పొరుగుదేశాల వ్యవహారశైలితో భారత్‌ ఎప్పటికప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవడం పరిపాటిగా మారింది. పాకిస్తాన్‌ మనకు శత్రుదేశం. ఇక నేపాల్‌, బాంగ్లాదేశ్‌, శ్రీలంక, మాల్దీవుల వ్యవహారశైలి వాటిని నిండా ముంచడమే కాదు, మనకు ఇబ్బందులు సృష్టిస్తోంది. తాజాగా బాంగ్లాదేశ్‌ సంక్షోభం మనకు సంకటస్థితిని కల్పించింది. భారత్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన బాంగ్లా ప్రధాని హసీనా మనదేశం ఎప్పటికప్పుడు ముందస్తుగా ఇచ్చిన సూచనలను బేఖాతర్‌ చేసి దేశానికి, తనకు దుస్థితిని తెచ్చిపెట్టుకున్నారు. బాంగ్లాదేశ్‌లో తాజాగా చెలరేగిన కోటా వ్యతిరేక ఉద్యమం మాటున బాంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ, జమాతే ఇస్లామీలు రూపొందించిన ధ్వంసరచన ప్రకారం ఇస్లామిస్టులు, జిహాదీలు, ఉగ్రవాదులు యదేచ్ఛగా చెలరేగి విధ్వంస కాండ సృష్టించి దేశాన్ని అస్థిర ఊబిలోకి దించారు.

1971 బాంగ్లా విముక్తి ఉద్యమంలో పాల్గొన్న కుటుంబాల వారికి కల్పి స్తున్న 30 శాతం రిజర్వేషన్‌ను ఎత్తివేయాలని గత జూన్‌ 7వ తేదీన ఢాకా యూనివర్సిటీలో 500 మంది విద్యార్థులు మొట్టమొదటిసారి ఆందోళన చేశారు. జూన్‌ 6వ తేదీన బాంగ్లా హైకోర్టు ఈ కోటా సక్రమమేనని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో విద్యార్థులు ఈ డిమాండ్‌ను లేవనెత్తారు. సున్నితమైన ఈ అంశంపై వ్యవహరించడంలో హసీనా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ‘కోటా ఉద్యమం ముసుగులో, శ్రీలంకలో మాదిరి పరిస్థితినే సృష్టించి, ప్రభుత్వాన్ని కూలదోయాలని కొన్ని అరాచక శక్తులు పన్నాగం పన్నాయంటూ’ గత జనవరి 31న ప్రకటించిన హసీనా ఈ అంశంలో ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదో ఆమెకే తెలియాలి. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తిరిగి అప్పీల్‌ చేయడంతో పాటు, విద్యార్థులతో చర్చలు జరపడం వంటి పరిష్కార మార్గాలను ప్రభుత్వం అనుసరించలేదు సరికదా తన పార్టీ అనుబంధ విద్యార్థి విభాగాలను, ఆందోళనకారులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టింది. ఫలితంగా పోలీసులు, ఆందోళనకార్లు, అవామీ లీగ్‌ అనుకూల విద్యార్థి విభాగాల మధ్య పరస్పర దాడులతో పరిస్థితి క్రమంగా చేయి దాటిపోయే పరిస్థితికి చేరుకుంది. జూన్‌ నుంచి ఇప్పటివరకు జరిగిన అల్లర్లలో మృతుల సంఖ్య 560 దాటినట్టు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

హసీనా

ఆర్మీ చీఫ్‌ శకుని పాత్ర

బాంగ్లాదేశ్‌ ఆర్మీ చీఫ్‌ వాఖర్‌ ఉజ్‌ జమాన్‌, హసీనాకు దూరపు బంధువు. ఈయన్ను ఆర్మీచీఫ్‌గా నియమించాలన్న ఉద్దేశం హసీనాకు ఉన్నట్టు తెలుసు కొని, చైనా అనుకూలుడిగా ఉన్న ఈయన విషయంలో జాగ్రత్త వహించాలని మనదేశం హెచ్చరించింది. కానీ దీన్ని ఆమె పెడచెవిన పెట్టి నియామకాన్ని ఖరారు చేయడమే కాదు, ఆయన్ను పూర్తిగా విశ్వసించారు. కానీ ఆయన రిజర్వేషన్‌ కోటా సమస్యను అడ్డంపెట్టుకొని విధ్వంసాన్ని ప్రోత్సహించాడన్న వార్తలు వచ్చాయి. ప్రధాని అధికార నివాసాన్ని పెద్ద సంఖ్యలో ఆందోళనకా రులు చుట్టుముట్టడం వెనుక జమాన్‌ హస్తం ఉన్నదన్న అనుమానాలు వ్యక్తమ య్యాయి. ఇక తాను చేయగలిగిందేమీ లేదని, తక్షణమే రాజీనామాచేసి, 45 నిమిషాల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆర్మీ చీఫ్‌ హెచ్చరించిన నేపథ్యంలో గత్యంతరం లేని స్థితిలో హసీనా తన పదవికి రాజీనామా చేసి, సోదరి సహా భారత్‌కు పారిపోయారు. భారత్‌ సలహాను పెడచెవిన పెట్టిన ఫలితంగా దేశం ఇప్పుడు ఛాందసవాదులు చేతుల్లోకి వెళ్లిపోబోతుండటమే కాదు ఆర్థికంగా నిలదొక్కుకున్న స్థితిలో ఉన్న బాంగ్లాదేశ్‌ పతనపథం ఖాయమని స్పష్టమైంది.

అల్లర్లు జరిగిన తీరు

ఆగస్టు 3వ తేదీన బాంగ్లాదేశ్‌లో తిరిగి ప్రారంభమైన అల్లర్లను విద్యార్థుల ఆందోళనగా పాశ్చాత్య మీడియా ప్రచారం చేసిప్పటికీ, వాస్తవానికి జిహాదిస్టులు, సుశిక్షితులైన ఉగ్రవాదులు మొత్తం పరిస్థితిని తమ నియంత్రణలోకి తీసుకున్నారనేది మాత్రం సుస్పష్టం. జర్నలిస్టులు, ఎన్నికైన ప్రజాప్రతి నిధులు, హిందూ ఆలయాలు ప్రధాన లక్ష్యంగా వీరు దాడులు, విధ్వంసానికి పాల్పడ్డారు. అల్‌`ఖైదా, ఇస్లామిక్‌ స్టేట్‌, ఇతర రాడికల్‌ గ్రూపుల ప్రమేయం ఈ దాడుల్లో స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా విపక్ష మతఛాందస పార్టీలైన బి.ఎన్‌.పి, జమాతే ఇస్లామీలు క్రమంగా తమ నియంత్రణలోకి తీసుకోవడంతో దేశం రావణకాష్టమైంది.

విధ్వంసకాండ ప్రారంభం

ఆగస్ట్‌ 4న సిరాయజ్‌గంజ్‌ జిల్లాలోని ఎనైత్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసిన ఇస్లామిక్‌ ఉగ్రవాదులు 13మంది పోలీసులను దారుణంగా హతమార్చి, అక్కడి ఆయుధాలను, మందుగుండు సామగ్రిని లూటీ చేయడమే కాకుండా భవనానికి ఏకంగా నిప్పుపెట్టడంతో రెండో విడత విధ్వంసకాండ మొదలైంది. అదేవిధంగా నిట్రోకోనా జిల్లాలో ఉగ్రవాదులు పోలీసు వాహనంపై దాడిచేసి పది పిస్టల్స్‌, మందుగుండు సామగ్రి దోచుకెళ్లారు. ఈ సంఘటనలో పోలీసులపై పాశవికంగా దాడి చేయడమే కాకుండా వాహనాన్ని ధ్వంసం చేశారు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా పోలీసులను లక్ష్యంగా చేసుకొని ఇదేమాదిరి దాడులు జరిగాయి. అప్పటికి వందకు పైగా మృతి చెందడంతో ప్రభుత్వం ఆగస్టు 4న, మెటా(ఫేస్‌బుక్‌), ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌లతో పాటు ఇంటర్నెట్‌ను రద్దుచేసింది. జిహాదిస్టులు, తీవ్రవాదులు, ఇస్లామిస్టులు, అల్లరిమూకలు ఈ మూడు వేదికల ద్వారా తప్పుడు సమాచారాన్ని యథేచ్ఛగా ప్రచారం చేస్తుండటంతో అధికార్లు ఈ చర్యలు తీసుకున్నారు. అయితే అల్‌`ఖైదా వంటి ఉగ్రవాద గ్రూపులతో సంబంధమున్న బాంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ), జమాతే ఇస్లామీ, జాతీయో పార్టీ (ఖదర్‌), హిజ్‌బుత్‌ తెహ్రీర్‌ వంటి పార్టీలు ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న వారికి పాకెట్‌ రూటర్లను సరఫరా చేసి, వైఫై ద్వారా పుకార్లు, తప్పుడు సమాచారాన్ని సోషల్‌ మీడియా వేదికల ద్వారా ప్రచారం చేయడానికి సహాయం చేశాయి. ఢాకా యూనివర్సిటీలో ఇటువంటి పాకెట్‌ రూటర్‌ సహాయంతో ఫేస్‌బుక్‌ ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తిచేస్తున్నట్టు ఒక మీడియా సంస్థ గుర్తించింది. ఫేస్‌బుక్‌ పేజీలో ‘ఉయ్‌ ఆర్‌ బాంగ్లాదేశ్‌’ పేరుతో ఫేస్‌బుక్‌లో పుకార్లను వ్యాప్తిచేసినట్టు కనుగొన్నది. ఎనిమిదివేల గిగాబైట్ల డేటాను కొనుగోలు చేసినట్లు ఇదే పేజీలో వారు పేర్కొనడాన్ని ఆ సంస్థ తెలుసుకుంది. ఇంత డేటా కొనుగోలుకు 2460 యుఎస్‌ డాలర్లు ఖర్చవుతుంది. బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ), జమాతే ఇస్లామీ, జాతీయో పార్టీ (ఖదర్‌), హిజ్‌బుత్‌ తెహ్రీర్‌ మరియు విదేశీ ఉగ్రవాదులు కుమ్మక్కై ఇంత ఖర్చుచేసి మరీ దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి పూనుకున్నట్టు స్పష్టంకావడమే కాదు, దేశాన్ని నియో`తాలిబన్ల రాజ్యంగా, పూర్తి దివాలా దేశంగా మార్చేందు కు స్పష్టంగా ఒక బ్లూప్రింట్‌ను సిద్ధంచేసి అమలు చేసినట్టు తేటతెల్లమైంది.

 ఆర్మీ చీఫ్‌ వాఖర్‌

హిందువులపై దాడులు, అత్యాచారాలు

హసీనా వ్యతిరేకులు దేశవ్యాప్తంగా లూటీలు, విచ్చలవిడి దహనకాండకు పాల్పడ్డారు. అవామీలీగ్‌ పార్టీకి చెందిన నాయకులు, మైనారిటీలు లక్ష్యంగా ఈ దాడులు కొనసాగాయి. హిందువుల ఇళ్లు, దేవాలయాలపై దాడులు విచ్చలవిడిగా కొనసాగాయి. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌, మొబైల్‌ డేటాను బ్లాక్‌ చేసిన చోట్ల మసీదుల్లోని లౌడ్‌ స్పీకర్ల ద్వారా తప్పుడు సమాచారం విస్తృతంగా వ్యాప్తి చేయాలని ఉగ్రవాదులు పిలుపునిచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఆగస్ట్‌ 4వ తేదీనుంచి నిరవధిక కర్వ్యూ విధించింది. ఇదే సమయంలో ఢాకా నగరంలోని కాక్రైల్‌ ప్రాంతంలో విధ్వంసకారులు హైకోర్టు న్యాయమూర్తుల వాహనాలపై దాడిచేసి వాటిని ధ్వంసం చేశారు. స్థానిక మీడియా సమాచారం ప్రకారం అల్లరిమూకలు, హిందువుల ఇళ్లు, షాపులు, దేవాలయాలపై విచ్చలవిడిగా దాడులకు పాల్పడ్డారు. ఢాకా నగరంలోని లక్ష్మీ బజార్‌, శాఖరీ బజార్‌ దేశంలోని ఇతరప్రాం తాల్లో హిందువులు అధికంగా నివసించే ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. ముఖ్యగా బీఎన్‌పీ, ఇస్లామిస్టులు, జిహాదిస్టు గ్రూపులు హిందువులను ‘అవామీలీగ్‌ మద్దతుదార్లుగా’ పేర్కొంటూ దాడులకు పాల్పడటంతో వీరు క్షణక్షణం గండంగా గడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. హిందువులను దేశం నుంచి వెళ్లగొట్టాలంటూ ఈ గ్రూపులు పిలుపునిచ్చాయి. ఇదే సమయంలో సిరాజ్‌గంజ్‌, మగుర, నాయఖలీ జిల్లాలోల హిందూ బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరిగినట్టు అనధికార వార్తలు పేర్కొన్నాయి.

హిందూ కౌన్సిలర్ల హత్య

ఒక పథకం ప్రకారం జరిగిన ఈ విధ్వంస కాండలో అవామీలీగ్‌ పార్టీ నాయకులు, రంగ్‌పూర్‌ జిల్లాకు చెందిన కౌన్సిలర్లు హరధన్‌ రాయ్‌, కాజల్‌ రాయ్‌లను దుండగులు ఆగస్టు 4న దారుణంగా హత్యచేశారు. ఇదే సమయంలో హరధన్‌రాయ్‌ సమీప బంధువు ఒకరు అల్లరిమూకల చేతుల్లో హత్యకు గురైనట్టు సిఎన్‌ఎన్‌ న్యూస్‌`18 వెల్లడిరచింది. ఇస్కాన్‌, కాళిమాత దేవాలయాలపై అల్లరిమూకలు దాడులు చేసి విగ్రహాలను ధ్వంసం చేశారు. నాయ్‌ఖలి జిల్లాలో అల్లరిగుంపులు హిందువుల ఇళ్లపై దాడులు చేశాయి. గతంలో కూడా మతఛాందసవాదులు హిందువులపై దాడులకు పాల్పడిన సంఘటనలు చాలా జరిగాయి. ముఖ్యంగా హిందువుల పండుగలు, ఊరేగింపులను వీరు లక్ష్యంగా చేసుకునేవారు. అయితే హసీనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని మతఛాందసవాదులను అదుపు చేయడంతో హిందువులు ఊపిరి పీల్చుకో గలిగారు. కానీ ఇప్పుడు సైన్యం మద్దతుతో వీరు చెలరేగి పోవడం హిందువులకు ప్రాణ సంకటంగా మారింది.

గణభవన్‌పై దాడి

ఇస్లామిస్టులు, జిహాదిస్టులు, టెర్రరిస్టులు ఉమ్మడిగా ముందస్తు ప్రణాళిక రచించి ప్రధాని హసీనా అధికార నివాసంపై దాడికి దిగినట్టు తెలుస్తోంది. దాడికి ముందు ‘గణభవన్‌’ను ముట్టడిరచాలని ఆందోళనకారులకు పిలుపునిస్తూ, విద్యార్థి ఉద్యమనేతల పేరుతో ఒక వీడియో వైరలైంది. ఈ నేపథ్యంలో హసీనా నిష్క్రమణ తర్వాత ఆందోళనకార్లు పార్లమెంట్‌ భవనంలోకి ప్రవేశించి దొరికిన ప్రతి వస్తువును ఎత్తుకెళ్లిపోయారు. ఢాకా లోని ధన్‌మండి ప్రాంతంలోని హసీనా కుటుంబానికి చెందిన ఇల్లు ‘సుధా సదన్‌’లోకి ప్రవేశించిన అల్లరిమూకలు కనిపించిన ఏ వస్తువును వదిలి పెట్టకుండా ధ్వంసం చేయడమో ఎత్తుకెళ్లిపోవడమో చేశారు. తర్వాత ఇంటికి నిప్పుపెట్టినట్టు ‘ప్రొథమ్‌ అలో’ దినపత్రిక వెల్లడిరచింది. ఇక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంటిని కూడా అల్లరిమూకలు వదిలిపెట్టలేదు. పూర్తిగా ధ్వంసం చేశారు. ధన్‌మండి లోని బంగబంధు షేక్‌ ముజ్‌బూర్‌ రహమాన్‌ మెమోరియల్‌ మ్యూజియంకు నిప్పుపెట్టారు.

హసీనాను కాపాడిన భారత్‌

ముఖ్యంగా జమాతే ఇస్లామీ పార్టీ ప్రణాళిక ప్రకారం హసీనాను చుట్టుముట్టి బంధించి, ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌, లెబనాన్‌ అధినేత కల్నల్‌ గడ్డాఫీల మాదిరిగానే హతం చేయాలన్న ఆలోచన చేశారని, ప్రధాని అధికార భవనాన్ని చుట్టుముట్టడం వెనుక ఉన్న నేపథ్యమిదేనన్న వాదనలు కూడా ఉన్నాయి. మూకదాడిలో హతమారిస్తే ఎవరి మీద కేసులుండవు. ఇందుకు అమెరికా మద్దతున్నది. ఈ పథకాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెను ప్రాణాలతో రక్షించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బాంగ్లా దేశ్‌ సైన్యంలో హసీనా మద్దతుదార్ల సహాయంతో ఆమెను అక్కడినుంచి త్రిపురలోని అగర్తలాకు తరలించారు. అక్కడినుంచి మరో విమానంలో ఢల్లీిలోని హిండన్‌ విమానాశ్రయానికి తరలించారు. ప్రస్తుతం అమెరికా, ఇంగ్లండ్‌లు ఆమెకు వీసా ఇవ్వడానికి సుముఖంగా లేనట్టు వార్తలు వస్తున్నాయి. ఇవే తనకు ఆఖరి ఎన్నికలని గతంలో ప్రకటించారు కాబట్టి, ఇక ఆమె రాజకీయాల్లో ఉండే అవకాశం లేదు. కాకపోతే అవామీ లీగ్‌ పునరుజ్జీవనానికి ఆమె చాలా అవసరం. ఆశ్రయం కల్పించడం ద్వారా ఆమెకు తగిన విధంగా ఆలోచించుకునే అవకాశాన్ని భారత్‌ కల్పించిందని భావించవచ్చు.

తాత్కాలిక ప్రధానిగా యూనస్‌

నోబెల్‌ బహుమతి గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ను దేశ తాత్కాలిక ప్రధానిగా అధ్యక్షులు షహబుద్దీన్‌ నియమించారు. విద్యార్థి ఉద్యమ నాయకులతో చర్చలు జరిపిన తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. హసీనా దేశం విడిచి వెళ్లిన వెంటనే అధ్యక్షులు పార్లమెంట్‌ను రద్దుచేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం 13మంది విద్యార్థి ఉద్యమ నాయకులు, దేశాధ్యక్షుడు, త్రివిధ దళాధి పతులతో చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం వెలువడిరది. యూనస్‌ మాజీ ప్రధాని హసీనాకు బద్ధ వ్యతిరేకి. దేశంలో సూక్ష్మ రుణవ్యవస్థను ప్రవేశ పెట్టి విజయవంతం చేసిన నేపథ్యంలో ఆయన 2006లో నోబెల్‌ బహుమతిని అందుకున్నారు. తర్వాతికాలంలో ఈ వ్యవస్థను గ్రామీణ బ్యాంక్‌గా మార్చి దానికి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కొనసాగారు. బాంగ్లాదేశ్‌లో బ్యాంక్‌ల నిబంధనల ప్రకారం రిటైర్‌మెంట్‌ వయస్సు 60. కానీ అప్పటికే ఈయనకు 73ఏళ్లు. అధిక వడ్డీలు, బలవంతంగా దారుణమైన రీతిలో రుణాలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. వీటికి తోడు ఆయన సొంతంగా రాజకీయ పార్టీ పెట్టాలనుకోవడం, విదేశీ ప్రతినిధులు ముఖ్యంగా అమెరికాతో నేరుగా సత్సంబంధాలు నెరపడం హసీనా ప్రభుత్వానికి మింగుడుపడలేదు. పై కారణాల నేపథ్యంలో ప్రభుత్వం ఆయన్ను గ్రామీణ బ్యాంక్‌ ఎం.డి. పదవినుంచి తొలగించింది. తర్వాత ఆయన ప్యారిస్‌ వెళ్లారు. ఆయన హసీనాకు బద్ధవిరోధిగా మారిన నేపథ్యమిదీ.

పాక్‌లో ఆనందం

హసీనా రాజీనామాతో పాకిస్తాన్‌ ఆనందిస్తోంది. కానీ దాని మద్దతున్న బి.ఎన్‌.పి/జమాతే ఇస్లామీ పార్టీలు అధికారంలోకి వచ్చినా వాటి ఏ మాత్రం సర్దుబాటు ధోరణిలేని వ్యవహారశైలి పాక్‌కు ఇబ్బంది కలిగించవచ్చు. అఫ్ఘ్ఘానిస్తాన్‌లో తాలిబన్లతో జరిగిన అనుభవమే ఇక్కడ కూడా పునరావృత్తం కాకూడద నేం లేదు. బీఎన్‌పీ అధికారంలోకి వచ్చినా అది అమెరికా చెప్పుచేతల్లో ఉండక తప్పదు. ఇక యూనుస్‌ అమెరికా కనుసన్నల్లో మెలుగుతారు. ఆప్పుడు తాలిబన్లనుంచి ఎదురైన పరాభవమే పాక్‌కు పునరావృతం కావచ్చు.

మమతా బెనర్జీ స్పందన

బాంగ్లాదేశ్‌ సంక్షోభాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం హ్యాండిల్‌ చేస్తున్న తీరు సమర్థనీయమని, తమ పార్టీ ఈవిషయంలో కేంద్రానికి పూర్తి మద్దతుగా నిలుస్తుందని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. నిజానికి ఆమె వ్యవహారశైలి తెలిసినవారికి ఈ ప్రకటన ఆశ్చర్యం కలిగించే మాట వాస్తవం. ఎందుకంటే బాంగ్లాదేశ్‌ ప్రజలు ఈ సంక్షోభం నేపథ్యంలో తమ రాష్ట్రంలోకి వస్తే ఆశ్రయమిస్తామని ఒక దశలో ప్రకటించిన నేపథ్యం ఆమెది! అటువంటి మమతా బెనర్జీలో ఇంతటి మార్పు ఎట్లా వచ్చిందనే సందేహం కూడా వ్యక్తం కాకమానదు. కేంద్రం నుంచి గట్టి హెచ్చరిక వెళ్లి ఉండకపోతే తప్ప మామూలు హెచ్చరికలను ఖాతరుచేసే మనస్తత్వం కాదామెది! ఈ విషయంలో కేంద్రం ఆమెను తమదారికి తెచ్చుకోవడం దేశ భద్రత రీత్యా చాలా అవసరం కూడా!

భారత్‌పై ప్రభావం అధికం

బాంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితస్థితి, పొరుగుదేశాలు ముఖ్యంగా భారత్‌పై అత్యధిక ప్రభావం చూపనుంది. మౌలికవసతులు, వర్తకం, అనుసంధానత, భద్రత రంగాల్లో బాంగ్లాదేశ్‌లో భారత్‌ పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టింది. అవామీ లీగ్‌తో భారత ప్రభుత్వం సన్నిహిత సంబంధాలు కలిగివుం డటంతో అంతర్జాతీయంగా ఏవిధమైన విమర్శలు వచ్చినా బాంగ్లా ప్రభుత్వానికి అండగా నిలిచింది. బాంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ), జమాతే ఇస్లా మీ (జేఐ) ఈ రెండు విపక్ష పార్టీలు పాక్‌కు అనుకూలంగా వ్యవహరిస్తుండటం వల్ల ఇవి అధికారంలోకి రావడం భారత్‌కు ఎంతమాత్రం ఇష్టంకాదు. చారిత్రకంగా బీఎన్‌పీ భారత్‌ వ్యతిరేక వైఖరి అనుసరిస్తోంది. గత జనవరి పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత ‘ఇండియా ఔట్‌’ ప్రచారాన్ని ముందుకు తీసుకు వచ్చింది కూడా. ఒకవేళ బీఎన్‌పీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, తన భారత వ్యతిరేక అజెండాను పూర్తిగా అమలుచేయడం సాధ్యంకాదు. ముఖ్యంగా సుదీర్ఘమైన సరిహద్దు కలిగివుండి, బలీయమైన ఆర్థిక సంబంధాల నేపథ్యంలో, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా బాంగ్లాదేశ్‌ ప్రస్తుత విదేశాంగ విధానంలో మార్పులు చేయడానికి సాహసించే పరిస్థితి లేదు. భారత్‌ ఆర్థిక ప్రాధాన్యతను బాంగ్లాదేశ్‌ ఎట్టి పరిస్థితుల్లో తగ్గించడం సాధ్యంకాదు. ఎందుకంటే భారత్‌ వ్యూహాత్మక, నిర్మాణాత్మక పెట్టుబడులు అత్యధిక స్థాయిలో కొనసాగుతుండటమే కారణం. భారత్‌ మాదిరిగానే చైనా కూడా అవామీలీగ్‌తో అనుకూల వైఖరినే అనుసరించింది. ముఖ్యంగా ఈ పార్టీ అందిస్తున్న సుస్థిర నాయకత్వం, తమ దేశ పెట్టుబడులను కూడా అంగీకరించడం ఇందుకు కారణం. అవామీలీగ్‌తో చైనా కమ్యూనిస్టు పార్టీకి సైద్ధాంతికంగా పొసగ నప్పటికీ ఆర్థిక కారణాలు రెండు దేశాలను కలిపి వుంచాయి. హసీనా తర్వాత ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడంలో చైనాకు పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ, అవామీలీగ్‌ అనుస రిస్తున్న భారత్‌`చైనాల అను కూల వైఖరిని బీఎన్‌పీ తీవ్రంగా విమర్శించిన నేపథ్యం ఆ దేశాన్ని కొంత మేర సందిగ్ధానికి గురిచేస్తోంది. అయితే తనకు ‘బానిస’గా వ్యవహరిస్తున్న పాక్‌ అనుకూల పార్టీ కనుక అంత కష్టపడాల్సిన అవసరం వుండదు.

అమెరికా వ్యూహం

ఇక అమెరికా విషయానికి వస్తే దక్షిణాసియా ప్రాంతంలో పరస్పర శత్రువులుగా వ్యవహరిస్తున్న భారత్‌`చైనా దిగ్గజాల మధ్య హసీనా ప్రభుత్వం సమర్థవంతమైన రీతిలో సమతుల్యతను పాటిస్తూ, దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడంలో సాధించిందని అమెరికా భావిస్తోంది. అయితే గత పార్ల మెంట్‌ ఎన్నికలు అప్రజాస్వామిక రీతిలో జరిగాయని అభిప్రాయపడుతోంది. విపక్షాలు పూర్తిగా ఈ ఎన్నికలను బహిష్కరించిన నేపథ్యంలో జరిగిన ఎన్నికలను అమెరికా, బ్రిటన్‌ మానవహక్కుల సంఘాలు తీవ్రంగా విమర్శించాయి. హసీనా ప్రభుత్వ హయాంలో మానవహక్కుల ఉల్లంఘన తీవ్రస్థాయిలో చోటు చేసుకున్నదని అమెరికా కూడా ఆరోపిస్తోంది. ఇదిలావుండగా బాంగ్లాదేశ్‌ సమీపంలోని సెయింట్‌ మార్టిన్‌ ద్వీపంలో ఒక నౌకాస్థావరాన్ని ఏర్పాటు చేయాలని అమెరికా తలపిస్తున్నది. ఇందుకోసం ఈ దీవిని తమకు లీజుకివ్వాలని బాంగ్లాదేశ్‌ను ఎప్పటినుంచో కోరుతోంది. దీనికి అంగీకరించని హసీనా ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగడం అమెరికాకు సుతరామూ ఇష్టం లేదు. జో బైడెన్‌ ఈ ఉద్దేశాన్ని దాచుకోలేదు. పలుమార్లు వ్యక్తంచేశారు కూడా. ఈ నేపథ్యంలో బాంగ్లాదేశ్‌ను ‘బాల్కనైజేషన్‌’ (మతం ప్రాతిపదికన విడగొట్టడం)కు గురిచేయాలని అమెరికా కుట్రపన్నుతోందంటూ పరోక్షంగా హసీనా గతంలో ఆరోపించారు. మయన్మార్‌లోని కుకి`చిన్‌ ప్రాంతం, బాంగ్లాదేశ్‌లోని ఛత్తోగ్రామ్‌ పర్వత ప్రాంతాలు, భారత్‌లోని మిజోరంలోని కొంత భాగంతో కలిపి క్రైస్తవ మెజారిటీ దేశాన్ని ఏర్పాటు చేయాలన్నది అమెరికా ఉద్దేశం. ఆ విధంగా ఏర్పడిన ప్రాంతంలో తమ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయడం ద్వారా దక్షిణాసియా ప్రాంతంలో భారత్‌, చైనాలను నియంత్రించాలన్నది దాని లక్ష్యం. ఇందుకు అడ్డుగా ఉన్న హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పావులు కదిపింది. అమెరికా దౌత్యవేత్త ‘డోనాల్డ్‌లు’ కీలక సూత్రధారి. ఇప్పుడు అమెరికా లక్ష్యం నెరవేరింది కనుక సెయింట్‌ మార్టిన్‌ ద్వీపం తను చేజిక్కించుకో గలుగుతుందా అన్నది ప్రశ్న. అదే జరిగితే దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో అమెరికా పెత్తనం ఖాయం!

– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE