ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యం. గత శతాబ్దం వరకూ ప్రపంచ రాజకీయాల కేంద్రస్థానం. వలసపాలనలో దేశదేశాల నుంచి దోచి తెచ్చిన సంపదతో విలాసవంతంగా ఆవిర్భవించిన రాజ్యం. అది ఇంగ్లండ్‌. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న ఇంగ్లండ్‌ ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుపుతున్న భయానక నేలగా మారిపోయింది. ఒకవైపు వలసవాదులపై పార్‌ రైటిస్టుల దాడులు.. మరోవైపు వలసవాదులకు మద్దతుగా జాతి వివక్ష వ్యతిరేక నిరసనకారుల ముసుగులోని లిబరల్‌, సెక్యులర్‌ ముఠాల ఆందోళనలు. వెరసి అగ్నిగుండంగా మారిపోయింది. పైకి ఒప్పుకోకపోయినా ఒక రకంగా ఇది అంతర్యుద్ధమే. ఇప్పుడు ప్రపంచమంతా వినిపిస్తున్న ప్రశ్న` బ్రిటన్‌లో ఏం జరుగుతోంది?

గత నాలుగు వారాలుగా యునైటెడ్‌ కింగ్‌డమ్‌ అల్లర్లతో అట్టుడికిపోతోంది. లండన్‌ సహా అనేక నగరాల్లో విచ్చల విడిగా దాడులు, లూటీలు, దహనాలు జరిగిపోతున్నాయి. ఇది వలసదార్లు, వలస వ్యతిరేక వర్గాలకు మధ్య జరుగుతున్న పోరాటం. ఒకవైపు పార్‌ నేషనలిస్టులు, మరోవైపు సోకాల్డ్‌ జాతివివక్ష వ్యతిరేక నిరసనకారులు దాడులు చేసుకుంటున్నారు. దుకాణాలు, వాహనాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను దహనం చేస్తున్నారు. లివర్‌పూల్‌, మాంచెస్టర్‌, బ్రిస్టల్‌, హల్‌, స్టోక్‌ ఆన్‌ ట్రెంట్‌, బ్లాక్‌పూల్‌, లీడ్స్‌, బెల్‌ఫాస్ట్‌, నాటింగ్‌హామ్‌ తదితర నగరాలు ఉద్రిక్తంగా మారిపోయాయి. అందుకే ఇది అంతర్యుద్ధమని చెబుతున్నారు.

చౌకగా దొరికే శ్రామికశక్తి కోసం బ్రిటన్‌ వలసలను ప్రోత్సహించింది. వారే ఇప్పడు అత్యధికులుగా మారే ప్రమాదం ఏర్పడిరది. స్థానిక బ్రిటిషర్లు క్రమంగా అల్పసంఖ్యాకులుగా మారిపోతున్నారు. వలసవచ్చిన వారి కారణంగా మతోన్మాదం, జిహాదీ ఉగ్రవాదం పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ గొడవలతోనే బ్రిటన్‌ అట్టుడికిపోతోంది.

వలసల వెనుక మరో కోణం

200 ఏండ్లకు పైగా వలసవాద పాలన సాగించిన చరిత్ర బ్రిటన్‌ది. వీరి అరాచకాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు తమ ఏలుబడిలో ఉన్న దేశాల నుంచి బ్రిటన్‌కు వలస వచ్చేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు వలసవస్తున్న వారిలో రకరకాల దృక్ఫథాలున్నవారు కనిపిస్తారు. మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో తమ కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలని భావించే మధ్యతరగతి వర్గాలు ఉంటాయి. ముఖ్యంగా భారత్‌ నుంచి వెళ్లేవారు ఇందుకు ఉదాహరణ. ఇలా వలసదార్ల సంతతి వారు విద్య, వ్యాపార రంగాల్లో ముందంజ సాధిస్తున్నారు. భారతీయ సంతతికి చెందిన రుషి సునాక్‌ మొన్నటివరకు బ్రిటన్‌ ప్రధాని పదవిని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.

పశ్చిమాసియాతో పాటు ఇస్లామిక్‌ దేశాల నుంచి బ్రిటన్‌కు వస్తున్నవారి ఆలోచనా విధానం వేరుగా ఉంది. వీరంతా డ్రైవర్లుగా, హోటళ్లు, పెట్రోల్‌ బంకులు, ఇళ్లలో పని చేసేవారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారే. ఇలాంటి వలసలతో అక్కడ ముస్లిం సమాజం బలంగా ఎదుగుతోంది. మసీదులు పెద్ద సంఖ్యలో ఏర్పడాయి. కొన్ని ప్రాంతాలకు వెళ్లితే ఇది క్రైస్తవ దేశమా లేక పాకిస్తాన్‌ లాంటి ముస్లిం దేశమా అని ఆశ్యర్యపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. వీరంతా శాంతి సామరస్యాలతో అక్కడి సమాజంలో కలిసిపోతే ఎలాంటి సమస్య ఉండదు. బ్రిటన్‌ సమాజంలో నేరాలు పెరిగిపోవడానికి కారణం పలానావారు అని ఆరోపించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి తోడు అక్కడ ఇస్లామిక్‌ జీహాదీలు ఆందోళన కలిగిస్తున్నారు

క్రైస్తవాన్ని పాటించే బ్రిటిష్‌వారు ఒకప్పుడు హుందాగా జీవించేవారు. ఇప్పుడు తమ సొంత దేశంలోనే మైనారిటీలుగా మారిపోతున్నామని వారిలో ఆందోళన మొదలైంది. బ్రిటన్‌లోని సెక్యులర్‌, లిబరల్‌ మనస్తత్వం కలిగిన రాజకీయ నాయకులు తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇదంతాచూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. బ్రిటన్‌కు వచ్చే శరణార్థులు, వలసదారుల పట్ల అక్కడి ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తున్నది. వారికి రాయితీలు ఉంటాయి. ఈ సౌకర్యాలు తమకు దక్కడం లేదని సాధారణ బ్రిటిష్‌ పౌరులు భావిస్తున్నారు. నిరుద్యోగ సమస్య అధికంగా ఉంది. ఈ కారణంగానే వారు వలసదారులపై, ముఖ్యంగా ముస్లింలపై ద్వేషం పెంచుకుంటున్నారు. కానీ అక్కడి సోకాల్డ్‌ ఉదారవాదులు, లిబరర్లు ఈ భయాన్ని ఇస్లామిక్‌ ఫోబియా అంటూ కొట్టిపారేస్తున్నారు

లండనిస్తాన్‌

ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన బ్రిటిష్‌వారి రాజధాని లండన్‌. భవిష్యత్తులో ఈ చారిత్రక నగరం తమదని వారు చెప్పుకోలేకపోవచ్చు. కారణం ఇక్కడ దెబ్బతిన్న జనాభా సమతౌల్యమే. వివిధ దేశాల నుంచి పథకం ప్రకారం వలస వచ్చిన వారు ఇప్పటికే లండన్‌ మీద ప్రాబల్యం సాధించారు. ప్రస్తుతం లండన్‌ నగరానికి మేయర్‌ సాదిక్‌ ఖాన్‌. పాకిస్తానీ మూలాలు ఉన్న సాదిక్‌ లేబర్‌ పార్టీ తరపున మూడుసార్లు మేయర్‌గా ఎన్నికయ్యారు. లండన్‌ను అనధికారికంగా ‘లండనిస్తాన్‌’ అంటారు. ఈ పదాన్ని ఇంగ్లీష్‌ పత్రికలే ప్రముఖంగా వాడటం గమనార్హం.

లండన్‌లో ఉగ్రవాద గ్రూపుల ప్రాబల్యం పెరిగి పోయింది. వాస్తవానికి ఈ పరిస్థితి అమెరికాపై 9/11 దాడులకు ముందే ఏర్పడిరది. అబ్దుల్లా ముత్తలాబ్‌ అనే వ్యక్తి ఉగ్రవాద కార్యకలాపాలకు ఆజ్యం పోశాడు. ఇది అల్‌ ముహజిరౌన్‌ ఉగ్రవాద సంస్థ ఏర్పాటుకు దారి తీసింది. బ్రిటన్‌లో ఉగ్రవాద భయాందోళనలను మొట్ట మొదటిసారి 2010లో గుర్తించారు. పశ్చిమ దేశాల్లో ఉగ్రవాద విస్తరణకు లండన్‌ కేంద్రస్థానంగా మారింది. ఫ్రాన్స్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే ఇస్లామిక్‌ తీవ్రవాదులు అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు లండన్‌ పారిపోయి వచ్చేవారు. వారిని అరెస్టు చేసేందకు బ్రిటన్‌ అధికారులు సహకరించేవారు కాదు. దీంతో ఫ్రెంచ్‌ పోలీసులు బ్రిటన్‌ను ‘లండనిస్తాన్‌’ అని పిలవడం మొదలు పెట్టారు. బ్రిటిష్‌ జర్నలిస్ట్‌ మెలానీ ఫిలిప్స్‌ ఏకంగా ‘లండనిస్తాన్‌: హౌ బ్రిటన్‌ ఈజ్‌ క్రియేటింగ్‌ టెర్రర్‌ స్టేట్‌ వితిన్‌’ పేరుతో 2006లో పుస్తకం ప్రచురించాడు. ఇస్లామిక్‌ తీవ్రవాదం, ఉగ్రవాద చర్యలతో ముంచుకొస్తున్నముప్పును గుర్తించిన యున్కెటెడ్‌ కింగ్‌డమ్‌ క్రమంగా చర్యలకు ఉపక్రమించింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిపోయింది. ప్రస్తుతం లండన్‌లో ఇస్లామిక్‌ రాడికలైజేషన్‌ అంత తీవ్రంగా లేకున్నా ముప్పు మాత్రం తొలిగిపోలేదు.

సమస్యగా మారిన వలసలు

1980 నుంచి యూరప్‌ దేశాలు ముస్లిం వలస సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీనికి తాజాగా పశ్చిమాసియా దేశాల్లో అంతర్యుద్దం, అనిశ్చిత వాతావరణం తోడైంది. సిరియా, లిబియా, ఇరాన్‌, నైజీరియా, అఫ్ఘ్ఘానిస్తాన్‌, పాకిస్తాన్‌ తదితర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో వలసదారులు యూరోప్‌లోకి చొరబడ్డారు. మధ్యధరా సముద్రం మీదుగా సాగే ఈ వలసలకు స్పెయిన్‌, ఇటలీ, గ్రీస్‌, మాల్టా ముఖద్వారాలు. యూరోప్‌ దేశాలు మొదట్లో వీరిని చౌకగా దొరికే శ్రామికులుగా గుర్తించి తమ దేశాల్లోకి అనుమతించాయి. భారత్‌ తరహాలోనే అక్కడి సెక్యులర్‌, లిబరల్‌ ప్రభుత్వాలు బుజ్జగింపు రాజకీయలతో వారికి అండగా నిలిచాయి. క్రమంగా ఈ వలసదారులు అక్కడి జాతీయ-అంతర్గత భద్రతకు, సామాజిక వ్యవస్థకు భంగకరంగా మారారు.

వలసదారులు ఆయా దేశాల్లో హింసకు, లైంగిక అత్యాచారాలను దిగడం ద్వారా శాంతి భద్రతలకు సవాలుగా తయారయ్యారు. కొన్ని నగరాల్లో వీరి జనాభా తామరతంపరలా పెరిగి స్థానిక జనాభాను మించిపోయారు. మసీదుల సంఖ్య పెరిగి, బురఖాలు ధరించే స్త్రీలు, అకారణంగా గొడవలకు దిగే ఛాందసులు ఎక్కువయ్యారు. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గ్రహించిన ఆయా దేశాలు వలసల నిరోధానికి ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. 1998 నాటి జనాభా ప్రకారం యూరోప్‌ దేశాల జనాభా 74.64 కోట్లకు చేరగా ఇందులో ముస్లింలు 25 కోట్ల వరకూ ఉంటారని అంచనా. తాజా లెక్కలు తీస్తే ఇంకా ఎక్కువే. ముస్లింలు ఆధిక్యతను పెంచుకోవడంతో పాటు తమ ఆచారాలను మిగతా సమాజాలపై బలవంతంగా రుద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. హలాల్‌ పేరుతో ఆహారపు అలవాట్లను మార్చుస్తున్నారు. అంతర్జాతీయ విధానాల్లో అతి జోక్యం పెరిగిపోయింది. ఉదాహరణకు యూరోప్‌కు ఏ మాత్రం సంబంధం లేని పాలస్తీనా సమస్యను అడ్డుపెట్టుకొని ఆందోళనలకు దిగుతున్నారు. అక్కడి రాజకీయాలను కూడా శాసించే స్థాయికి ఎదిగారు. విభిన్న సంస్కృతుల సమ్మేళనానికి చోటిచ్చే ప్రజాస్వామ్యానికీ, ఇస్లాంకీ పొసగదని అనేక మంది యూరోపియన్లు ఇప్పుడు గట్టిగా భావిస్తున్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల నుంచి తమ దేశాలను, సంస్కృతిని కాపాడుకునే దిశగా ఫార్‌ రైట్‌, నేషనలిజం పేరుతో జాతీయవాద పార్టీలు ఆవిర్భవించాయి

తాజా పరిణామాలు

ఇటీవలే రుషి సునాక్‌ నాయత్వంలోని కన్సర్వేటివ్‌ పార్టీని ఓడిరచి లేబర్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొత్త ప్రధానిగా వచ్చిన కీర్‌ స్టార్మర్‌పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయన వైఫల్యాన్ని ఈ అల్లర్లు ఎత్తి చూపుతున్నాయి. అల్లర్లను అదుపు చేయాల్సింది పోయి పార్‌ నేషనలిస్టులను నిందించడం అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మారింది. ఈ అల్లర్లలో ఇప్పటి దాకా 130 మంది వరకూ గాయపడితే, వేయి మందికి పైగా అరెస్టయ్యారు.

సౌత్‌పోర్ట్‌లో ఏం జరిగింది?

బ్రిటన్‌ ఉత్తర ప్రాంతంలోని సముద్రతీర పట్టణం సౌత్‌పోర్ట్‌.. జూలై 29న అక్కడ జరిగిన కత్తిపోటు ఘటనలు, హత్యలు ఆందోళనకు గురిచేశాయి. అక్కడి టేలర్‌ స్విఫ్ట్‌ థీమ్డ్‌ డ్యాన్స్‌, యోగా పార్టీలో జరిగిన కత్తి దాడిలో చిన్నారులు బెబే కింగ్‌(6), ఎల్సీ డాట్‌ స్టాన్‌కోంబ్‌(7), ఎలైస్‌ డా సిల్వా అగ్వియర్‌(9) చనిపోయారు. ఈ వ్యవహారంలో నిందితుడు 17 ఏళ్ల యువకుడని గుర్తించారు. దాడి జరిగిన కొద్దిసేపటికే నిందితుడు 2023లో సముద్రమార్గం ద్వారా బ్రిటన్‌కు వచ్చిన శరణార్ధి అని, అతనో ముస్లిం అంటూ సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే అతను ముస్లిం కాదని వేల్స్‌లో రువాండా తల్లిదండ్రులకు జన్మించిన వ్యక్తి అని చెబుతున్నారు. సౌత్‌పోర్ట్‌ ఘటనలో ఒక్కసారిగా బ్రిటిష్‌ సమాజం భగ్గుమంది. మరుసటి జూలై 30వ తేదీన హత్యకు గురైన చిన్నారులకు సంతాప సూచికంగా నిర్వహించిన కార్యక్రమానికి వెయ్యి మందికిపైగా హాజరయ్యారు. వీరంతా ఒక్కసారిగా గొడవలకు దిగారు. అక్కడకు వచ్చిన వారు మసీదుపై దాడికి దిగారు. పోలీసులపై రాళ్లు, బాటిళ్లు, టపాసులు విసిరేశారు. పోలీస్‌ వ్యాన్‌కు నిప్పు పెట్టారు. ఈ పరిణామాల తర్వాత పోలీసులు నిందితున్ని సమీపంలోని ఓ గ్రామంలో అరెస్టు చేశారు. అతనికి తీవ్రవాదంతో ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. స్థానికులు అందించిన సమాచారం ప్రకారం నిందితుని పేరు అక్సెల్‌ రుకడు బానా. ఇతని మతం మీద సందేహాలు ఉన్నప్పటికీ స్థానికంగా అల్లరి మూకలతో తిరిగేవాడని చెబుతున్నారు. ఇతని స్నేహాల కారణంగా ముస్లిం అనే ప్రచారం జరిగి ఉండొచ్చు. వారి మతతత్వ ఉన్మాద ప్రభావం మాత్రం కచ్చితంగా అక్సెల్‌ రుకడు బానాపై ఉందంటున్నారు.

వేగంగా వ్యాపించిన అల్లర్లు

సౌత్‌పోర్ట్‌ అల్లర్లు క్రమంగా దేశమంతా వ్యాపించాయి. లండన్‌, హార్టిల్‌పూల్‌, మాంచెస్టర్‌లలో హింసాత్మక నిరసనలు చెలరేగి, వారం పాటు కొనసాగాయి. దక్షిణ తీరంలోని ప్లైమౌత్‌ నుంచి ఈశాన్య ప్రాంతంలోని సండర్‌ల్యాండ్‌ వరకు ఇంగ్లండ్‌ అంతటా అల్లర్లు చెలరేగాయి. ఉత్తర ఐర్లాండ్‌లోని బెల్ఫాస్ట్‌కు కూడా వ్యాపించాయి. ఆందోళనకారులు మసీదులపై, శరణార్థుల వసతిగృహాల మూకుమ్మడి దాడులు చేశారు. కార్లు, భవనాలతో పాటు లైబ్రరీకి నిప్పుపెట్టారు. దుకాణాల్లో చొరబడి దోపిడీలు చేశారు.

అల్లర్లకు సంబంధించి ఆగస్టు 6 నాటికి 400 మందికి పైగా అరెస్టు చేశారు. వారిలో 11 ఏళ్లలోపు పిల్లలు కూడా ఉన్నారు. వంద మందికిపైగా పోలీసులు గాయపరిచిన ఈ అల్లర్ల వెనుక ఎవరున్నారు అనే దిశగా దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ హింసాత్మక ఘటనల్లో నిషేధంలో ఉన్న అతివాద గ్రూపు ఇంగ్లిష్‌ డిఫెన్స్‌ లీగ్‌ (ఈడీఎల్‌) మద్దతుదారులు పాల్గొన్నట్లు భావిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఈడీఎల్‌ వ్యవస్థాపకుడు టామీ రాబిన్సన్‌ అలియాస్‌ స్టీఫెన్‌ యాక్స్‌లీ లెన్నాన్‌. సోషల్‌ మీడియాలో ఈయన పెట్టిన రెచ్చగొట్టే పోస్టుల ప్రభావం అంతా ఇంతా కాదంటున్నారు. అయితే అల్లర్లకు పాల్పడ్డవారిలో ఎక్కువ మంది సాధారణ బ్రిటన్‌ పౌరులే. కానీ బ్రిటన్‌కు వలస వచ్చినవారి కారణంగానే అశాంతి ఏర్పడిరదని వీరంతా బలంగా నమ్ముతున్నారు. బ్రిటన్‌ వ్యాప్తంగా అల్లర్లు తీవ్రం కావడంతో పోలీసులను పెద్ద సంఖ్యలో మొహరిం చారు. మసీదులకు ఎమర్జెన్సీ సెక్యూరిటీ కల్పించారు.

జాతివివక్ష వ్యతిరేక నిరసనలు

వారం రోజుల పాటు బ్రిటన్‌ వ్యాప్తంగా పార్‌ నేషనలిస్టు, రైట్‌వింగ్‌ అని ప్రచారం పొందిన నిరసనకారులు విధ్వంసం సృష్టించిన తర్వాత దీనికి వ్యతిరేకంగా మరోవైపు నుంచి ఆందోళనలు మొదల య్యాయి. జాతి వివక్ష వ్యతిరేక నిరసనకారులుగా చెప్పే వామపక్ష, రాడికల్‌, లిబరల్‌ మూకలు లండన్‌, తదితర నగరాల్లో ప్రదర్శనలు నిర్వహించారు. సౌత్‌పోర్ట్‌ ఘటనకు వ్యతిరిరేకంగా జరిగిన నిరసనలను తిప్పికొట్టేందుకు ఈ ప్రదర్శనలు జరిగాయి. నిరసనకారులు ‘స్మాష్‌ ఫాసిజం అండ్‌ రేసిజం’, ‘స్టాప్‌ ది ఫార్‌ రైట్‌’ అనే నినాదాలతో ప్లకార్డులను ప్రదర్శించారు. జాత్యహంకారం, ఇస్లామోఫోబియాలకు వ్యతిరేకంగా ఐకమత్యంగా నిలిచిన ప్రజలకు, లండన్‌వాసులకు రక్షణ కల్పించడంలో పగలు, రాత్రి శ్రమిస్తున్న పోలీసులకు ధన్యవాదాలు అని లండన్‌ మేయర్‌ సాదిక్‌ ఖాన్‌ ఎక్స్‌లో పోస్ట్‌చేశారు. ఈ సాదిక్‌ పాకిస్తాన్‌ మూలాలు ఉన్న వ్యక్తి.

స్టార్మర్‌ ప్రభుత్వ వైఫల్యం

అల్లర్ల వెనుక పార్‌ నేషనలిస్టులు, అతివాద దుండగులు ఉన్నారు అంటూ బ్రిటన్‌ ప్రధానమంత్రి కీర్‌ స్టార్మర్‌ వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలకు పాల్పడినందుకు వారు చింతించాల్సి వస్తుందని హెచ్చరించారు. బ్రిటన్‌ జాతీయ అతివాదానికి మినహాయింపు కాదని తాజా అల్లర్లు రుజువు చేస్తున్నాయి. చివరిసారిగా 2011లో బ్రిటన్‌లో వలసవాద వ్యతిరేక అల్లర్లు పెద్దఎత్తున జరిగాయి. అప్పటల్లో అవి లండన్‌ నగరానికే పరిమిత మయ్యాయి. ఈసారి అన్ని పట్టణాలకూ వ్యాపించాయి. ఇటీవలే పగ్గాలు చేపట్టిన లేబర్‌ పార్టీ ప్రభుత్వానికి ప్రస్తుత అల్లర్లు అగ్నిపరీక్షగా మారాయి. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ బయటకు వచ్చిన తర్వాత జరిగిన రాజకీయ, ఆర్థిక పరిణామాలు కన్సర్వేటివ్‌ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తికి దారి తీశాయి. ప్రధాని రుషి సునాక్‌ పరిస్థితులను అదుపు చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఫలితంగా ఎన్నికల్లో కన్సర్వేటర్లు దారుణంగా ఓడిపోయారు. ప్రజలు లేబర్‌ పార్టీకి అధికారం అప్పజెప్పితే ఆరంభంలోనే చేతకానితనాన్ని బయట పెట్టుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

సోషల్‌ మీడియా పాత్ర ఎంత?

యూకేలో ‘అంతర్యుద్ధం అనివార్యం’` ప్రముఖ వ్యాపారవేత్త, సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’ యజమాని ఎలాన్‌ మస్క్‌ చేసిన వ్యాఖ్య ఇది. సౌత్‌పోర్ట్‌లో చిన్నారులను హత్య చేసింది ముస్లిం శరణార్థి అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంతో మత కలహాలకు దారి తీసింది.

బ్రిటన్‌లో స్థానిక, స్థానికేతర వైషమ్యాలు ఏ స్థాయికి చేరాయో ఇది సూచిస్తున్నది. సోషల్‌ మీడియాను సంఘ విద్రోహశక్తులు ఎలా దుర్వినియోగం చేస్తాయో ఈ ఉదంతం కండ్లకు కట్టింది. బ్రిటన్‌లో సాంకేతిక శాఖ మంత్రి గూగుల్‌, ఎక్స్‌, టిక్‌టాక్‌, మెటా సంస్థల ప్రతినిధులతో సమావేశమై, అసత్య సమాచారం వ్యాపించకుండా ఆపడంలో ఆ సంస్థల బాధ్యతను మరోసారి నొక్కిచెప్పాల్సి వచ్చింది. తమ వాక్‌ స్వాతంత్య్రం గురించి గర్వంగా చెప్పుకొనే బ్రిటన్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాలపై నియంత్రణలు విధించాలని ఆలోచిస్తోంది. అల్లర్ల నేపథ్యంలో అక్కడున్న భారతీయులను మన కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

– క్రాంతి, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE