సంపాదకీయం
శాలివాహన 1946 శ్రీ క్రోధి శ్రావణ శుద్ధ అష్టమి – 12 ఆగస్ట్ 2024, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
మన పొరుగు దేశం బాంగ్లాదేశ్ పరిణామాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. పదిహేనేళ్లు తిరుగులేని నేతగా బాంగ్లా రాజకీయాలను శాసించిన షేక్ హసీనా యుగం సమాప్తమైనట్టే ఉంది. ఉద్యోగాలలో రిజర్వేషన్ సమస్య పేరుతో జూన్ 5న మొదలైన అల్లర్లు, ఆగస్ట్ 5తో ఆమె రాజీనామాకు కారణమై, దేశం వీడి వెళ్లవలసిన అవాంఛనీయ పరిస్థితులు వచ్చాయి. ఈ సంవత్సరం జనవరిలోనే ఏర్పడిన పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్టు దేశాధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ ప్రకటించారు. 1971 నాటి సోనార్ బాంగ్లా స్వాతంత్య్ర సమరానికి నాయకుడు, మాజీ అధ్యక్షుడు షేక్ ముజిబూర్ రెహమాన్ ఇప్పుడు దేశం అసహ్యించుకునే చరిత్ర పురుషుడు కావడం ఒక వైచిత్రి.
ఈ ఉదంతంలో హసీనా పాత్రను కాదనలేం. ఆమె ఒక నియంతలా వ్యవహరించారన్న ఆరోపణ ఉంది. బాంగ్లాదేశ్ అత్యున్నత న్యాయస్థానం వైఖరీ కారణమైందనే అనాలి. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు 30 శాతం రిజర్వేషన్‌ను సమర్ధిస్తూ ఆ కోర్టు జూన్ 5న తీర్పు ఇచ్చింది. జూలై 21న ఆ రిజర్వేషన్‌నే 5 శాతానికి తగ్గించింది. అయినా అల్లర్లు సద్దుమణగలేదు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ మళ్లీ ఆందోళనలు చేపట్టి, తారస్థాయికి తీసుకువెళ్లారు. మొత్తానికి ఆగస్ట్ 5న హసీనా అవమానకరమైన తీరులో ప్రధాని పదవికి రాజీనామా ఇచ్చి దేశం వదిలారు. బాంగ్లాదేశ్ అనే ఆ చిన్న దేశం మూడోసారి సైనిక పాలనలోకి వెళ్లిపోయింది. సైన్యాధ్యక్షుడు జనరల్ వాకెర్ యుజ్ జమాన్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టు ప్రకటించాడు.
ఒక పౌర సంక్షోభానికి సైనిక పాలన ముగింపు కావడం ప్రజాస్వామ్యవాదులకు రుచించనిదే. కానీ ఈ పరిణామానికి ముందు వివక్షా వ్యతిరేక విద్యార్థి ఉద్యమ సంస్థ ఇచ్చిన పిలుపును ప్రజలు గమనంలోకి తీసుకుని ఉంటే బాగుండేది. నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ మహమ్మద్ యూనస్ ప్రధాన సలహాదారుగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పరచాలని ఆ విద్యార్థి ఉద్యమం సంస్థ సభ్యులు పిలుపునిచ్చారు. ఇది ఆహ్వానించదగినది. డాక్టర్ యూనస్ కూడా నాలుగు మంచి మాటలే చెప్పారు. షేక్ హసీనా దేశం వీడి వెళ్లినందుకు చేసుకుంటున్న సంబరాలు ముగియగానే అంతా ఇళ్లకు వెళ్లిపోవాలని, ప్రస్తుతం దేశంలో శాంతిభద్రతలు నెలకొనడం అత్యవసరమని ఒక చానెల్‌తో మాట్లాడుతూ చెప్పారాయన. నిజానికి హసీనా నిష్క్రమించినా అల్లర్లు ఆగక పోవడం విచిత్రమే. హసీనా నాయకత్వంలోని ఆవామీ లీగ్ సభ్యులకూ, నిరసన కారులకూ మధ్య ఘర్షణలు కూడా ఆగలేదు. అల్లర్లు ఆగకుంటే వాటి ప్రభావం మైన్మార్ మీద, భారత్‌లో సెవెన్ సిస్టర్స్ మీద ఉంటుందని డాక్టర్ యూనస్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలో లోతైన అర్ధాలే ఉన్నాయని అనిపిస్తుంది. దేశంలో పది లక్షల మంది రొహింగ్యాలు ఉన్న నేపథ్యంలో ఈ గొడవ అగ్ని పర్వతంలా బద్దలయ్యే ప్రమాదమూ ఉందని ఆయన హెచ్చరించడం మరింత వాస్తవికంగా ఉంది. ఏమైనా ఇప్పుడు బాంగ్లాదేశ్ సైన్యం పాలన కింద ఉందన్నది నిజం.
ఈ పరిణామాలు కలవరపెట్టేవే. మొదట బాంగ్లా బంధు షేక్ ముజిబూర్ రెహమాన్ వ్యతిరేక శక్తులు, అంటే పాక్ అనుకూల వర్గాలు పెచ్చరిల్లాయన్నది స్పష్టమవుతోంది. హసీనా అధికారిక నివాసం మీద దాడి చేసినప్పుడు ముజిబూర్ విగ్రహం మీద కూడా ఆందోళనకారులు దాడికి దిగారు. సైనిక పాలన దరిమిలా మన రెండు దేశాల సంబంధాలు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేం. ఈ అల్లర్లలో కీలకంగా ఉన్న నిషిద్ధ జమాతే ఇస్లామీ పార్టీ సైనిక ప్రభుత్వంలో భాగస్వామి కావచ్చునన్న ఊహాగానాలు విస్మరించకూడనవి. ఇదే సంస్థ బాంగ్లా ఉద్యమంలో పాకిస్తాన్ సేనలు జరిపిన ఊచకోతకు సహకరించిందన్న ఆరోపణలు ఉన్నాయి. రిజర్వేషన్ వ్యతిరేకోద్యమంలో సంభవించిన 300 మరణాల గురించీ, జరిగిన నష్టం గురించీ విచారణ జరిపిస్తామని సైనిక నేత ప్రకటించడంతోటే హసీనా ఇక ఇంగ్లండ్ నుంచి బాంగ్లాకు రాకపోవచ్చునన్న అంచనాలు వినిపిస్తున్నాయి. 1971 నాటి స్వాతంత్య్రోద్యమంలో తూర్పు బెంగాల్ నుంచి లక్షలలో శరణార్థులు వచ్చి భారత్‌లో తలదాచుకున్నారు. వారి పోషణ భారత బడ్జెట్ మీదనే ప్రభావం చూపింది. ఇప్పుడు అదే పరిస్థితి పునరావృతమైనా ఆశ్చర్యంలేదు. కానీ ఇదే జరిగితే దీని ప్రమాద స్థాయి ఎక్కువే ఉంటుంది. స్వరూపం కూడా భిన్నంగానే ఉంటుంది. ఇదే అదనుగా పాక్ అనుకూల శక్తులు, రొహింగ్యాలు మరింతగా భారత్‌లో చొరబడడానికి ప్రయత్నిస్తారు. బాంగ్లాలో ఇంకా మిగిలి ఉన్న భారతీయ విద్యార్థులను రావించడం కూడా సమస్యే. ఇదే అదనుగా హిందూ దేవాలయాల మీద మతోన్మాదశక్తులు దాడులకు దిగడం దారుణం. ఇటీవల కాలంలో అక్కడ హిందువుల మీద, హిందువులు ప్రార్థనా స్థలాల మీద దాడులు పెరిగిన సంగతి నిజం. ఇలాంటి పరిస్థితులలో కూడా ఢాకేశ్వరి ఆలయ రక్షణకు కొందరు హిందూ యువతీయువకులు ముందుకు రావడం స్వాగతించదగినది. ఇప్పటికే మూడు ఆలయాలను ఉన్మాదులు ధ్వంసం చేశారు. హిందూ దేవాలయాలకు రక్షణ కల్పిస్తున్నట్టు మిలటరీ పాలకులు చెప్పడం ఆహ్వానించదగినదే. రిజర్వేషన్ సమస్యే దేశం పరిస్థితిని, ఇంత వేగంగా, ఇంతదాకా తీసుకు రాగలదా? ఇందులో అగ్రరాజ్యాల ప్రమేయం ఉందని ఇప్పటికే అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రిజర్వేషన్ సమస్యకు మించి, ఆ చిన్న దేశం అంచనాకు అందని ఎత్తు ఏదో ఇందులో ఉందన్నదే అందరి అనుమానం. స్వాతంత్య్రం కోసం పోరాడిన కుటుంబాలకు రిజర్వేషన్ కల్పిస్తామన్నందుకు ఇంత రగడా? ఈ ప్రశ్నలకు నోబెల్ గ్రహీత డాక్టర్ యూనస్ వ్యాఖ్యలలో జవాబులు వెతుక్కోవచ్చునేమో!