోనయ్యాడు బామ్మ హాల్లో సోఫాలో కూర్చొని దివ్యకి జడ వేస్తుంది. లక్ష్మి లతకి పాఠం చెప్తుంది. భర్తని చూడగానే లేచి ఆప్యాయంగా చేతిలో బ్యాగు అందుకుంది. కాఫీ తెచ్చి ఇచ్చి తుఫానువల్ల ఇబ్బందులు, ఇంట్లో విషయాలు, బామ్మ చాకచక్యం, పని నేర్పు పూసగుచ్చినట్లు చెప్పింది. బామ్మతో తల్లితో మాట్లాడినట్లు మాట్లాడుతూ సలహాలడిగి తీసుకుంటున్న భార్యని చూసి కళ్లు చెమర్చాయి. ఇంటి పెద్దలు, పాత సామాను వాటి విలువ గుర్తించింది భార్య. తనకి అంతకంటే కావల్సిందేముంది. పిల్లలకి ఫస్ట్ ఎయిడ్ చేయించాడు. తుఫానువల్ల తను మాత్రం లాభం పొందాడు. తుఫాన్‌కి మనసులోనే కృతజ్ఞతలు అర్పించాడు కృష్ణసాయి.
– జి.యస్.కె.సాయిబాబా