ఆగస్టు 26 శ్రీకృష్ణాష్టమి

శ్రీమహా విష్ణువు దశావతారాలలో రామకృష్ణులు పరిపూర్ణ అవతారాలని, మరీ ముఖ్యంగా కృష్ణావతారం సహజావతారమని పెద్దలు చెబుతారు. తామరాకుపై నీటిబిందువులా నిస్సంగత్యంగా సాగాలని నిరూపించిన కర్మయోగి శ్రీకృష్ణుడు. ధర్మరక్షణ కోసం రాగద్వేషాలకు అతీతంగా నిందలను కూడా నవ్వుతూ స్వీకరించిన స్థితప్రజ్ఞుడు. ‘కృష్ణస్తు భగవాన్‌ స్వయమ్‌’ అని మహర్షులు కీర్తించారు. ‘భగవద్గీత’ ఆయన ప్రసాదించిన అద్భుత గ్రంథ రాజం. అదే లేకపోయి ఉంటే ప్రపంచ వాఙ్మయం పరిపూర్ణమయ్యేది కాదని జ్ఞానులు, మేధావులు శ్లాఘించారు. ‘భగవద్గీత’లోని ఒక్క శ్లోకాన్నయినా గురు ముఖతః అధ్యయనం చేసిన వారు ధన్యులవుతారని జగద్గురువు శంకర భగవత్పాదులు ఉద్బోధించారు. శ్రీకృష్ణుడు ఆరాధ్యులకు ఆనంద స్వరూపుడు. ఆపన్నులకు జగన్నాథుడు, నమ్మినవారికి కొంగుబంగారం, జ్ఞానులకు వేదవేద్యుడు. ఇష్టులకు జగన్నాటక సూత్రధారి, అనిష్టులకు కపట నాటక సూత్రధారి, పెద్దలు మెచ్చిన విధేయుడు, ఆదర్శ శిష్యుడు. అమాయక తల్లికి అల్లరి తనయుడు. అమిత స్నేహశీలి. చక్రం పడితే కోపధారి. నెగ్గాలన్న పట్టుతో పాటు తగ్గాలన్న విడుపు కలవాడు. ఇలా… ఆయన గుణగుణా లను వేనోళ్ల కొనియాడతారు. లేదంటే వ్యంగ్యోక్తులతో అనుచిత విమర్శలు చేస్తారు. కానీ ఆయన జీవితపథంలోని మర్మాలను గ్రహించి ఆచరించే ప్రయత్నం చేయరు. శ్రీకృష్ణాష్టమి పురస్కరించుకొని ఆ కోణంలోనిదే ఈ వ్యాసం..

ఆధ్యాత్మికతతో పాటు లౌకిక అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం కృష్ణావతారం ప్రత్యేకత. మానవాళి నడత, నడక, మనుగడను ఆచరణ పూర్వకంగా వివరించాడు. రాజనీతిజ్ఞతను ప్రదర్శిం చాడు. హరివంశ, భాగవత విష్ణు పురాణాలలో శ్రీకృష్ణ చరితం విపులంగా ఉంది. ఆయన నరుడిగా పుట్టి చరించిన నారాయణుడు. నరులలో ఉత్తముడు, పురుషోత్తముడు. జీవితంలోని వివిధ దశలలోని ఆయన చేష్టలు, చర్యలు, ధర్మరక్షణ యత్నాలు ఇలా… ఏ అంశాన్ని తీసుకున్నా అవి మానవాళికి దిశానిర్దేశం చేసేలానే ఉంటాయి.

‘కృష్ణ కృష్ణేతి కృష్ణేతి యో మాం స్మరతి నిత్యశః

జలం హిత్వా యథా పద్మం నరకాదుద్ధరామ్యహమ్‌’

(నిత్యం కృష్ణ కృష్ణా! అని జపిస్తే నీటిలో ఉన్నా తడి, బురద అంటని పద్మంలా నరకలోక బాధలు లేకుండా పోతాయట)అని నారసింహ పురాణం పేర్కొంటోంది.

‘చిన్ని’ కృష్ణుడిగానే నాయకత్వ లక్షణాలు ప్రదర్శించాడు. నాయకుడు అంటే మార్గదర్శనం చేస్తూ, కడకంటూ పోరాడాలి తప్ప పలాయనం చిత్తగించకూడదని సూచించాడు. చేపట్టిన కార్యం ఎంత క్లిష్టమైనదైనా, అందులోని కష్టనిష్ఠురాలను మెలకువతో ఎదుర్కొంటూ మార్గాన్ని సుగమం చేసుకోగల ధీశాలి. చేపట్టిన పనిని తుదివరకు సాధించాలనే గట్టి తలంపు గల వీరవ్రతధారి. మార్గాన్ని కాక గమ్యాన్ని ప్రధానంగా తలచి, ఆ ప్రయత్నంలో ఎన్ని ఇక్కట్లు ఎదురైనా సహించి, ఎన్ని తంత్రాలనైనా ప్రయోగించి అంతిమ విజయమే జీవితోద్దేశ్యంగా కలిగిన ధ్యేయవాది. ఇలాంటి విజయంతో పాటు స్వధర్మ సంరక్షణ సంరక్షతత్ప రత్వం ఆయన సొంతం.

‘అధర్మం పెరిగి ధర్మం నశించినప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటాను’ అని భగవానుడు ప్రకటిం చాడు. అన్యాయాలను, అత్యాచారాలను ప్రతి ఘటించి సమాజంలో శాంతిస్థాపన యత్నంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. కంస శిశుపాలజరాసంధ తదితర రాజలు స్వైర విహారంతో పొరుగున ఉన్న చిన్నచిన్న రాజులు భీతిల్లుతున్న వేళ ఆయన జోక్యం అనివార్యమైంది. సమాజ నియమాలను మీరి ప్రవర్తించిన వారు జీవించే హక్కు కోల్పోతారని హెచ్చరించాడు. అలాంటి వారిని మాయోపాయంతో దండిరచినా పాపం లేదనే సిద్ధాంతాన్ని కలియుగంలో ప్రవేశించిన మానవాళికి ప్రసాదించాడు. ఆ స్ఫూర్తితో, పరపీడన పరాయణత్వాన్ని పరిహరించ డంలో కృష్ణపథాన్ని అనుసరించి స్వరాజ్యస్థాపన చేయడంలో చంద్రగుప్త, విక్రమాదిత్య, శివాజీ, శ్రీకృష్ణదేవరాయలు కృతకృత్యులయ్యారు.

శ్రీకృష్ణుడు ప్రకృతి ప్రియుడు. గోవులను కాశాడు. వనమాల, శిఖిపింఛ ధారణ ద్వారా గ్రామాలలో (స్థానికంగా)దొరికే వస్తువులనే ఉపయోగించాలనే సందేశాన్ని ఇచ్చాడు. స్వావలంబనం ముఖ్యమని చాటిచెప్పేలా వెదురుతో మురళి తయారు చేశాడు. ప్రస్తుత ‘మేకిన్‌ ఇండియా’ అనే నినాదానికి ఆ నడవడితోనే  బీజం పడిరదని పోల్చడంలో సంశ యించనవసరం లేదేమో! సంపదలతో తులతూగే నందుడి ఇంట పెరిగిన ఆయనకు గోవుల కాపరిగా వెళ్లవలసిన అవసరం లేదు. చిన్నతనం నుంచి అహంభావాన్ని త్యజించి, గోకులంలో పెద్దలను మన్నిస్తూనే తనకంటే ఎంత చిన్నవారితోనైనా ప్రేమగా మెలిగేవాడు, ఆనందంతో మాట్లాడేవాడు. అసురప్రవృత్తిని రూపుమాపి ప్రేమభావన ఏర్పరి చాడు. అధికారకాంక్షకు అతీతుడు. ఎందరెందరో రాజులను అవలీలగా జయించినా తానెన్నడు ఏలిక కావాలని కోరుకోలేదు. అన్నచాటు తమ్మునిగానే ప్రవర్తిల్లాడు. మగధóరాజు, మేనమామ కంస వధా నంతరం రాజ్యాధిపత్యం స్వీకరించే అవకాశం వచ్చింది. మాతామహుడు ఉగ్రసేనుడు కూడా ‘రాజ్యం వీరభోజ్యం అన్నట్లు కంసవధతో వీర ధర్మంగా రాజ్యం నీకు సంక్రమించినట్లే. పైగా వయసుపైబడిన నేను రాజ్యభారం వహించలేను. కనుక నీవు సింహాసనాన్ని అధిష్టించు’ అన్నప్పుడు, ‘నహి రాజ్యేన మే కార్యం/ నాప్యహం నృప కాంక్షితః/న చాపి రాజ్యలబ్ధేన / మయా కంసో నిపాతితః’ (నాకు రాజ్యకాంక్ష ఎన్నడూ లేదు. కంసుడిని చంపింది రాజ్య లోభంతో కాదు) అని కృష్ణుడు వినయంగా బదులిచ్చాడు. ‘అహం స ఏవ గోమధ్యే/గోపై స్సహ వనే తరః’ (నేను గోవుల మధ్య అడవుల్లో తిరిగేందుకు పోతాను) అనీ విన్నవించాడు.

‘అనేన గోసత్యాగ్రహ యజ్ఞేన

కృష్ణగోపాల ప్రియతామ్‌ యిదం నమః’ (గోరక్షణ కోసం కొనసాగే సత్యాగ్రహంతో గోపాలుడు ప్రసన్నుడు అవుతాడు. ఆ యాగం శ్యామ సుందర గోపాలుడి కోసమే కానీ మీ,మాకోసం ఎన్నటికీ కాదు)

పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాడు. సమస్యలను, సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలే తప్ప పలాయనం పరిష్కారం కాదని, ఆత్మవిశ్వాసంతో కడదాక పోరాడాలన్న స్ఫూర్తిని నింపాడు. శిశుప్రాయంలో పూతన జీవితాపహరణం నుంచి ఆయన మహానిర్యాణం వరకు సంఘటనలను పరిశీలిస్తే అనేక కోణాలు అవిష్కృతమవుతాయి. కష్టసుఖాలు, సుఖదుఃఖాలు, ఎగుడుదిగుళ్లు జీవితంలో భాగ మంటూ, వాటిని ఎలా అధిగమించాలి? ఎలా ఆనందమయం చేసుకోవాలి? అనేవి చాటిచెప్పిన చైతన్యమూర్తి.

 ‘అడుగడుగున గండాలెన్నో ఎదిరీది నిలిచాడు’. ప్రేమను పంచుతూనే ధర్మ సంస్థాపన చేశాడు. శత్రువులను నిష్కంటకం చేసేందుకు అవసరమైతే చతుర్విధ ఉపాయాలను పాటించాలన్నాడు. జరాసంధుడు, తన అల్లుడు కంసుడిని వధించిన కృష్ణుడిపై ప్రతీకారంతో మధురపై పదహారుసార్లు దండయాత్ర చేశాడు. ఆ సమయంలో తన సుఖం, పట్టుదల (వ్యక్తిగత స్వార్థం) కంటే ప్రజాహితం మిన్న అని భావించిన కృష్ణుడు వ్యూహం మార్చాడు. నెగ్గాలనే సంకల్పం ఉన్నా కాలం కలసి రానప్పుడు తగ్గడంలో చిన్నతనం లేదని, బుద్ధిబలంతో సమస్యను చక్కపెట్టవచ్చని నిరూపించాడు. తనపై ప్రత్యర్థుల వ్యక్తిగత కక్ష, ప్రజలకు శాపం కాకూడదనే భావనతో (నేటి కొందరు నాయకులు తెలుసుకోవలసిన సత్యం) జరాసంధుని దాడులకు విరామం ఇచ్చేలా సముద్రం మధ్యలో 12 యోజనాల పొడవు, వెడల్పు గల నగరాన్ని (ద్వారక) నిర్మించుకొని కథ నడిపాడు.

ఇంతటి సామాజిక స్పృహ, రాజకీయ చతురత కలిగిన ఆయన ఆధునికుల అనుచిత వ్యాఖ్యలు, విమర్శల నుంచి తప్పించుకోలేకపోతున్నాడు. ‘భాగవతమందు శ్రీకృష్ణుడు వ్యభిచారిగా వర్ణింపబడి యున్నాడు. దీనివలన శ్రీకృష్ణుని నిర్మల చరిత్రకొక కళంకము కలిగినది. దీని మూలముననే వ్యభిచార మునకు శ్రీకృష్ణుడొక సామెతగా లోకులచే వ్యవహరింపబడుచున్నాడు. శ్రీకృష్ణుడు నిందల బాలయినట్లు ఏ యితర మహాపురుషుడును గాలేదన వచ్చును. ఇట్లు నిందించినవారు వారి పరమభక్తులే. భక్తి కొఱకై యా పరమపురుషునిచే చిన్నతనమున దొంగతనం చేయించినారు. వయసున వ్యభిచారము చేయించినారు. ఇట్లు వర్ణించుట చేత జన సామాన్యంలో శ్రీకృష్ణుని గౌరవము తగ్గుచు వచ్చెను’ అని తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి తమ ‘హిందువుల పండుగలు’ గ్రంథంలో ఆవేదన వ్యక్తం చేశారు. కలిలో, అందునా ఆధునిక కాలంలో కారాగారానికి పర్యాయపదంగా మారిన ‘శ్రీకృష్ణ జన్మస్థానం’ అనడం కూడా ఆధ్యాత్మికవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నేరస్థులను శిక్షించే చోటును అలా వ్యవహరిస్తుంటారు. కానీ ఆయన ఏ నేరమో చేసి కారాగారానికి వెళ్లలేదు. మేనమామ కంసుడు తనకు ప్రాణభయంతో సోదరి బావమరిది దేవకీ వసుదేవులను ఖైదు చేయడంతో అక్కడ జన్మించడం ఆయన నేరం కాదని, అది అవతార పరమార్థమని పెద్దలు చెబుతారు.

విదేశీయులు కృష్ణభక్తితో పరవశులు అవుతుండగా, స్వదేశీయులు కొందరు ఆయన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. స్వామి వివేకానంద ఒకసారి అమెరికాలో కృష్ణలీలల్లోని ఆధ్యాత్మికతను వివరించిన తీరుకు ముచ్చటపడిన ఒక సంపన్ను రాలు తన ఆస్తులను త్యజించి ఓ ద్వీపానికి తరలి పోయి ఏకాంతవాసంలో కృష్ణుడి ధ్యానంలో నిమగ్న మైంది. భారతదేశంలోని కొందరు అవగాహన శూన్యులు, ‘పదహారు వేలమంది భార్యలను పోషించిన ‘అపరనిజామ్‌’ అని శ్రీకృష్ణుడిని వ్యాఖ్యా నించారు. నరకుడు చెరలో వేసిన ఆ రాజకన్యల యుక్తయవస్సంతా అక్కడే గడిచిపోగా, తమను కన్నవారు కానీ, ఇతరులు కానీ ఆదరించరని మొర పెట్టుకోగా, వారికి తాను భర్తగా (భరించేవాడు… లేదా బాధ్యత వహించేవాడు) ఉండి సమాజంలో గౌరవ ప్రతిపత్తులు కల్పించాడు. దేశ విభజన తరువాత ఎందరో విగతభర్తృకలై అవమానాలు పొందడం, వారి పట్ల సమాజం వ్యవహరించిన తీరు ఆధునిక చరిత్ర పుటల్లో నిక్షిప్తమై ఉంది.

‘వస్తూని కోటి శస్సంతు పావనాని మహీతలే! నతాని తత్తులాం యాంతి కృష్ణ నామాను కీర్తనే!! (ధరాతలంపై గల పవిత్ర వస్తువులన్నింటినీ కలిపినా శ్రీకృష్ణనామ సంకీర్తనకు సాటిరావు) అని శ్రీకూర్మ పురాణం చెబుతోంది.

‘కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనమ్‌

వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణమ్‌ హరిమ్‌’

–  డా॥ ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE