సుప్రీం కోర్టు భారత వాస్తవ చరిత్రను గుర్తించింది. ‘ప్రాచీన భారతదేశంలో కుల వ్యవస్థే లేదు. ప్రబలంగా అమలులో ఉన్న వర్ణ వ్యవస్థనే కుల వ్యవస్థని తప్పుగా అర్థం చేసుకున్నారు,’ అంటూ భగవద్గీత ఆధారంగా రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై సంచలన తీర్పును వెలువరించింది. భారత రాజకీయాలలో రిజర్వే షన్ల అంశం అత్యంత సున్నితమైనది. వీటిని అడ్డం పెట్టుకుని రాజకీయపార్టీలు ఓటు బ్యాంకులను తయారు చేసుకున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఇండీ కూటమి తన ప్రచారానికి కేంద్ర బిందువుగా కులాన్ని, రిజర్వేషన్ల అమలుపై అబద్ధపు ప్రచారాన్ని చేసి లబ్ధి పొందిన విషయం మనకు తెలిసిందే. ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లు దశాబ్దాలుగా అమలవుతున్నప్పటికీ, భారతదేశంలోని అత్యంత బలహీన వర్గాల బహుముఖీయ అవసరాలను గుర్తిస్తూ రిజర్వేషన్లను మరింత సూక్ష్మంగా అమలుచేసేందుకు సుప్రీం కోర్టు గత గురు వారం ఇచ్చిన తీర్పు సంచలనాత్మ కమైంది. ఆహ్వానించదగినది. ఉత్తరాదిలో కొన్ని నిరసన గొంతుకలు వినిపిస్తున్నా, దక్షిణాది రాష్ట్రాలు ఆహ్వానించడం ముదావహం. ముఖ్యంగా, తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడైనా తీర్పును ఆహ్వానించి, దీనిని అమలు చేయబోయే తొలి రాష్ట్రం తమదేనని ప్రకటించడం కూడా ప్రగతీశీల చర్యగానే చెప్పుకోవాలి.
రిజర్వేషన్లను మరింత సమానంగా వర్తింప చేసేందుకు షెడ్యూల్డు కులాలలో ఉప వర్గీకరణకు అనుమతిస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం నూతన చట్టబద్ధమైన ప్రమాణాన్ని అమలులోకి తెచ్చింది. ఏడుగురు న్యాయ మూర్తులతో కూడిన ధర్మాసనం 6-1 మెజారిటీతో ఇచ్చిన తీర్పులో ఎస్‌సి వర్గాలలో సామాజిక న్యాయ అవగాహనను పునర్నిర్వ చిస్తూ, ఈ సమూహంలో కూడా చారిత్రికంగా వస్తున్న అసమానతలను పరిష్కరించవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇది 2004లో ఇ.వి. చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేసులో ఇచ్చిన తీర్పు నుంచి స్పష్టమైన నిష్క్రమణ. ఈ కేసులో కోర్టు ఎస్సీ, ఎస్టీలు ఒక సజాతీయ వర్గమని, దీనిని మరింతగా విభజించలేమంటూ తీర్పు చెప్పింది. దీనికి భిన్నంగా ప్రస్తుతం వచ్చిన తీర్పుతో, అత్యంత అణచివేతకు గురైన వర్గాలకు లబ్ధి చేకూరేలా కోటాలను కేటాయించేందుకు రాష్ట్రాలకు నూతన ద్వారాలను తెరిచింది.
పంజాబ్ ప్రభుత్వం పంజాబ్ షెడ్యూల్డు కాస్ట్ అండ్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (రిజర్వేషన్ ఇన్ సర్వీసెస్) యాక్ట్ 2006 ప్రకారం ఉపవర్గీకరణ చేయాలని నిశ్చయించినప్పుడు దానిని పంజాబ్ అండ్ హరియాణ హైకోర్టు కొట్టివేసింది. దానిని సుప్రీం కోర్టులో సవాలు చేసారు. పంజాబ్ ప్రభుత్వం వర్సెస్ దావిందర్ సింగ్ కేసులో ఇచ్చిన ఈ తీర్పుతో పంజాబ్, తమిళనాడులాంటి రాష్ట్రాలలో ఉపవర్గీకరణకు సంబంధించిన చట్టాలను సుప్రీం కోర్టు సమర్ధించింది. అది పంజాబ్ షెడ్యూల్డు కాస్ట్ అండ్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (రిజర్వేషన్ ఇన్ సర్వీసెస్) యాక్ట్ 2006ను, అరుంతతియార్స్ (స్పెషల్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూ షన్స్ అండ్ అపాయింట్‌మెంట్స్ ఆర్ పోస్ట్స్ ఇన్ ది సెర్విసెస్ అండర్ ది స్టేట్ వితిన్ ది రిజర్వేషన్ ఫర్ ది షెడ్యూల్డ్ కాస్ట్స్) యాక్ట్ 2009ని సమర్ధించింది. ఈ చట్టం ప్రకారం రాష్ట్రంలో అరుంత తియార్లకు ఎస్సీ రిజర్వేషన్లలో 18శాతాన్ని కేటాయించారు.
ఇరవై ఏళ్ల అనంతరం, రిజర్వేషన్లు హిందూ సమాజంలో తగినంత సామాజిక మార్పును వ్యాప్తి చేసినట్టున్నాయి, అందుకే, న్యాయమూర్తులు బి.ఆర్. గవాయ్, విక్రమ్‌నాథ్, పంకజ్ మిత్తల్, సతీష్ చంద్రశర్మ, మనోజ్ మిశ్రతో కలిసి ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ చంద్రచూడ్ హేతుబద్ధమైన సూత్రం ఆధారంగా ఉపవర్గీకరణ అత్యవసరమని నొక్కి చెప్పారు. ధర్మాసనంలో ఏడవ న్యాయమూర్తి జస్టిస్ బేలా వీరితో విభేదించారు. కాగా, వీరిలో జస్టిస్ గవాయ్ దళితుడు అయినప్పటికీ, ఉపవర్గీకర ణకు అనుకూలంగా తీర్పు చెప్పడాన్ని విశేషంగా చెప్పుకో వాలి. షెడ్యూల్డు కులాల రిజర్వేషన్ల ఉపవర్గీ కరణకు భగవద్గీత హేతువు కావడం విశేషంగా చెప్పుకోవల సిన విషయం.
సుప్రీం కోర్టుపై భగవద్గీత ప్రభావం
మార్గదర్శనం కోసం అత్యున్నత న్యాయస్థానం సర్వ శాస్త్ర సారమైన భగవద్గీత సూత్రాలను ఆవాహనం చేసింది. తద్వారా షెడ్యూల్డు కులాలలో ఉపవర్గీకరణకు మార్గాన్ని సుగమం చేసింది. గీతలో బోధించిన ధర్మ, కర్మ సూత్రాలను నొక్కి చెప్తూ, ప్రాచీన హిందూ సమాజం జన్మ ఆధారితమైనది కాదని కూడా పట్టి చూపింది. వ్యక్తి చేసే కర్మలు వారి వర్ణాన్ని నిర్ణయించాయని, కనుక రిజర్వేషన్ లాభాలను ముఠా కట్టినట్టు ఉపయోగించుకోవడాన్ని నిరోధించడం కోసం భారత రాజ్యాంగం హేతుబద్ధ మైన దృష్టితో దానిని చూడాలని ధర్మాసనం అభిప్రాయపడడం సానుకూల విషయం. భగవద్గీతను మార్గదర్శకంగా చేసుకొని చెప్పిన ఈ తీర్పు నిజమైన సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించవలసిన, చారిత్రిక అసమానతలను పరిష్కరించవలసిన అవసరాన్ని నొక్కి చెప్పింది. మరింత సమానమైన, న్యాయమైన సమాజాన్ని సృష్టించేందుకు ఆధునిక న్యాయపరమైన చట్రాలను, ప్రాచీన జ్ఞానంతో సమలేఖనం చేసింది.
ఎస్సీ సమాజంలో అసమానతల గుర్తింపు
ఎస్సీ సమాజంలోనే కొనసాగుతున్న నిరంతర అసమానతలను కోర్టు తీర్పు గుర్తించింది. ఇందులో బలహీనవర్గాలు తమకు అందవలసిన న్యాయమైన ప్రయోజనాలు అందేలా చూడడం ఈ తీర్పు లక్ష్యం. ‘ధర్మం’ అనే కోణం నుంచి చూసిన సుప్రీం కోర్టు ఆధునిక పాలనకు సనాతన, కాలాతీత భగవద్గీత బోధనలను అనువర్తింపచేసింది. కనుకనే, హిందూ భావజాలం ద్వారా చారిత్రిక అన్యాయాలను పరిష్కరించి, నిజమైన సామాజిక సమానతను ప్రోత్సహించాలని నిర్ణయించింది.
ఈ నిర్ణయానికి సహజంగానే రాజకీయ, సామాజిక వర్గాల నుంచి వ్యతిరేక, అనుకూల ప్రతిస్పందనలను వచ్చాయి. కొన్ని పార్టీలు, వ్యక్తులు ఈ తీర్పును చారిత్రిక అసమతుల్యతలను సరిదిద్ద డంలో ముఖ్య అడుగుగా చూసి ప్రశంసించారు. వీరి ప్రకారం ఈ ఉపవర్గీకరణ అనేది ఎస్సీ/ఎస్టీ సమాజంలో అత్యంత అణచివేతకు గురైన వర్గాలకు రిజర్వేషన్ ప్రయోజనాలు చేరేందకు ఉపకరిస్తుంది.
కాగా, ఈ తీర్పు రిజర్వేషన్లకు వ్యతిరేకమైం దంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ/ఎస్టీలలో ఏ కులాన్ని క్రీమీ లేయర్‌గా నిర్ణయించి, మినహాయించాలన్న అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే ఈ తీర్పు అప్పగించింది, తద్వారా రిజర్వేషన్ ప్రయోజనాలను పొందుతున్న సంపన్నులైన ఎస్సీ/ఎస్టీలను మినహాయించేందుకు హేతువును ఆ రాష్ట్రంలో ఉన్న క్షేత్ర స్థాయి పరిస్థితులను బట్టి ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. ఈ పరిస్థితిని ఒక రైలులో జనరల్ కంపార్ట్‌మెంటులో ముందు ఎక్కిన ప్యాసెం జర్లు ఇతరులను ఎక్కనివ్వకుండా అడ్డుకుంటారో అలాంటిదని పోల్చారు జస్టిస్ గవాయ్. దానితో పాటుగా, ఒక ఎస్‌సి ఐఎఎస్, ఐపిఎస్ అధికారి కుమారుడిని, గ్రామపంచాయతీ బడిలో చదువు కుంటున్న బాలుడిని ఒకే గాటన కట్టలేమంటూ వ్యాఖ్యానించడంలో వాస్తవం లేదని ఎవరైనా అనగలమా?
కులతత్వాన్ని పెంచి పోషించింది – జస్టిస్ మిత్తల్
రిజర్వేషన్ విధాన అమలు అన్నది దేశంలో కులతత్వాన్ని పెంచిందని జస్టిస్ పంకజ్ మిత్తల్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు, వెనుకబడిన వర్గాల ఉద్ధరణకు మరింత సమర్ధవంతమైన చర్యలు అవసర మని ఆయన సూచించారు. ఎస్సీ/ఎస్టీ అనేది ఒకేవర్గం కాదని, వీరిలోని కొన్ని కులాల వారితో ఇతరులు సహపంక్తి భోజనం చేయడానికి కూడా ఇష్టపడరని ధర్మాసనం ఎత్తి చూపింది. దీనితో పాటుగా ఎస్సీ/ఎస్టీ వర్గాలలో అణచివేతకు గురయ్యే సమూహాలకు చెందిన విద్యార్ధుల అధిక స్కూల్ డ్రాపౌట్ రేటును కూడా కోర్టు ఉదాహరణగా చూపింది. తద్వారా, ఎవరినైతే రిజర్వేషన్ల ద్వారా ఉద్ధరించవలసి ఉందో వారికి ప్రస్తుత వ్యవస్థలో ఆ ప్రయోజనాలు అందడం లేదని కూడా సూచించింది.
వివరణాత్మకంగా ఈ తీర్పును అర్థం చేసు కుందాం –
ఇ.వి. చిన్నతయ్య తీర్పు రద్దు
సుప్రీం కోర్టు 2004లో ఎస్సీల ఉపవర్గీకరణ చేయడానికి అనుమతి లేదంటూ ఇచ్చిన ఇ.వి. చిన్నయ్య తీర్పును తల్లకిందలు చేసింది. దీనిని తోసిపుచ్చడమన్నది షెడ్యూల్డ్ కులాలలో సామాజిక అసమానత గురించి మరింత సూక్ష్మంగా అర్థం చేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం అనుసరి స్తున్న విధానంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది.
రాజ్యాంగానికి అనుగుణంగానే
ఎస్సీ/ఎస్టీలలో ఈ ఉపవర్గీకరణ అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు) లేదా ఆర్టికల్ 341 (షెడ్యూల్డు కులాల గుర్తింపును శాసించే)ను ఉల్లంఘించడంలేదని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్టికల్ 341 కేవలం ఎస్సీలను గుర్తిస్తుంది తప్ప నిజమైన అవసరాల ఆధారంగా మరింత వర్గీకరణను నిరోధించదని మెజారిటీ అభిప్రాయం నొక్కి చెప్పింది.
అనుభవాత్మక సమర్ధన అవసరం
ఎస్సీలలో నిర్దిష్ట ఉపకులాల ప్రాతినిధ్యంలో లోటుపాట్లు ఉన్నాయని చూపే నిర్ధిష్టమైన అనుభవా త్మక డాటా ఆధారంగా మాత్రమే రాష్ట్రాలు తమ ఉపవర్గీకరణను సమర్ధించుకోవలసి ఉంటుంది. ఇటు వంటి చర్యలు రాజకీయ ప్రయోజనం లేదా ఏకపక్ష నిర్ణయాల కంటే వాస్తవ అసమానతలపై ఆధారపడి ఉన్నాయని నిర్ధారించేందుకు తోడ్పడతాయి.
రాష్ట్రాల చర్యలపై పరిమితులు
ఉపవర్గీకరణను అనుమతించేటప్పుడు నూటికి నూరు శాతం రిజర్వేషన్లనూ ఒకే ఉపకులానికి రాష్ట్రాలు కేటాయించరాదని, ఉపవర్గీకరణను అనుమతిస్తూనే సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సమతుల్యతను నిర్వహిస్తూ, ఎస్సీ వర్గంలో అర్హమైన ఇతర సమూహాలను మినహాయించకుండా నిరోధించేందుకు ఈ నియమాన్ని అమలు చేయాలని స్పష్టం చేశారు.
న్యాయ సమీక్ష – పర్యవేక్షణ
ఎస్సీలలో ఉపవర్గీకరణ చేయాలన్న రాష్ట్రాల నిర్ణయం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది. ఈ పర్యవేక్షణ అన్నది ఈ ప్రక్రియ పారదర్శకంగా సాగేలా, రాష్ట్రాలు రాజ్యాంగం నిర్ణయించిన హద్దు లలో ఉండేలా చూడడమే కాక అధికార దుర్వినియో గాన్ని నిరోధిస్తుంది.
మరింత వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత
మెజారిటీ నిర్ణయంతో ఏకీభవిస్తూ, ఎస్సీలలో మరింత వెనుకబడిన సమూహాలకు రాష్ట్రాలు ప్రాధాన్యతను ఇవ్వవలసిన అవసరాన్ని జస్టిస్ బిఆర్ గవాయ్ పట్టి చూపారు. ప్రస్తుతం ఎస్సీలలో చిన్న వర్గం మాత్రమే రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందు తోందని, చారిత్రిక అన్యాయాలను పరిష్కరించేందుకు మరింత వెనుకబడిన సమూహాలకు అదనపు మద్దతు అవసరమని ఆయన అభిప్రాయ పడ్డారు.
క్రీమీ లేయర్ సూత్రాన్ని ప్రవేశపెట్టడం
ఎస్సీలకు క్రీమీ లేయర్ సూత్రాన్ని అనువర్తింప చేయడమన్నది ఇతర వెనుకబడిన వర్గాలకు (ఓబీసీలు)కు అనువర్తింపచేస్తున్న దానిలానే ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. అంటే, ఎస్సీలలో సంపన్నులైన వారిని రిజర్వేషన్ ప్రయోజనాల నుంచి మినహాయించి, ఈ నిశ్చయా త్మక చర్య సమాజంలో అత్యంత అణచివేతకు గురైన వర్గాలకు చేరేలా ఖరారు చేస్తుందని పేర్కొంది.
విబేధించిన జస్టిస్ బేలా త్రివేది
ఎటువంటి ఉపవర్గీకరణనైనా అనుమతించడ మన్నది రాష్ట్రపతి విడుదల చేసిన ఎస్సీల జాబితాను సవరించడమేనని, దీనిని కేవలం పార్లమెంటు మాత్రమే చేయగలదని జస్టిస్ బేలా త్రివేదీ మెజారిటీ తీర్పుతో విబేధించారు. ఇలాంటి చర్యలు రాజకీయ అవకతవకలకు దారితీస్తాయని, ఎస్సీ జాబితా సమగ్రతను దెబ్బతీసే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు.
శాసన వర్సెస్ కార్యనిర్వాహక అధికారాలు
శాసనపరమైన చర్యలు మాత్రమే ఎస్సీ జాబి తాను సవరించగలవని, కులాలను ఉపవర్గీకరించ డానికి రాష్ట్రాలను అనుమతించడం అన్నది కార్యనిర్వాహక అధికార అతివ్యాప్తిగా పరిగణించేం దుకు ఆస్కారం ఉందని జస్టిస్ త్రివేది ఉద్ఘాటించారు. సామాజిక న్యాయానికి సంబంధించిన వ్యవహారా లలో రాష్ట్రాలు, కేంద్ర అధికారానికి మధ్య గల సున్నితమైన సమతుల్యతను ఆమె అభిప్రాయం సూచిస్తోందని న్యాయనిపుణుల భావన.
సమానత్వాన్ని, వివక్షను సమతులం చేయడం
ఎస్సీలలో సమానత్వాన్ని తేవడం, వివక్షను పరిష్కరించడం మధ్య సమతుల్యతను సాధించడం ఈ తీర్పు లక్ష్యంగా ఉంది. ఉపవర్గీకరణను అనుమ తించడం ద్వారా, వివిధ ఉపకులాలు ఎదుర్కొనే భిన్న సవాళ్లను సుప్రీం కోర్టు గుర్తించడమే కాక మరింత లక్ష్యిత మద్దతు కోసం ఒక న్యాయ చట్రాన్ని అందిస్తోంది.
ముందుకు మార్గం
సుప్రీం కోర్టు తీర్పుపై ఎవరేమన్నా, రిజర్వేషన్ల వ్యవస్థను రద్దు చేయడమనేది జరగదనే విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలి. రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి ప్రయోజనం పొందని వారిని రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేయమని తీర్పు కోరుతోంది. దీనితోపాటుగా, భారతీయ కుల వ్యవస్థపై ఉన్న ప్రచారాన్ని సరి దిద్దేందుకు సుప్రీం కోర్టు తోడ్పడిరది. సమాజ మూల భావన కర్మ ఆధారితమైనదే తప్ప జన్మ ఆధారితమైంది కాదని స్పష్టం చేసేందుకు భగవద్గీతలోని అంశాలను కోర్టు ప్రస్తావించింది. అందరి సంక్షేమాన్ని నొక్కి చెప్పడమే కాక, వ్యక్తుల వర్ణ లేదా సామాజిక హోదాతో సంబంధం లేకుండా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండేలా చూడవలసిన అవసరాన్ని గీత నొక్కి చెప్తుంది.
ఈ తీర్పుతో సరైన దిశలో పయనించేందుకు గీత బోధలను భారత్ గుర్తు పెట్టుకోవలసి ఉంది. నిజమైన సామాజిక న్యాయానికి నిరంతర కృషితో పాటు హిందూ సమాజం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఉపవర్గీకరణ ద్వారా సమాజంలో బలహీనవర్గాలను గుర్తించి, వారికి దానిని అనువర్తింపచేయడం ద్వారా, భవిష్యత్తులో కులమే ‘వర్ణ’ రూపంలోకి తిరిగి వెళ్లవచ్చు. భారత్ అనేది అందరు పౌరులకు గౌరవాన్ని, సమాన అవకాశాలను కల్పించే భూమి అన్న భావన ఉండేది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు సనాతన ధర్మ సారం ఆధారంగా ఇచ్చింది. కనుకనే, వంద కోట్లకుపైగా ఉన్న పౌరులలో అది ఐక్యతను, సమానత్వాన్ని ప్రోత్సహించింది.
కనుక, సుప్రీం కోర్టు తీర్పు కేవలం ఒక న్యాయ పరమైన మైలురాయి కాదు, అది భగవద్గీత స్ఫూర్తితో వచ్చిన నైతిక నిర్దేశం. సామాజిక న్యాయం, రిజర్వేషన్ల పట్ల తమ విధానాన్ని పునరాలోచించు కోమని దేశాన్ని కోరుతోంది. అంతేకాదు, ఎవరికైతే ఎక్కువగా అవసరమో వారికి ఆ రిజర్వేషన్ ప్రయోజ నాలు చేరడం లేదనే విషయాన్ని హిందూ సమాజానికి పట్టి చూపుతోంది. కనుక, ఈ తీర్పు అవసరాన్ని, సారాంశాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఎస్సీ/ఎస్టీలు సమూహాలు నిజమైన సామాజిక సామరస్యాన్ని, పురోగతిని నిర్ధారించవ్చు.
– డి. అరుణ