బాధ్యతలు పట్టని వారికి హక్కులు ఉండవు అని ఇటీవల ఒక మేధావి సరైన పంథాలో తన అభిప్రాయం వెల్లడించారు. భారతదేశంలో ఒక వింత వాతావరణం ఉంది. హక్కుల కోసమే తప్ప, బాధ్యతల గురించి మాట్లాడేవారు కనిపించరు. కోర్టు తీర్పులు సహా తాము కోరుకున్నట్టే రావాలని, లేకుంటే అరాచకాన్ని సృష్టించాలని భావించే వారూ ఎక్కువే. ఇటీవల జమ్ముకశ్మీర్‌లో ఒక పోలీసు ఉన్నతాధికారి ప్రకటన చాలామందిని ఆలోచింప చేసింది. కశ్మీర్ లోయ నుంచి జమ్ముకు ముస్లిం ఉగ్రవాదం విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయన చెప్పిన మాటలు అవి. జమ్ములో గాని, గతంలో కశ్మీర్ లోయలోగాని ఉగ్రవాదం పెరగడానికి కారణం స్థానికుల సహకారమేనని నిస్సంకోచంగా ఆయన చెప్పారు. పాక్ ప్రేరేపిత ముస్లిం మతోన్మాద ఉగ్రవాదం భారత సార్వభౌమాధికారాన్ని సవాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి వారికి ఆశ్రయం ఇవ్వడం అతి పెద్ద బాధ్యతా రాహిత్యం. అయితే కశ్మీర్‌లో ప్రజలకు హక్కులు లేవని చాలామంది చెబుతూ ఉంటారు. అలాంటి వాదనలు వినిపిస్తేనే బాధ్యతలు పట్టని వారికి హక్కులు ఎలా ఇస్తామని ఎదురుదాడి చేసేవారు ఎక్కువ అవుతున్నారు.
ఒక దేశాన్ని ప్రపంచ మానవాళి ముందు సగర్వంగా నిలిపేవి నాలుగు అంశాలు. బాధ్యత కలిగిన విలువలు పాటించే పౌర జనాభా, నిర్దిష్ట దేశ భూభాగం, నిష్పాక్షిక ప్రభుత్వ పాలన, దేశ సార్వభౌమాధికార సమగ్రతలు అందులో ప్రధాన మైనవి. దేశ పౌరులుగా మనందరికీ కొన్ని బాధ్యతలు, హక్కులు ఉన్నాయి. బాధ్యతలు నిర్వహించిన పౌరులకే హక్కులు అనుభవించే అర్హత కూడా ఉంటుందనడం పరిపాటి. నేటి పౌరుల్లో హక్కుల పోరాటాల పట్ల ఆరాటమే తప్ప బాధ్యతల గూర్చిన కనీస కనీస స్పృహ కనిపించదు. భారత్‌లో మనదైన నాగరికత, విలువల సమాజం, అందులో సమత అనాదిగా కొనసాగుతున్నాయి. నేడు దేశంలోని అన్ని విభాగాలు దినదినాభివృద్ధి చెందుతున్నాయి. మౌలిక వసతులు, ప్రజా రవాణా వ్యవస్థలు, పౌర సేవలు, పౌర సౌకర్యాలు, ఆధునిక హంగులు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని పథకాలు రచించి అమలు చేసినా ‘పౌర భావనలు లేదా సివిక్ సెన్స్’ లోపిస్తే అవి నిష్ప్రయోజనమై బుడిదలో పోసిన పన్నీరే అవుతుందని గమనించాలి. ప్రతి పౌరుడికి కొన్ని నిర్దిష్ట బాధ్యతలు ఉన్నాయని మరువరాదు. వేర్పాటు వాదం, ఉగ్రవాదం, విధ్వంసం, అసహనం లాంటివి పెరుగుతున్న నేటి పౌర సమాజంలో సివిక్ సెన్స్ పెంచడం మాత్రమే మన ముందున్న ఏకైక మార్గమని తెలుసు కోవాలి. ప్రజలు సన్మార్గంలో పయనించేలా చూసుకోవాలి.
పౌర సమాజ కనీస బాధ్యతలు
తన వృత్తి విధులను తూచ తప్పకుండా నిర్వహిస్తూ, సమాజ హిత ఆలోచనలు చేయడం, స్వచ్ఛందంగా సేవలు విస్తరించడం, నీతి-న్యాయం-నైతికతలకు పట్టం కట్టడం, నిర్దేశిత పౌర నియమ నిబంధనలు పాటించడం, పౌరుల హక్కులను గౌరవించడం, పౌర సమాజ అవగాహనకు దోహదపడడం, ప్రభుత్వ ఆస్తులను కాపాడడం, కరుణ-దయాగుణాలను పెంపొందించుకోవడం, దేశాభివృద్ధికి కృషి చేయడం, సకాలంలో పన్నులు కట్టడం, ప్రభుత్వ పాలనకు సహకరించడం, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రదర్శించడం, దేశభక్తితో జాతీయ పతాకం/గీతాలను గౌరవించడం, సంఘ విద్రోహశక్తుల కట్టడికి పాలనకు చేయూత ఇవ్వడం లాంటి విలువలతో కూడిన విధులు దేశ ఖ్యాతిని ఇనుమడింపజేస్తాయి. ఏ దేశమైనా, ఎంత సంపద ఉన్నా ఆ దేశ ఖ్యాతి అంతర్జాతీయ యవనికపై అక్కడి పౌర సమాజ సున్నిత స్వచ్ఛంద ప్రవర్తనలపై ఆధారపడి ఉంటుందని గమనించాలి.
‘సివిక్ సెన్స్’ కొరవడితే అనర్థాలే
సివిక్ సెన్స్ లేదా పౌర భావనలు సన్నిగిల్లితే సమాజంలో అశాంతి, అనారోగ్యకర పరిస్థితులు రాజ్యమేలుతాయి. ఇతరుల హక్కులకు భంగం కలిగించడం, సామాజిక-నైతిక ప్రవర్తనలు సన్నగిల్లడం, దేశభక్తి పలుచబడడం, పౌర నియమ నిబంధనలను బేఖాతరు చేయడం, పన్నులు ఎగవేయడం, స్వార్థ బుద్ది ప్రబలడం, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం, ట్రాఫిక్ రూల్స్‌కు తూట్లు పొడవడం, పరమత-కుల-ప్రాంత అసహన జ్వాలలు ఎగిసి పడడం, పక్షపాతం పెట్రేగిపోవడం, సాంస్కృతిక వారసత్వాలకు విలువలకు ఇవ్వక పోవడం, సామాజిక కట్టుబాట్లను ఛేదించడం లాంటి కారణాలతో దేశంలో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. రోజు రోజుకు అక్షరాస్యత, విద్య పెరిగినప్పటికీ పౌరుల్లో ‘సివిక్ సెన్స్’ మాత్రం పెరగడం లేదని స్పష్టం అవుతున్నది.
పౌర బాధ్యతలు నిర్వహిస్తున్నామా!
ఇంటి వ్యర్థాలు/చెత్త చెదారాలను వీధుల్లో వేయడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, కాలుష్యానికి కారణం కావడం, ట్రాఫిక్ రూల్స్‌ను తుంగలో తొక్కి ప్రమాదాలకు కారణం కావడం, నిరసనల సందర్భంగా ప్రజారవాణా బస్సులు/ప్రభుత్వ కార్యాలయాలు/ఆస్తులను నాశనం చేయడం లాంటి ప్రమాదకర సంఘటనలు తరుచుగా చూస్తూ సున్నిత పౌరులు బాధ పడడం జరుగుతోంది. దేశవ్యాప్తంగా 2022లో 4,61,312 రోడ్డు ప్రమాదాలు నమోదు కావడంతో పాటు 1,68,491 మంది ప్రాణాలు కోల్పోవడం కూడా పౌర భావనలు సన్నిగిల్లడమే కారణంగా పేర్కొనాలి. ప్రతి ఒక్కరు బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ పాటించి ఉన్నట్లయితో ఈ ప్రాణాలు నిలిచి పోయేవని గమనించాలి. కల్తీ, లంచగొండితనం, దోపిడీ, అవినీతి అక్రమాలు లాంటివి నిత్యం మనల్ని, మన ఆరోగ్యాలను హరిస్తున్నాయని తెలుస్తున్నది.
పౌర భావనలే సమాజాభివృద్ధికి రక్ష
మన జీవన ప్రమాణాలు, సుఖసంతోషాలు పెరగడానికి సివిక్ సెన్స్ ఉండడం మాత్రమే ఏకైక మార్గమని తెలుసుకోవలసిన సమయం ఆసన్నమైనది. పౌరుల్లో సివిక్ సెన్స్ పెంచడం మన కనీస కర్తవ్యం. ఉన్నత విద్యతో పౌర భావనలు నెలకొని విలువలతో కూడిన సమాజం చిగురించే అవకాశం చాలా ఉంది. అనాగరిక ప్రవర్తనలను అందరు వ్యతిరేకించాలి. చట్టాలను ఉల్లంఘిచే సంఘ విద్రోహాల చేతులకు బేడీలు తొడగాలి. అందుకు సాయపడాలి. సమాజంలోని విద్యావేత్తలు, స్వచ్ఛంద కార్యకర్తలు, పెద్దలు తమ విధిగా సివిక్ సెన్స్‌ను ప్రచారం చేయాలి, పాటించే విధంగా కార్యాచరణను తీసుకోవాలి. చట్టం గీత దాటిన వారికి సత్వర శిక్షలు వేయడం, అవగాహనలను విస్తృత పరచడం, సత్పౌరులను సన్మానించడం, ఆరోగ్యకర వాతావరణాన్ని నెలకొల్పడం, జాతీయ సమగ్రతను కాపాడడం, ప్రజాస్వామ్య విలువలను కాపాడడం, రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించడం లాంటి పౌర బాధ్యతలు దేశ ఔన్నత్యాన్ని ఇనుమడింపజేస్తాయి. రాజ్యాంగం విషయంలో కూడా కొన్ని అవాంఛనీయ పరిస్థితులు ఎదురవు తున్నాయి. రాజ్యాంగం చెబుతున్న దానిని పాటించకుండా, లేదా ప్రతిఘటిస్తూ తమకు హక్కులు కావాలని వాదించే అసంబద్ధ వైఖరి దేశంలో ముదిరిపోతోంది. పదుల సంఖ్యలో లేదా వందల సంఖ్యలో అమాయకులను పొట్టన పెట్టుకున్న వారికి పెద్ద శిక్ష పడితే ఆ నేరగాళ్ల మానవ హక్కుల గురించి రోడ్డెక్కి ఉద్యమాలు నడిపించే కుహనా ‘పౌర సంఘాలు’ ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ఇలాంటి వాదనలు, ప్రతిపాదనలు రాజ్యాంగం పట్ల సందిగ్ధ స్థితిని సృష్టిస్తాయి. కోర్టులను ప్రశ్నార్థకంగా చూస్తే వాతావరణాన్ని సృష్టిస్తాయి. కొందరికే పౌర హక్కులా అన్న ప్రశ్న ఇప్పటికే దేశంలో, సాధారణ ప్రజలలో బలంగానే వినిపిస్తున్నది. ఇది సరైన ధోరణి అనిపించుకోదు. ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకుని ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేసే భస్మాసుర వైఖరిని నిలువరించాలి.
పౌర భావనలను పాఠశాల దశ నుంచే బోధించడం మన కనీస బాధ్యతగా తీసుకోవాలి. వైవిధ్య భరిత భారతంలో ఇతరుల హక్కులకు భంగం కలిగించకుండా సివిక్ సెన్స్‌ను పెంపొందించుకుంటూ మన భారతీయ సనాతన వసుధైక కుటుంబకం పౌర భావనలకు విలువనివ్వాలి, శాంతియుత సమాజ స్థాపన స్వప్నాన్ని సాకారం చేసుకోవాలి.
డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037