తెలంగాణలో విశ్వవిద్యాలయాల నిర్వహణ గాడితప్పింది. నిధులు, నియామకాలు లేక కునారిల్లుతున్నాయి. ఫలితంగా విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. దీంతో, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెచ్చుకున్న పేరు ప్రతిష్టలు మసకబారి పోతున్నాయి. అన్నింటికీ మించి విద్యార్థులకు, అభ్యర్థులకు నాణ్యమైన బోధన కనుమరుగైపోతోంది. ఉన్నత చదువులు అభ్యసించి అత్యున్నత ప్రమాణాలను పెంపొందించుకోవాలన్న విద్యార్థులు, ఉద్యో గార్థుల కల.. కళ తప్పిపోతోంది. గత బీఆర్‌ఎస్‌ హయాం నుంచి మొదలు, నేటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనూ విద్యావ్యవస్థపై అవసరమైనంత ప్రాధాన్యత కనిపించడం లేదు. ఈ కారణంగా ప్రభుత్వాలు మారినా.. యూనివర్సిటీల పరిస్థితి షరా మామూలుగానే ఉంటోంది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత విద్యాప్రమాణాలు పెరుగుతాయని, విశ్వ విద్యాలయాల్లో అత్యున్నత సదుపాయాలు కల్పిస్తారని అందరూ భావించారు. కానీ, దాదాపు దశాబ్ద కాలంగా నియామకాలు చేపట్టడం లేదు. వీసీల నియామక ప్రక్రియపై అంతగా దృష్టి పెట్టలేదు. నిధుల కేటాయిం పులు కూడా ఆశించిన స్థాయిలో లేవు. ఫలితంగా విద్యావ్యవస్థ మనుగడకే ప్రమాదం పొంచి ఉన్న పరిస్థితులు భయాందోళనలు కలిగిస్తు న్నాయి. మొన్నటికి మొన్న యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్ల పదవీకాలం ముగిసిపోగా, వీసీలను నియమించాల్సిన ప్రభుత్వం.. ఐఏఎస్‌ అధికారులకు ఇంచార్జ్‌ వీసీలుగా బాధ్యతలు అప్పగించింది. ఇక, పూర్తిస్థాయి వైస్‌ ఛాన్సలర్ల నియామకం ఎప్పటికి జరుగుతుందో, యూనివర్సిటీల్లో పరిస్థితులు ఎప్పటికి కుదుటపడతాయో తెలియని పరిస్థితి. వీసీల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక బోధన, బోధనేతర సిబ్బంది విషయం చెప్పనక్కర్లేదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

ప్రతిష్టాత్మకమైన, వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ మొదలుకొని.. తెలంగాణ లోని మొత్తం 11 యూనివర్సిటీల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. విద్యా ప్రమాణాలు రోజు రోజుకూ క్షీణించిపోతున్నాయి. 70 శాతం బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడంలో గత ప్రభుత్వం గానీ, ఇప్పటి ప్రభుత్వం గానీ నిర్లక్ష్యం గానే వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో బోధన, బోధనేతర సిబ్బంది కలిపి మొత్తంగా 4,500 ఖాళీలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. కాంట్రాక్టు, తాత్కాలిక సిబ్బందితో బోధన అరకొరగానే సాగుతోంది. నాణ్యమైన బోధన అందక నానాటికీ ప్రమాణాలు పడిపోతున్నాయి. ఇక, పరిశోధనల జాడే కనిపించడం లేదు. అంతేకాదు.. యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాలకూ కొరతే ఉంది. కనీస సౌకర్యాలకూ కరవే.

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు నామ్‌కే వాస్తేగా మారిపోయాయి. పరిశోధనల మాట పక్కన బెడితే.. సాధారణ విద్యా ప్రమాణాలు కూడా రోజురోజుకూ పడిపోతున్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం, నిధుల కొరత, మౌలిక సదుపాయాల లేమికి తోడు బోధనాసిబ్బంది పోస్టుల్లో చాలా వరకు ఖాళీగా ఉండటంతో.. విశ్వ విద్యాలయాల్లో చదువు క్రమంగా గతి తప్పుతోంది. యూనివర్సిటీలు ఇచ్చే సర్టిఫికెట్లతో ఉద్యోగాలు రావడం లేదని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 ఉస్మానియా యూనివర్సిటీ కూడా నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ – న్యాక్‌ గుర్తింపులో వెనుకబడి ఉంది. ఈ యూనివర్సిటీ ర్యాంకు యేటేటా దిగజారుతోంది. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. యూనివర్సిటీల్లో సమస్యలు తిష్ట వేశాయని, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాలు చెబుతున్నా.. నిధులు మాత్రం కేటాయించడం లేదు.

రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోనూ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లే కాకుండా.. బోధనేతర సిబ్బందికి సంబంధించిన ఖాళీలు కూడా భారీగానే పేరుకు పోయాయి. ఏటేటా పదవీ విరమణలు జరుగుతున్న ప్పటికీ, వారి స్థానంలో నియామకాలు మాత్రం జరపడం లేదు. సిబ్బంది నియామకాల భర్తీకి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామంటూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవో బుట్టదాఖ లయ్యింది. వీసీల ద్వారా కాకుండా.. కమిటీల ద్వారా నియామ కాలు చేపట్టాలని భావించింది. కానీ ఆ ప్రతిపాదన ముందుకు పడలేదు.

ఈ ఏడాది మేలోనే అన్ని యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్ల పదవీకాలం పూర్తయింది. కొత్తవారి నియామకం కోసం సెర్చ్‌ కమిటీలు వేశారు. ఆశావ హుల నుంచి దరఖాస్తులు కూడా తీసుకు న్నారు. కానీ ఆ కమిటీలు ఇప్పటి దాకా సమావేశం కాలేదు. వైస్‌ ఛాన్సలర్ల నియామకం జరిగితే తప్ప యూని వర్సిటీల్లోని బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీల భర్తీ సాధ్యం కాదు. ఆ ఖాళీలు భర్తీ చేస్తే తప్ప విశ్వవిద్యాలయాల్లో బోధన గాడినపడే పరిస్థితి లేదు.

రాష్ట్రంలోని మొత్తం 11 యూనివర్సిటీల్లో 2,828 పోస్టులకు గానూ, 1,869 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే 70శాతం వరకు బోధనా సిబ్బంది లేరు. ఇలా ఉంటే విశ్వవిద్యాలయాల్లో బోధన ఎలా సాగుతుందని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. పరిశోధనలు ఎలా సాధ్యమవుతాయని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2017లోనే యూనివర్సిటీల్లో 1,528 ఖాళీలున్నట్టు అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గుర్తించింది. 1,061 పోస్టులను భర్తీ చేయాలని కూడా నిర్ణయించింది. కానీ ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. ఎప్పుడూ ఏదో ఒక కారణంతో నియామకాలు ఆగిపోతూనే ఉన్నాయి. 2021 జనవరి నాటికి ఖాళీల సంఖ్య 1,869కు పెరిగింది. ఇందులో 248 ప్రొఫెసర్‌, 781 అసోసియేట్‌ ప్రొఫెసర్‌, 850 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ తర్వాత మరిన్ని పోస్టులు కూడా ఖాళీ అయ్యాయి. మరోవైపు.. బోధనేతర సిబ్బంది ఖాళీలు కూడా భారీగానే ఉన్నాయని గుర్తించారు. మొత్తంగా 4,500కు పైగానే పోస్టులు యూనివర్సిటీల్లో భర్తీ చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్రంలోపనే కీలకమైన ఉస్మానియా యూనివర్సిటీలోనూ ఫ్యాకల్టీ కొరత తీవ్రంగా నెలకొంది. అన్ని విభాగాల్లోనూ కాంట్రాక్ట్‌, పార్ట్‌టైమ్‌ లెక్చరర్లతోనే బోధన చేయిస్తున్నారు. సీనియర్‌ ఫ్యాకల్టీ లేకపోవడంతో పరిశోధనలు ముందుకు సాగడం లేదు. పోస్టు గ్రాడ్యుయేట్‌ స్థాయిలో కూడా బోధన మొక్కుబడిగా ఉందనే విమర్శలు నెలకొన్నాయి. ల్యాబ్‌లలో అవసరమైన పరికరాలు, రసాయనాలు, ఇతర మౌలిక వసతులు కూడా అందుబాటులో లేవంటున్నారు. జేఎన్‌టీయూహెచ్‌లోనూ ఇదే దుస్థితి నెలకొంది. నిజాం కాలేజీ, కోఠిలోని ఉమెన్స్‌ యూనివర్సిటీలోనూ చాలా కోర్సులకు ఫ్యాకల్టీ లేదన్న వాస్తవం విద్యావేత్తలు జీర్ణించు కోలేకపోతున్నారు. అంతేకాదు.. రాష్ట్రంలోని మరికొన్ని యూనివర్సిటీల్లో లెక్చరర్ల సమస్యను పరిశీలిస్తే.. ఉస్మానియా విశ్వవిద్యాలయం తర్వాత చెప్పుకోదగ్గ ది కాకతీయ యూనివర్సిటీ. ఇక్కడ పొలిటికల్‌ సైన్స్‌, ఎడ్యుకేషన్‌ వంటి విభాగాల్లో రెగ్యులర్‌ అధ్యాపకులు ఒక్కరు కూడా లేరు. ఈ యూనివర్సిటీ పరిధిలోని కొత్తగూడెం ఇంజనీరింగ్‌ కాలేజీలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కరీం నగర్‌లోని శాతవాహన వర్సిటీలో మ్యాథ్స్‌, ఫార్మసీ, బోటనీ, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాల్లో రెగ్యులర్‌ లెక్చరర్లు లేరు. మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ విభాగాలకు ఒక్క రెగ్యులర్‌ ఫ్యాకల్టీ కూడా లేకపోవడంతో.. కాంట్రాక్టు లెక్చరర్లతో అరకొరగా బోధన కొనసాగిస్తున్నారన్న విమర్శలున్నాయి. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో చూసినా కొన్ని విభాగాల్లో ఒక్క ప్రొఫెసర్‌ కూడా లేని పరిస్థితి ఉంది. కీలకమైన ఇంజనీరింగ్‌ విభాగంలో 48 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగతా విభాగాల్లోనూ రెగ్యులర్‌ అధ్యాపకులు నామమాత్రం గానే ఉన్నారు. అటు.. నిజామాబాద్‌లోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో మ్యాథ్స్‌, ఎకనామిక్స్‌, ఫార్మస్యూటికల్స్‌, కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ విభాగాల్లో రెగ్యులర్‌ అధ్యాపకులు అసలు లేరు.

బోధనా సిబ్బంది కొరత, కొత్త నియామకాలు జరగకపోవడం కారణంగా రాష్ట్రంలోని మొత్తం 11 విశ్వవిద్యాలయాల్లో 1,365 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. వాళ్ల సంఖ్య కూడా సరిపడా లేకపోవడంతో కాంట్రాక్టు లెక్చరర్లపైనే విపరీతమైన పనిభారం పడుతోంది. అసలే చాలీచాలని జీతాలకు తోడు పనిభారం వల్ల ఇబ్బందిపడుతున్నామని కాంట్రాక్టు లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను రెగ్యులర్‌ చేస్తామని ప్రభుత్వాలు హామీలు ఇవ్వడం, ఆశలు పెంచడం తప్పితే.. ఆ హామీలు నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బోధన, బోధనేతర సిబ్బంది మాత్రమే కాదు.. దాదాపు అన్ని యూనివర్సిటీల్లో మౌలిక వసతుల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. తాగునీటి సౌకర్యం కూడా సరిగా ఉండటం లేదని విద్యార్థులు ఫిర్యాదులు చేస్తున్నారు. హాస్టళ్లు, టాయిలెట్ల పరిస్థితి దారుణంగా ఉంటోందని వాపోతున్నారు. పాలమూరు వర్సిటీ హాస్టళ్లలో గదుల తలుపులు, కప్‌బోర్డులు విరిగిపోయాయి. శాతవాహన వర్సిటీలో ఫార్మసీ కళాశాల భవనాలు నామమాత్రంగా ఉన్నాయి. ఉస్మానియా వర్సిటీ భవనాల నిర్వహణ సరిగా లేదు. కొన్ని శిథిలావస్థకు చేరాయి. వీటిని బాగు చేయా లంటే నిధుల కొరత వెంటాడుతోందని అధికారులు చెబుతున్నారు.

పై పరిస్థితులకు గడిచిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రధాన కారణమైతే.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అదే అలసత్వాన్ని కొనసాగి స్తోంది. వైస్‌ చాన్స్‌లర్ల పదవీకాలం ముగియడంతో.. ప్రభుత్వం ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో ఐఏఎస్‌ అధికారిని ఇన్‌చార్జి వీసీగా నియమించింది. ఈ మేరకు గత మేలో ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని మొత్తం పది విశ్వవిద్యాలయాల వీసీల పదవీ కాలం మే 21వ తేదీతో ముగిసింది.

వాస్తవానికి వీసీల పదవీ కాలం ముగియక ముందే కొత్తవారిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. వీసీల నియామకం కోసం దాదాపు అన్ని యూనివర్సిటీలకు సెర్చ్‌ కమిటీలను నియమించారు. వీసీ పోస్టుల కోసం వచ్చిన దరఖాస్తులను ఆ కమిటీ పరిశీలించి.. అన్ని అర్హతలున్న వారి జాబితాను ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత నియామకాలు ఉంటాయి. కానీ సెర్చ్‌ కమిటీలు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో అయితే ఎగ్జిక్యూటివ్‌ కమిటీ కూడా ఏర్పాటు కాకపోవడంతో సెర్చ్‌ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు.

రాష్ట్రంలోని యూనివర్సిటీల దుస్థితి ఇలా ఉంటే.. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో కొత్త యూనివర్సిటీకి శంకుస్థాపన చేసింది. శరవేగంగా ప్రారంభోత్సవం చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. మరి.. స్కిల్‌ యూనివర్సిటీపై అమితంగా శ్రద్ధ చూపిస్తున్న ప్రభుత్వం.. మిగతా యూనివర్సిటీలపైనా ప్రత్యేక దృష్టి సారించాలని విద్యావేత్తలు సలహా ఇస్తున్నారు.

– సుజాత గోపగోని, సీనియర్‌ జర్నలిస్ట్‌, 6302164068

About Author

By editor

Twitter
YOUTUBE