– అవని సంబరాజు

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

గోడ గడియారం వైపు చూస్తూ ‘అప్పుడే పదకొండు అయిందా? పోనీలే పని అంతా అయి పోయింది. ఇక పన్నెండు గంటలకు అన్నం వండుకుంటే సరిపోతుంది’ అని మనసులో అనుకుంటూ, ఏదో గుర్తుకు వచ్చినట్టుగా తన దూరవాణి (ఫోన్‌) ఎక్కడ ఉందా అని చూసింది. వంటగదిలోనే ఉంచిన తన ఫోన్‌ను తెచ్చుకుని..మాధవికి ఫోన్‌ చేయాలి అనుకుంటూ సోఫాలో కూర్చుంది. ప్రతిరోజూ తన ప్రాణ స్నేహితురాలు మాధవితో మాట్లాడకుంటే మనసొప్పదు రాధికకు. ఈ ఆలోచన రాగానే తన మనసుని చదివినట్టుగా మాధవి నుండి ఫోన్‌ వచ్చింది. ఆశ్చర్యంతో పాటు ఏదో తెలియని భయం కూడా ఒక్క క్షణం ఆవహించింది.

‘‘జరగరానిది ఏమైనా జరిగిందా ఏమి?’’ అనుకుంటూ తన దూరవాణి పైన ఉన్న ఆకుపచ్చ గుర్తును నొక్కింది. రాధిక సందేహిస్తున్నట్టుగానే అటువైపు నుండి మాధవి ఏడుపు వినపడిరది.

‘‘ఏమైందే? మధూ! ముందు నాకు చెప్పు. అమ్మ ఎలా ఉంది?’’ ఆందోళనగా అడిగింది.

‘‘అంతా అయిపోయింది. ఇక అమ్మ లేదు. నిన్న రాత్రివరకు కూడా బాగానే ఉంది. నిద్ర కూడా మంచిగా పోయింది రాత్రి. ఇంతకు ముందు జావ తాగించాము. అకస్మాత్తుగా వెక్కిళ్లు మొదలయ్యాయి. డాక్టరుగారికి ఫోన్‌ చేసి రమ్మన్నాము. పల్సాక్సిమీటర్‌ (ూబశ్రీంశీఞఱఎవ్‌వతీ) తో చూస్తే, నాడి అస్తవ్యస్తంగా కొట్టుకొంటోంది. అంతలోనే ఆమెలో చలనం ఆగిపోయింది.

డాక్టరుగారు ఇంటికి వచ్చి పరీక్షచేసి, రవిని పిలిపించమన్నాడు.

‘‘అమ్మ చనిపోయిందని నిర్ధారణ చెయ్య టానికే వచ్చాను. చాలా రోజుల నుండి అమ్మ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది’’ అన్నాడు అంటూ బోరు బోరున ఏడవసాగింది.

ఎప్పటికైనా ఇలాంటి రోజును ఎదుర్కొన వలసిందే కదా! పుట్టినవాడు గిట్టక తప్పదు కదా! అని తనకి తాను ధైర్యం చెప్పుకుంటూ.

‘‘మధూ! నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మ పరిస్థితి మనకు తెలుసు కదా! ఇన్ని రోజులు మంచం మీద అవస్థ పడిరది. ఒక రకంగా నరకం లోంచి బయటపడిరది కదా! అలా ఆలోచించు. నీతోపాటు చిన్నపిల్లలున్నారు. నువ్వు ఏడుస్తూ ఉంటే వాళ్లు భయపడతారు. నేను వెంటనే బయలుదేరి వస్తాను. నువ్వు అధైర్యపడకు.’’

‘‘తమ్ముడికి ఫోన్‌ చేసావా? నేను చెయ్యనా?’’ అంది రాధిక.

‘‘రవి అమెరికాలో ఉన్నా వాడి మనసంతా అమ్మమీదే ఉంది. ఎప్పుడూ కెమెరాతో చూస్తూనే ఉంటాడు. అమ్మ ఏదోలా ప్రవర్తిస్తుంది. అనగానే వాడికి చెప్పాను. కెమెరాలో చూడమని. వాడికి విషయం అంతా తెలిసింది. భారత దేశానికి రావటానికి టికెట్ల కొరకు చూస్తున్నాడు. నాకు కాళ్లూ చేతులూ ఆడటం లేదు. నువ్వు వెంటనే రా’’ అంటూ ఏడుస్తూనే చెప్పి ఫోన్‌ పెట్టేసింది.

రాధిక చకచకా చెయ్యవలసిన పనుల ప్రణాళిక వేసేసింది. రాత్రి భోజనానికి భర్త వరుణ్‌, పిల్లలకు కావాల్సిన ఏర్పాట్లు చేసింది. ఎదురింటి వాళ్లతో పిల్లల్ని పాఠశాల నుండి తీసుకురమ్మని, వరుణ్‌ వచ్చేవరకు చూసుకొమ్మని జరిగిన విషయం చెప్పి తాను వెళ్తున్నానని చెప్పింది. వరుణ్‌కి ఫోన్చేసి విషయం చెప్పింది. అతను వెంటనే ‘‘నువ్వు ముందు వెళ్లి నీ స్నేహితురాలికి ధైర్యం చెప్పు తనతో ఉండు. నా గురించి పిల్లల గురించి అలోచించకు. పిల్లలను నేను చూసుకుంటాను. నువ్వు పక్కనుంటే మాధవికి కొండంత ధైర్యం, ఆలస్యం చేయకు’’ అన్నాడు.

‘‘సరే’’ అని ఫోన్‌ పెట్టేసింది.

వరుణ్‌ చాలా మంచివాడు. అర్థ్ధం చేసుకుంటాడు. ఎంతో సున్నితమైన మనసు, అతనితో పోల్చుకుంటే నాకే కాస్త గడుసుతనం ఎక్కువ అనుకుంటూ కారు తాళాలను చేతిలోకి తీసుకుంది. కారు నడుపుతున్నంతసేపూ రాధిక వాళ్ల అమ్మగారు అన్నపూర్ణమ్మగారి జ్ఞాపకాలే. తను మాధవి ఒకే కాలేజీలో చదివారు. ఇద్దరూ పాటలు పాడుకుంటూ మాధవి వాళ్లింట్లో గంటల కొద్దీ సమయం గడిపేవారు. వీళ్ల పరీక్షలప్పుడు అన్నపూర్ణమ్మ ఎంతో సహాయం చేసేది. ప్రశ్నలు అడగటం, ఏ ప్రశ్నకి ఎలా సమాధానం రాయాలి అని చెప్పటం లాంటివి చేసేది. కొన్నిసార్లు వీళ్లిద్దరితో మంచిమంచి వంటలు కూడా చేయించేది. రాధిక, మాధవి సరదాగా మాట్లాడుకుంటూ కొత్త వంటలపై ప్రయోగాలు చేసేవారు.

వరుణ్‌తో తన పెళ్లి కూడా అన్నపూర్ణమ్మ గారే కుదిర్చారు కదా! ఇలా ముసురుతున్న ఆలోచనలతోనే మాధవి ఇంటికి వచ్చేసింది.

బాధలో ఉన్న మాధవిని ఓదారుస్తూ తనతో తెచ్చిన చపాతీ తినిపించి, పండ్ల రసం తాగించింది. పిల్లలను పైన గదిలోకి వెళ్లి ఆడుకొమ్మని, అక్కడే ఉండమని చెప్పింది. మధు బంధువులకు విషయం తెలిసింది. ఒక్కొక్కరే వచ్చి వెళ్తున్నారు. రాధిక తరువాత జరగవలసిన కార్యక్రమాలేంటి అని తెలుసుకొని, పురోహితుడిని మాట్లాడటం, దహన సంస్కారాలకు కావల్సిన ఏర్పాట్లు చేయటం లాంటి పనులన్నీ దగ్గరుండి చూసు కొంది. రవి రాగానే జరగవలసిన కార్యక్రమం అంతా వెంట వెంటనే జరిగిపోయింది. రవి ఎంతో శ్రద్ధగా దహన సంస్కారాలు పూర్తి చేసాడు. ఇంట్లో పదిరోజులూ గరుడ పురాణం పారాయణం చేయించాడు. నిత్యకర్మలను ఆచరించాడు. కర్మకాండ జరిపించటానికి వచ్చిన బ్రాహ్మణుడు కూడా ప్రతి విషయం అందరికీ అర్థమయ్యేలా విశదీకరిస్తున్నాడు. ధర్మోదకాలు, దశాహం లాంటివి జరిగిపోయాయి. 12వ రోజు రానే వచ్చింది. చూస్తుండగానే ఒక మనిషి వెళ్లిపోయి పన్నెండు రోజులయింది అని తలుచు కుంటే ఆశ్చర్యంగా ఉంది. పన్నెండవరోజు సపిండీకరణము. బ్రాహ్మణుడు పిండపురాణం, గరుడపురాణంలలోని విషయాలను చెప్తూ కర్మకాండను జరిపిస్తున్నాడు.

పాంచభౌతికమైన ఈ శరీరం నుండి మర ణించిన తరువాత మళ్లీ ఈ పంచభూతాలు శరీరం నుండి విడిపోతాయి. ఆ పంచభూతాలు భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం, దేహి, దేహం నుండి వెళ్లిపోగానే పంచభూతాలు ఎలా వచ్చాయో అలా వెళ్లిపోతాయి. ముందుగా గాలి (ఊపిరి రూపంలో), అగ్ని (శరీరం చల్లబడటం), నీరు (శరీరంలోని తోలుతిత్తిలోని రంధ్రాల ద్వారా) వెళ్లిపోగా భూతత్వములయిన ధాతువులు, గోళ్లు, ఎముకలు మిగులుతాయి. అవి కూడా కొన్ని రోజులకు భూమిలో కలిసిపోయి, ఈ శరీరాకాశం, మహాకాశంలో కలిసిపోతుంది. చనిపోయిన వ్యక్తి ప్రేతరూపంలోకి మారి పోతాడు….

ఇలా బ్రాహ్మణుడు, మంత్రాలను చదువుతూ 16 పిండాల ప్రాధాన్యత గురించి చెప్తూ వెళ్తున్నాడు.

వింటూన్న రాధిక అలవోకగా ఎవరెవరు వచ్చారు అని చూసింది. కొంచెం దూరంగా కూర్చున్న ఒక మధ్య వయస్కురాలిని చూడగానే గతుక్కుమంది. ఆవిడే శారదగారు. అసలు ఇలా ఎదురుపడాల్సి వస్తుందని కూడా రాధిక ఎప్పుడూ అనుకోలేదు. ఒక రకంగా ఆ మనిషిని మరిచిపోయింది. అదే సమయానికి అవిడ కూడా రాధికను చూడటంతో వారిరువురి చూపులు కలుసుకున్నాయి. ఇద్దరు అపరిచితులు కూడా చూపులు కలవగానే అసంకల్పితంగా చిరునవ్వుతో పలకరించుకుంటారు. కాని వీరిద్దరూ అసలు ఏమీ జరగనట్లే ముఖం తిప్పేసుకున్నారు. ఎవ్వరూ బయటపడలేదు.

శారదగారు అన్నపూర్ణమ్మ పనిచేసే బడిలోనే పది సంవత్సరాలు ఉపాధ్యాయు రాలిగా పని చేసింది. అన్నపూర్ణమ్మగారు పదవీ విరమణ చేసినా మధ్య మధ్యలో కలుస్తూనే ఉండేవారు. ఈ పరిచయంలోనే శారదాగారి అబ్బాయి వరుణ్‌ను చూసి, రాధికకు సరిఅయిన జోడు అని, వారిద్దరి వివాహం కుదిర్చారు అన్న పూర్ణమ్మ. శారదగారు మరెవరో కాదు, రాధికకు అత్తగారు. ఇప్పుడు ఇద్దరి మనస్సులలో ఒకటే ఆలోచన మెదులు తుంది. అది వారిద్దరి మధ్య ఒకప్పుడు (చివరి సారిగా) జరిగిన ‘మహాసంగ్రామం’ అని వారనుకునే వాగ్యుద్ధం.

రాధిక, వరుణ్‌ ల వివాహం అయిన కొన్ని సంవత్సరాలు బాగానే ఉన్నాయి. అత్తమామలు రాధిక వరుణ్‌ ఇద్దరు చిన్న పిల్లలతో రోజులు సంతోషంగానే గడిచాయి. పనుల ఒత్తిడి వల్లనో, మరేదో కారణం చేతనో మెల్లగా శారదమ్మలో, రాధికలో కూడా మార్పులు వచ్చాయి. చిన్న చిన్న విషయాలు సమస్యలుగా కనపడేవి. చిన్న చిన్న తగాదాలు కూడా అప్పుడప్పుడు వచ్చేవి. కాని, భర్త మనసు నొప్పించకూడదని రాధిక, కొడుకు బాధపడతాడని శారదమ్మ, ఎప్పుడూ వరుణ్‌ ముందు బయటపడేవారు కాదు. కాని ఏదో జరుగుతోంది ఇంట్లో అని వరుణ్‌కు తెలిసి పోయేది. చాలాసార్లు శారదమ్మ కొడుకుతో చెప్పాలని వెళ్లేది. కాని ఆఫీస్‌ మీటింగ్‌లతో సతమతమవుతున్న కొడుకుని చూసి వెనకకు వచ్చేసేది. సమయం చూసి ఒకసారి రాధిక, భర్తతో చెప్పాలని ప్రయత్నించింది. కాని వరుణ్‌, ‘‘మీరు ఇద్దరు ఆడవాళ్లూ తేల్చుకోండి, ఏదైనా సమస్య ఉంటే. నాకు ఆఫీస్‌ పనితోనే సరిపోతుంది. ఇప్పుడు నా ఉద్యోగం ఎన్ని రోజులుంటుందో తెలియదు. కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి. దయచేసి ఏవైనా తగాదాలు ఉంటే నా దగ్గరికి తీసుకురావద్దు’’ అని చెప్పాడు.

అత్తా కోడళ్లు వరుణ్‌ ఉన్నంతసేపూ బాగానే ఉండేవారు. ఒక్కోసారి మాటామాటా కూడా అనుకునేవారు వరుణ్‌ లేని సమయంలో. ఈ నాటకం మాత్రం ఎన్ని రోజులు సాగుతుంది? ‘ఎంతో కష్టపడి కొడుకుని కనిపెంచి, పెద్దచేసి ప్రయోజకుడిని చేసాను. నా మాట కూడా వినాలి’ అని తల్లిÑ ఎక్కడో పుట్టి ఈ ఇంటికి వచ్చాను. నా త్యాగానికి కూడా విలువివ్వాలని కోడలు. ఈ సమస్య తెగేది కాదు కదా! ఒకరోజు గ్రహాలు అనుకూలించలేదు. మాటకు మాట సమాధానం చెప్పటం, ఒకరి లోపాల్ని ఒకరు ఎత్తి చూపించటం, ఒకరి ఐలహీనతలను ఒకరు వ్యంగ్యంగా విమర్శించుకున్నారు. ఇద్దరిలో అహం, ఆత్మాభిమానం దెబ్బతిన్నాయి. ఆవేశం, కోపంలో ‘‘ఈ ఇల్లు నాది. నేను వరుణ్‌ను పెళ్లి చేసుకొన్నాక కొన్నది’’ అని రాధిక ఇంటి నుండి వచ్చేసింది. పొరపాటు జరిగింది అని ఒక క్షణం అన్పించినా, ఏదో ఒకటి ఈ రోజు తేల్చుకోవాల్సిందే అన్న పంతంతో కొనసాగించింది.

‘‘నిన్న మొన్న వచ్చావు ఈ ఇంట్లోకి, ఇంత పొగరా! సరే నేను ఈ ఇంటి నుండి వెళ్లిపోతాను. నేను చచ్చినా ఈ ఇంటి గడప తొక్కను. నీ మొహం కూడా చూడడం నా కిష్టం లేదు. మా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు దక్కనివ్వనూ, అంతా అనాథాశ్రమానికి రాసేస్తాను’’ అంటూ ఏడుస్తూ తన గదిలోకి వెళ్లిపోయింది శారదమ్మ. ఇక ఈ ఇంట్లో ఉండటం ఇష్టంలేదు. వరుణ్‌ వచ్చేవరకు ఎలాగోలా ఉండి రాగానే చెప్పింది. ‘‘ఊళ్లో వ్యవసాయం పనులున్నాయి. ఈసారి నెలపైగానే ఉండి పనులన్ని చక్కబెట్టుకొని వస్తాము’’ అని. వరుణ్‌ బాధపడితే శారదమ్మ మనసు తల్లడిల్లుతుంది.

సరేనన్నాడు వరుణ్‌. ఈ అబద్దం అంత అతికినట్టుగా లేదు అని గ్రహించాడు. నెల కాస్తా, నెలలుగా, సంవత్సరాలుగా మారింది. ఎవరింట్లో వాళ్లు ఆనందంగా (నే) ఉన్నారు. తరువాత వరుణ్‌ జరిగిన విషయం తెలుసుకొని, కొంచెం బాధ పడ్డాడు. తను మధ్యలో కలుగచేసుకొని ఇద్దరికీ నచ్చచెప్తే బాగుండేదేమో అనుకున్నాడు. కాని ఈ నచ్చ చెప్పటం శాశ్వత పరిష్కారం కాదు కదా! సమస్య ఏమిటో రాధిక చెప్పలేదు. శారదమ్మ మాట్లాడలేదు. వరుణ్‌ అడగలేదు. ఇద్దరు మనుషులు కలిసి ఉండాలంటే మూడో మనిషి నచ్చచెప్పే ప్రయత్నం చేయటం కాదు, మార్పు, అర్థం చేసుకోవటం అనే ఆలోచన ఆ ఇద్దరిలోనే రావాలి. అదీ స్వయంగా వాళ్ల హృదయాంతరాల లోంచి రావాలి. బయటివాళ్ల జోక్యం ద్వారా ఎన్ని రోజులు కలిసి ఉంటారు? కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుందనుకుని ఊరుకున్నాడు.

 పండుగలకు, పబ్బాలకు తను, పిల్లలూ ఊరికి వెళ్లేవారు, రాధిక తన తల్లి గారింటికి వెళ్లేది. ‘వస్తావా’ అని వరుణ్‌ అడగలేదు. ఊరికి ‘వస్తానని ’రాధిక కూడా చెప్పలేదు. ఇలా దూరంగా ఉండటంలోనే ఆనందం, ప్రశాంతత ఉన్నాయనిపించింది అందరికీ.

అమ్మా, నాన్న కూడా మరీ అంత వయసు మళ్లినవాళ్లు కాదు. చక్కగా తీర్థయాత్రలకు వెళ్తున్నారు వాళ్లంతటవాళ్లు, ఎవరిమీదా ఆధారపడలేదు. చూద్దాం ఇలా ఎన్ని రోజులు గడుస్తుందో అని ఊరుకున్నాడు వరుణ్‌.

 * * * *

ఇదంతా సినిమా రీల్‌ లాగా రాధిక, శారదమ్మ మనోఫలకంపై మెదిలింది. ఆ అదో పెద్ద విషయం ఏమీ కాదులే అని కార్యక్రమంలో నిమగ్నమైపోయారు. బ్రాహ్మణుడు సపిండీకరణం మంత్రాలు చదువుతూ దాని ప్రాధాన్యత ఏమిటి. మన హిందూ ధర్మంలో అని చెప్తున్నాడు. రవిచేత అన్నంతో ఒక పెద్ద పిండం, మూడు చిన్న, చిన్న పిండాలు చేయించాడు. ఎడమవైపు పెద్ద పిండం, కుడివైపు మూడు చిన్న పిండాలను వరుసలో పెట్టాడు. పెద్దది రవి వాళ్ల అమ్మ అన్నపూర్ణమ్మ గారిదని, కుడివైపున ఉన్న వాటిలో మొదటిది రవి వాళ్ల నాయనమ్మ రమణమ్మది, రెండవది రమణమ్మ వాళ్ల అత్తగారు ఇందిరమ్మదని, మూడవది ఇందిరమ్మగారి అత్తగారు రుక్మిణమ్మదని, వారు వసు, రుద్ర, ఆదిత్య రూపాలతోను పొందారని చెప్పాడు. మరణించిన అన్నపూర్ణమ్మ ప్రేతరూపం నుండి వరుసగా వసు, రుద్ర, ఆదిత్య రూపాలలోకి మారి తరువాత ఈ అనంత విశ్వం నుండి స్వేచ్ఛను పొందుతుందని, ఇప్పటివరకూ తనకు చేసే శ్రద్ధ కర్మలద్వారానే ఆహారాన్ని పొందుతుందని చెప్పాడు.

చనిపోయిన వారి కర్మలను అనుసరించి యమదూతల యాతనలు ఉంటాయని, పురాణం లోంచి విషయాలను సమయోచితంగా, సందర్భోచితంగా చెప్తున్నాడు.

పెద్ద పిండాన్ని మూడు భాగాలుగా చేయమన్నాడు. ఒక పిండ భాగాన్ని కుడిచేతివైపున్న మొదటి పిండమైన వసురూపంలో ఉన్న రమణమ్మగారి పిండంతో కలిపి ఒకటిగా చేయమన్నాడు. ఇలా రవి చేస్తున్నప్పుడు

‘‘సంఘచ్ఛధ్వం సంవదధ్వం,

సంవో మనాంసి జానతామ్‌॥

దేవా భాగం యథాపూర్వే

సంజానానా ఉపాసతే?’’

అనే మంత్రం చదివి ఆ మంత్రం అర్థాన్ని వివరించాడు.

‘‘మీరు కలిసి ఉండుదురుగాక! కలిసి ఒకే పలుకును పలుకుదురుగాక,

మీ మనసులు ఒకటిగా అగుగాక, ప్రాచీన కాలంలో దేవతలు ఎలాగైతే వారి భాగంను హవిస్సు నుండి పొందారో అలా.’’

‘‘సమానో మంత్రః సమితిః సమానీ

సమానం మనః సహచిత్తమేషామ్‌

సమానం మంత్రమభిమంత్రయేవః

సమానేన వో హివిషాజుహోమి॥

సమానీవ ఆకూతిః సమానా హృదయాని వ

సమానమస్తో వో మనో యథావః   సుసహాసతి॥’’

అనే వేదమంత్రాన్ని పఠించాడు.

‘‘మన మంత్రము, మనస్సు, ఈ చిత్తం ఒకటి అగుగాక. సమానమైన

అభిమతంను మనం కలిగి ఉండెదముగాక. ఒకే అభిలాషను, సమానమైన

ఆలోచనలను కలిగి ఉండెదముగాక – ఇక మీదట ఇద్దరి లక్ష్యం ఒకటే అగుగాక.’’

ఇలా అర్థం వివరిస్తూ ఉన్నాడు.

తరువాత అన్నపూర్ణమ్మగారి రెండవ పిండ భాగాన్ని రుద్ర రూపంలో ఉన్న, రమణమ్మ అత్తగారైన ఇందిరమ్మగారి పిండంతో కలిపి ఒకటిగా చేయించాడు రవితో, మళ్లీ

‘‘సంఘచ్ఛద్వం సంవధధ్వం…’’

‘‘సమానోమంత్రః సమితీ సమానా…’’

మంత్రాలను పఠించాడు.

ఇదే సంపిండీ కరణమని, ‘‘ఇతః పరం ప్రేతశబ్దం నాస్తి’’ అని గట్టిగా చప్పుడు చేయించాడు.

ఇపుడు, ఈ సంపిండీకరణం ద్వారా, ప్రేత రూపంలో ఉన్న అన్నపూర్ణమ్మ వసు రూపంలో ఉన్న తన అత్తగారితో కలిసి వసురూపాన్ని పొందింది. వసు రూపంలో ఉన్న రమణమ్మ, రుద్రరూపంలో ఉన్న తన అత్తగారి స్థానాన్ని పొందింది. రుద్రరూపంలో ఉన్న ఇందిరమ్మ అదిత్యరూపంలో ఉన్న తన అత్తగారైన రుక్మిణమ్మ స్థానాన్ని పొందింది. రుక్మిణమ్మ ఈ సోపానాలను అధిగమిస్తూ వృద్ధ ప్రప్రితామహిగా మారి శాశ్వతంగా స్వేచ్ఛా జీవిగా ఈ విశ్వంలో కలిసిపోయింది అంటూ ఈ సంపిండీకరణం అంతర్యాన్ని వివరించాడు. అందుకే ఈ కర్మకాండలో శ్రద్ధ చాలా అవసరమన్నాడు.

 * * * *

మళ్లీ మళ్లీ ఈ మంత్రమే రాధిక, శారదమ్మ చెవుల్లో మార్మోగసాగింది. ఏ సంబంధం లేదు మన మధ్య, ఇక ఉండకూడదు. తెంపేసుకుని ఎవరి ఇంట్లో వాళ్లు సంతోషంగా ఉన్నామని అనుకున్నాము. ఈ శరీరమున్నంతవరకే ఈ దూరాలు. తరువాత జరిగే కర్మకాండలో ఇలాగే మనం ఇద్దరం కలిసి ప్రయాణం చేయవలసిందే కదా! మన రుషులు మనకు ఇచ్చిన ధర్మాచారం ఇది. దీనికి కాదనటానికి లేదు. చనిపోయినా కలిసి చేసే ప్రయాణం నిశ్చితమైనప్పుడు బతికుండగా కలసి నివసించటానికి సమస్య ఏమిటి? అహో ఎంత గొప్పది కదా మన ధర్మం? ఎప్పుడూ శ్రేయస్సునే కోరేది. చావు కూడా బతకటానికి బాటను వేస్తుంది. ఆపైన వాళ్లిద్దరి ధ్వాస కర్మకాండపైన లేదు. మరొక్కసారి వాళ్లిద్దరి చూపులు కలుసుకున్నాయి. రాధికకు కన్నీళ్లు జలజలా రాలాయి. తప్పు చేశాను క్షమించమని అర్థించినట్టుగా! శారదమ్మ కళ్లలో కూడా క్షమించేశాను…నన్ను కూడా క్షమించు. ఇక మీదట మన ఇద్దరి ఇల్లూ ఒకటే, ధ్యేయం ఒకటే, ఆశయం ఒకటే అన్న సందేశం కనపడిరది.

ఇద్దరూ చిరునవ్వులను ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ మార్పు వారి హృదయాంత రాలలోంచి వచ్చింది. కాలం సమస్యను తీరుస్తూ, పరిష్కారం చూపెట్టి, తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయింది.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE