సి.కుమారయశస్వి

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది.

రెండు బిల్డింగ్స్ ‌మధ్యన ఉన్న ఖాళీస్థలం ఇది. ముందు, వెనుక వీధులు ఉన్నాయి. ఆ వీధుల్లోని పిల్లలంతా చేరి ఆటలు ఆడుకోవడానికి అనువుగా ఉంది. కానీ, ఆదివారం సాయంకాలం అయినా కూడా ఖాళీగా కనిపిస్తోంది.

వెనుక వీధికి, స్థలానికి మధ్య ఒక గోడ ఉంది. ఆ గోడను ఆనుకొని ఒక పెద్ద వేప చెట్టు పెరిగింది. ఆ చెట్టు నీడలో, గోడ వి•ద హర్ష ఒక్కడే కూర్చోని ఉన్నాడు. క్రికెట్‌ ‌బ్యాట్‌ని రెండు చేతులతో పట్టుకొని, స్థలం వైపే నిరాశగా చూస్తున్నాడు.

పదకొండేళ్ల హర్షకి క్రికెట్‌ ఆడటమంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు నుండి ప్రతిరోజు సాయంకాలం తన స్నేహితులతోనో లేదా తన వీధిలోని తోటి పిల్లలతో కలిసి ఆడేవాడు. బ్యాటింగ్‌, ‌బౌలింగ్‌ ‌రెండు అద్భుతంగా చేస్తాడు. తన ఆట తీరు చూసి పిల్లలంతా కేరింతలు కొడుతుంటే రెట్టింపు ఉత్సాహన్ని కనబరిచేవాడు. తనతో పోటీపడలేక మిగతా పిల్లలంతా చతికిలపడేవారు. అలాంటి వాడు ఇప్పుడు దాదాపు నెల నుండి ఒక్కసారి కూడా క్రికెట్‌ ఆడలేదు. ఆ అవకాశం రాలేదు.

ఈ రోజైన ఆడుకోవాలని హర్ష సంతోషంగా బ్యాట్‌ ‌తీసుకొని ఇంట్లో నుండి బయలుదేరాడు. ఎలాంటి షాట్లు ఆడాలి, ఎలాంటి బౌలింగ్‌ ‌వెయ్యాలి అని ఆలోచిస్తూ వచ్చాడు. స్థలం దగ్గరికి రాగానే తన సంతోషం ఆవిరైంది. ఆశ కోల్పోకుండా ఎదురుచూడాలని నిశ్చయించుకున్నాడు. రెండు గంటల నుండి ఎదురుచూస్తునే ఉన్నాడు. ఒక్కరు కూడా రాలేదు. తనలో ఆశ సడలింది.

సూర్యాస్తమయ సమయం దగ్గరపడింది. అది గమనించిన హర్ష దిగులుగా తలదించి, కళ్లు మూసుకొని బాధపడుతూ ఒక్క క్షణంపాటు కూర్చున్నాడు. తర్వాత పైకి లేచి, బ్యాట్‌ ‌తీసుకొని ఇంటికి బయలుదేరాడు. స్థలం మొత్తం దాటుకొని ముందు వీధి దగ్గరికి వచ్చాడు. స్నేహితులందరితో కలిసి ఆడుకొని, సంతోషంగా ఇంటికి బయలు దేరాల్సిన వాడు దిగాలుగా స్థలం దాటి వీధిలోకి అడుగుపెట్టాడు.

వీధిలో కొంచెం ముందుకు రాగానే, తనతో స్నేహితులల్లో ముగ్గురు పక్క వీధిలో ఉంటారని గుర్తొచ్చింది. వాళ్లు ఎందుకు రాలేదో తెలుసుకోవాలని అనిపించి వెంటనే వాళ్ల వైపుగా సాగాడు.

మొదటి స్నేహితుడి ఇంటికి వచ్చాడు. ఆ పిల్లవాడి ఇంట్లో లేడు. కాస్త ముందుకు రాగానే రెండో స్నేహితుడి ఇల్లు వచ్చింది. రెండో స్నేహితుడు కూడా ఇంట్లో లేడు. ఇంకాస్త ముందుకు వచ్చి, మూడో స్నేహితుడి ఇల్లు చేరాడు. మేడమీద ఉన్నాడని తెలుసుకొని పైకి వచ్చాడు.

మేడ మీదికి అడుగుపెట్టగానే ఆకాశంలో మెల్లగా కిందికి దిగుతున్న సూర్యుడ్ని చూశాడు. ఎర్రగా ఉన్న సూర్యుడు తన కళ్లకు పెద్ద బంతిలాగా కనిపించాడు.

ఎదురుగా ఉన్న గోడమీద తన స్నేహితులు అటు వైపుగా కూర్చోని ఉన్నారు. తన మూడో స్నేహితుడితో పాటు మిగతా ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారు. ముగ్గురు కలిసి తదేకంగా ఒక వైపే చూస్తున్నారు. హర్ష వచ్చింది కూడా గమనించుకోలేదు.

వాళ్లు ఏం చేస్తున్నరనే సందేహంతో హర్ష దగ్గరిగా నడిచాడు. రెండు అడుగులు ముందు వెయ్యగానే ముగ్గురు ఆనందంతో కేరింతలు కొట్టారు. అది చూసి వాళ్లు ఫోనులో ఆట ఆడుతున్నారని అర్థమైంది. మధ్యలో కూర్చున్న అబ్బాయి ఫోను ఆడుతుంటే పక్కనున్న ఇద్దరు ఆసక్తిగా ఆట వైపే చూస్తున్నారు. ఇంతకి ఏం ఆట ఆడుతున్నారో చూద్దామని దగ్గరికి వెళ్లి ఫోనులోకి తొంగి చూశాడు హర్ష. ఆశ్చర్యపోయాడు. వాళ్లు క్రికెట్‌ ఆడుతున్నారు. ఆటలో ఫోర్‌ ‌లేక సిక్స్ ‌పడినప్పుడు ఆనందపడిపోయి కేరింతలు కొడుతున్నారు. హర్ష చలనం లేకుండా నిలబడిపోయాడు.

‘‘హర్ష నువ్వెప్పుడు వచ్చావు?’’ అని ఒక స్నేహితుడు ఆశ్చర్యంగా అడిగాడు.

ఉలిక్కిపడి హర్ష తన స్నేహితుడి వైపు చూసాడు. మిగతా ఇద్దరు పిల్లలు కూడా హర్ష వైపు చూసి ‘హాయ్‌’ అని నిర్లిప్తంగా చెప్పి తిరిగి ఫోనులోకి మునిగిపోయారు. పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఆడగలిగిన ఆటను ఫోనులో ఆడుతుండటం చూసి హర్షకి కోపం వచ్చింది.

‘‘ఫోనులో ఎందుకు ఆడుతున్నారు?’’

‘‘ఏంటి?’’ హర్ష దేని గురించి చెప్తున్నడో అర్థంకాక తన స్నేహితుడు అడిగాడు.

‘‘క్రికెట్‌. ‌నిన్న నేను స్కూల్లో చెప్పింది గుర్తులేదా?’’

‘‘ఏం చెప్పావ్‌?’’

ఆ ‌ప్రశ్న వినగానే హర్ష కంగుతిన్నాడు.

శుక్రవారం సాయంకాలం తన నాన్నతో కలిసి బండి వి•ద ఒక వీధి నుండి వెళ్తుంటే ఒక ఖాళీ స్థలాన్ని చూశాడు. ఆ స్థలాన్ని చూడగానే అక్కడ ఆడుకోవచ్చని అనే ఆలోచన వచ్చింది. తన నెల రోజు ఎదురు చూపునకు ముగింపు పడినట్టు అనిపించి సంబరపడ్డాడు.

మరుసటి రోజు, అంటే శనివారం, స్కూల్‌కి వెళ్లి ఆ స్థలం గురించి తన స్నేహితులకి చెప్పాడు. రేపు సాయంకాలం క్రికెట్‌ ఆడేందుకు రండి అని అందరిని పిలిచాడు. అందరు వస్తామని చెప్పారు. దాంతో కొదవలేని ఆనందాన్ని పొందాడు. అప్పటి నుండి సాయంకాలం ఇంటి నుండి బయలుదేరే వరకు ‘ఎప్పుడెప్పుడు సాయంకాలం అవుతుంది. ఎప్పుడెప్పుడు ఆడుతానా’ అని ఆరాటపడ్డాడు.

‘‘ఆడుకునేందుకు రమ్మని చెప్పా కదా! అందరిని పిలిచానుగా..’’

‘‘ఓ..!’’ తన స్నేహితుడికి గుర్తోచింది.

‘‘..వి•రు కూడా వస్తామన్నారుగా..’’

‘‘అన్నాము కానీ….’’

‘‘…మనం క్రికెట్‌ ఆడక ఎన్ని రోజులైంది. వి•కు ఆడాలని లేదా?’’

‘‘లేదు’’ అని తన స్నేహితుడు గట్టిగా చెప్పాడు. హర్ష నివ్వెరపోయాడు.

‘‘ఆడాలనే ఆసక్తి పోయింది. నిన్న వస్తాము అని చెప్పాము కానీ ఈ రోజు రాబుద్ది కాలేదు. పైగా మన క్లాసులో అందరం ఫోనులో పోటీ పెట్టుకున్నాం. అందుకే రాలేదు’’

హర్ష ఏమి మాట్లాడకుండా నిలబడి తన స్నేహితుడి వైపే చూస్తున్నాడు. తన ఎదురుగా ఆకాశంలో సూర్యుడు పూర్తిగా అస్తమించాడు. మెల్లగా చీకటి ఆకాశం మొత్తం కమ్ముకుంటోంది.

* * *

హర్ష నిరాశగా వెనక్కి తిరిగి గబగబా అక్కడి నుండి తిరుగుముఖం పట్టాడు. తన స్నేహితుడు పిలుస్తున్నా పట్టించుకోలేదు. వీధిలో నుండి పెద్ద రోడ్డు వి•దకి వచ్చాడు. రోడ్డు వాహనాలతో చాలా రద్దీగా ఉంది. హర్షకు ఆ శబ్దాలు వినపడటం లేదు. తన మనసు నిండా అనేక రకాల ఆలోచనలు నడుస్తున్నాయి. ప్రతి ఆలోచన ఇక పై తను క్రికెట్‌ ఆడలేడేమో అనే అనుమానాన్ని రేకెత్తిస్తున్నాయి. ఆ అనుమానం ఏదో తెలియని భయానికి దారి తీసింది. వెంటనే తన బ్యాట్‌ని గుండెలకి గట్టిగా హత్తు కున్నాడు.

కొంతదూరం అలానే నడుచుకుంటూ వస్తుండగా హర్షకి ఒక షాపింగ్‌ ‌మాల్‌ ‌కనిపించింది. అది సుమారు అయిదు మేడల ఎత్తు, రెండు మేడల వెడల్పుతో ఉంది. జనాల కళ్లని తిప్పుకునేల బయట మొత్తం రంగురంగుల లైట్స్ ‌వెలుగుతున్నాయి. జనాలు లోపలి వెళ్తున్నారు, బయటికి వస్తున్నారు. అందరి ముఖాల్లో ఆనందం ఉంది.

రెండు సంవత్సరాల క్రితం ఇదే స్థలంలో హర్ష తన మొదటి అర్ధశతకం చేసాడు. వరసగా తన టీం మొత్తం విఫలమవుతుండగా, తను మాత్రం స్థిరంగా నిలబడి గెలిపించాడు. ఆ గెలుపును తన టీం సభ్యులే కాకుండా తన స్నేహితులంతా మెచ్చుకున్నారు. ఒక రోజున ఉన్నట్టుండి స్థలం మొత్తం గుంతలు తీసిపెట్టారు. వాకబు చెయ్యగా మాల్‌ ‌కడుతున్నారని తెలిసింది. చేసేది లేక నిస్సహాయులుగా వెను దిరిగారు.

మాల్‌ ‌నుండి ముందుకు నడిచాడు హర్ష. ఇంకాస్త ముందుకు వెళ్లగా ఒక అపార్ట్‌మెంట్‌ ‌కనిపించింది. ఆ స్థలంలో కూడా తను ఆడిన ఆట గుర్తొచ్చింది. అక్కడ తను, తను ఇందాక మాట్లాడిన స్నేహితుడు ఇద్దరు కలిసి పోటాపోటీ•గా ఆడారు. హర్ష టీం ఆ ఆట గెలవకపోయినా, తన స్నేహితుడి ఆటను చూసి చాల ఆనందించాడు. అక్కడి నుండి ఇంకొంచెం ముందు వెళ్తే ఇంకోటి, ఇంకొంచెం వెళ్తే మరొకటి. అలా తన జ్ఞాపకాల గుర్తులన్ని తారసపడుతూనే ఉన్నాయి. అవన్నీ తలుచుకొని తన బాధ పెరిగింది.

నాలుగైదు సంవత్సరాల ముందు వరకు హర్ష తన ఇంటి చుట్టూ పక్కల ఉండే ఖాళీ స్థలాల్లో క్రికెట్‌ ఆడేవాడు. మెల్లమెల్లగా ఆ ఖాళీ స్థలాలను రియల్‌ ఎస్టేట్‌ ‌వాళ్లు హస్తగతం చేసుకొని ప్లాట్లుగా మార్చి అమ్మడం మొదలుపెట్టారు. వాటిని జనాలు కొని అక్కడ ఇల్లో, అపార్ట్‌మెంటో కట్టడం ప్రారంభించారు. అప్పటికి హర్షకి తన స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి స్థలాలకి కొదవలేదు. సంతోషంగా వెళ్లి ఇంకోచోట ఆడుకునేవాళ్లు.

కానీ, మూడేళ్ల నుంచి పరిస్థితి మరీ కష్టంగా మారింది. ఒక స్థలం పోయిన ఇంకో స్థలం ఉంది ఆడుకుందాం అనుకున్న నెలరోజుల లోపు ఆ స్థలంలో కూడా ఏదో ఒక్కటి కట్టడం మొదలు పెట్టేవారు. అలా హర్ష ఇంటి చుట్టూర మాత్రమే కాక ఆ ప్రాంతంలో ఉన్న స్థలాలన్నీ కట్టడాలతో నిండిపోయాయి. గత్యంతరం లేక రెండు రోజులు వీధులల్లో ఆడారు. మూడో రోజు చుట్టూ ఇళ్లలో వాళ్లు తిట్టారు. అప్పటి నుండి ఆడుకోవడానికి ఖాళీ స్థలాలను వెదకడం ప్రారంభించాడు హర్ష. అనువైన స్థలం దొరికినప్పుడు, తన స్నేహితులని పిలిచి, ఆడుకొని తృప్తి పడేవాడు. రెండు రోజులకి ఏదో ఒక సమస్య వల్ల ఆడుకోవడానికి అడ్డంకి ఏర్పడేది. ఊరికంటూ ఒక మైదానం అయితే ఉంది కానీ అది చాలా దూరంలో ఉంది. అంత దూరం ఇంట్లో వారు వద్దు అనేవారు. దాంతో ఆడుకోవడానికి చోటే లేకుండాపోయింది. ఆ కారణంగా చాలా మంది హర్ష స్నేహితులు ఆడుకోవడం మానేశారు. ప్రత్యా మ్నాయంగా ఫోనులల్లో గేమ్స్ ‌వైపు మొగ్గుచూపారు. కానీ హర్ష మాత్రం ఆ పని చెయ్యలేదు. క్రికెట్‌ ఆడటం ఆపేసినందుకు బాధ పడ్డాడు, ఆడే సమయం ఎప్పుడు వస్తుందా ? అని ఎదురుచుసాడు, అంతేగానీ ఫోను గురించి ఎప్పుడు ఆలోచించలేదు. తనకు అంత ఇష్టం నలుగురితో కలిసి ఆడుకోవడం అంటే.

హర్ష నడుచుకుంటూ ఒక పార్క్ ‌దగ్గరికి చేరాడు. తన స్నేహితులల్లో చాలా మంది ఆ పార్క్ ‌చుట్టూ పక్కల ఉంటారు. వారిలో ఎవరైనా కనిపిస్తారేమో కనీసం వాళ్లనైనా ఆడుకునేందుకు రమ్మని అడుగుతాం అనుకొని పార్క్‌లోకి అడుగుపెట్టాడు. లోపల కొందరు పిల్లల గుంపులుగా కూర్చోని ఎవరి ఫోనులల్లో వాళ్ళు లీనమైపోయి రకరకాల ఆటలు ఆడుకుంటున్నారు. ఆ గుంపులల్లో తన వయసు వారు చాలా మందే ఉన్నారు. హర్ష పార్క్ అం‌తా తిరిగి అందరిని గమనించాడు. ఫోనులో ఆటలు ఆడుతున్న అందరు చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళని చూడగానే తను ఏం చేయాలో తనకు అర్థమైంది. వెంటనే పార్క్ ‌నుండి బయటికి వచ్చాడు. ఇంటి వైపు నడిచాడు.

చివరికి హర్ష తన ఇల్లు ఉండే వీధికి చేరాడు. ఆ వీధి మొదట్లోనున్న ఒక చెత్తకుప్ప ముందు నిలబడ్డాడు. తన బ్యాట్‌ ‌వైపు బాధగా చూసి దాన్ని గుండెలకి హత్తుకున్నాడు. తనకు ఏడుపు మొదలైంది. గుండెల నుండి బ్యాట్‌ ‌తీయగానే తన కన్నీళ్లు బ్యాట్‌ ‌వి•ద పడ్డాయి. వెంటనే బ్యాట్‌ని ఆ కుప్పలోకి విసి రేశాడు. అది ఎక్కడ పడిందో హర్ష కంటికి కనిపించ లేదు. కన్నీళ్లు తుడుచుకొని ఇంటి వైపు వెళ్లిపోయాడు.

ఆకాశాన్ని చీకటి పూర్తిగా కమ్మేసింది. కానీ అందులో ఒక్క నక్షత్రం కూడా కనపడటం లేదు.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE