దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న తెలంగాణ రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పలుమార్లు ప్రస్తావించింది. చివరకు ఆగస్టు 15వ తేదీ నాటికి రుణమాఫీని మూడు విడతలుగా అమలు చేసింది. అయితే, ఇప్పుడు ఆ మాఫీ మంటలు రాష్ట్రంలో హీట్‌ పుట్టిస్తున్నాయి. రాజకీయ రగడకు కారణమవుతున్నాయి. మొత్తానికి తెలంగాణలో రైతుల రుణమాఫీ వ్యవహారం రోజురోజుకు రచ్చ రేపుతోంది. ఓవైపు రాజకీయ పార్టీల మధ్య రగడకు.. మరోవైపు రైతుల ఆందోళనలు, ఆవేదనకు రుణమాఫీ అనేది ప్రధానాంశంగా మారుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య నిత్యం మాటల యుద్ధం జరుగుతోంది. బీజేపీకి చెందిన కేంద్ర  హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌, తెలంగాణ బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు,  ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు తదితరులు రుణమాఫీ డొల్లతనాన్ని ఎత్తిచూపుతూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.

రాష్ట్రంలో గడపగడపకు వెళ్లి రుణమాఫీ బండారాన్ని బయటపెడతామని బీఆర్‌ఎస్‌ ప్రకటిం చింది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీలకు రుణమాఫీ బోగస్‌ అంటూ.. బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ లేఖలు రాశారు. ఇక రుణమాఫీ కోసం ఏకంగా రైతుదీక్ష చేపట్ట నున్నట్టు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. దీంతో, ఈ అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.

తమకు రుణమాఫీ కాలేదంటూ పెద్ద సంఖ్యలో రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు ఇప్పటికీ   రుణమాఫీ కాని అర్హు లందరికీ న్యాయం చేస్తామని, ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తామని ప్రభుత్వం తరఫున వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మొత్తంగా రుణమాఫీ వ్యవహారం మరిన్ని ప్రకంపనలు సృష్టించే పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఎస్‌ఎల్‌బీసీ విడుదల చేసిన లెక్కల ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మార్చి 31వ తేదీ నాటికి రైతులకు ఇచ్చిన మొత్తం పంట రుణాలు 64,940 కోట్ల రూపాయలు. అందులో కాంగ్రెస్‌ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన 2023 డిసెంబర్‌ నాటికి ఇచ్చిన రుణాలు 49,500 కోట్ల రూపాయలు. మొదట్లో 2 లక్షల రూపాయల రుణమాఫీ కోసం 40 వేల కోట్ల రూపాయల వరకు అవసరమని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ఆ తర్వాత రుణమాఫీ కోసం 31 వేల కోట్ల రూ.లు అవసరమవుతాయని కేబినెట్‌ సమావేశంలో తేల్చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి, సహా మంత్రులు స్వయంగా ప్రకటనలు చేశారు. కానీ, బడ్జెట్‌లో మాత్రం రుణమాఫీకి 26 వేల కోట్ల రూపా యలు మాత్రమే కేటాయించారు. చివరికి మూడు విడతల్లో కలిపి రుణమాఫీకి విడుదలచేసింది 17వేల 933 కోట్ల రూపాయలు మాత్రమే. దీంతో లక్షలాది మంది రైతులకు రుణమాఫీ అందలేదన్న విమర్శలు గుప్పు మంటున్నాయి. గత ప్రభుత్వ హయాంలో లక్ష రూపాయల రుణ మాఫీ కోసం 36.68 లక్షల మంది రైతుల లెక్కతేలారు. కానీ, ప్రస్తుతం 2 లక్షల రూపాయల రుణ మాఫీ కేవలం 22.37 లక్షల మంది రైతులకే అందడం విస్మయం కలిగిస్తోంది. రైతుల సంఖ్య పెరగాల్సిందిపోయి తగ్గడంపై అన్నదాతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతులు రోడ్డెక్కుతున్నారు. తమకు రుణమాఫీ జరగలేదంటూ ఆందోళనలు చేపడుతున్నారు. అగ్రికల్చర్‌ ఆఫీసుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.  చాలామంది పీఎం కిసాన్‌ నిబంధనలు, ఇతర షరతులు తమకు వర్తించకపోయినప్పటికీ ఇప్పుడు రుణమాఫీ జరగక పోవడానికి కారణాలేంటో అర్థం కావడం లేదని చాలామంది రైతులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు. వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌ సెల్‌కు భారీగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఈ నెల (ఆగస్టు) 18వ తేదీ వరకు లెక్కలు చూస్తేనే 58 వేల మందికిపైగా రైతుల నుంచి ఫిర్యాదులు అందాయని వ్యవసాయశాఖ ఉన్నతస్థాయి వర్గాలు చెప్పాయి. అన్ని జిల్లాల నుంచి ఫిర్యాదుల వివరాలను తెప్పించుకున్నామని.. వాటిని సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని ఉన్నతాధికారులు అంటు న్నారు. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లోని వ్యవసాయ కమిషనరేట్‌లో ప్రత్యేకంగా ప్రక్రియ కొనసాగుతోందని కూడా చెబుతున్నారు. ఇప్పటి వరకు 58 వేల ఫిర్యాదులు అందాయని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నప్పటికీ.. ఫిర్యాదుల సంఖ్య లక్షల్లోనే ఉంటుందని రైతు సంఘాల నేతలు, నిపుణులు చెబుతున్నారు. లక్షలాది మంది రైతులు బ్యాంకుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగు తూనే ఉన్నారని.. చాలా మంది లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇవ్వలేదని అంటున్నారు. చాలా మండలాల్లో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఏదో ఒకటి చెప్పి వెనక్కి పంపిస్తున్నారని.. లిఖితపూర్వక ఫిర్యాదులు తీసుకోవడానికి అంగీకరించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అయితే,  ప్రభుత్వ నిర్ణయాలు, రైతుల నుంచి వస్తున్న ఒత్తిడి మధ్య  ఏం చేయాలో అర్థంకావడం లేదని వ్యవసాయ అధికారులు తల పట్టుకుంటు న్నారు. లక్షలాది మంది రైతులకు రుణమాఫీ జరగక పోవటానికి కారణమేంటో, ఏ ప్రాతిపదికన అర్హులను నిర్ధారించారో, ఏ కొలమానాలతో అనర్హులను తేల్చారో  అంతుపట్టడం లేదని అంటున్నారు. ఇప్పటికైతే రూ. 2 లక్షల రూపాయల వరకు అప్పు తీసుకున్న రైతులకే రుణమాఫీ వర్తింపజేశామని అంతకు మించి అప్పులు తీసుకున్న వాళ్లు అదనంగా ఉన్న సొమ్మును చెల్లించాకే మాఫీ అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉదాహరణకు ఒక రైతు బ్యాంకులో  మూడు లక్షలరూపాయలు అప్పు తీసు కుంటే.. రైతు ముందుగానే బ్యాంకులో ఆ మూడు లక్షల్లో లక్ష రూపాయలు బ్యాంకు అకౌంట్‌లో జమ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే మిగతా 2 లక్షల రూపాయల మాఫీని ప్రభుత్వం వర్తింప జేస్తుందని అధికారులు చెబుతున్నారు. దీనిపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిబంధన పెట్టాల్సిన అవసరమేంటని నిలదీస్తున్నారు. ఆ అదనపు రుణం మొత్తాన్ని ఇప్పటికిప్పుడు చెల్లించ డానికి ప్రైవేటుగా అప్పులు చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం నేరుగా మాఫీ వర్తింపజేస్తే.. మిగతా డబ్బులను కొంతకాలం తర్వాత అయినా తీర్చుకునే వెసులుబాటు ఉంటుందని, ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలని రెండు లక్షలకు పైగా రుణాలు తీసుకున్న రైతులు కోరు తున్నారు. బ్యాంకులు ఇప్పటివరకు రుణమాఫీ జరిగిన రైతులకు.. వర్షాకాలం పంటల కోసం కొత్తగా అప్పులు ఇస్తున్నాయి. కానీ, రుణ మాఫీ జరగని రైతులకు మాత్రం కొత్తగా అప్పులు ఇవ్వడం లేదు. దీంతో కీలకమైన వ్యవసాయ సీజన్‌లో పంట రుణాలు దొరక్క ప్రైవేట్‌ అప్పులు చేయాల్సిన దురిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఈ మొత్తం వ్యవహారంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు క్లారిటీ ఇస్తున్నారు. బ్యాంకుల నుంచి తమకు వివరాలు అందిన ప్రతి రైతుకు అర్హతను బట్టి రుణమాఫీ చేసే బాధ్యత తమదేనని తుమ్మల హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. 2 లక్షల రూపాయల వరకూ కుటుంబ నిర్ధారణ జరిగిన రైతులందరికీ మాఫీ చేశామని,  కుటుంబ నిర్ధారణకాని వారికి ఆ ప్రక్రియ పూర్తిచేసి రుణమాఫీ సొమ్ము మొత్తం రైతుల అకౌంట్లలో జమ చేస్తామని మంత్రి తెలిపారు. 2లక్షల రూపాయలకు పైన అప్పు లున్న వారికి మాత్రం.. అదనంగా ఉన్న మొత్తాన్ని చెల్లించిన తర్వాత వారి అర్హతను బట్టి వారికి రుణమాఫీ చేస్తామన్నారు. బ్యాంకర్ల నుంచి డేటా తప్పుగా వచ్చిన రైతుల వివరాలను కూడా సేకరిస్తు న్నామని వివరించారు. రుణమాఫీ పొందిన రైతులకు తిరిగి కొత్త రుణాలు మంజూరు చేయా ల్సిందిగా బ్యాంకర్లను ఇప్పటికే కోరామని మంత్రి తుమ్మల వెల్లడిరచారు.

మరోవైపు.. రుణమాఫీకి అర్హత ఉండికూడా రుణమాఫీ కాని రైతుల విషయంలో తాము బాధ్యత తీసుకొని మాఫీ చేయిస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల చెబుతున్నారు. కానీ, తొలి విడత నుంచే ఎందరో రైతులు ఫిర్యాదు చేసినా మాఫీ చేయలేదని రైతు సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. అధికారులు ఇంటింటికీ తిరిగి కుటుంబాలను తేల్చి, అర్హులను గుర్తించి రుణమాఫీ చేస్తామని అంటున్నారని.. అదంతా పూర్తి కావడానికి ఎన్నాళ్లు పడుతుందని ప్రశ్నిస్తున్నారు. లక్షల సంఖ్యలో ఉన్న బాధిత రైతుల ఇళ్లకు వెళ్లడం, వారి డేటాను చెక్‌ చేయడం, కచ్చి తత్వాన్ని నిర్దేశించుకోవడానికి ప్రాక్టికల్‌గా చూస్తే  చాలా సమయం పడుతుందని అంటున్నారు. ఇప్పటికే తమవద్ద పూర్తి సమాచారం ఉందని ప్రభుత్వం చెప్పిందని ఇంటింటికీ తిరిగి సర్వే చేయడం ఏమిటో అంతుబట్టట్లేదని అంటున్నారు. మాఫీ వ్యవహారాన్ని, విమర్శలను కొన్నాళ్లపాటు పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని కూడా ఆరోపిస్తు న్నారు.

– సుజాత గోపగోని, సీనియర్‌ జర్నలిస్ట్‌, 6302164068

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE