- డి. అరుణ
బడ్జెట్ అంటే జమా, ఖర్చుల చిట్టా. మన ఇళ్లల్లో కూడా ప్రతి నెలా ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి, అత్యవసర ఖర్చులను బట్టి మన ఇంటి బడ్జెట్‌ను కూడా సర్దుబాటు చేసుకుంటాం. దేశ బడ్జెట్ అయినా అంతే! రాష్ట్రానికి, దేశానికీ సంబంధించిన బడ్జెట్లు భారీగా ఉంటాయి కనుక దాని పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా, కళ్లకు అంత భారీగా అంకెలు కనిపిస్తుంటే ఏదో ఒక రూపంలో పన్ను కడుతున్న ప్రతి పౌరుడికీ అందులో తనకెంత వస్తుందోనన్న ఆశ కలుగుతుంటుంది. ఈసారి బడ్జెట్ విషయంలోనూ అంతే! నిజానికి, ఎన్నికలకు ముందే తాత్కాలిక బడ్జెట్ వచ్చేసింది, అందులోనే చాలా అంశాలను కేంద్రం పొందుపరిచింది. ఇప్పుడు వచ్చిన బడ్జెట్ కొన్ని నెలలకు మాత్రమే సంబంధించింది. అయినప్పటికీ, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే మనం దుబారా ఖర్చులు మానుకొని ఆదా చేసినట్టే, దేశాన్ని ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా నిలిపే దిశలో బడ్జెట్ కూడా చాలా పొదుపుగా, పెద్దగా రాయితీలు లేకుండా వచ్చేసింది. ఆర్ధిక క్రమశిక్షణను నేర్పాలని కటువుగా వ్యవహరించే తండ్రిలా మోదీ కూడా ఈ బడ్జెట్‌ను అదే రీతిలో రూపొందించేలా ఆర్ధికమంత్రిని ప్రోత్సహించినట్టు కనిపిస్తోంది. దీర్ఘకాలిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చేసిన బడ్జెట్‌ను ఈసారి ఒక జమా ఖర్చుల పత్రంలా కాక ఒక ప్రక్రియలా రూపొందించారు. భారం మొత్తాన్నీ కేంద్రమే మోయకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్న రాష్ట్రాలకు, మంత్రిత్వ శాఖలకు, పరిశ్రమలకు తోడ్పడేలా ఇకపై బడ్జెట్‌లు ఉండనున్నాయి. అంతేకాదు, సంప్రదాయ పరామితులను పక్కకు పెట్టి, అవసరమైన చోట మాత్రమే ఖర్చు పెట్టాలన్న దృష్టితో బడ్జెట్‌ను తయారు చేశారు.
ఆర్థిక మంత్రి కూడా ఇందులో అవసరమైన సవరణల కోసం దేశవ్యాప్తంగా పర్యటించి, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, ఇఫ్ఫీ వంటి సంస్థల అభిప్రాయాలను తెలుసుకొని, హేతుబద్ధమైన, లబ్ధి చేకూర్చే సూచనలు వస్తే అవసరమైన మార్పులు చేయనున్నారు. ఇదే దేశ అభివృద్ధికి, పౌరుల జీవన ప్రమాణాలకు మార్గాన్ని సుగమం చేసే ఆర్థిక ప్రక్రియ కానుంది.
ఈసారి బడ్జెట్‌లో మంచి విషయాలే ఎక్కువ ఉన్నాయి. అంతర్గత ఆర్థిక సరళులపై తక్కువ ప్రభావాన్ని బడ్జెట్లు చూపుతున్న సమయంలో బడ్జెట్ చుట్టూ రాజకీయ, మీడియా ఉన్మాదం పెరిగి పోతుండడం విచిత్రమే. మనకు ఫలితాలు కూడా కనిపించడం కష్టమే, ఎందుకంటే, ఈ వ్యయాలు ఆరునెలలకు మాత్రమే వర్తిస్తాయి. ఈ నెలాఖరులోగా ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ఆమోదించాక, వచ్చే బడ్జెట్‌కు కేవలం ఆరు నెలలే మిగులుతాయి. ముఖ్యంగా జనవరి` మార్చి 2025 త్రైమాసికంలో బడ్జెట్ ప్రతిపాదనల ఆధారంగా కాక, అప్పటికే కనిపించే రాబడి, ఖర్చు సరళులపై ఆధారపడి వ్యయాలు ఉంటాయి. అక్టోబర్` డిసెంబర్ త్రైమాసిక సరళులను గమనించిన తర్వాత ఆర్ధిక మంత్రిత్వ శాఖకు వచ్చే అవగాహనను బట్టి మంత్రిత్వ శాఖల ఖర్చులను తగ్గించుకోమని కానీ పెంచమని కానీ సూచనలు అందుకుంటాయని ఆర్ధికవేత్తలు అంటున్నారు. పార్లమెంటు విత్త బిల్లును ఆమోదించిన ఒక నెలవరకూ అనేక బడ్జెట్ పథకాలను అమలు చేయరు కాబట్టి ఈ ఆర్ధిక సంవత్సరంలో ఒక నెల ఊరికే గడిచిపోతుందంటే, విచిత్రంగా అనిపించక మానదు.
ఈ క్రమంలో బడ్జెట్ ప్రతిపాదనల దిశలో ఎటువంటి తప్పూలేదని అనేకమంది ఆర్ధికవేత్తలు చెప్తున్నారు. ఈ ప్రతిపాదనలలో ఉపాధి, స్కిల్లింగ్, మౌలిక సదుపాయాలపై ఖర్చును నిలకడగా ఉంచడం, మూలధన లాభాలను, మూలరేట్ల వద్ద పన్ను తగ్గింపును క్రమబద్ధీకరించడం వంటి వాటిపై కీలకంగా దృష్టి పెట్టిన విషయం మనకు కనిపిస్తుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎం ఇలు)కు, పట్టణాల పేదలకు మరిన్ని ఇళ్ల నిర్మాణానికి పరపతి సజావుగా అందేందుకు ఈ ప్రతిపాదనలు తోడ్పడతాయి. ముఖ్యంగా, అణు ఇంధన రంగంలో తొలిసారిగా ప్రైవేటు సంస్థలు దోహదం చేసే దిశగా ప్రైవేటు భాగస్వామ్యానికి ఆమోదం తెలపడం ఒక మైలురాయి నిర్ణయంగా చెబుతున్నారు. గతంలో చేసిన చట్టాలు ఈ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని నిరోధించాయి. దీనివల్ల కలిగే లాభాలలో నూతన దృక్పధాలకు, పెట్టుబడులకు, నైపుణ్యాలకు చోటు లభించి భారత్ మరింత నిలకడైన, సాంకేతికంగా ఆధునిక భవిష్యత్తు దిశగా పయనించేందుకు అవకాశం లభ్యమవుతుంది.
ఈ బడ్జెట్‌లో ప్రశంసించవలసిన విషయం, కూటమి ప్రభుత్వం అయినప్పటికీ, ఆర్థిక స్థిరీకరణ పధానికే ఈ బడ్జెట్టు కట్టుబడి ఉండడం. అనేక సందర్భాలలో ప్రభుత్వాలు, తమ కూటమిలో ఉన్న పార్టీలకు తల ఒగ్గడం మనం చూసే ఉన్నాం. అయితే, ఈసారి అలా జరుగకుండా ఉండడం ప్రభుత్వ నిబద్ధతకు ఒక తార్కాణంగా చెప్పుకోక తప్పదు. బీజేపీకి సార్వత్రిక ఎన్నికలలో వచ్చిన ఫలితాలు, త్వరలోనే జరుగనున్న మూడు రాష్ట్రాల ఎన్నికలు (మహారాష్ట్ర, రaార్ఖండ్, హరియాణా) నేపథ్యంలోనూ ఆర్ధిక మంత్రి ఉచితాలను ప్రకటించా లన్న ఉత్సాహాన్ని మోడీ ప్రభుత్వం నిలవరించు కోవడం నిజంగా హర్షించవలసిన విషయం. ఫిబ్ర వరిలో తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నప్పుడు కూడా ఉచితాల జోలికి పోని ప్రధాని ఈసారి కూడా యుక్తమైన ఆర్ధిక ఆలోచనలకే కట్టుబడి ఉన్నారు.
ఎన్నికలకు ముందు ఏమీ ఇవ్వకపోయినా, గెలిచిన తర్వాత అయినా ఏదో ఒకటి ఇవ్వకపోతారా అని అందరూ ఎదురు చూస్తున్న 2024`25 ఆర్ధిక సంవత్సరపు బడ్జెట్లో ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలతో పాటు ఆర్థిక రంగంలో పలు వ్యవస్థలకు ప్రోత్సాహాన్ని ఇచ్చేలా పలు మార్పులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఆర్థిక మంత్రి చేసిన కీలక ప్రకటనలు ఏమిటో చూద్దాం `
కస్టమ్స్ డ్యూటీలో సవరణలు
- బంగారం, వెండి, ప్లాటినం:
బంగారం వెండిపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 6శాతానికి, ప్లాటినమ్‌పై సుంకాన్ని 6.4శాతానికి తగ్గించారు. పోటీతత్వాన్ని పెంచేందుకు తక్కువ సుంకాలను ప్రతిపాదిస్తున్న ఆభరణాలు, విలువైన రాళ్ల పరిశ్రమకు ఈ చర్య ప్రయోజనాన్ని చేకూరుస్తుందని భావిస్తున్నారు.
- లోహయుక్త నికెల్,
దుక్కరాగి (ఫెర్రోనికెల్, బ్లిస్టర్ కాపర్):
ఈ లోహాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని తొలగించారు. ఇది తత్సంబంధిత పరిశ్రమలకు వ్యయాన్ని తగ్గించేందుకు తోడ్పడుతుందని అంచనా.
- టెలికాం పరికరాలు:
నిర్ధిష్టమైన టెలికాం పరికరాలపై సుంకాన్ని 10 నుంచి 15శాతాన్ని పెంచారు. ఇది దేశీయ పరిశ్రమను ప్రోత్సహించే చర్యగా పలువురు భావిస్తున్నారు.
- వైద్య పరికరాలు:
వైద్యపరంగా ఎక్స్`రే మెషీన్లలో ఉపయోగించేం దుకు ఎక్స్`రే ట్యూబులు, చదునైన పానెల్ డిటెక్టర్లపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలన్న ప్రతిపాదన హర్షణీయం.
ఇది దేశీయ సామర్ధ్యాల జోడిరపు, స్థానిక ఉత్సత్తి రంగానికి తోడ్పాటుతోపాటు కాన్సర్ రోగుల వ్యాధినిర్ధారణ ఖచ్చితత్వాన్ని, చికిత్సా ఫలితాలను మెరుగుపరచేందుకు ఆధునిక సాంకేతిక అందుబాటులో ఉండేలా హామీ.
వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం
వ్యవసాయ రంగం, రైతాంగం పట్ల మోదీ ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో పని చేస్తోంది. ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు పలు చర్యలను బడ్జెట్‌లో ప్రకటించడం జరిగింది.
- అధిక దిగుబడిని ఇచ్చే పంటలు:
32 రకాల ఆహార ధాన్యాల, ఉద్యాన పంటల కోసం 109 అధిక దిగుబడినిచ్చే, వాతావరణ మార్పులను తట్టుకోగల రకాల విడుదల.
- డిజిటల్ పంట సర్వే
వ్యవసాయానికి సార్వజనిక డిజిటల్ మౌలిక సదుపాయాలను పెంచేందుకు 400 జిల్లాల్లో అమలు.
- చమురు విత్తనాల వ్యూహం
విదేశీ మారకాన్ని తగ్గించి, దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు చమురు విత్తనాల ఉత్పత్తిలో స్వావలంబనను సాధించే కృషికి ప్రోత్సాహం.
వ్యవసాయ ఆధునీకరణ
- బడ్జెట్ కేటాయింపు:
గత ఏడాదితో పోలిస్తే 21.6శాతం పెంపుతో బడ్జెట్ కేటాయింపును 1.52 లక్షల కోట్లకు పెంచారు.
- సార్వజనీన డిజిటల్ మౌలికసదుపాయాలు
వీటిని అభివృద్ధి చేయడం ద్వారా రైతులకు పరపతి అందుబాటును మెరుగుపరచేందుకు లంకెలను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
- వ్యవసాయ – మౌలికసదుపాయ నిధి
గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను పెంచేందుకు కేటాయింపులు రూ. 30,000 కోట్లకు పెంపు చేశారు.
గ్రామీణ ఆదాయాలకు ప్రోత్సాహం
మెరుగైన కనీస మద్దతు ధరలు (ఎంఎస్పీ) పెంపు, గ్రామీణ ఆదాయాలను, అనుసంధానతను మెరుగుపరిచేందుకు పిఎంజిఎస్‌వై 4ఫేజ్‌ను (ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన) ప్రారం భించడం, ఆటో అమ్మకాలను పెంచే సంభావ్యతను పరిశీలించడం.
ఉపాధి, స్కిల్లింగ్
ముద్రా రుణాల పెంపు, ఉపాధి అనుసంధాన ప్రోత్సాహకాలు వంటి పథకాల ద్వారా వ్యవస్థాపకత, ఉపాధి సృష్టిపై దృష్టి. వ్యవస్థాపకతను ప్రోత్స హించడం ద్వారా దేశీయ వినిమయాన్ని, ఎగుమతు లను పెంచేందుకు అవకాశం లభ్యమవుతుంది.
స్టార్టప్ ఇకో సిస్టం పెంపు, పెట్టుబడులకు ప్రోత్సాహం
గతంలో ఏదైనా సంస్థలలో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా దానికి కూడా పన్ను కట్టవలసి ఉండేది. ఇప్పుడు పెట్టుబడులపై వేసే ‘ఏంజెల్ టాక్స్’ను రద్దు చేయడం అన్ని వర్గాల పెట్టుబడిదారులకు ఉపయోగకరం కానుంది. దీని ఫలితంగా నూతనంగా పెట్టే సంస్థలకు అంటే స్టార్టప్‌లకు లాభం చేకూరనుంది. ఈ చర్య దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించి శక్తిమంతమైన స్టార్టప్ వాతావరణాన్ని పెంచిపోషిస్తుంది.
స్టార్టప్ వృద్ధి
ఈ చర్య ఎఐ రంగం (కృత్రిమ మేథా)లో ఆవిష్కరణలను, వ్యవస్థాపక స్ఫూర్తిని ప్రోత్సహిస్తుంది.
నైపుణ్యాల అభివృద్ధి
పరిశ్రమలకు సంబంధించిన 1,000 శిక్షణా సంస్థలు నైపుణ్యాల అంతరాన్ని తగ్గించడమే కాకుండా భవిష్యత్ ఉద్యోగాలకు యువతను సన్నద్ధం చేస్తాయి. ముఖ్యంగా మహిళల నేతృత్వంలో అభివృద్ధి, ఎఐ`తోడ్పాటుతో వారి నైపుణ్యాలను పెంచడం దీని లక్ష్యం. ముఖ్యంగా, కార్పొరేట్ రంగం సామాజిక బాధ్యతతో ఇచ్చే నిధులను యువతకు స్కాలర్‌షిప్‌ల రూపంలో ఇచ్చి, వారి నైపుణ్యాలను పెంచడం ద్వారా ఉపాధికి అర్హులుగా తయారు చేయాలని చేసిన ప్రతిపాదన భవిష్యత్తులో నిరుద్యోగ సమస్యను తగ్గించనుంది.
పరిశోధన, ఆవిష్కరణలకు ప్రోత్సాహం
జన విశ్వాస్ బిల్లు, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ వంటి చొరవలు పరిశోధనలను ప్రోత్సహించ డమే కాక వ్యాపారం చేయడాన్ని సులభతరం చేస్తాయి. కాగా, ప్రభుత్వం ఈ పరిశోధనలకు దిశను నిర్ణయించి, పర్యవేక్షించేందుకు నిపుణులను నియమించుకుంటే ఈ ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశముంది. లేదంటే పరిశోధనా సంస్థలు కూడా బ్యూరోక్రటిక్ పద్ధతిలో చిక్కుకుని లక్ష్యమే విఫలమయ్యే అవకాశం మెండు.
ఇంధన పరివర్తన విధానాలు
కర్బనీకరణను తగ్గించడం క్లిష్టమైన రంగాలలో అణు ఇంధనం, ఉష్ణాధార విద్యుదుత్పత్తిని వినియో గించడంపై దృష్టి పెట్టి ఇంధన పరివర్తనకు మార్గాలను, ఇంధన నిల్వ వ్యవస్థలను ప్రతిపాదిస్తూ, ఇంధన పరివర్తన విధాన పత్రాలను ఈసారి బడ్జెట్లో ప్రవేశపెట్టడం హర్షణీయం. ముఖ్యంగా, అణు ఇంధ నంలోకి ప్రైవేటు భాగస్వాములను అనుమతించాలని నిర్ణయించిన నేపథ్యంలో జీరోకార్బన్ దిశగా ప్రయాణం సులువుకానుందని నిపుణుల భావన.
పర్యావరణం, హరిత ఇంధనాలలో పెట్టుబడులకు ప్రోత్సాహం
పర్యావరణ అనుకూల ప్రాజెక్టులలో హరిత పెట్టుబడులను, మూలధనాన్ని ఆకర్షించేందుకు, పెట్టుబడిదారుల విశ్వాసం సడలకుండా పారదర్శ కతకు హామీ ఇస్తూ ఒక చట్రాన్ని రూపొందించాలన్న ప్రభుత్వ నిర్ణయం ఆ పరిశ్రమల నుంచి ప్రశంసలను అందుకుంటోంది.
మహిళా ఉద్యోగులకు సౌకర్యాలు
ఆర్ధిక వ్యవస్థలో మహిళా శ్రామికశక్తిని ప్రోత్సహించేందుకు ఈసారి బడ్జెట్లో పలు ప్రోత్సాహ కాలను ప్రకటించారు. హాస్టళ్లు, క్రెచ్‌లు, నైపుణ్యాల వృద్ధి కార్యక్రమాల ద్వారా వారిని ఇందులో సమ్మిళితం చేయాలన్నది లక్ష్యం. అందులో భాగం గానే మహిళా ఉద్యోగులు పిల్లల సంరక్షణను, ఇంట్లో వృద్ధుల సంరక్షణ బాధ్యతలను సమతులం చేసుకోవడానికి తోడ్పడేలా సీనియర్ కేర్‌ను ఉద్యోగ లబ్ధిగా ప్రకటించడం హర్షణీయమైన చర్య. ఉద్యోగం చేస్తున్న మహిళలు తమ కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తున్నామన్న భావనకు గురికాకుండా, మరింత నిబద్ధతతో పనిచేసేందుకు ఇది తోడ్పడుతుంది.
సరఫరా లంకెల అభివృద్ధి
కీలక ఖనిజాల సరఫరా లంకె అభివృద్ధి సామర్ధ్యాలను పెంచుకునేందుకు ప్రైవేటు, ప్రభుత్వ కంపెనీలను ప్రోత్సహించనున్నట్టు బడ్జెట్‌లో ప్రకటించారు. తద్వారా పర్యావరణ అనుకూల ఇంధనాన్ని ఉత్పత్తి చేసే దేశీయ ఉత్పాదక రంగాలకు తోడ్పాటును అందించడం దీని లక్ష్యం.
మౌలిక సదుపాయాల అభివృద్ధి
ఆర్ధిక వ్యవస్థపై బలమైన గుణక ప్రభావాన్ని (మల్టిప్లైయర్ ఎఫెక్ట్) చూపిన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై భారీ పెట్టుబడులనే ఈ బడ్జెట్ కేటాయిం చింది. ఇతర ప్రాధాన్యతలను, విత్త స్థిరీకరణను సమతులం చేస్తూనే రానున్న ఐదేళ్ల వరకూ ప్రభుత్వం బలమైన ఆర్ధిక తోడ్పాటును అందించనుంది. అందులో భాగంగానే, రూ. 11,11,111 కోట్ల కాపెక్స్‌ను అంటే జీడీపీలో 3.4 శాతాన్ని కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా, అమృత్‌సర్, కోల్‌కతా పారిశ్రామిక కారిడార్‌పై గయలో ఒక పారిశ్రామిక నోడ్ (వ్యాపారాలకు కీలక సేవలను సమర్ధవంతంగా అందించే ప్రాంతం) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది.
దీనితో పాటుగా రూ. 26వేల కోట్ల వ్యయంతో 1. పాట్నా`పూర్నియా ఎక్స్‌ప్రెస్‌వే, 2.బక్సర్ భగల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ వే, 3. బోధగయా, రాజగిర్, వైశాలీ, దర్భంగా మార్గాలను వేగవంతంగా పూర్తి చేయడం, 4. బక్సర్ వద్ద గంగా నదిపై అదనపు 2 లేన్ వంతెన నిర్మాణం ఉన్నాయి.
అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ నూతన రాజధాని అమరావతి అభివృద్ధి కోసం రూ. 15,000 కోట్ల కేటాయింపు. ఇతరత్రా అభివృద్ధి కోసం మల్టీలేటరల్ సంస్థల నుంచి రుణ సౌకర్యం పొందేందుకు తోడ్పాటును ఆ రాష్ట్రానికి హామీ ఇచ్చింది.
పర్యాటక వృద్ధి
ఇన్‌క్రెడిబుల్ ఇండియా 3.0ను సాధించేందుకు దేశీయంగా పర్యాటకాన్ని ప్రోత్సహించాలని గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు మొత్తాలను ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయించారు. ఇందులో భాగంగా గయలోని విష్ణుపాద ఆలయం, బోధగయలోని మహా బోధి ఆలయం వంటి మతపరమైన పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. వీటిని కాశీ కారిడార్ తరహాలో రూపొందించాలని ప్రణాళిక. బిహార్‌లోనే రాజ్‌గిర్ ప్రాంతాన్ని, నలందను కూడా అభివృద్ధి చేయనున్నారు. దీనితోపాటు ఒడిషాలో కూడా పర్యాటక వృద్ధికి నిధులు ప్రకటిం చారు. స్వదేశ్ దర్శన్ పథకం కింద కొన్ని నిర్ధిష్ట ఇతివృత్తాలతో పర్యాటక సర్క్యూట్‌లను అభివృద్ధి చేయడం, ఆధ్యాత్మిక యాత్రలను ప్రోత్సహించేందుకు ‘ప్రసాద్’ పథకానికి కేటాయింపులు చేశారు.
విదేశాలు సహా దేశీయంగా ప్రచారం, తగిన సౌకర్యాల కల్పనతో పర్యాటక రంగం భారత్‌కు విదేశీ మారకాన్ని తెచ్చిపెట్టే పాడి ఆవు అవుతుంది. భారత్‌కు ఆధ్యాత్మికంగా ఉన్న పేరు ప్రతిష్ఠలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పర్యాటకులను ఆకర్షించేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేయవలసి ఉంటుంది.
బడ్జెట్ పై నిరర్ధక విమర్శలు
స్థూలంగా బడ్జెట్‌లో ప్రధాన ప్రతిపాదనలు ఇవి. నిజానికి బడ్జెట్ ప్రతిపాదనలపై వస్తున్న విమర్శలన్నీ రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నవే, అందులో ఎక్కడో అణుమాత్రం సత్యం ఉండవచ్చు తప్ప అదే పరమ సత్యం కాదు. అవేంటో చూద్దాం`
మొదటగా కూటమి భాగస్వాములైన తెలుగు దేశం, జనతాదళ్ (యు)లకు ఇతర రాష్ట్రాలకు నష్టం చేకూరుస్తూ బిహార్, ఆంధ్రప్రదేశ్‌లకు ప్రాధాన్యతలను ఇచ్చారని ప్రతిపక్షాలు విమర్శలు చేయడం అవివేకం. ఎందుకంటే, బడ్జెట్ అనేది ఈ దేశానికి మొత్తానికి సంబంధించిందే తప్ప ఈ రెండు రాష్ట్రాలకూ కాదు. ఒకవేళ వారికి ఎక్కువ ఇచ్చినా, పేద రాష్ట్రమైన బిహార్‌కు లేదా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మించుకునేందుకు తోడ్పడడంలో నైతికంగా ఎటువంటి తప్పు ఉండదు. ఆంధ్రప్రదేశ్‌ను 2014లో విభజించే సమయంలో ఆ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కేంద్రం నిలబెట్టుకోలేదు.
పూర్వోదయ రాష్ట్రాలకు (పేద) నిధుల కేటాయింపు కేవలం బిహార్‌కే జరుగలేదు, అవి రaార్ఖండ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్‌కు కూడా తోడ్పడ తాయి. వరద నియంత్రణ చర్యలకు కేటాయించిన నిధుల విషయమైనా అంతే, అవి హిమాచల్‌కు, ఉత్తరాఖండ్‌కు కూడా అందుతాయి. అన్నింటికన్నా ఇక్కడ గుర్తించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, ఈ వ్యయాలన్నీ కూడా కుదించిన ఈ బడ్జెట్ సంవత్సరంలోనే జరుగవు. అవి పలు ఏళ్లకు వ్యాపిస్తాయి. ఇతర రాష్ట్రాలు తమ బకాయిలను వచ్చే ఏడాది పొందేందుకు ఆస్కారం ఉంది.
ఇక మరొక విమర్శ ఉపాధి, ఉద్యోగాలకు సంబంధించింది. బడ్జెట్‌లో ఉపాధి కల్పనకు మూడు, స్కిల్లింగ్‌కు రెండు పథకాలు ఉన్నాయి. ఈ పథకాలన్నీ విఫలమవుతాయన్నట్టు ప్రతిపక్షాలు మాట్లాడు తున్నప్పటికీ, అన్నీ విఫలం కావడం వారి కోరిక తప్ప సత్యం కాదు. ఈలోగా, ప్రభుత్వం ఏదో ఒక స్థాయిలో వీటిని అమలు చేసి, ఏది బాగా పని చేస్తోందో తెలుసుకుని, ఆ పథకానికి వచ్చే బడ్జెట్‌లో నిధులను ఎక్కువగా కేటాయించవచ్చు. ఇందుకోసం ఈ పథకాల అమలును పర్యవేక్షించి, అప్పటికప్పుడు అవసరమైన దిద్దుబాటు చర్యలను సూచించే ఉపాధి, స్కిల్లింగ్ నిపుణుడిని ప్రభుత్వం నియమించుకోవాలి. ఆ వ్యక్తి రాష్ట్రాలను కూడా కలుపుకుపోయేలా ఉండాలి.
పలు కారణాలతో అసలైన పాలక వ్యవస్థలైన రాష్ట్రాలూ, స్థానిక సంస్థలు ఉపాధి, ఉపాధి నైపుణ్యాలను పెంపొందించేందుకు చేపట్టిన సంస్కరణలను అడ్డుకుంటుండగా, అంతా కేంద్రమే చేయాలని ఆశించడం సమంజసం కాదు కదా?
పన్నులు కట్టే ఉద్యోగులకు ఎటువంటి ఊరటను కల్పించలేదనే విమర్శ ఉంది. అయితే, ఈ నూతన పన్నుల వ్యవస్థలో తక్కువ కోతలు ఉన్నప్పటికీ, పన్ను రహిత పరిమితిని పెంచిందనేది వాస్తవం.
అలాగే, వివిధ తరగతుల ఆస్తులకు సంబంధించి మూలధన లాభాల పన్ను విధానంలో మార్పులు మార్కెట్లు, రియల్ ఎస్టేట్‌లపై ప్రభావం చూపుతాయనే విమర్శ కూడా ఉంది. లిస్టెడ్ షేర్లకు దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్‌టిసిజి) పన్ను 12.5 శాతానికి పెరిగ్గా, రియల్ ఎస్టేట్‌కు అదే స్థాయికి తగ్గించారు.
కానీ, రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ కూడా కాస్ట్ ఇండెక్సేషన్ గతంలో ఉన్న ప్రయోజనాన్ని కోల్పోయింది. ఫ్యూచర్స్, ఆప్షన్స్ వ్యాపారం కోసం సెక్యూరిటీల లావాదేవీల పన్ను (ఎస్‌టిటి) కూడా పెంచగా, దానితో పాటుగా షేర్ల నుండి స్వల్పకాలిక మూలధన లాభాలపై కూడా పెంచారు.
దీనిపై వస్తున్న విమర్శలు మరీ అతిగా ఉంటున్నాయి. ఉపాధిని పెంపొందించడం దీర్ఘకాలిక లక్ష్యం అయితే, శ్రమకు, శ్రామిక శక్తికి విరుద్ధంగా మూలధన పెట్టుబడి నుంచి వచ్చే ఆదాయానికి అధిక ప్రోత్సాహకాలు ఉండ కూడదని నిపుణులు చెబుతున్నారు. పైగా, వ్యక్తుల పై అత్యధిక పన్ను రేటు 30 శాతం-ప్లస్ అయినప్పుడు, ఇది ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రుణ నిధుల నుండి వచ్చే ఆదాయాలకు వర్తిస్తున్నప్పుడు, దీర్ఘకాలిక మూలధన లాభాలపై ఆ స్థాయిలో మూడవ వంతు పన్ను విధించడంలో తర్కం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఖచ్చితంగా రిస్క్ క్యాపిటల్‌ను ప్రోత్సహించాలి, అయితే అసలు సమస్య మూలధనం, శ్రమపై ఆర్జించే ఆదాయాల రేట్ల మధ్య గల భారీ అంతరం. ఈ అంతరాన్ని కొంతమేరకు మూసివేయడం అవసరం, అందుకోసం ప్రత్యేకించి ఉద్యోగాల ఆటోమేషన్ ఆచరణీయమైన ఎంపికే అయినా, ఎక్కువమంది కార్మికులను నియమించుకునేలా కంపెనీలను ఆ యత్నం ప్రోత్సహించాలి.
ఎంఎస్‌ఎంఇలు, పట్టణ గృహ నిర్మాణాలకు సంబంధించిన అంశాలు కూడా ఉపాధి సృష్టి బాటలోనే ఉన్నాయి. అంతేకాదు, పెద్ద కంపెనీలు కాకుండా ఎంఎస్‌ఎంఇలు, స్టార్టప్‌లు (ఏంజెల్ ట్యాక్స్ రద్దు నుండి ప్రయోజనం పొందు తాయి) ఉద్యోగాలలో వృద్ధికి చోదకులుగా ఉంటాయి.
గమనించదగ్గ పెద్ద విషయం ఏమిటంటే, బడ్జెట్ ప్రవేశపెడుతున్న అన్ని పథకాలు – అది ఉపాధి, నైపుణ్యం, ఎంఎస్‌ఎంఇలకు మద్దతు, పట్టణ గృహాలు లేదా మూలధన లాభాలపై అధిక పన్నులు వంటివన్నీ కూడా కార్మికులకు అనుకూలంగా పథకాలు అమలయ్యేలా సమలేఖనం కావడం.
రుణ – జీడీపీ నిష్పత్తి
ప్రస్తుతం భారతదేశానికి అతిపెద్ద భారంగా మారింది రుణ-జీడీపీ (స్థూల దేశీయ ఉత్పత్తి) నిష్పత్తి కనుకనే ప్రభుత్వం దీనిని తగ్గించడంపై ఎక్కువగా దృష్టి పెట్టింది. దీని కారణంగానే, ప్రస్తుతం రూ.7.1 లక్షల కోట్లగా ఉన్న మార్కెట్ రుణాలను మహమ్మారి కాలానికి ముందు ఉన్న సాధారణ స్థాయికి తెచ్చే సంకల్పంతో ఉంది. ఉపాధిని ప్రోత్సహించేందుకు పథకాలను, కొన్ని రాష్ట్రాలకు సహాయాన్ని 2024-25 బడ్జెట్‌లో ప్రకటించినప్పటికీ, విత్త స్థిరీకరణ మార్గానికే కట్టుబడి ఉండాలన్న ఉద్దేశాన్ని ఉద్ఘాటిస్తూ విత్త లోటు లక్ష్యాన్ని తగ్గించింది. ముఖ్యంగా, తాత్కాలిక బడ్జెట్లో ప్రకటించిన 5.1 శాతం నుంచి 4.9 శాతానికి విత్త లోటు లక్ష్యాన్ని తగ్గించినట్టు రేటింగ్ ఏజెన్సీలకు సంకేతాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. అంటే, జీడీపీలో కేంద్ర ప్రభుత్వ రుణ శాతం తగ్గుతూ వస్తుందనే విషయాన్ని నొక్కి చెప్పింది. అంతేకాదు, జీడీపీలో కేంద్ర ప్రభుత్వ రుణశాతం తగ్గిస్తూ, ప్రతి ఏడాదీ విత్త రుణాన్ని తగ్గించడమే 2026`27 నుంచి తమ ప్రయత్నంగా ఉంటుందని ఆర్థిక మంత్రి సీతారామన్ తన ఉపన్యాసంలో ప్రకటిస్తూ, ఒక స్థాయిని మించి విత్తలోటు దాటకూడ దన్నారు. డెట్ డైనమిక్స్ లెక్కింపులోకి వెళ్లే ప్రస్తుత మున్న వృద్ధి రేట్లు, వడ్డీ రేట్లు, ఇతర కొలమానాలపై ఆధారపడి ఇది ఉంటుందని ఆర్ధిక మంత్రి చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరానికి విత్త లోటును తగ్గించేందుకు రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయాన్ని కుదింపు చేశారు. ప్రభుత్వ ఖర్చు 1.3శాతం పడిపోయింది. మూలధన వ్యయం కూడా 0.2 శాతం తగ్గి, అంచనాల కన్నా కిందకు వచ్చింది.
ఈ చర్యల కారణంగా దీర్ఘకాలిక విత్త లోటు 3శాతం ఉంచాలన్న లక్ష్యం ఇకపై కల కాదు. రుణాన్ని ‘క్షీణించే మార్గంలో’ ఉంచాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని బడ్జెట్ ఎత్తి చూపింది. రేటింగ్ సంస్థ అయిన ఫిచ్ ప్రకారం, విదేశీ కంపెనీలకు ప్రభుత్వం కార్పొరేట్ పన్నును 40శాతం నుండి 35 శాతానికి తగ్గించడం, దాని పబ్లిక్ క్యాపెక్స్-ఆధారిత మౌలిక సదు పాయాలకల్పనకు ప్రోత్సాహం, ఉత్పత్తి పెట్టుబడులకు సానుకూల సంకేతం అని పేర్కొంది. కాగా, మధ్యకాలికంగా, నిలకడగా విత్త స్థిరీకరణ చేయడం అన్నది రుణ`జీడీపీ నిష్పత్తిని తగ్గించేందుకు తోడ్పడడమే కాక, స్థూల ఆర్ధిక పనితీరు, విదేశీ పెట్టుబడులకు గల సానుకూల వేగాన్ని కలిపినప్పుడు భారత్ రేటింగ్ పెరిగేందుకు మార్గం సుగమం అవుతుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ పేర్కొనడం ఒక శుభశూచకం.
మొత్తం మీద ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర బడ్జెట్ వ్యవసాయ ఆధునీకరణ, ఆరోగ్యసంరక్షణను మెరుగుపరిచి అందుబాటులోకి తేవడం, పన్ను నిబంధనలను సరళీకరించడం, మౌలిక సదుపాయాలను పెంచడం, నిలకడైన పద్ధతులను ప్రోత్సహించడం అన్నవి సమతులమైన, సమ్మిళిత వృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను పట్టి చూపు తుంది. అయితే, వీటిని సమర్ధవంతంగా అమలు చేయడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం అన్నవి ఈ చొరవల లాభాలను పూర్తి స్థాయిలో సాకారం చేసేందుకు అవసరం.