-జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌

జులై 30వ తేదీ తెల్లవారుజామున ఉత్తర కేరళకు చెందిన వాయనాడ్‌ ప్రాంతంలో భారీవర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర విధ్వంసం జరిగింది. ఈ ప్రాంతంలో నివసించే ప్రజలకు ఆ రాత్రి పీడకలనే మిగిల్చింది. ఊళ్లకు ఊళ్లే కొట్టుకు పోవడం అందరినీ కలచివేసిన విషాదం. మరునాడు ఉదయం కూడా ఎడతెరిపిలేని భారీవర్షాల కారణంగా సహాయక చర్యలు చేపట్టలేని దుస్థితి. ఇప్పటి వరకు 375మంది మరణించినట్టు తెలుస్తున్నప్పటికీ కొండచరియలు విరిగిపడిన శిథిలాల్లో ఎంతమంది కూరుకుపోయారో చెప్పడం కష్టం. వందలాది మంది క్షతగాత్రులతో ఆసుపత్రులు నిండిపోయాయి. వాయనాడ్‌లో చోటుచేసు కున్న ఈ తాజా ప్రకృతి బీభత్సానికి వాతావరణ మార్పులతో పాటు మానవ కార్యకలాపాలు కూడా కారణమని చెప్పక తప్పదు. 

ప్రస్తుత విధ్వంసానికి కారణం ఇరువఝింఝి నది వరదలే కారణమని చెబుతున్నారు. ఇది వైత్రి తాలూకాకు చెందిన ముండక్కాయ్‌, చూరల్‌మల, అత్తమల గ్రామాలను ఆనుకొని ప్రవహిస్తూ ఛాలియార్‌ నదిలో కలుస్తుంది. సమీపంలోని పొత్తుకల్లు ప్రాంతంలో ఛాలియార్‌ నదిలో అనేక గుర్తుతెలియని శరీర భాగాలు కొట్టుకువచ్చినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇదిలావుండగా ‘‘హ్యూమ్‌ సెంటర్‌ ఫర్‌ ఎకాలజీ అండ్‌ వైల్డ్‌ లైఫ్‌ బయాలజీ’’ సంస్థవారు 2018 నుంచి వాయనాడ్‌ జిల్లాల్లో వర్షపాతం తీరుతెన్నులపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ విశ్లేషిస్తున్నారు.ఈ సంస్థ తాను సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌, విపత్తు నిర్వహణ బాధ్యులకు అందజేస్తూ వస్తోంది. ఈ సమాచారంలో జిల్లా స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు వాతావరణ విశ్లేషణ వివరాలుంటాయి. ప్రతి 25 కిలోమీటర్లకు వర్షపాత విశ్లేషణ చేయగల గ్రిడ్‌ సదుపాయం ఈ సంస్థకుంది. వర్షా కాలంలో ఈ ప్రాంతంలో సాధారణ వర్షపాతం 3000 మిల్లీమీటర్లు. అయితే జులై 20 నాటికే ఇక్కడ అత్యధికంగా వర్షాలు కురిసాయి. ఫలితంగా ఈ ప్రాంతంలో విస్తరించిన కొండప్రాంతాల్లో నేల సంతృప్త స్థాయికి చేరుకుంది. అంటే నీటిని అప్పటికే పూర్తిగా పీల్చుకున్న స్థితికి నేల చేరుకోవడంవల్ల, ఏ మాత్రం వర్షం కురిసినా అది వరదగా మారి సమీపంలోని నదుల్లోకి ప్రవహిస్తుంది. ప్రస్తుతం జరిగిందిదే. హ్యూమ్‌ సంస్థ 2020లో ఇదే ప్రాంతంలో మట్టిపెళ్లలు విరిగిపడే ప్రమాదాన్ని గుర్తించి హెచ్చరించడంతో అప్పట్లో అధికార్లు ఈ ప్రాంతంలోని పల్లె ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ‘‘ఈ సంవత్సరం కూడా వర్షాల కారణంగా సంబంధాలు తెగిపోయిన పల్లెల వివరాలు, భారీవర్షాలు కురిసే అవకాశంతో పాటు, కొండచరియలు విరిగిపడే ప్రమాదమున్నదన్న అంశాన్ని అధికార్లకు అందజేశాం. అయితే అధికార్లు తగిన సమయంలో స్పందించాల్సింది’’ అని హ్యూమ్‌ సంస్థ పేర్కొంది.

కేంద్రరాష్ట్రాల మధ్య జగడం

ఈ వరద విధ్వంసం నేపథ్యంలో కేంద్రం, కేరళ ప్రభుత్వాల మధ్య పరస్పర ఆరోపణల పర్వం కొనసాగింది. జులై 31న రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ‘సంఘటనకు వారం ముందు అంటే జులై 23న, వాతావరణ మార్పులపై కేంద్రం కేరళ ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరిక చేసింది. 20 సెంటీమీటర్లకు పైగా అతిభారీ వర్షాలతో పాటు కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నదని కూడా మళ్లీ జులై 26న రాష్ట్రానికి తెలినపినా, రాష్ట్ర ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోలేదు’అంటూ ఈ వైపరీత్యంపై ప్రకటన చేశారు. అయితే, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ దానిపై స్పందిస్తూ, వాస్తవానికి, ఈ ప్రకటనకు పొంతన లేదంటూ కొట్టిపారేశారు. ‘ఇక్కడ వర్షపాతం 115మి.మి. నుంచి 204మి.మి. మధ్యలో ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కానీ కేవలం 48 గంటల్లోనే 572మి.మి. వర్షపాతం నమోదైంది. మొదటి 24 గంటల్లో 200 మి.మి. వర్షపాతం, తర్వాతి 24 గంటల్లో 372 మి.మి. వర్షపాతం నమోదైంది. జులై 30 ఉదయం, అంటే విధ్వంసం జరిగిన తర్వాతే మట్టిపెళ్లలు విరిగిపడే ప్రమాదముందన్న ‘రెడ్‌ అలర్ట్‌’ కేంద్రం జారీ చేసింది’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జులై 23 నుంచి 29 వరకు వరద హెచ్చరికలు జారీచేసే బాధ్యత కేంద్ర జలసంఘానిదేనని, కానీ ఇరుఝింఝి లేదా చాలియార్‌ నదుల్లో వరద వస్తుందని ఎటువంటి హెచ్చరిక జారీ కాలేదని ఆయన వివరించారు. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణల మాట ఎట్లా ఉన్నా ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోవడమే కాకుండా పెద్దఎత్తున ఆస్తినష్టం, ఊళ్లకు ఊళ్లే కనిపించకుండా పోయాయన్నది కఠోరవాస్తవం.

విధ్వంసానికి కారణం

 వాతావరణంలో మార్పులతో పాటు, మానవ కార్యకలాపాలు కూడా ప్రకృతి విధ్వంసాలకు కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా వాయనాడ్‌ జిల్లా సంక్లిష్టమైన వాతావరణ పరిస్థితులు కలిగివుంది. కేరళ ప్రణాళికా బోర్డు సమాచారం ప్రకారం, రాష్ట్రంలోని 50% భూభాగం 20 డిగ్రీల ఏటవాలు తనంతో ఉంటుంది. నేలకోత, మట్టిపెళ్లలు విరిగి పడటానికి ఇదే ప్రధాన కారణం. కొండల పైప్రాంతాల్లో మట్టి వదులుగా ఉండటం కూడా నేలకోతకు మరో హేతువు. తూర్పు కేరళ ప్రాంతంలోని పశ్చిమ కనుమల్లో ప్రధానంగా వర్షా కాలంలో కొండచరియలు విరిగిపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటోంది. 2022లో కేంద్ర భూశాస్త్ర మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్‌సైన్స్‌) లోక్‌సభకు ఒక విస్తుబోయే సమాచారాన్ని అందించింది. గత ఏడేళ్లకాలంలో దేశంలో చోటుచేసుకున్న కొండ చరియలు విరిగిపడిన సంఘటనల్లో అత్యధికంగా సంభవించింది కేరళలోనే! 2015-2022 మధ్యకాలంలో దేశంలో జరిగిన 3782 ఈ సంఘట నల్లో 57% అంటే 2239 కేవలం ‘దేవభూమి’లో చోటుచేసుకున్నవే. 2018లో ఇదే రాష్ట్రంలో సంభవించిన వరదల్లో 400మంది ప్రాణాలు కోల్పోయారు. 2021లో కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో సంభవించిన మట్టిపెళ్లలు విరిగిపడటం, వరదల కారణంగా డజన్ల కొద్దీ అసువులుబాసారు. భారత వాతావరణ నివేదిక ప్రకారం 2022లో చోటుచేసు కున్న ఆకస్మికవరదలు, కొండచెరియలు విరిగి పడటం, తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా 22మంది మరణించారు.

పెరిగిన టూరిజం

పర్యావరణపరమైన హాట్‌స్పాట్‌ కావడంతో కేరళలో ఇటీవలి సంవత్సరాల్లో పర్యాటకం కూడా వేగంగా పుంజుకుంది. ఫలితంగా హోటళ్లు, రెస్టా రెంట్లు, వసతిగృహాలు, చిన్న టిఫిన్‌ సెంటర్లు పర్యావరణ పరంగా సున్నిత ప్రాంతాల్లో విచ్చలవిడిగా విస్తరించాయి. లాడ్జ్‌లు, హోటళ్ల నిర్మాణాలకోసం విచ్చలవిడిగా చెట్లు నరికేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ ప్రాంతాల్లో రోడ్లు, కల్వర్టుల నిర్మాణాలు విస్తృతంగా చేపడుతోంది. చర్చ్‌లు, మసీదుల వంటి మతపర మైన ప్రార్థనా మందిరాలను కూడా పెరుగుతున్న జనాభాతో పాటు యధేచ్ఛగా నిర్మిస్తుండటం మరోకారణం. ప్రాంతాల్లో నీరు స్వేచ్ఛగా ముందుకెళ్లకుండా ఈ నిర్మాణాలు అడ్డుపడటం వల్ల ప్రకృతి విలయాలు సంభవిస్తు న్నాయి. కొండల ఏటవాలు తలాలపై నిర్మిస్తున్న వివిధరకాల నిర్మాణాలు కొండచరియలు విరిగిపడటానికి ముఖ్య కారణమవుతున్నాయని పర్యావరణవేత్తలు అంటు న్నారు. మైనింగ్‌ కార్యకపాలు పెరుగుతున్నాయి.

పూర్తిగా గుర్తించలేదు

ఆగ్నేయ అరేబియా సముద్రంలో నీరు వేడెక్కడంవల్ల కేరళపై క్యూములోనింబస్‌ మేఘాలు దట్టంగా ఏర్పడి. ఆకస్మికంగా కుంభవృష్టి కురిపి స్తాయి. 64% పశ్చిమ కనుమలను పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతాలుగా ప్రకటించాలని 2011లో మహాదేవ్‌ గాడ్గిల్‌ కమిటీ తన నివేదికలో సిఫారసు చేసింది. ఈ కమిటీ పేర్కొన్నవన్నీ దాదాపు మానవ ఆవాసాలున్న ప్రాంతాలే. అయితే సజ్జన్‌ కుమార్‌ అనే ప్రముఖ భూగర్భ శాస్త్రవేత్త పశ్చిమ కనుమల్లోని మానవ సంచారం లేని ప్రాంతాల్లో కూడా కొండచరియలు విరిగిపడిన సంఘటనలను ఉదహరిస్తూ ఈ ప్రాంతాలను గాడ్గిల్‌ కమిటీ మాత్రమే కాదు, భారత భూగర్భ పరిశోధనా సంస్థ కూడా గుర్తించలేదన్న సంగతిని గుర్తుచేస్తున్నారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణలను సమతుల్యం చేస్తూ ముందుకు సాగాలని 2013లో ఏర్పాటు చేసిన కస్తూరిరంగన్‌ కమిటీ కూడాపేర్కొంది.

మారని అధికార్ల వైఖరి

ఇదిలావుండగా కొచ్చిన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి చెందిన అడ్వాన్స్‌డ్‌ సెంటర్‌ ఫర్‌ అట్మాస్పియరిక్‌ రాడార్‌ రీసెర్చ్‌ సెంటర్‌ వారు 2022లో సమర్పించిన పరిశోధనా పత్రం, అరేబియా సముద్రంలో వస్తున్న వాతావరణ మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలో ఆకస్మిక కుంభవృష్టి, కొండ చరియలు విరిగిపడే అవకాశాలున్నాయని పేర్కొంది. కవలప్పర, పుత్తుమల్ల ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన సంఘటనలను ఆధారం చేసుకొని ఈ పరిశోధనాపత్రాన్ని రూపొందించారు. ఇదిలా వుండగా 2020లో పెట్టుముడి (ఇడుక్కి జిల్లా), 2021లో కూత్తికాల్‌ (కొట్టాయం జిల్లా)లో భారీవర్షాలు పడ్డాయి. ఈ ఏడాది 2024 మేలో కొచ్చి జిల్లాలోని కలమస్సెరీలో కుంభవృష్టి కురిసింది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో మేఘాలు దట్టంగా ఏర్పడుతున్నాయనడానికి ఈ కుంభవృష్టి ఉదాహరణ అని ఈ పరిశోధకుల అభిప్రాయం. గతంలో ఇవి అరేబియా సముద్రం ఉత్తరభాగంలో ఏర్పడటం వల్ల కొంకణ్‌ ప్రాంతంలో భారీ వర్షాలతోపాటు కొండచరియలు విరిగిడేవి. ఇప్పుడు ఇవే మేఘాలు ఆగ్నేయ ప్రాంతంలో ఏర్పడటం వల్ల ఈ స్థితి ఉత్తర కేరళ ప్రాంతానికి బదిలీ అయింది. ఇంటువంటి ‘మిసోస్కేల్‌ మినీ రైన్‌ఫాల్‌’ కారణంగా గంటకు 15 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవు తుంది. దీన్ని వాతావరణమార్పును స్పష్టంగా సూచిస్తున్న అంశమని వారు పేర్కొంటున్నారు. ఇక్కడ సమాచారం కాదు ముఖ్యం. వర్షాలు పడుతున్న తీరును బట్టి ప్రమాదాన్ని పసిగట్టి తక్షణ చర్యలు తీసుకోవాలి. ఇది అధికార్ల బాధ్యత అని వారు పేర్కొంటున్నారు. అయితే ప్రభుత్వాధికార్లు మాత్రం దీన్ని కొట్టిపారేస్తూ, గతంలో కొండచరియలు విరిగిపడిన ప్రదేశాలకు ఆరు కిలోమీటర్ల పరిధివరకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని, ప్రస్తుత ప్రమాదం ఈ పరిధికి ఆవల జరిగిందంటూ చెబుతున్నారు.

 కేరళ ప్రభుత్వ వైఫల్యం

దేశవ్యాప్తంగా 0.42మిలియన్‌ చదరపు కిలోమీటర్ల ప్రాంతం కొండచరి యలు విరిగిపడే ప్రమాదమున్న ప్రాంతంగా గుర్తించారు. ఇందులో 66% వాయువ్య హిమాలయా ప్రాంతాలు, 18.8% ఈశాన్య హిమాలయా ప్రాంతాలు, 14.7% పడమటి కనుమల్లో విస్తరించి వుంది. ఈ కొండ చరియలు విరిగిపడుతున్న ప్రమాదాల వల్ల కలిగే నష్టం జి.డి.పి.లో సగటున 1% నుంచి 2% వరకు ఆర్థిక నష్టం వాటిల్లుతోందని భారత భూగర్భ పరిశోధనా సంస్థ వెల్లడిరచింది. కేరళలో 17వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతం కొండచరియలు విరిగిపడే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ప్రాంతాలుగా మ్యాప్‌లో గుర్తించారు. ఇందులో అత్యధికభాగం పడమటి కనుమల పశ్చిమ ప్రాంతంలో విస్తరించి ఉండటం గమనార్హం. ఇటువంటి ప్రమాదం పొంచి ఉండే ప్రాంతాల్లో నివసించే ప్రజల రక్షణకోసం ప్రభుత్వాలు ఇప్పటికైనా శాస్త్రీయమైన విధానాన్ని అనుసరిం చాలి. అభివృద్ధి పేరుతో విచ్చలవిడిగా చెట్లను కొట్టేయడం, పర్యావరణ విధ్వంసానికి పాల్పడటం సముచితం కాదు. అక్రమ మైనింగ్‌లు, అక్రమ కట్టడాలను పరిమితం చేస్తూ అభివృద్ధిని, ప్రకృతిని సమతుల్యం చేస్తూ ముందుకు సాగాల్సిన అవసరం వుంది. రాష్ట్రంలోని శాస్త్రవేత్తలు, సంస్థలు ఎప్పటికప్పుడు ఇచ్చిన సమాచారాన్ని అధికార్లు బేఖాతరు చేయడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. తన వైఫల్యాన్ని కప్పి పుచుకునే రీతిలో కేంద్రంపై విమర్శకు దిగడం ఎంతవరకు సమంజసం? ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లుతెరచి ప్రస్తుత విపత్తును ఒక గుణపాఠంగా తీసుసుకొని సున్నిత ప్రాంతాల్లో ప్రజల ప్రాణరక్షణకు తగిన చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో మరింత ఘోర నష్టాన్ని చవిచూడక తప్పదు.

About Author

By editor

Twitter
YOUTUBE