దేశ జనాభాలో సగం మంది సగటు వయస్సు 29 ఏళ్ల లోపువారే. ఈ జనాభా సామర్ధ్యాన్ని ఉపయోగించుకోవడానికి 25 సంవత్సరాల సమయం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద శ్రామికశక్తిని అందించే దేశంగా భారత్‌ అవతరించబోతుంది. ప్రతి ఏడాది 13 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు పోతున్నారు. రానున్న కాలంలో భారత్‌నే విదేశీ విద్యార్థులను ఆకర్షించేలా ఎదుగనుంది. 2047 నాటికి భారత్‌ ‌విశ్వ గురువుగా మారనుంది.  2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారితే దేశ ప్రజల ఆదాయం 6 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది.

‌మూడు దశాబ్దాల పాటు భారత్‌ ఏటా 9 నుంచి 10 శాతం వృద్ధి సాధిస్తే.. ప్రజల ఆదాయం 12000 డాలర్లు దాటుతుంది. కొరియా, తైవాన్‌, ‌చైనా కూడా ఇదే స్థాయిలో అభివృద్ధి చెందాయి. 2047 నాటికి దేశాన్ని వికసించిన భారత్‌గా (అభివృద్ధి చెందిన దేశంగా) మార్చేందుకు కృషి చేయాలని మే, 2023 నాటి నీతి ఆయోగ్‌ ‌సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ‘విజన్‌-2047’ ‌భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడానికి అవసరమైన సంస్థాగత, నిర్మాణాత్మక మార్పులను సంస్కరణలను నిర్దేశిస్తుంది. స్వాతంత్య్రం సాధించి 2047 నాటికి వందేళ్లు నిండుతుంది. ఆ నాటికి 30 ట్రిలియన్‌ ‌డాలర్ల అభివృద్ధి చెందిన ఆర్ధిక వ్యవస్థగా ఆవిర్భవించేందుకు విజన్‌ ‌డాక్యుమెంట్‌ను నీతి ఆయోగ్‌ ‌సిద్ధం చేసింది. ఇది ఆర్ధిక వృద్ధి, పర్యావరణ స్థిరత్వం, సామాజిక పురోగతి, సుపరిపాలన, మెరుగైన అభివృద్ధి వంటి కోణాలను కలిగి ఉంటుంది. ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ ‌ప్రకారం 2047 నాటికి భారత్‌ ‌స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 8 శాతం పెరగాలి. 2022లో 6.5 శాతం ఉండగా 2023లో 7.7 శాతానికి పెరిగింది.

2021 డిసెంబరులోనే వికసిత భారత్‌కు అడుగులు పడ్డాయి. రంగాల వారీగా సిద్ధం చేసే బాధ్యతలను 10 సెక్టోరల్‌ ‌గ్రూప్స్ ఆఫ్‌ ‌సెక్రటరీలకు అప్పగించారు. వీటిలో ప్రధానంగా పరిశ్రమ ఛాంబర్‌లు, ఎగు మతి ప్రోత్సాహక మండలి, విశ్లేషణా నిపుణులు, పరిశోధనా సంస్థలతో పలు దఫాల్లో మేధోమథనం, సంబంధిత సంప్రదింపులు జరిగాయి. అభివృద్ధి చెందిన భారత్‌ 2047 ‌కోసం 10 రంగాల దార్శినికత విభాగాలను ఏకీకృతం చేసేందుకు 2023లోనే నీతి ఆయోగ్‌ ‌బాధ్యతలను చేపట్టింది.

తలసరి ఆదాయం రూ.98 వేల లక్ష్యం..

దేశంలో ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉంది. ఈ విధంగా ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4,046 నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలు అంటారు. 12,000 డాలర్ల తలసరి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. అమెరికా, చైనా, జపాన్‌, ‌జర్మనీ తర్వాత ప్రస్తుతం ప్రపంచంలోనే 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా(3.75 ట్రిలియన్‌ ‌డాలర్లు) భారత్‌ ‌కొనసాగుతున్నది. అంటే భారత్‌ ‌తలసరి ఆదాయం దాదాపు 1,183 డాలర్లని (రూ.98,373) అంచనా. 2047 నాటికి ఈ పరిమాణం 18,000 డాలర్ల••గా నిర్దేశించుకున్నాం. ప్రస్తుతం 25.5 ట్రిలియన్‌ ‌డాలర్లతో అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్నది. ప్రపంచం మొత్తం జీడీపీలో 25శాతం వాటాను కలిగి ఉంది. చైనా ప్రపంచ జీడీపీలో 18 ట్రిలియన్‌ ‌డాలర్లతో 17.9 శాతం ఎకానమీగా రెండో స్థానంలో ఉంది. తరువాత స్థానాలలో జపాన్‌ 4.2 ‌ట్రిలియన్‌ ‌డాలర్లు, జర్మనీ 4 ట్రిలియన్‌ ‌డాలర్లుగా ఉన్నాయి. 2022 నాటికి భారత్‌ ఎకానమీ బ్రిటన్‌, ‌ఫ్రాన్స్‌లను అధిగమించింది. ఇదే లక్ష్యంతో సుస్థిర పాలనతో ముందుకు సాగితే 2047 నాటికి అనుకున్న ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఆర్ధిక ప్రగతిని సాధిస్తే అభివృద్ధి అనేది దానంతట అదే జరిగిపోతుంది.

బడ్జెట్‌తో పడిన అడుగులు..

వికసిత భారత్‌-2047‌కు సాధ్యమనేది మన దేశ బడ్జెట్‌ 2024-25‌తోనే అర్థం చేసుకోవచ్చు. బడ్జెట్‌ అం‌టే అప్పులు, ఆదాయం కాకుండా రూ.48.20 లక్షల కోట్ల బడ్జెట్‌లోనూ విజన్‌ ‌కనిపిం చింది. వికసిత భారత్‌ ‌లక్ష్యాలకు అను గుణంగా బడ్జెట్‌ ఉం‌ది. తొమ్మిది ప్రాధాన్యాంశాలు కనిపించాయి. ముఖ్యంగా పేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతి.. వికసిత భారత్‌ ‌లక్ష్యాలుగా బడ్జెట్‌ ఉం‌ది. ఆర్ధిక వ్యవస్థలో అపార అవకాశాలను సృష్టించడానికి పెద్దపీట వేసింది. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసుకున్న తొమ్మిది ప్రాధాన్యాంశాలు బడ్జెట్‌లో స్పష్టంగా కనిపించాయి. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన-నైపుణ్యాభి వృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగం, పరిశోధన-ఆవిష్కరణలు, తయారీ-సేవలు, సంస్కరణలు వీటినే ప్రాధాన్యంగా తీసుకొని బడ్జెట్‌ ‌రూపకల్పన జరిగింది. ఇదే కాకుండా ఇప్పటికే మనం చెప్పుకున్నట్టుగా భారత్‌ను ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా రూపొందించడం, అభివృద్ధి దిశగా పునాది ఈ బడ్జెట్‌తో పడిందని చెప్పుకోవచ్చు. ప్రధానిగా మోదీ మూడోసారి అధికారం చేపట్టాక దేశం గర్వించేలా అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.

ఉపాధికి ఊతం..

సామాజిక న్యాయాన్ని సంపూర్ణంగా సాధించా లన్న సంకల్పంతో చేనేతకారులు, స్వయం సహాయక సంఘాలు, ఎస్సీ, ఎస్టీ మహిళా ఔత్సాహిక పారిశ్రా మిక వేత్తలు, వీధి వ్యాపారులకు పీఎం విశ్మకర్మ, సీఎం స్వనిధి, జాతీయ జీవనోపాధి మిషన్‌, ‌స్టాండప్‌ ఇం‌డియాల ద్వారా మద్దతు ఇవ్వనున్నారు. మహిళలకు ఉపాధి, ప్రయోజనం కల్పించే పథకాలకు ఈ బడ్జెట్‌లో రూ.3 లక్షల కోట్లను కేటాయించారు. గిరిజనుల సామాజిక, ఆర్ధిక అభ్యున్నతి కోసం ప్రధాన మంత్రి జన జాతీయ ఉన్నత గ్రామ అభియాన్‌ను సైతం త్వరలోనే ప్రారంభించనున్నారు. స్వయం ఉపాధి పథకాల ద్వారా జీవనోపాధి పొందుతున్నవారి వ్యాపార సామర్ధ్యాలను పెంచేం దుకు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ముద్ర రుణాల పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పెంచడంతో మధ్య స్థాయి నుంచి ఉన్నతమైన వ్యపారాలను చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇదే కాకుండా స్వయం ఉపాధిపై ఆధార పడిన వీధి వ్యాపారులకు కావాల్సిన ప్రోత్సాహాన్ని అందించ నున్నారు.

పట్టణ పేదల కోసం రూ.10లక్షల కోట్లతో కోటి ఇళ్లను నిర్మించనున్నారు. మహిళా సాధికారతను ప్రోత్సహించేందుకు వీలుగా వారి పేర్లపై రిజిష్టరయ్యే ఆస్తులపై స్టాంప్‌ ‌డ్యూటీని సైతం తగ్గించనున్నారు. ఇవే కాకుండా మహిళలకే ప్రత్యేకించిన నైపుణ్యాల శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు. ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం పెంచడం కోసం పరిశ్రమలు, కంపెనీల సహకారంతో వర్కింగ్‌ ‌విమెన్‌ ‌హాస్టళ్లు, చిన్న పిల్లల సంరక్షరణను చూసుకునే క్రెచ్‌ల ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఉపాధి, ఉద్యోగ రంగాలలో మహిళల సంఖ్య ఆశించిన స్థాయిలో పెరగనుంది. అంతమంగా మహిళాసాధికారతను సాధించడం సాధ్యం అవుతుంది.

విద్యా ప్రమాణాల పెంపు..

యువతకు నైపుణ్య శిక్షణ

దేశంలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది. దీనిలో భాగంగానే ‘‘జాతీయ విద్యా పాలసీ (చీజు)’’ ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దేశంలో కాలేజీల నమోదు రేటు 27 శాతం నుంచి 60 శాతానికి పెంచే లక్ష్యంతో బడ్జెట్‌లోనూ ప్రభుత్వం భారీగా నిధులను కేటాయించింది. దీంతో కాలేజీకి వెళ్లే విద్యార్థుల సంఖ్యను 4 కోట్ల నుండి 9 కోట్లకు చేరే విధంగా చూడనున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న వెయ్యి విశ్వవిద్యాలయాలకు తోడుగా మరో వెయ్యి కొత్తగా అవసరం అవుతాయి. బడ్జెట్‌లో పేర్కొన్న విధంగా నవ ప్రాధాన్యాల్లో ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి కీలకంగా మారనున్నాయి. దేశంలో భారీగా కొత్త ఉద్యోగాల కల్పన, అందుకు వీలు కల్పించేలా యువతకు నైపుణ్య శిక్షణ లక్ష్యంతో మోదీ సర్కార్‌ అడుగులు వేసిందనే చెప్పుకోవాలి.

ఎంఎస్‌ఎంఈ ‌పరిశ్రమలు, మధ్య తరగతి, విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి బడ్జెట్‌లో రూ.1.48 కోట్లను కేటాయించారు. ప్రధాని ఫ్యాకేజీలోని స్కీం-ఏలో భాగంగా తొలిసారి ఉద్యోగాల్లో చేరిని వారిని ఈపీఎఫ్‌ఓ ‌ఖాతాల ఆధారంగా గుర్తించి వారికి ఒక నెల వేతనాన్ని ప్రోత్సాహకంగా అందించనున్నారు. స్కీం-బీలో ఉత్పాదక రంగంలో ఉపాధి కల్పనను ప్రోత్సాహించేందుకు ఉద్యోగికి, యజమానికి కూడా ప్రోత్సహకాలు ఇవ్వనున్నారు. ఇదే కాకుండా దేశంలోని కోటి మంది యువతకు అగశ్రేణి 500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ ‌కల్పించనున్నారు. వారి ఉద్యోగ సామర్ధ్యాన్ని పెంచేందుకు కొత్త పథకాన్ని కూడా ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం ఒక్కో అభ్యర్థికి నెలకు రూ.5వేల భృతి కూడా చెల్లించ నున్నారు. దేశంలో ఈ ఐదేళ్లల్లో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం, ఇతర అవకాశాలను కల్పించేం దుకు బడ్జెట్‌లో రూ.2 లక్షల కోట్లను కేటాయించారు. 100 నగరాలలో పారిశ్రామిక పార్కులను సైతం అభివృద్ధి చేయనున్నారు. దీంతో వేలాది కంపెనీలు ఏర్పాటు కానున్నాయి. వేలాది మంది యువ పారిశ్రామికవేత్తలు దేశంలో తయారు కానున్నారు.

అన్నదాతకు కొండంత అండగా

దేశంలో సుమారు 70 శాతం గ్రామాలలో వ్యవసాయమే జీవనాధారం. సాగు ఉత్పాదకత పెంచడమే లక్ష్యంగా బడ్జెట్‌లో వ్యవసాయం, దీని అనుబంధ రంగాలకు కేంద్ర ప్రభుత్వం రూ.1.52 లక్షల కోట్లను కేటాయించింది. రైతు సంక్షేమానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో దీంతో అర్థం చేసుకోవచ్చు. దేశంలోని కోటి మంది రైతులు వచ్చే రెండేళ్లల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టేలా ప్రోత్సాహం కూడా అందించ నుంది. దేశ సమగ్రాభివృద్ధికి జాతీయ సహకార విధానాన్ని అమల్లోకి తేనుంది. గ్రామీణ ఆర్ధికం, సత్వర అభివృద్ధి, ఉద్యోగావకాశాల కల్పనను వేగవంతం చేయనున్నారు. రైతుకు భూమే ఆధారం. భూమి మీద ఆధారపడి జీవించే రైతుకు భూమి హక్కులు దక్కాలి. అందుకే రాష్ట్రాల భాగస్వామ్యంతో రైతులు, వారి భూములకు మూడేళ్లలో డిజిటల్‌ ‌ప్రజా మౌళిక సదుపాయాలను కల్పించనున్నారు. భూ సంస్కరణలలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని భూములకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య లేదా భూ ఆధార్‌ ‌కేటాయించనున్నారు. ఇదే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో భూ పరిపాలన, ప్రణాళిక, నిర్వహణ, పట్టణ ప్రాంతాల్లో అర్బన్‌ ‌ప్లానింగ్‌, ఉప చట్టాల రూపకల్పనను కూడా రాష్ట్రాలు నెరవేర్చేలా కేంద్రం చూడనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని రకాల భూములకు యూనిక్‌ ‌ల్యాండ్‌ ‌పార్శిల్‌ ఐడెంటిఫికేషన్‌ ‌నంబర్‌ (‌యూఎల్‌పీఐఎన్‌) ‌లేదా భూ ఆధార్‌ ‌కేటాయింపు, భూ సర్వే, పటాల డిజిటలీకరణ, ప్రస్తుత యజమానులకు అనుగుణంగా సబ్‌ ‌డివిజన్‌ ‌పటాల సర్వే, భూముల రిజిస్ట్రీ, దానికి రైతుల అనుసంధానం చేయనున్నారు. దీంతో సమస్యలు రహిత భూ పరిపాలన అమల్లోకి రానుంది. రైతులకు భూ తగాదాలు అనేవి భవిష్యత్తులో ఉండే అవకాశం ఉండదు.

తిరుగులేని రక్షణ వ్యవస్థ

చైనా కవ్వింపులు, పాక్‌ ‌ముష్కరుల చొరబాట్లతో సరిహద్దుల వెంట అప్రమత్తంగా ఉండే సైన్యంతో భూతల, గగనతల రక్షణ వ్యవస్థల మరింత పటిష్టతే లక్ష్యంగా మోదీ సర్కార్‌ ‌మరోమారు రక్షణ రంగానికి పెద్దపీట వేసిందని చెప్పుకోవచ్చు. 2024-25 బడ్జెటులో రక్షణ రంగానికి రూ.6,21,940 కోట్లు కేటాయించింది. అత్యాధునిక డ్రోన్సు, యుద్ధ విమానాలు, నౌకలు, ఆయుధాలు, ఇతర సైనిక ఉపకరణాల కొనుగోలు కోసం ఏకంగా రూ.1,72,0000 కోట్లు కేటాయింపులు జరుగగా.. ఇది తాజా కేంద్ర బడ్జెట్‌లో రక్షణ రంగ వాటా 12.9 శాతం పెరిగింది. గత ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి రక్షణ రంగానికి కేటాయింపులు 4.79శాతం పెరిగాయి. రక్షణ రంగంలో స్వావలంబనే లక్ష్యంగా సైనిక ఉపకరణాల స్థానిక తయారీని మరింత ప్రోత్సాహించేందుకు మోదీ సర్కార్‌ ‌శ్రీకారం చుట్టింది. అందుకే స్థానిక ఉపకరణాల సేకరణ కోసం రూ.1,05,518 కోట్లను కేటాయించింది. దీంతో లక్షిత రక్షణరంగంలో ఆత్మనిర్భరత మరింతగా సాకారం కానుంది. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి సరిహద్దుల వెంట రహదారుల నిర్మాణానికి కేటాయింపులు 30 శాతం పెంచారు. బీఆర్‌ఓకు కేటాయించిన రూ.6500 కోట్ల నిధులతో సరిహద్దుల వెంట మౌలికవసతుల కల్పన మరింతగా పెరగ నుంది. రక్షణరంగ పరిశ్రమల్లో అంకుర సంస్థలు ప్రోత్సహించే ఉద్ధేశంతో ఐడెక్స్ ‌పథకానికి రూ.518 కోట్లు కేటాయించారు. అంకుర సంస్థలు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ఆవిష్కర్తలు ఇచ్చే కొత్త ఐడియాలను ఆచరణ పెట్టేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. కోస్ట్‌గార్డ్ ఆర్గనైజేషన్‌కు రూ.7,651 కోట్లు కేటాయించారు. తేజస్‌ ‌వంటి తేలికపాటి యుద్ధ విమానాలను తయారు చేస్తూ నూతన విమానాల డిజైన్‌, ‌రూపకల్పన, తయారీ కోసం కృషి చేసే హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌కు రూ.1,600 కోట్లు ఇవ్వడం జరిగింది. రాష్ట్రీయ రైఫిల్స్ ‌విభాగం కోసం రూ.10,535 కోట్లు, ఎన్‌సీసీ కోసం రూ.2,726 కోట్లు, త్రివిధ దళాల్లో అగ్నిపథ్‌ ‌పథకం నిర్వహణ కోసం కూడా రూ.5,980 కోట్లు కేటాయించారు.

గ్రామాలకు అండగా.. పట్టణాలకు దండిగా..

గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను పరుగులు పెట్టించేం దుకు కేంద్ర సర్కార్‌ ‌నడుం బిగించింది. కీలకమైన కేంద్ర ప్రభుత్వ పథకాల(ఫ్లాగ్‌షిప్‌)‌కు బడ్జెట్‌లో భారీగా నిధులను కేటాయించింది. గత ఆర్ధిక సంవత్సరంలో గ్రామీణాభివృద్ధికి రూ.2.38 లక్షల కోట్లు కేటాయిం చగా, ఈ ఏడాది బడ్జెట్‌లో ఏకంగా రూ.2.65 లక్షల కోట్లకు పెంచడం హర్షించదగిన విషయం. ఇదే కాకుండా ఉపాధి హామీకి మళ్లీ భారీగా నిధులతో పాటు గ్రామీణ రోడ్ల కోసం నాలుగో దశ, అదనంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనుంది. మహాత్మగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సైతం ఈ బడ్జెట్‌లో గతానికి కంటే 40శాతం అదనంగా నిధుల కేటాయించారు. గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం కోసం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ ‌యోజన-పీఎంజీఎస్‌వై(ఫ్లాగ్‌షిప్‌ ‌స్కీమ్‌)‌కు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యం లభించింది. పీఎంజీఎస్‌వై-4లో భాగంగా 25వేల గ్రామీణ ప్రాంతాలను పక్కా రోడ్లతో అనుసంధానం చేయనున్నారు. ఇందుకు బడ్జెట్‌లో గతం కంటే అదనంగా 12 శాతం నిధులను కేటాయించారు. పీఎంఏవై కింద పేదలు, మధ్య తరగతి వర్గాలకు సొంతింటి కల నెరవేర్చేలా బడ్జెట్‌లో భారీగా నిధుల కేటాయింపు జరిగింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 2023 మార్చి నాటికే 2.94 కోట్ల ఇళ్లను నిర్మించారు. గ్రామీణ ప్రాంతాలలో వచ్చే ఐదేళ్లల్లో ఈ పతకం కింద 2 కోట్ల ఇళ్లను నిర్మించ నున్నారు. గ్రామీణ కుటుంబాలన్నింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు బడ్జెట్‌లో రూ.69,927 కోట్లను కేటాయించారు. 2019-20లో జల్‌ ‌జీవన్‌ ‌మిషన్‌ ‌ఫ్లాగ్షిప్‌ ‌పోగ్రాంను అందుబాటులోకి తెచ్చారు. దేశంలో 19.26 కోట్ల గ్రామీణ కుటుంబాలకు గాను, ఇప్పటి వరకు 14.22 కోట్ల కుటుంబాలకు తాగు నీటి సదుపాయం కల్పించారు.

బడ్జెట్‌లో నిర్దేశించిన 9 ప్రాధామ్యాల్లో పట్టణాభి వృద్ధి ఒకటి. భూ సంబంధ సంస్కరణల్లో భాగంగా పట్టణ భూ రికార్డులకు జీఐఎస్‌ ‌మ్యాపింగ్‌ ‌విధానంలో డిజిటలైజేషన్‌ ‌చేపట్టనున్నారు. దేశంలో 30 లక్షలకు పైగా జనాభా కలిగిన 14 పెద్ద నగరాలకు రవాణా ఆధారిత అభివృద్ధి ప్రణాళికను కేంద్రం ప్రకటించింది. నగరాల సృజనాత్మకతో కూడిన పునర్‌ అభివృద్ధి కోసం ఓ ప్రేమ్‌వర్క్‌ను రూపొందించింది. నగరాలను అభివృద్ధి కేంద్రాలు (గ్రోత్‌ ‌హబ్‌లు)గా తీర్చదిద్దేందుకు వీలుగా రాష్ట్రాలతో కలిసి కేంద్రం పని చేయనుంది. టౌన్‌ ‌ప్లానింగ్‌ ‌పథకాల వినియోగంతో నగర చుట్ట పక్కల ప్రాంతాల అభివృద్ధి, ఆర్ధిక, రవాణా ప్రణాళిక ద్వారా దీనిని సాధించనున్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌ ‌యోజన-అర్బన్‌ ‌పథకం కింద వచ్చే ఐదేళ్లల్లో కోటి మంది పట్టణ పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు గృహ నిర్మాణాలను చేయించనున్నారు. ఇందుకు బడ్జెట్‌లో రూ.2.2 లక్షల కోట్ల నిధులను కేంద్రం అందించనుంది. ఇదే కాకుండా సరసమైన రేట్లతో రుణాలను కూడా అందించేందుకు వీలుగా వడ్డీ రాయితీని కూడా ప్రతిపాదించడం జరిగింది. అదే విధంగా పట్టణ ప్రాంతాల్లోని భూముల రికార్డులన్నీ డిజిటలీకరించనున్నారు. ఇందుకు రాష్ట్రాలకు కూడా అవసరమైన తోడ్పాటును కేంద్రం అందించనుంది. స్వచ్ఛతకు కేంద్రం పెద్దపీట వేసింది. బడ్జెట్‌ ‌స్వచ్ఛ భారత్‌ ‌మిషన్‌కు గత ఏడాది రూ.9,550 కోట్లు కేటాయించగా ప్రస్తుతం రూ.12,192 కోట్లు కేటాయించింది. దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో బహిరంగ మల మూత్ర విసర్జనను పూర్తిగా అరికట్టడం, ఘన, జల వ్యర్ధ్యాల నిర్వహణను కూడా తెచ్చింది. స్వచ్ఛతనే లక్ష్యంగా స్వచ్ఛభారత్‌ ‌మిషన్‌ ‌పని చేస్తోంది.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE