– సూరిశెట్టి వసంతకుమార్‌

‘‘అమ్మా! సుమతి నాన్నగారు ఉత్తరంరాశారు. పండక్కి నాలుగు రోజులముందే రమ్మని. నిన్ను తప్పకుండా తీసుకుని రమ్మన్నారు’’ అంటూ సోఫాలో అమ్మ ప్రక్కన కూర్చున్నాను.

మొదటిసారి సంక్రాంతి పండక్కి వెళ్తున్నావు. మీ మధ్య నేనెందుకు? మీరు వెళ్లిరండిగానీ, పెళ్లిలో ఇస్తానన్న బంగారం ఇప్పుడైనా అడిగి తీసుకో. ఇవ్వకపోతే గట్టిగా వార్నింగు ఇవ్వు.’’

‘‘అలాగేనమ్మా’’ అంటూ లేచి గదిలోకి వెళ్లి పోయాను.

పుట్టినప్పట్నించి బొంబాయిలోనే ఉండడం వల్ల పల్లెటూరులో సంక్రాంతి పండగ ఎలాగుం టుందో చూడాలనిపించి పండక్కి రెండు రోజులముందే సుమతిని తీసుకుని ఊరికి బయలుదేరాను.

వైజాగ్‌కి ఇరవై మైళ్ల దూరంలో ఉంది సుమతి వాళ్ల ఊరు. చుట్టూ పచ్చని పంటపొలాలు. ఊరికి ఆనుకుని పారే చిన్న పిల్లకాలువ. దాని పైనుంచి వచ్చే పిల్ల గాలులు మనసులోని కోరికల్ని తట్టి లేప సాగాయి. వాళ్ల ఇల్లు చాలా చిన్నదవడంవల్ల మా ఇద్దరికీ ఏకాంతం దొరకడమే చాలా గగనమై పోయింది. నా అవస్థని చూచి కాబోలు ఇంట్లో వాళ్లందరూ ఆ రోజు బయట మంచాలేసుకుని పడుకుని ఉన్న ఒక గదిని మాకు ఇచ్చేసారు. చాలా రోజుల తర్వాత స్వర్గద్వారం తెరవబడడంతో ఆ రాత్రంతా సుమతిని నిద్రపోనివ్వలేదు.

తెల్లవారుతుండగా అలసిపోయిన సుమతి చేతిని తీసుకుని ముద్దుపెట్టు కుంటుంటే ‘ఏమండీ! పండక్కి బంగారం ఉంగరం అడగమని జ్ఞాపకం చేస్తున్నారా? అంది సుమతి నవ్వుతూ.

‘‘ఏమిటి సుమా! నువ్వు అంటున్నది. మా అమ్మ గురించి నీకు తెలుసు కదా! పాతకాలం మనిషి. వరకట్నం అనే పండగ కట్నాలనీ ఏవేవో అంటుంది. నువ్వు కూడా అవన్నీ పట్టించుకుంటే ఎలా చెప్పు? మీ ఇంటి పరిస్థితి గురించి నాకు తెలియదా? ఉంగరం పెట్టకపోయినా పరవాలేదు. అమ్మని ఎలా సముదాయించాలో నాకు తెలుసు. అనవసరంగా మామయ్య గారిని ఇబ్బంది పెట్టకు’’ అంటూ సుమతిని దగ్గరకు లాక్కున్నాను.

‘‘లేదండీ, నాన్నగారు పెళ్లప్పుడే ఉంగరం ఇవ్వాలని అనుకున్నారు. కానీ డబ్బులు కుదరక ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ప్రావిడెంట్‌ ఫండులో నుంచి లోనుగా తీసుకుని పండక్కి ఉంగరం చేయించారట’’ అంది సుమతి.

మర్నాడే భోగి పండగ. ఇంట్లో వాళ్లందరూ తొందరగా లేవడంతో మేమూ లేవవలసి వచ్చింది. తలంటుకుని స్నానంచేసి రాగానే ట్రేలో కొత్త బట్టలు, వాటితోపాటు బంగారపుటుంగరం నా చేతికిచ్చి వెళ్లిపోయారు మామయ్యగారు. మొహమాటపడుతూ తీసుకున్నాను. కొత్త బట్టల మధ్య వేెంకటేశ్వరస్వామి బొమ్మ ఉన్న ఉంగరం తళతళా మెరిసిపోతుంది.

పట్టుచీర రెపరెపలు వినబడడంతో తలెత్తి చూశాను. ఎదురుగా చందనపు బొమ్మలా నిలబడి  ఉంది  సుమతి. ‘‘ఉంగరం బాగుందా? సైజు సరి పోయిందో లేదో చూశారా?’’ అంటూ ఉంగరాన్ని చేత్తో పట్టుకుని నా చేతి వేలికి పెట్టింది. ‘‘కొంచెం వదులుగా ఉన్నట్టుంది కదండీ, మనం బొంబాయి వెళ్లిన తర్వాత సరిచేసుకుందాం లేండి. ఇప్పటికి దారంతో చుట్టి ఇస్తాను. పెట్టుకొండేం’’ అంది. సుమతి ముద్దు ముద్దుగా.

పండుగ నాలుగు రోజులూ సరదాగా గడిచి పోయాయి. బయలుదేరేరోజు దగ్గర పడు తుండగా జ్ఞాపకంవచ్చింది. చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాస్‌ని చూడాలన్నది. శ్రీనివాస్‌, నేనూ ఒకే స్కూల్లో, ఒకే కాలేజీలో చదువు కున్నాం. వాడికి బ్యాంకులో ఉద్యోగం రావడంతో వైజాగ్‌ వచ్చి సెటిలైపోయాడు.

‘‘సుమా నేను శ్రీనివాస్‌ను చూసి వచ్చేస్తాను. నేను వచ్చేసరికి రెడీగావుండు. సింహాచలం వెళదాం’’ అంటూ బావమరిది బైకిమీద వైజాగ్‌ బయలుదేరాను. బ్యాంకుకి వెళ్లేసరికి లంచ్‌ టైం అయింది. శ్రీనివాస్‌ నన్ను చూడగానే ఆనందంతో బయటికి వచ్చి గట్టిగా కౌగలించుకున్నాడు

‘‘రా… రా.. కొత్త పెళ్లి కొడకా’’ అంటూ నన్ను పక్కనే వున్న స్టార్‌ హోటల్‌కి తీసుకుని వెళ్లాడు. ఇద్దరం బోల్డెన్ని విషయాలు మాట్లాడుకుంటూ నెమ్మదిగా భోజనం ముగించాం. ఇంతలో బేరర్‌ బిల్లు తీసుకుని వచ్చాడు. నేనిస్తానంటే నేనిస్తానని బిల్లు లాకుంటుంటే గమనించాను. నా చేతికి ఉంగరం లేదన్న సంగతి. గుండె కాసేపు ఆగినంత పనైంది. చేతికి   ఉంగరం లేకపోవడంతో మనసంతా బాధతో నిండిపోయింది. కిందనంతా వెతికి చూసాను. దొరకలేదు. ఒకవేళ దార్లోగాని పడి పోయిందేమోనని అక్కడా వెతికాను దొరకలేదు.

‘‘ఒరే శ్రీనివాస్‌ ఏమిట్రా చెయ్యడం. పాపం అంకుల్‌ కష్టంలో ఉన్నా లోన్‌ పెట్టి ఉంగరం చేయించి పండక్కి కట్నంగా ఇచ్చారు. వాళ్లకి నా మొహం ఎలా చూపింపచడమో తెలియడం లేదు. సుమతికీ విషయం తెలిస్తే చాలా బాధపడుతుంది. అమ్మతో జరిగింది చెప్పినా నమ్మదు. పైగా నా మీదే నిందలు వేస్తుంది. ఏం చెయ్యడమో పాలుపోవడం లేదురా?’’ అన్నాను కొంచెం గాబరా పడుతూ.

‘‘అయితే ఒక పని చెయ్యరా! అలాంటి ఉంగరం దొరుకు తుందేమో చూద్దాం. దొరికిం దంటే కొనేద్దాం. నా దగ్గర ఎలాగు క్రెడిట్‌ కార్డు ఉంది. నువ్వు తర్వాత డబ్బులు పంపిం చుదువుగానీ.. ఏమంటావ్‌?’’

నాకా సమయంలో శ్రీనివాస్‌ ఆపద్భాంధవుడిలా కనిపించాడు. నాకు చెప్పినట్లే నాలుగైదు షాపులు తిరిగి అలాంటి ఉంగరాన్ని వెతికి, కొన్ని చేతికి పెట్టు కున్నాడు. వాడికి మరో మారు థాంక్యు చెప్పి ఇంటికి బయలుదేరి పోయాను.

ఇంటికి వచ్చేసరికి సుమతి అందంగా అపరంజి బొమ్మలా తయారైవుంది. ఉదయం జరిగిన సంఘ టనవల్ల తన అందాన్ని ఆస్వాదించలేక పోయాను. ‘‘ఏమిటండీ, ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉన్నారు…? ఒంట్లోగాని బాగో లేదా?’’ అంటూ వచ్చింది సుమతి.

ఏమీ లేదని చెప్పి స్నానం చేసిన తర్వాత ఇద్దరు సింహాచలానికి బయలు దేరాం. దేవుని సన్నిధిలో మనస్సుకి కొంచెం శాంతికలిగింది. ఇద్దరం బయటికి వచ్చి స్వామివారి కళ్యాణ మండపంలో కూర్చున్నాం.

‘‘ఏమండీ ఎందుకలా వున్నారు?’’ మళ్లీ మొద లెట్టింది సుమతి.

‘‘అబ్బే… ఏమీ లేదు. ఉన్న నాలుగు రోజులూ సరదాగా గడిరచిపోయాయి. రేపు ఊరికి వెళ్లిన తర్వాత… ఆఫీసు, ఇల్లూ, లైఫ్‌ మళ్లీ మెకానికల్‌ అయిపోతుంది కదా అని ఆలోచిస్తున్నాను అంతే’’.

‘‘ఏమండీ మీరు ఉంగరం పెట్టుకున్న తర్వాత మీ చేతుల్ని సరిగా చూడలేదు. చెయ్యి చూపించండి’’ అంటూ నా చేతికి ఉన్న ఉంగరాన్ని తీసి గబగబా వెళ్లి స్వామి వారి హుండీలో వేసేసింది.

‘‘అయ్యో! ఇలా చేసావేమిటి సుమతి. అందమైన ఉంగరాన్ని తీసుకుని వెళ్లి హుండీలో వేసేసావు. ఏమైంది నీకు’’ అన్నాను కొంచెం కోపంగా.

‘‘ప్లీజ్‌ నన్ను క్షమించండి. మిమ్మల్ని ఇంకా మోసం చెయ్యడం నా కిష్టం లేదండి. నాన్నగారు ఇచ్చిన ఉంగరం బంగారుది కాదు. వెండితో చేయించి దానికి బంగారపు పూత పూయించారు. నాన్నగారికి అనుకున్నట్టుగా లోన్‌ శాంక్షన్‌ కాలేదు. బయట ఎక్కడా అప్పు దొరకలేదు. మీ అమ్మగారికి సమాధానం చెప్పలేక, ఇప్పటికి ఎలాగోలా ఈ ఉంగరాన్ని ఇచ్చేద్దాం. లోన్‌ రాగానే బంగారంతో అలాంటి ఉంగరాన్ని చేయించి మార్చేద్దాం! అని నాన్నగారు చెప్పారు. కానీ నాకే మిమ్మల్ని చూసిన తర్వాత అబద్ధం చెప్పాలనిపించలేదు, మిమ్మల్ని ఇలా మోసం చెయ్యడం నాకెందుకో చాలా బాధనిపిం చింది. అందుకే మీ దగ్గర నిజం చెప్పి క్షమించమని అడగాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఆ ఉంగరాన్ని స్వామివారి హుండీలో వేసేశాను. ఏమండీ నన్ను క్షమించరూ’’ అంది కళ్లల్లో నీళ్లు తిప్పుకుంటూ సుమతి. తేలు కుట్టిన దొంగలా అయింది నా పరిస్థితి. ఇటువంటప్పుడు నిజం చెప్తే సుమతి మనసుని ఇంకా బాధపెట్టినట్టు అవుతుందని ఆ నిజాన్ని నా లోనే ఉంచేసుకుని సుమతిని దగ్గరగా తీసుకున్నాను.

వచ్చేవారం కథ..

దాసాని పూలమడుగు

– రోహిణి వంజరి

About Author

By editor

Twitter
YOUTUBE