ఆగస్టు 19 రక్షాబంధన్‌ (శ్రావణపూర్ణిమ)

నిత్యజీవితంలో ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా దైనందిన వ్యవహారాలలో సమాజం కొట్టుకుపోతున్నప్పుడు ఆశయ విస్మరణ జరగకుండా చేసేదే శ్రావణపౌర్ణిమ. ఏ ప్రేమ, ఆత్మీయత, విద్యా, విజ్ఞానాల మీద మన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలు ఆధారపడి ఉన్నాయో వాటిని గుర్తు చేస్తుంది.

విదేశీదాడులతో ఏర్పడిన ఆత్మవిస్మృతి కారణంగా వందల సంవత్సరాల పాటు మనం అస్తిత్వ పోరాటం చేయవలసి వచ్చింది. ప్రజల మధ్య సంబంధాలు దెబ్బతిన్నందువల్ల అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఆ సంబంధాలను పటిష్ట పరచాలంటే సామరస్యం నిర్మాణం కావాలి. ఈ దిశగా జరిగే ప్రయత్నాలకు ప్రేరణ శ్రావణపౌర్ణమి నాడు నిర్వహించుకునే రక్షాబంధన్‌.

ఈ పండుగ సోదర సోదరీమణుల మధ్య బంధు భావనను నిర్మించడమే కాకుండా కుటుంబ విలువలను శక్తిమంతం చేస్తుంది. ఈ పండుగ ప్రేమ, సోదరత్వానికి ప్రతీక. సమాజ రక్షణ, మన సనాతన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ విశ్వమానవ కల్యాణానికి అనువైన వాతావరణాన్ని నిర్మిస్తూ ప్రపంచ శాంతి, అభ్యుదయానికి పునాదులు వేయడానికి మనకు ప్రేరణ కల్పిస్తుంది.

ఇలాంటి పవిత్రమైన పండుగ రోజున ఈ వ్యాసంలో స్మరించుకుంటున్న పంచ పరివర్తన్‌ అంశాలలో మనందరం భాగస్వాములవుదాం.

  1. కుటుంబ ప్రబోధన్‌ : మన జాతీయ జీవనం అఖండంగా అప్రతిహతంగా సాగిపోవడానికి కారణం కుటుంబ వ్యవస్థ. ఈ వ్యవస్థ నిరంతరంగా నిలిచేందుకు మన పూర్వులు ఏర్పరిచిన విధివిధానాలు అమూల్యమైనవి.

భజన్‌ : ‘భజ’ (భజన) అంటే తెలుసుకోవడం, అన్వేషించడం, సేవ చేయడం అని అర్థం. ముందుగా మన పూర్వజుల గురించి కుటుంబ సభ్యులందరికీ తెలియాలి. వారి గొప్పదనం, వారి మంచి పనులు గురించి తెలియజేయాలి. పెద్దలను సేవించాలన్న భావన పిల్లలకు అందించాలి. తరాల మధ్య ప్రేమభావన, వాత్సల్యం పెంపొందించాలి. ఇందుకోసం ఇంట్లో మంచి విషయాల గురించి చర్చ జరుగుతుండాలి.

భోజన్‌: మనిషి జీవ ప్రక్రియకు ఆహారం కావాలి. అంతేనా, భోజనం అందరూ కలిసి చేయడం ఇంట్లో చాలా ముఖ్యం. కనీసం ఒకపూట కలిసి భోజనం చేయాలి. భగవద్గీతలో చెప్పినట్లు ప్రసాదంగా భావించి తినాలి.

భాష: సృష్టిలోని సమస్త జీవరాశులన్నింటిలో భగవంతుడు మానవుడికిచ్చిన వరం భాష. మిగిలిన ఏ ప్రాణికి ఆ వరం దక్కలేదు. భాష భగవద్దత్తమైనది. మాతృభాష తల్లిదండ్రుల నుంచి సంక్రమించేది. మనుషుల మధ్య అనురాగం, ఆప్యాయత, మమతానుబంధాలు పెరగడానికి ఉపయోగపడు తుంది. కనుకనే మాతృభాషను ప్రోత్సహించాలి.

భూష: అంటే వేషధారణ. భారతీయుల వేషధారణ ప్రపంచంలోనే గుర్తింపు పొందింది. మనదైన వస్త్రధారణ శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మనిషి మానసిక స్థితిని కూడా సంతుల నంతో నడిపించగలదు. వాతావరణ పరిస్థితికను గుణమైన వస్త్రధారణ మనది.

భవన్‌: అంటే నివాసం. కుటుంబం నివసించే మేడ కావచ్చు, పూరి గుడిసె కావచ్చు. ఆ నివాసం ఒక ఆనందభవనం, ఆరోగ్యసదనం, శాంతినివాసం, సంస్కృతికి కేంద్రం కావాలి. ఏ ఇంట్లో నిర్మలత్వం, పవిత్రత ఉంటాయో అక్కడ భగవంతుడు ఉంటాడు. ఇది కుటుంబ సభ్యులందరి సమష్ఠి బాధ్యత. ఇంట్లో భగవంతుని చిత్రాలతోపాటు, జాతీయనాయకుల చిత్రాలను కూడా ఉంచుకోవాలి. దేశ ఆర్థిక వ్యవస్థకు కుటుంబం పట్టుకొమ్మ అయిన పొదుపు పద్ధతి భారతీయ కుటుంబ వ్యవస్థలో అనాదిగా కొన సాగుతూ వస్తున్న వరం. పేదలను ఆదుకోవడం కోసం కుటుంబం సేవా కేంద్రం కావాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం శారీరక, మానసిక స్థితితోపాటు సామాజికంగా (ఇరుగు పొరుగువారితో) సత్సంబంధాలు కలిగి ఉండడం ఆరోగ్యవంతుని లక్షణం.

  1. పర్యావరణం : అభివృద్ధి పేరిట పర్యావరణా నికి చేటు కలిగించటం ద్వారా మానవుడు తన కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నాడు. భోగలాలసత కాదు, త్యాగభావన కావాలి. పాశ్చాత్య భావన యాంత్రికతను, భౌతికవాదాన్ని ప్రోత్సహిస్తే హిందుత్వం సమగ్ర దృష్టిని, త్యాగభావనను ప్రవచించింది. శాశ్వత ఆనందాన్ని పొందాలంటే కోరికలను తగ్గించుకోవాలని భగవద్గీత పేర్కొంది. కోరికలను తగ్గించుకోవడం వల్ల వస్తూత్పత్తిలో ప్రకృతి శోషణ ఉండదు. భోగవాదం ఆశకు, శోషణకు, హింసకు దారితీస్తేÑ త్యాగం శాంతినిస్తుంది. త్యాగభావన ద్వారా హిందుత్వం ప్రపంచ ప్రగతికి నమూనాను అందిస్తుంది.

కోరికలు తీర్చుకోవడానికి అనేక వస్తువులను ఉత్పత్తి చేస్తున్నారు. ఇందుకోసం ప్రకృతి వనరులను విరివిగా ఉపయోగించుకుంటున్నాం. ఈ ప్రక్రియే కాలుష్యానికి దారితీస్తున్నది. వీటితోపాటు అనేక సమస్యలు తోడవుతున్నాయి. ఉదాహరణకు వాతావరణం వేడెక్కడం. ఓజోన్‌ పొరలో రంధ్రాలు, భూక్షయం, అడవులు క్షీణించడం మొదలైనవి. వీటితో పర్యావరణం దెబ్బతిని మానవులతో పాటు అనేక జీవరాశుల మనుగడకు ప్రమాదం ఏర్పడిరది. ప్రకృతిలో మనం ఒక భాగమని, ప్రకృతికి రక్షకులమే (ట్రస్టీ) కాని యజమానులం కాదని భారతీయత ప్రబోధిస్తుంది. తాను పొందిన దానికి ప్రతిఫలంగా తిరిగి ఇవ్వనివాడు దొంగ అంటుంది గీత. ప్రకృతి మనకు శుభ్రమైన గాలిని, నీటిని, ఆహారాన్ని అందిస్తుంది. కనుక దీనిని పరిరక్షించడం మన బాధ్యత. ఇంద్రియాలను నిగ్రహించకపోతే ప్రకృతికి భంగం వాటిల్లుతుందని శ్రీకృష్ణుడు చెప్పాడు. జీవుల సంక్షేమం నుండి సంరక్షణ బాధ్యత కలుగుతుంది. ఆవును చంపి మాంసం పొందవచ్చును. పాలు కూడా పొందవచ్చును. కానీ చంపడం నాశనాన్నీ, పాలు తీసుకోవడం సంరక్షణనీ సూచిస్తుంది. సంరక్షణ నిరంతరం సాగుతుంది. హిందువు ప్రకృతిని నాశనం చేయడు, సంరక్షిస్తాడు. సరైన నాగరికత ప్రకృతి శోషణను కాక, సంరక్షణను ప్రోత్సహిస్తుంది. ప్రకృతి సంరక్షణవల్ల లభించిన వనరులనే ఉపయోగించు కోవడం మన లక్ష్యం కావాలి అని దీన్‌దయాళ్‌జీ అన్నారు.

నేడు మన ప్రథమ కర్తవ్యంగా జల సంరక్షణకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. ప్లాస్టిక్‌ వస్తువులను వినియోగించడం క్రమేపి తగ్గించుకోవాలి. పుట్టిన రోజున ఒక మొక్కను నాటి సంరక్షించే సంప్రదా యాన్ని కుటుంబంలో అలవాటుచేయాలి. ఇలాంటి అనేక విషయాలను స్వయంగా మనకు మనమే ఆచరిస్తూ ఇతరులకు నమూనగా నిలబడే విధంగా సంకల్పిద్దాం.

  1. సమరసత : హిందువులందరినీ సంఘటితం చేయడం సంఘం లక్ష్యం. దీనికొక ఆధారం అవసరం. మానవుని మనోలక్షణాన్నిబట్టి ఇది భావాత్మకమై ఉండాలి. కనుక ఇది మన మాతృభూమి. మనందరం ఒకే తల్లిబిడ్డలం అని మనం ప్రారంభిస్తాం. అస్పృశ్యత మన సమాజంలోని అసమానతలలో అత్యంత దురదృష్టకరమైన అంశం. ప్రాచీనకాలంలో ఇది లేదని కొందరు మేధావులు అంటారు. కాలక్రమంలో ఇది మన సాంఘిక వ్యవస్థలో చోటుచేసుకొని వేళ్లూనింది. వాస్తవం ఏమైనప్పటికీ ఈ తప్పిదాన్ని సమూలంగా నిర్మూలించాలన్న వాస్తవాన్ని మనం అంగీకరించాలి. ‘‘అస్పృశ్యత తప్పు, అది తప్పుకాకపోతే ప్రపంచంలో మరేదీ తప్పుకాదు’’ అని మనమందరం ప్రకటించాలి. అసమానతల వల్ల మనం ఏ విధంగా బలహీనుల మైనామో ప్రజలందరికీ విశదీకరించాలి. అప్పుడే హిందూ సంఘటనకు పెద్ద అవరోధం తొలగిపోగలదు.

నచ్చజెప్పడం ద్వారా సాఫల్యం: సమాజ సమతా లక్ష్య సాధనకు అన్ని రకాల మనుష్యుల మద్దతును, సహకారాన్ని పొందవలసి ఉంటుంది. మన సమాజంలో ఎందరో ధర్మగురువులు సాధుపుంగ వులు. పండితులు ఉన్నారు. వారందరికీ సామాన్య ప్రజల మనస్సులపై ఎంతో ప్రభావం ఉంది. మన లక్ష్యసాధనలో వారి సహకారం కావాలి. ప్రాచీన సంప్రదాయాలను దృఢంగా విశ్వసించినవారు వాటిని మార్పు చేయడానికి అంగీకరించరని మనం భావిస్తుంటాం. అంతమాత్రంచేత వారి సద్భావనలను తక్కువగా అంచనావేయడం తగదు. మనం ధర్మగురువులను సమీపించి ప్రాచీన ధర్మంలోని శాశ్వత సత్యాల గురించి, కాలానుగుణంగా పరివర్తింపజేయతగు అంశాల గురించి ప్రజలకు బోధించవలసిందిగా గౌరవంగా విజ్ఞప్తి చేయాలి. సమాజ రక్షణ బాధ్యత గల వారు తమ ఆశ్రమాల నుండి బయటకు వచ్చి ప్రజలతో కలిసినప్పుడే ఆ లక్ష్యం నెరవేరుతుందని ధర్మగురువులకు నచ్చజెప్పాలి.

ఇది కఠినతరమైన పనిగా మనకు అనిపించ వచ్చును. మన ధర్మగురువులు ఇప్పటికే ఈ దిశలో పనిచేస్తుండడం శుభసూచకం. ద్వితీయ సర్‌సంఘ చాలక్‌ శ్రీ గురూజీ విశ్వహిందూపరిషత్‌ ఆధ్వర్యంలో ధర్మాచార్యులనందరినీ ఒకే వేదికపై సమీకరించి వారందరి దృష్టిని ఈ లక్ష్యంవైపు ప్రసరింపజేశారు. ఫలితంగా ఎందరో సాధువులు, ధర్మాచార్యులు సమాజంలోని అన్ని వర్గాలవారి మధ్య కలిసిమెలిసి మసలనారంభించారు. ఒకప్పుడు పునరా గమనమును నిరసించినవారు తమ వైఖరిని మార్చుకొని పరధర్మంలోకి వెళ్లినవారిని తిరిగి హిందువులుగా స్వాగతిస్తున్నారు.

సరైన దృష్టి ` డాక్టర్జీ: సమాజంలో ఒక ప్రత్యేక వర్గం తరచు తీవ్ర విమర్శలకు గురౌెతోంది. సమాజంలోని ఏ భాగాన్నయినా ఇలా అవమాన పరచడం తగదు. వారిలోని స్థైర్యాన్ని ప్రోదిచేస్తూ సామాజిక పరివర్తనకు క్రొత్తవీ, మరింత మంచివైన ఉదాహరణలను వారి ముందుంచాలి. దురదృష్టవ శాత్తు మన సమాజంలోని విభేదాలను విశ్వసించే వారు, సరైన దృక్పథాన్ని గ్రహించలేనివారు ఉన్నారు. వారూ హిందూ సమాజంలోనివారే. అట్టివారితో కటువుగా వ్యవహరించడం సరికాదు. వారికి నచ్చచెప్పడానికి మార్గాలున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌. స్థాపకులు డాక్టర్‌జీ ఈ దృష్టితోనే కృషి చేశారు.

  1. ‘స్వ’ (స్వదేశీ) : శతాబ్దాల తరబడి విదేశీ పరిపాలకులు సాగించిన అణచివేత విధానాల ఫలితంగానే భారత్‌ ప్రగతి సాధనలో ప్రపంచ దేశాలతో పోటీపడలేక వెనుకబడి పోయిందనేది సత్యం. స్వాతంత్య్రం రాగానే భారత్‌ సిరిసింపదలతో తులతూగగల స్వావలంబ దేశంగా అవతరించగల దని భారతీయులు భావించారు. కానీ అలా జరగలేదు. పైగా సమస్యలు పెరుగుతూనే వస్తున్నాయి. స్వాతంత్య్ర పోరాటంలోనే అరవిందమహర్షి, గాంధీజీ, ఇతర తత్త్వవేత్తలు దేశ వికాసానికి దారిచూపారు. కానీ స్వతంత్ర భారత నేతల దృష్టి స్వాభావికంగానే అభివృద్ధి చెందిన దేశాలవైపు పడిరది. ఆ దేశాల ప్రణాళికలను మనపై రుద్దడం ప్రారంభించారు. స్వదేశీ సంకుచితమైనది కాదు. ప్రపంచ ప్రగతి కోసం అందరికీ ఆమోద యోగ్యమైన ప్రత్యమ్నాయ నమూనాగా స్వదేశీని పేర్కొనవచ్చు.

ఆచరణలో స్వదేశీ : ఒక వినియోగదారుడిగా స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించాలి (నాణ్యత తక్కువైనప్పటికీ). ధర ఎక్కువే అయినా మానసికంగా సిద్ధపడాలి. మన ఉత్పత్తిదారులు కూడా సంపూర్ణ శక్తితో పనిచేస్తూ నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేయాలి. దేశంలోని శాస్త్రవేత్తలు, టెక్నీషియన్లు, పరిశోధకులు, నేడు ఎదురవుతున్న సవాళ్లకు దీటుగా ప్రతిభ, నైపుణ్యాలను ప్రదర్శించాలి. భారతీయమైన టెక్నాలజీని అభివృద్ధి చేయాలి. స్వభాషను ఉపయోగించడం, స్వదేశీ వేషధారణ, ఆహారపద్ధతులు, గృహ నిర్మాణం. సాధారణ చర్మకారులు తయారుచేసిన చెప్పులను వాడడం, గోసంపద వృద్ధికి కృషిచేయాలి. దేశంలో వచ్చిపడుతున్న ప్రమాదాలను ప్రభుత్వం గమనిస్తూ తన విధానాలను పునఃపరిశీలించుకోవాలి. ఈ దిశలో గత దశాబ్ద కాలంగా మన దేశం స్వావలంబి భారత దిశగా ప్రయాణిస్తుండటం శుభపరిణామంగా భావించి మనందరం ఈ విషయంలో మరింత క్రియాశీలకంగా ఉందాం.

  1. పౌర విధులు : మన దేశంలో హక్కుల కంటే విధులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పౌరుడిగా బాధ్యతలను నిర్వర్తించడం అనేది ఎవరో చూస్తున్నారని కాకుండా స్వీయ క్రమశిక్షణతో సంబంధించినదిగా మనం భావిస్తాం. ఉదాహరణకు రోడ్డులో వెళుతున్నప్పుడు ఎడమవైపున వెళ్లడం, కూడలిలో రెడ్‌ సిగ్నల్‌ పడినపుడు వాహనాన్ని ఆపడం. కుటుంబంలో నియమాలను, విధానాలను ఎలా అయితే మనం స్వయంగా పాటిస్తామో అదేవిధంగా ప్రభుత్వ నియమాలను, విధానాలను గౌరవించి పాటించడం మన ధర్మంగా పాటిస్తూ వస్తున్నాం. మన బాధ్యతలను నిర్వర్తిస్తేనే ఇతరుల హక్కులకు రక్షణ ఉంటుంది.

పంచపరివర్తన్‌లో పైన పేర్కొన్న అంశాలను మనం ఆచరిస్తూ సమాజంలోకి విస్తృతంగా తీసుకెళ్లి అద్భుత భారతాన్ని నిర్మించాలన్నదే రక్షాబంధన్‌ సంకల్పం కావాలి.

` కుర్రా దుర్గారెడ్డి

About Author

By editor

Twitter
YOUTUBE