ఆగస్ట్ 14 దేశ విభజన విషాద సంస్మరణ దినం
భారత విభజన (1947)ను అధ్యయనం చేయడం అంటే రక్తపుటేరు లోతును కొలవడమే. భారత విభజన ఒక విషాద ఘట్టం మాత్రమే కాదు. ఒకే మూలాలు ఉన్న సమూహాన్ని వలసవాదం ఎలా ధ్వంసం చేయగలదో ప్రపంచ చరిత్రకు ఒక పాఠం కూడా. అది రెండు మూడేళ్ల ఘర్షణ కాదు. ఒక దేశ భవిష్యత్తును సుదీర్ఘకాలం వెంటాడగల దుష్పరిణామమని నాడే సంకేతించింది. ఈ భూగోళం మీద విభజన పేరుతో జరిగిన అత్యంత ఘోర ఉదంతంగా కూడా దీనిని చూసేవారు ఉన్నారు. ఈ ఘట్టాన్ని చరిత్రగా నమోదు చేసిన పుస్తకాలు వందలలో వెలువడినాయి. విభజన విషాదమే ఇతివృత్తంగా మరిన్ని సృజనాత్మక రచనలూ వచ్చాయి. అయినా విభజన గాథకు పూర్తి రూపం ఇవ్వడం ఇంతవరకు సాధ్యం కాలేదు. విభజన విషాదపు లోతులను అక్షరబద్ధం చేయడంలో చరిత్ర ఒకింత విఫలమైందన్న విమర్శ లేకపోలేదు. కానీ చరిత్రకు ఛాయ వంటి సాహిత్యం ఆ పని చాలావరకు చేసిందన్న అభిప్రాయం ఉంది. అందుకే ఈ పని రక్తపుటేరు లోతును కొలవడం వంటిది. స్వాతంత్య్రం వచ్చింది. స్వాతంత్య్రం వెంట విభజన, ఆ వెనుకే పెను విషాదం వచ్చాయి. స్వాతంత్య్ర విజయోత్సవాలు కొందరికి, విషాదం మిగిల్చిన కన్నీళ్లు ఇంకొందరికి అన్నట్టు జాతి వ్యవహరించడం మహా ద్రోహం. ఆ ధోరణి మారాలి. స్వాతంత్య్రం తెచ్చిన వారిగా కొందరిని పూజిస్తున్నాం. తప్పులేదు. కానీ ఆ క్రమంలోనే ప్రాణాలు వదిలిన వారిని, నాటి ప్రజల కన్నీళ్లని స్మరించుకోవడం, శిరసు వంచి వందనం చేయడం కూడా మన మీద ఉన్న కర్తవ్యం.
విభజన మీద రచనలు వెల్లువెత్తాయి. కొందరు హత్యాకాండ నేపథ్యంగా స్వీకరించారు. కొందరు హత్యాకాండలోని ఘోరాన్ని వర్ణించారు. మరికొందరు ఆ మహా విషాదం తరువాతి పరిణామాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఏడున్నర దశాబ్దాలు గడుస్తున్నా స్వతంత్ర భారతాన్ని వెంటాడుతున్న చారిత్రక పరిణామం. సరిహద్దు సమూహాలు భరిస్తున్న మానని గాయం. చరిత్రకారులు, సృజనాత్మక రచయితలు, విశ్లేషకులు ఆ ఘట్టం లోతులను తడుముతూనే ఉన్నారు. జ్ఞాపకాలను పలకరిస్తూనే ఉన్నారు. ఎండిన రక్తపు మరకల కింద రోదనలను వినే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు? అది స్వాతంత్య్రోద్యమం ఊహించని పతాక సన్నివేశం.
చరిత్ర గ్రంథాలు
ప్రత్యక్షసాక్షులు, సమకాలీనులు, చరిత్రకారులు ఈ అంశం మీద రాసిన పుస్తకాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. భారత ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ‘ఇండియా డివైడెడ్’ పుస్తకం అలాంటిదే. అబుల్ కలాం ఆజాద్ ‘ఇండియా విన్స్ ఫ్రీడమ్’ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచనలలోని ‘పాకిస్తాన్ ఆర్ ది పార్టిషన్ ఆఫ్ ఇండియా’, ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖుడు హెచ్‌వీ శేషాద్రి ట్రాజిక్ స్టోరీ ఆఫ్ పార్టిషన్, జస్వంత్ సింగ్ ‘జిన్నా, ఇండియా, పార్టిషన్, ఇండిపెండెన్స్, నిసిద్ హజారియానంద్, మిడ్‌నైట్ ఫ్యూరీస్, అంచల్ మల్హోత్రా, రెమనెంట్స్ ఆఫ్ ఎ సెపరేషన్, నరేంద్ర సింగ్ సరిలా, ది షాడో ఆఫ్ ది గ్రేట్ గేమ్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ పార్టిషన్ వంటి పుస్తకాలు అసంఖ్యాకంగా వచ్చాయి. నెత్తురూ, కన్నీరుతో నిండిన ఘటన సృజనాత్మక రచయితలను తాక కుండా ఉండదు. ఈ వ్యాసం మాత్రం సృజన్మాతక రచనలనే ప్రధానంగా చర్చిస్తుంది.
దేశ విభజన ఇరవై లక్షలమంది ప్రాణాలను బలిగొన్నదని తారీఖులతో, ఆధారాలతో, కారణాలతో కలిపి చెబుతుంది చరిత్ర. ఇది సృజనాత్మక రచయితలను కదిలించే తీరు వేరు. ఆ ఇరవై లక్షలలో` తప్పిపోయిన బాలిక, సామూహిక లైంగిక అత్యాచారానికి గురైన ఒక యువతి, తల్లి ఎదుటే హింసకు గురైన తనయ, తండ్రి ఎదుటే మతోన్మాదుల చేతుల్లో ప్రాణాలు వదిలిన ఒక కొడుకు` ఉండవచ్చు. ఎవరి విషాదం వారిదే. సమూహం చరిత్రలో వ్యక్తి అస్తిత్వం కూడా విలువైనదని సృజనాత్మక రచయితలు భావిస్తారు. చరిత్ర చరిత్రకారుడి మేధతో వెలువడు తుంది. సృజనాత్మక రచన రచయిత హృదయం అందిస్తుంది. ఒక ఉదాహరణ చూద్దాం. తమను తాము కాపాడుకోవడానికి లెక్కలేనంత మంది స్త్రీలు బావులలో దూకారు. పంజాబ్‌లోని ఒక గురుద్వారా వెనుక బావి నుంచి దాదాపు 180 మహిళల శవాలను ఆ సమయంలో వెలికి తీసిన వాస్తవాన్ని అఖండ భారత్ ఆఖరి సీడబ్ల్యుసీలో జేబీ కృపలానీ ప్రస్తావించారు. ఈ లెక్కలు చరిత్ర చెప్పగలుగుతుంది. కానీ అలా బిడ్డలతో సహా దూకిన ఒక తల్లి గుండెకోతను, మానసిక స్థితిని, దుఃఖాన్ని సాహిత్యమే ఆవిష్కరించగలుగుతుంది. చరిత్ర రచన వాస్తవాలకు, ఆధారాలకు, అంకెలకు పరిమితమవుతుంది. వ్యక్తుల, ప్రధానంగా మహిళల ఉద్వేగాలనీ, బాధల గాఢతనీ, నాటి హింసలోని క్రౌర్యాన్నీ సాహిత్యమే అక్షరీకరిస్తుంది. ఊర్వశి బుటాలియా రచన ‘ది అదర్ సైడ్ ఆఫ్ సైలెన్స్’లో విభజన వేళ మహిళలు ఎదుర్కొన్న దుస్థితిని వివరించారు. ఆనాడు మహిళల మీద జరిగిన లైంగిక అత్యాచారాల గురించి వెలికి ఆమె తీశారు. 75,000 మంది మీద అత్యాచారం జరిగిందని చెప్పినా, నిజానికి ఆ సంఖ్య లక్షవరకు ఉంటుందని ఊర్వశి వాదన. వీరంతా అత్యాచారా లకు, మత మార్పిడులకు, అపహరణలకు గురైన వారు. కానీ విభజన నాడు కనిపించిన ఈ తీవ్ర పరిణామం గురించి తక్కువ మాట్లాడతారన్నది ఆమె ఆరోపణ. నిజమే.
విభజన ఇతివృత్తంగా కూడా అసంఖ్యాకంగా రచనలు వచ్చాయి. కథ, నవల, కవిత, నాటకం` ప్రతి ప్రకియ విభజన విషాదాన్ని స్వీకరించింది. తమస్ (భీష్మ సహానీ), పింజార్ (అమృతా ప్రీతమ్), ట్రైన్ టు పాకిస్తాన్ (కుష్వంత్ సింగ్), ఐస్ క్యాండీమ్యాన్/క్రాకింగ్ ఇండియా (బప్సీ సిధ్వా), ఏ బెండ్ ఇన్ ది గ్యాంజెస్ (మనోహర్ మల్గోంకర్), మిడ్‌నైట్ చిల్డ్రన్ (సల్మాన్ రష్దీ), ఇంక్విలాబ్ (కేఏ అబ్వాస్), రaూటా సచ్ (యశ్‌పాల్)` హిందీ, ఇంగ్లిష్, ఉర్దూలలో విభజన నాటి కన్నీళ్లే అక్షరాలుగా కనిపించే సృజనాత్మక రచనలు. కథలు వందలలో ఉన్నాయి. రావి నది అవతల (గుల్జార్), టోబా టేక్‌సింగ్ (సాదత్‌హసన్ మంటో), వంటి ఎన్నో గొప్ప కథలు వచ్చాయి. సుభ్ ఏ ఆజాదీ (కవిత, ఫైజ్ అహ్మద్ ఫైజ్) వంటి కవిత్వం కూడా వెలువడిరది. కిషన్‌చందర్, రాజిందర్ సింగ్ బేడీ, కేఎస్ దుగ్గల్, నానక్ సింగ్, ఇస్మత్ చుగ్తాయ్ కూడా ఈ విభాగం లోని వారే. ఇటు భారతీయ రచయితలు, కొందరు పాకిస్తానీ రచయితలు, బంగ్లాదేశ్ రచయితలు కూడా ఈ పని చేశారు. 1969లో డబ్ల్యు హెచ్ ఆడెన్ అనే అమెరికా కవి వెలువరించిన ‘సిటీ విథౌట్ వాల్స్’ సంకలనంలోని ‘పార్టిషన్’ కవితకు ప్రత్యేక స్థానం కల్పించాలి. భారత్`పాకిస్తాన్‌ల మధ్య విభజన రేఖను గీసే మహత్తర బాధ్యతను నిర్వర్తించ డానికి బ్రిటిష్ ఇండియా తీసుకువచ్చిన సిరిల్ రాడ్‌క్లిఫ్‌తో జరిగిన ద్రోహం ఎలాంటిదో ఈ కవిత ఆవిష్కరించింది. ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ (ల్యారీ కోలిన్స్, డొమినిక్ లాపీరే) కూడా కవితాత్మకంగా, కొంత కల్పనతో సాగే చరిత్ర పుస్తకం.
ఇది సూర్యోదయాన్ని నిరోధించిన మచ్చ అంటాడు ప్రఖ్యాత కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్. అందుకే భారతీయ సాహిత్యంలో పార్టిషన్ లిటరేచర్ పేరుతో ఈ ఇతివృత్తంతో రచనలు స్రవంతిగా ఉబికింది. తెలుగు సహా దాదాపు అన్ని భారతీయ భాషలలోను` హిందీ, ఉర్దు, పంజాబీ, బెంగాలీ, ఇక ఇంగ్లిష్ సరేసరి` ఈ సాహిత్యం వెలువడిరది అంటారు ప్రబీర్ కుమార్ సర్కార్ (రాంచీ విశ్వవిద్యాలయం). సహజంగానే హిందీ, ఇంగ్లిష్ భాషలలో వచ్చిన సాహిత్యానికి ఎక్కువ ప్రాచుర్యం వచ్చింది. విభజన ప్రభావం అతి తీవ్రంగా అనుభవించిన పంజాబ్, బెంగాల్ ప్రాంత రచయితలు మరింత గాఢతతో రచనలు అందించగలిగారు. ఇతివృత్తాలలో కొన్ని పోలికలు ఉన్నా, వాటి వెనుక దీనత్వం లోతులు వేరు. విభజన ముందు వరకు సోదరులుగా ఉన్న హిందువులు, సిక్కులు, ముస్లింలు విభజన ప్రకటన వెలువడగానే బద్దశత్రువులైపోయారు. ఆ వర్గం స్త్రీలను ఈ వర్గం, ఈ వర్గం స్త్రీలను ఆ వర్గం పరమ నీచంగా చూశారు. చరిత్ర స్వీకరించిన ఈ వైయుక్తిక గాథలను సాహిత్యం పరిశీలించింది.
కొన్ని నవలలు
విభజన కాలం మీద వెలువడిన నవలల్లో ‘తమస్’కు అగ్రస్థానం ఉంది. భీష్మ సహానీ రాసిన ఈ నవల పంజాబ్‌లోని చిన్న పట్టణం నేపథ్యంలో సాగుతుంది. తమస్ అంటే చీకటి. అదొక చీకటి యుగమని ప్రతీకాత్మకంగా రచయిత చెప్పారు. ఊరిలోని పశు వైద్యుడికి ప్రయోగాల కోసం ఒక పంది కావాలని నాథూ అనే పేద చమార్‌కు (తోళ్ల పనిచేస్తాడు) మురాద్ అలీ అనే పలుకుబడి కలిగిన వ్యాపారి పురమాయించడం దగ్గర ఈ నవల ఆరంభమవుతుంది. ఒక గుడిసెలో నాథూ దానిని వేటాడతాడు. మొత్తానికి ఐదు రూపాయలు తీసుకున్నందుకు అతి కష్టం మీద దానిని చంపి కాలు అనే పారిశుధ్య కార్మికుడికి అప్పగిస్తాడు. నిజానికి ఆ పంది పశు వైద్యుడి కోసం కాదు. పట్టణంలో తగ్గు ముఖం పట్టిన మత కలహాలను మళ్లీ రాజేయడానికి. ముస్లింలు పందిని ద్వేషిస్తారు. అలాంటిది చచ్చిన పందిని తీసుకువెళ్లి మసీదు మెట్ల మీద వేయిస్తాడు మురాద్ అలీ. దానిని కాంగ్రెస్ కమిటీ చూస్తుంది. మళ్లీ పట్టణం భగ్గుమంటుంది. ఇది హిందువుల పనేనని నమ్మిన ముస్లింలు ఇందుకు ప్రతీకారంగా గోవధ చేస్తారు. నిజంగానే శాంతిని కోరేవారు, తాడోపేడో తేల్చుకోవాలనుకువాళ్లు హిందూ ముస్లింలు, సిక్కులలో ఉన్న విషయాన్ని రచయిత చెబుతారు. అదే సమయంలో విభజన రాజకీయా లను మరింత పెంచాలని చూస్తే పోలీస్ డిప్యూటీ కమిషనర్ రిచర్డ్ పాత్ర కూడా ఈ నవలలో కనిపిస్తుంది. ఇతడు సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల హత్యలు, మానభంగాలు, దోపిడీలు అన్నీ జరిగిపోతాయి. ఆ అల్లర్లలోనే నాథూ, అతని భార్య కూడా చనిపోతారు. చివరికి శాంతియాత్రకు సిద్ధమవుతారు. అందుకోసం తెచ్చిన వాహనంలో డ్రైవర్ పక్కన కూర్చున్న ఒకడు శాంతి నినాదాలు ఇస్తూ ఉంటాడు. అతడు మురాద్ అలీ. ఇదొక అద్భుతమైన మలుపు. విభజన ప్రకటన సమయానికి భారత రాజకీయాలు ఎలాంటి మలుపు తీసు కున్నాయో సహానీ గొప్పగా గమనించారని అనిపిస్తుంది. అల్లర్లు ఆరంభించినది ముస్లింలేనన్న వాస్తవాన్ని సహానీ అంగీకరించారనే చెప్పాలి.
విభజన నాటి విషాదాన్ని తొలిసారిగా నవలీకరించిన రచయిత కుష్వంత్ సింగ్ అంటారు సాహిత్య విమర్శకులు. 1956లో వెలువడిన ఆ నవల ‘ట్రెయిన్ టు పాకిస్తాన్’. సట్లెజ్ నదీతీరంలోని మోనోమజ్రా అనే గ్రామం నేపథ్యంతో ఈ ఇతివృత్తం అల్లారు రచయిత. అక్కడ కొన్ని శతాబ్దాలుగా హిందు వులు, సిక్కులు, ముస్లింలు కలసిమెలసే జీవించారు. వేకువ నుంచి అర్ధరాత్రి వరకు రైళ్ల కూతలు వినపడే ఆ గ్రామంలో అందరూ రైలు ప్రయాణికులకు సేవలు అందించి బతికేవారే. ఆ రోజు వచ్చిన రైలు మాత్రం పెను దిగ్భ్రాంతిని తీసుకుని వచ్చింది. నిండా హిందువుల శవాలతో వచ్చిందా రైలు. ఇందుకు ప్రతీకారం తీర్చుకోవాలని కొందరు ఒక గురుద్వారాలో జరిపిన సమావేశంలో తీర్మానిస్తారు. ఆ క్రమంలోనే పాకిస్తాన్ నుంచి ముస్లిం శరణార్థుల రైలును ఆపేందుకు ఊరి దగ్గరి వంతెనకు అడ్డంకులు పెడతారు. ముస్లిం శరణార్థులను చంపి, రైలుకు నిప్పు పెట్టాలని కూడా అనుకుంటారు. ఆ కాలంలోనే కారాగారంలో ఉన్న జుగ్గా అనే ఒక స్థానిక గూండాను హుకుమ్ సింగ్ విడుదల చేయిస్తాడు. నూరాన్ అనే మహిళతో ప్రేమలో ఉంటాడు. వారికి ఒక బిడ్డ కూడా. అయితే నూరాన్ పాకిస్తాన్‌లోని శరణార్థి శిబిరానికి వెళ్లడానికి నిరాకరిస్తూ ఉంటుంది. ఎందుకంటే తన బిడ్డకు ఉన్న సిక్కు వారసత్వం. నూరాన్ కూడా ఆ రైలులో ఉంది. అప్పుడే ఊరికి వచ్చిన జుగ్గా ఆమెను రక్షిస్తాడు. వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు ప్రేమికులతో కుష్వంత్ సింగ్ నాటి ఘటనలను చిత్రించారు. సామాజిక, మత పరిస్థితులు ఎలా ఉన్నా ప్రేమ బతకాలని ఆశించారు.
బప్సి సిధ్వా నవల ‘ఐస్ క్యాండీ మ్యాన్’ కూడా భారత్ నుంచి ముస్లింల శవాలతో, వక్షోజాలు నరికిన శరీరాలతో పాకిస్తాన్‌కు రైలు రావడంతో మలుపు తిరుగుతుంది. విభజన ఘోరాలకు సాక్షి, పార్సీ బాలిక లెన్నీ చుట్టూ, లాహోర్ కేంద్రంగా ఇతివృత్తం సాగుతుంది. ఆ బాలిక ఇంట్లో పనిమనిషి శాంత. ఈమె ప్రేమ కోసం కొందరు పాకులాడుతూ ఉంటారు. అందులో మషూర్, దిల్‌నవాజ్ (ఇతడే క్యాండీ మ్యాన్) కూడా ఉన్నారు. రైలు వచ్చే ముందు వరకు ప్రశాంతంగా, మత సామరస్యంతో ఉన్న లాహోర్ తరువాత వేడెక్కుతుంది. భారత్ నుంచి ఆ రైలులోని శవాలలో దిల్‌నవాజ్ సోదరి కూడా ఉంటుంది. ఇందుకు ప్రతీకారంగా ఇతడు చేసిన పని తనతో పాటు శాంతి కోసం పోటీ పడుతున్న మషూర్‌ని చంపడం. మొత్తం హిందువుల మీద అతడు కక్ష పెంచుకుంటాడు. మతోన్మాదులతో కలసి దాడులలో పాల్గొంటాడు. ఆఖరికి తాను ఒకప్పుడు ఎంతో గాఢంగా ప్రేమించిన శాంతను అపహరి స్తాడు. ఆమె హిందువు అయిన కారణంగా వ్యభిచారంలో దింపుతాడు. అయితే లెన్నీ బంధువులు ఆమెను కాపాడి అమృత్‌సర్‌లోని హిందూ శరణార్థి శిబిరానికి పంపిస్తారు. ఈ ప్రపంచం మొత్తం దగ్థమైపోతున్న భావన, ఆ వేడి తన ముఖానికి కొడుతున్న హింసాత్మక అనుభవం లెన్నీని కలుగు తాయి. ముస్లిం మహిళల వక్షోజాలు నరికినందుకు ఎవరినో ఒకరిని చంపాలి అనుకుంటాడు దిల్‌నవాజ్. ఐస్ క్యాండీలు అమ్మే పాత్ర గుండె హఠాత్తుగా నిప్పులు కొలిమిలా మారిపోవడం నాటి మనుషుల మానసిక ప్రవృత్తిని సంకేతాత్మకంగా చెబుతుంది. విభజనలో మహిళలు పడిన బాధలు వర్ణనాతీతం. ఎందరో హిందూ స్త్రీల వక్షోజాలు కూడా కోసేశారు. రైళ్లలో ఖండిరచిన పాలిండ్లు పడి ఉండేవంటే అర్ధం చేసుకోవచ్చు. అవతలి పక్షం మీద కక్ష తీర్చుకోవడం అంటే మతోన్మాదులు అర్ధం చేసుకున్నది, స్త్రీలను అవమానించడమే. ‘ట్రెయిన్ టు పాకిస్తాన్’ నవలలో ఈ మనస్తత్వాన్ని ప్రతిబింబించే ఒక దృశ్యం ఉంది. సుందరికి నాలుగు రోజుల క్రితమే వివాహం అయింది. భర్తతో కలసి బస్సులో కొత్త జంట గుజ్రన్‌వాలా (పాకిస్తాన్) వస్తూ ఉంటే, ముస్లింలు దాడి చేశారు. అతడి ఒంటి మీది బట్టలు తీసేశారు. ఆమెపై లైంగిక అత్యాచారం చేశారు. ఈ ఉదాహరణలు బట్టి చూస్తే కథకులు, నవలాకారులు సత్యనిష్ఠతో నాటి పరిస్థితిని చిత్రించారనే అనిపిస్తుంది.
కురుతులన్ హైదర్ రాసిన ఆగ్ కా దర్యా (అగ్నిధార) ఇదొక విశేషమైన రచన. నందుల కాలం నుంచి విభజన అనంతర పాకిస్తాన్ నిస్పృహ వరకు పరిచయం చేస్తుంది. ఫైర్‌ఫ్లైస్ ఇన్ ది మిస్ట్ కూడా హైదర్ నవల. జుంపా లహరి రాసిన ఇంటర్‌ప్రిటర్ ఆఫ్ మాలడీస్ చాలా ఖ్యాతి గాంచింది. పార్టిషన్స్ (అమిత్ మజుందార్), ది పార్టెడ్ ఎర్త్ (అంజలి ఇంజేటి), ‘ది రేప్’ (రాజ్‌గుల్), ‘యాషెస్ అండ్ పెటల్స్’ (హెచ్‌ఎస్ గిల్), ఏ ఫైన్ ఫ్యామిలీ (గురుచరణ్‌దాస్), ‘ది డార్క్ డ్యాన్సర్’ (బి. రాజన్) నాటి హింస, క్రౌర్యం, అమానవీయత ఇతివృత్తాలుగా వచ్చిన నవలలు. భారత తాత్కాలిక ప్రభుత్వంలో ప్రధాని నెహ్రూ, పాకిస్తాన్ గవర్నర్ జనరల్ జిన్నా ఇద్దరూ కూడా రాబోయే పరిణామాల పట్ల ఏమాత్రం సంసిద్ధంగా లేరని ‘మిడ్‌నైట్ ఫ్యూరీస్’ నవలా రచయిత నిసిద్ హజారి సుస్పష్టంగానే చెప్పారు. మహాత్మా గాంధీ: ది కాంగ్రెస్ అండ్ పార్టిషన్ ఆఫ్ ఇండియా (డీసీ రaా), క్లియర్ లైట్ డే (అనితా దేశాయ్), ది హార్ట్ డివైడెడ్ (ముంతాజ్ షా నవాజ్) ఇతర నవలలు.
కథా సాహిత్యం
విభజన మీద వందలలో కథలు వచ్చాయి. మంటో, భీష్మ సహానీ, ఇస్మత్ చుగ్తాయ్, కిషన్‌చందర్ వంటివారు అలాంటి కథలు రాశారు. రచయిత్రి అటియా హోసన్ రచన ‘ఆఫ్టర్ ది స్టార్మ్’ విభజన హింస కారణంగా బాల్యాన్ని కోల్పోయిన బాలిక బీబీ గురించి చెబుతుంది. ఘర్షణల నుంచి శరణార్థి శిబిరానికి చేరుకోవడం, అక్కడ నుంచి దత్తకు వెళ్లిపోవడానికీ మధ్య గడిచిన జీవితానికీ మధ్య ఏర్పడిన శూన్యాన్ని ఆమె ఎప్పటికీ పూరించుకోలేక పోతుంది. ఆమె ఆత్మను కోల్పోయిన ఒక అనాథగా మాత్రమే రచన అంతటా కనిపిస్తూ ఉంటుంది. కృష్ణ సోబ్తి రాసిన కథలో ‘మా అమ్మ ఏది?’ అంటూ నిరంతరం ప్రశ్నించే బాలిక పాత్రను చిత్రించారు. కథ పేరు కూడా అదే. ముంతాజ్ ముఫ్తి, నసీమ్ హిజాజీ, కృష్ణబల్దేవ్ వైయిద్, రాహి మాసుమ్ రెజా, అబ్దుల్లా హుసేన్, ఇంతిజార్ హుసేన్, మనోహర్ మాల్గోంకర్, రజియా బట్, విక్రమ్‌చంద్ర, సునీల్ గంగోపాధ్యాయ, రోహింటన్ మిస్త్రీ, చమన్ నహాల్, అమితవ్ ఘోష్, ఖాండిజా మస్తూర్ వంటి ఎందరో రచయితలు ఆ నాటి బీభత్సాన్ని ఇతివృత్తంగా తీసుకున్నారు. లేదా తమ ఇతివృత్తంలో భాగం చేసుకున్నారు. వచ్చిన సాహిత్యమంతా పరిచయం చేయడం సాధ్యం కాదు. కాబట్టి స్థాలీపులాక న్యాయంగానే ఇచ్చామని గమనించాలి.
క్రాసింగ్ ఓవర్
‘క్రాసింగ్ ఓవర్’` ఇదొక పుస్తకానికి పెట్టిన పేరు. సాధారణ అర్ధం` ఒక వీధిని వీడి పక్క వీధిలోకి వెళ్లడం, సరిహద్దు, లేదా వంతెన దాటడం. అలాగే క్రోమోజోములు జెనెటిక్ పదార్థాలుగా మారి కొత్తగా భూమ్మీదకు పంపిన వాళ్లలో కనిపించే వైవిధ్యం అన్నది (జెనెటిక్స్ పరిభాషలో) దీనికే మరొక అర్థం. ఆధ్యాత్మిక కోణం నుంచీ ఒక అర్ధం ఉంది. ఇహలోకం నుంచి పరలోకాలకు ఆత్మ చేసే ప్రయాణం. ఆ పుస్తకంలోని విషయాన్ని బట్టి ఆ అర్థాలు అద్భుతంగా పొసుగుతాయి. 1947 నాటి భారత విభజన ప్రపంచ చరిత్రలో కొత్త పాఠాన్ని చేర్చింది. మానవ చరిత్రలోనే అనివార్యంగా అధ్యయనం చేయవలసిన అంశంగా మారింది.
‘క్రాసింగ్ ఓవర్’ ఒక కథా సంకలనం. హవాయ్ విశ్వవిద్యాయలం వారు (2007) ప్రచురించారు. ఫ్రాంక్ స్టూవర్ట్ సంపాదకుడు. సుక్రీతాపాల్ కుమార్ సహ సంపాదకుడు. భారత్, పాక్, బాంగ్లాదేశ్‌ల విభజన గాథలు ఇతివృత్తాలుగా వెలువడిన కథలే ఇందులో అన్నీ. ఊర్వశీ బుటాలియా, జోగిందర్ పాల్ వ్యాసాలును కూడా చేర్చారు. ఇందులో చాలావరకు భారతీయ భాషలలోకి అనూదితమైన కథలే. అంటే ఇది అంతర్జాతీయ పాఠకుల కోసం ఉద్దేశించిన సంకలనం. ఇదొక అద్భుత ప్రయత్నం. భీష్మ సహానీ ‘రైలు అమృత్‌సర్ చేరింది’ మొదటి కథ. ఆయన రచనే ‘పాలి’ కూడా ఇందులో ఉంది. ఇంకా, సాదత్ హసన్ మంటో (టోబా టేక్‌సింగ్, తీత్వల్ కుక్క, మోజెల్), రాజిందర్‌సింగ్ బేడీ (లజ్వంతి), రషీద్ హైదర్ (అజ్ఞాతం), మోహన్ రాకేశ్ (ఫిర్యాదు, శిథిలాల అధిపతి), గుల్జార్ (రావి నదికి ఆవల), ప్రఫుల్లరాయ్ (తండ్రి, ఎక్కడ సరిహద్దు లేదో అక్కడ), సమరేశ్‌బాబు (వీడ్కోలు), జోగిందర్ పాల్ (స్లీప్‌వాకర్స్ నుంచి), ఇంతిజార్ హుసేన్ (బస్తీ నుంచి), అబుల్ బషర్ (పునర్జన్మ), కమలేశ్వర్ (పాకిస్తాన్‌లు ఎన్ని?) రాసిన కథలు ఇందులో ఉన్నాయి.
కథలు నాటి గాథలను, అందులోని విషాదాన్నీ, హింసనీ, దు:ఖాన్నీ కళ్లకు కడతాయి. వ్యాసాలు నాటి చరిత్రలను, పరిస్థితులను, వాటికి ఉన్న కోణాలను కొత్త దృక్పథంతో ఆవిష్కరించాయి. 1947 భారత విభజన ఒక ప్రపంచ విషాదం. ఆ విషాదానికి బలైన వారిని స్మరించుకోవడం, వారి కన్నీటికి సానుభూతి ప్రకటించడం ప్రతి తరం బాధ్యత.
‘స్వప్నాలు సరిహద్దులెరుగవు’
‘అది ఇప్పటికీ నా జన్మభూమే.
కానీ నా దేశం ఎప్పటికీ కాదు
అక్కడికి వెళ్లాలంటే రెండు ప్రభుత్వాలవీ
అనేక కార్యాలయాల చుట్టూ నేను ప్రదక్షిణలు చేయాలి
నా కలలకు రుజువులు చూపించడానికి
ఈ ముఖానికో ముద్ర వేయించుకోవాలి’
అన్నారు ప్రముఖ కవి గుల్జార్. విభజనతో వదులుకున్నది ఉమ్మడి వారసత్వమే. మతంతో ప్రమేయం లేకుండా ఎందరో నమ్మిన సత్యమిదే. వారిలో గుల్జార్ ఒకరు. ఆ చింతన ఫలితమే ఈ కవిత. దేశ విభజన చేసిన గాయం పెట్టే సలుపును, బాధను, భయాన్ని జ్ఞాపకాల నుంచి తొలగించుకోవడం కోసం ఆ నేపథ్యంతో రచనలు చేసినవాడు గుల్జార్. సంపూరణ్ సింగ్ కాల్రా కలం పేరే గుల్జార్. ఆయన కవి, కథకుడు, చలనచిత్ర గేయ రచయిత, దర్శకుడు. విభజన విషాదం, చరిత్ర పంజాబీలదో, బెంగాలీలదో అనుకోవడం వల్ల సానుభూతినీ, సంఫీుభావాన్నీ ప్రకటించే బాధ్యతను మిగిలిన దేశం విస్మరించింది.
భారత్`పాక్ విభజన కుటిల రాజకీయాల ఫలితం. ఒక కృతక దేశ నిర్మాణం కూడా. ఆనాటి చాలామంది సాహిత్యవేత్తలు ఆ కృతక సరిహద్దుల ఏర్పాటును సహించలేకపోయారు.
‘కళ్లకు వీసాలతో పనిలేదు/ స్వప్నాలు సరిహద్దులెరుగవు
నేను మూసిన కళ్లతో నిత్యం/ సరిహద్దులు దాటతాను
మెహిదీ హసన్‌ను కలుసుకోవడానికి!’
ఆ కవితలో గుల్జార్ ప్రస్తావించిన మెహిదీ హసన్ రాజస్థాన్ వాసి. గొప్ప గజల్ గాయకుడు. ఆయన 1947లో పాకిస్తాన్ వలస వెళ్లిపోయారు. పాకిస్తాన్ నుంచి గుల్జార్ భారత్‌కు వలస వచ్చారు. ఇదొక వైచిత్రి. తరువాత తాను భారత్‌కు వెళతానంటే పాకిస్తాన్ వీసా నిరాకరించిందని హసన్ వాపోయారు. పైగా ఒకనాడు కరాచీ నగరాన్నీ, బొంబాయి నగరాన్నీ అక్కాచెల్లెళ్ల వంటివని పిలిచేవారు. ఎందుకంటే రెండూ సాగరతీరాలే. ఎన్నో పోలికలు వాటి మధ్య. విభజనలో నాయకులు మరచిపోయిన ఉమ్మడి వారసత్వం గురించి ఎందరో వ్యథ చెందేవారు. ఒక కవితలో గుల్జార్ ఆ వ్యథనే ఎంతో గొప్పగా చిత్రించారు. ‘మీ నగరంలో పడి ఉన్న శవాల మీద గద్దలు ఎగురుతున్నాయి, ఇక్కడ మా నగరంలోని కూడళ్లలోనూ (అంటే ముంబై) అదే దృశ్యం’ అన్నారాయన.
భారత్`పాకిస్తాన్ విభజన కేవల భౌగోళిక విభజన కాదు. ఒక నాగరికత నిలువుకోత. ‘రావి నదికి ఆవల’ (‘రావి పార్’) కథలో గుల్జార్ ఇదే చెప్పారు.
దర్శన్‌సింగ్, అతడి భార్య శాహిని, వారి నవజాత కవలల కథ ఇది. స్వాతంత్య్రం వచ్చిందని తెలుసు కానీ, అది వీరి లాయల్‌పూర్‌కు ఎప్పుడు వస్తుందో తెలియదంటారు రచయిత. దర్శన్‌సింగ్ తండ్రి చనిపోయాడు. గ్రామంలో మత కల్లోలాలు పెచ్చరిల్లడంతోనే హిందు వులు, సిక్కులు అంతా గురుద్వారాలో తలదాచు కున్నారు. అక్కడే శాహిని కవలలకు జన్మనిచ్చింది. ఒక బిడ్డ బలహీనంగా ఉంది. బతికే ఆశ కూడా లేదు. ‘కాందిశీకుల కోసం ప్రత్యేక రైలు’ భారత్‌కు వెళుతుంటే అందులో ఎక్కాలని దర్శన్‌సింగ్ నిశ్చయించుకున్నాడు.
ఐదురోజుల క్రితం ఇక్కడ నుంచే వెళ్లిన రైలులో ఆవగింజకు కూడా చోటు లేదట. ఇప్పుడూ అంతే. బాలింత శాహిని చూసి కొందరు దయాళువులు చోటిచ్చారు, రైలు కప్పు మీద. కవలలలో ఒక శిశువు అడపాదడపా ఏడ్చినా రెండో శిశువులో చలనం ఉండదు. రైలెక్కిన కొన్ని క్షణాలకే దర్శన్‌కి అర్ధమైంది, ఆ శిశువు చనిపోయింది. చుట్టూ ఉన్నవారు ఆ విగతజీవిని లాక్కుని అక్కడే పడేయాలని అనుకున్నా, తల్లిప్రాణం ఒప్పుకోదు. అన్న లేకుండా ఆ రెండోవాడు పాలు తాగడంటుంది. ఎట్టకేలకు రైలు ఖైరాబాద్ చేరింది. ఆపై గంటలోనే హిందు స్తాన్‌లో సురక్షితంగా ప్రవేశిస్తాం అనుకుంటూ ప్రాణాల మీద ఆశ పెంచుకుంటారు. రైలు ఒక వంతెన మీదకు చేరుకుంది. నిశిరాత్రి ఎవరో అరిచారు ‘రావి నది’ అని. ఎవరో సలహా ఇచ్చారు దర్శన్‌సింగ్‌కి. మృతశిశువును నదిలో వదిలేస్తే పుణ్యలోకాలు దక్కుతాయి కదా అని. దర్శన్ భార్య చేతిలో నుంచి పొత్తిళ్లలోని ఆ శిశువును తన చేతులలోకి తీసుకుని నదిలోకి విసిరేశాడు. ఆ నీళ్లలో ఓ పసి ఆక్రందన. రైలు కప్పు మీద శాహిని మృత శిశువును గుండెలకు హత్తుకుని రోదిస్తున్నది. రైలు వంతెన దాటుతున్నందుకు జనం కొడుతున్న కేరింతలలో నదిలో పసి ఆక్రందన, ఇక్కడ తల్లి ఆక్రందన కూడా వినిపించలేదు.
దేశ విభజన విషాదం జాడ కాలం మీద సుదీర్ఘమైనది. గుల్జార్ రచనలలోనూ ఆ నీడ, జాడ గమనిస్తాం. అవన్నీ ‘ఫుట్‌ప్రింట్స్ ఆన్ జీరో లైన్: రైటింగ్ ఆన్ ది పార్టిషన్’ పేరుతో సంకలనంగా వెలువరించారు. విభజన గాథ మిగిల్చిన ఆ విషాదానికి ప్రత్యక్ష సాక్షులు లేదా బాధితులు ఆ జ్ఞాపకాలని తుడిచివేయాలని అనుకున్నా సాధ్యం కాలేదు. ఈ గుంజాటనకి అక్షరరూపమే ‘విభజన’ కథ. సంపూరణ్‌సింగ్ అంటే మరెవరో కాదు, విభజన సమయంలో విడిపోయిన తమ కుమారుడేనని హర్భజన్‌సింగ్ అనే ఆయన, ఆయన భార్య గట్టి నమ్మకం. గుల్జార్‌కు ఆ మేరకు ఉత్తరాలు రాశారు. ఆ దంపతులను గుల్జార్ కలుసుకున్నారు. నీవు విభజన కాలంలో తప్పిపోయిన మా అబ్బాయి ఇక్బాల్‌సింగ్‌వేననీ, పేరు మార్చుకున్నావనీ వాదిస్తారు వారు. ఆఖరికి, నీవు ఎక్కడున్నా ఫరవాలేదు, మతం మారినా పట్టించుకోను. కానీ నీవు నా కొడుకువే అన్న సంగతి మరచిపోవద్దు అని వేడుకుంటుందా తల్లి. చాలా రోజులకి హర్భజన్ మరణించినట్టు సమాచారం వస్తుంది. మనసులో ఏదో మూల రోదన. ఇలా ముగించారీ కథ (అను: సి. మృణాళిని).
విభజన నాటి రక్తపాతాన్నీ, భయాన్నీ నిర్దేశించినది ఒక్కటే! ‘హిందువులు మరింత హిందు వులుగానూ, ముస్లింలు మరింత ముస్లింలగానూ ప్రవర్తించడం’ (‘పొగ’ కథలో వాక్యం). బొంబాయి నేపథ్యంగా సాగిన ‘భయం’ (కావూఫ్) కథలో యాసిన్ అనే ముస్లిం యువకుడు లోక్‌ల్ ట్రైన్‌లో పొందిన అనుభవం, చేసిన దుర్మార్గం ఇతివృత్తం. అతడికి ప్రతి హిందువు ఇద్దరూ ముగ్గురిగా కనిపిస్తారు. ఒక స్టేషన్‌లో ఓ యువకుడు ఎక్కాడు. ఇతడి ముఖానికి మఫ్లర్ ఉంది. ‘అతడు హిందువే’ అని తీర్మానించు కున్నాడు యాసిన్. అతడితో తనకు ప్రాణహాని ఉందని తక్షణమే నిర్ధారించుకున్నాడు. కారణం` ఆ అపరిచితుడు జేబులో పెట్టిన చేయి తీయడం లేదు. అంటే ఆయుధంతో సిద్ధమవుతున్నాడు. కాబట్టి తనని చంపడానికి ముందే తాను అతడిని చంపాలని నిర్ణయించుకున్నాడు యాసిన్. రైలు భయాందర్ వంతెన మీదకు వచ్చింది. అతడు బోగీ గుమ్మం దగ్గర ఆదమరచి ఉండగా యాసిన్ వెళ్లి బలంగా బయటకు నెట్టేశాడు. మరుక్షణం ఒక ఆక్రందన` ‘అల్లా’ అంటూ. దీనికి అనూహ్యమైన ముగింపు ఇచ్చారు గుల్జార్. ‘అది అలా జరగాల్సి ఉంది మరి! ఏం చేస్తాం!’ అంటాడు యాసిన్ భార్యతో.
గుల్జార్ నవల ‘రెండు’. ఇందులో ఇతివృత్తం దేశ విభజన నాటి విషాదమే.
కత్తిరించిన కలలతో కథలు
‘ఇక్కడ హిందూ`ముస్లిం హత్యలు మొదలైతే నేనేం చేస్తానో నాకే తెలియదు!’ అంటాడు జుగ్లు అనే హిందువు. ‘ఏం చేస్తావు?’ అని అడుగుతాడు ముంతాజ్. ఆ ఇద్దరు స్నేహితులు. ‘ఏమో, నిన్నే చంపేయవచ్చు’ అన్నాడు జుగ్లు. ఇతడి మాటలతో బెదిరిన ముంతాజ్ పాకిస్తాన్ వలసపోయాడు. జుగ్లు ఇలాంటి మాట అనడానికి కారణం ఒకటే. లాహోర్‌లో అతడి పినతండ్రిని ముస్లింలు చంపారు. అందుకు ఇక్కడ ఎవరో ఒక ముస్లింను చంపుతానేమో నని అన్నాడు. ఇది ‘ఎ టేల్ ఆఫ్ 1947’ కథలోని సంభాషణ. రచయిత`సాదత్ హసన్ మంటో. విభజన విషాదాన్ని ఉర్దూ రచయిత మంటో అక్షరాలలో చూడడం గొప్ప అనుభవం. ఆ విషాదం లోని నిగూఢత్వాన్ని మంటో అంత బలంగా వ్యక్తీకరించినవారు చాలా తక్కువ అని విమర్శకులు అంటారు. గాఢమైన స్నేహం రాత్రికి రాత్రి ఆగర్భ శత్రుత్వంగా మారింది. ‘ది హోలోకాస్ట్ ఆఫ్ పార్టిషన్: ఏ క్రిటికల్ స్టడీ ఆఫ్ సాదత్ హసన్ మంటోస్ మోటెల్డ్ డాన్’ అన్న పరిశోధన గ్రంథంలో పీవీ లక్ష్మీప్రసాద్ విభజన గురించి మంటో రాసిన యాభయ్ స్కెచ్‌లు, కొన్ని చిన్నకథలు అందించారు. దీనిని ఉర్దూ సాహిత్యంలో ఒక క్లాసిక్‌గా గౌరవిస్తారు. ‘తోబా టేక్‌సింగ్’, ‘కోల్డర్ దాన్ ఐస్’, ‘ది డాగ్ ఆఫ్ తిర్వాల్’ వంటి కథలు ఇందులో ఉన్నాయి. 1947లో వచ్చినది స్వాతంత్య్రమా అని ప్రశ్నించాడాయన. ఎందుకు? స్వతంత్రం ఇంత హింసను వెంట తీసుకు వస్తుందా? ఇంత క్రౌర్యానికి కారణమవుతుందా? ఈ వాతావరణంలో ఎవరు నిజంగా స్వతంత్రుడు? అని కూడా నిలదీస్తారాయన. ఈ ప్రశ్నలన్నీ ‘ది రిటర్న్’ అన్న కథలో వినిపిస్తాయి. స్త్రీల మీద జరిగిన సామూహిక లైంగిక అత్యాచారాలను చాలామంది వలె ఆయన కూడా ఇతివృత్తంగా స్వీకరించారు. కానీ వాటిలో ఆయన మానవత్వం మీద జరిగిన అత్యాచా రానికి స్త్రీమూర్తులను ప్రతీకలుగా తీసుకున్నారు. ఈ ధోరణితో రాసిన కథ ‘ది అసైన్‌మెంట్’. ‘కింగ్‌డమ్స్ ఎండ్ అండ్ అదర్ స్టోరీస్’ (1987) కూడా మంటోను బాగా గుర్తుంచుకునేలా చేసే మరొక కథా సంకలనం. ఇందులోనూ ఎక్కువ కథలు బ్రిటిష్ ఇండియా చివరిదశ, విభజన, మతోన్మాదం గురించి ఉంటాయి.
సుదీర్ఘచరిత్ర, బలమైన సంస్కృతి కలిగిన సమాజంలో వలసవాదపు విషపుగోళ్లు లోతుగా దిగిన ఫలితం ఎలా ఉంటుందో చూడాలంటే భారతీయ సమాజం పరిణామంలో కనిపిస్తుంది. ఏకాత్మత కలిగిన జీవన విధానాన్ని ధ్వంసం చేసిన ఘనత వలసవాదానికి చెందుతుంది. మత విశ్వాసాలు వేరు, తరతరాలుగా జీవించిన గడ్డ మీద ఉండవలసి మమకారం వేరు, అవి రెండూ సంఘర్షించుకునేవి కారాదు అన్న చారిత్రక సత్యాన్ని గుర్తించలేనంతగా సమాజాన్ని దిగజార్చింది బ్రిటిష్ ఇండియా. భారత్`పాక్ విభజన కృతకమైన చర్య అని నమ్మిన వారిలో ఒకడు మంటో. తన ప్రగాఢ విశ్వాసాన్ని వ్యంగ్య వైభవంతో కథగా మలిచాడా యన. అదే ‘టోబా టేక్‌సింగ్’. 1955లో వెలువడిన ఈ కథ (ఉర్దూ)లో దేశ విభజననీ, దానితో ఏర్పడిన మానసిక స్థితినీ, ఉద్వేగాలనూ చిత్రించారు మంటో. విభజన భారత ఉపఖండాన్ని రెండు దేశాలుగానే కాదు, చాలా మంది మనసులను ఎన్నో ముక్కలుగా చీల్చింది.
‘దేశ విభజన జరిగిన రెండేళ్ల తర్వాత పాకిస్తాన్, భారతదేశ పాలకులు మామూలు ఖైదీలను మార్చుకున్నట్టే పిచ్చివాళ్లను కూడా అదలు బదలు చేసుకోవచ్చని అనుకున్నారు. అంటే భారతదేశపు పిచ్చాసుపత్రులలో ఉన్న ముసల్మాను పిచ్చాళ్లను పాకిస్తాన్‌కు పంపించి పాకిస్తాను పిచ్చాసుపత్రుల్లో ఉన్న హిందువు, సిక్కు పిచ్చాళ్లను భారతదేశం తరలించడమన్నమాట’ ఇలా మొదలయింది ఈ కథ. విభజన తరువాత మతాలవారీగా పౌరులను రెండు దేశాలు పంచుకోవడం, ఆ పరిస్థితులు రావడం పట్ల తనకు ఉన్న నిరసననే మంటో ఇందులో వ్యక్తీకరిం చాడు. లాహోర్‌లోని పిచ్చాసుపత్రి వాతావరణాన్ని చిత్రించే క్రమంలో మంటో చాలా తీవ్రమైన రాజకీయాంశాల మీద చెణుకులు విసురుతాడు. ఇది ఒక మతిస్థిమితం లేని వ్యక్తి అడిగిన ప్రశ్న. ‘మౌల్వీగారు! పాకిస్తాన్ అంటే ఏమిటి?’ అవతల నుంచి సమాధానం` ‘హిందు స్తాన్‌లో అది ఒక గొంతుకలను కోసే కత్తులను తయారుచేసే స్థలం.’ ఇంకొక మతిస్థిమితం లేని సిక్కు అడిగాడు, ‘సర్దార్‌జీ! మనల్నెందుకు హిందూస్తాన్‌కు పంపిస్తున్నారు, మనకి వాళ్ల భాష రాదు కదా?’ అందుకు అవతలి సిక్కు, ‘నేను వాళ్ల భాష మాట్లాడగలను. పనికిమాలిన తిరుగుబోతు హిందుస్తానీల భాష’ అంటాడు. వాళ్లకి జిన్నా పేరు తెలుసు, అతడికి ఖాయిద్ ఏ ఆజమ్ అన్న బిరుదు ఉందనీ తెలుసు. కొందరికి సిక్కు నాయకుడు తారాసింగ్ పేరు తెలుసు. కానీ మిగిలిన స్వాతంత్య్రో ద్యమ విశేషాలు ఏమీ తెలియవు. పాకిస్తాన్ ఎక్కడ ఉందంటే వాళ్లు చెప్పలేరు. హిందుస్తాన్‌లో పాకిస్తాన్ ఎందుకు ఉంటుంది అంటారు. అక్కడే పదిహేనేళ్లుగా ఒక సిక్కు ఉన్నాడు. ఇన్నేళ్లూ అతను మేను కూడా వాల్చలేదని చెబుతారు. కాళ్లు వాచి ఉంటాయి. ఎప్పుడైనా గోడకు అనుకుని చిన్న కునుకు తీస్తాడు. దాన్ని పంజాబీలో టేక్ అంటారు. విభజన మీద అభిప్రాయం అడిగితే, ‘అగడం బగడంలోంచి అనాలోచిత పెసరపప్పు లాంతర.. పాకిస్తాన్ గవర్న మెంట్’ అనేవాడు. ఆఖరికి పాక్ గవర్నమెంట్‌కు తోబా టేక్‌సింగ్ గవర్నమెంట్ అన్న మాటలు పర్యాయపదాలై పోయాయి అక్కడ. ఇతని అసలు పేరు బిషన్‌సింగ్. పేరే కాదు, అతడి వివరాలూ ఎవరికీ తెలియవు. అలాంటి సమయంలో అతని ముస్లిం మిత్రుడు వచ్చి నీ కూతురు భారత్ వెళ్లిపోయిందనీ, అక్కడే క్షేమంగా ఉందనీ చెబుతాడు. చివరికి పిచ్చివాళ్లను బదలా యించుకునే ఆ రోజు వచ్చింది. అందరినీ వాఘా సరిహద్దుకు తెచ్చారు. తాను ఎట్టి పరిస్థితులలోను ఇటు పాకిస్తాన్, అటు భారత్‌కు కూడా వెళ్లనని మారాం చేస్తాడు టేక్‌సింగ్. పోలీసులు తోబా టేక్‌సింగ్‌ను పట్టుకుని సరిహద్దులకు ఈడ్చుకుని వస్తుండగా, అటు పాకిస్తాన్‌కు, భారత్‌కు చెందని ఖాళీ ప్రదేశంలో అటు కొంత, ఇటు కొంత దేహం వచ్చేలా కింద పడిపోతాడు టేక్‌సింగ్. ఇంతకీ టేక్‌సింగ్ అంటే అదే`ఎవరికీ చెందని స్థలం. సిక్కులు, హిందువులు కూడా పాకిస్తాన్‌లోని తమ స్వస్థలాలను వదులుకుని వచ్చినందుకు తీవ్రంగా కలత చెందారు. అమృత్‌సర్ పాకిస్తాన్‌కు చెందకుండా భారత్‌లో అంతర్భాగమైనందుకు తీవ్రంగా దుఃఖించిన ఒక హిందూ న్యాయవాది కూడా ఉన్నాడు. అయితే తను సృష్టించిన పాత్రకు దక్కిన అదృష్టం మంటోకి దక్కలేదు. బొంబాయి సినీరంగం నుంచి పాకిస్తాన్ వెళ్లిన మంటో భగ్నహృదయంతో అక్కడే కన్నుమూశాడు.
విభజన జ్వాలల్లో ‘ఆమె’ దేహం
దేశ విభజన ఘటనల విశ్లేషణలో మహిళావాద గళం అమృతా ప్రీతమ్. ఆ దృష్టితోనే రాసిన నవల పింజర్. దేశ విభజన మానవతకు చేసిన అపార ద్రోహం గురించి చెప్పే ప్రముఖ కవిత` ‘అజ్జ్ అఖాన్ వారిస్ షా ను’ (ఈరోజు నేను వారిస్ షాను అడుగుతున్నాను). సజీవంగా ఉన్నవారు ఎవరికైనా ఆనాటి అత్యాచారాలను అక్షరబద్ధం కూడా చేయలేరు అంటారామె. కాబట్టే 250 ఏళ్ల క్రితం అజరామర విషాదాంత ప్రేమకావ్యం ‘హీర్`రాంరీa’ రాసిన సూఫీ కవి సయ్యద్ వారిస్ షాను సమాధి లేచి వచ్చి ఆ కావ్యానికి కొత్త పుటను చేర్చవలసిందని ఆమె అభ్యర్థించారు. హీర్ అనే పంజాబీ ఆడపడుచు కన్నీటి గాథను వివరించిన కవివి కాబట్టి, ఇవాళ విలపిస్తున్న మిలియన్‌ల పంజాబీ కూతుళ్లు నీవిచ్చే సాంత్వన కోసం చూస్తున్నారు అంటారు ప్రీతమ్. విభజన విషాదం తీవ్రతను ఆవిష్కరించేందుకు ఆమె పాఠ కులను నిశ్చేష్టులను చేసే ఉపమానాలు వాడారు. చీనాబ్ నది నెత్తుటి మయమై, నాటి హింసలో చనిపోయినవారి శవాలతో నిండి ఉందంటారామె. ప్రధానంగా స్త్రీకి పట్టిన దుర్గత పట్ల ఆమె విలపించారు. పంజాబ్ శ్మశానాలలో రక్తం ఊరుతున్నదని అన్నారామె. ‘ది రివెన్యూ స్టాంప్’ పేరుతో ప్రీతమ్ తన జ్ఞాపకాలను అక్షరబద్ధం చేశారు. లాహోర్‌లోని ఇంట్లో తన ఇద్దరు పిల్లలతో ఒక దీర్ఘరాత్రి గడిపి, కట్టుబట్ట లతో, ఒంటి మీద ఒక శాలువతో ఎలా భారత్‌కు వచ్చినది ఆమె నమోదు చేశారు. మొదట డెహ్రాడూన్‌లో ఉన్న వారి కుటుంబం తరువాత ఢల్లీి వచ్చింది. అలా రైలులో వచ్చినప్పుడు ఎముకలు కొరికే ఆ చలి నిండా శోకం వినిపించిదని, తను తెచ్చిన ఒక్క శాలువనే రెండు ముక్కలు చేసి పిల్లలకు కప్పానని ఆమె చెప్పారు. ఇలాంటి విషాదమే ప్రతి శరణార్థి ఎదుర్కొన్నది.
అమృతా ప్రీతమ్ విశిష్ట రచన పింజర్ (అస్థి పంజరం). ఆమె 30వ ఏట, 1950లో రాశారు. భారతీయ సాహిత్యంలో వెలువడిన అపురూప రచనగా దీనికి గౌరవం ఉంది. 2009లో కుష్వంత్ సింగ్ ఆంగ్లంలోకి అనువదించారు. 1947 విభజన సమయానికి భారతీయ సమాజం రూపురేఖలను ఆమె నవలలో వివరించారు. నిజానికి స్వీయానుభ వాలనే రచయిత్రి పొందు పరిచారని అనాలి.
పింజర్ పంజాబీ భాషాపదం. అర్థం అస్థిపంజరం. రక్తమాంసాలు, జీవం పోయిన పరిస్థితిని సంకేతిస్తూ రచయిత్రి స్త్రీలు అస్థిపంజరాల వలె మిగిలారని చెప్పదలిచారు. పూరో అనే హిందూ బాలిక చుట్టూ ఇతివృత్తం నడుస్తుంది. అమృత్‌సర్‌లో నివాసం ఉంటున్న ఆ కుటుంబంలో పూరో, గర్భవతి అయిన ఆమె తల్లి, తండ్రి, సోదరుడు త్రిలోక్, చెల్లెలు రజ్జో ఉంటారు. పూరోకు సంబంధాలు చూడడానికి చట్టోవాని అనే గ్రామం వెళుతుంది ఆ కుటుంబం. రత్తోవాల్‌లో ఉండే రాంచంద్‌తో పూరో వివాహం నిశ్చయమవుతుంది. అదే సమయంలో సంప్రదాయం ప్రకారం పూరో సోదరునికి రాంచంద్ చెల్లెలిని ఇచ్చి వివాహం చేయడానికి కూడా నిర్ణయించుకుంటారు. రాంచంద్‌తో తన వివాహం గురించి కలలు కంటున్న పూరోను అదే ప్రాంతానికి చెందిన రషీద్ అపహరించాడు. పూరోను రషీద్ రహస్యంగా ప్రేమిస్తున్నప్పటికీ, అపహరించడానికి ఒక కారణం చెబుతారు. కొన్ని తరాలకు పూర్వం పూరో కుటుంబం నుంచి రషీద్ పూర్వికులు అప్పు తీసుకున్నారు. అది కట్టకపోవడంతో వారి ఆస్తులను తీసుకోవడమే కాకుండా, ఒక స్త్రీని పూరో పూర్వికుడు అపహరించాడు. అందుకు విభజన ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రతీకారం తీసుకున్నాడు రషీద్. ఈ పని చేయడానికి రషీద్ కుటుంబ పెద్దలు ఖురాన్ మీద ప్రమాణం చేయించారు. అయితే పూరో రషీద్ ఇంటి నుంచి తప్పించుకుని తన ఇంటికి వస్తుంది. పూరో తల్లిదండ్రులు ఆమెను నిరాకరించడమే కాకుండా, మళ్లీ రషీద్ ఇంటికే వెళ్లమని, లేదంటే తమ మీద ముస్లింలు దాడి చేసి చంపుతారని కూడా చెబుతారు. దీనితో పూరో వెనక్కి వెళ్లిపోతుంది. పూరో పేరును హమీదా అని మార్చి, ఇద్దరిని సక్కర్ అనే ఊరు పంపేస్తారు. ఆమె గర్భవతి అయినా అది నిలవదు. కారణం జరిగిన పరిణామాలు ఆమె మానసికి స్థితి మీద తెచ్చిన ఒత్తిడి. తరువాత మతి స్థిమితం లేని ఒక స్త్రీ లైంగిక అత్యాచారంతో కన్న బిడ్డను హమీదా పెంచుతుంది. ఈ రెండు స్త్రీ పాత్రలను బట్టి ఒకటి అర్ధమవుతుంది. అవతలి మతం వారి నైతిక స్థయిర్యం దెబ్బ తీయడానికైనా, తమ పశువాంఛను తీర్చుకోవాలన్నా కూడా స్త్రీ దేహమే కావాలి. అందుకే ఆమె దేహం అస్థిపంజరంలా మారిందంటారు రచయిత్రి.
దేశ విభజన ప్రకటన వెలువడిరది. అటు రత్తోవాల్‌లోను, ఇటు సక్కర్‌లోను కూడా ముస్లింలు హిందువుల ఇళ్లను ధ్వంసం చేశారు. రజ్జో తన సోదరుడితో కలసి అమృత్‌సర్ వెళుతుంది. లాజో, రాంచంద్ ఘర్షణలలో చిక్కుకున్నారు. భారత్‌కు వెళుతుంటే లాజోను ముస్లింలు అపహరించారు. రాంచంద్ పూరోను కలుసుకుని తన సోదరి లాజో ఆచూకీ తెలియచేయమని కోరతాడు. రత్తోవాల్‌లో సేల్స్‌గర్ల్ వేషంలో తిరిగిన పూరోకు లాజో అచూకి దొరికింది. రషీద్ సహకారంతోనే ఆమెను పూరోయే రక్షిస్తుంది. రాంచంద్‌ను వివాహం చేసుకోవలసిందని అతడి తండ్రి పూరోను కోరినా నిరాకరించి రషీద్‌తోనే కాపురం చేయడానికి మొగ్గు చూపుతుంది.
విభజన
అప్పగించిన బాధ్యత కోసం వచ్చినప్పుడయినా
అతడు పక్షపాతబుద్ధి లేనివాడే!
మతావేశంతో పెచ్చరిల్లిన రెండు వర్గాల ప్రజల మధ్య, సరిపడని దైవాలూ,
వేర్వేరు ఆహారపు అలవాట్లూ ఉన్న వారికి విభజించి ఇవ్వడానికి
ఏనాడూ ఈ నేలను చూడని అతడిని రప్పించారు
పునరాలోచనలకీ,హేతుబద్ధ చర్చలకీ సమయం లేదనీ, ఇప్పటికే ఆలస్యమైందనీ
లండన్‌లోనే అతడికి పాఠం చెప్పి పంపారు.
ఇప్పుడు ఉన్న పరిష్కారం విభజన ఒక్కటే
తాను రాసిన లేఖ మేరకే నీ పని చూడాలని వైస్రాయ్ అనుకుంటాడు
అతడితో సాంగత్యం గురించి నువ్వు తక్కువగా ఆశించడమే మంచిది
అందుకే నీకు వేరొక బస కోసం ఏర్పాటు చేశాం
సంప్రతించడానికి నీకు నలుగురిని`
ఇద్దరు ముస్లింలు, ఇద్దరు హిందువులు` న్యాయమూర్తులుగా ఇవ్వగలం
తుది నిర్ణయం మాత్రం నీదే అయి ఉండాలి
హంతకులను పూదోటలకు దూరంగా ఉంచేందుకు
రేయింబవళ్లు పోలీసు పహారా ఉండే భవంతిలో నోరెత్తవద్దు
లక్షలాది ప్రజల నుదిటిరాతను నిర్ధారించే ఆ బాధ్యతను
పూర్తిచేయడానికి అతడి మీద పని భారం మోపారు
కానీ…అతడికి ఇచ్చిన దేశపటాలు కాలం చెల్లినవి
జనాభా లెక్కలు నిర్ద్వంద్వంగా తప్పుడువే
వాటిని తనిఖీ చేసుకునే సమయం కూడా వారికి లేకపోయే!
ఘర్షణలు జరుగుతున్న ప్రదేశాలు చూడడానికీ సమయం లేదాయే!
భగభగలాడే వేడి వాతావరణం
దీనికి తోడు విరేచనాల బాధ అతడిని నిలవనీయడం లేదు
అయినా అతడు ఏడు వారాలలో చేసేశాడు, సరిహద్దులు తేలిపోయాయి
మంచికో చెడుకో ఒక ఖండం చీలిపోయింది
తరువాతి రోజే అతడు ఇంగ్లండ్ ఓడెక్కాడు
ఒక కేసు విషయంలో మంచి న్యాయవాది పాటించినట్టు
అన్నీ తక్షణం మరచిపోయే చోటు అదే అతడికి
అతడు మళ్లీ రానేరాడు.
కానీ అతడు క్లబ్‌లో తన భయమేమిటో చెప్పాడు
తనను ఎవరైనా చంపేస్తారని!
ఇదీ ఆ ‘రేఖ’ రమస్యం
భారత స్వాతంత్య్రోద్యమం గురించి మనం రాసుకున్న చరిత్ర పుస్తకాలలో దుర్భిణి వేసి చూస్తే తప్ప కనిపించని పేరు సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్. భారత్`పాకిస్తాన్ విభజన పథకానికి ఓ తొమ్మిది మంది తలాడిస్త్తే, హింసతో రగిలిపోతున్న ఇరు దేశాల మధ్య విభజన రేఖను గీసే పనిని తానొక్కడే ఐదువారాలలో ఆదరాబాదరా చేసేసి ఇంగ్లండ్ ఉడాయించిన ఘనుడు. అది విభజన రేఖ కాదు. రెండు దేశాల మధ్య ఏడున్నర దశాబ్దాల తరువాత కూడా తడి ఆరని రక్తరేఖగానే మిగిలి పోయింది. ఇతడి చేయించిన ఆ మహాద్రోహాన్ని, దాని నేపథ్యాన్ని కవిత రూపంలో ఆవిష్కరించాడు, అమెరికా కవి డబ్ల్యు హెచ్ ఎడెన్.
బ్రిటిష్ బారిస్టర్ సిరిల్ రాడ్‌క్లిఫ్ జూలై 8,1947న భారతదేశానికి వచ్చాడు. అతడు భారత్‌ను చూడడం అదే మొదటిసారి. పని` భారత్, పాకిస్తాన్‌ల మధ్య విభజన రేఖ గీయడం. ఆ క్లిష్టమైన పని పూర్తి చేయడానికి అతడికి మిగిలిన సమయం కేవలం ఐదువారాలు. పంజాబ్, బెంగాల్ ప్రాంతాల విభజన కోసం రెండు సంఘాలను నియమించారు. అవి అతడి కిందనే పనిచేశాయి. ఈ సంఘాలలో ఇద్దరేసి ముస్లింలు, ఇద్దరేసి ముస్లిమేతరులు ఉన్నారు. ఇంతకీ సిరిల్ తన విభజన నివేదికను ఆగస్ట్ 17, 1947న అందించాడు. ఈ తాత్సారమే లక్షల మందిని బలిగొన్నది. ఇంకొన్ని లక్షల మందిని నిరాశ్రయులను చేసింది. అంతిమంగా అతడు చేసిన దానికి అతడికే సిగ్గనిపించి ఉండాలి. అతడి కాగితాలను అతడే తగలబెట్టాడు. విభజన రేఖ పనికి ప్రభుత్వం ఇవ్వదలచిన రూ.40,000 నిరాకరిం చాడు. మళ్లీ భారత్‌లో అడుగు పెట్టలేదు.
సరిహద్దు రేఖను గీసే పనిలో ఉండగా అతడి మీద అన్ని వర్గాల నుంచి గట్టి ఒత్తిడే ఉంది. మరొక పక్క దారుణమైన మత ఘర్షణలు, ఉద్రిక్తత. ఇచ్చిన దేశ పటాలు కాలదోషం పట్టినవి. అందించిన జనాభా లెక్కలు కూడా పాతవే. దీనికి తోడు ఆఖరి వైస్రాయ్ మౌంట్‌బాటన్ వేధింపులు. ఒకటే ప్రశ్న! సిరిల్ అంత నిర్దయగా ఎందుకు వ్యవహరించాడు? అది పక్షపాతమా? భారత్ గురించి అతడికి ఎలాంటి పరిజ్ఞానం లేదా? కాకుంటే ఈ దేశం, ఇక్కడి పరిస్థి తులు గురించి అతడికి చెప్పలేదా? ఈ ప్రశ్నలతోనే ఎడెన్ ఈ కవిత రాశాడు. 1966లో రాసిన ఈ కవితను, 1969లో ఆయన వెలువరించిన సంకలనంలో చేర్చారు.
‘పార్టిషన్’ కవిత తొలి పంక్తి రాడ్‌క్లిఫ్ భారత్‌కు వచ్చేనాటికి పక్షపాత రహితంగానే ఉన్నాడు అని. అదెలా అంటే, భారత్ గురించి అతడి బుర్రలో కనీస కల్పన కూడా లేదు. అతడికి భారత్ సంస్కృతీ సంప్రదాయాలు, అప్పటికి స్వైర విహారం చేస్తున్న మత ఉద్రిక్తతలు కాస్త కూడా తెలియవు. జీవితంలో ఏనాడూ భారత్‌ను చూసి ఎరుగని రాడ్‌క్లిఫ్‌ను దేశ విభజనకు పిలిచారు. ఆహార విహారాలు, దైవారాధన వేర్వేరుగా ఉన్న, మతోద్రిక్తతతో ఉన్న రెండు వర్గాల మధ్య విభజన ఇది అనుకున్నాడాయన. పరస్పరం చర్చించుకోవడానికి సమయం లేదు, హేతుబద్ధమైన చర్చలకీ తావు లేదని అతడిని ఇంగ్లండ్ నుంచి పంపిస్తూ చెప్పిన మాటలు. అంటే విభజన గురించి అప్పటికే నిర్ణయం తీసేసుకున్నారు. నీవు పూర్తి చేయవలసినది అందుకు సంబంధించిన లాంఛనాలు మాత్రమేనని కూడా చెప్పారు. రెండు వర్గాలు కూడా సయోధ్యకు రాలేవు. పరిష్కారం విభజన మీద ఆధారపడి ఉంది. ఆ ప్రకారమే ఈ ఇంగ్లండ్ మేధావి కూడా విభజనను ఆపడానికి ఎలాంటి అవకాశాలు లేవనే స్థిర నిశ్చయానికి వచ్చాడు. రాడ్‌క్లిఫ్‌కు మౌంట్ బాటన్ రాసిన ఉత్తరం గురించి ఇందులో కవి ప్రస్తావించాడు. దొరికిన సాక్ష్యాధారాలను బట్టి విభజన వంటి చరిత్రాత్మక బాధ్యతను అప్పగించి నప్పటికి రాడ్‌క్లిఫ్‌ను కలుసుకోవడానికి మౌంట్ బాటన్ ఇష్టపడలేదు. రాడ్‌క్లిఫ్‌కు సహకరించడానికి రెండు సంఘాలను ఏర్పాటు చేశారు. అందులో ఇద్దరి వంతున హిందువులు, ముస్లింలు సభ్యులు. అయితే తుది నిర్ణయం మాత్రం రాడ్‌క్లిఫ్ చేతిలోనే ఉంటుంది.
కవిత చివరలో చెప్పిన అంశాలు ఇవి: రాడ్‌క్లిఫ్‌ను పెద్ద భవంతిలో ఏకాంతంగా ఉంచారు. బయట పోలీస్ పహారా. అటు వర్గం లేదా ఇటు వర్గం నుంచి ఛాందస మతవాదులు రాడ్‌క్లిఫ్‌ను చంపుతారని పోలీసులు భయం. విభజన రేఖను గీసిన తీరును కూడా ఎడెన్ విమర్శించాడు. భారత్ వేడి వాతావరణంతో అతడు విరేచనాల బారిన పడి పాయఖానాలోనే ఎక్కువ గడిపాడు. రాడ్‌క్లిఫ్‌కు ఇచ్చిన దేశపటాలు కాలం చెల్లినవి. జనాభా లెక్కలూ తప్పుల తడకలే. వీటిని తనిఖీ చేసుకునే సమయం కూడా అతడికి లేకపోయిందన్నదే ఎడెన్ నిరసన. కాబట్టి రాడ్‌క్లిఫ్ తప్పుడు మ్యాప్‌లు, జనాభా లెక్కలతో మిలియన్‌ల ప్రజల తలరాతను నిర్దేశించాడు. చివరి పంక్తులలో రాడ్‌క్లిఫ్‌ను ఇంకాస్త గట్టిగా విమర్శించాడు ఎడెన్. రాడ్‌క్లిఫ్ వెంటనే స్వదేశం వెళ్లిపోయి, వృత్తి నైపుణ్యం మెండుగా ఉన్న న్యాయవాదిలాగే ఈ కేసును కూడా మరచిపోయాడు. తన రోజువారీ జీవితంలో పడిపోయాడు.ఇక తానెప్పుడూ భారత్‌లో అడుగు పెట్టనని క్లబ్ మిత్రులతో చెప్పాడు. క్లబ్‌లోనే చెప్పినదానిని బట్టి తనను ఎవరైనా కాల్చే ప్రమాదం ఉందని చెప్పాడు. చాలా సరళమైన భాషలో భారత్, పాక్ విభజనలోని అసంబద్ధతని ఎడెన్ కవిత రూపంలో ఆవిష్కరించాడు. ఇవన్నీ గమనించిన తరువాత రావలసిన ప్రశ్న`విభజన నేపథ్యాన్ని మనం సరిగానే అధ్యయనం చేశామా?
‘డ్రాయింగ్ ది లైన్’
సిరిల్ రాడ్‌క్లిఫ్ కేంద్ర బిందువుగా ఉండే విభజన రేఖ ఘట్టం ఆధారంగా ‘డ్రాయింగ్ ది లైన్’ పేరుతో బ్రిటిష్ రచయిత హోవార్డ్ బెంటన్ నాటకం రాశారు. హోవార్డ్ డేవిస్ దర్శకత్వం వహించారు. లండన్‌లోని హ్యాంప్‌స్టీడ్ థియేటర్‌లో రెండుసార్లు (డిసెంబర్ 3,2013Ñ జనవరి 11,2014) ప్రదర్శించారు.మొదట ఈ నాటకాన్ని ప్రదర్శించినప్పుడు అన్ని టిక్కెట్లు అమ్ముడు పోయాయి. తరువాత 80 దేశాల వాళ్లు ‘ది గార్డియన్’ వెబ్ సిరీస్ ద్వారా చూశారు. రాడ్‌క్లిఫ్, పంజాబ్ సరిహద్దు కమిషన్ నేపథ్యంతో ఈ నాటకం రచించారు. ఆ రేఖకే రాడ్‌క్లిఫ్ పేరు పెట్టారు. రాడ్‌క్లిఫ్ నిరాశతోనే స్వదేశానికి తిరిగి వెళ్లాడని నాటకం చెబుతుంది. భారత్ అంటే ఏమిటో తెలియక, గణాంకాలు తెలియక ఏ పనీ చేయలేక నిరాశవహుడయ్యాడు అంటుందీ రచన. నాటకం గురించి రచయిత బెంటన్ కొన్ని విషయాలు చెప్పాడు. అంటే రాడ్‌క్లిఫ్ గురించే. భారత్‌లో ఇచ్చిన బంగ్లాలో అతడు మనశ్శాంతి లేకుండా గడిపిన సంగతి, విభజన పనిలో సహాయం అందించే పేరుతో సేకరించిన కాగితాలను ఇంగ్లండ్‌కు తీసుకువెళ్లి కాల్చేయడం, డబ్బు నిరాకరించడం గురించి చెప్పాడు రచయిత. రాడ్‌క్లిఫ్ పాత్రలో టామ్ బియర్డ్ నటించాడు. ఇంకా పాల్ బెజ్లే (జిన్నా), తన్వీర్ ఘని (గాంధీ), సిలాస్ కార్సన్ (నెహ్రూ), ఆండ్రూ హావిల్ (మౌంట్‌బాటన్), లూసీ బ్లాక్ (ఎడ్వినా మౌంట్‌బాటన్), జాన్ మెకే (అట్లి) ప్రధాన పాత్రలలో నటించారు. ఈ ఇతివృత్తంలో నాటకీయతకు ఎక్కువ అవకాశం ఇచ్చే ఘట్టాలు ఉన్నాయంటారు విమర్శకులు. వైస్రాయ్ మౌంట్‌బాటన్‌కు విభజన రేఖ గీయడానికి వచ్చిన రాడ్‌క్లిఫ్‌తో మాటామంతీ ఇష్టం ఉండదు. రాడ్‌క్లిఫ్ ఎవరినైతే పలకరించాలని అనుకున్నాడో, ఆ గాంధీజీకి విభజన అంటే ఇష్టం లేదు. ఇతివృత్తం భారత చరిత్రలోనిదే అయినా, అంతర్జాతీయ వీక్షకుల కోసం దర్శకుడు ఒక అంశాన్ని జోడిరచానని చెప్పుకున్నాడు. అదే` ఎడ్వినా మౌంట్‌బాటన్, నెహ్రూల ముద్దూముచ్చట.
‘పెషావర్ ఎక్స్‌ప్రెస్’ చూపిన నెత్తుటి బాట
కిషన్‌చందర్ రాసిన ‘పెషావర్ ఎక్స్‌ప్రెస్’ కథకు పెద్ద ప్రాచుర్యం లభించలేదు. నిజానికి సాహిత్యంలో ఇదొక ప్రయోగం. శరణార్థులను చేర్చిన రైలింజనే ఆ నాటి దీనగాథలను వ్యాఖ్యానించడం ఇందులో ప్రత్యేకత. కథలోని ఈ శైలే ఆ ప్రత్యేకతను తెచ్చి పెట్టింది. మనిషి చేసిన విధ్వంసం, మత కల్లోలాల నేపథ్యంలో మనిషిలో పోటెత్తిన మతావేశం, పాశవికత పాఠకులను నివ్వెరపరుస్తాయి. పాకిస్తాన్‌లోని పెషావర్ నుంచి వందలాది మంది శరణార్థులతో భారత్‌కు బయలుదేరిన ఎక్స్‌ప్రెస్ రైలు అది. ప్రతి బోగీ బలూచ్ గార్డుల పహారాలో ఉంచారు. ఇన్నాళ్లూ తమ మాతృభూమిగా భావించిన నేలకు అంతిమ వీడ్కోలు చెప్పవలసి రావడం ప్రయాణికులందరికీ దుర్లభమైపోయిందని చెబుతుంది రైలింజన్. ఆపై పెషావర్ నుంచి తక్షశిల మీదుగా బొంబాయి చేరిన క్రమంలో వరసగా వజీరాబాద్, లాహోర్, అమృత్‌సర్, జల్లుండు, అంబాలా వంటి పట్టణాలలో శరణార్థులు పడిన నరకయాతన, జరిగిన సామూహిక హత్యలు, లైంగిక అత్యాచారాలు, అపహరణోదంతాలు గురించి రైలింజన్ చెబుతుంది. అంటే ఆ సమయంలో హింసతో అట్టుడికినట్టు ఉడికిన భారత భూగాన్ని ఒక క్రమంలో కిషన్‌చందర్ మనకు వివరించారు. అవన్నీ మనసును కలచివేస్తాయి. రైలును ఎక్కడ బడితే అక్కడ ఆపి ఉన్మాదులు దోచుకునేవారు. అపహరణలకు, హత్యలకు పాల్పడేవారు. చిత్రంగా రక్షణ కోసం ఉన్న బలూచ్ గార్డులే హిందువులను ఆ మూకలకు అప్పగించేవారు. ఆ మూకలు వారిని ఒకరి తరువాత ఒకరిని చంపి పోయేవి. దారంతా శరణార్థులు దారుణమైన, దుర్మార్గమైన, మానవత్వం తలదించేకునేటట్టు చేసే సన్నివేశాలను చూడవలసి వస్తుంది. అందులో` ఒక రైల్వేస్టేషన్‌లో స్త్రీలను వివస్త్రలను చేసి ఊరేగించే సన్నివేశం ఒకటి. చిన్న పిల్లలు, యువతులు, వృద్ధురాండ్ర వరకు అన్ని వయసుల వారిని వివస్త్రలను చేసి ప్రయాణికులు వేచి ఉండే గదిలో నగ్నంగానే కూర్చోబెడతారు. ఒక చిన్న బాలుడు తన తల్లిని ఆ స్థితిలో చూసి అడుగుతాడు, ‘అమ్మా, ఏమిటి ఇలా కూర్చున్నావు’ అని. ఒక సామూహిక రాక్షస మనస్తత్వంతో పురుషులు ఎంత నీచానికి దిగజారిపోయారో చూపుతారు రచయిత. ఇందులో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములే. ఒక బోగీలో కాలేజీ విద్యార్థిని సోషలిజం, థియరీ అండ్ ప్రాక్టీస్ అన్న పుస్తకం చదువుతూ కూర్చున్న సంగతిని కూడా రైలింజన్ విడిచిపెట్టదు. అంతిమంగా రైలు బొంబాయి చేరింది. అక్కడ ఇంజన్‌ను కడుగుతారు. అప్పుడు అది చెప్పుకునే స్వగతం ప్రత్యేకమైనది. ఇక్కడ నన్ను బాగా శుభ్రం చేశారు. అలాంటి భయానక ప్రయాణం మళ్లీ నేను ఎప్పడూ చేయను. బంగరు వన్నె కంకులు ఊగుతూ ఉండే గోధుమపొలాల గుండా వెళ్లాలనీ, అటూ ఇటూ పసుపుపూల ఆవాల మొక్కల దుబ్బులు మధ్య ఉండే పట్టాల మీద నుంచి సాగాలనీ అనుకున్నాను. పొలం పనులు చేసుకుంటూ హిందూ ముస్లిం రైతులు సంప్రదాయక పంజాబీ ప్రేమగీతాలు కలసి పాడుకుంటూ ఉంటే వినాలని కోరుకున్నాను. నేనొక ప్రాణం లేని రైలింజన్‌నే కావచ్చు. అయినా మత విద్వేషం ఒలికించిన రక్తం నింపుకుని ప్రయాణించాలని అనుకోలేదు. నేను క్షామపీడిత ప్రాంతాలకు ఆహార పదార్థాలను మోసుకు వెళ్లేదాన్ని. బొగ్గును రవాణా చేసేదాన్ని. ఇనుపరజను తీసుకుపోయేదాన్ని. నేను సౌభాగ్యవంతులైన రైతులను, సంతోషంగా ఉండే శ్రామికులను గమ్యాలకు చేరుస్తాను. ఆ క్షణంలో వాళ్లలో హిందువులు, ముస్లింలు అంటూ వేర్వేరుగా ఎవరూ ఉండరు.వాళ్లంతా కేవలం శ్రామికలు. లేదా మనుషులు’. అని ముగించారు కథ.
రక్తకాండకు ఆరంభం
ఇస్లామాబాద్, రావల్సిండి సమీపంగా ఉండే గ్రాండ్ ట్రంక్ రోడ్డు బైపాస్ దగ్గర ఉంటుంది తక్షశిల రైల్వే స్టేషన్. అక్కడి ఖాన్‌పూర్ సరస్సు ఆ ప్రాంతాన్ని మరింత శోభాయమానం చేస్తూ ఉంటుంది. తక్ష అనే హిందూ పురాణపురుషుడి పేరు మీద ఈ పట్టణం ఏర్పడిరదంటారు. తక్ష అంటే రాముల వారి సోదరుడు భరతుడి కుమారుడు. ఇదే తక్షశిల కంటోన్మెంట్ జంక్షన్. ఇది బ్రిటిష్ వాళ్ల కాలం నాటిదే. దీనికి ఉన్న అసలైన పేరు, 1947 విభజన నాటి హింసాకాండ ఈ స్టేషన్‌లో మొదలయింది. అది కూడా మొదట హిందువుల మీదే జరిగింది. ఫర్హన్జ్ ఇస్ఫహానీ రచన ప్యూరిఫయింగ్ లాండ్ ఆఫ్ ది ప్యూర్’లో మార్చి 9,1947న ఇక్కడ హత్యాకాండ జరిగిందని రాశాడు. సిక్కులు, హిందువులతో భారత్‌కు వెళుతున్న రైలును ఈ స్టేషన్‌లో ఆపి 22 మంది సిక్కులు, హిందువులను చంపారు. ఈ హత్యాకాండను ప్రారంభించినవాడి పేరు తాహిర్ సైఫ్.
చాలామంది రచయితలు ఈ స్టేషన్‌లో జరిగిన ఆ హత్యాకాండ గురించి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రస్తావించారు. అందులో ఒకరు కుష్వంత్ సింగ్. మార్చి 9, 1947 నాటి రాత్రి అదే రైలులో ఆయన కూడా ప్రయాణిస్తున్నారు. బయటపడిన వారిలో ఆయన ఒకరు. మరునాడు లాహోర్‌లో దిగిన తరువాత పేపర్‌లో చూస్తే తక్షశిల మారణకాండ గురించి తెలిసింది. ఆయన కుటుంబం లాహోర్ నుంచి ఢల్లీి వచ్చింది. ట్రూత్ లవ్ అండ్ ఎ లిటిల్ మాలీస్ అన్న తన జీవిత చరిత్రలో కూడా ఆయన ఈ అనుభవం గురించి రాశారు. ఆ అనుభవాలే ఆయనకు ట్రయన్ టు పాకిస్తాన్ రచనలో ఉపకరించాయి.