బాంగ్లాదేశ్‌ ఇవాళ పలు బలమైన శక్తుల క్రీడారంగంగా మారింది. అటు అమెరికా, ఇటు చైనా తమవైన విభిన్న అజెండాలతో స్వప్రయోజనాల కోసం వ్యూహాలు పన్నుతుండగా, మతోన్మాద ఇస్లామిక్‌ అతివాద శక్తులు, క్రైస్తవ మత ప్రచారకులు కలిసి బాంగ్లాదేశ్‌లో భారత్‌ తన కార్యకలాపాలు కొనసాగించకుండా కార్యక్షేత్రాన్ని కుదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన భారత్‌, బాంగ్లాదేశ్‌కు విద్యుత్‌ అందిస్తున్న భారతీయ కంపెనీలను వారి సరఫరాను నిలిపివేయచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పుడు రెండు అగ్రశక్తులు బాంగ్లాదేశ్‌ను చెరొకవైపు నుంచి తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దక్షిణ ఆసియాలో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా, ఆసియాలో తిరుగులేని ఆధిపత్యాన్ని కోరుకుంటున్న అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నేతృత్వంలోని చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీ` నోబెల్‌ గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ నాయకత్వంలోని బాంగ్లాదేశ్‌ ప్రభుత్వాన్ని చీల్చివేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

జామాత్‌`ఇ`ఇస్లామీ, ఖలీదాజియా నాయకత్వంలోని బాంగ్లాదేశ్‌ నేషనల్‌ పార్టీ (బీఎన్‌పీ రెండూ కూడా అగ్రదేశాల ఈ ఆధిపత్య పోరులో ఇష్టపూర్వకంగానే వారి పరికరాలుగా మారి వ్యవహరించే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్‌ ఒక చిన్న బానిసదేశ స్థితికి దిగజారు తుందన్న వాస్తవం వారికి బాధ కలిగించినా, ఆ విషయం బహిరంగ సత్యమే.

ఈ పరిస్థితుల్లో పేరు చెప్తేనే ప్రపంచమంతా వణికిపోయే ముస్లిం బ్రదర్‌హుడ్‌, తన ఇస్లామిస్టు` జిహాదీ అజెండాతో భారతదేశపు తూర్పు సరిహద్దులలో సమీకరణాలను మరింత సంక్లిష్టం చేసే అవకాశాన్ని తోసిపుచ్చలేం. అంతర్జాతీయ జిహాదీ ముస్లిం నాయకత్వం కీలుబొమ్మలుగా, ప్రైవేటు సైన్యంగా ‘రజాకార్లు’ పనికి వస్తారు. ఇప్పటికే పౌర నిఘాను మతోన్మాద సైన్యమైన ఈ రజాకార్లు చేపట్టినట్టు వార్తలు వినవస్తున్నాయి.

కొద్దికాలం కింద షేక్‌ హసీనా ప్రభుత్వం పడిపోయి, ఆమె సురక్షితంగా బయటపడేందుకు ఒప్పందం చేసుకొని, అవామీ లీగ్‌ను క్షాళన జరిగి, సైన్యం అధికారాలు హస్తగతం చేసుకున్న తర్వాత భారత్‌ కార్యకలాపాలు అక్కడ తగ్గిపోయాయి. నోబెల్‌ గ్రహీత యూనస్‌, ఒక డజనుమంది సలహాదారుల నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, బాధ్యతలు స్వీకరించినప్పటికీ, సైన్యమే నిర్ణయాలు తీసుకుంటున్న క్రమంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏమీ మారినట్టు కనిపించడం లేదు.

యూనస్‌ను కేవలం ముసుగుగా వాడుకుంటూ, కొత్తగా సైనిక నియంత్రణలోకి వెళ్లిన బాంగ్లాదేశ్‌తో క్రియాశీలక కార్యసంబంధాలను ఏర్పాటు చేసుకోవడానికి వెళ్లే ముందు ఆ దేశంలో అంతర్గతంగా ఉన్న అనేక పొరలను భారత్‌ అర్థం చేసుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా అటు చైనా, ఇటు అమెరికా, మరోవైపు పాకిస్తాన్‌ డీప్‌ స్టేట్‌ తమ వాటా కోసం బేరసారాలు చేస్తున్న క్రమంలో ఈ అవగాహన భారత్‌కు అత్యంత ముఖ్యం.

తాత్కాలిక యూనస్‌ ప్రభుత్వాన్ని ‘ప్రజాస్వామిక వైట్‌హౌజ్‌’ వెంటనే గుర్తించడంతో, వారి పాలనకు చట్టబద్ధత లభించింది. యూనస్‌ నేతృత్వంలో ఢాకాతో కలిసి పని చేసేందుకు ‘సిద్ధంగాఉన్నామని, ఎదురుచూస్తున్నా’మనే సందేశాన్ని తెలిపేందుకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధిని సిద్ధం చేశారు.

సెయింట్‌ మార్టిన్‌ ద్వీపాన్ని ‘నారికేళ జింజీరా’ (కొబ్బరికాయల ద్వీపం) లేదా ‘దారుచీనీద్వీప్‌’ (దాల్చినచెక్క ద్వీపం) అనేవారు. చిట్టగాంగ్‌ తీరం వెంట ఉన్న ఈ ద్వీపంపై యుఎస్‌ కళ్లు పడ్డాయి. అటు భారత్‌పైనా, దాని పొరుగుదేశం, విస్తరణవాది అయిన చైనాపై ఒక కన్నువేసి ఉంచి, పెత్తనం చేసేందుకు అక్కడ ఒక సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయాలని అది ప్రయత్నిస్తోంది. వ్యూహాత్మక ప్రభావాల నేపథ్యంలో ఈ ప్రాంతంలో ప్రత్యక్షంగా యుఎస్‌ ఉనికిని భారత్‌ ప్రోత్సహించకపోవచ్చు లేదా ఆహ్వానించకపోవచ్చు. ఎందుకంటే, అదే జరిగితే, వాణిజ్యం, పెట్టుబడులు, సేవలపరంగా మొత్తం ఆగ్నేయ ఆసియా నుంచి భారత్‌ విడివడుతుంది.

చర్చి ప్రోత్సాహంతో ‘కూకీలాండ్‌’ అన్న పేరుతో కృత్రిమ, స్వయం ప్రతిపత్తి గల ప్రాంతాన్ని ఏర్పాటు చేసేందుకు ‘ప్రాజెక్ట్‌ `కె’ ముందుకు వస్తోంది. బాంగ్లాదేశ్‌, బర్మా, భారత్‌లోని మణిపూర్‌, మిజోరం లోని కొన్ని ప్రాంతాలను కలిపి ప్రత్యేక క్రైస్తవ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నది చర్చి కల్పన. ఈ క్రైస్తవ అజెండాకు అధ్యక్షుడు జో బైడెన్‌ లేదా అతడి తర్వాత వచ్చే అవకాశమున్న కమలా హారిస్‌ నేతృత్వంలోని వైట్‌హౌజ్‌ నుంచి పూర్తి మద్దతు అందే అవకాశ ముంది. ఒకవేళ డొనాల్డ్‌ ట్రంప్‌ నవంబర్‌ 2024 ఎన్నికలలో డెమొక్రాట్లను ఓడిరచినా, ఈ అజెండా కొనసాగే అవకాశం ఉంది.

బాంగ్లాదేశ్‌లో ఇప్పటి నుంచి ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు నిర్వహించినా, అవామీలీగ్‌ పూర్తిగా అధికారానికి దూరమైన నేపథ్యంలో, ఢాకాలో తనకు అనుకూలమైన, విధేయమైన ప్రభుత్వం రావాలని వాషింగ్టన్‌ ఆశిస్తుంది.

మరొకవైపు, భారతదేశపు ‘చికెన్‌ నెక్‌’ ప్రాంతానికి దగ్గరగా ఉండేందుకు బీజింగ్‌కు ఆస్కారమిచ్చే తీస్తా నదీ ప్రాజెక్టు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ప్రయత్నించి, చైనా చేజిక్కించుకుంటుంది. హసీనా ప్రభుత్వం పడిపోయే కొన్నివారాల ముందు, చైనా పర్యటనకు వెళ్లిన బాంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమైన నేపథ్యంలో గ్రాంట్లే కాకుండా రెండు బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల విలువైన వడ్డీలేని, రాయితీలతో కూడిన వాణిజ్య రుణాలు ఇస్తామని ఆ దేశం హామీ ఇచ్చిందనే వార్తలు వచ్చాయి.

మనకు పైకి కనిపించినట్టుగా, ప్రత్యక్షంగా లేదా ఆసియన్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు (ఎఐఐబి) ద్వారా లేదా ప్రత్యక్షంగాను మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడం అన్నది కేవలం పెట్టుబడుల ప్రోత్సాహానికే ఇది పరిమితం కాదు. బదులుగా, ఇది భారత్‌కు వ్యూహాత్మక సమస్యలు తలెత్తేలా చేసి, గడపలోకి వచ్చే అవకాశాన్ని చైనాకు కల్పిస్తుంది.

బాంగ్లాదేశ్‌ కథనానికి మూడవ కోణం, పాకిస్తాన్‌, ముస్లిం బ్రదర్‌హుడ్‌లో కొంత భాగం మద్దతుతో జమాత్‌`ఇ`ఇస్లామీ కల్లుతాగిన కోతుల్లా ప్రవర్తించడం. ఇది భారత్‌కు పెనుసవాళ్లను విసురు తుంది. బాంగ్లాదేశ్‌లో హిందువులను జమాత్‌ హననం చేస్తున్న విషయం విస్తృతంగా వార్తలలోకి ఎక్కింది. సిఐహెచ్‌ఎస్‌ ఈ తీవ్రమైన, ఘోరమైన నేరాలను అత్యంత నిశితంగా నమోదు చేసింది.

‘ముస్లింల సమ్మేళనం’గా జమాత్‌ ప్రాచుర్యం పొందింది. 1975లో అతి పెద్ద ముస్లిం సంస్థగా ఏర్పాటైన జమాత్‌ను 2013లో బాంగ్లాదేశ్‌ సుప్రీం కోర్టు ప్రత్యక్ష రాజకీయాల నుంచి నిషేధించింది. మత స్వేచ్ఛ లేదా ఇతర విశ్వాసాలను అనుస రించేందుకు స్వతంత్రాన్ని జమాత్‌ సంస్థ వ్యతిరేకిం చడంతో దానిని రాజకీయాలలో పాల్గొనేందుకు అనర్హులుగా ప్రకటించింది.

అల్‌`బదర్‌, అల్‌`షామ్స్‌, స్వయం ప్రకటిత శాంతి కమిటీలు అన్నీ జిహాదిస్టు నెట్‌వర్క్‌ దాని పరిధిలో ఉంటాయి. ఇవన్నీ కూడా బాంగ్లాదేశ్‌లోని హిందూ, బౌద్ధ, క్రైస్తవ వ్యతిరేక సంస్థలు.

ఈ పరిణామాల క్రమంలో బాంగ్లాదేశ్‌ విషయంలో అత్యంత భిన్న అజెండాలు కలిగిన క్రైస్తవ మతప్రచారకులు, ఇస్లామిక్‌ శక్తులు ఒకరితో ఒకరు తలపడే అవకాశం ఉంది. యుఎస్‌ మద్దతుతో అతివాద క్రైస్తవ మతప్రచారకులు స్వయంప్రతిపత్తి గల క్రైస్తవ ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలన్న వ్యూహం బాంగ్లా దేశ్‌ను ‘మతాధిపత్య,’ ‘ఇస్లామిస్టు’ రాజ్యాంగా రూపొందించాలన్న జమాత్‌ భావనకు విరుద్ధంగా ఉంటుంది. క్రైస్తవ మతప్రచారకులు, ముస్లింల మధ్య సంఘర్షణ అన్నది చిలికి చిలికి గాలి వాన అవుతున్న వార్తలు ఐరోపా దేశాలలోని అనేక నగరాల నుంచి వస్తున్న విషయం తెలిసిందే.

 సరళమైన, పురోగమనశీలమైన ప్రజాస్వామిక అజెండాను బాంగ్లాదేశ్‌లో అమలుచేయడానికి చైనా, యుఎస్‌లలోని విరుద్ధ భౌగోళిక`రాజకీయ శక్తులు, క్రైస్తవ మతప్రచారకులు, జమాత్‌ మతపరమైన తీవ్రవాదం అన్నవి అతి తక్కువ అవకాశాన్ని మిగిలిస్తాయి. హిందువుల, బాంగ్లాదేశ్‌లో నివసిస్తున్న భారతీయ మూలాలు కలిగిన ప్రజల ప్రయోజనాలే కాకుండా తన భౌగోళిక`రాజకీయ, వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకునేందుకు భారత్‌ ఈ ఉత్తేజిత మిశ్రమంలో ఆచితూచి అడుగులు వేస్తూ ప్రయాణించాలి.

హిందువుల ప్రాణాలు, ఆస్తులు, వ్యాపారాలను, ముఖ్యంగా జిహాదిస్టులు లక్ష్యంగా చేసుకున్న మహిళలను పరిరక్షించేందుకు బాంగ్లాదేశ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరిగ్గానే ఉద్ఘాటించారు.

తన వారిని బాంగ్లాదేశ్‌లో పరిరక్షించడమే కాకుండా హింసతో అట్టుడుకుతున్న దేశం నుంచి పారిపోయి ప్రవాహంలా వచ్చి పడిపోతున్న బాంగ్లాదేశీలను నిలువరించి, వ్యవహరించడం అన్నది భారతదేశానికి అతిపెద్ద ప్రాధాన్యత.

రెండవది, పాకిస్తాన్‌ వంటి కీలుబొమ్మలు సహా యుఎస్‌, చైనా – ఇద్దరికీ క్రీడారంగమైన ఈ బురద నీటిలో న్యూఢిల్లీ ఈదవలసి రావచ్చు.

మూడవది, అతివాద వామపక్ష తీవ్రవాదులు, మతతత్వ జిహాదిస్టుల నుంచి సైనిక వ్యవస్థ వరకూ రకరకాల శక్తులు తాండవం చేస్తున్న నేపథ్యంలో ఢాకాతో సమీకరణలను పునఃపరిశీలించడం లేదా సవరించడం అన్నది అతిపెద్ద సవాలుగా పరిణమించ వచ్చు.

నాలుగవది, శాంతియుతమైన, నిశ్చలమైన, సుసంపన్నమైన దక్షిణ ఆసియా అన్న అజెండాను అనుసరించడం భారత్‌కు అంత తేలిక కాకపోవచ్చు.

ఐదవది, మాజీ ప్రధానమంత్రి, సీనియర్‌ అవామీ లీగ్‌ నాయకురాలు షేక్‌ హసీనాను ఢిల్లీలో రాష్ట్ర అతిథిగా గౌరవించడాన్ని కొనసాగించినంత కాలం బాంగ్లాదేశ్‌తో సంబంధాలను సజావుగా చేసుకోవడం కొంత సమస్యాత్మకం కావచ్చు.

ఆరవది, అన్ని శక్తులూ యధావిధిగా కొనసాగు తున్నప్పుడు భావసారూప్యత కలిగిన భాగస్వాములతో కలిసి ప్రజాస్వామ్యం కోసం ప్రయత్నించడం అత్యంత క్లిష్టమైన పని కావచ్చు.

ఏడవది, తమ దేశంలో అన్ని ఆశలనూ కోల్పోయి, మెరుగైన అవకాశాల కోసం భారత దేశంలోకి చొరబడాలుకునే ప్రజలనేకమంది ఉన్న నేపథ్యంలో, సాపేక్షంగా ఉద్రిక్తతలు లేని బాంగ్లాదేశ్‌ సరిహద్దులను 365 రోజులూ, 24 గంటలూ కాపుకాయవలసిన అవసరం ఉంది.

ఎనిమిదవది, బాంగ్లాదేశ్‌లో రాజకీయ, సామాజిక కల్లోలం, ఆర్ధిక పతనం కారణంగా తూర్పు రాష్ట్రాలలో తన జనాభాకు ముప్పు వచ్చే ఆస్కారాన్ని భారత్‌ నిశితంగా పరిగణించి, పరిశీలించవలసి ఉంటుంది.

బాంగ్లాదేశ్‌, భారత్‌ల మధ్య దీర్ఘకాలిక సంబంధాల కోసం నిష్పాక్షికమైన, ఉదారవాద, సహేతుకమైన వైఖరిని అవలంబించవలసి ఉంటుంది.

కె.ఎ. బదరీనాథ్‌

(‘సెంటర్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ అండ్‌ హోలిస్టిక్‌ స్టడీస్‌’ డైరెక్టర్‌

– చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌, న్యూఢిల్లీ)

About Author

By editor

Twitter
YOUTUBE