– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్ జర్నలిస్ట్
అరాచకం నుంచి ఆటవిక పాలనలోకి ప్రయాణించింది పశ్చిమ బెంగాల్. ఈ సంవత్సరం ఆరు మాసాలలోనే దేశం విస్తుపోయే రెండు దారుణ సంఘటనలు అక్కడ జరిగాయి. ఫిబ్రవరిలో సందేశ్‌కాలి దురంతం. ఆగస్ట్‌లో కోల్‌కతా రాజాగోవింద్ కర్ వైద్య కళాశాల దురాగతం. రెండూ స్త్రీల మీద అత్యాచారాలే. పాలిస్తున్నది ఒక స్త్రీ. ఆ వైద్య కళాశాలలో పీజీ డాక్టర్‌ను అతి దారుణంగా హత్య చేసిన ఘటన ఇప్పుడు దేశాన్ని కదిపింది. దేశంలోని ప్రతి ఆసుపత్రి నిరసన వ్యక్తం చేస్తున్నది. అయినా అక్కడ మమతా బెనర్జీ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక లేదు. ఆ పార్టీలో చలనం లేదు. దేశం మొత్తం చీదరించుకుంటున్నది. కోర్టులు మండి పడుతున్నాయి. నిన్నటిదాకా మైనారిటీల బుజ్జగింపునకే అంకితమైన పార్టీగా అంతా భావిస్తున్న తృణమూల్ కాంగ్రెస్, తాను మత్తుమందుల మాఫియా ప్రతినిధినని కూడా నిరూపించుకుందని ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 31 ఏళ్ల పీజీ డాక్టర్‌పై లైంగిక అత్యాచారం, ఆ పై హత్య జరిగినా దోషులను రక్షించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమే జుగుప్స కలిగిస్తున్నది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ కేసును సుమోటోగా స్వీకరించడంతో కొత్త మలుపు తిరిగింది.
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఒక మహిళా ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగిన సంఘటన దేశాన్ని కుదిపేసింది. నేరగాళ్లను కఠినంగా శిక్షించాలని, ఆసుపత్రుల్లో తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ డాక్టర్లు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తమ భద్రతకు సంబంధించి కఠిన చట్టాలు అమల్లోకి తేవాలన్న వారి డిమాండ్ సహేతుకం!
పశ్చిమబెంగాల్ ప్రతిపక్షాలు బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం విడివిడిగా ర్యాలీలు నిర్వహించి నేరగాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం ఒక ఎత్తు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ తరపున ఆగస్ట్ 17వ తేదీన కోల్‌కతాలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం ద్వారా దిగజారుడు రాజకీయానికి సరికొత్త భాష్యం చెప్పడం మరో ఎత్తు! హత్యకు గురైన పీజీ డాక్టర్ కంట్లో నుంచి రక్తం వచ్చిందని పోస్ట్‌మార్టం నివేదిక చెప్పింది. ఇప్పుడు ముఖ్యమంత్రి మమత ర్యాలీ దేశ ప్రజలకే రక్తకన్నీరు తెచ్చింది. ఆ డాక్టర్ మృతదేహం అర్థనగ్నంగా అదే ఆసుపత్రి ప్రాంగణంలో లభించిన కొన్ని గంటలలోనే దాదాపు నలభయ్ మంది లోపలికి ప్రవేశించి విధ్వంసం సృష్టించారు. నిజానికి కొన్ని ఆధారాలు నాశనం చేశారు. ఆ విధ్వంసం వెనుక బీజేపీ, సీపీఎంల హస్తమున్నదంటూ ఎదురుదాడికి దిగిన ఆమె ఎవరికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించినట్టు? విపక్షాలకా? లేక తన ప్రభుత్వానికా? ఇది ఆమెకే తెలియాలి. సాక్ష్యాధారాలను మాయం చేయడానికే విపక్షాలు ఆసుపత్రిలో విధ్వం సాన్ని సృష్టించాయని చెప్పడం రాజకీయ తెంపరితనం తప్ప మరోటికాదు! హత్యాచారా నికి గురైన కుటుంబానికి న్యాయం చేయాల నేది ఆమె డిమాండు! అసలు న్యాయం చేయాల్సింది ఎవరు? తన ప్రభుత్వమే కదా! అదీకాకుండా వైద్య, ఆరోగ్యశాఖ తన అధీనంలోనే ఉంది!! శాంతిభద్రతలకు పూచీపడే హోంశాఖ కూడా ఆమె చేతిలోనే ఉంది. మరి చిల్లర రాజకీయాలు చేస్తున్నదెవరు? తృణమూల్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎన్నడూ లేని రీతిలో దిగజారి పోయాయని, కేవలం ఒక్క మహిళా డాక్టర్ మాత్రమే కాదు, పశ్చిమ బెంగాల్ సంస్కృతి, విద్య, నాగరికత మొత్తం అత్యాచారానికి గురయ్యాయంటూ కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి చేసిన ఆరోపణలు అక్షరసత్యం! దేశంలో ఏ రాష్ట్రంలో లేని అరాచక పాలన కొనసాగుతుంది పశ్చిమ బెంగాల్‌లోనే! పీజీ డాక్టర్ తాజా హత్యోదంతం, ఆపై ప్రభుత్వం, పోలీసులు, ఆసుపత్రి యాజమాన్యం వ్యవహరించిన తీరు ఇందుకు ప్రబల నిదర్శనం.
ఆత్మహత్య అంటూ ఫోన్‌కాల్
‘మీ కుమార్తె ఆత్మహత్య చేసుకున్నదంటూ’ ఆసుపత్రి అసిస్టెంట్ సూపరింటెండెంట్ నుంచి మొట్టమొదట తమకు కాల్ వచ్చిందని హతురాలి తండ్రి తెలిపినట్లు అమృత్‌బజార్ పత్రిక పేర్కొంది. ఫోన్ చేసిన అధికారి తన పేరు వెల్లడిరచలేదని ఆయన్ను ఉటంకిస్తూ ఎన్‌డీటీవీ పేర్కొంది. విచిత్రమే మంటే, ట్రైనీ డాక్టర్ మృతదేహం లభించిన ప్రదేశానికి అత్యంత సమీపంలో మరమ్మతుల పేరిట గోడలు పగలగొట్టడం కూడా వివాదాన్ని సృష్టించింది. కేవలం సాక్ష్యాధారాలను లేకుండా చేయడానికి తప్ప, విచారణ పూర్తికాకుండానే మరమ్మతులకు తొందరే మొచ్చిందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే అంశాన్ని కలకత్తా హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించాయి. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కూడా ఈ సంఘటనను సుమోటోగా స్వీకరించి జరిపిన విచారణలో కూడా ఇదే అంశాన్ని ఎత్తి చూపింది. కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ విచారణ అసంపూర్తిగా ఉన్నదని కూడా తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది. పశ్చిమ బెంగాల్ డాక్టర్ల సంఘం సీబీఐకి రాసిన ఒక లేఖలో ఇదే అంశాన్ని స్పష్టంగా పేర్కొంది. ఆసుపత్రిలో ట్రైనీడాక్టర్ శవం లభ్యమైన ప్రదేశానికి సమీపంలో మరమ్మతు పనులు చేపట్టడం సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి తప్ప, సంఘటన ప్రదేశంలో అప్పటికప్పుడు సివిల్ పనులు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు ప్రశ్నించారు.
పోస్ట్‌మార్టం నివేదిక
ప్రధాన నిందితుడు పొలీసుల వలంటీర్ సంజయ్ రాయ్‌తో పాటు మరికొందరి ప్రమేయం ఉన్నదన్న అనుమానాలను పోస్ట్‌మార్టం నివేదిక బలపరుస్తోంది. మృతురాలి జననాంగంలో 151 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం, ‘‘సామూహిక అత్యాచారం తర్వాత గొంతు నులిమి చంపేశారు. పెనుగులాట సందర్భంగా తలను గోడకు బలంగా నొక్కి పట్టడంతో వెనుకవైపు పెద్ద గాయమైంది. ముఖమంతా గీరుకుపోయింది. కేకలు వేయకుండా నోరు మూసేశారు. గొంతుపై బలంగా నొక్కడంతో థైరాయిడ్ కార్టిలేజ్ చితికిపో యింది. జననాంగాల వద్ద లోతైన గాయమైంది. లైంగిక దాడే అందుకు కారణం. నడుము, పెదాలు, చేతివేళ్లు, ఎడమకాలిపై గాయాలున్నాయి. రెండు కళ్లనుంచి, నోటినుంచి రక్తస్రావమైంది. ముక్కు, నోరు గట్టిగా అదిమినట్టు చర్మం కమిలింది’’. కాళ్లను పక్కకు విరిచేశారని బంధువు ఒకావిడ విలపిస్తూ చెప్పారు. కళ్లద్దాలముక్కలు కంట్లో ఉన్నాయి. ఊపిరాడకుం డా చేసి చంపేశారని ఆమె విలపిస్తూ చెప్పారు. అయితే ట్రైనీ డాక్టర్‌ది ఆత్మహత్య అవకాశాలే అధికమని మృతురాలి కుటుంబ సభ్యులకు తెలిపామంటూ వచ్చిన వార్తలను పోలీసులు ఆగస్టు 14న ఖండిరచడమే కాదు మృతదేహాన్ని తాము సమాధి చేయలేదని, కుటుంబ సభ్యులే అంత్యక్రియ లు నిర్వహించారని స్పష్టం చేశారు.
నిందితుడి అరెస్ట్
పోలీసు వలంటీరుగా పనిచేస్తున్న సంజయ్ రాయ్ (31)ను ప్రధాన నిందితుడిగా గుర్తించి ఆగస్ట్ 10వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్ట్ 9వ తేదీ తెల్లవారు జామును 3 నుంచి 5గంటల లోపు ట్రైనీ డాక్టర్ పై ఆసుపత్రి మూడో అంతస్తులో ఛెస్ట్ డిపార్ట్‌మెంట్ సెమినార్ హాలులో అత్యాచారం, హత్య జరిగాయి. సరిగ్గా సంఘటన జరిగిన సమయంలో సంజయ్ రాయ్ ఆసుపత్రిలో సంచరించినట్టు సి.సి. ఫూటేజ్‌ల్లో నమోదు కావడం, నేరం జరిగిన ప్రదేశంలో రాయ్ బ్లూటూత్ హెడ్‌ఫోన్ లభించడం అతడి అరెస్ట్‌కు దారితీసింది. నేరం జరిగిన సమయా నికి అతను సి.సి.ఫూటేజ్ ల్లో కనిపించడం, ఫోరెన్సిక్ నివేదికలో బాధితురాలి వేలిగోళ్లలో ఉన్న రక్తం మరకలు, నిందితుడి చర్మంతో సరిపోలడంకూడా ప్రధాన ఆధారాలుగా నిలిచాయి. సంజయ్‌రాయ్‌కి లై డిటెక్టర్ పరీక్ష జరపడానికి కలకత్తా హైకోర్టు అనుమతించడం పెద్ద సంచలనమే. ఎందుకంటే దేశ నేరచరిత్రలోనే ఇలాంటి పరీక్షకు అనుమతి ఇవ్వడం ఇది ఐదోసారి. కాబట్టి ఈ కేసు తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.
సీబీఐకి అప్పగింత
కేసును విచారిస్తున్న కోల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్. శివజ్ఞానం నేతృత్వం లోని డివిజన్ బెంచ్ ఆగస్టు 13వ తేదీన ఈకేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. జూనియర్ డాక్టర్లు తక్షణమే తమ ఆందోళన విరమించి విధుల్లో చేరాలని కోరింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా జూనియర్ డాక్టర్లు విధుల్లో చేరాలని చేసిన విజ్ఞప్తిని జూనియర్ డాక్టర్లు తిరస్కరిస్తూ నిజమైన నేరగాళ్లను అరెస్ట్ చేసేవరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమ కుమార్తెపై జరిగిన అత్యాచారం, హత్య సంఘటనలో అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న కొందరు జూనియర్ వైద్యులు, ఇతర సీనియర్ వైద్యుల ప్రమేయం ఉన్నదని అనుమానిస్తున్నట్టు తల్లి దండ్రులు చెప్పారని సీబీఐ అధికార్లు వెల్లడిరచారు. కొన్ని పేర్లను సైతం బయటపెట్టారని, 30 మందిని పిలిపించి విచారించాలని నిర్ణయించినట్టు వారు వివరించారు.
ఆసుపత్రిపై అల్లరిమూకల దాడి
ఇలా ఉండగా ఆగస్టు 14 బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత 12.40 ప్రాంతంలో కొందరు అల్లరిమూకలు ఆర్.జి.కర్ మెడికల్ ఆసుపత్రిపై ఆకస్మికంగా దాడికి పాల్పడ్డారు. ఒకపక్క ఆగస్ట్ 9న జరిగిన హత్యాచార సంఘటనపై జూనియర్ డాక్టర్లు ఆందోళన కొనసాగిస్తుండగానే, ఈ మూకలు ఆసుపత్రి ఆస్తులను ధ్వంసంచేశారు. కేసును సీబీఐ విచారిస్తున్న తరుణంలో సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడానికే ఒక పథకం ప్రకారం ఈ దాడులు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. అల్లరి మూకలు అత్యవసర విభాగాన్ని కూడా విడిచిపెట్ట లేదు. అక్కడ మందులతో సహా పూర్తి విధ్వంసానికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన నర్సులను నెట్టేసి, కర్రలు, ఇటుకలు, ఇనుపరాడ్లతో విధ్వంసం సృష్టించి, ఎమర్జెన్సీ, ఔట్‌పేషెంట్ వార్డులు, నర్సింగ్ స్టేషన్, మెడికల్ స్టోర్‌లో పరికరాలు, ఔషధాలను చిందర వందర చేయడం, సీసీటీవీ కెమోరాలను పగుల గొట్టడం, ఇటుకరాళ్లతో దాడి చేయడం దేనికి సంకేతం? అక్కడే వున్న పోలీసు వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు. అదనపు బలగాలు వచ్చి లాఠీచార్జ్, బాష్పవాయు ప్రయోగం చేపట్టడంతో పారిపోయారు. రోగులు హాహాకారాలు చేశారు. చికిత్స పొందకుండానే కొందరు తమ ఊళ్లకు వెళ్లిపోయారు. విపక్షాలు నిర్వహించిన ర్యాలీకి ప్రతిగా తమ పార్టీ తనపున ఆగస్ట్ 17న కోల్‌కతాలోని మౌలాలి నుంచి ధర్మంతల వరకు ర్యాలీ చేపడతామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించిన కొద్ది గంటల వ్యవధిలోనే ఈ దాడులు జరగడం గమనార్హం.
‘‘దాడికి ముందే అల్లరి మూకలు గుమికూడ టాన్ని గమనించి, పోలీసులకు తెలిపినా వారు పట్టించుకోలేదు. తీరా దాడులు ప్రారంభమయ్యాక పోలీసులంతా ఆసుప్రతిలోకి పారిపోయి వచ్చారు’’ అని అంకిత్ మైతీ అనే జూనియర్ డాక్టర్ మీడియాకు వెల్లడిరచారు. కాగా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ మాత్రం ‘‘సోషల్ మీడియా, ఆన్‌లైన్ న్యూస్‌ల్లో 31ఏళ్ల మహిళా ట్రైనీ డాక్టర్ హత్యపై రెచ్చగొట్టే రీతిలో ప్రచారం చేయడమే ఈ దాడులకు కారణం’ అని ఆరోపించారు. ‘మేం ఇప్పటికే ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశాం. ఈ సంఘటనలో ఇంకా కొంతమంది ప్రమేయం వుండే అవకాశం ఉంది. కేసు విచారిస్తున్నాం. కానీ పోలీసులపైనే వ్యతిరేక ప్రచారం జరుగుతోంది’ అన్నారు. ఒకవేళ సాక్ష్యాధారాలను పోలీసులు ధ్వంసం చేశారని సీబీఐ నిరూపిస్తే, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. అదేరోజు రాత్రి ఆసుపత్రికి పది కిలోమీటర్ల దూరంలో జాదవ్‌పూర్ యూనివర్సిటీ నుంచి పౌరులు రాత్రి నిర్వహించ తలపెట్టిన ఆందోళన కార్యక్రమంపై పడిరది.
హైకోర్టు మొట్టికాయలు
ఆర్‌జీ కార్ ఆసుపత్రిలో దుండగులు సృష్టించిన మారణకాండపై కల్‌కత్తా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం వల్లనే ఈ విధ్వంసం జరిగిందని పేర్కొంది. ఆసుపత్రి దాడిపై వేర్వేరుగా వివరణ ఇవ్వాలని, విడివిడిగా అఫిడవిట్లు దాఖలు చేయాలని, పోలీసు, ఆసుపత్రి వర్గాలను ఆదేశించింది. ఆర్‌జీ కార్ ఆసుపత్రిలో జరిగిన విధ్వంసాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ టి.ఎస్. శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం 16వ తేదీన విచారణ చేపట్టింది. వైద్యురాలి మృతదేహం లభించిన గదిని శుభ్రం చేసి రంగులు వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. ఆసుపత్రిని మూసివేయాలని ఆదేశాలివ్వగలమని న్యాయ మూర్తులు హెచ్చరించారు. కేసుపై మధ్యంతర నివేదిక సమర్పించాలని కూడా సీబీఐని ఆదేశించింది.
వరుస తప్పిదాలు
సంఘటన జరిగిన తర్వాత ఆర్జీ కర్ మెడికల్ ఆసుపత్రి ప్రిన్సిపాల్ డా॥ సందీప్‌ఘోష్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత నాలుగు గంటల్లోనే ఆయన్ను కలకత్తా నేషనల్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ప్రభుత్వం నియమించడంతో దుమారం రేగింది. దీనితో రాజీనామా చేశాడు. మమత ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. హైకోర్టు కూడా ఆయన రాజీనామాను తప్పుపట్టి, దీర్ఘకాలిక సెలవులో వెళ్లాల్సిందిగా ఆదేశించాల్సివచ్చింది. మృతదేహం లభించిన సెమినార్ హాలు గోడలకు మరమ్మతులు చేపట్టడం, జూనియర్ డాక్టర్ హత్యాచారం సంఘటన తర్వాత దీదీ ప్రభుత్వం 42 మంది డాక్టర్లను బదిలీ చేయడంకూడా పలు విమర్శలకు దారితీసింది. దీనితో ఈ బదలీలు ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగాయని అడ్డంగా బొంకింది మమత సర్కారు. మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఏమెచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది.
ఆర్‌జీ కర్ వైద్య కళాశాలలో మత్తు మందుల మాఫీయా తీవ్రస్థాయిలో పని చేస్తున్నదని, దాని ఆనుపానులు హత్యకు గురైన పీజీ డాక్టర్‌కు తెలుసునని ఫలితమే ఈ హత్య అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఇదే ఆసుపత్రి టీఎంసీ వర్గాలకు ఏటీఎంలా పనిచేస్తున్న సంగతిని కూడా చాలామంది ప్రస్తావించారు. ఇక్కడ నుంచి మనుషుల అవయవాలు సరఫరా అవుతాయన్న ఆరోపణ ఉంది. మాఫీయా గురించిన వాస్తవాలు అక్కడ చదువుతున్న వారికి ఎంతో కొంత తెలిసి ఉంటాయి కాబట్టి, అవి బయటపెట్టే ప్రయత్నం చేస్తే ఫలితం ఇలాగే ఉంటుందని హెచ్చరించడమే ఈ హత్య, ఘాతుకం వెనుక ఉద్దేశమై ఉండవచ్చునన్న అభిప్రాయం కూడా ఉన్నది. కేసును సీబీఐలో ఎంతో ఖ్యాతి ఉన్న సీమా పహూజాకు అప్పగించడంతో చాలాపేర్లు బయటకు వస్తాయన్న అనుమానాలు ఉన్నాయి. సూమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు ఆగస్ట్ 20న ముగ్గురు సభ్యుల ధర్మాసనంతో విచారణ మొదలుపెట్టింది. పశ్చిమ బెంగాల్ తరఫున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ హాజరయ్యారు.
నోరు మెదపరేమి?
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై కాంగ్రెస్, టీఎంసీ, ఇంకా ఇతర పార్టీలు ఆనాడు రోజుల తరబడి గోల చేశాయి. వీళ్ల అడుగులకు మడుగులు వత్తే మీడియా ఆ చెత్తంతా దేశం మీద చల్లింది. కానీ సందేశ్‌కాలీ మహిళల మీద అత్యాచారం జరిగినప్పుడు నోరు మెదపనట్టే ఇప్పుడు కూడా ఆ పార్టీలు ఏవీ సరైన రీతిలో స్పందించలేదు. దీదీ నోటికి భయపడి కావచ్చు. లేదా విపక్షంలో పెద్ద నోరున్న దీదీని ఇలా బలహీనపరిస్తే, అది మోదీకి లాభిస్తుందన్న పిచ్చి ఊహ కావచ్చు. సాగరికా ఘోష్ అనే రాజ్యసభ ఎంపీ, టీఎంసీ సభ్యురాలు సీబీఐని లక్ష్యంగా చేసుకుని విమర్శలు ప్రారంభించింది. ఇదొక తుంటరితనం. కేసును సాధ్యమైనంత తొందరగా తేల్చి సత్వర న్యాయం చేయాలని ఆమె ఘోషించింది. ఆధారాలను బయటపెట్టాలని కోరుతోంది. ఎక్కడి నుంచి వస్తాయి ఆధారాలు? రాష్ట్ర ప్రభుత్వమే, అధికారిక గూండాలే అన్నీ నాశనం చేశారు. సమస్య ఇంత దూరం వచ్చింది కాబట్టి కొంతమంది లాంఛనంగా ఖండిస్తున్నారు. అయినా కొందరు ఇప్పటికీ నోరెత్తడం లేదు. సోనియా గాంధీ, ప్రియాంక వాద్రా, శివసేన నాయకులు, ఎన్‌సీపీ నాయకులు, సమాజ్‌వాదీ నాయకులు ఎవరూ నోరెత్తడం లేదు. ఒకప్పుడు కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా నానా రగడా సృష్టించినందుకు ఆర్‌జీ కర్ కళాశాలకు ఘోష్‌ను బదలీ చేశారు. ఇక్కడి నిర్వాకం తరువాత పదోన్నతితో మళ్లీ పాత కాలేజీకి బదలీ చేయడం అంటే, అతడికీ తృణమూల్ అధినేత్రికి ఉన్న అవినాభావ సంబంధాలు కూడా బయటపడడం అవసరం. మత్తు మందులు రాజ్యమేలుతున్న ఈ కాలేజీ వ్యవహారం కూడా బయటకి తేవాలి.
తృణమూల్‌లో లుకలుకలు
దేశం మొత్తం అత్యాచారం గురించి అగ్గి మీద గుగ్గిలమవుతుంటే, న్యాయం చేయాలని కోరుతూ ఉంటే, తృణమూల్ తైనాతీ గణం మాత్రం తమ నాయకురాలిని అడ్డగోలుగా కాపాడే ప్రయత్నంలో మునిగి తేలుతోంది. విధులు బహిష్కరించిన డాక్టర్‌ల మీద జనం ఆగ్రహం ప్రదర్శిస్తే తామే అడ్డుపడేది లేదని ఆ పార్టీ కార్యకర్తలు పరోక్షంగా బెదిరించారు. మమత రాజీనామాను కోరుతూ లేస్తున్న ప్రతి తర్జనని విరిచేస్తామని ఇంకొందరు నాయకులు ప్రకటించారు. కానీ కొందరిలో మాత్రం ఈ వ్యవహారంలో సరిగా వ్యవహరించాలన్న సూచన కనిపిస్తున్నది. తాజాగా ఆ పార్టీ నేత సుఖేందు శేఖర్‌రాయ్ సీబీఐ నిక్కచ్చిగా ఉండాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేయడం తృణమూల్ కాంగ్రెస్‌లోనే నెలకొన్న వ్యతిరేకతను తెలియజేస్తోంది. మాజీ ప్రిన్సిపాల్, పోలీసు కమిషనర్‌ను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయడం వల్ల ఆత్మహత్య కథనం ఎందుకు బయటకు తీసుకు వచ్చిందీ తెలుసుకోవడానికి చాలా అవసరమని పేర్కొనడం ఇక్కడ గుర్తించాల్సిన ముఖ్యమైన అంశం. సెమినార్ గోడను కూల్చాల్సిన అవసరం ఎందు కొచ్చిందని ఆయన ప్రశ్నించడమే కాదు, నిందితుడు అంత శక్తిమంతమయ్యేందుకు కారకులెవరని ప్రశ్నించడం మమతా బెనర్జీని ఇబ్బందుల్లోకి నెట్టే అంశమే. పోలీసు జాగిలాలను రప్పించడానికి మూడు రోజుల సమయం ఎందుకు పట్టిందని ఆయన ప్రశ్నించడం కూడా సహేతుకమే. మరో నేత కునాల్ ఘోష్ కూడా తాను ఈ కేసులో న్యాయం జరగాలని డిమాండ్ చేయడం గమనార్హం. జాతీయ మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు రేఖాశర్మ, ఈ ఘటనలో పరిణామాలు, ఈ పని ఏ ఒక్కరో చేసింది కాదని స్పష్టమవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో ప్రమేయం ఉన్నవారిని ఎందుకు రక్షించాలని యత్నిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని వర్గాలు ఇక్కడ ప్రభుత్వ నిర్వాకంపై వేలెత్తి చూపుతుంటే రాష్ట్ర పోలీసులు మాత్రం, హత్యాచార సంఘటనపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారంటూ ఇద్దరు ప్రముఖ వైద్యులు డాక్టర్ కునాల్ సర్కార్, డాక్టర్ సుబర్ణ గోస్వామి మరో సీనియర్ బీజేపీ నాయకురాలు లాకెట్ చటర్జీలను లాల్‌బజార్‌లోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీచేయడం విచిత్రం. ఇది కచ్చితంగా సామూహిక హత్యాచారమే నని అఖిల భారత ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుబర్ణ గోస్వామి చెప్పారు.
‘‘మృతురాలి శరీరంలో తీవ్రమైన గాయా లున్నాయి. కేవలం ఒక్కడు మాత్రమే ఇన్ని గాయాలు చేయలేడు! ఎక్కువమంది దాడిచేసినట్లు అనిపిస్తోంది’’ అని అనుమానం వ్యక్తం చేశారు. ఆయనేం మామూలు రాజకీయవేత్త కాదు కదా, ఆరోపణలు చేయడానికి! ఒక డాక్టర్! పోలీసులు ఈవిధంగా నోటీసులు జారీచేయడం ఇప్పటికీ మారని ప్రభుత్వ వైఖరికి నిదర్శనం. నిందితులను కాపాడటానికి ప్రభుత్వం తాపత్రయ పడుతున్నదని ఏ సాధారణ వ్యక్తికైనా ఇట్టే అర్థమవుతుంది.
లక్ష్యం నెరవేరకుండానే…
తాను చేస్తున్న ఎం.డి.కోర్సులో గోల్డ్ మెడల్ సంపాదించాలన్నది ఆమె కోర్కె. తన మరణానికి ఒకరోజు ముందు డైరీలో తన లక్ష్యాన్ని పేర్కొన్నదని, హతురాలి తండ్రి చెప్పారు. ‘‘రోజుకు 10 నుంచి 12 గంటలు ఆమె చదువులోనే నిమగ్నమై వుండేది. ఆమెను డాక్టర్ చదివించడానికి తామెన్నో త్యాగాలు చేశామని, ఆమె కూడా తన లక్ష్యసాధనలో ఎంతో కష్టపడి చది విందని ఆయన వివరించారు. అటువంటి తన కుమార్తె మరణం తనను కోలుకోలేని స్థాయిలో కృంగదీసినా, దేశవ్యాప్తంగా ఈ ఘాతుకానికి వ్యతిరేకంగా వస్తున్న మద్దతు న్యాయం లభించేవరకు పోరాడాలన్న పట్టుదలను పెంచు తోందని’’ ఆయన పేర్కొన్నారు.