హిందూ సమాజం అన్ని వైపుల నుంచి దాడులకు గురి అవుతున్న సమయంలో యదా యదాహి ధర్మస్య అన్న రీతిలో, కృష్ణాష్టమికి భారత గడ్డ మీద ఆవిర్భవించిన సంస్థ విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ). అంతర్జాతీయ హిందూసమాజం హక్కుల రక్షణ కోసం ఏర్పడిన ఈ సంస్థ అయోధ్య ఉద్యమంతో చరిత్రను మలుపు తిప్పింది. హిందువు తనను తాను హిందువు అని చెప్పుకునే స్థితికి తీసుకువచ్చింది. అసలు హిందువు పట్ల సమాజం దృష్టినే మార్చింది. ఆ సంస్థ పరిణామం, వికాసం, విజయాల గురించి విహెచ్‌పి అఖిల భారతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి కప్పగంతుల కోటేశ్వరశర్మతో  ముఖాముఖీ వీహెచ్‌పీ 60 ఏళ్ల ప్రత్యేక సంచిక కోసం.

1964 ఆగస్ట్‌, కృష్ణాష్టమి. విశ్వహిందూ పరిషత్‌కు శ్రీకారం చుట్టిన రోజు. ఇది ఆధునిక భారత చరిత్రను తిరగరాసిన సంస్థ. ఆ ఘట్టం వివరాలు చెప్పండి!

స్వాతంత్య్రం వచ్చిన తరువాత సమాజ స్థితిగతు లను గమనిస్తే హిందూ సంస్కృతి, హిందూధర్మం, హిందూ పరంపరలకు అవి అనుగుణంగా లేవన్నది తెలుస్తుంది. స్వాతంత్య్రం రాకపూర్వం కంటే వచ్చిన తరువాత మతమార్పిడుల సంఖ్య పెరిగిందన్నదే హిందూ ధార్మిక, సామాజిక, సాంస్కృతిక క్షేత్రాలలో పనిచేసిన మహనీయులు, పెద్దల అభిప్రాయం. హిందూ సమాజాన్ని చిన్నచూపు చూసే విధంగా, అణచివేసే పద్ధతిలో చట్టాలు వెల్లువెత్తుతున్నాయన్న ఆందోళన మరొకటి. ఈ స్థితి నుంచి హిందూ సమాజాన్ని బయటికి తేవడానికి ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచన మొదలైంది. అపుడే మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పరచిన నియోగి కమిషన్‌ నివేదిక రావటం, మతమార్పిడులపైన అధికారిక సమాచారం బయట పడటం, ప్రలోభపెట్టి, భయపెట్టి – రకరకాల పద్ధతులతో మత మార్పిడులు విశృంఖలంగా జరుగుతున్న సమాచారం హిందూ సమాజంలో ఆందోళన రేపింది. సాధుసన్యాసులు, ధర్మాచార్యులు, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రేరణతో సామాజిక, సాంస్కృతిక సంస్థలలో పనిచేసే కార్యకర్తలు, ఆ సంస్థల అధినేతలు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ద్వితీయ సర్‌సంఘచాలక్‌ పరమపూజనీయ శ్రీ గురూజీ పర్యటనలలో ఈ భయాన్నీ, ఆందోళననీ వ్యక్తం చేసేవారు. దరిమిలా ఈ విషయం మీద ప్రముఖ ధర్మాచార్యులందరినీ కలవడానికి గురూజీ ఒక సంఘ ప్రచారక్‌ను నియమించారు. ఆయన శివశంకర్‌ ఆప్టే. పరిషత్‌ స్థాపనకు ఇదొక నేపథ్యం.

మరొకవైపు- భగవద్గీత ప్రవచనాల కోసం స్వామి చిన్మయానంద విదేశాలలో పర్యటించేవారు. ఆ పర్యటనలలో వారి దృష్టికి వచ్చిన విషయాన్ని గురూజీతో ప్రస్తావించారు. అది – అమెరికా, యూరప్‌ దేశాలలో స్థిరపడిన భారతీయ సంతతి హిందువులు తమ ధార్మిక, సాంస్కృతిక అవసరాలను స్వతంత్ర భారత ప్రభుత్వం తీరుస్తుందని ఎదురుచూస్తున్నారు. భారత ప్రభుత్వం పట్ల పెట్టుకున్న ఆశల గురించి అక్కడి పత్రికలో వ్యాసాల రూపంలో వారు తెలియచేశారు కూడా. అదే సమయంలో హిందూ మహాసభవారు కూడా విదేశాలలో ఉన్న హిందువుల సమస్యలను భారత ప్రభుత్వం, భారతీయులు పట్టించుకోవలసిన అవసరం ఉందని పత్రికలలో వ్యాసాలు రాశారు. అప్పుడే వెస్టిండిస్‌కు చెందిన భారత సంతతి ప్రముఖుడు కపిల్‌దేవ్‌ భారత పర్యటనకు వచ్చినపుడు అధికారులను కలసి ప్రవాసుల అవసరాల గురించి ప్రస్తావించారు. వారు ఉత్తరప్రదేశ్‌ నుంచి వెళ్లిన వారు. ఆయన చెప్పినవన్నీ, ధార్మికమైనవి. సంస్కృతికి సంబంధించినవి. ‘మేము వెళ్లేటప్పుడు భగవద్గీత, రామచరిత మానస్‌ పట్టుకు వెళ్లాం. పారాయణం చేస్తున్నాం. కానీ, గృహప్రవేశం, నామకరణోత్సవం ఇత్యాది కార్యక్రమాలకీ, ఉత్సవాలు, పూజలు, వ్రతాలకీ పురోహితుడు కావాలి. దేవాలయం నిర్మిస్తే పూజారి కావాలి. అంత్యక్రియలు జరిపించటానికి పురోహితుడు కావాలి. ఈ అవసరాలు తీర్చేందుకు సహకరించాలి’ అని అడిగారు. సరైన సమాధానం, స్పందన రాలేదు. దీనితో ఒక ఆఫీసర్‌ సలహా ఇచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘచాలక్‌ ఢిల్లీ వచ్చినపుడు మీరు వారిని కలవండి అన్నదే ఆ సలహా. దరిమిలా ఆయన గురూజీని కలసి విషయం చెప్పారు. వీహెచ్‌పీ స్థాపనకు ఇదీ ఓ కారణమే. దేశంలోనూ, విదేశాలలోనూ ఉన్న హిందువులందరి ధార్మిక, సామాజిక, సాంస్కృతికమైన అవసరాలు తీర్చే ఒక వేదిక కావాలి అనుకున్నారు. అంతిమంగా సాధుసన్యాసులందరినీ కలిసి ముంబయిలోని చిన్మయానందకు చెందిన సాందీపని ఆశ్రమంలో ఆగస్ట్‌ 29, 30 తేదీలలో రెండురోజులు జరిగిన జన్మాష్టమి కార్యక్రమంలో వీహెచ్‌పీకి శ్రీకారం చుట్టారు.

1964 – 2024.. ఈ ఆరు దశాబ్దాల ప్రయాణం ఎలా సాగింది? సంస్థ నిర్మాణం ఎలా ఉంటుంది?

మొట్టమొదటగా చిన్మయానంద సంస్థాపక అధ్యక్షుడిగా, శివశంకర్‌ ఆప్టే ప్రధాన కార్యదర్శిగా విశ్వహిందూపరిషత్‌ ఆవిర్భవించింది. హైందవ ధార్మికమైన స్పృహను, జాతీయ భావాన్ని, దేశభక్తిని హిందువులలో పెంపొందించాలని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రయత్నిస్తున్న సంస్థ వీహెచ్‌పీ. ప్రారంభంలోనే విశ్వహిందూ సమ్మేళనం పేరుతో ప్రయాగ కుంభమేళ సమయంలో విశ్వహిందూ సమ్మేళనాలు నిర్వహించింది. 1966లో సంస్థను రిజిష్ట్రర్‌ చేశారు. రిజిష్ట్రరయిన సంస్థకు మొదటి అధ్యక్షుడు మైసూర్‌ మహారాజు జై చామరాజ్‌ వడయార్‌. నేను హిందువును, హిందూ ధర్మానికి అనుగుణంగా, సంస్కృతికి అనుగుణంగా నేను జీవించాలి. హిందువుగా జీవించాలి. ధర్మాన్ని ప్రచారం చేయాలి, సంస్కృతిని ప్రచారం చేయాలి. హిందూ సమాజాన్ని సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో రకరకాలైన కార్యక్రమాలతో వీహెచ్‌పీ 60 ఏళ్లుగా పురోగమిస్తున్నది. దాదాపుగా భారతదేశంలోని అన్ని జిల్లాల్లో కూడా, 95 శాతం, 98 శాతం క్రైస్తవులు ఉన్నటువంటి జిల్లాలు తప్పిస్తే వీహెచ్‌పీ శాఖలు, సమితులు ఏర్పడినాయి. అలాగే జిల్లా స్థాయి నుండి ప్రఖండ స్థాయివరకు కార్యపద్ధతిని ఏర్పరుచుకున్న సంస్థ ఇది. లక్ష జనాభాకు ప్రఖంఢ సమితి ఉంది. క్రమపద్ధతిలో సమితి ద్వారా విశ్వహిందూ పరిషత్‌ గ్రామగ్రామాన ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. సత్సంగ్‌ ప్రధాన కార్యక్రమం. హిందువులందరు ఒక చోట కలసి ధర్మం, సంస్కృతి, అవసరాలు, సమస్యలు, ఎదుర్కోవలసిన విషయాలు చర్చించడమే సత్సంగ్‌. తర్వాత గోరక్షణ, రామసేతు రక్షణ, కాశీ, మధుర విముక్తి ఉద్యమాల గురించి కూడా చర్చిస్తూ ఉంటారు. మతమార్పిడులను నిరోధించడం, మారిన హిందువులను తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకు రావడం ఇట్లా 12 రకాల అయామ్‌ల మాధ్యమంగా విశ్వహిందూపరిషత్‌ దిన దిన ప్రవర్ధమానంగా పనిచేస్తూ ఉంది.

విశ్వహిందూ పరిషత్‌ను స్థాపించినపుడు ఒక నినాదం ఉంది. ఇస్లాం, క్రైస్తవం, కమ్యూనిజం ఈ మూడిరటి నుంచి భారతీయ సమాజాన్ని రక్షించాలి. అందులో కమ్యూనిజం దాదాపు ముగిసిన అధ్యాయం. మిగతా రెండు, అంటే ఇస్లాం, మొగలు పాలన కంటే లేకపోతే బానిసరాజుల పాలనకంటే ఎక్కువ ప్రమాదకరంగా ఈ రోజున ఉంది. బ్రిటిష్‌ పాలన కంటే ఎక్కువగా క్రైస్తవం ఈ దేశంలో ఈ రోజున ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ రెండిరటిని మీరు ఎట్లా చూస్తున్నారు? నివారణకు ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు?

ఇస్లాం, క్రైస్తవాలు విజృంభించి దూకుడు ప్రదర్శిస్తూ ఉండడానికి కారణం మన ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు. సెక్యులరిజం నినాదంతో ముందుకు వెళ్లడమూ ప్రధానమైన కారణంగా మేము భావిస్తున్నాం. చట్టాలు సమర్థంగా ఉన్నాయి. కానీ చట్టాలకు భాష్యం చెప్పడం దగ్గరే చిక్కు. ఓ సందిగ్ధ పరిస్థితి. చాలా వాటికి ఇతమిత్ధమైన నిర్వచనాలు లేవు. రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం సంతృష్టీకరణను అవలంబించడం మరొకటి. దీనితో రాడికలైజేషన్‌ పద్ధతిలో ఇస్లాం, క్రైస్తవం పెరుగుతున్నాయి అన్నదే వీహెచ్‌పీ దృష్టి.

ఆర్‌ఎస్‌ఎస్‌ 1964కే ఒక బలీయ శక్తి. అయితే విశ్వహిందూపరిషత్‌ స్థాపన అనేది ఆర్‌ఎస్‌ఎస్‌ స్పృషించలేని మరొక కోణాన్ని సాధించడానికా?

ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తి నిర్మాణ సంస్థ. అక్కడ సంస్కా రాలనీ, అనుభవాన్నీ సంపాదించిన కార్యకర్తలని వివిధ రంగాలలో పనిచేయడానికి ప్రోత్సహిస్తుంది. అలాగే ధార్మికరంగ అవసరాలను దృష్టిలో పెట్టుకొని, అభిరుచి ఉన్న కార్యకర్తలను ధార్మికరంగానికి పంపించి పనిచేయమని ప్రోత్సహించే పద్ధతి, వ్యవస్థ ఆర్‌ఎస్‌ఎస్‌. ధార్మికరంగం మాత్రమే కాకుండా అన్ని రంగాలకి ఈ రకమైన పద్ధతిలో కార్యకర్తలనిచ్చి ప్రోత్సహించడమే సంఘం పని. అలా వెళ్లిన కార్యకర్తలే వీహెచ్‌పీలో పనిచేస్తున్నారు.

మొత్తం హిందూసమాజాన్ని పునరుద్ధరించ డానికి కొన్ని ఉద్యమాలను వీహెచ్‌పీ తీసుకున్నది.  అవి విజయవంతమయ్యాయి. ఏకాత్మతా యజ్ఞం దగ్గర నుంచి పలు ఉద్యమాలు ఉన్నాయి.  వీటికి స్ఫూర్తి ఏమిటి?

స్వతంత్ర భారతదేశ చరిత్రలో 1980, 1981 ప్రాంతంలో హిందూ సమాజ నడతని ప్రభావ వంతమైన దిశవైపు సాగించిన ఘటన తమిళనాడులో జరిగింది. మీనాక్షిపురం అనే గ్రామంలో హిందువు లందరినీ, అంటే యావత్‌ గ్రామాన్ని రాత్రికిరాత్రి మహమ్మదీయులుగా మార్చి, మీనాక్షిపురం పేరును రహమత్‌నగర్‌ మార్చిన ఘటన అదే. యావత్‌ భారతదేశ హిందువులను, ప్రభుత్వాలను కూడా కదిలించివేసింది. నాటి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ కూడా విస్తుపోయి కంచి కామకోటి పీఠాధిపతినీ, పెజావర్‌ స్వామినీ సంప్రదించారు. ఇలాంటి భయానక, దారుణ పరిణామాల నుంచి దేశాన్ని రక్షించుకోవలసిన అవసరం ఉంటుంది, ఆలోచించండి అన్న పద్ధతిలో సలహా తీసుకున్నారనేది ఆ రోజుల్లో చెప్పుకున్న మాట. ఆ మేరకు కంచి కామకోటి పీఠాధిపతులు పరమాచార్య, విశ్వేశ్వ తీర్థులు, వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అందరం ఆరునెలలు తిరిగి, ఆ గ్రామస్థులందరికి నచ్చచెప్పి, ఇస్లాంలో ఉండే ఇబ్బందులు, పరిణామాల గురించి వివరించి వాళ్లందరిని తిరిగి హిందువులుగా మార్చిన సంఘటన. అయితే వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ ఘటన వరకే ఆలోచించలేదు. ఇది స్థానిక సమస్య కాదు, కాబట్టి ఇలాంటివి జరగకుండా దేశవ్యాప్తంగా ఒక స్పృహను నిర్మాణం చేయాలని జనజాగృతి కార్యక్ర మాన్ని ప్రారంభించారు. సంస్కృతి రక్షా యోజన పేరుతో హిందువులందరినీ చైతన్యపరచడం, మీనాక్షిపురం సంఘటన ఆధారంగా భవిష్యత్తులో ఏ రకమైన పరిస్థితులు హిందూ సమాజం ఎదుర్కొవలసిన అవసరం ఉంటుందన్న పద్ధతిలో ఆలోచించి ఒక కార్యక్రమాన్ని యోజన చేశారు. అది ఏకాత్మతా యజ్ఞం. భారతమాత, గంగామాత రథాలతో దేశవ్యాప్త యాత్ర. కశ్మీరు నుంచి కన్యా కుమారి వరకు, ఇటువైపు అరుణాచల్‌ప్రదేశ్‌ నుంచి గుజరాత్‌ వరకు సాగిన బ్రహ్మాండమైన రథయాత్ర. దాదాపుగా 6,7 కోట్ల మంది హిందువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతమాత విగ్రహంతో, గంగాజలంతో ఉపరథం, ఉపయాత్రలు. ముఖ్యమై నవి మూడు యాత్రలు. ప్రతి మండలం నుంచి ఉప యాత్రలు కలిసే విధంగా యాత్రలు. దేశంలో కోట్లాది మంది ఈ రథాన్ని దర్శించాలి, గంగాజలాన్ని స్వీకరిం చాలి అనుకుని 12,18,20 గంటలు ఆలస్యం అయినప్పటికీ ప్రతి గ్రామంలో వేచి ఉండేవారు.

అయోధ్య ఉద్యమం భారతదేశ చరిత్రలోనే అసాధారణమైనది. అదెలా సాధ్యమైంది?

ఏకాత్మతా యజ్ఞం తరువాత వీహెచ్‌పీ చేపట్టిన పెద్ద ఉద్యమం అయోధ్య ఉద్యమం. 1984లో శ్రీరామ జన్మభూమి ఉద్యమాన్ని సాధుసన్యాసు లందరు వీహెచ్‌పీకి అప్పగించారు. ఢిల్లీలోని విజ్ఞాన భవనంలో ధర్మాచార్యుల సదస్సు పేరుతో మొదటి ధర్మసంసద్‌ (ధర్మాచార్యుల సమావేశం)జరిగింది. వీహెచ్‌పీకి మార్గదర్శనం చేసేందుకు మొదట్లోనే మార్గదర్శక్‌ మండలి ఏర్పాటు చేశారు. ఈ మండలిలో హిందూధర్మంలోని అన్ని సంప్రదాయాల ధర్మాచార్యులు సదస్యులుగా ఉంటారు. ఢిల్లీలో జరిగిన ధర్మాచార్యుల మొదటి ధర్మసంసద్‌లో దేశం మొత్తం నుంచి దాదాపు 10వేల మంది సాధు సన్యాసులు పాల్గొన్నారు. వాళ్లందరు కలసి రామ జన్మభూమి, కృష్ణ జన్మస్థానం, కాశీ విశ్వేశ్వర మందిరం` ఈ మూడిరటిని విముక్తి చేసి హిందూ సమాజం మీద విదేశీ ఆక్రమణకారుల మిగిల్చిన కళంకాన్ని తుడిచివేసే బాధ్యతను వీహెచ్‌పీకి అప్పగించారు. దరిమిలా ముందుగా రామ జన్మభూమి కార్యక్రమం ప్రారభించారు. 1984 నుంచి 2020 లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ వచ్చేంతవరకు రామజన్మభూమి ఉద్యమాన్ని వీహెచ్‌పీ నిర్వహించింది. రాష్ట్రపతికి, ప్రధానికి ఉత్తరాలు రాసే కార్యక్రమం, రాస్తా రోకో, అయోధ్యలో కార్యక్రమాలు పరిషత్‌ నిర్వహించింది. శిలాపూజ కార్యక్రమంలో పన్నెండున్నర లక్షల శిలలను గ్రామగ్రామాన పూజించి అయోధ్యకు చేర్చారు.రామజ్యోతి యాత్ర, రామజానకీ రథయాత్ర కూడా జరిగాయి. భిన్నమైన టువంటి కార్యక్రమాల ద్వారా దేశంమొత్తంలోని హిందువులలో ఒక నవచైతన్యాన్ని రామజన్మభూమిని పొందాలి, ఇది మనది, మనం హిందువులం, మనకు ఆదర్శమూర్తి, మర్యాదపురుషోత్తముడు రామజన్మ భూమి మనదే అనే భావనను కలిగించి, మొదటి కరసేవ నిషేధించినప్పటికీ ఉత్తరప్రదేశ్‌ మొత్తాన్ని కూడా అష్టదిగ్బంధనం చేశానని ములాయంసింగ్‌ ప్రకటించినప్పటికీ 7, 8 వందల కిలోమీటర్లు కాలినడకన వచ్చిన కరసేవకులను ఉత్తరప్రదేశ్‌ ప్రజలు సాదరంగా ఆహ్వానించి, సేవలు చేసి, అయోధ్యకు జేర్చి, మొదటి కరసేవను విజయవంతం చేశారు. అక్టోబర్‌ 30, 1990 కరసేవ తరువాత, నవంబర్‌ 2వ తేదీ అయోధ్య పురవీధులలో లక్షలాది కరసేవకులు వీధుల్లో కూర్చొని, నిరాయుధులై రామనామ సంకీర్తన చేస్తున్నటువంటి సమయంలో ములాయంసింగ్‌ కాల్పులు జరిపించడం, దాదాపు 450కి పైగా కరసేవకులు, సాధువులు, సన్యాసులు మరణించడం, ఆ దరిమిలా రెండవ కరసేవ కల్యాణసింగ్‌ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో (డిసెంబర్‌ 6,1992) వివాదస్పద కట్టడం ధ్వంసమైంది. జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు రామజన్మభూమికి సంబంధించినటువంటి న్యాయ ప్రక్రియను పూర్తిచేసుకొని చట్టబద్ధంగా రామజన్మ భూమిలో రామమందిరాన్ని నిర్మాణం చేసుకోనే స్థితికి విజయవంతమైన పద్ధతిలో సాధుసన్యాసుల మార్గదర్శనంలో, నేతృత్వంలో వీహెచ్‌పీ ఈ కార్యక్రమాన్ని సాగించింది.


సత్య రథయాత్రలు జరిపారు. అది ఒక ప్రాంతంలోనిదే అయినా చాలా విజయవంతమైంది. అట్లాంటివి మిగతా రాష్ట్రాలలో ఏమైనా జరిగాయా?

సత్య రథయాత్ర దళితులు నివసించే గ్రామాలు, బస్తీలకి ఉద్దేశించిన యాత్ర. సమరసతా సాధన దిశగా వీహెచ్‌పీ చేసిన ఒక ప్రయత్నం. గ్రామ గ్రామాన, పట్టణాల్లోనూ హరిజనవాడలోకి దేవుడిని తీసుకెళ్లే సంకల్పంతో అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం ముందు ఈ ప్రతిపాదన ఉంచినపుడు, వారు విగ్రహాన్ని ఇచ్చారు. ఇప్పుడు కూడా కొన్ని రథాలు తిరుగుతున్నాయి. గో రథయాత్ర అందులో ఒకటి. అలాగే రాజస్థాన్‌లో. దాదాపుగా ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక రథం హరిజనవాడలోకి వెళ్లడం, రథంతోపాటు సాధుసన్యాసులు వెళ్లి ప్రవచనాలు చెప్పడం, ధర్మం గురించి, లవ్‌జిహాద్‌ గురించి, మతమార్పిడులు గురించి, చిన్నతనం నుంచి పిల్లలకు సంస్కారాలు ఇచ్చి, ఈ రకంగా హిందూ ధర్మం, సంస్కృతికి సంబంధించినటు వంటి ఆచరించవలసిన బాధ్యత, రక్షించుకోవలసిన బాధ్యత గురించి ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం ఈ రథయాత్రల ద్వారా వీహెచ్‌పీ నిరంతరం చేస్తూనే ఉంది.


రామసేతు, గోరక్షణ ఉద్యమాలు కూడా వీహెచ్‌పీ ధర్మ రక్షణ ఆశయానికి, చరిత్రకు వన్నె తెచ్చాయి. వాటిని ఎలా గుర్తుంచుకుంటారు?

2006-07 నాటి ఉద్యమం రామసేతు రక్షణోద్యమం. డీఎంకే ప్రభుత్వం కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం రామేశ్వరం దగ్గరి రామసేతువును ఛేదించి ఓడలు రావడానికి, పోవడానికి దగ్గరగా ఉంటుందన్న వాదనతో రాములవారు నిర్మాణం చేసిన సేతువును, పదిహేడున్నర లక్షల సంవత్సరాల క్రితం ఉందని నాసా వారు చెపుతున్న రామసేతువును పగలగొట్టేందుకు ప్రయత్నించినపుడు వీహెచ్‌పీ ఉద్యమాలు, కార్యక్రమాలు చేపట్టింది. సముద్రతీరం నుంచి, సేతువు పరిసరాల నుంచి తేలే రాళ్లను సేకరించి ప్రతి ఒక్క జిల్లాకి పంపించి రామసేతు సంరక్షణ ఉద్యమాన్ని నిర్వహించాం. 50 లక్షల మందితో 2007వ సంవత్సరంలో ఢిల్లీలో ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీ స్తంభించిపోయింది. దరిమిలా సుప్రీంకోర్టు కూడా, సేతువును ఛేదించే విషయం వదిలేయండి, మరొక చోటు చూసుకోండి అని తీర్పు ఇచ్చింది.

 బక్రీద్‌కు లక్షలాది గోవులను వధిస్తారు. గోవు మన సర్వదేవతా స్వరూపం, దీనిని పూజించాలి. రకరకాల కార్యక్రమాల ద్వారా గోవు పట్ల శ్రద్ధను పెంచడం, ప్రతి రైతు ఇంట్ల గోవును పెంచుకొనేటట్లు ప్రోత్సహించడం, వీహెచ్‌పీ బజరంగదళ్‌ ద్వారా, గోరక్షా విభాగం ద్వారా బక్రీద్‌ నాటి వధకు గోవులను తరలించకుండా నిరోధించే పని ప్రారంభించడం జరుగుతున్నాయి. గోరక్షా ఉద్యమంలో దాదాపు ఇప్పటివరకు 300కు పౖగా వీహెచ్‌పీ, బజరంగదళ్‌ కార్యకర్తలు గోవులను తస్కరించే వాళ్ల చేతులలో మరణించారు కూడా.

మీనాక్షిపురం స్వతంత్ర భారతదేశంలో మతాంతరీకరణలకు సంబంధించి ఒక ఆందోళన కరమైన వాతావరణాన్ని, వాస్తవాన్ని గుర్తించేటట్లు చేసింది. అలాంటి మీనాక్షిపురాలు ఇపుడు భారత దేశంలో ప్రధానంగా పశ్చిమబెంగాల్‌లో కావచ్చు, హిందుత్వ భావన బలంగా ఉన్నట్టు చెప్పే ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతం కావచ్చు, కర్ణాటక కావచ్చు, చిన్న చిన్న మీనాక్షిపురాలు ఈరోజు కనిపిస్తున్నాయన్న వాదన ఉంది. దానిమీద ప్రభుత్వాలు ఏం చేయాలి, విశ్వహిందూపరిషత్‌ ఏ సలహా ఇస్తుంది?

బెంగాల్‌లో మీనాక్షిపురం స్థాయిలో జరుగుతు న్నదని నేను అనుకోను. పత్రికల ద్వారా, వీహెచ్‌పీ యంత్రాంగం ద్వారా అలాంటి సమాచారం లేదు. కానీ, మహమ్మదీయుల దూకుడు దేశవ్యాప్తంగా తీవ్రమైన సంగతి మనందరి అనుభవమే. దీంట్లో కీలక అంశం రాజకీయమైనది. ప్రభుత్వాల మద్దతు అంశం కూడా కీలకమే. సాధారణంగా మన హైదరాబాద్‌లోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణా లోనూ అనుభవాలను చూసినట్లయితే దేశం మొత్తంలో ఈ రాజకీయ పార్టీల వల్ల, ప్రభుత్వాలవల్ల, కొన్ని చట్టాల వల్ల కూడా హిందువుల సరిహద్దులు కుంచించుకుపోతున్నాయి. మహమ్మదీయులకు పెరిగిపోతున్నాయి. ఫలితంగా మహమ్మదీయులు గణనీయంగా ఉన్నచోట హిందువుల నిత్య జీవితం భయానకమైన పరిస్థితిలో పడిన అనుభవాలు దేశం మొత్తంలోనూ కనిపిస్తాయి. కొన్ని ప్రభుత్వాలు నిర్దిష్టంగా చర్యలు తీసుకున్న కారణంగా అక్కడ వారి దూకుడు కనిపించకపోయినప్పటికీ లోలోపల జరుగుతున్నట్లు అనుమానం కలుగుతున్నది. విదేశీ మద్దతు, రాజకీయ పార్టీల మద్దతు, ప్రభుత్వాల మద్దతు, సెక్యులరిస్టుల మద్దతు.. వీటన్నింటి కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిరది. కాబట్టి ప్రభుత్వాలు మతమార్పిడులకు సంబంధించిన చట్టాలు పటిష్టం చేయాలి. హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ ఆ ప్రయత్నాలు జరిగాయి. చట్టాలలో ఇలాంటి మార్పు కోసం వీహెచ్‌పీ తన వంతు ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది.

భారతీయ సమాజాన్ని చీల్చడానికి విదేశీ శక్తులు, ఉదారవాదులు, ఇక్కడి రాజకీయ నాయకులు ఉపయోగించుకున్నది కులవ్యవస్థ. అంతకంటే పెద్ద సమస్య అంటరానితనం. ఈ రెండిరటి నుంచి హిందూధర్మానికి చిరకాలంగా ఉన్న బెడదను తప్పించేందుకు వీహెచ్‌పీ చేస్తున్న కృషి ఎంతవరకు విజయం సాధించింది?

గ్రామాలలో దేవాలయ ప్రవేశం, మంచినీటి బావి దగ్గర సమస్యలు వస్తే పరిష్కరించ గలిగిన స్థితిలో వీహెచ్‌పీ ఉన్నది. రెండు వర్గాలకు నచ్చచెప్పి, మనమందరం హిందువులం, ఐక్యంగా ఉండాలనే భావనతో నచ్చచెప్పి ఫలితాలు సాధించిన అనేక సంఘటనలు అనుభవంలో ఉన్నాయి. ప్రభుత్వా వర్గాలకీ, పోలీసులకీ కూడా సాధ్యంకాని చోట వీహెచ్‌పీ వారిని పిలిస్తే మంచిది అన్న సందర్భాలు తెలంగాణలో నేను క్షేత్ర సంఘటనా కార్యదర్శిగా ఉన్నప్పుడు వచ్చాయి. నా అభిప్రాయంలో కుల వ్యవస్థ అనే దురభిమానం లేదా ఈ అసంబద్ధతను ప్రోత్సహిస్తున్నది రాజకీయాలు. ఎన్నికలలో టిక్కెట్టివ్వడం దగ్గరి నుంచి దానిని రాజకీయ పార్టీలు ప్రోత్సహిస్తున్నాయని వీహెచ్‌పీ భావిస్తోంది.

ఆ కోణం నుంచి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల ప్రభావం హిందూ సమాజం మీద పడకుండా ధార్మిక చైతన్యాన్ని, సామాజిక చైతన్యాన్ని, సమరసతా భావాన్ని పెంపొందించే పనిని వీహెచ్‌పీ నిర్వహిస్తోంది. ఆ దిశలోనే ముందుకు వెళుతుంది. సఫలత మాత్రం కొద్ది శాతమే. కారణం రాజకీయ పార్టీలే. హోటల్‌లో తినడానికి, సినిమా చూడటానికి అంటరా నితనం లేదు. ఇతర కార్యక్రమాలలో పాల్గొనడానికీ అడ్డురాదు. బస్సుల్లో, రైళ్లలో అంటరానితనం ఏదీ? ఊర్లోకి వచ్చేసరికి అంటరానితనం ఉంది. అలాగే రాజకీయాల్లోనే ఉంది.

దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన పార్టీ విధానం సంతుష్టీకరణ. దీనితో హిందూ సమాజానికి అపారమైన చేటు జరిగింది. ఇప్పుడు అంతర్జాతీయ కుట్ర జరుగుతోంది. ఇందుకు స్పష్టమైన రుజువులు ఉన్నాయి. దీని వెనుక ఉన్నవాడిగా జార్జి సోరెస్‌ను చెబుతారు. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో హిందూ ధర్మాన్ని పెకలించివేయాలంటూ సదస్సునే నిర్వహించారు. దీనికి మూలం ఏమిటి? వీహెచ్‌పీ ఎట్లా స్పందించింది?

ప్రపంచంలో ఏ దేశం కూడా మరొక దేశం ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా బలపడు తుందంటే సహించలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ వందేళ్ల కృషి, సంఘ పరివార సంస్థలు- ప్రత్యేకించి వీహెచ్‌పీ 60 ఏళ్ల కృషి, దాదాపుగా 30 నుంచి 40 వరకు సంఘ పరివార సంస్థల నిరంతరమైన కృషి కారణంగా హిందూ సమాజంలో, భారతదేశంలో ఒక సామాజిక, ధార్మిక, సాంస్కృతిక చైతన్యం నిర్మాణమయింది. ఫలితంగా హిందూ అనుకూల వాతావరణం నిర్మాణ మైంది. దేశం స్వయంసమృద్ధమవుతున్నది. ఇతర దేశాల మీద ఆధారపడ్డ స్థితి నుంచి బయటపడి ఇతర దేశాలకు సహాయపడే స్థితికి ఎదుగుతున్నది. ఆర్థికశక్తిగా ఎదిగింది. అగ్రరాజ్యాల నుంచి, మన ఇరుగు పొరుగు దేశాల వరకు ఈ ప్రస్థానం వెనుక ఉన్నది సంఘం, సంఘపరివార్‌ అనే భావనకు వచ్చాయి. కాబట్టి సంఘ పరివార్‌ సిద్ధాంతానికి  అనుగుణమైన పద్ధతిలో నడిచే ప్రభుత్వాలు కేంద్రం లోనూ, అనేక రాష్ట్రాల్లోనూ ఉండడమే ప్రపంచానికి కళ్లల్లో నిప్పులు పోసుకునే స్థితి ఏర్పడిరది. సహజంగానే వాళ్లు మూలాలను భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తారు. భారతదేశంలో ఉన్న అనేక రాజకీయ పార్టీలు వారికి మద్దతు పలుకుతున్నాయి.

దేశ మూలశక్తి హిందూ శక్తి. వెయ్యి సంవత్స రాలపాటు నిరంతర పోరాటం చేయగలిగే శక్తిని ప్రసాదించిన సంస్కృతి, హిందూ సంస్కృతి, హిందూ జీవన వ్యవస్థ. వెయ్యేళ్లూ కలసి పోరాడలేదు. కానీ పోరాటాన్ని వదలలేదు. నిరంతరంగా పోరాడుతూ, ధర్మాన్ని, సంస్కృతిని యథాతథంగా కాపాడుకో గలిగినది హైందవ జాతి. ఈ జాతి హిందుత్వం పేరుతో ఏకమవుతుంటే సహించలేకే దీన్ని భంగం చేయాలి, భగ్నం చేయాలన్న ప్రయత్నం సాగుతున్నది.

ప్రపంచ చరిత్ర చూస్తే, రోమన్‌, గ్రీక్‌, పర్షియన్‌ సామ్రాజ్యాలు ఆక్రమణలతో నేలమట్టమయ్యాయి. మహమ్మదీయుల ఆక్రమణలో లేదా క్రుసేడులలో ఆయా జాతుల వారు మహమ్మదీయులుగా, క్రైస్తవులుగా మారిపోయారు. హిందూ జాతి అలా కాలేదు. వెయ్యి సంవత్సరాలుగా నిలబడిరది. పోరాడి స్వాతంత్య్రం పొందింది. స్వతంత్రం పొందిన తరువాత జాతీయ భావన, జాతీయ సమైక్యత అవసరాన్ని గుర్తించే విధంగా పరిపాలకులు పరిపాలన చేయని కారణంచేత ఈ స్థితి సంభవిం చింది. సంఘ పరివార్‌ ఆ తప్పును సరిచేస్తోంది. దీన్ని తట్టుకోగలిగిన రాజకీయయంత్రాంగాన్ని, రాజనీతిని హిందువులందరి ఐక్యమత్యాన్ని రక్షించడమే వీహెచ్‌పీ, సంఘపరివారం ఉద్దేశం.

వీహెచ్‌పీ విశ్వవ్యాప్తంగా హిందువులను ఐక్య చేసే ఉద్దేశంతో ఏర్పడిరది కదా! ఆ కృషి ఎలా ఉంది?

సుమారు 60 దేశాలలో పనిచేస్తోంది. 22 దేశాలలో విశ్వహిందూపరిషత్‌ ఆఫ్‌ అమెరికా, విశ్వహిందూపరిషత్‌ ఆఫ్‌ జర్మనీ, విశ్వహిందూ పరిషత్‌ ఆఫ్‌ యునైటెడ్‌ కింగడమ్‌, విశ్వహిందూ పరిషత్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా.. ఈ రకంగా న్యూజిలాండ్‌, కరేబియన్‌ కంట్రీస్‌, సూరినామ్‌, విశ్వహిందూపరిషత్‌ ఆఫ్‌ బంగ్లాదేశ్‌, విశ్వహిందూపరిషత్‌ ఆఫ్‌ నేపాల్‌ రిజిష్ట్రర్డ్‌ బాడీగా అక్కడి హిందువులకి ధార్మిక, సాంస్కృతిక అవసరాలు తీర్చే విధంగా పనిచేస్తోంది.

ఆస్ట్రేలియాలో ఒక యూనివర్సిటీని (విశ్వహిందూ) కూడా వీహెచ్‌పీ నిర్వహిస్తున్నది. అక్కడ హిందువులను, హిందూ సంస్కృతిని అవమానించే సంఘటనలు జరుగుతున్నప్పుడు తప్పక స్పందిస్తుంది. ఉదాహరణకు చెప్పుల మీద, టాయిలెట్‌ షీట్స్‌ మీద దేవుళ్ల బొమ్మలు వేసినపుడు ఆందోళన చేసి క్షమాపణ చెప్పించింది. ఆస్ట్రేలియాలో స్వస్తిక్‌ను నిషేధించినపుడు వీహెచ్‌పపీ న్యాయ పోరాటం చేసింది. హిందువుల స్వస్తిక్‌ వేరు, నాజీల స్వస్తిక్‌ వేరు అని కోర్టును, పార్లమెంటును ఒప్పించి నిషేధం తొలగించింది. విశ్వహిందూ పరిషత్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా కార్యక్రమాలకు ఆ దేశ ప్రధాని తరచు వస్తూంటారు.

వీహెచ్‌పీ స్థాపన, వికాసాలలో మహామహులు పనిచేశారు. చిన్మయానంద, ఎస్‌.ఎస్‌.ఆప్టే, రామస్వామి అయ్యర్‌, కె.ఎమ్‌.మున్షీ.. మహామహు లందరూ పనిచేశారు. ఆ తరువాత అశోక్‌ సింఘాల్‌ తదితరులు. వీరి విశిష్ట సేవ గురించి నాలుగు మాటలు.

వీహెచ్‌పీ దినదిన ప్రవర్ధమానవుతున్న సంస్థ. అందరి తపస్సు ఇందులో ఉంది. ప్రత్యేకించి రెండు విషయాలు చెప్పుకోవచ్చు. ఒకరు బాగా పనిచేశారు, మరొకరి కాలంలో తక్కువ కృషి జరిగింది వంటి తులనాత్మకమైన రీతిలో కాకుండా ఫలితమేదో చెప్పుకోవాలంటే మహారాణా భాగవత్‌సింగ్‌ గురించి చెప్పుకోవాలి. ఆయన వీహెచ్‌పీ అధ్యక్షులుగా పని చేశారు. ఉదయపూరు మహారాణా. వారు అధ్యక్షులుగా ఉన్న సమయంలో అజ్మీర్‌ చుట్టుప్రక్కల గ్రామాలలో మతం మారిన వారిని పరిషత్‌ ధర్మప్రచార విభాగం తిరిగి హిందూధర్మంలోకి తీసుకొచ్చే ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. పాతిక సంవత్సరాలు కృషి చేసింది. పృథ్వీరాజ్‌ చౌహాన్‌ హత్య తరువాత రాజస్థాన్‌లో దాదాపుగా 70, 80 గ్రామాలలో వారి వంశస్థులైన క్షత్రియులందరినీ మహమ్మదీయులుగా మార్చారు. పృథ్వీరాజ్‌ జన్మదినోత్సవం, బలిదాన దినోత్సవం, జీవితచరిత్రను, పరిపాలనా విధానాన్ని 16 ఎం.ఎం ఫిలిం ద్వారా ఊరూరా చూపిస్తూ, మనమంతా పృథ్వీరాజ్‌ అనుయాయులమన్న భావనను, హిందువులమనే భావనను తీసుకువచ్చి, మహమ్మదీయులుగా మారిన రెండు లక్షలమందిని ఒకేసారి హిందూధర్మంలోకి పరావర్తనం చేసిన ఘట్టం మరువలేనిది. మేము హిందువులమే, హిందుత్వంలోకి మళ్లీ వస్తాం. కానీ మా మగపిల్లలకు, మీ ఆడపిల్లలను ఇస్తారా, మాతోపాటు కలసి పంక్తి భోజనం చేస్తారా, శతాబ్దాల నుంచి ముస్లింలుగా ఉన్నాం కదా అన్నారు వారు మొదట. మహారాణా భాగవత్‌సింగ్‌ రాజస్థాన్‌ రాజ వంశాలనందరినీ పిలిచారు. పరిస్థితిని వివరించారు. కశ్మీరీ పండిత్‌లను మహమ్మ దీయులుగా మార్చారు. పరిస్థితి చక్కబడ్డాక హిందూధర్మంలోకి వస్తామన్నారు. రాజు సిద్ధంగా ఉన్నాడు, పురోహితులు అంగీకరించలేదు. కాలాపహడ్‌ విషయంలో పూరీ పండితులూ అలాగే చేశారు. మహమ్మదీయునిగా ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు కాలాపహడ్‌. ఈ విషయాలన్నీ వివరించి చెప్పి వాళ్లందరి అనుమతి తోటి, వాళ్లందరి సమక్షంలో మళ్లీ రాణా హయాంలో వెనక్కి తీసుకువచ్చారు. వీహెచ్‌పీకి పేరు ప్రఖ్యాతలు శ్రీ రామజన్మభూమి ఉద్యమం ద్వారా విశేషంగా వచ్చాయి. అప్పుడు నేతృత్వం వహించినవారు అశోక్‌ సింఘాల్‌. అయితే ఆ విజయం ఆయన కారణంగానే దక్కిందని కాదు, సాధుసన్యాసులందరి ఆశీర్వచనంతో దక్కింది. విశాఖపట్టణంలో వీహెచ్‌పీ ప్రాంత సమావేశం జరుగుతుంటే అశోక్‌సింఘల్‌ గారి గూర్చి దీర్ఘ పరిచయం చేశారు. సాధించిన విజయాలకు నేను లేదా విశ్వహిందూపరిషత్‌ కారణంగాదు. యావత్‌ హిందూ సమాజం కారణం. యావత్తు హిందూ సమాజం ఒకటిగా నిలబడిరది కాబట్టి సాధ్యమైంది. సాధుసన్యాసుల అనుగ్రహంతో సాధ్యమైంది అని సింఘల్‌జీ తన ఉపన్యాసంలో చెప్పారు. మానవీయ శక్తికి ఆధ్యాత్మిక శక్తి తోడైంది కాబట్టి సాధించాం అన్నారు.

– జాగృతి డెస్క్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE