– సంబరాజు లీల (లట్టుపల్లి)

గీరా నొప్పులు పడుతున్నది. డాక్టరిచ్చిన మందుల వల్ల అవి అంతగా తెలియటం లేదు. కానీ మగతగా ఉంది. అప్పుడప్పుడు కళ్లు తెరిచి ఏవో అడిగి కళ్లు మూసుకుంటున్నది.

గీరా కాన్పు కోసం ఐదుగురు డాక్టర్లు, ఇద్దరు పిడియాట్రిషియన్లు, ఐదుగురు నర్స్‌లు, ఐదుగురు ఆయమ్మలు అక్కడ సేవలో ఉన్నారు. ఏం జరుగు తున్నదో గీరాకు తెలియటంలేదు.

నొప్పులు అంతకంతకు పెరిగి, మొదటి బిడ్డ బైట పడిరది. ఆడపిల్ల. ఆ వెనుకనే మరో ఆడపిల్ల. ఆ శిశువు రోదన విని, ఆ తల్లి కళ్లు తెరిచింది. కానీ ఏమీ తెలియలేదు. కేరుకేరుమనే రోదనలతో ఆ పురిటి గది ప్రతిధ్వనించింది.

మరుక్షణంలో ఆ పిల్లల్ని అందుకున్న నర్సులు, ఇద్దరు ఆయాలు వేరే గదిలోకి మాయమయ్యారు. అక్కడే బొడ్డు తాడు కత్తిరించి, బ్యాండేజి వేసి, వెచ్చటి గుడ్డతో రక్తపు మరకల్ని తుడిచేసి, వెయిట్‌, షుగర్‌, బీపీ చూసి ఇన్‌క్యూబేటర్‌లో పెట్టారు.

కొంతవరకు దిగంబరంగా ఉన్న ఆ దేహాలకు డైపర్స్‌ వేసి, తెల్లటి మెత్తని గుడ్డలతో చుట్టేశారు.

మరో పది నిమిషాల్లో, ఐదైదు నిమిషాల తేడాతో ఇద్దరు మగపిల్లలు పుట్టారు. కేరు కేరుమంటున్న ఆ బిడ్డల్ని తీసుకెళ్లి చేయాల్సిన సపర్యలన్నీ చేసి పడుకో బెట్టారు. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క బిడ్డనుంచారు.

గోడలే అడ్డాలుగా, దిగంతాల్ని తలపింపజేసే గోప్యం. గీరాను ఉంచిన ఆ లేబర్‌ రూమ్‌లో గీరా, వరద, గీరాను కంటికి రెప్పలా చూసుకున్న నర్స్‌ మాత్రమే ఉన్నారు. మిగిలిన వారంతా ఆ పరదా బైటనే, అవసరమైతే రావటానికి.

వచ్చినా, వాళ్లకు ఎలాంటి వివరాలు తెలియవు. అసలా తల్లి సరోగెేట్‌ అని కూడా తెలియదెవరికి!

పిడియాట్రీషియన్లు, పిల్లల ఆరోగ్యం పట్ల సంతృప్తిని వెలిబుచ్చారు. అవసరమైన మందులు వేశారు.

అప్పుడప్పుడు కేరుమంటున్న ఆ శిశువుల కేకలు, ఆ సౌండ్‌ ప్రూఫ్‌ గదిని దాటి వెళ్లటం లేదు. ఇంకా ఆ తల్లి దేహం కళ్లు తెరిచే స్థితికి రాలేదు. మగతగా ఉంది. నలుగురు బిడ్డలున్న ఆ గదులు, ఒకదాని కొకటి పోలిక లేనట్లుగా ఉన్నాయి. అంత పెద్ద ఆసుపత్రిలో అది ఏ నంబర్‌ గదో, ఏ వార్డులో ఉందో ఎవరికీి తెలవదు. తెలియకుండా దేనికదే వేరువేరుగా ఉన్నాయి

చూసుకోటానికి ప్రతి శిశువుకూ ఓ నర్స్‌ ఉంది.

కళ్లు, కాళ్లు, చెవులు, నోరు, చూపు, చేతులు, జననాంగాలు, వీపు, పొట్ట, జుట్టూ లాంటివి పరిశీ లించి ‘గుడ్‌’ ‘వెరీ గుడ్‌’ అనే రిమార్కులు రాశారు.

ముందుగా గాంధారి, సత్యవతి, రాష్ట్రాయ్‌, శంతన్‌ వచ్చారు. అందరూ స్టెరిలైజ్డ్‌ ఆసుపత్రి గుడ్డలు వేసుకుని, చెప్పులు బైట విడిచి, ఆ పాప గది లోపలికొచ్చారు.

ఆ పాపలో అచ్చం రాష్ట్రాయ్‌ పోలికలు కనిపించాయి. సత్యవతికి అదే విషయం చెప్పింది చిన్నగా. శంతన్‌, రాష్ట్రాయ్‌ పాప డీఎన్‌ఏ రిపోర్ట్సు చూశారు. తమ పాపెే. రిపోర్టులో గాంధారి, వ్యాస్‌ లక్షణాలు జన్యుపరంగా స్పష్టంగా ఉన్నాయి.

నిజమే, తమ ఇంటి వారసత్వం.

వ్యాస్‌, రాష్ట్రాయ్‌ లిద్దరూ తల్లి పోలికే! ఎందుకో తమ ఇంటి జన్యుపర లక్షణాలతో ఉన్న ఆ పసికందును చూస్తే చాలా ఆనందమనిపించింది వారికి.

రాష్ట్రాయ్‌ అతి జాగ్రత్తగా ఎత్తుకుని, గాంధారి చేతిని ఆ పాపపై వేశాడు. చాలా మెత్తగా, పత్తిలా సున్నితంగా ఉంది. అప్పుడు పొంగింది గాంధారిలోని ప్రేమ. మెల్లగా పైకి లేపి, గుండెలకు హత్తుకుంది. ఆమెలోని మాతృత్వం కరిగి పాపను చేరినట్లుగా పాప కదిలింది.

సిస్టర్‌ జాగ్రత్తగా అందుకుని ఉయ్యాల్లో పడుకోబెట్టింది. తేడా తెలిసిందేమో కెవ్వుమంది. సిస్టర్‌ పాలు పట్టి డైపర్‌ మార్చింది. కాలకృత్యాలు కూడా అయిపోగా, ఆ విషయం కేస్‌ షీట్‌లో రాసింది.

నలుగురూ బైటకొచ్చారు. వచ్చేటప్పుడున్న నిర్వేదం ఇప్పుడు వారిలో లేదు. మనసులు ఆనందంగా ఉన్నాయి.

  * * *  *

ఉష, అనిరుద్‌ ఆ మెసేజ్‌ చూసుకుని వచ్చారు.

డాక్టర్‌ వారిని తీసుకెళ్లి బాబును చూపించింది. అన్ని రకాల టెస్టు రిపోర్ట్సు, డీఎన్‌ఏ రిపోర్ట్సు చూశాడు అనిరుద్‌. ఉష మాత్రం అవేమీ పట్టించుకో కుండా వాడిని గుండెలకు హత్తుకుంది. వాడి స్పర్శ ఆమెలో పులకింతలు రేపి, పాలు ఊరినట్ల నిపించింది. తనలో మాతృభావన పెరిగిపోతుంటే వాడి గుప్పిళ్లు తెరిచి, బుగ్గమీద ముద్దుపెట్టు కుంది.

అది తనకిష్టమయినట్లుగా, అమ్మ చేతుల కమ్మదనం అందుకుంటున్నట్లుగా నిద్రపోయాడు. అనిరుద్‌ వెళ్లి మిగిలిన అమౌంట్‌ చెల్లించి వచ్చాడు. ఇద్దరూ ఆ చంటివాడిని తీసుకు వెళ్తామని చెప్పారు డాక్టర్‌తో.

‘‘ఓకే, అన్ని ఫార్మాలిటీసు ముగిశాయి కాబట్టి తీసుకెళ్లొచ్చు’’ చెప్పింది వరద.

 ఉష వెంటనే వాడి బ్యాగెేజీ అంతా సర్దింది ఆనందంగా. ఎందుకో వాడి ఉనికి, స్పర్శ ఆమెకు ఆనందాన్నిస్తున్నాయి.

‘వీడి వల్ల నా మనసులో తల్లితనపు ఆనందం పొంగుతున్నది. ఆ తృప్తి నాలో మాతృత్వం రేపుతున్నది. డాక్టర్‌గారి ప్రయోగం నిజమయితే, వీడికి మరో అనుబంధం దొరుకుతుంది. లేక… నా అదృష్టం బాగా లేకుంటే వీడే నా కంటి వెలుగు అవుతాడు’ అనుకుంది. అతి విలాసవంతమైన కారులో మెత్తటి అమ్మ ఒడిలో వాడి ప్రయాణం ప్రారంభమయింది.

ధనవంతులుండే ఆ కాలనీలో ఉష, అనిరుద్‌ ఇంట్లోకి వాడిని తెచ్చి ఎర్రనీళ్లు తిప్పిపోశారు. వాడికని కేటాయించిన గదిలో అపురూపంగా పడుకోబెట్టారు. ఎక్కడో పుట్టినా వాడి జీవితం ఉష ఒడి అనే పూలపడవలో సాగిపోవడం మొదలయింది.

  * * *  *

గీరా మగతగా కళ్లు తెరిచింది. పురిటిగదిలో కళ్లు మూసుకున్న గీరాకు దుస్తులు మార్చి చక్కగా ఉన్న తెల్లటి పరుపు మీద పడుకోబెట్టారు. గీరా మేలుకోవడం గమనించి వేడి వేడి హార్లిక్స్‌ తెచ్చింది నర్స్‌. కూర్చోబెట్టి తాగించింది.

‘‘హలో! ఎలా ఉంది గీరా?’’ అడిగింది వరద చిరునవ్వుతో.

గీరా నవ్వుతూ అలవాటుగా పొట్టమీద చెయ్యేసుకుంది. ఎలాంటి కదలికా లేదక్కడ. గంధపు చెక్కలా నున్నగా ఉంది. ఒక్కసారి తుళ్లిపడినట్లుగా చూస్తూ, ‘‘డాక్టర్‌! పిల్లలు… పిల్లలేరి? ఆరోగ్యంగా ఉన్నారా?’’ ఆతృతగా ప్రశ్నించింది.

‘‘రిలాక్స్‌ గీరా! హాయిగా, ఆరోగ్యంగా చిల్డ్రన్‌ వార్డులో ఉన్నారు. ఎలాంటి కంగారు అక్కరలేదు’’ చెప్పింది.

‘‘ఒక్కసారి… ఒక్కసారి చూడొచ్చా?’’

‘‘నో…నో… అది కుదరదు. నీవు కనే అమ్మవే కాని, కన్నతల్లివి కాదు. నీవు ఎవరికోసం నీ కడుపున మోశావో, వాళ్లొచ్చి చూసి వెళ్లారు. ఒప్పుకున్న మేరకు డబ్బు కూడ ఇచ్చేశారు. నీకు కాస్త ఆరోగ్యం చిక్కగానే వెళ్లిపోవచ్చు’’ చెప్పింది.

‘‘ఊ…’’ కళ్లనీళ్లు తిరిగాయి గీరాకు.

‘‘చెప్పానుగా! నీ త్యాగం చాలా గొప్పది. ఇంక, వాళ్లు నీకు పుట్టలేదు అనుకో. లేదంటే నీ కడుపులోనే ఉన్నారు, చూడటం వీలు కాదనుకో. అగ్రిమెంట్‌ అయ్యాక ఇవ్వననటం కూడా న్యాయం కాదు కదా!’’

‘‘ఇవ్వననటం లేదు, ఒక్కసారి చూస్తానంటు న్నాను!’’

‘‘చూశాక అసలే ఇవ్వలేవు. నిజానికి నేను చూడను అని అగ్రిమెంట్‌లోనే అంగీకరించావు’’ ఓదార్చింది వరద. ఏడుస్తున్న గీరా తలమీద చెయ్యి వేస్తూ ‘‘నీ కోసం భగవంతుడొక కానుక ఇచ్చాడు. నీ త్యాగాన్ని ఆయన గుర్తించాడు. అదేంటో చెప్పుకో!’’ అంది నవ్వుతూ.

‘‘మరో దుఃఖమా?’’ ఏడుస్తూ నవ్వలేక నవ్వింది. ‘‘కాదు, ఆనందం. దుఃఖం వెనక ఆనందం ఉంటుంది. పడుతున్న ప్రతి కష్టం వెనక ఓ సుఖం ఉంటుందని తెలియదా?’’ ప్రశ్నించింది.

‘‘తెలియదు. ఇప్పుడీ దుఃఖానికి డబ్బే సుఖమా?’’

‘‘కాదు, వ్యాస్‌తో నీ పెళ్లి’’ చెప్పింది వరద.

‘‘అవును, అందుకే ఈ పిల్లల కోసమే పది నెలలు పెళ్లి వాయిదా వేశాను. ఇంక వారితో మాట్లాడాలి’’ చెప్పింది గీరా.

 మెల్లమెల్లగా గీరాలోని మాతృదుఃఖం నెమ్మదించింది. ‘‘ఇదిగో నీ అమౌంట్‌ ఐదులక్షలు. వ్యాసుతో నీ పెళ్లి జరిగినా, మానినా ఇది నీ జీవితానికి ఆధారమౌతుంది’’ అంటు డబ్బిచ్చింది వరద.

గీరా వాటిని బ్యాగ్‌లో పెట్టుకుంది.

‘‘గీరా! ఒక్క క్షణం కళ్లు మూసుకో! నీకో సర్‌ప్రయిజింగ్‌ కానుకిస్తాను’’ ఊరించింది వరద.

‘‘నాకెేం కానుకుంటుంది? కనే అమ్మనే గాని, కన్న అమ్మను కాను. మాతృదానం చేశానేగాని, మాతృత్వం పొందలేదు. అమ్మను, అద్దె అమ్మను’’ అంది పేలవంగా.

‘‘ఇది పెళ్లికానుక. వ్యాసుతో నీ పెళ్లి కదా! పిలుపు ఉంటుందో లేదో, ముందే ఇస్తాను. కళ్లు మూసుకో!’’ చెప్పింది అనునయంగా.

మెల్లగా మంచం మీద పడుకుని కళ్లుమూసు కుంది. ‘తన నుంచి ఆమెకూ ఓ ఐదు లక్షల వరకూ లాభం. ఏదైనా గిప్టు ఇస్తుందేమో’’ననుకుంది గీరా. రెండు నిమిషాల తరువాత పువ్వులా మెత్తని స్పర్శ, ఆ కదలికలో చేతులాడిరచే పసిబిడ్డ. ఆ పాప కాళ్లతో తనను తంతున్నది.

‘ఇది.. నా భ్రమా!’ అనుకుంటూ వెంటనే కళ్లు తెరిచింది.

నిజమే! పువ్వులాంటి పాపాయి. గులాబీరేకల్లా మృదువుగా తనను తాకుతున్నది. మొదట బొమ్మ అనుకుని తడిమి తడిమి చూసింది.

నిజమే! తనను అమ్మను చేసిన పాపాయి. బొమ్మ కాదు, ప్రాణమున్న పసిపాప! అప్రయత్నంగానేె, పాపను గుండెలకు అదుముకుంది. ఆ ఒత్తిడికి పులకించిన దేహం క్షీరధారలు కురిపించింది. పైట, జాకెట్‌ తడిసిపోయాయి.

గీరాకెందుకో ఆ స్పర్శతో ఆ పాప తనదేె, తను కన్నబిడ్డనిపించింది. దగ్గరగా ఒత్తుకుని, వదులుకోలే నట్లుగా పాలు పట్టించింది. కమ్మటి ఆ పాలు తాగిన పాప క్షణం ఆపి, అమ్మను చూసుకుంది.

‘‘అలా… చూడకే తట్టుకోలేను. నాకే సౌఖ్యా లొద్దు, నువ్వుంటే చాలు…’’ అంటూ హఠాత్తుగా వరద వంక చూస్తూ… డాక్టర్‌! ఈ పాపనింకా తీసుకెళ్లలేదా?’’ అదెలా… సంభవం?’’ ప్రశ్నించింది.

‘‘లేదు, తీసుకువెళ్లరు. చెప్పాగా. పెళ్లి కానుకగా నీకీ కానుకనిస్తున్నానని!’’ ఆదరంగా చెప్పింది.

‘‘మరి వ్యాస్‌… వ్యాసు ఒప్పుకుంటాడా? చదువుకున్నవాళ్లు విజ్ఞానవంతులు కాబట్టి, నేను ‘సరోగేట్‌ మదర్‌’ అగ్రిమెంట్‌ చేసుకున్నానంటే, సహృదయంతో పది నెలలు ఆగారు. బిడ్డతల్లిగా వస్తానంటే ఒప్పుకుంటారా?’’ సందేహంగా అంది.

‘‘ఒప్పుకుంటారు?’’ కచ్చితంగా చెప్పింది.

‘‘ఒప్పుకోకున్నా ఫరవాలేదు. నా చిన్నతల్లి చాలు నాకు. డాక్టర్‌! ఒక్క సందేహం. ఈ పాపనెందుకు తీసుకెళ్లలేదు? నేను ముగ్గుర్ని ముగ్గురి కోసం కన్నాను గదా!’’ సందేహంగా అంది.

‘‘నీకు దేవుడు ముగ్గురితోపాటు మరో పాపని కూడా ఇచ్చాడు. నీవు ముగ్గుర్ని కాదు. నలుగురిని మోసి కన్నావు. ఎవరి పిల్లల్ని, వాళ్లు తీసుకెళ్లారు. నీ పాప నీకు మిగిలింది. ఒక నిజం చెప్పనా గీరా! ఎవరి ఎగ్‌, ఎవరి సెమన్‌, ఎవరు సరోగేట్‌ మదర్‌, ఆ పిల్లల్ని తీసుకునే దంపతులెవరు? ఇవన్నీ మీకు తెలియవు. అంతా రహస్యంగా ఉంటుంది.

‘‘కానీ, మాకంతా తెలుసు! అందుకే నేనే మీడియేటర్‌గా ఉంటాను. ఇందులో గోప్యత అవసరం. కానీ, ముందు ముందు ఆ తల్లికి పిల్లల అవసరం పడ్డా, ఆ దంపతులు వద్దనుకున్నా, ఈ వివరాలు తెలిస్తే ప్రాబ్లమౌతుంది. అవి నివారించటానికే ఈ రహస్యం.

‘‘గీరా! ఈ పాప ఎవరో తెలుసా?

‘‘వ్యాస్‌ ద్వారా నీవు గాంధారికి సరోగేట్‌ మదర్‌గా మారావు. ఆ పిండం అనూహ్యంగా సెల్‌ విభజన, డబులయి, ట్విన్స్‌ పుట్టారు. ఆ అమ్మాయే, ఈ పాపాయి. అంటే సాక్షాత్‌, నీ కాబోయే భర్త ద్వారా, నీవు కన్న అమ్మాయి. అందుకే పెళ్లి కానుక అన్నాను.

‘‘ఆ విషయం వ్యాస్‌కు తెలియజేశాను. అతడు, ఐక్యరాజ్యసమితి మెడికల్‌ కౌన్సిల్లో, తన మొదటి డోనర్‌ భారతదేశానికే చెందాలని ఆంక్ష పెట్టాడు. నీ ద్వారా పొందాడు. యూ ఆర్‌ లక్కీ గీరా! నీ త్యాగానికి ఫలితం దక్కింది. ఇదిగో… ఇది నాకు నీ ద్వారా వచ్చిన ఆదాయం, ఐదులక్షల చెక్‌. నీ కూతురికి నా కానుకగా ఇస్తున్నాను’’ చెప్పింది.

గీరాకు కృతజ్ఞతతో కళ్ల నీళ్లు వచ్చాయి.

‘‘గీరా! అందరమ్మాయిలు భార్యలయి తల్లులవు తారు. నీవు, తల్లివై భార్యవవుతున్నావు. ఇదిగో… వ్యాస్‌ నీకు మెయిలిచ్చాడు’’ అంటూ చూపించింది.

ఆనందంతో గీరా పాపాయిని మరోసారి ముద్దుపెట్టుకుంది.

(సమాప్తం)

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE