మతమార్పిడులు మెజారిటీ జనాభాపై ప్రభావాన్ని చూపుతాయంటూ ఇటీవల అలహాబాద్‌ ‌హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కైలాష్‌ అనే వ్యక్తి ఉత్తర ప్రదేశ్‌లోని హామిర్‌పూర్‌ ‌నుంచి కొంతమందిని క్రైస్తవంలోకి మతమార్పిడి చేయడానికి తరలించాడన్న అభియోగంపై హైకోర్టు సింగిల్‌ ‌బెంచ్‌ ‌జడ్జి జస్టిస్‌ ‌రోహిత్‌ ‌రంజన్‌ అగర్వాల్‌ ఈ ‌కేసును విచారించారు. ఉత్తరప్రదేశ్‌ ‌చట్టవ్యతిరేక మతమార్పిడుల నిరోధక చట్టం-2021 కింద అరెస్టయిన కైలాష్‌, ‌బెయిల్‌ ‌కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. అతనికి బెయిల్‌ ‌నిరాకరించడమేకాదు.. మత ప్రచారంపై రాజ్యాంగ పరిధిని వివరిస్తూ, మతమార్పిడులను తక్షణం అరికట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

రాజ్యాంగంలోని 25వ అధికరణం మత ప్రచారానికి అనుమతిస్తున్నదే కానీ, మత మార్పిడు లకు కాదని స్పష్టం చేశారు. ప్రచారం చేయడమంటే వ్యక్తులను ఒక మతం నుంచి మరో మతంలోకి మార్చడం కాదని, మతమార్పిడులను అరికట్టకపోతే మెజారిటీ జనాభా ఒకనాటికి మైనారిటీలుగా మారిపోతారని, కనుక దీన్ని నిరోధించాల్సిన అవసరం ఉన్నదనే అంశాన్ని మరోమారు వెలుగులోకి తెచ్చారు. చట్టవిరుద్ధ మతమార్పిడులు ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ/ఎసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లో అధికంగా ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్నాయంటూ మతపరమైన సమావేశాలను తక్షణమే నిలిపి వేయాలని కోరారు.

ప్రాథమిక హక్కులకు భంగం?

బలవంతపు మతమార్పిడులు ప్రాథమిక హక్కులకు భంగకరమని దేశంలో వివిధ కోర్టులు గతంలో తీర్పులు చెప్పాయి. ఒక వ్యక్తి తన ఇష్టానికి అనుగుణంగా మతం మారవచ్చునని సుప్రీంకోర్టు చాలా కేసుల్లో పేర్కొంటూనే బలవంతపు లేదా ప్రలోభాలతో మతమార్పిడులు చేపట్టడం రాజ్యాంగం పేర్కొంటున్న మతస్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని స్పష్టం చేసింది. రెవరెండ్‌ ‌స్టైనిస్‌లాస్‌ ‌వర్సెస్‌ ‌మధ్య ప్రదేశ్‌ ‌కేసులో స్వేచ్ఛగా మతప్రచారం చేసుకోవడమంటే బలవంతంగా మత మార్పిడులకు పాల్పడటం కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఇదిలావుండగా వయోజనులు కుల మతాలకతీతంగా వివాహం చేసుకోవచ్చునని సుప్రీకోర్టు తీర్పు చెబుతూనే వివాహ సమయంలో మతం మార్చుకున్నా, కేవలం చట్టపరమైన నిబంధనలను తప్పించుకునేందుకు మతమార్పిడి ద్వారా వివాహం చేసుకోకూ •దని హెచ్చరించింది కూడా.

మతమార్పిడులకు కారణాలు

ఒక వ్యక్తి తన ఆధ్యాత్మిక ప్రయాణంలో తన వ్యక్తిగత సానుకూలతకు, అభివృద్ధికోసం అప్పటి వరకు విశ్వసించిన వాటిల్లో మార్పులు చేసుకోవడం కోసం మతం మారడం సహజంగా జరుగుతుంది. అలాగే జీవిత భాగస్వామి మతం వేరయినప్పుడు, కుటుంబంలో సామరస్యతకోసం లేదా తన భాగస్వామి పట్ల నిబద్ధత కోసం కూడా మతం మారిన సంఘటనలున్నాయి. కొన్ని సామాజిక వర్గాలు కొన్ని సామాజిక ఒత్తిడుల నేపథ్యంలో ఒక ప్రత్యేక మతాన్ని తప్పనిసరిగా అవలంబించాల్సి రావడం కూడా ఒక కారణం. తాను అనుసరిస్తున్న మతంలో వివక్ష, వేధింపుల నుంచి బయటపడేందుకు, మతం మారడం సహజంగా జరుగుతుంటుంది. ఒక మతంలో కేవలం ఆ మతం వారికే వర్తించే అర్థికపర మైన అవకాశాల పట్ల ఆకర్షితులైన ఇతర మతంలోని కొందరు మతం మారుతుం టారు. కొన్ని సందర్భాల్లో ప్రలోభపెట్టడం లేదా బలవంతపు మతమార్పిడులు జరుగుతుంటాయి.

స్వాతంత్య్రానికి పూర్వం

స్వాతంత్య్రానికి పూర్వం రాయ్‌గఢ్‌, ‌బికనీర్‌, ‌కోటా, జోధ్‌పూర్‌, ‌పాట్నా, ఉదయ్‌పూర్‌, ‌కలహండి, సుర్గుజా సంస్థానాల్లో మతమార్పిడుల నిరోధక చట్టాలు అమల్లో ఉండేవి. ముఖ్యంగా మిషనరీ కార్యకలాపాలను అడ్డుకునేందుకు అప్పట్లో హిందూ పాలకుల సంస్థానాల్లో ఈ చట్టాలను అమలుచేశారు.

కేంద్రంలో ప్రత్యేక చట్టంలేదు

1954, 1960 సంవత్సరాల్లో పార్లమెంట్‌లో ‘ఇండియన్‌ ‌కన్వర్షన్‌ (‌రెగ్యులేషన్‌ అం‌డ్‌ ‌రిజిస్ట్రేషన్‌) ‌బిల్లు, ‘వెనుకబడిన వర్గాల (మత రక్షణ) బిల్లులను అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఈరెండు బిల్లులకు సభ్యుల మద్దతు లభించకపోవడంతో ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మతాంతరీకరణకు సంబంధించి ఏ విధమైన ప్రత్యేక చట్టాన్ని రూపొందించలేదు. అయితే కేంద్రం ఈ చట్టాలను అమల్లోకి తేవడంలో విఫలం కావడంతో క్రమంగా రాష్ట్రాలు ఈ చట్టాలను అమల్లోకి తే•వడం మొదలైంది. ఆ విధంగా మొదటి సారి 1967 బిహార్‌ ‌రాష్ట్రం అమల్లోకి తెచ్చింది. 1968లో మధ్యప్రదేశ్‌ ‌దీన్ని అమల్లోకి తెచ్చిన రెండవ రాష్ట్రం. తర్వాత అరుణాచల్‌‌ప్రదేశ్‌, ‌ఛత్తీస్‌గఢ్‌, ‌గుజరాత్‌, ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌, ‌కర్ణాటక రాష్ట్రాలు ఇదే బాట పట్టాయి. అలా ప్రస్తుతం దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో మతమార్పిడుల నిరోధక చట్టాలు అమల్లో ఉన్నాయి. ఇటీవల గుజరాత్‌ ‌ప్రభుత్వం రాష్ట్రంలో మతమార్పిడులకు సంబంధించి బౌద్ధం, హైందవాలను వేర్వేరు మతాలుగా పరిగణిం చాలని స్పష్టం చేయడం గమనించాల్సిన పరిణామం. అయితే అనుబంధ నిబంధనల రూపకల్పన జరగక పోవడంతో అరుణాచల్‌ ‌ప్రదేశ్‌లో ఇంకా అమలు పరచలేదు. రాజస్థాన్‌ అసెంబ్లీ మతమార్పిడుల బిల్లును అమోదించినప్పటికీ రాష్ట్రపతి ఆమోదం పొందాల్సివుంది. మణిపూర్‌ ‌వంటి రాష్ట్రాలు ఈ చట్టాలను అమల్లోకి తీసుకురావాలని యోచిస్తు న్నాయి. బలవంతపు మతమార్పిడుల నిరోధక చట్టాన్ని తమిళనాడు ప్రభుత్వం 2002లో అమల్లోకి తెచ్చినా, 2004లో మైనారిటీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, ఎన్నికల నేపథ్యంలో నాటి జయలలిత ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దుచేసింది.

ఎందుకు మతమార్పిడుల వ్యతిరేక చట్టాలు?

కొన్ని మతాల సంప్రదాయ విశ్వాసాలను పరిరక్షించేందుకు, ముఖ్యంగా మతమార్పిడుల కారణంగా జరిగే సంఘర్షణలను నివారించేందుకు, సామాజిక సంఘర్షణలను నివారించేందుకు, అంటే మతమార్పిడుల కారణంగా ఒకే మతంలో చోటు చేసుకునే సంఘర్షణల నివారణకు ఈ మతమార్పి డుల చట్టాల అవసరం ఏర్పడింది. అంతేకాదు మోసపూరిత వివాహాలను నివారించేందుకు. కొన్ని సందర్భాల్లో కొందరు వ్యక్తులు వివాహానికి ముందు తమ మతాన్ని వెల్లడి చేయకుండా గోప్యంగా ఉంచి, తీరా వివాహమయ్యాక తమ భాగస్వామిని బల వంతంగా మత మార్పిడులకు గురిచేసిన సంఘటనల నేపథ్యం కూడా ఈ చట్టాల రూపకల్పనకు ప్రధాన కారణం. కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు బలవంతపు మతమార్పిడుల సంఘటనలను గుర్తించింది కూడా. ఇవి వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించడమే కాకుండా, తన స్వీయ మతాన్ని అనుసరించే స్వేచ్ఛను హరిస్తున్న ఫలితంగా సమాజంలో సెక్యులర్‌ ‌స్థాయి దెబ్బ తింటోందని కోర్టు ఒకదశలో స్పష్టం చేసింది.

రాజ్యాంగానికి వ్యతిరేకం

ఇదిలావుండగా మతమార్పిడి వ్యతిరేక చట్టాలు రాజ్యాంగంలోని 25, 26,27,28 అధికరణాలను ఉల్లంఘించేవిగా ఉన్నాయన్న వాదనలున్నాయి. ముఖ్యంగా అధికరణం-25 (మతాన్ని అనుసరించే, ప్రచారం చేసుకునే స్వేచ్ఛ), అధికరణం-26 (మతవ్యవహారాలను నిర్వహించుకునే హక్కు), అధికరణం- 27(ఒక ప్రత్యేక మతాన్ని ప్రోత్స హించేందుకు వీలుగా పన్నులు చెల్లింపు), అధికరణం-28 (కొన్ని ప్రత్యేక విద్యాసంస్థల్లో మతపరమైన ప్రార్థనలు జరుపుకోవచ్చు. అయితే ప్రభుత్వ విద్యాసంస్థలకు ఇది వర్తించదు). అంతేకాదు జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు (అధికరణం-21), సమానత్వపు హక్కు (అధికరణం -14) ను కూడా ఈ చట్టాలు ఉల్లంఘించేవిగా ఉన్నాయని వాదించేవారున్నారు. యు.ఎస్‌. ‌కమిషన్‌ ఆన్‌ ఇం‌టర్నేషనల్‌ ‌ఫోరం (యుఎస్‌సీఆర్‌ఐఎఫ్‌) ఈ ‌చట్టాలు అందరికీ సమానంగా వర్తించేవిగా లేవని పేర్కొన్నది. ముఖ్యంగా కొన్ని మైనారిటీ మతాల వారి విషయంలో ఇవి దుర్వి నియోగమయ్యే అవకాశముందన్న ఆరోపణలున్నాయి. ఈ చట్టాల్లోని పదజాలం అస్పష్టంగా ఉన్నదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. నూటికి 99 పాళ్లు హిందూ మతం నుంచే మార్పిడులు జరుగుతుండడం గమనార్హం ఎప్పుడో, ఎక్కడో ఆడపా దడపా జరిగిన సంఘటనలను భూతద్దంలో చూపడం ద్వారా మైనారిటీలకు అన్యాయం జరుగుతున్నదని గగ్గోలు పెట్టడం తప్ప మరోటి కాదు.

విదేశాల్లో అమల్లో ఉన్న చట్టాలు

అల్జీరియా, మయన్మార్‌, ‌భూటాన్‌, ‌నేపాల్‌ ‌దేశాల్లో మతమార్పిడుల నిరోధక చట్టాలు అమల్లో ఉన్నాయి. శ్రీలంకలో బౌద్ధుల జాతీయవాద పార్టీ ‘జాతికా హెలా ఉరుమయ’ 2004లో బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా ఒక బిల్లును ప్రవేశ పెట్టింది. అయితే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ క్రైస్తవ మిషనరీలు, పౌరహక్కుల సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేయడంతో, ఈ బిల్లు రాజ్యాంగాన్ని ఉల్లంఘించేదిగా ఉన్నదంటూ తీర్పుచెప్పింది. దీంతో బిల్లులో మార్పులు చేసి 2009లో మళ్లీ ప్రవేశపెట్టగా మెజారిటీ సభ్యులు తిరస్కరించారు. 2020లో అధ్యక్షుడు మహింద రాజపక్ష మరిన్ని మార్పులతో మళ్లీ ఈ బిల్లును ప్రవేశపెడతామని ప్రకటించినా, ఇప్పటివరకు అది కార్యరూపం దాల్చలేదు. 2021లో పాకిస్తాన్‌లో బలవంతపు మత మార్పిడుల నిరోధక బిల్లును ప్రవేశపెట్టాలని యత్నించినా, మత వ్యవహారాల మంత్రిత్వశాఖ దీన్ని తిరస్కరించడంలో అది మూలనపడింది.

ఐక్యరాజ్య సమితి చట్టం

‘ఐక్యరాజ్య సమితి సార్వజనీక మానవహక్కుల ప్రకటన’ మతం మారడం మానవుల హక్కుగా స్పష్టం చేసింది. అయితే స్వచ్ఛందంగా తన మతాన్ని వదులుకొని, మరో మతాన్ని స్వీకరించడంలో తప్పులేదు కానీ ప్రలోభాలతో, బలవంతపు మత మార్పిడులు జరపడాన్ని ఈ చట్టం సమర్థించబోదన్న సత్యాన్ని గుర్తించాలి. అయితే ఐక్యరాజ్య సమితి ప్రకటనను ఖాతరు చేయని కొన్ని విదేశీ గ్రూపులు మతం మార్పిడులను అడ్డుకుంటున్నాయి. ముఖ్యంగా కొన్ని దేశాలు స్వచ్ఛందంగా మతం మారడానికి, ఇతర మతాన్ని అలవాటు చేయడానికి మధ్య తేడాను స్పష్టంగా పేర్కొనడమే కాకుండా ఈ ‘అలవాటు’ పక్రియను నిరోధిం చేందుకు యత్నిస్తున్నాయి. యుఎస్‌ఎస్‌ఆర్‌ ‌పతనం తర్వాత రష్యా ఆర్థోడాక్స్ ‌చర్చి తిరిగి పుంజుకుంది.

రోమన్‌ ‌క్యాథలిక్‌ ‌చర్చ్, ‌సాల్వేషన్‌ ఆర్మీ, జెహోవాల్‌ ‌విట్‌నెసెస్‌ ‌వంటి సంస్థల మతమార్పిడి కార్యకలాపాలను వ్యతిరేకిస్తు న్నది. మనదేశం విషయానికి వస్తే మతమార్పిడులు వివాదాస్పదంగానే పరిగణి స్తున్నాయి. ముఖ్యంగా వివిధ రాజకీయ పార్టీలు మైనారిటీల ఓట్లకోసం చేసే బుజ్జగింపు రాజకీయాల నేపథ్యంలో మెజారిటీ మతస్థుల్లో అభద్రతాభావం పెరిగి జాతీయవాదం పెరగడానికి దోహదం చేసింది. ఇది మనదేశానికే పరిమితం కాదు. ఇప్పుడు యూరప్‌ ‌దేశాల్లో కూడా జాతీయవాదం పెరుగుతున్నట్లు ఇటీవలి ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. ప్రజాస్వామ్య దేశాల్లో ముఖ్యంగా మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు పెరిగిపోవడం, ఓట్ల కోసం రాయితీలు విచ్చలవిడిగా ఇవ్వడం ఇతరత్రా ప్రయోజనాలు కల్పించడం, మిగిలిన మెజారిటీ మతవర్గాల్లో తమ సామాజిక, సాంస్కృతిక భద్రతపై అనుమానాలు పెరిగేలా చేయడమే ఇందుకు కారణం.

1873లో మాక్స్ ‌ముల్లర్‌ ఒక సందర్భంలో మాట్లాడుతూ, ‘ఈ ప్రపంచం రెండు గ్రూపులుగా విడిపోయింది. ఒకటి కొత్త అనుయాయులను చేర్చుకోవడానికి చురుగ్గా పనిచేసేది కాగా రెండవది అందుకు ఉత్సాహం చూపనిది. మొదటి గ్రూపు కిందికి బౌద్ధం, క్రైస్తవం, ఇస్లాం వస్తే; రెండో గ్రూపు కిందికి హిందూయిజం, జుడాయిజం, జొరాష్ట్రియ నిజం వస్తాయి. స్తబ్దుగా ఉన్న గ్రూపునుంచి అనుయాయులను ఆకర్షించాలని చురుగ్గా ఉండే గ్రూపులు యత్నించడం సహజం’అన్నారు. ప్రస్తుతం జరుగుతున్నదిదే!

జమలాపురం విఠల్ రావు

About Author

By editor

Twitter
YOUTUBE