కేంద్రంతోనో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోనో విభేదాలు ఉండవచ్చు. కానీ ఆ విభేదాలు వ్యవస్థలకు తూట్లు పొడిచే పరిస్థితిని సృష్టించకూడదు. కేంద్ర ప్రభుత్వానికీ, రాష్ట్రాలకు నడుమ రాజ్యాంగ సంక్షోభాలకు తావివ్వకూడదు. రాష్ట్రాల ముఖ్యమంత్రుల వైఖరి ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాల మీద ప్రభావం చూపేదిగా పరిణమించకూడదు. దేశంలో కొన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులయిన కొందరు రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యం ఇచ్చిన అవకాశంతో ఆ పదవిని స్వీకరించినవారిలా కాకుండా, సర్వంసహ పాలకులుగా వ్యవహరించడం పరిపాటిగా మారింది. దీనికి సెక్యులరిజం మీద పోరాటంగానో, మత పార్టీలను నిరోధించే క్రమంగానో పేరు పెట్టడం కూడా చిరకాలంగా కనిపిస్తున్నది. ఇప్పుడు ఆ ధోరణి పరాకాష్టకు చేరిందనే అనాలి. విదేశ వ్యవహారాలు, రక్షణ కేంద్రం చేతిలోనే ఉంటాయి. అవి ఉమ్మడి జాబితాలోని అంశాలు కావు. కానీ ఆ సంగతి పూర్తిగా విస్మరించిన ఇద్దరు ముఖ్యమంత్రులు ఇప్పుడు కనిపిస్తున్నారు. ఒకరు పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రెండవ వారు కేరళ ముఖ్యమంత్రి, సీపీఎం నాయకుడు పినరయ్‌ ‌విజయన్‌. ‌ఫెడరల్‌ ‌వ్యవస్థను కాపాడే బాధ్యత కేంద్రానిది మాత్రమేనన్నట్టు ఉన్నది వీరి ధోరణి. మమత చర్య గురించి పొరుగు దేశం నిరసన ప్రకటించవలసి వచ్చింది.
రిజర్వేషన్‌ల వ్యవహారంతో అట్టుడుకుతున్నట్టు ఉడుకుతున్నది బంగ్లాదేశ్‌. ‌కాల్పులు జరిగాయి. అంతా అల్లకల్లోలం. ఇదంతా చూసిన, పక్కనే ఉన్న పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హృదయం దారుణంగా ద్రవించి ఒక పిలుపు నిచ్చారు. ‘నిస్సహాయులైన ప్రజలు’ ఇక్కడికి వస్తే ఆశ్రయం ఇస్తానని ప్రకటించారు. బంగ్లావాసుల కోసం మమతా బెనర్జీ ఇచ్చిన పిలుపు పట్ల ఆ దేశ అధ్యక్షురాలు షేక్‌ ‌హసీనా ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేయడం గమనార్హం. ఆ ప్రభుత్వం మమత మొహం వాచేటట్టు చీవాట్లు పెట్టింది. సహాయం కోరుతూ ఎవరు వచ్చి తలుపు తట్టినా వారికి ఆశ్రయం ఇవ్వడానికి తాము సదా సిద్ధంగా ఉంటామని జూలై 21న మమత ఉదారంగా పిలుపు నిచ్చారు. ‘బంగ్లాదేశ్‌లో జరిగే వ్యవహారం గురించి నేను ఏమీ మాట్లాడను. ఎందుకంటే అది వేరే దేశం. దాని గురించి భారత ప్రభుత్వం మాట్లాడుతుంది. కానీ బంగ్లా నుంచి ఎవరైనా నిస్సహాయులై మా తలుపు తడితే వారికి ఆశ్రయం ఇచ్చేస్తాం’ అన్నారామె. పైగా ఇంకొక దేవ రహస్యం కూడా లోకానికి చెప్పారు. శరణార్థులను ఆదుకోమంటూ ఐక్యరాజ్య సమితి తీర్మానం కూడా ఉందని అపార జ్ఞానాన్ని ప్రదర్శించారు. మృతవీరుల సంస్మరణ దినానికి ఇచ్చిన ఉపన్యాసంలో ఈ చెత్తంతా ఆమె వాగారు. అక్కడితో ఆగలేదు. ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు బంగ్లాదేశ్‌ ‌నుంచి పశ్చిమ బెంగాల్‌ ‌వచ్చినా అభ్యంతరం లేదంటూ తన ఎక్స్‌లో పోస్ట్ ‌కూడా పెట్టారు. బంగ్లా నుంచి విద్యార్థులుఎవరు వచ్చినా వారికి కావలసిన ఏర్పాట్లు చూడవలసిం దంటూ తన రాష్ట్ర అధికారులకు మమత ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇచ్చినట్టు ఎక్స్‌లో కూడా ప్రకటించారు.
ఇటు ఫెడరల్‌ ‌వ్యవస్థ మర్యాదలూ, అటు అంతర్జాతీయ సంప్రదాయాలూ కూడా ఏ మాత్రం తెలియని మమతా బెనర్జీ వాగుడు పెద్ద వివాదానికే దారి తీసింది. బంగ్లాలోని భారత్‌ ‌హైకమిషన్‌ అధికారులను పిలిచి బంగ్లా ప్రభుత్వం నిరసన తెలియచేసింది. బంగ్లాదేశ్‌ ‌పంపించిన నిరసన లేఖను భారత విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్‌వీర్‌ ‌జైస్వాల్‌ ‌విడుదల చేశారు. మమతా బెనర్జీ ఎక్స్ ‌పోస్ట్ ‌బంగ్లా అంతర్గత వ్యవహారా లలో కలగచేసుకోవడమేనని ఆ దేశ ప్రభుత్వం ఆరోపించింది. అలజడిని నివారించి శాంతిభద్రత లను నెలకొల్పేందుకు బంగ్లా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్న తరుణంలో మమత ఇలాంటి పోస్టు పెట్టడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అవుతుందని కూడా గట్టిగానే చీవాట్లు పెట్టింది. ఇలాంటి ప్రకటనలు ఉగ్రవాదులకీ, సమస్యలు సృష్టించేవాళ్లకి మాత్రమే అక్కరకు వస్తాయని కూడా ఆ ప్రభుత్వం ఘాటుగానే స్పందించింది (వాళ్లయితే టీఎంసీ పార్టీకి బాగా పనికొస్తారు). మమత ఇచ్చిన పిలుపు పెద్ద ఎత్తున గందరగోళం సృష్టిస్తుందని బంగ్లా విదేశ వ్యవహారాల మంత్రి హసన్‌ ‌మహమ్మద్‌ ‌వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ పట్ల మాకు గౌరవం ఉన్నదనీ, భారత్‌తో సత్సంబంధాలు కొనసాగుతున్న ఈ తరుణంలో అలాంటి ఆశ్రయం వ్యాఖ్యలు ఇబ్బందులు తెస్తాయన్నదే బంగ్లాదేశ్‌ అభిప్రాయం.
మమత ఇచ్చిన ‘ఆశ్రయం’ పిలుపు గురించి, దాని పూర్వాపరాల గురించి నివేదిక సమర్పించ వలసిందిగా పశ్చిమ బెంగాల్‌ ‌గవర్నర్‌ ‌సీవీ ఆనంద బోస్‌ ఆదేశాలు జారీ చేశారు. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన ఏ విషయమైనా లావాదేవీలు జరపవలసింది కేంద్రం మాత్రమేనని రాజ్‌భవన్‌ ‌మీడియా సెల్‌ ‌తన ట్వీట్‌లో పేర్కొన్నది. పార్లమెంట్‌ ‌సమావేశాలలో వీరంగం వేస్తున్న టీఎంసీ సభ్యులు నేత ఓవరాక్షన్‌కు ఏమంటారో?
కేరళ నిర్వాకం
విదేశీ సహకారానికి సంబంధించి వ్యవహారాలు చూడడానికి జూలై 15న కేరళ ప్రభుత్వం కె. వాసుకి అనే ఐఏఎస్‌ అధికారిని నియమించుకుంది. ఆయన కార్మిక, నైపుణ్యం విభాగంలో సీనియర్‌ అధికారి. వాసుకికి ఈ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం అదనంగా అప్పగించింది. ఢిల్లీలోని కేరళ హౌస్‌ ‌రెసిడెంట్‌ ‌కమిషనర్‌ ‌వాసుకుకి సహకారం అందిస్తారు.
ఏ రాష్ట్ర ప్రభుత్వ శాఖ అయినా విదేశాల నుంచి సాయం పొందవలసిన అవసరం వస్తే ఎప్పుడూ విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖను లేదా ఆ దేశంలోని భారత దౌత్య కార్యాలయాన్ని సంప్రతించ వలసి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దేశ విదేశ వ్యవహారాల శాఖతో సంప్రతింపులు కేరళ నియమించిన ఈ అధికారి బాధ్యతగా చెబుతున్నారు. నిజానికి ఆ బాధ్యతను నిర్వర్తించడానికి అధికారులు ఎలాగూ ఉంటారు. కాబట్టి కొత్తగా మరొక అధికారిని ప్రత్యేకంగా నియమించవలసిన అవసరం ఏమిటి అన్నదే ఇప్పుడు అందరూ వేస్తున్న ప్రశ. ఆఖరికి కాంగ్రెస్‌ ‌కూడా ఇది అసాధారణ చర్యగానే అభివర్ణిం చింది. ఈ వ్యాఖ్య చేసిన వారు ఎవరో కాదు. తిరువనంతపురం ఎంపీ, భారత విదేశ వ్యవహారాల శాఖలో పనిచేసిన ఒకనాటి ఐఎస్‌ఎఫ్‌ అధికారి శశిథరూర్‌. అసలు ఈ నియామకంలోని చట్ట బద్ధతను కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు.
రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌లోని ఒకటో జాబితాలో యూనియన్‌ ‌లిస్ట్ 10‌లోని ఒకటో అంశమే విదేశీ వ్యవహారాలు పూర్తిగా కేంద్రం పరిధిలోనివని ఘోషిస్తున్నదని భారత విదేశ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్‌వీర్‌ ‌జైస్వాల్‌ ‌గుర్తు చేయవలసి వచ్చింది. మమతా బెనర్జీ, పినరయ్‌ ‌విజయన్‌ ఇద్దరూ కేంద్ర జాబితాలో చొరబడే ప్రయత్నమే చేశారంటే వాస్తవదూరం కాబోదు. అయితే ఫెడరల్‌ ‌సంప్రదాయాలను బీజేపీ ప్రభుత్వం ధ్వంసం చేస్తుందంటూ పదే పదే ఆరోపణలు గుప్పించే విపక్ష శిబిరంలోని నాయకులలో ఈ ఇద్దరిదీ అగ్రతాంబూలమే మళ్లీ. సందేశ్‌ఖాలి, అంతకు ముందు ఉపాధ్యాయ నియామకాలు, ఎన్నికల హింస మీద దర్యాప్తు వేటి గురించి చర్యలు ప్రారంభించినా మమతా బెనర్జీకి వెంటనే ఫెడరల్‌ ‌వ్యవస్థ నాశనమైపోతున్న దృశ్యం కనిపించేది. కేరళ ముఖ్యమంత్రి కార్యాలయానికీ, బంగారం అక్రమ రవాణాకీ సంబంధం ఉందని నిఘా సంస్థలు అను మానించగానే సీపీఎంకీ, ముఖ్యమంత్రి పినరయ్‌కి ఫెడరల్‌ ‌వ్యవస్థ మీద దాడి దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నదీ అన్నది ప్రశ్న కాదు. రాజ్యాంగబద్ధంగా కేంద్రం, రాష్ట్రాలు పనిచేస్తున్నాయా లేదా అన్నదే అసలు ప్రశ్న. మమత, పినరయ్‌ ఇద్దరు రాజ్యాంగ విరుద్ధమైన చర్యకే పాల్పడ్డారు. పినరయ్‌ ‌కేరళను వేరే దేశంగా చూడాలని అనుకుంటున్నారు కాబోలునన్న విమర్శ కూడా వినిపించింది. వేర్పాటువాద ధోరణి ప్రబలంగా ఉన్న ఆ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇలాంటి పోకడలకు పోవడమే దురదృష్టం.
విదేశీ వ్యవహారాల కార్యదర్శి నియామకం రాష్ట్ర అభివృద్ధి కోసమేనని కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ‌వి. వేణు సమర్థించుకోవడం మరొక అంశం. అక్కడి ఉద్యోగులు కూడా సీపీఎం భాషనే మాట్లాడుతూ ఉండడం విశేషం. అంత ప్రాధాన్యం లేని ఈ విషయం కంటే చర్చించవలసిన విషయాలు చాలా ఉన్నాయని కొందరు అధికారులు ఈ నియామకం నేపథ్యంలో అభిప్రాయపడడం మరొక అంశం. విదేశీ వ్యవహారాలు కేంద్ర జాబితాలోనివే రాష్ట్రంలో అధికారంలో ఉన్నవారికి, ప్రభుత్వోద్యోగు లకి కూడా తెలియకపోలేదని కూడా ముక్తాయించడం మరొక విషయం. దౌత్య విషయాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయనీ, వాటిలో జోక్యం చేసుకోవ డానికీ, కేరళ నుంచి విదేశీ వ్యవహారాల కార్యదర్శిని నియమించడానికీ ఎలాంటి సంబంధం లేదని వాటిని కేంద్రమే నిర్వహిస్తుందని కూడా ప్రధాన కార్యదర్శి కాస్త గడసరితనంతోనే చెప్పారు.
ఇలా నేరుగా విదేశాలతో సంప్రతింపులు జరుపుదామనుకునే రాష్ట్రాలకు గతంలోనే శృంగ భంగమైన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్‌ ‌నుంచి పెగాసస్‌ ‌నుంచి సాంకేతిక పరిజ్ఞానం తీసుకునే విషయంలోనే ఇది జరిగింది. ఒక రాష్ట్రం నేరుగా ఇజ్రాయెల్‌ ‌సంస్థతో సంప్రతిస్తే, ఆ ప్రతిపాదన భారత కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలని స్పందన వచ్చింది. విదేశాలతో అధికారికంగా సంప్రతించడం అంటే, హార్వార్డ్‌కో, మరొక పాశ్చాత్య దేశాలలోని విశ్వ విద్యాలయానికో వెళ్లి ఉపన్యాసం ఇవ్వడమంత సులభం కాదు.లేదా పాకిస్తాన్‌కు వెళ్లినప్పుడు అక్కడ భారత్‌ ‌పెద్దన్నలా వ్యవహరిస్తున్నదని నిందలు వేసి రావడమంత తేలిక కాదు. అసలు ఏ దేశంలో అయినా ఫెడరల్‌ ‌ప్రభుత్వం అనుమతి లేకుండా విదేశీ వ్యవహారాలు నడపడం సాధ్యమవుతుందా? దౌత్యం విషయం కాకుండా వాణిజ్యం వంటి ఇతర అంశాలకే తమ కార్యదర్శి పరిమితమవుతారని కేరళ అధికారులు వివరణ ఇస్తున్నా అందులో వాస్తవికత లేదు. ఇప్పుడు అన్నీ దౌత్యం పరిధిలోనే ఉంటు న్నాయి. మరింతగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసమే అన్న సాకు చూపుతూ కేంద్రం అధికారాల లోకి రాష్ట్రాలు ప్రవేశించాలనుకోవడం సరికాదు.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE