22, 23, 24 జనవరి, 1966న ప్రపంచ హిందూ సమ్మేళనం ప్రయాగలో జరిగింది. మౌని అమావాస్య కుంభమేళా సంరంభం మధ్య జరిగిన ఈ సమ్మేళనానికి ఉన్న మరొక విశిష్టత – చరిత్రలో హర్షవర్ధనుడు నిర్వహించిన తరువాత మళ్లీ గురూజీ ప్రేరణతో 20వ శతాబ్దంలో ఇంతటి సమ్మేళనం జరిగింది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకుÑ ద్వారక నుంచి బర్మా వరకు ప్రతినిధులు హాజరయ్యారు. నాటి ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వనాథ్‌దాస్‌, బిహార్‌ గవర్నర్‌ అనంతశయనం అయ్యంగార్‌, పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ కైలాస్‌నాథ్‌ కట్జు, నేపాల్‌ ప్రధాని తులసిగిరి హాజరయ్యారు.

మహా సమ్మేళనంలో హృదయాలను కదిలించే తీరులో వినిపించిన ప్రసంగాలలో పూజ్యశ్రీ గురూజీ ముగింపు  ప్రసంగం ఒకటి. వారిలా అన్నారు.

 ‘‘నేనొక సామాన్య స్వయంసేవకుడను. నా పని ఈ మహాసమ్మేళనపు ఏర్పాటుకు సేవ చేయడం. అయితే జగద్గురువుల ఆదేశం మేరకు నేనిక్కడ నిలబడ్డాను.

‘‘విశ్వహిందూపరిషత్‌ సంకల్పం భగవదిచ్ఛతో జరిగినట్టిదని నా విశ్వాసం. ఒకే సమయంలో అనేకులకు కల్గిన సంకల్పమిది. శ్రీ ఆప్టే రెండు మూడేండ్ల క్రితం తన ఈ  ఆలోచనను పత్రికలలో వ్రాశారు. స్వామి చిన్మయానంద కూడా అవే ఆలోచనలు వ్యక్తం చేశారు. మరి అనేకులు కూడా అనేక సందర్భాలలో, అనేక విధాలుగా ఈ కోరికను వ్యక్తం జేశారు. హిందూ మహాసభవారు కూడా ఈ ప్రయత్నం చేశారు. నాడు నా దగ్గరకు వచ్చి నా సహకారం కూడా కోరారు. హిందూ సమాజోద్ధరణకు జరిగే కార్యకలాపాలలో నా సహకారం సర్వదా ఉం టుందని, అయితే ఈ పని రాజకీయ దళాలకు అతీతంగా జరగాలని,  సమాజంలోని ఉత్తమ పురుషుల, ప్రముఖుల సమితి ద్వారా ఇది చేయడం వాంఛనీయమని సూచించాను. ఇదే అభిలాష అన్యుల ముందు కూడా వ్యక్తం చేశాను. ముందు పరస్పరం ఆలోచనలు పంచుకున్నాం.తాత్కాలికాధ్యక్షునిగా ఉండవలసిందని స్వామి చిన్మయానంద ను కోరాం. బృహత్సమ్మేళనం ఒకటి – ఈ తీర్థరాజంలో, ఈ పవిత్ర సమయంలో జరగాలని నిర్ణయించుకున్నాం. ఆయా నిర్ణయాల ఫల స్వరూపం ఈ మహా సమ్మేళనం. ఈ రెండున్నర రోజులు తమ జీవితంలో మహత్తరమైనవిగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి వారూ మనసులలో భద్రపరచుకోదగినదిగా, ఎందరో మహానుభావుల దర్శనం ఒకే వేదిక మీద జరుగుతున్నది. వారి పవిత్ర ఏకతా సందేశం వినిపించింది. ఎందరో మహానుభావులు ఇందుకు సహకరించారు. ఇక్కడికి రాలేకపోయిన శ్రీ మున్షీ, శ్రీ సి.పి.రామస్వామి అయ్యరు ప్రభృతులు ఎంతో కృషి చేశారు. ద్వారకా పీఠాధిపతులు స్వయంగా  మార్గదర్శనం చేశారు. స్వయంగా అనేక సమావేశాలకు విచ్చేశారు.

‘‘మన కార్యక్రమం ధర్మాన్ని క్రోడీకరించడం కాదు. మన ధర్మం ఈశ్వర ప్రసాదం, దీని పరివర్తనం కల్యాణకారకం అని భావించాం. మన వైయక్తిక సామాజిక జీవనంలో ఈ విశిష్టధర్మాన్ని నిలుపు కోవడం కల్యాణ కారకం. స్వతః సంక్రమించిన ధర్మాన్ని విడువకుండా ఆధునిక కాలంలో సమన్వయించుకొని మనం జీవించాలి. అనేక కారణాలవల్ల మనలో ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది. ఆత్మనూన్యనత (Inferiority Complex) పెరిగింది. దీనిని పారద్రోలు కోవాలి.

విదేశాలలో ఉన్న హిందువులకు, స్వదేశంలో ఉన్నా ధర్మం అందనివారికి మనం అందించాలి. ఇందుకు అనుగుణమైన తీర్మానం కూడా సమ్మేళనంలో వచ్చింది. విదేశాలలో ఉన్న హిందువులలో కూడా హిందూత్వనిష్ట చాలా ఎక్కువగా ఉన్నది. అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ విషయమై ఎంతో జాగృతి కల్గుతున్నది. మనలో ఆత్మనూన్యత ప్రబలితే మనం చేయగలిగిందేమి ఉంటుంది? ఇక్కడ మనం స్వభాషలో మాట్లాడడానికే లజ్జ చెందే స్థితి ఉంటే, అక్కడ ఉన్న హిందువులు స్వధర్మాన్ని ఎలా ప్రకటించగలరు? ఈ దుస్థితిని మనం విదిలించి వేసుకోవాలి. మనమంతా హిందూత్వ కణాలుగా రూపొందాలి. అగ్నికణం తానున్న ప్రతిచోట తన తేజస్సును విస్తరింపజేసినట్లు, మనం హిందూత్వపు కాంతులను ఎక్కడున్నా వెదజల్లగలగాలి. ఇందుకు ఎంతో ఆత్మవిశ్వాసం కావాలి. ఎంతో తేజస్సు కావాలి. ప్రబల వాతావరణం కావాలి. సంఘటన కావాలి. ఇది ఒక వ్యక్తివల్ల జరిగేది కాదు, సమష్టి కృషి వల్ల సిద్ధించాలి. నేను హిందువును, హిందూస్థానం నా ధర్మభూమి అని నిర్భయంగా ప్రకటించుకొనగలగాలి. మనకు అత్యంత పూజనీయమైనది గోమాత. దాని హత్యకాండను ఈ దేశంలో ఆపలేని దుస్థితిలో మనం ఉన్నాం. మన ఆత్మవిశ్వాసానికి మన ఈ మాతృభూమి, ధర్మభూమి, కర్మభూమి ఆధారం కావాలి.

‘‘మనది మతాంతరీకరణ సంప్రదాయం కాదు. సర్వవిధములైన ఆరాధనా పద్ధతులను ఆదరించే సంప్రదాయం మనది. క్రైస్తవులు, ముస్లింలు మతాంతరీకరణ చేస్తారు. స్వీయ మత ధర్మాల విలువను గురించి విశ్వాసం చాలక తమ జనాభాను పెంచుకునే ప్రయత్నం ఈ మతాంతరీకరణ లేమోననిపిస్తుంది. క్రీస్తు దైవకార్య నిర్వహణ కోసం వచ్చారుగాని వినాశనం కోసం రాలేదని చెప్తారు. కాని క్రైస్తవులు మాత్రం సర్వత్రా ఉన్నదాన్ని విధ్వంసం చేసేందుకే యత్నించడం కనిపిస్తుంది. అందుకనే కాబోలు ఒకరు ‘‘ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక క్రైస్తవుడు. ఆయన శిలువ మీద మరణించారు’’ అన్నారు. నన్నడిగితే అతడు కూడా క్రైస్తవుడు కాదు, యూదు జాతీయుడాతడు అన్నాను. ఏమైనా హిందూత్వం నుండి మానవాళిని దూరం చేసే ప్రయత్నం దైవకార్య నిర్వహణ కాజాలదు. దాని నుండి హిందువులను కాపాడుకోవాలి. సర్వ సంగ్రాహకమైన ఈ సనాతన ధర్మభావాన్ని పరి రక్షించుకోవాలి. అజ్ఞానంవల్లగాని, మరొక కారణం వల్లగాని వంచితులైనవారిని మనం పునరుద్ధరించు కోవాలి. సనాతన ధర్మం అంటే ఏవేవో సంకుచి తార్థాల్లో చిత్రిస్తున్నారు కొందరు. సర్వదా నిలిచి యుండే ధర్మం సనాతన ధర్మం. గతంలోను, ప్రస్తుతంలోను, భవిష్యత్తులోనూ నిలచి ఉండే ధర్మాన్నే మనం సనాతన ధర్మం అంటాం. ఆ అర్థంలోనే నేనీ మాటను వాడుతాను.

‘‘మనమెన్ని పంథాలలో జీవిస్తున్నామో అందరం స్ఫూర్తిని ఈ సనాతన ధర్మం నుండే పొందుతున్నాం. జైనులు మున్నగువారు దీనికి చెందరని కొందరన్నారు. వేదాలలో అనేక ఉపాసనా రీతులను సూచించారు. సత్వ రజస్తమోగుణాలతో కూడిన మానవాళికి వారి వారి ప్రవృత్తులకు తగిన సందేశాలు, ఉపాసనారీతులను  సూచించారు. వాటి ఆధారంగా స్వీకరించిన వాటిలో జైనం ఒకటి. జైనానుశాసనం అందుకు అనుగుణంగా ఉంటుంది. ఒక జైనముని ఈ విషయం నాతో ప్రస్తావిస్తూ ‘హిందువునని అంగీకరించనివారు జైనులు మాత్రం ఎలా కాగల్గుతారు?’ అన్నారు. నాకెంతో ఆనందం వేసింది. ఈ సామరస్యానికి, సమన్వయానికి మనం కృషిచేయాలి. ఇదే నా ప్రార్థన. నా గట్టి మద్దతు ఇందుకే. ఈ సమ్మేళనం మన చరిత్రలో స్వరాక్షరా లతో లిఖించదగినది. అన్ని సంప్రదాయాలు కలసికట్టుగా ఉన్నాయని ప్రకటించే సమయమిది. ఇది మన సౌభాగ్యం. తరతరాలుగా నిద్రిస్తున్న మన జాతి మేల్కొంటోంది. ఇక హైందవ నికేతనం సమస్త విశ్వంలో, గగన తలాన సమున్నతంగా ఎగురు తుంది. వివేకానందుడు ప్రకటించిన ఈ ఆశ ఫలించే రోజు వస్తుంది. ఇందుకు సందేహం ఎంత మాత్రం లేదు.

‘‘అయితే ఇలా అని సంతృప్తి పడితే చాలదు. ఇక కృషి ప్రారంభం కావాలి. సద్గుణసంపన్న, శీలసంపన్న, అనుశాసన యుక్త సంఘటన మన యశస్సుకు కారణం అవుతుంది. ఈ భావనను ప్రబలంగా హృదయాలలో పదిలపరచుకొని, ఏకసూత్రబద్ధులమై దేశం నలుమూలలకు, జగత్తులోని మూలములకు మనం చేరాలి. పురోగమ నిశ్చయంతో కృషిచేయాలి. ఇది ముగింపు కాదు. ఇది ప్రారంభం.

‘‘విశ్వహిందూపరిషత్‌ నిరంతరంగా దృఢతరమయ్యేందుకు అందరం కలిసి కృషిచేద్దామని మాత్రం విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాను’’ అని ముగించారు శ్రీ గురూజీ.

– జాగృతి 31.1.1966

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE