ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ కు భారీ నిధులు కేటాయిస్తున్నట్లు కేంద్రం పార్లమెంట్‌లో ప్రకటించంతో రాష్ట్ర ప్రజల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రకటించింది. భవిష్యత్తులో అవసరమైతే మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడాన్ని బట్టి రాష్ట్రానికి మంచిరోజులు రానున్నాయని సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. పారిశ్రామిక కారిడార్ నిర్మాణానికి సహకారంతో పాటు, రోడ్ల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపింది. వివిధ సంస్థల సహకారంతో పై నిధులను రాష్ట్రానికి అందించడంతో పాటు భవిష్యత్తులో అవసరమైతే అమరావతికి మరిన్ని అదనపు నిధులను కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడాన్ని బట్టి చూస్తుంటే రాష్ట్రానికి మంచిరోజులు రానున్నాయని సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. గతంలో కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున నిధుల కేటాయింపులు జరిపిన సందర్భాలు లేవు. ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ రాష్ట్ర పరిస్థితిని సమీక్షించి రాష్ట్రాన్ని ఆదుకోవాలని నిర్ణయించిన మీదట ఈ మేరకు కేటాయింపులు జరిపినట్లు తెలుస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తామని గతంలోనే బీజేపీ హామీ ఇచ్చింది. ఇప్పుడు మూడోసారి మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక బడ్జెట్ సమావేశాల్లో ఏపీకి పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తు న్నట్లు ప్రకటించారు.
ఐదేళ్ల క్రితం ఆగిపోయిన ప్రభుత్వ భవన సముదాయాల నిర్మాణాలకు కేంద్ర సాయంతో నిధుల సమస్య తీరినట్లయింది. శాసనసభ, సచివాలయ భవన సముదాయం, ఐకానిక్ టవర్స్ వంటి అతి కీలక భవనాల నిర్మాణానికి కూడా మార్గం సుగమ మైంది. రైతులను వెంటాడుతున్న కౌలు సమస్యలూ పరిష్కారం కాబోతున్నాయి. ధ్వంసమైన రోడ్ల పునర్నిర్మాణానికి అవకాశం లభించింది. తాగు నీరు, డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాల కల్పన సహా అనేక పనులు నిరాటంకంగా సాగుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
అమరావతికి వెన్నుదన్ను
వైసీపీ ప్రభుత్వం రాజధాని అమరావతి పట్ల ఉద్దేశపూరితంగా అలసత్వం, నిర్లక్ష్యం వహించి కారణంగా అభివృద్ధికి నోచుకోక చెట్లు, పొదలతో శిథిల ప్రాంతంగా మారిపోయింది. ప్రజల వైసీపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ, మూడు రాజధానులు వద్దని, అమరావతే రాజధానిగా కావాలని తేల్చి చెప్పారు. ఇక అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని కోరుతూ బీజేపీ మాత్రమే మొదటి నుంచిపోరాడుతోంది. కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వం ఈ మేరకు రూ. 1,500 కోట్లు గతంలోనే ఇచ్చింది. రాజధాని ప్రాంతంలోని గుంటూరు, విజయవాడలకు డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాలకు రూ.1000 కోట్లు కేటాయించింది. ఎయిమ్స్ ఆసుపత్రిని నిర్మించింది. సచివాలయం, హైకోర్టు తాత్కాలిక భవనాలు పూర్తయ్యాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవనాలతో పాటు ఎన్డీవో భవనాలు 80 శాతం పూర్తయ్యాయి. ప్రభుత్వ టైప్-1, టైప్-2 భవనాలతో పాటు ప్రధాన కార్యదర్శుల, జడ్జీల భవనాల నిర్మాణం జరుగుతోంది. శాశ్వత సచివాలయంగా ఐదు పెద్ద టవర్ల నిర్మాణం ప్రారంభం అయింది. రాజధానితో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాలను కలిపే కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి వంతెన నిర్మాణం చివరి దశకు చేరింది. సీడ్ యాక్సస్ రోడ్డు కూడా చాలా భాగం పూర్తయింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక అవి ఆగిపోయాయి. తాను గెలిస్తే అమరావతిలోనే ఉంటానని, అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోమనరెడ్డిచ, గెలిచాక మూడు రాజధానుల వాదనను ముందుకు తెచ్చారు. బీజేపీ ఆ అంశాన్ని వ్యతిరేకిస్తూ, అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. అమరావతి ప్రాంతంలో పాదయాత్రలు చేసింది. ఆ సందర్భంలోనే పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిపై వైసీపీ వర్గాలు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. రాజధాని ప్రాంతంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసంపూర్తి భవన నిర్మాణాలను తిరిగి ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిం చాలని అధికారులను ఆదేశించారు. అక్కడ మొలిచిన తుమ్మ చెట్లను తొలగించేందుకు నిధులను కూడా ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఐఐటీ హైదరాబాదు, ఐఐటీ చెన్నైల నుంచి నిపుణులను రప్పించి రాజధానిలో నిలిచిన నిర్మాణాల పటిష్టతలను పరిశీలించే ఏర్పాటుచేశారు. ఇక పోలవరం విషయానికి వస్తే, అది కేవలం ఆంధ్ర ప్రదేశ్‌కు జీవనాడి మాత్రమే కాదని, యావద్దేశానికి ఆహారభద్రత అందించే కీలక ప్రాజెక్టుగా కేంద్రం జాతికి స్పష్టం చేసింది. ఆ పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడం తమ బాధ్యతగా గుర్తుచేస్తూ వేగంగా పూర్తిచేస్తామని హామీ ఇచ్చింది. గోదావరి వరదలు తగ్గుముఖం పట్టాక పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పారిశ్రామిక కారిడార్‌లకు ప్రత్యేక సహకారం..
రాష్ట్రంలో విశాఖ `చెన్నై కారిడారు, హైదరా బాదు` బెంగుళూరు కారిడార్‌లు ఏర్పాటుకు కేంద్రం గతంలోనే ఆమోదం తెలిపింది. కేంద్రం దేశ వ్యాప్తంగా గుర్తించిన 11 పారిశ్రామిక కారిడార్ల ద్వారా 32 ఇండస్ట్రియల్ ప్రాజెక్టులను అభివృద్ధి పరుస్తోంది. అందులో భాగంగా రాష్ట్రం మీదుగా మూడు పారిశ్రామిక కారిడార్లు… విశాఖ `చెన్నై; హైదరాబాదు `చెన్నై; హైదరాబాదు` బెంగుళూరు పారిశ్రామిక కారిడార్లు వెళ్తున్నాయి. వీటి ద్వారా విశాఖపట్నం, కృష్ణపట్నం, శ్రీకాళహస్తి, కొప్పర్తి (కడప), ఓర్వకల్లు (నంద్యాల) ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి కేంద్రం నిర్ణయించింది.
ఈ ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి జరిగితే ప్రత్యక్ష, పరోక్ష రంగాల్లో 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విశాఖ` చెన్నై, హైదరాబాదు `బెంగుళూరు కారిడార్‌ల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, కడప జిల్లా కొప్పర్తి, నంద్యాల జిల్లా ఓర్వకల్లు పార్కులను అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో నీరు, విద్యుత్, రైల్వే వంటి మౌలిక సదుపాయాలకు నిధులు మంజూరు చేస్తుంది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మూలధన పెట్టుబడుల కోసం ఈ ఏడాది అదనపు కేటా యింపులు చేస్తామని కేంద్రం తెలిపింది. దీంతో ఈ ప్రాంతంలో పెద్దఎత్తున పరిశ్రమలు ఏర్పాటై స్ధానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెద్ద సంఖ్యలో లభించే అవకాశాలు ఉన్నాయి.
వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం రాయల సీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలతో పాటు ప్రకాశం జిల్లాకు ప్రత్యేక గ్రాంట్లు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. గతంలో ఉత్తరాంధ్రలోని 3 ఉమ్మడి జిల్లాలు, రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలకు ఏడాదికి రూ.50 కోట్ల చొప్పున ఇప్పటివరకు రూ.1,750 కోట్లు ఇచ్చింది. ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లాను కూడా ఇందులో కలిపింది. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో 8 వెనుకబడిన జిల్లాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు రానున్నాయి. నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు ఈ నిధులను కేంద్రం ఇస్తోంది. ప్రధానంగా గిరిజన ప్రాంతాలు, వెనుకబడిన వర్గాలు ఈ జిల్లాల్లో ఉండటంతో వీటికి ప్రాధాన్యం దక్కింది. రక్షిత నీటి పథకాలు, చిన్న నీటి వనరుల అభివృద్ధి ద్వారా స్థానికంగా కొత్త ఆయకట్టును సాగులోకి తీసుకురావడం, గ్రామాల్లో దెబ్బతిన్న రహదారుల నిర్మాణం వంటి పనులకు ఈ నిధులను వెచ్చించ వచ్చు. పాఠశాల భవనాలు, ఆరోగ్య కేంద్రాలు వంటి వాటికి కూడా వినియోగించవచ్చు.
పూర్వోదయ ద్వారా కూడా సహాయం
కేంద్ర ప్రభుత్వం దేశానికి తూర్పున ఉన్న ఐదు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి ఒక ప్రత్యేక ప్రణాళిక ప్రకటించింది. ‘పూర్వోదయ’ పేరుతో దీనిని అమలు చేయబోతున్నట్లు బడ్జెట్లో తెలిపింది. ప్రస్తుతం బిహార్, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ఈ ప్రాజెక్టును అమలు చేయబోతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడిరచారు. ‘పూర్వోదయ’ అంటే ఏమిటో అందులో సూక్ష్మంగా వివరించారు. దేశానికి తూర్పున ఉన్న గల ఐదు రాష్ట్రాలూ దేవాలయ, సంస్కృతీ సంప్రదాయాల పరంగా ఎంతో సమున్న తంగా విలసిల్లాయని, ఆ పురాతన సాంస్కృతిక కేంద్రాలను మళ్లీ వైభవోపేతంగా తీర్చిదిద్ది తదను గుణంగా ఆర్థిక కార్యకలాపాలకు ఆలవాలంగా మార్చాలనేది పూర్వోదయ ప్రణాళికగా అవగతమవు తోంది. పురాతన సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధ రించి, పర్యాటకులను ఆకర్షించి ఆర్థిక కార్యకలా పాలు పెంచాలనేది వ్యూహంగా ఉంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో గఅ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి మొదలు పెడితే కృష్ణా, గుంటూరు, రాయలసీమ వరకు సంస్కృతీ సంప్రదా యాల్లో ఎంతో ప్రఖ్యాతి ఉంది. ఇక్కడి అందమైన ప్రదేశాలను, ఆలయాలను మేళవిస్తే పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది.
కేంద్ర సంస్థలకు నిధులు
రాష్ట్రంలో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ), గిరిజన విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ(ఐఐపీఈ), సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-రీసెర్చ్ (సమీర్), ఇండియన్ స్ట్రాటెజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్(ఐఎస్‌పీఆర్‌ఎల్), విశాఖ పోర్టు ట్రస్టు, విశాఖ ఉక్కు కర్మాగారం, హిందూస్థాన్ షిప్ యార్డ్ తదితర కేంద్ర సంస్థలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. గిరిజన విశ్వ విద్యాలయాన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో భాగంగా గుర్తించాలని నిర్ణయించారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.620 కోట్లు, విశాఖ పోర్టు ట్రస్టుకు రూ.150 కోట్లు, పెట్రోలియం ఎనర్జీ సంస్థకు రూ.168 కోట్లు కేటాయించారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన కింద దేశంలోని అన్ని ఎయిమ్స్‌లకూ కలిపి రూ.2,200 కోట్లు కేటాయిం చారు. ఇందులో నుంచి మంగళగిరి ఎయిమ్స్‌కు కూడా నిధులు అందుతాయి.
అలాగే 2024-25 సంవత్సరానికి రాష్ట్రానికి కేంద్ర పన్నులు, సుంకాల్లో రూ.50,474.64 కోట్ల వాటా లభిస్తుందని బడ్జెట్‌లో పేర్కొన్నారు. మొత్తం పన్నులు, సుంకాల్లో ఏపీ వాటా 4.04 7%. కార్పొరేషన్ ట్యాక్స్ రూపేణా రూ.15,15 6.51 కోట్లు, ఆదాయ పన్ను-రూ.17,455.93 కోట్లు, కేంద్ర జీఎస్టీ-రూ.15,079.39 కోట్లు, కస్టమ్స్-రూ.2,228.46 కోట్లు, ఎక్సైజ్-రూ.469.73 కోట్లు, సర్వీస్ ట్యాక్స్-రూ.1.66 కోట్లు, ఇతర పన్నులు, సుంకాల రూపేణా రూ.82.96 కోట్లు లభిస్తాయి. ఇవి కాక మరిన్ని ఆర్ధిక సాయాలను కేంద్రం ప్రకటించింది. వనరుల కొరత రాకుండా వివిధ రాష్ట్రాలకు రూ.లక్షన్నర కోట్ల మేర దీర్ఘకాలిక వడ్డీలేని రుణాలను కల్పిస్తామని ప్రతిపాదించారు. రాష్ట్రానికి విదేశీ రుణ సాయం లభిస్తున్న ‘ఆంధ్రప్రదేశ్ రోడ్లు-వంతెనల నిర్మాణ ప్రాజెక్టు’, గ్రామీణ రహదారుల ప్రాజెక్టు (రూ.150 కోట్లు), నీటిపారుదల, జీవనోపాధి మెరుగుదల ప్రాజెక్టు రెండోదశ (రూ.300 కోట్లు), అభ్యాస్ పరివర్తన్ ప్రాజెక్టు (రూ.300 కోట్లు) గురించి కూడా బడ్జెట్‌లో ప్రస్తావించారు.
మొత్తంమీద కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అధికప్రాధాన్యతను కల్పించడంతో పాటు కీలకమైన అమరావతి, పోలవరానికి పెద్ద ఎత్తున నిధులను కేటాయించారు. దీంతో పై రెండు ప్రాజెక్ట్ పరిధిలో అభివృద్ధి పరుగు పెట్టనున్నాయి.
– టిఎన్. భూషణ్, సీనియర్ జర్నలిస్ట్