దేశమంటే 240 మంది లోక్‌సభ ఎంపీలు కారు,

140 కోట్ల మంది భారతీయులు

మొన్నటి లోక్‌సభ ఎన్నికలలో ఎన్‌డీఏకి కొద్ది సీట్లు తగ్గాయి. బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి  కొద్దిదూరంలో ఉండిపోయింది. ఇదే అదనుగా విపక్షాలు కొత్త సవాళ్లు విసరడానికి సిద్ధమవుతున్నాయి. చిత్రంగా వాటి విషపుటాలోచనలు బీజేపీనీ, మోదీనీ గద్దె దించడానికేనని వారు చెబుతున్నారు. కానీ ఆ కుట్రలు భారత సార్వభౌమాధికారాన్ని సవాలు చేసే విధంగా మలుపు తీసుకుంటున్నాయి. డీప్‌స్టేట్‌ కుళ్లూ కుతంత్రాలు, రాజకీయాలు సుస్పష్టమైపోయి, పొరుగున ఉన్న బాంగ్లాదేశ్‌ అల్లకల్లోలమైంది. అలాంటి పరిస్థితులు భారత్‌లోను దూసుకు వచ్చేస్తున్నాయంటూ, మోదీ రాజీనామా లేఖను సిద్ధం చేసుకోవడమే తరువాయి అంటూ విపక్ష శిబిరంలో ప్రముఖులు చంకులు గుద్దేసుకున్నారు కూడా. ఈ నేపథ్యంలోనే 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట మీద నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇది ఆయన 11వ ప్రసంగం.

పదేళ్ల బీజేపీ ఏలుబడిలో సాధించిన విజయా లను నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి జాతికి గుర్తు చేశారు. తన ప్రభుత్వం చేపట్టబోయే పథకాల గురించి వివరించారు. ఇందులో చాలా అంశాలు బడ్జెట్‌లో ప్రతిపాదించారు కూడా.

1995 నాటి ప్రమాదకర వక్ఫ్‌ చట్టానికి సవరణలు సూచిస్తూ బీజేపీ/ఎన్‌డీఏ తెచ్చిన బిల్లు పార్లమెంట్‌ సంయుక్త సంఘం పరిశీలనకు వెళ్లింది. దీనికి కాంగ్రెస్‌, దాని తైనాతీలు ఎలాగూ మోకాలడ్డుతాయి. అదే జరిగింది. బాంగ్లాదేశ్‌లో అల్లర్లు, అవి భారతదేశంలోనూ పునరావృతమవుతా యని విపక్షాలు దింపుడుకళ్లం ఆశలతో చూస్తున్న సమయంలో ఆగస్ట్‌ 8న ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. నిజానికి ఇదొక లోతైన సంకేతం.

 పార్లమెంట్‌లో మెజారిటీ తగ్గినంత మాత్రాన బీజేపీ తన మౌలిక విధానాల నుంచి, నినాదాల నుంచి వెనక్కి తగ్గడం లేదన్నదే ఆ సంకేతం. దీనికి కొనసాగింపుగానే ఎర్రకోట నుంచి ప్రధాని లౌకిక పౌరస్మృతి  అవసరం గురించి పిలుపునిచ్చారు. ఈ పిలుపు ఉమ్మడి పౌరస్మృతి గురించేనని వేరే చెప్పక్కరలేదు. యథాప్రకారం ఉమ్మడి పౌరస్మృతిని ముస్లిం సమాజం అంగీకరించబోదని అఖిల భారత షరియా బోర్డు వెంటనే ప్రకటన కూడా ఇచ్చేసింది. అయితే ఇప్పటివరకు ఉన్న పౌరస్మృతి, స్వాతంత్య్రం సిద్ధించి లేదా రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఏడు దశాబ్దాల తరువాత కూడా ఈ దేశంలో ఉన్నది వివక్షాపూరితం, స్వతంత్ర భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను నిపుణులు, బాధ్యత కలిగిన పౌరులు అంతా అంగీకరిస్తారు. అది రాజ్యాంగం నిర్దేశించిన అంశమే. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ఈ విషయాన్ని సుస్పష్టంగానే చెబుతున్నాయి. ఒకే దేశం ఒకే ఎన్నిక  విధానానికి కూడా తాము కట్టుబడే ఉన్నామని కూడా ప్రధాని చెప్పారు.

ఉమ్మడి పౌరస్మృతి  అంశాన్ని మోదీ సరైన సమయంలో మళ్లీ గుర్తు చేశారనే అనాలి. ఈ అంశం మీద విపక్షాలన్నీ దొంగ నిద్ర నటిస్తున్నాయి. బుజ్జగింపు రాజకీయాల కోసం ఉమ్మడి పౌరస్మృతిని అవి వ్యతిరేకిస్తున్నాయి. భారత స్వాతంత్య్రోద్యమంలో జరిగిన, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కొనసాగించిన చారిత్రక తప్పిదాలను సవరించే పనిని బీజేపీ ప్రభుత్వం స్వీకరించింది. నాడు అఖిల భారతీయ జనసంఫ్‌ు చేసినట్టే, నేడు బీజేపీ కొన్ని జాతీయ ప్రాధాన్యం కలిగిన అంశాలపై సుదీర్ఘ పోరాటాన్నే చేస్తున్నది.  కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణం రద్దు అందులో ఒకటి. అది చేసి చూపించింది బీజేపీ. అలాగే ఉమ్మడి పౌరస్మృతి, ఒకే ఎన్నిక, ఒకే దేశం కూడా బీజేపీ నినాదాలే. ఇవి ఒకరోజులోనో, ఒక ఎన్నికల హామీతోనో నెరవేర్చ గలమని బీజేపీ కూడా భావించడం లేదు. ఇందులో అన్ని అంశాలకీ ఎన్‌డీఏ భాగస్వాముల మధ్య కూడా ఏకాభిప్రాయం లేదు. బీజేపీకి ఉన్న జాతీయ దృక్పథం, వాటి దృక్పథం ఎప్పటికీ ఒకటి కాలేవు. హిందుత్వం, జాతీయత, దేశరక్షణ, సంస్కృతి వంటి విషయంలో బీజేపీవి స్థిరమైన అభిప్రాయాలు. వాటి నుంచి బీజేపీ తగ్గలేదు. కానీ బీజేపీయేతర పక్షాలే వాస్తవికతను తెలుసుకున్నాయి. 1990 నాటి బీజేపీ ఒక అంటరాని పార్టీ. కానీ 1996 నాటికి ఆ దురభిప్రాయాన్ని బీజేపీ రూపుమాపగలిగింది. తనవైన విధానాలను ప్రజలలోకి తీసుకువెళ్లి వారి మనసులను గెలుచు కున్నది. ఇప్పుడైన అదే ఉద్దేశంతో తన విధానాలను అమలులోకి తీసుకు రావాలని బీజేపీ భావిస్తున్నట్టు కనిపిస్తుంది.

డీప్‌స్టేట్‌ రాజకీయాలు వీరవిహారం చేస్తున్నాయి. చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడం, కీలుబొమ్మలను ప్రతిష్ఠించడం ఇప్పుడు కొత్త పరిణామం. దీనిని ప్రతిఘటించగలిగేది ప్రజాభి ప్రాయమే. 40 కోట్ల మంది భారతీయులు ఒక మహా వలస శక్తిని కూలదోశాయని మోదీ గుర్తు చేయడం వెనుక పెద్ద అర్ధమే ఉంది. డీప్‌స్టేట్‌ రాజకీయం వ్యూహం కూడా నాటి వలసదేశాలలో జరిగినట్టే  కిరాయి మూకలను ఉపయోగించుకుని సుస్థిరతను, జాతీయ భావాలను, పురోగతిని అడ్డుకోవడమే. నాడు బ్రిటిష్‌ వలస పాలన చేసింది కూడా అదే. కానీ ఈరోజు 140 కోట్ల మంది భారతీయులు ఉన్నారు అని ప్రధాని గుర్తు చేయడం ఇందుకే. 140 కోట్ల మంది కలసి నడిస్తే ఎలాంటి సవాలునయినా, శక్తిని అయినా ప్రతిఘటించగలమని, వికసిత భారత్‌ దిశగా ప్రయాణించగలమని ఆయన పెద్ద హెచ్చరికే చేశారు. సవాలుకే సవాలు విసరడం భారతీయుల సహజ లక్షణమని ఆయన నినదించారు. మోదీ చెప్పినట్టు భారత్‌ అంటే 240 లోక్‌సభ (బీజేపీ బలం) స్థానాలు కాదని, 140 కోట్ల మంది భారతీయులని చెప్పి ఆయన విధ్వంసక శక్తుల చెంప చెళ్లుమనిపించారు. దేశాన్ని యథాతథ స్థితి నుంచి తప్పించి సంస్కరణల పథంలో నడపాలంటే జనబలం అవసరమని ఆయన అన్నారు. సంకీర్ణంలో బలం తగ్గితే దుష్పరిణామాలు తప్పవని కూడా ఆయన హెచ్చరించడం గమనార్హం. మైనారిటీ ప్రజల కోసం మెజారిటీ ప్రజల పురోగతిని, పురోగమన దృష్టిని అడ్డుకునే బుద్ది ఎప్పటికీ ప్రశ్నార్దకమే.

కోల్‌కత్తాలో జరిగిన పీజీ డాక్టర్‌ హత్యను ఖండిరచడంలోనే విపక్షాల బలహీనత అర్థమవుతుంది. ఫైజాబాద్‌ ఎంపీ (సమాజ్‌వాదీ పార్టీ) సన్నిహితుడు అయోధ్యలో మైనర్‌ బాలిక మీద అత్యాచారానికి పాల్పడినా విపక్షాలు ఖండిరచవు. మోదీని గుడ్డిగా వ్యతిరేకించే ఏ రాజకీయ పార్టీని అయినా మీడియా సమర్ధిస్తున్నది. అందులో భాగంగానే పీజీ డాక్టర్‌ హత్య వివాదానికి ఇవ్వవలసినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. మమత రాజీనామా చేయాలని ఎవరూ గట్టిగా కోరడం లేదు. దోషులను కఠినంగా శిక్షించాలని ఒక మాట అని రాహుల్‌ గాంధీ ముఖం చాటేశాడు. ఇలాంటి దుండగాలను, నీచ రాజకీయాలను ఖండిరచడం అంటే, విపక్ష కూటమిని బలహీనం చేయడమేనని, మోదీకి బలం తేవడమేనని విపక్షాలు భావిస్తున్నాయి. నిజానికి అది డీప్‌స్టేట్‌కు మరింత చోటు కల్పించడమే. దీనినే మోదీ గొప్పగా చెప్పారనిపిస్తుంది. కోల్‌కతా అమానుషం గురించి మోదీ ప్రస్తావించక తప్పని పరిస్థితి. నిజంగానే బీజేపీ సాధించిన, సాధిస్తున్న విజయాలను విపక్షాలు జీర్ణం చేసుకోలేకపోతున్నాయి. ఆ క్రమంలో ఎంత అవినీతిని అయినా, ఎంతటి అమానుషాలనైనా సమర్ధించే దుశ్చర్యకు పాల్పడుతున్నాయి. అవినీతిని ప్రచారం చేసుకోవడం కూడా ఘనకార్యంగా భావించే స్థితికి విపక్షాలు వచ్చాయని మోదీ సరైన వ్యాఖ్యానమే చేశారు.

బాంగ్లాదేశ్‌ పరిస్థితిని ఆగస్ట్‌ 15న ఎర్రకోట మీద ప్రస్తావించడం అవసరమే. అక్కడి హిందువుల రక్షణ బాధ్యత తాము పట్టించుకున్న సంగతిని ఆయన ప్రకటించారు. బాంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి ప్రధాన కారకుడు షేక్‌ ముజిబూర్‌ రెహమాన్‌ను ఆగస్ట్‌ 15,1975న భారత్‌ స్వాతంత్య్ర దిన వేడుకలలో ఉండగానే దుండగులు దారుణంగా చంపారు. అప్పటికి దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించి సరిగ్గా నెలా 20 రోజులైంది. అప్పటి రాజకీయ నేపథ్యంలో ముజీబ్‌ హత్యతో ఇందిరాగాంధీ కలవర పడ్డారన్న వార్తలు కూడా నాడు వెలువడినాయి. ఇవాళ బాంగ్లాదేశ్‌ పరిస్థితి, అక్కడి హిందువుల పరిస్థితి దారుణం. వారి భద్రత గురించి మోదీ సరైన సమయంలోనే హెచ్చరించారు. దీనితో తాత్కాలిక ప్రభుత్వ అధ్యక్షుడు మహమ్మద్‌ యూనస్‌ మైనారిటీల రక్షణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

బీజేపీ/మోదీ నాయకత్వంలోని ప్రభుత్వాలు పాలించిన ఈ పదేళ్లు విపక్షాల నుంచి, అంతర్జాతీయంగా భారత్‌ వ్యతిరేక శక్తులు, అరాచకశక్తుల నుంచి సవాలు లేని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. కాబట్టి ఈ ఏడాది సవాళ్లు ప్రత్యేకమైనవి కాకున్నా, అంతర్జాతీయ పరిస్థితులు, డీప్‌స్టేట్‌ భారత్‌ వంటి పురోగామి దేశానికి ప్రత్యేకించి సమస్యలు సృష్టిస్తున్నాయి. క్రైస్తవం, ఇస్లాం శక్తుల నుంచి, ఉదారవాద శక్తుల నుంచి ఎదురవుతున్న సవాళ్లను తక్కువగా చూడలేం. 98 నిమిషాల మోదీ ఎర్రకోట ఉపన్యాసంలో ప్రతి నిమిషం దీనినే ప్రతిధ్వనించింది.

About Author

By editor

Twitter
YOUTUBE