ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో నీటి వనరులు పూర్తిగా నీటితో నిండిపోగా రాయలసీమ రైతులను మాత్రం దురదృష్టం వెన్నాడుతోంది. కృష్ణానది భారీ వరదలతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల జలాశయాలు నిండాయి. రాయలసీమకు నీళ్లు వస్తున్నాయి. దాంతో సీమ రైతులు సాగు, తాగునీటికి ఇబ్బందులు ఉండవని సీమ రైతులు సంబరపడ్డారు. ఇంతలోనే తుంగభద్ర డ్యామ్‌ గేట్లు కొట్టుకుపోవడంతో బ్యారేజీలోని 65 టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలేయాల్సి వచ్చింది. ఇది కర్నూలు, అనంతపురం, కడప జిల్లా రైతులకు తాగు, సాగునీటి అవసరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది.

ఎగువ ప్రాంతాల్లోని వర్షాలతో కృష్ణానదిపై ఉన్న జలశయాలన్నీ నిండుకుండల్లా తొణికిసలాడు తున్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్‌, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ వరకు వరద నీరు భారీగా చేరింది. జూరాల, సుంకేసుల నుండి శ్రీశైలం ప్రాజెక్టుకు 4 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా సాగర్‌కు రోజూ 3 లక్షల క్యూసెక్కులకు పైగానే నీరు విడుదల చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ జలవిద్యుత్‌ ఉత్పత్తికి 26,826 క్యూసెక్కులు, తెలంగాణ జలవిద్యుత్‌ ఉత్పత్తికి 38,528 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతుండడంతో మొత్తం 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 585.30 అడుగులుగా, పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుత నిల్వ 298.30 టీఎంసీలుగా నమోదైంది. పులిచింతల జలాశయం పూర్తి నీటి నిల్వసామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 34 టీఎంసీలుగా నమోదైంది.

కర్నూలు, కడపకు కృష్ణానీరు

కర్నూలు, కడప జిల్లాకు కృష్ణాజలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు పోతిరెడ్డిపాడు నీటి నియంత్రణ కేంద్రం నుంచి నీటిని విడుదల చేశారు. కర్నూలు జిల్లాలోని వెలుగోడు నుంచి కృష్ణా జలాలు తెలుగు గంగ అంతర్భాగ ప్రాజెక్టుల్లో ఒకటైన సబ్సిడరీ రిజర్వాయర్‌ (ఎస్‌ఆర్‌-1)కు చేరుకోగా అక్కడనుంచి ఎస్‌ఆర్‌-2కు విడుదల చేశారు. 17 టీఎంసీల సామర్ధ్యంగల బ్రహ్మసాగర్‌ జలాశయానికి నీటిని విడుదల చేశారు. దీని పూర్తి నిల్వసామర్ధ్యానికి అనుగుణంగా నీరు చేరాలంటే 60 రోజులు పడుతుంది. నెల తర్వాతనైనా ఆయకట్టు క్రింద సాగుకు అవకాశం ఏర్పడుతుందన్న ఆశల్లో రైతులు ఉన్నారు. జిల్లాలో 96 వేల ఎకరాల ఆయకట్టు తెలుగుగంగ కింద సాగవుతుంది. గాలేరు-నగరిలో అంతర్భాగంగా ఉన్న గండికోట రిజర్వాయర్‌ను 27 టీఎంసీల సామర్థ్యానికి పైగా ఉండేలా నిర్మించారు. ప్రస్తుత నీటిమట్టం 1.44 టీఎంసీలు మాత్రమే ఉంది. కర్నూలు జిల్లా అవుకు రిజర్వాయర్‌ నుంచి 11,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రోజు ఒక టీఎంసీ నీరు చేరే పరిస్థితులు కనిపిస్తుండడంతో ఐదు వారాలకు అటు ఇటుగా గండికోట నిండే అవకాశం ఉంది. గండికోట నుంచి పైడిపాలెం, సీబీఆర్‌ లిఫ్ట్‌లకు, వామికొండ, సర్వారాయ సాగర్‌ రిజర్వాయర్‌లకు నీరు విడుదల చేసే అవకాశం ఉండడంతో పులివెందుల, జమ్మలమడుగు, కమలా పురం ప్రాంత రైతాంగానికి ప్రయోజనం చేకూరు తుంది. ఈ ఏడాది జిల్లాలో వర్షాలు రాకపోయినా కృష్ణమ్మ కరుణించడంతో కడప జిల్లాలోని బద్వేలు, మైదుకూరు, నియోజవర్గాలకు తెలుగుగంగ ద్వారా, జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం నియోజకవర్గాలకు గండికోట ద్వారా, పొద్దుటూరు, కడప, మైదుకూరు నియోజకవర్గాలకు కడపకు కేసాయికట, కేసీ కెనాల్‌ ద్వారా ఆలస్యంగానైనా నీరు అందనుండడంతో రైతులు చాలావరకు గట్ట్టెక్కే అవకాశం కనిపిస్తోంది.

పెన్నానదిలో వరద ప్రవాహం

పెన్నానదిలో జల ప్రవాహం క్రమేణా పెరుగు తోంది. శ్రీశైలం ప్రాజెక్టు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి విడుదలైన నీరు కుందూ నదిలోకి చేరుతోంది. పెద్దముడియం, రాజుపాళెం, దువ్వూరు, చాపాడు, ఖాజీపేట మండలాల మీదుగా కుముద్వని పెన్నాలో కలుస్తోంది. కమలాపురం, వల్లూరు, చెన్నూరు, కడప, సిద్ధవటం, ఒంటి మిట్ట మండలాల నుంచి దిగువ ప్రాంతంలోని సోమశిల జలాశయం లోకి పరుగులు తీస్తోంది. ఈ రెండు నదుల పరివాహక ప్రాంతాల్లో తాగు, సాగునీటి బెంగ తాత్కాలికంగా తీరినట్లే.

ఏటా కడలిల పాలు

ఈ ఆనందం కలిగించే అంశం నాణేనికి ఒకవైపే. రెండో వైపున ఆవేదన మిగులుతోంది. ఎగువ ప్రాంతం నుంచి ఎప్పుడు వరదలు వచ్చినా ప్రకాశం బ్యారేజీ నుంచి వందల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది. ఈ ఏడాది ప్రకాశం బ్యారేజీకి వరదలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 86.14 టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోయింది. 2019లో 501 టీఎంసీలు, 2020లో 439.19 టీఎంసీలు, 2021లో 332 టీఎంసీల నీరు కడలిలో కలిసింది. పులిచింతల వద్ద గల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తిని ఆరంభించడమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ప్రకాశం బ్యారేజీ వరకు నీటి పొదుపు ఉన్నప్పటికీ దానికి దిగువన మాత్రం ఎలాంటి అదుపూ లేదు. నీరు ఇలా వృథా సముద్రం లోకి వెళ్తుండడంతో బ్యారేజీకి 20 కిలోమీటర్ల దిగువన చోడవరం వద్ద బెలూన్‌ బ్యారేజీని నిర్మించా లని నవ్యాంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం సంకల్పించింది. తరువాతి ప్రభుత్వం (వైౖసీపీ) చోడవరం వద్ద, దానికి దిగువున శ్రీకాకుళం వద్ద ఒక్కొక్కటి 4.05 టీఎంసీల సామర్ధ్యంతో రెండు మినీ బ్యారేజీలు నిర్మించాలని నిర్ణయించింది. అయితే శ్రీకాకుళం వద్ద బ్యారేజీని తొలుత నిర్మించాలని భావించింది. శ్రీకాకుళం వద్ద సముద్రం ఆటుపోటుల సమయంలో నీరు సమీప గ్రామాల్లోకి చొచ్చుకు వస్తోంది. దీంతో ఇక్కడ భూగర్భ జలాల పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉన్నందున రెండో బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని వైసీపీ ప్రభుత్వం భావించినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతాన్ని మినహాయిస్తే దిగువన నదీ పరివాహక ప్రాంతంలో చుక్క నీరు కూడా ఉండడం లేదు.

ఎక్కడ చూసినా ఉప్పు నీరే..

కృష్ణానది పెనమలూరు మండలంలోని గ్రామాలను ఆనుకుని సముద్రం సరిహద్దు వరకు ప్రవహిస్తోంది. చోడవరం, ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బోర్లు వేసినప్పుడు వచ్చే జలాల్లో స్వచ్ఛత ఉండడం లేదు. మోపిదేవి, అవనిగడ్డ చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితి మరోలా ఉంది. పోటు సమయంలో సముద్రపు నీరు నదిలోకి వచ్చి చేరుతుంది.

ఇక అల్పపీడనాల సమయంలోనూ సముద్రపు నీరు రోజుల తరబడి నదిలో ఉంటోంది. ఈ కారణంగా ఆ పరిసర ప్రాంతాల్లోని భూములు చౌడు బారిపోతున్నాయి. ప్రకాశం బ్యారేజీ – చోడవరం బ్యారేజీ – మోపిదేవి బ్యారేజీల మధ్య ఏడాది పొడవునా నీరు నిల్వ ఉండేలా చేస్తే ఈ పరిస్థితులు మారతాయని జలవనరుల శాఖ అధికా రులు భావిస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మినీ బ్యారేజీలను ముందుకు తీసుకెళ్తుందా? కొత్తగా మార్పులు చేర్పులు చేస్తుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

తుంగభద్రపై ఆశలు వదులుకోవాల్సిందేనా తుంగభద్ర జలాశయం క్రస్ట్‌ గేట్‌ వరద నీటిలో కొట్టుకుపోవడంతో నీరు వృథాగా పోయి కర్ణాటక సహా తెలుగు రాష్ట్రాల ఖరీఫ్‌ సాగు ప్రశ్నార్థకంగా మారింది. గత రెండేళ్ల కాలంలో తుంగభద్ర ప్రాజెక్టుకు ఎన్నడూ లేనివిధంగా ఈసారి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో రైతులు సాగుకు సిద్ధమయ్యారు. నిర్ణీత సమయాని కంటే ముందుగానే కాల్వలకు నీరు వదిలారు. ఎల్లెల్సీ (దిగువ కాల్వ) కింద కర్నూలు జిల్లా పరిధిలో ఖరీఫ్‌లో 45 వేల ఎకరాలు, రబీలో 1.08 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. అనధికారికంగా రెట్టింపులో ఆయకట్టు ఉంటుంది. ప్రస్తుతం సమృద్ధిగా నీరు ఉండటంతో చాలా ప్రాంతాల్లో రైతులు నాట్లు వేశారు. మరికొందరు రూ.వేలు వెచ్చించి పొలాలను సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోవడంతో అన్నదాతల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆదోని, ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజక వర్గాలతో పాటు వందలాది గ్రామాలకు ఎల్లెల్సీ ద్వారానే తాగునీరు అందుతుంది. గతేడాది దిగువకాల్వ 121 కి.మీ వద్ద కాల్వ స్తంభం కొట్టుకుపోవడంతో పొలాలకు నీరు అందలేదు. ఈ ఏడాది పుష్కలంగా నీరున్నా గేటు కొట్టుకుపోవడంతో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక పంటకైనా నీరందుతుందా? లేదా? అన్న సందిగ్ధంలో రైతులు ఉన్నారు.

తుంగభద్ర జలాశయం క్రస్ట్‌ గేట్‌ కొట్టుకు పోయిన అంశం అనంతపురం జిల్లాలోని హెచ్చెల్సీ ఆయకట్టు రైతాంగానికి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాగు, సాగుకు జీవనాధారంగా ఉన్న హెచ్చెల్సీపై దీని ప్రభావం తీవ్రంగా ఉండనుంది. నిండుకుండలా ఉన్న టీబీ డ్యాంను చూసి రెండు రాష్ట్రాల ప్రజలు, రైతులు ఆనంద పడ్డారు. అంతలోనే ఓ గేట్‌ కొట్టుకు పోయిన నీరంతా వృథాగా పోతుండటంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. జిల్లాలోని కణేకల్లు, బొమ్మనహాళ్‌, విడపనకల్లు, ఉరవకొండలతో పాటు వివిధ ప్రాంతాల్లో పంటల సాగు చేయడానికి హెచ్చెల్సీ జలాలే జీవనాధారం. జలాశయం వద్ద నుంచి 105 కి.మీ. పొడవునా ప్రయాణించి ఆంధ్ర సరిహద్దులకు చేరడానికే కోట్లు ఖర్చు పెట్టి హెచ్చెల్సీని ఆధునికీకరించారు. సరిహద్దు నుంచి హెచ్‌ఎల్‌ఎంసీ, బీబీసీ ప్రాంతాల మీదుగా పీఏబీఆర్‌కు నీరు చేరి జిల్లాలోని అనంతపురం నగరంతో పాటు వివిధ ప్రాంతాలకు శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం ద్వారా తాగునీరు అందిస్తారు. ముఖ్యంగా హెచ్చెల్సీ ద్వారా 92 టీఎంసీలు వాటా రావాల్సి ఉండగా నీటి లభ్యతను బట్టి 26 టీఎంసీల దాకా నీరు ప్రతి ఏడాది అందుతున్నాయి. అందులో పది టీఎంసీల దాకా హెచ్చెల్సీ జలాలు తాగునీటికి వాడుకోవాల్సి ఉంటుంది. మిగిలిన జలాలను సాగు కోసం వినియోగించు కుంటారు. హెచ్చెల్సీ కాలువకు 15 రోజుల కిందట నీరు విడుదల చేశారు. ఇప్పటి వరకు రెండు టీఎంసీలు కూడా జిల్లాకు అందలేదు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా క్రస్టిగేట్‌ చైన్‌అంక్‌ తెగిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

తుంగభద్ర ఎగువ కాలువకు జలాశయం నుంచి 1500 క్యూసెక్కుల మేరకు సరిహద్దులో అందు తుండటంతో రైతులు ఆయకట్టులో వరినాట్లు సాగు చేయడంలో నిమగ్నమయ్యారు. చివరి ఆయకట్టులో ఇప్పుడిప్పుడే వరినారు వేస్తున్నారు. రాయదుర్గం, ఉరవకొండ లాంటి పట్టణాలకు తాగునీరు అందిం చేందుకు నిర్మించుకున్న సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులను నింపుకునే పనిలో భాగంగా కాలువ నుంచి నీటి పంపింగ్‌ ప్రక్రియ ప్రారంభించారు. వేసవిలో ఇబ్బంది లేకుండా ఉండటానికి తాగు నీటి అవసరా లకు పది టీఎంసీల మేరకు నీటిని కేటాయించారు. దీంతో ఓ వైపు పంపింగ్‌ ప్రక్రియ జరుగుతుండగా మరో వైపు వరినాట్లు సాగుతున్నాయి. ఈనేపథ్యంలో క్రస్ట్‌ గేట్‌ కొట్టుకుపోవడం తీవ్ర ఆందోళన కలిగి స్తోంది.

వర్షాలు కురిస్తేనే..

సాధారణంగా జూలై నెలలో కురిసే వర్షాలతో జలాశయంలో నీరు మెండుగా చేరుకుని ఆగస్టు రెండో వారానికి జలాశయం పూర్తిగా నిండిపోతుంది. ఈ ఏడాది భారీ వర్షాలు కురవడం, ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరదనీరు చేరి తక్కువ సమయంలోనే జలాశయం నిండిపోయింది. వంద టీఎంసీలకు మించి నీటి నిల్వతో నిండుకుండలా ఉండేది. దీంతో క్రస్ట్‌ గేట్లను ఎత్తి 30 వేల క్యూసెక్కుల నీరు నదికి వదులుతూ ఉండేవారు. ఒక్కసారిగా క్రస్ట్‌ గేట్‌ తెగిపోవడంతో పరిస్థితులు తారుమారయ్యాయి.

ఎగువ నుంచి నీటి లభ్యత క్రమేపీ తగ్గుముఖం పట్టి ఇన్‌ఫ్లో 25 వేల క్యూసెక్కు లకు పడిపోయింది. అయితే గతంలో ఆగస్టు చివరిలో కూడా వర్షాలు కురిసి జలాశయానికి సమృద్ధిగా నీరు చేరిన అవ కాశం ఉండటంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బోర్డు అధికారులు భావిస్తున్నారు.

– టిఎన్‌. భూషణ్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE