రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల ఫైళ్లు రెండు నెలలుగా కాలిపోవడం కలకలం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి బయటపడకుండా ఉండేందుకు ఆయా శాఖల అధికారులే కీలక ఫైళ్లను ఉద్దేశపూర్వకంగా కాల్చి వేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పోలవరం భూసేకరణ పరిహారానికి సంబంధించిన ఫైళ్లను ఆగస్టు 17న రాజమహేంద్రవరంలో తగులబెట్టారు. తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనంలో ఇంజినీరింగ్‌ విభాగంలో కీలక ఫైళ్లు అగ్నిప్రమాదానికి గురయ్యాయి. జూలై 22న మదనపల్లి సబ్‌ కలెక్టర్‌ ఆఫీసులో రెవిన్యూ ఫైళ్లకే నిప్పుపెట్టారు. కరకట్టపై పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఫైళ్లను  అదే నెల 3 రాత్రి కాల్చేశారు. కొన్ని చోట్ల ప్రమాదాలు.. మరికొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా తీసుకెళ్లి నిప్పుపెట్టినట్లు కనిపిస్తోంది. ఫైళ్లను కాల్చేసినా ఏమీ కాదని ఓ భావన వారిలో పెరిగిపోవడం వల్లనే ఇలా విచ్చలవిడిగా కాల్చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. భారీగా అవినీతి జరిగిన వ్యవహారాల్లో బయటపడటం కన్నా ఫైళ్లు తగలబెట్టిన నేరం కింద నిందలు ఎదుర్కోవడం మంచిదని అవినీతి చేసినవారు భావిస్తున్నారు. ఎన్ని ఫైళ్ల ప్రమాదాలు జరిగినా.. ఎన్ని ఫైళ్లతు నిప్పు పెట్టినా ఎంత వారున్నా ఊరుకోబోమని భారీ స్టేట్‌మెంట్లు తప్ప చర్యలు లేకపోవడంతో బరి తెగిస్తున్నట్లు తెలుస్తోంది.

గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్‌, విలువైన భూములను కొందరు రాజకీయ నేతలకు అను కూలంగా రికార్డులు మార్చారనే ఆరోపణలు ఒక్కొ క్కటిగా బహిర్గతమవుతున్నాయి. రాజమహేంద్ర వరంలో దహనమైన ఫైళ్లలో పోలవరం భూసేకరణ, పునరావాసం అంశాల్లో భారీ అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్న వాటికి సంబంధించినవి ఉన్నట్లు సమాచారం. ఇప్పటికీ తమకు పరిహారం అందలేదని కొందరు నిర్వాసితులు ఆ కార్యా లయానికి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భూ సేకరణ, పరిహారం చెల్లింపుల్లో జరిగిన అక్ర మాలు బయటకు రాకుండా ఉండేందుకు ఫైల్స్‌ దహనంచేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలవరం ప్రధాన ఎడమ కాలువ పనుల కోసం చేపట్టిన భూసేకరణ చెల్లింపుల్లో భారీ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం రూ. 19 కోట్లు దాకా మింగేశారని చెబుతున్నారు. ఇప్పుడు తగలబడిరది సరిగ్గా ఆ ప్రధాన ఎడమ కాలువ భూసేకరణ కార్యాలయంలోని ఫైళ్లే! ఇంకా.. రైతులు, లబ్ధిదారుల ఆధార్‌ కార్డులు, కాకినాడ కలెక్టరేట్‌ నుంచి ఇక్కడకు వచ్చిన లెటర్లు, పోలవరం ఎడమ ప్రధాన కాలువకు సంబంధించిన అవార్డు పత్రాలు, ఫొటోలు కూడా దహనమైన వాటిలో ఉన్నాయి. సమా చారం తెలిసి విలేకరులు అక్కడకు వెళ్లగా, సగం కాలిన ఫైళ్లను, పత్రాలను అక్కడి అధికారులు లోప లకు తీసుకుని వెళ్లి దాచేశారు. దీంతో ఈ ఘటనపై మరిన్ని అనుమానాలు ముసురుకున్నాయి. ఫైళ్లను బయట పడేసినట్టు చెబుతున్న శ్రావణి అనే స్వీపరు..ఆకస్మికంగా విశాఖపట్నం వెళ్లారని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. విశాఖ జిల్లాలోని విశాఖ అర్బన్‌, రూరల్‌, భీమునిపట్నం మండలాల పరిధిలోని దసపల్లా, హయగ్రీవ, రామానాయుడు, శారదాపీఠం భూములతోపాటు ఎర్రమట్టి దిబ్బ ప్రాంతాలను రెవెన్యూశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్‌పి సిసోడియా ఆగస్టు 16, 17 తేదీల్లో పరిశీలిం చారు. నిబంధనలు, ఉల్లంఘనలు జరిగినట్లు, కొందరు అనధికారికంగా ఒప్పందాలు చేసుకున్నట్లు ఆయన గుర్తించారు. అగ్రిగోల్డు భూముల కొను గోలులో మాజీమంత్రి జోగిరమేష్‌ కుమారునితోపాటు ప్రభుత్వ సర్వేయరు అరెస్టుతో ఏ క్షణంలో ఎవరి అరెస్టు ఉంటుందోనని ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది.

తితిదే ఫైల్స్‌ దగ్ధం

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం పరి పాలన భవనం మొదటి అంతస్తులోని ఇంజనీరింగ్‌ విభాగంలో అగ్నిప్రమాదం(?).. దస్త్రాలు దగ్ధం చర్చ నీయాంశంగా మారింది.ఈ అంతస్తు ఐదో నంబరు గదిలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో నారాయణవనం, నాగలాపురంతోపాటు 13 ఆలయాల దస్త్రాలు ఉన్నాయి. ఆ రోజు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో డీఈఈ భాస్కర్‌ కార్యాలయ తలుపులను సిబ్బంది మూసేశారు. ఉద్యోగి నాగార్జున పక్క హాల్లో భోజనం చేస్తుండగా గది నుంచి పొగలు రావడంతో కంట్రోల్‌ రూంకు సమాచారం ఇచ్చారు. తితిదే అగ్నిమాపక, విజిలెన్స్‌, విద్యుత్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని తలుపులు తీసి మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే పలు దస్త్రాలు దగ్ధమయ్యాయి. అన్ని దస్త్రాలకు ఈ-ఫైలింగ్‌ ఉంటుందని అధికారులు చెబుతున్నా కొన్ని కీలక దస్త్రాలను అసలు ఈ-ఫైలింగ్‌ ద్వారా నడిపారా? నేరుగా ఆమోదముద్ర వేసి పనులు చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విజిలెన్స్‌ అధికారులు ఇంజినీరింగ్‌ విభాగం అధికారులకు నోటీసులిచ్చి వివరణ కోరారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో రహదారులు, ఇంజినీరింగ్‌ పనుల పేరుతో పెద్దఎత్తున నిధులు పక్కదారి పట్టించారనే ఆరోపణలపై ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణ చేయిస్తోంది. తగలబడిన కొన్ని దస్త్రాలను బస్తాల్లో వేసుకుని గుట్టుచప్పుడు కాకుండా తరలించారన్న ఆరోపణలు లేకపోలేదు. దీపం కిందపడి ఘటన జరిగినట్లు అధికారులు చెబుతుండగా అందులో వాస్తవమెంత.. కుట్ర కోణం ఉందా అనే విషయం విచారణలో తేలాల్సి ఉంది.

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఫైల్స్‌ దగ్ధం

ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో జూలై 22న అర్ధరాత్రి 11 గంటలకు రెవెన్యూకు సంబంధించిన కీలక ఫైళ్లు దగ్ధమైతే మరునాడు తెల్లవారుజాము వరకు సంబంధిత అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వక పోవడం,దగ్ధమైన ఫైళ్లన్నీ భూ సంబంధిత వివా దాలకు సంబంధించినవి కావడం గమనార్హం. వైసీపీ పాలనలో పెద్దిరెడ్డి కుటుంబం, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి,ఆయన అనుచరులు మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు నియోజక వర్గాల్లో వందల ఎకరాలు వివిధ రూపాల్లో ఆక్రమించి నట్లు ఎప్పటినుంచో ఆరోపణలున్నాయి. పేదలు, రైతుల నుంచి ఆసైన్మెంట్‌ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేయడం, తర్వాత కలెక్టర్‌ నుంచి ఎన్వోసీ పొందడం, తర్వాత ల్యాండ్‌ కన్వర్షన్‌ చేయడం షరా మామూ లైంది. వీఆర్వోల నుంచి తహసీల్దార్‌ వరకూ ఇందులో కీలకపాత్ర పోషించగా, సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఆర్డీవోలు తమ వంతు సహకారం అందించి ఈ వ్యవహారాన్ని పూర్తి చేశారంటున్నారు

 ఈ నేపథ్యంలో, పేదల నుంచి దౌర్జన్యంగా ఆక్రమించిన భూమితో పాటు, కబ్జా చేసిన వేల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములను స్వాధీనం చేసుకుని పేదలకు తిరిగి ఇచ్చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆ భూములకు సంబంధించిన కీలక ఫైళ్లను మాయంచేసే క్రమంలో దుండగులు ఫైళ్లకు నిప్పుపెట్టారని తెలుస్తోంది. దీనిపై టీడీపీ నేతలు, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌, బీజేపీ, ఇతర ప్రజాసంఘాలు స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యా లయం ముందు ఆందోళనకు దిగాయి.  దీని వెనుక పెద్దిరెడ్డి కుటుంబం హస్తం ఉందని మండిపడ్డాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించగా స్వయంగా డీజీపీ వెళ్లి పరిశీలించారు. తర్వాత విచారణ చేసిన  ‘‘సిసోడియా, అగ్నిప్రమాదానికి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌’’ కారణం కానేకాదని ప్రభుత్వానికి నివేదిం చారు. ఈ సంఘటనకు కారకులుగా భావిస్తున్న మాజీ ఆర్డీవోలు మురళి, హరిప్రసాద్‌ తోపాటు సీనియర్‌ అసిస్టెంట్‌ గౌతమ్‌ తేజ్‌ నూ సస్పెండ్‌ చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

పర్యావరణ నియంత్రణ బోర్డు ఫైల్స్‌ దగ్ధం

పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారి సమీర్‌శర్మ డ్రైవర్‌ బస్తాల కొద్దీ ఫైళ్లను కృష్ణా జిల్లా యనమల కుదురు -పెదపులిపాక గ్రామాల మధ్య కృష్ణా కరకట్టపై జూలై 3న రాత్రి తగలబెట్టిన విషయం తెలిసిందే. మంటలను ఆర్పి స్వాధీనం చేసుకున్న పత్రాలను స్థానికులు పోలీసులకు అప్పగించారు. వీటిపై వైసీపీ ప్రభుత్వంలో గనుల మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పేర్లు, ఫొటోలు ఉన్నాయట.

ఈ అంశంపైనా పోలీసులు విచారణ చేస్తున్నారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి చెందిన రొయ్యల ఫ్యాక్టరీకి ఇచ్చిన అనుమతులు, ఆ కంపెనీ ద్వారా వెదజల్లుతున్న కాలుష్యంపై విచారణ చేయిస్తామని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రకటించిన కొద్ది గంటల వ్యవధిలోనే పీసీబీ కార్యాలయంలోని కీలక ఫైళ్లు దహనం చేసే ప్రయత్న జరగడంతో ఇందులో ఏదో మతలబు దాగి ఉందని అనుమానించి ఆ దిశగానూ పోలీసులు విచారణ చేస్తున్నట్టు సమాచారం.

ఏపీఎస్‌బీసీఎల్‌ పత్రాలు చోరీ

విజయవాడలో ఏపీఎస్‌బీసీఎల్‌ కార్యాలయం నుంచి.. జూన్‌ 6న కొన్ని కీలకపత్రాలతో ఏపీ39 ఎన్‌క్యూ 6666 నంబరు వాహనంలో సంస్థ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి తీసుకెళ్లినట్లు వచ్చిన ఫిర్యాదులు వచ్చాయి. రాష్ట్రంలో మద్యం పాలసీ అమలులో అధిక కమిషన్లు తీసుకోవడం ద్వారా నాసిరకం మద్యం సేకరించే కార్యక్రమంలో ఆయన ప్రధాన పాత్రగా ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి రాగానే ఆయన కీలక పత్రాలతో హైదరాబాదుకు ఉడాయించగా, సీఐడీ పోలీసులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి వాటిని సేకరించి వాసుదేవ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

గ్రామసభల భయంతోనే

సెప్టెంబరు మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న రెవెన్యూ గ్రామ సభలు (మీ భూమి- మీ హక్కు) సందర్భంగా ఏ ఉద్యోగిపై ఎటువంటి ఫిర్యాదు అందుతుందోననే మండలస్థాయి, అంతకంటే దిగువ స్థాయి సిబ్బందిలో ఆందోళన స్పష్టంగా కనబడుతోంది. కూటమి ప్రతిరోజూ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌కు వచ్చే అర్జీల్లో సగానికి పైగా భూములకు సంబంధించినవి కావడంతో ఈ విషయంపై నిగ్గు తేల్చుతామని ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. అసైన్డ్‌ భూమి కేటాయించి 20 సంవత్స రాలు దాటిన అసలైన లబ్ధిదారుడు పొజీషన్‌లో ఉంటే ఆయా భూములను నిషేధిత జాబితా నుంచి పెదఎత్తున తొలగించిన సంగతి తెలిసిందే. ఇందులో కొంతమేర 20 ఏళ్లు పూర్తికాని భూములను కూడా నేతలకు లబ్ధి చేకూర్చేందుకు నిబంధనలకు విరుద్ధంగా రికార్డుల్లో భూ యజమానుల పేర్లు సైతం మార్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అసైన్డ్‌, ఇనామ్‌ భూముల విషయంలో అక్రమాలు పెద్ద ఎత్తున జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. చాలాచోట్ల డి-పట్టాలను కూడా గిఫ్ట్‌గా ఇచ్చినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గత ఐదేళ్ల కాలంలో అసైన్డ్‌, 22(ఎ), ఇనామ్‌ భూములు 13.59 లక్షల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి ఆయా భూముల యజమానులకు భూ యాజమాన్య హక్కులను గత ప్రభుత్వం కల్పించింది.

రెవెన్యూ గ్రామ సభల వల్ల ఆయా గ్రామాల్లో పేద భూముల నేతలు, వారి అనుయాయులకు కట్టబెట్టిన విషయం వెలుగులోకి వస్తే క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించడం కష్టమవుతుందనే భావన ఒకవైపు, ప్రభుత్వ పరంగా కేసులు నమోదుతో పాటు సస్పెన్షన్లు తప్పవనే ఆందోళన ఉద్యోగుల్లో కనబడు తోంది. అందువల్లనే ఈ ఫైల్స్‌ కాల్చే సంఘటనలు జరుగుతున్నట్లు అనుమానించాల్సి వస్తోంది.

– తురగా నాగభూషణం, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE