అయోధ్యలో రామాలయ నిర్మాణం అంటే, ఆధునిక భారతదేశ నిర్మాణమన్న మాట ఉంది. ఇదొక సుదీర్ఘ ధార్మిక పోరాటం. దీనిని తుదికంటా తీసుకువెళ్లినదే విశ్వహిందూ పరిషత్. ఆరు దశాబ్దాల విశ్వహిందూ పరిషత్ చరిత్రలో అయోధ్య ఘట్టం చిరస్మరణీయమైనది. దేశమంతా రామమయం చేసిన ఘనత కూడా పరిషత్‌దే. అంతిమంగా ఇది సంఘ పరివార్ సాధించిన అద్భుత విజయం. ఎనిమిదివందల ఏళ్ల బానిస చరిత్రలో ఇదే మొదటి విజయం. దీనికి కేంద్ర బిందువు విశ్వహిందూ పరిషత్.
2024లో హిందూ సమాజం అయోధ్యలో శ్రీరాముడిని ప్రతిష్ఠించుకుంది. అదొక అసాధారణ పోరాటంతోనే సాధ్యమైంది. అందులో ఆఖరి పోరాటం మాత్రం విశ్వహిందూ పరిషత్ నిర్వహించి చరితార్థమైంది. 1528లో మొదలైన పోరాటమది. శతాబ్దాల తరబడి వివాదం కోర్టులలోనే ఉండి పోవడం, అందుకోసం వరుస కేసులు వేస్తూ ముస్లింలు అడ్డుపడడం హిందూ సమాజ సహనాన్ని పరీక్షించింది. ఈ ధోరణికి వ్యతిరేకంగా ఉద్యమించా లని హిందూ ధర్మాచార్యులు 1984లో ఆదేశించారు. వారి నిర్ణయం మేరకు విశ్వహిందూ పరిషత్ సరికొత్త ఉద్యమ కార్యాచరణకు సిద్ధమైంది. 1984 ఏప్రిల్ 7,8, తేదీలలో న్యూఢల్లీిలోని విజ్ఞానభవన్‌లో హిందూ ధర్మసంసద్ నిర్వహించారు. అయోధ్య రామ జన్మభూమి, కాశీ విశ్వనాథ మందిరాన్ని, మధుర శ్రీకృష్ణజన్మభూమిని అప్పగించాలని తీర్మానం చేశారు. గోరఖ్‌నాథ్ పీఠం మహంత్ అవైద్యనాథ్ అధ్యక్షులుగా శ్రీరామ జన్మభూమి ముక్తి యజ్ఞ సమితిని ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 25, 1984న బిహార్‌లోని సీతామర్హి నుంచి శ్రీరామజానకి రథయాత్ర నిర్వహించి ఆయన ప్రజలను జాగృతం చేసే పనిని మొదలు పెట్టారు. ఆంజనేయస్వామి పేరుతో యువజన సంఘాన్ని ఏర్పాటుచేయాలని ధర్మసంసద్ నిర్ణయించింది. బజరంగ్‌దళ్ ఏర్పాటుతో లక్షల సంఖ్యలో యువకులు ఈ సంఘటన యజ్ఞంలో చేరడం మొదలుపెట్టారు.
1985 అక్టోబర్ 31, నవంబర్ 1న రెండు రోజులు ఉడిపిలో పూజ్య పెజావర్ స్వామీజీ అధ్యక్షతన హిందూ ధర్మసంసద్ సమ్మేళనం జరిగింది. మార్చి 8, 1986 శివరాత్రికి శ్రీరామ జన్మభూమిని హిందూ సమాజానికి దత్తం చేయకపోతే దేశమంతటా సత్యాగ్రహం చేయాలని తీర్మానించారు. రామ జన్మభూమిని స్వాధీనం చేయకపోతే ఆత్మాహుతి చేసుకుంటానని అయోధ్యలోని దిగంబర్ అఖాడాకు చెందిన మహంత్ శ్రీరామచంద్రదాస్ (1950 నుంచి ఫైజాబాద్ సివిల్ కోర్టులో న్యాయ పోరాటం చేసినవారు) అప్పుడే ప్రకటించారు. అప్పటికి ఆయన వయసు 75 సంవత్సరాలు.
తెరుచుకున్న తాళాలు
ఈ పరిణామాలతో అయోధ్య జాతీయ ప్రాముఖ్యం కలిగిన అంశంగా మారింది. నాటి యూపీ ముఖ్యమంత్రి వీర బహదూర్ సింగ్ అయోధ్యకు వెళ్లాడు. జన్మభూమి ద్వారానికి అక్రమంగా తాళం వేశారనీ, చట్టవిరుద్ధమనీ విశ్వహిందూ పరిషత్ పెద్దలు సింగ్ దృష్టికి తీసుకువెళ్లారు. శ్రీరామజన్మభూమి కట్టడం తాళాలు తెరిపించాలని కోరుతూ న్యాయవాది అశోక్ చంద్రపాండే ఫిబ్రవరి 1,1986న ఫైజాబాద్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 1949లో తాళాలు ఎవరు వేశారు వంటి విషయాలకు సంబంధించి యూపీ ప్రభుత్వం వద్ద రికార్డులు లేవని తెలియడంతో జిల్లా సెషన్స్ జడ్జి కె.ఎం.పాండే వెంటనే తాళాలు తెరవాలని ఆదేశించారు. అయితే జిల్లా పోలీసులు తాళాలు తెరిచేందుకు ముందుకు రాలేదు. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ సభ్యులు సత్యాగ్రహానికి దిగుతామని హెచ్చరించడంతో చివరకు తాళాలు తెరిచారు.
చాలా సంక్లిష్ట పరిస్థితుల మధ్య, ఇంకా చెప్పా లంటే చాలా అనివార్యతల నడుమ ఫిబ్రవరి 1, 1986న అయోధ్య రామయ్యను దర్శించుకునే అవకాశం హిందువులకు వచ్చింది. విశ్వహిందూ పరిషత్ నాయకులు తమ ఆందోళనలు, యజ్ఞాలు ఫలించినందుకు సంతృప్తి ప్రకటించారు. అయితే ఆ స్థలంపై యాజమాన్యపు హక్కు ఎవరిదన్న అంశం ఇంకా కోర్టు నిర్ధారించవలసి ఉంది. ఆ హక్కు కూడా లభించినపుడే అసలు పర్వదినం.
ఫిబ్రవరి 1, 1986న అయోధ్యలో సమావేశమైన హిందూ ధర్మాచార్యులు, సాధుసంతులు శ్రీరామజన్మ భూమి దేవాలయంతో పాటు, పరిసర ప్రాంతాలను పునరుద్దరించి అభివృద్ధి చేసేందుకు శ్రీరామజన్మ భూమి ట్రస్టును ఏర్పాటు చేశారు. సమాజంలో శాంతిని కాపాడు కుంటూనే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని విశ్వహిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్ ప్రకటించారు.
నవంబర్ 9,1989న అయోధ్యలో రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన – శిలాన్యాసం జరిగింది. కరసేవ అని పిలవకపోయినా రామభక్తులు అయోధ్యకు వెల్లువెత్తిన తొలి ఘటన ఇది. 1989 డిసెంబర్‌లో తొమ్మిదో లోక్‌సభకు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో వీపీ సింగ్ నేతృత్వంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం వచ్చింది. దీనికి బీజేపీ బయట నుంచి మద్దతు ఇచ్చింది. శిలాన్యాసం జరిగిన కొద్దిరోజులకే రామభక్తులతో 1990 ఫిబ్రవరిలో కరసేవ నిర్వహించాలని వీహెచ్‌పీ పెద్దలు భావించారు. కానీ వీపీ సింగ్ ప్రభుత్వం సమస్య పరిష్కారానికి నాలుగు నెలల సమయం అడగటంతో కరసేవ నిర్ణయాన్ని వాయిదా వేశారు. చర్చలకు రాబోమని బాబ్రీ యాక్షన్ కమిటీ తెగేసి చెప్పడంతో మళ్లీ సమస్య మొదటికి వచ్చింది.
కరసేవ తేదీ ఖరారు
వీపీ సింగ్ ప్రభుత్వం కోరిన, లేదా విశ్వహిందూ పరిషత్ విధించిన నాలుగు నెలల గడువు ముగింపునకు వచ్చింది. 1990 జూన్ 23-24 తేదీల్లో హరిద్వార్‌లో సమావేశమైన సాధుసంతులు తాజా రాజకీయ పరిస్థితులను కూలంకషంగా చర్చించి అక్టోబర్ 30, 1990 వ తేదీన కరసేవ ప్రారంభించాలని ఆదేశించారు. కరసేవ అంటే మందిర నిర్మాణమే లక్ష్యంగా పనిచేయడం! ఉద్యమంలో భాగంగా 1990 సెప్టెంబర్‌లో నిర్వహించిన శ్రీరామజ్యోతి కార్యక్రమం… అటక్ నుంచి కటక్ వరకు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జాతిని సమైక్యం చేసింది. సెప్టెంబర్ 18, 1990న అయోధ్యలో తమ ప్రయాణాలను ఆరంభిం చిన శ్రీరామజ్యోతులు సరిగ్గా నెల తర్వాత అక్టోబర్ 18వ తేదీ దీపావళి పర్వదినాన లక్షలాది గ్రామాల్లోని కోట్లాది మంది హిందూ గృహాలకు చేరాయి. ప్రతి గ్రామం నుంచి కరసేవ కోసం ప్రతినిధులు కదిలారు.
అడ్వానీ రథయాత్ర
అయోధ్య ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఘనత బీజేపీ ప్రముఖుడు లాల్ కృష్ణ అడ్వాణీ రథయాత్రదే. 1986లో ఊపందుకుని, 1989 నాటి రామశిల కార్యక్రమంతో వేడెక్కిన అయోధ్య ఉద్యమం నుంచి బీజేపీ దూరంగా ఉండలేని పరిస్థితిని కల్పించాయి. 1989 జూన్‌లో పాలంపూర్ (హిమాచల్‌ప్రదేశ్)లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం రామ జన్మభూమి ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించింది. అక్టోబర్ 30న విశ్వహిందూ పరిషత్ తలపెట్టిన కరసేవకు తమ వంతుగా ప్రజలను సమాయత్తం చేయడానికి అడ్వాణీ రథయాత్రకు సంకల్పించారు. అక్టోబర్ 23న బిహార్‌లోనే సమస్తిపూర్ వద్ద రథయాత్రను ఆపి, అడ్వానీని అరెస్టు చేసి దుమ్కాలోని నీటి పారుదల శాఖ అతిథిగృహంలో నిర్బంధించారు. మరుక్షణమే వీపీ సింగ్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహ రించుకుంది. ప్రభుత్వం పడిపోయింది. వీపీసింగ్ తరువాత చంద్రశేఖర్ ప్రధాని అయ్యారు.
అక్టోబర్ 30, 1990
అడ్వాణీ రథయాత్రను ఆపినా, అక్టోబర్ 30 నాటి కరసేవ ఆగలేదు. కానీ దీనిని నిరోధించడానికి 24వ తేదీ నుంచి యూపీలోని వేలాదిమంది ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తల అరెస్టులు మొదలైనాయి. 24వ తేదీన దాదాపు లక్షన్నర మందిని యూపీ ప్రభుత్వం అరెస్టు చేసి తాత్కాలిక జైళ్లకు తరలించింది. వేలాది మందితో వస్తున్న జోతిష్యపీఠం శంకరాచార్యులను పావపావ్ వద్ద అక్టోబర్ 24వ తేదీన పోలీసులు నిర్బంధిం చారు. 29వ తేదీనాటికి (దేశంలో) అరెస్టైనవారి సంఖ్య ఏడున్నర లక్షలు. యూపీలోని రెండువేల పాఠశాలలు, కళాశాలలు, సత్రాలు అన్ని తాత్కాలిక కారాగారాలుగా మారాయి.
అక్టోబర్ 27 తేదీ నాటికి ఢల్లీి, హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బిహార్‌ల నుంచి వెల్లువలా కరసేవకులు యూపీలోకి ప్రవేశించారు. ఆ రోజున విశ్వహిందూ పరిషత్ అగ్రనాయకులు అందర్ని రాష్ట్రంలో అరెస్టు చేసింది యూపీ ప్రభుత్వం. అక్టోబర్ 28వ తేదీన మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్ వద్ద బీజేపీ నేత రాజమాత విజయరాజె సింధియాను అరెస్టు చేశారు. ఆమె నేతృత్వంలో 50 వేల మంది కరసేవకులు బయలుదేరి యూపీలో ప్రవేశించారు. బీజేపీ అగ్రనేత అటల్ బిహార్ వాజ్‌పేయి, కేదార్‌నాథ్ సహానీలు విమానంలో లక్నోకు చేరుకోగానే వారిని పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ భారతం నుంచి వచ్చిన కరసేవకులకు బీజేపీ నేత ఏ. నరేంద్ర నాయకత్వం వహించారు. ఆయన నాయకత్వంలో దాదాపు 50 వేలమందికిపైగా కరసేవకులు యూపీలో ప్రవేశించారు. అక్టోబర్ 29న 2 వేల మంది కరసేవకులు కర్ఫ్యూను ధిక్కరించి అయోధ్యలో ప్రవేశించేసరికి ములాయం ప్రభుత్వం ఉలిక్కిపడిరది. ఇది కరసేవకుల మొదటి విజయం! ఉద్యమనేత, విశ్వహిందూ పరిషత్ నాయకుడు అశోక్ సింఘాల్ పోలీసులు, గూఢచారుల కళ్లుగప్పి అయోధ్యలో ప్రవేశించారు.
కరసేవ
అక్టోబర్ 30 ఉదయం 9.44 నుంచి 11.44 మధ్య కరసేవకు మూహూర్తంగా నిర్ణయించారు. కరసేవకులు, భద్రతాదళాల మధ్య మొదటి పోరాటం ఆ తెల్లవారు జామున 3 గంటల వేళ సరయూ వంతెన వద్ద ప్రారంభమైంది. కరసేవకులను నిలువ రించడం పోలీసులకు అసాధ్యమైంది. కాల్పులు జరిగాయి. చాలామంది కరసేవకులు సరయూలో దూకారు. వారిలో కొంతమంది మహిళలు. ఎంతమంది కరసేవకులు మరణించారో ఎవరు లెక్క చెప్పలేకపోయారు. ఆ రోజంతా నదిలో శవాలు దొరుకుతూనే ఉన్నాయి!
విశాల హిందూ జనవాహిని మధ్యలో విశ్వహిందూ పరిషత్ నేతలు అశోక్ సింఘాల్, మరో నేత యూపీ మాజీ డీజీపీ శిరీశ్‌చంద్ర దీక్షిత్, సంత్ వామదేవ్‌జీ మహరాజ్ ఉన్నారు. వీరిని అరెస్టు చేసేందుకు యూపీ ప్రభుత్వం 10 రోజులుగా విఫలయత్నమే చేసింది. కరసేవ మూహూర్తం సమీపిస్తుండటంతో కరసేవకులు సింఘాల్ నేతృత్వంలో జైశ్రీరాం నినాదాలు చేస్తూ రామ జన్మస్థాన్ వైపునకు కదిలారు. ఒక్క ఉదుటన పోలీసులు సింఘాల్‌పై పడ్డారు. ఆయన తలపై లాఠీ దెబ్బ పడడంతో రక్తం ధారకట్టింది. దెబ్బలు పడుతున్నా ముందుకే కదులుతుండటంతో పోలీసులు అరెస్ట్ చేసి ఫైజాబాద్ ఆసుపత్రికి తరలించారు.
ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు వేలాది మంది కరసేవకులు కర్ఫ్యూను ధిక్కరించి చిన్న చిన్న సందులు గుండా పోలీసులతో పోరాడుతూ హనుమాన్ గఢీ వద్దకు చేరుకున్నారు. ఈ సమాచారం జిల్లా మేజిస్ట్రేట్ రామశరణ్ శ్రీవాస్తవకు చేరింది. కరసేవకులను వెనక్కి వెళ్లాలని బెదిరించాడు. కరసేవకులు తగ్గలేదు. జన్మభూమికి వెళ్లే చిట్టచివరి బారికేడ్‌ను సైతం ధ్వంసం చేశారు. శ్రీరామ జన్మభూమికి-కరసేవకులకు మధ్య సరిహద్దు భద్రతాదళాలు, సీఆర్పీఎఫ్ అడ్డుగోడగా నిలిచాయి.
జిల్లా మేజిస్ట్రేట్ శ్రీవాస్తవ కరసేవకులపై కాల్పులు జరపాలని బీఎస్‌ఎఫ్ సైనికులను ఆదేశించారు. నిరాయుధులైన కరసేవకులు, ఇంకా వృద్ధులపై కాల్పులు జరపడానికి బిఎస్‌ఎఫ్ అంగీకరించలేదు. దాంతో కరసేవకులు ముందుకు దూకారు. శ్రీవాస్తవ మరోసారి ఫైరింగ్ ఆదేశాలు ఇచ్చాడు. ఈసారి సీఆర్‌పీఎఫ్ జవాన్లు కాల్పులు ప్రారంభించారు. మొదటి వరుసలోని 12 మంది కరసేవకులు అక్కడే కుప్పకూలి అసువులు బాశారు. సహచరులు బలి అవ్వడం చూసిన మిగిలిన కరసేవకులు చొక్కా గుండీలు విప్పి ఛాతిని చూపిస్తూ ముందుకు దూకారు. కొందరు కాల్పులకు ఆదేశాలిచ్చిన జిల్లా మేజిస్ట్రేట్ శ్రీవాస్తవ వైపునకు ఊరికారు. అటు ఇళ్లపై నుంచి కాల్పుల మోత విన్న అయోధ్య ప్రజలు కూడా పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ మధ్యలో అక్కడి నుంచి శ్రీవాస్తవ పలాయనం చిత్తగించాడు.
మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు దాదాపు వెయ్యి మందికి పైగా కరసేవకులు అన్ని అడ్డంకులు తొలగించుకుని బాబ్రీ కట్టడం-రామ జన్మభూమి వద్దకు చేరుకున్నారు. నాలుగు నిమిషాల్లో ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. రామ్‌లాలా హమ్ ఆయే హై…. అంటూ ఆనందోత్సాహాలతో జన్మస్థాన్‌పై సాష్టాంగపడ్డారు. లేచి కరసేవను ప్రారంభించారు. అక్కడ కొద్దిగా మట్టి తవ్వి సంకేతరూపంలో పునాది వేయడమే కరసేవ! వారి వద్ద ఎలాంటి ఉపకరణాలు లేవు. బారికేడ్‌లను ఛేదించుకుని వచ్చిన సమయంలో దొరికిన ఇనుపరాడ్లే కరసేవకు పనిముట్లు. యువకులు ఒకరి భుజాలపై ఒకరు ఎక్కి గోపురాల పైకి చేరుకున్నారు. జాతికే కళంకమైన బాబ్రీ కట్టడాన్ని తొలగించే పనిని ప్రారంభించారు. అది కూడా ప్రతీకాత్మకంగానే! మరికొందరు యువ కరసేవకులు భగవ జెండాలను ఎగురవేశారు. దాదాపు 20 నిమిషాలపాటు బాబ్రీపై కరసేవకుల పెత్తనం నడిచింది.
విశ్వహిందూ పరిషత్ నాయకుడు, యూపీ మాజీ డీజీపీ ఎస్సీ దీక్షిత్‌ను కొందరు పోలీసు అధికారులు జన్మస్థాన్ వద్దకు తీసుకువచ్చారు. లక్ష్యం నెరవేరింది, వెనక్కి రమ్మని ఆయన కరసేవకులకు విజ్ఞప్తి చేశాడు. చాలామంది వెనక్కి మరలి వస్తున్నారు కూడా. అప్పుడే ఒక హెలికాప్టర్ తక్కువ ఎత్తులో ఎగురుతూ బాబ్రీ కట్టడం వద్దకు వచ్చింది. అందులో ఉన్న ములాయం సింగ్ యాదవ్, మంత్రి మహమ్మద్ ఆజం ఖాన్‌ను కరసేవకులు గుర్తుపట్టారు. కరసేవ జరిగిందని అర్థం చేసుకున్న ములాయం, భద్రతా దళాలకు రెడ్ అలర్ట్ సందేశాలు ఇచ్చాడు. వెంటనే ఒక అధికారి మందిరంలోపల కరసేవకులపై కాల్పులకు ఆదేశాలు ఇచ్చాడు. మళ్లీ సీఆర్‌పీఎఫ్ జవాన్లే కాల్పులకు తెగబడ్డారు. ఇది ఆ రోజున నిరాయుధులైన కరసేవకులపై కాల్పులకు తెగబడిన మూడో ఘటన. ఇద్దరు మరణించారు. ఒకరు సాధువు. రెండోవారు 14 సంవత్సరాల రాజేంద్రకుమార్‌యాదవ్. ఈ బాలుడే మొదటిసారిగా బాబ్రీ కట్టడం గోపురంపైకి ఎక్కి భగవాపతాకాన్ని ఎగురువేశాడు. ఆ విధంగా శ్రీరామ జన్మభూమిలో అమరుడైన మొట్టమొదటి కరసేవకుడిగా రాజేంద్రకుమార్ నిలిచారు.
నవంబర్ 2, 1990
అక్టోబర్ 30 నాటి పరిణామాలతో గుండె బరువెక్కినా, 31, నవంబర్1వ తేదీలలో అయోధ్యలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. 30వ తేదీ నాటి కరసేవకు చేరుకోలేకపోయిన వేలాదిమంది వచ్చి చేరారు. ఇంతలో పోలీసుల కస్టడి నుంచి తప్పించుకున్న అశోక్ సింఘాల్, ఎస్సీ దీక్షిత్‌లు నవంబర్ 1వ తేదీ సాయంత్రానికి మహంత్ నృత్యగోపాల్ దాస్ నివాసం మణిరాం ఛావనీ చేరుకున్నారు. మరోసారి శాంతి యుతంగా మందిర ప్రవేశానికి ప్రయత్నించాలని నవంబర్ 2న మరోసారి ఊరేగింపుగా బయలు దేరారు. ఉదయం మణిరాం చావనీ నుంచి రెండు దిశలలో యాత్రలు ప్రారంభమయ్యాయి. కొద్ది దూరం వెళ్లగానే భద్రతా దళాలు ఎదురుపడ్డాయి. వెంటనే కరసేవకులు రోడ్డుపైనే బైఠాయించి రామ నామ జపం మొదలు పెట్టారు. తనను గుర్తుపట్ట కుండా తల నీలాలు సమర్పించుకున్న సాధ్వి ఉమా భారతి హిండాల్‌కో వసతిగృహం నుంచి తప్పించు కుని అయోధ్య చేరుకున్నారు. ఆమె నాయకత్వంలో ఉత్తర భారతానికి చెందిన వందలాది కరసేవకులు మరో మార్గం గుండా ముందుకు కదిలారు. మొత్తం మూడు మార్గాల్లో కరసేవకులు రోడ్లపైన ఉన్నారు. కొద్దిదూరం రాగానే మొదట ఉమాభారతిని పోలీసులు అరెస్టు చేశారు. దాంతో కరసేవకులు రోడ్డుపై పాకుతూ రామభజన చేసుకుంటూ కదిలారు.
ఇంతలో ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయో తెలియదు. మూడు మార్గాల్లో పాకుతూ వస్తున్న కరసేవకులపై పోలీసులు ఒక్కసారిగా బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. తుపాకులను కాళ్లకు కాకుండా తలలకు గురిపెట్టారు. ఇండ్లలో తలదా చుకున్న వారిని బైటకు ఈడ్చి కాల్చారు. కరసేవకుల మృతదేహాలను తీసుకుని పోవడానికి వచ్చిన వారిని సైతం కాల్చారు. అయినా కూడా కొంతమంది కరసేవకులు ముందుకే కదిలారు.
మరణించిన కరసేవకుల్లో కలకత్తాకు చెందిన రామ్‌కొఠారీ, శరత్‌కొఠారీ అనే యువకులు ఉన్నారు. ఇద్దరు కూడా 30వ తేదీన గోపురాలపై మొట్టమొదట ఎక్కిన బృందంలో ఉన్నారు. ఈ అన్నదమ్ములను పోలీసులు పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్చి చంపారు. కరసేవకుల బలిదానం చూసి కన్నీళ్లు పెట్టుకున్న పోలీసులు కూడా ఉన్నారు. నవంబర్ 2న జరిగిన కాల్పుల ఘటనపై అయోధ్య ప్రజలు ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ రోజు సాయంత్రం కనిపించిన పోలీసునల్లా రాళ్లతో కొట్టారు. బీజేపీ, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సంతాప సభలు, తిలాంజలి కార్యక్రమాలు నిర్వహించారు. వాటిలో కోట్లాది హిందూ సోదరులు పాల్గొన్నారు.
మూడో కరసేవ డిసెంబర్ 6, 1992లో జరిగింది. పెద్ద సంఖ్యలోనే కరసేవకులు హాజర య్యారు. ఉదయం కూడా వాతావరణం ప్రశాంతం గానే ఉంది. రామకథా కుంజ్‌లో సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు 70,000 మంది వచ్చారు. స్థలం వద్ద దాదాపు ఐదు వందల మంది సాధువులు పై భాగాన పూజలు చేయడానికి వెళ్లారు. కుంజ్‌లో ప్రసంగాలు సాగుతూ ఉండగానే కొందరు బయటకు వెళ్లారు. అక్కడ పోలీసులతో ఘర్షణ జరిగింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో దాదాపు ఎనభైమంది కట్టడం పైకి ఎక్కి గుమ్మటాలను ధ్వంసం చేసే పని మొదలుపెట్టారు. కట్టడం నేల మట్టమైంది. ప్రధానమంత్రి పీవీ నరసింహారావు చేత కొందరు కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌లలో ప్రభుత్వాలను వెంటనే రద్దు చేయించారు. ఆర్‌ఎస్‌ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్‌లను నిషేధించారు. కాంగ్రెస్ ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించడం అది మూడో సారి. అయితే ఈ నిషేధం చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. వివాదాస్పద కట్టడం కూలిన తరువాత తలెత్తిన సమస్య అక్కడి 2.77 ఎకరాల స్థలం మీద యాజ మాన్యపు హక్కు ఎవరిది అన్నదే. దీని మీదే నవంబర్ 9, 2019న భారత అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మకమైన తీర్పును వెలువరించి, 130 ఏళ్ల న్యాయ పోరాటాన్ని సుఖాంతం చేసింది.
– జాగృతి డెస్క్