– రోహిణి వంజరి

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

‘‘శీనమ్మా…టిఫిను డబ్బాలో అన్నం బెట్టినవా..?’’

‘‘ఆ ఆ.. పెడతా ఉండాను. ఆదివారం కూడా నాకు ఈ రంది తప్పదు’’ ఇసుక్కుంటా బానట్లో తిరగమాత వేసిన చింతపండు గుజ్జులో కల్లుప్పు, పసుపు వేసి, కుంకుడుగాయంత ఇంగువ పెళ్ల చేసి కలిబెడుతోంది శీనమ్మ కుంపటి ముందర గూర్చొని. రోజు పొద్దనే పిలకాయలకి అన్నం క్యారేజీలు కడుతుంది ఆమె. ఈ ఆదివారం ఆ పనిలేదులే రవంతసేపు నడువాల్చొచ్చనుకుంటే పొగడ దొరువు కండ్రిగకు పోయి వస్తానన్నాడు. శీనమ్మ ఇంటాయన సత్తెయ్య, కొళాయి గుంట దగ్గర నీళ్లు పట్టి బొక్కెనలో పోసి నాలుగు చెంబులు నీళ్లు పోసుకున్నాడు తిరుపాలు. ఒంటిమీద నీళ్లు జారినట్లే ఆలోచనలు వస్తా, జారిపోతా ఉండాయి. తుండుగుడ్డ మొలకు చుట్టుకోని, గోచి తీసి ఇనపకమ్మీ మీద ఆరేసి, దేవుడిరట్లోకి పోయి పటాల ముందున్న లక్క డబ్బాలో నించి విబూది నాలుగేళ్లకు రాసుకొని నుదిటిమీద అడ్డపట్టీలు పెట్టుకున్నాడు. దేవుడి పటాలకి దణ్ణం పెట్టుకున్నాడు. పంచలోకి వచ్చి దండెమ్మీద ఆరేసి ఉన్న నాలుగు మూరల పంచె నడుముకి చుట్టుకుని, ఖద్దరు బనీను వేెసుకున్నాడు. బనీను నిండా చిరుగులే. మరి కొత్త బనీను కుట్టించి ఐదిళ్ల పైనే అయింది. ముందరింట్లో చిలక్కొయ్యకు తగిలించి ఉండే బులుగుల గీరల తెల్ల చొక్కా తొడుక్కుంటుంటే. సంక దగ్గర సర్రుమని చిరిగింది. ఇవేమి తిరుపాలుకు పట్టలేదు. ఈ తూరికి తమ నొసటన ఏమి రాసినాడో ఆ భగవంతుడు. గాల్లో దీపం పెట్టకుండా ప్రయత్నం చేయడమే మనవంతు. ఫలితం భగవంతుడిచ్చేది. అయినా ఏదో ఒక మూలన ఆశ బతుకుమీద.

శీనమ్మ ఇచ్చిన కాఫీ నీళ్లు తాగాడు. ‘ఇంకో తూరి ఆలోచించకూడదా నువ్వు. పోయిన తూరి అంత ఆశ పడ్డాం. ఏమైంది? పెట్టినదంతా బూడిద పాలు’ యూరియా సంచిలో డబ్బా పెట్టి చేతికిచ్చిన శీనమ్మ కళ్లల్లోకి ఓతూరి చూసి, గమ్మున సంచి తీసుకుని బైటికి నడిచాడు. తిరుపాలు పొయ్యే తలికి బస్సు కదలబోతుండాది. కండక్టర్‌ సత్తార్‌ హారను కొడతా ఉండాడు. గబాల్న బస్సు ఎక్కినాడు తిరుపాలు. బస్సు ముందుకు పోతా ఉంటే.. వేడిగాలి మొకానికి తగలతా ఉండాది. చేెలన్నీ ఎండపోయి బీళ్లు పడి ఉండాయి దారిపొడుగునా. ఆకుపచ్చటి చేలు కనుచూపుమేరలో అవపడటంలే..

బస్సు కిటికికి కర్రతుమ్మ చెట్టు కొమ్మలు రాసుకుంటా పోయినాయి. కర్రతుమ్మ పచ్చటి పువ్వు నుంచి పుప్పొడి కళ్లల్లో పడి కళ్లు మండిరాయి తిరుపాలుకి. అందుకోసరమో లేక మరెందుకోసరమో కానీ కళ్లల్లోనించి నీళ్లు కారతా ఉండాయి. ఏ దుఃఖం గుండెల్లో కాల్వలు కట్టింది ఏమో! చెంపల మీదికి జారుతున్న కన్నీటిని పైగుడ్డతో ఒత్తుకున్నాడు. ఆలోచనలు ఒక తట్టుకి నిలవడంలే. శీనమ్మ చెప్పినట్టు కయ్యలు అమ్మెస్తే ఈ యాతనంతా ఉండదు కదా అనుకున్నాడు. నేలతల్లిని అమ్ము కోవడం అనే ఆలోచన రాగానే గుండెల్లో పట్టేసినట్లే అయింది తిరుపాలుకు.

సరిగ్గా ఐదేళ్ల క్రితం ఉండే రెండెకరాల్లో సన్నాలు, డెబ్బై రెండు, మూడు పిడికిళ్ల రకాల వరి ఓ ఎకరాలో పండిస్తే, మెట్ట తాపున మిరప, పెసలు పండేవి. మిరప నారుతో పాటే మధ్యమధ్యలో టమెటా, వంగ, బెండనారు, తోటాకు, పనగంటాకు, గోంగూర వేస్తే అటు తిండి గింజలకు, ఇటు కూరాక్కు దిగుల్లేకుండా బతుకు గడిచిపోయేది. అట్టా బతుకులు ఏళ్లదిస్తే బాగానే ఉండేది కాని, ఊర్లో ఏదో ముసలం పుట్టింది. ఆశల స్థానే అత్యాశ నిచ్చెన మెట్లు గబగబా ఎక్కింది. పచ్చటి నేల తల్లి గుండెల్లో గునపాలు గుచ్చారు. పాడినిచ్చే పశువుల్ని తెగనమ్ముకున్నారు. ఒకళ్లిద్దరు తప్ప ఊరు ఊరంతా పంట పొలాలను తవ్వి చేపల గుంటలుగా మార్చారు. చేపలు, రొయ్యల ఇత్తనాలు నీళ్ల గుంటల్లో వదిలేస్తే లక్షల్లో లాభాలు కళ్ల జూడవచ్చు అనుకున్నారు. ఇంట్లో ఉండే నగానట్రా తాకట్టు పెట్టి మరీ గుంటలు తవ్వించారు. మట్టినంతా ఎత్తి కయ్యల చుట్టూ పోసి ఎత్తుగా గట్లు కట్టించారు. తమ మట్టి బతుకులు బంగారంగా మారతాయనుకున్నారు. తమ గుడిసెలు భవంతు లవుతాయని కలలుగన్నారు. అందరితో పాటు తాను కూడా కలలు గన్నాడు. శీనమ్మ మెళ్లో పసుపుతాడేసు కుని, ఉన్న ఒక్క బంగారు సరుడు తాకట్టుకిచ్చింది అయిష్టంగానే. తొలితూరి గుంటలు నిండడానికి మోటారు పంపుసెట్లు వాడారు. గుంటలు నిండాయి. నేెలతల్లి మీద తూట్లు పొడిచినందుకు కోపమో ఏమో ఆ ఏడాది ఒక్క చినుకు కూడా నేల రాల్లేదు. పెట్టిన పెట్టుబడి వొచ్చింది అంతే. అది వడ్డీలు తీర్చేదానికి కూడా చాల్లేదు. గుడిసెలు భవంతులుగా మారలేదు. బతుకులు ఎలిగిపోలేదు. రెండో తూరి మోటార్లల్లో నీళ్లు రాలేదు. గుంటల్లో నీళ్లు ఇంకి పోతా ఉండాయి. నెల్లూరు నుంచి ట్యాంకర్లు తెప్పించినా, బీడు పడ్డ కయ్యలో మాదిరి నీటి చుక్కలు ఆవిరైపోతున్నాయి. స్తోమతున్నోళ్లు మల్లా బోర్లు తవ్వించుకున్నారు. తాను ఏ ఆధారం లేనోడు. తన గుంటల్లో కూడా నీళ్లు ఇంకి పోయినాయి. చేపలు సరిగ్గా ఎదగలా. తీరా చేపలు, రొయ్యలు అమ్మకానికి వొచ్చే సమయంలో వరదలు వొచ్చి మొత్తం కొట్టుకుపోయినాయి. నెత్తిన గుడ్డ మిగిలింది. మార్కెట్లో నష్టం వొచ్చింది. ఇంక జన్మలో రొయ్యల గుంటలు వద్దు అనుకున్నాడు తను. పోనీ తవ్విన గుంటలు మళ్లీ కయ్యలు చేెయాలంటే ఎంత యాతన.

కయ్యలు రొయ్యల గుంటలు చేసినాక ఇప్పటికి ఒక్క తూరి కూడా కప్పల బెకబెకలు ఇనింది లేదు. వానపాములు, ఎర్రలు, నత్తలు, వానకారు కోయిలలు అయిన నీళ్లపాములు, గాజలశెట్టి పురుగులు, కయ్యలను ఊతం చేసుకుని ఊంటూ, నేెల సారాన్ని పెంచే జీవులన్నీ మాయమైపోయాయి. చేపల గుంటలు పాచి పట్టకుండా చేసిన సున్నం పొడి, రొయ్యల, చేపల దాణాలో ఉండే రసాయనాల వల్ల ఆ జీవులన్నీ నశించిపోయినాయి. నేల సారం మొత్తం కొట్టకపోయి చౌడు భూములైనాయి. పచ్చని పంట చేల మీదికి అప్పుడప్పుడూ వచ్చి పలకరించే జముడు కాకులు, పక్షుల జాడే లేదు. వానలు పదితే పంట వెయ్యవచ్చు అని ఎదురు చూడడమే మిగిలింది. ఒక్క పదును వాన పడి ఎన్ని ఏళ్లయిందని, కయ్యల్లో చాడ పెట్టి, చెంగోవాలు కట్టి, మడుల్లో నాగాలి పర్రుతో దున్ని ఎన్నిదినాలయిందని..? పచ్చని పంట కళ్లచూసి ఎన్ని దినాలయిందని..?

బిడ్డలను సాకేదానికి నెల్లూరు సంతపేటలో ఓ చిల్లర అంగట్లో లెక్కలు రాసే గుమస్తా పనికి కుదురుకున్నాడు. ఇదిగో ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత తినీ, తినకా దాచిపెట్టిన డబ్బుతో కయ్యలో కొత్త బోరు చేయిద్దామని బయలుదేరాడు. అరిచేతుల్లో పీచు టెంకాయ పట్టుకుని, మెట్ట కయ్య అంతా తిరిగి పడమటి మూలన టెంకాయ నిట్టనిలువుగా లేచిందని, అక్కడ జలధార ఉందని, అక్కడ బోరు బిట్టు వేయించ మని, బోరు మిషన్‌ నరసయ్య పోయిన వారమే చెప్పినాడు. ఈ రోజు మళ్లీ ఓ తూరి మాట్లాడుకొని, మంచిరోజు చూసుకుని బోరువేయించాలని ఊరికి పోతావుడాడు. గట్టిగా బస్సు హారను కొట్టేతలికి ఉలిక్కిపడి ఇహంలోకి వొచ్చాడు తిరుపాలు, వరసగా మొత్తలు, డేవిస్‌ పేట, ముదివర్తిపాలెం బస్సులు ఆగి ఉండాయి. జనాలు గుంపులుగుంపులుగా ఉండారు. సోమరాశిపల్లి బస్సు స్టాప్‌ దగ్గర ఇద్దురు పోలిసోళ్లు గూడా ఉండారు. అందరితో పాటు బస్సు దిగాడు తిరుపాలు. అక్కడ నించి బస్సులను ముందుకు పోనికుండా ఆపేశారు. ఎందుకో తెలియక జనాలు తలా ఒక మాట అనుకుంటా ఉండారు. ఊర్లో కట్టావారి బీడులో సీమచింత చెట్టు కొమ్మకు ఉరిపోసుకున్నాడట సుబ్బానాయుడు. పోలిసోళ్లు చెప్పారు. శవాన్ని ఇంకా చెట్టు నుంచి దించలేదు. మొదులు నరికిన అరటిచెట్టు మాదిరి నేలమీద కూలబడిపోయాడు తిరుపాలు. పోయిన వారం తనకూడా కయ్యల్లో తిరిగాడు సుబ్బానాయుడు. పిల్లకు పెళ్లి కుదిరిందని చెప్పాడు. చేపల గుంటలు తవ్వి నష్టపోయిన వాళ్లల్లో ఒకడు. కట్నం డబ్బు సమయానికి ఈలేదని, కుదిరిన సంబంధాన్ని కాదనుకుని పోయారట మగపెళ్లివాళ్లు నిన్న. అందుకే ఉరేసుకున్నాడేమో. పోయిన ఏడాది బాకీలు తీర్చలేక నూనెగమండ్ల ఓబయ్య ఎండ్రిన్‌ తాగి తేరిపోయి నాడు. ఇంకెన్ని ఘోరాలు ఈ కళ్లతో చూడాలో, వొచ్చిన బస్సులోనే వెనక్కి తిరుక్కున్నాడు. తిరుపాలు నిస్సత్తువగా.

క్యాలండర్‌లో కాగితాలు రోజుకొకటి చినగతానే ఉండాయి. ఎవరెట్టా పోయినా నేను మాత్తరం ముందుకు పోతాను అంటుంది కాలం. మీ ముంగిట్లోకి వచ్చేస్తాను అంది తొలకర్ల కాలం, ‘‘రేపటి మింది ఆశ ఉంటేనే మనిషి బతుకుతాడు. లేకుంటే జీవచ్చవం అవుతాడు’’ ఆలోచిస్తా ఉంటాడు తిరుపాలు. తొలకరి జల్లుల సమయం. అంతా బాగుంటే ఈపాటికి కయ్యల్లో చాడ పెట్టి, చెగోవాలు కట్టి, ఎడ్లతో పాటు తను కూడా మడుల్లో తిరిగితడు. పాలం అమ్మడం శీనమ్మకి కూడా ఇష్టం లేదు. కానీ వానలు పడక, పంటలు పండక, చేపల గుంటలు కూడా ఎండి పోయి, నాలుగేళ్ల నుంచి కయ్యలమీద దమ్మిడి ఆదాయం రాలేదు. పిలకాయల చదువులు గుర్తుకువచ్చినప్పుడు మాత్రం ‘‘కయ్యలు అమ్మయ మంటూ’’ జాతరలో పోతరాజు మాదిరిగా చిందులు తొక్కుతుంది.

‘‘ఎందయ్యా..! యోచిస్తాఉండావా..’’ శీనమ్మ మాటకి ఈ తూరి ఎట్టాగైనా కయ్యల్లో మసూరి రకం వరి పంట వేద్దాం మనం. భూమమ్మ గుండెల్లో గునపాలు గుచ్చి, గుంటలు చేశామని ఇన్నాళ్లు అమ్మకి మనమీద కోపమేమో. అయినా రొమ్ముపాలు తాగిన బిడ్డ కాలితో తంతుంటే ఏ తల్లి అయినా పసిబిడ్డను తోసేస్తుందా..? ప్రేమతో గుండెల్లోకి పొదువుకొదూ..! ఎవరు చూడొచ్చారు. ఈ తూరి వానలు పడొచ్చు. ఎండిన గుంటలు నిండొచ్చు. మళ్లీ పంట వేయవచ్చు. బాకీలు తీర్చేయవచ్చు.’’ చెప్పుకుంటా పోతా ఉండాడు తిరుపాలు కలలో మాదిరిగా. ఆ దృశ్యాలన్ని కళ్ల ముందు కనపడు తున్నట్లు, గుండె నిండుగా ఉన్న ఆశలు, కళ్లల్లోకి వచ్చి శీనమ్మ కళ్లు మెరుపులినుతున్నాయి.

ఎప్పటి మాదిరి చిన్న యానాదితో చేయించి బంకమట్టి బొమ్మ కాకుండా, విగ్రహాలు చేసే స్థపతి వెంకటయ్యని మైపాడు నుంచి పిలిపించి మెట్ట కయ్య పడమటి మూలన ఉండే గెనెమకి ఆనుకోనుండే పెద్ద ఏపచెట్టు కింద వినాయకుడి బొమ్మ చేయించాడు. వినాయకుడి బొమ్మ రంగురంగులుగా మెరిసిపోతా ఉండాది. పొద్దునే కయ్యల కాడికి వొచ్చి, రెండు కట్టెల పొయ్యలమీద తంపటేసి రెండు పెద్ద గంపల నిండా కుడుములు చేసారు శీనమ్మ, తిరుపాళ్లు. వినాయకుడికి కుడుములు సోస్తన్నాం రమ్మని ఊర్లోవాళ్లని పిలవడానికి పోయినారు పిలకాయ లిద్దురు. కుడుములు, బెల్లమేసిన నానుబియ్యం, వడపప్పు, టెంకాయలు, సాంబ్రాణి కడ్డీలు, కర్పూరు అన్నీ సిద్ధం చేసుకునే తలికి సూరీడు నడినెత్తిమీద నుంచి పడమటితట్టుకు దిగినాడు. పొద్దున ఇంటి కాడినుంచి ఒండుకొచ్చిన నిమ్మకాయ పులుసన్నం తిని, కయ్యలోనే ఉండే చిన్న గుడిసింట్లో కాసేపు నడుం వాల్చారు. సాయంత్రానికి ఊర్లో పశువులు మేపీ పిలకాయలు, పక్క పక్క కయ్యలోళ్లు వచ్చారు. కల్లు శాంతమ్మ ఇట్లో పూచిన ఎర్రటి ముద్ద దాసాని పూలు రెండు పెద్ద గంపల నిండా తెచ్చింది. కుమ్మరోళ్ల సూరయ్య తాత పచ్చ గన్నేరు పూలు తెచ్చాడు. పశువుల కాళ్లకి నాడాలు కొటే నన్నె సాయిబు తమలపాకులు తెచ్చాడు. నాగలి పర్రు తయారు చేసే సోమయ్య కూడా వినాయకుడి నైవేద్యానికని కుడుములు, ఉండ్రాళ్లు తెచ్చాడు. అందరికీ ఆశే. పని ప్రారంభించేముందు వినాయ కుడికి కుడుములు పోసి మొదులు పెడితే ఆ పని పూర్తవుతుందని నమ్మకం.. మన ప్రయత్నం మనం చేస్తే ఈశ్వరుడి దయ ఉంటుందన్న నమ్మకం. ఈ రోజు బాగాలేకున్నా రేపు మంచి జరుగుతుందని నమ్మకం.

అదేంచిత్రమో గాని ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడని మెరుపులు తూరుపక్క అందరి మనసులను మురిపిస్తూ, చిన్న కండ్రిగ నుంచి సుబ్బయ్య శాస్త్రి వొచ్చాడు. దాసాని పూలతో, గన్నేరుపూలతో వినాయకుడిని అలంకరించారు. గంపల నిండా పూలు. ఎన్ని దేవుడి మీద వేసినా ఇంకా వస్తానే ఉండాయి ఎర్రెర్రని దాసాని పూలు గంపలోనించి. సుబ్బయ్య శాస్త్రి సంకల్పం చెప్పి, పసుపు గణపతి చేసి తమలపాకు మీద పెట్టి, కుంకుమ బొట్టు పెట్టి పూజ చేసాడు. తర్వాత వినాయకుడికి అష్టోత్తరం చదివాడు. శీనమ్మ, తిరుపాలు ఇద్దురూ టెంకాయలు కొట్టారు. కర్పూరం ఎలిగిచ్చి గంటలు కొట్టారు. కుడుములు వినాయకుడిమీద పోశారు. పిలకాయ లంతా కింద పడిన కుడుములను తీసుకుని తిన్నారు. తర్వాత పూజ కాడికి వొచ్చిన పెద్దలంతా గణపతికి కుడుములు పోశారు. రమణయ్య అందరికీ పానకం, వడపప్పు పెట్టాడు. తిరుపాలు పిలగాడు వెంకటేశు అందరికి నాను బియ్యం పెట్టాడు. కూతురు యశోద పట్టపోళ్ల పిలకాయలతో ఆడుకుంటోంది. ఆ సాయంత్రం అక్కడ అందరు ఎండిన తమ బతుకులు పండాలని వినాయకుడికి మొక్కుకున్నారు. కుడుములతో నోర్లు తీపి చేసుకొని, రేపటి వెలుగుకోసం కలలు కంటా ఆ సంది చికట్లో ఇంటిదారి పట్టారు. తిరుపాలు, శీనమ్మలు పిలకాయ లను తీసుకుని గుడిసెలోకొచ్చి పండు కున్నారు ఆ రాత్రి.

పొద్దునంతా పని చేసి ఒళ్లు పులిసిపోయి ఉండాది ఇద్దరికి. అట్టా నడుం వాల్చాగానే నిద్దర పట్టేసింది. ఏకువ జామున ఉరుముల శబ్దానికి మెలుకువ వచ్చింది తిరుపాలుకు. గుడిశకు కప్పిన తాటాకు చిల్లుల నుంచి టపటపా నిళ్లు తిరుపాలు ఒంటిమిది పడ్డాయి. దిగ్గున లేచి కూర్చున్నాడు. బైట కుండపోత వాన. చెక్క తలుపు గొళ్లెం తీశాడు బైటికి వద్దామని. విసురుగా లోపలి కొట్టింది వానజల్లు. తలుపు మూసేసి గొళ్లెం పెట్టిశాడు.

పొద్దునకి రవంత తెరిపి ఇచ్చింది వాన, మోకాళ్లలోతు బురదలో పరిగెడ్తాడు తిరుపాలు వినాయకుడి బొమ్మ కాడికి. ఏప చెట్టు కింద వినాయకుడి బొమ్మ అనవాలు కూడా లేదు. అయ్యో ఇలాగైంది ఏమిటి అని బాదపడుతూ కయ్య తట్టు చూశాడు, ఎర్రటి దాసానిపూలతో నిండి పెద్ద మడుగుని తలపిస్తోంది మెట్ట కయ్య. పూలతో పాటు తమలపాకులు కూడా తేలతా ఉండాయి నీళ్లల్లో. రెండు చేతులు ఎత్తి కయ్య తట్టు చూసి మొక్కతా ‘‘వినాయక స్వామి..! నిన్న పూజ అంతా చేసి, చివర్ల నిమజ్జనం చేయలేదని నీకు నువ్వే నిమజ్జనం అయినవా స్వామి ఈ కయ్యలో’’ కళ్లు మూసుకున్నాడు భక్తిగా తిరుపాలు. అప్పటికే ఊరోళ్లంతా వచ్చే సుండారు కయ్యలకాడికి మూడు పదునుల పైనే వాన కురిసినట్లు ఉండాది. అందరి ముఖాల్లో ఆనందం. కయ్యలు నీళ్లతో నిడిపోయి ఉండాయి.

‘‘పందుము తిన్నా పరగడుపే ఏదుము తిన్నా ఏకాశే’’ అన్నట్లు వారం దినాల్లో పడిన వాన అంటా ఆవిరైనట్లు నీళ్లు ఇంకిపోయినాయి.. మళ్లీ గుంటలు ఎండిపోసాగాయి. తిరుపాలు మెట్ట కయ్య, వినాయ కుడికి పూజ చేసిన కయ్య మాత్రం ఎండలేదు. పడమటి తట్టు భూమిలోనుంచి జలధారలు పైకి ఎగదన్నుకొస్తా ఉండాయి. ఆ కయ్య పెద్ద చెరువుని తలపిస్తోంది. నిళ్లు తగ్గలేదు. కయ్య నీళ్లతో నిండిపోయి, నీళ్లు గెనెమ గట్లపైకి పొర్లతా ఉండాయి, ‘‘ఈశ్వరా.. ఇన్ని దినాలకి మామీద దయచూపావా తండ్రి గంగమ్మ తల్లిని మెట్టు కయ్యలోకి పంపావా మహాదేవా’’. ఆ క్షణం తిరుపాలుకి ఓ ఆలోచన. ఇప్పుడు బోరు తవ్వించుకుంటే ఇక నీళ్లకి కరువుండదు. కాని బోరు తొవ్వుకుంటే తనకొక్కడికే లాభం. ఈ చిన్న మడుగులాంటి కయ్యని ఇంకా లోతుకి తవ్వించి, చుట్టూరా గట్లు కట్టించి, నీళ్లు నిల్వచేసుకుంటే తన చుట్టుపక్కల కయ్యలకి కూడా నీరు అందించవచ్చు, తనకు ఉండే ఒక మాగాణి కయ్యలో తన బతుకు గడచిపోతుంది. తను ఒక్కడే బాగుపడితే చాలదు. తనచుట్టూ ఉండేవాళ్లు కూడా బాగుండాలి. ఆ ఆలోచనతో తిరుపాలు ఊరందరికి బంధువు అయినాడు. అందరికోసం ఒక్కడు నిలిచి, ఒక్కడి కోసం అందరు కదిలి తిరుపాలు మెట్ట కయ్యని సాగునీళ్ల మడుగుగా మార్చుకున్నారు..

వచ్చేవారం కథ..

సీనియర్‌ సిటిజన్‌!   – జి.యస్‌.కె. సాయిబాబా

About Author

By editor

Twitter
YOUTUBE