-స్వాతి

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

నిశ్చేష్టురాలైపోయింది భవాని.
‘‘కాదులే, అది కాకపోవచ్చు. ఇవన్నీ వయసుతో మామూలే’’ ఎందరో ఓదార్పుగా చెప్తూనే ఉన్నారు.
తను కూడా అలాగే అనుకుంది.
తన గదిలోకి వెళ్లి తలుపులు దగ్గరకు వేసి వాలుకుర్చీలో వాలింది.
వెనకే’ అమ్మా అంటూ వచ్చింది లావణ్య.
‘‘నేనేం దిగాలుపడి బెంగపడిపోడం లేదు లవీ! నన్ను కాస్సేపు ఇలా ఒంటరిగా ఉండనీ’’ నిర్మొహమాటంగా చెప్పింది కూతురికి.
‘‘కాఫీ పంపుతాను’’ అని తలుపు చేరవేసి వెళ్లింది లావణ్య.
కొన్ని కొన్ని సమయాల్లో ఇలా కొంత ఏకాంతం ఎవరికి వారికి చాలా అవసరం.
అలాగని భవానికి దుఃఖం పొంగుకు రాలేదు.
‘‘నాకే ఈ రోజు రావాలా?’’ అని వాపోలేదు.
కొత్త కొత్తగా యవ్వనం తొంగి చూసిన రోజులు గుర్తుకు వచ్చాయి.
ఎవరైనా కొంత పరిశీలనగా చూస్తున్నారంటే ఎంత సిగ్గనిపించేదని, అది గమనించే కాబోలు అమ్మ అర్జెంట్‌గా రెండు ఓణీలు కొనితెచ్చింది. అప్పటి దాకా వేసుకున్న పొడుగు జాకెట్లనే సగానికి కత్తిరించి అనువుగా మార్చింది. మల్లు గుడ్డ కొనుక్కు వచ్చి లోపలి బాడీలు కుట్టి పెట్టింది.
ఇప్పటిలా లక్షలు ఖర్చుపెట్టి చేసుకునే ఆడంబరపు ఓణీల ఫంక్షన్లు లేవు. ఓ శుక్రవారం పొద్దున్నే కొత్త ఓణీ కొంగు చివర పసుపు అద్ది వేసుకోమని ఇచ్చింది అమ్మ. ఎంత సంబరంగా అనిపించిందనీ …
చిన్నప్పటీ నుండీ అమ్మ చీరలు కట్టుకుని, అక్క ఓణీలు వేసుకునీ ఎన్ని నాటకాలు వెయ్యలేదు.
‘నిజానికి ఓణీలు వేసుకున్నాకే ఆడపిల్లల్లా అనిపిస్తారు’ అని కూడా అనుకునేది.
కొత్త ఓణీ వేసుకుని బయటకు వెళితే అపురూప సంపదలను భద్రంగా దాచుకున్న అనుభూతి కలిగింది.
వయసు పెరిగే కొద్దీ కొంత పరిపూర్ణత శరీరానికే కాదు మనసుకూ అబ్బింది. కొంగు జారిపోకుండా జాగ్రత్త పడటం ఒద్దికగా మసులు కోవడం మరో స్వభావంగా మారిపోయింది.
చదువు మధ్యలో ఆపేసి అతనికి ఇల్లాలిగా వెళ్లినప్పుడు, మనసా వాచా మనశ్శరీరాలు అతనికి అర్పించుకున్నప్పుడు ఆ యవ్వన సంపద పులకింత మైమరపు తక్కువేమీ కాదు.
సమయం చిక్కితేచాలు లాలింపుగానో తమకంగానో సుకుమారంగా పలకరించే అతని చేతులు జీవితాంతం రక్షణ అనుకుంది.
ముగ్గురు బిడ్డలకు తల్లిగా మారినా ఆ సౌకుమార్యం ఎక్కడా తప్పిపోలేదు.
తొలిసారి బిడ్డకు పాలిచ్చిన క్షణం ఎంత తాదాత్మ్యత. సార్థ్ధకత సమకూరినట్టు అనిపించింది. ఎన్నేళ్లు పిల్లలను గుండెలకు హత్తుకుని లాలించేది. ఎన్ని సార్లో నిద్రపోతూ కూడా పసిబిడ్డలను గుండెల మీదే పడుకోబెట్టుకునేది.
ఎంతో పరిపక్వతను కష్టపడి తెచ్చుకుంటే నడి వయసులో భర్త సెలవంటూ వెళ్లిపోయినా, చేతి కర్రలా ఊతమవుతాడనుకున్న కొడుకు తాగి బండి నడిపి తనువు చాలించినా, పెద్ద కూతురు అజాపజా లేకుండా ఎవరితోనో లేచిపోయినా భవాని కుంగి పోలేదు. తనదైన ప్రపంచాన్ని రంగుల ప్రపంచాన్ని సృజించుకుని రాత్రీపగలూ తనలోకంలో తను వసంతమై విహరించేది.
ఎన్నో జాతీయ అంతర్జాతీయ చిత్రకళా ప్రదర్శనల్లో బహుమతులు, గొప్ప గుర్తింపు ఎంతో వినయంగా తలవంచి స్వీకరించేది.
చివరికి ఎనభైలోకి రాగానే తనకు తాను తాను నచ్చజెప్పుకుని చిన్న కూతురితో రాజీ పడి లావణ్య ఇంటికి మకాం మార్చుకుంది. పెరిగిన మనవ రాళ్లు, బిజినెస్‌తో బిజీగా ఉండే కూతురు అల్లుడు, విశాల మైన ఆ భవనంలో ఆమెకో రెండు గదులు. వంట మనిషి, పనివాళ్లు, డ్రైవర్‌… ‌సుఖమయ జీవనమే. కొంత పనిభారం, బయటకు వెళ్లడం తగ్గించుకుని ఇంటికి పరిమితమైంది.
ప్రశాంతంగా రోజులు గడిపేస్తున్న ఈ సమయంలో రొటీన్‌ ‌చెకప్‌లో బయట పడిన ఈ కఠోర సత్యం ఆవిడను ఒక్కసారి అంతర్లీనంగా కుదిపేసింది.
‘‘మెడికల్‌ ‌ప్రపంచం ఇంత అడ్వాన్స్ అయిన ఈ రోజుల్లో ఇదేం ఆందోళన పడవలసిన విషయం కాదు తల్లీ. చూద్దాం..ట్రీట్‌మెంట్‌ ‌కోర్స్ ఎలా చెయ్యాలో ప్లాన్‌ ‌చేద్దాం. ముందు మీరు ఈ రోజు ఇంటికి వెళ్లి రెస్ట్ ‌తీసుకుని ఉదయం కల్లా వచ్చెయ్యండి’’ డాక్టర్‌ ‌గారి హామీ.
‘‘అమ్మా ఆలస్యమైపోతోంది వచ్చి లంచ్‌ ‌చెయ్యి’’ లావణ్య పిలుపు.
ఎవరి పనుల్లో వాళ్లు తీరిక దొరికినప్పుడు లంచ్‌ ‌చెయ్యడం అలవాటే.
ఇంట్లోనే ఉండే భవాని ఒకటిన్నర రెండు కల్లా భోజనం చెయ్యడం పరిపాటే.
‘‘వస్తున్నా?’’ ’
లేచి మొహం కడుక్కుని లంచ్‌కి వెళ్లింది భవాని. రొటీన్‌కి భిన్నంగా లావణ్య ఆమె కోసం ఎదురు చూస్తోంది.
‘‘ఎందుకమ్మా నువ్వు తినెయ్యకపోయావా?’’ మామూలుగా మాట్లాడిన తల్లిని చూసి ఊపిరిపీల్చుకుంది లావణ్య.
‘‘సాయంత్రం ఒకసారి నిర్మల దగ్గరకు వెళ్తాను లవీ, చాలా రోజుల నుంచి పలకరించాలని అనుకుంటున్నాను’’
భోజనం ముగించి చెయ్యి కడుక్కుంటూ అంది భవాని.
‘‘అలాగే అమ్మా, డ్రైవర్ని పిలుస్తాను’’
* * *
లంచ్‌ ‌తరువాత నిద్రపోయినా, పోకపోయినా ఓ గంట మంచం మీద వాలడం అలవాటు భవానీకి. పొద్దుటి నుంచి శారీరికంగా, మానసికంగా అలసి పోయిందేమో వెంటనే నిద్రపట్టేసింది. అయిదింటికి లావణ్య వచ్చి లేపితే కాని మెళుకువ రాలేదు.
‘‘డ్రైవర్‌ ‌వచ్చాడు అమ్మా’’ అంటే క్షణం ఏమీ అర్ధం కాలేదు. నెమ్మదిగా గుర్తు వచ్చింది. నిర్మల దగ్గరకు వెళ్తానని చెప్పడం. ‘‘అబ్బా ఇప్పుడేం వెళ్దాం?’’ అనిపించినా బలవంతాన లేచి రెడీ అయింది.
నిర్మల తనూ ముప్పై ఏళ్ల పాటు ఒకే ఆఫీస్‌ ‌లో కలిసి పనిచేశారు. ఇద్దరూ ఇంచుమించు ఒకేసారి రిటైర్‌ అయ్యారు.
అడపాదడపా కలుసుకుని కబుర్లు కలబోసుకోడం అలవాటే.
కొంచం మనసు తేలిక పడుతుందని బయలు దేరింది.
‘‘చాలా రోజులకు’’ అంటూ ఆప్యాయంగా ఆహ్వానించింది నిర్మల. కాఫీ తాగుతూ పిచ్చాపాటీ మాట్లాడుకున్నారు.
నవ్వుతూ నవ్వుతూనే అసలు విషయం చెప్పింది భవాని.
‘‘అన్ని టెస్ట్‌లూ అన్ని ఇన్వెస్టిగేషన్‌లూ అయ్యాయి. బ్రెస్ట్ ‌కాన్సర్‌ అని నిర్ధారించారు. ‘‘
‘‘అయ్యో’’
‘‘అయ్యో అని ఏం లాభం అది మనచేతిలో ఉన్నది కాదుగా’’
‘‘అయినా ఇవ్వాళా రేపూ మంచి మెడిసిన్స్, ‌ట్రీట్‌ ‌మెంట్‌ అం‌దుబాటులో ఉన్నాయి.’’
‘‘అవును డాక్టర్‌ ‌గారు చెప్పారు. రేపటినుండి ట్రీట్‌ ‌మెంట్‌ ‌మొదలు. అందుకే ఒకసారి చూసి వెళ్దామని. కీమో థెరపీ వల్ల జుట్టు రాలిపోతుందన్నదే కాస్త బెంగగా ఉంది. అయినా మళ్లీ ఆర్నెల్లలో వచ్చేస్తుందని అన్నారులే’’ తేలిగ్గా నవ్వుతూ,
‘‘అన్నట్టు శాంత ఎలావుంది?’’ అని అడిగింది భవాని.
శాంత అదే కాలనీలో ఉంటుంది. ఆవిడ కూడా భవానీ, నిర్మలతో పాటే పనిచేసింది. కాదంటే కొంచం పై పోస్ట్‌లో. ఈ మధ్యనే ఆవిడ భర్తపోయాడు. అప్పట్లో ఒకసారివెళ్లి పలకరించి వచ్చారు కూడా.
‘‘ ఎలా ఉందని చెప్పను? ఇదే కాలనీలోముప్పై ఏళ్లుగా ఉంటున్నామా? కనీసం రెండు రోజులు ఆ భార్యాభర్తా సవ్యంగా గడిపింది లేదు. చండికలా మొగుణ్ణి చీల్చి చెండాడేది.
చివరకు మంచం మీదున్న వాణ్ణి కూడా కాల్చుకుతింది.
ఇప్పుడేమో ఒకటే శోకాలు. ‘ఆయనెందుకు పోవాలి భగవంతుడు నన్నైనా తీసుకు పోలేదంటూ…’ మరో రెండు నెలల్లో సంవత్సరీకాలు వస్తున్నా ఎవరైనా కనబడితే చాలు శోకాలు.’’
‘‘ఒకసారి పలకరించి వద్దామా?’’ కుతూహ లంగా అడిగింది భవాని.
‘‘నీకు భరించే ఓపిక ఉంటే అలాగే వెళ్దాం.’’
ఇద్దరూ నాలుగిళ్ల అవతల ఉన్న శాంత ఇంటికి బయల్దేరారు.
తలుపులు చేరవేసి ఉన్నాయి. లోపల నుండి మైక్‌ ‌పెట్టినట్టి టీవీ డైలాగ్‌ ‌లు వినబడుతున్నాయి. బహుశా ఏదో సీరియల్‌ ‌కావచ్చు.
‘‘శాంతా…శాంతా’’ రెండు మూడుసార్లు పిలిచి ఇహ లాభంలేక డోర్‌ ‌బెల్‌ ‌కొట్టారు.
కొంచం మొహం చిట్లించుకుని నింపాదిగా లేచి ‘‘తలుపు తీసే ఉంది’’ అంటూ బార్లా తెరిచి ఇద్దరినీ చూసి
‘‘రండి’’ అంటూ ఆహ్వానించింది.
లోపలికి వెళ్తూనే టీవీ ఆఫ్‌ ‌చేసి సోఫాలో వాలింది.
‘‘ఎలా ఉన్నావు శాంతా?’’
‘‘ఎలా ఉంటాను? ఏం ఉంటాను? అప్పటి శాంత ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడున్నది ఒక జీవచ్చవం, అంతే’’
అంటూ వలవలా ఏడుపు మొదలుపెట్టింది.
‘‘ముందు కళ్లు తుడుచుకో శాంతా, జీవితంలో విషాదాలు మామూలే కదా ఎవరికి లేవు? మేమెన్ని బాధలు పడలేదు?’’ పైకి ఓదార్పుగా మాట్లాడినా అతను బెడ్‌ ‌మీద ఉన్నప్పుడు ఆవిడ తిట్టడం – ‘‘నువ్వు పోయినా నాకు పీడా పోతుంది ఈ సేవలు చెయ్యలేక చస్తున్నాను’’ అని విసుక్కోడం ఇద్దరికీ తెలిసినదే.
‘‘నా దేవుడు వెళ్లిపోయి నాకెంత అన్యాయం చేసాడు? ఎందుకు నాకీ బతుకు?’’ రాగాలు తీస్తూనే ఉంది.
ఇద్దరూ కాస్సేపు కూచుని లేచారు వెళ్లడానికి.
ఈ లోగా పనిమనిషి జ్యూస్‌ ‌పట్టుకు వచ్చింది.
‘‘ఇలా అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. నేనే ముందు పోతాననుకున్నాను మహరాజు ముందే వెళ్లిపోయాడు’’
అక్కడ ఉన్నంత సేపూ తన దుఃఖాన్ని వెయ్యిం తలు చేసి చూపటం తప్ప మరో మాట మాట్లాడలేదు.
‘‘చూశావుగా భవానీ దానికి పిచ్చిపట్టినట్టుంది. అది నిజంగా బాధపడు తోందో.. లేదూ నాటాకాలాడుతోందో తెలీడం లేదు.’’
‘‘పాపం’’
‘‘జాలిపడుతున్నావా?’’
‘‘అవును నిర్మలా, జాలిపడుతున్నాను. శాంత ఒకరకమైన ఆత్మన్యూనతలో ఉంది. అవును. ఎవరూ తనపట్ల ఏ శ్రద్ధా చూపడం లేదని… నిజానికి భర్త ఉన్ననాళ్లూ తన ఆత్మన్యూనతతో ఆయనను కించపరచి తనే గొప్ప అన్నట్టుగా ఫీలయిపోయేది. ఇప్పుడు జనాల సానుభూతి కోసం ఇలా. సరే నిర్మలా వస్తాను మరి’’
‘‘ధై••ర్యంగా ఉండు భవానీ’’ ధైర్యం ఇవ్వబోయింది నిర్మల.
‘‘దేనికి నిర్మలా, మనిషన్నాకా ఏదో ఒక జబ్బు చెయ్యడం మామూలే. మన స్థాయిలో మనం దాన్ని ఎదుర్కోవాలని చూస్తాం. ఏమవుతుందనేది దైవ నిర్ణయం.
అయినా నిర్మలా నేను అదృష్టవంతురాలిని. తగ్గుతుందో తగ్గదో కాని రుగ్మత సోకినది శరీరానికే. సానుభూతి వెదుక్కునే మానసిక రుగ్మత కాదు. రేపటి నుండి చికిత్స మొదలు. చూద్దాం. ఫలితం ఎలా ఉన్నా మళ్లీ కలుద్దాంలే ’’
అంటూ కారెక్కింది భవాని.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE