ఆంధ్రప్రదేశ్‌లో గత వారం రోజుల్లో మూడు ముఖ్యమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వ పాలనా విధానాలపై సమీక్షలు, పథకాలపై తనిఖీలు, ఎన్నికల అజెండాపై కార్యాచరణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అత్యంత ప్రభావం చూపిన, అవినీతికి లోనైన పోలవరం, అమరావతి, విద్యుత్, పర్యావరణం (ల్యాండ్, శాండ్, మైన్స్, జియాలజీ), మద్యం, ఎక్సైజ్, శాంతిభద్రతలు, ఆర్థికశాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించి, అమలుచేస్తోంది కూడా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సంతకాలు చేసిన అయిదు పథకాల్లో ఒకటైన సామాజిక పింఛన్లను రూ.వెయ్యి పెంచి జూలై ఒకటిన పంపిణీ చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తదితర మంత్రులు తమ శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ అయిదేళ్లలో జరిగిన విషయాలు తెలుసు కుంటూనే క్షేత్ర స్థాయిలో పరిశీలన ప్రారంభించారు. రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారు. పోలవరం వెళ్లి అక్కడ వాస్తవ పరిస్థితులు పరిశీలించి నిపుణులతో చర్చించి శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అలాగే పోలవరం నిర్మాణంపై పరిశీలన, పరీక్ష, సూచన, సలహాలకు అమెరికా, కెనడాలకు చెందిన నీటి పారుదల నిపుణులను పిలిపించారు. ఇక ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్ తన శాఖలు.. పంచాయతీ, గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల అధికారు లతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ, వాస్తవ పరిస్థితులు తెలుసు కుంటున్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య పరిస్థితులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. డయేరియా నివారణకు వైద్యశిబిరాలు నిర్వహించి, ఆసుపత్రుల్లో మౌలికసదుపాయాలను తెలుసుకునేందుకు పర్యటి స్తున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ప్రజాపంపిణీ వ్యవస్థ కింద పంపిణీ జరిగే బియ్యం కొన్ని ప్రైవేటు గోదాముల్లో అక్రమ నిల్వలున్నట్లు గుర్తించి సీజ్ చేయించారు.
పోలవరంపై శ్వేతపత్రం
గత ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి ప్రభుత్వం శ్వేతపత్రంలో వివరించింది. విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే గత వైసీపీ ప్రభుత్వం చేసిన నష్టమే ఎక్కువని పేర్కొంది. పోలవరానికి సంబంధించిన రూ.3,385 కోట్లను గత ప్రభుత్వం దారి మళ్లించినట్లు ఆరోపించింది. శ్వేతపత్రంలో పేర్కొన్న అంశాలిలా ఉన్నాయి. 2014 నుండి 2019 వరకూ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై రూ.11,762 కోట్లు ఖర్చు చేసింది. అందులో కేంద్రం వాటాగా రూ.6764.16 కోట్లు ఉన్నాయి.మిగతా నిధుల చెల్లింపులో జాప్యం చేసింది. ‘2019లో ప్రభుత్వం మారిన తరువాత నుండి కేంద్రం రూ.8,382.11 కోట్లు రాష్ట్రానికి ఇవ్వగా, అందులో రూ.4996.53 కోట్లు ప్రాజెక్టు పనులకు ఖర్చు చేసి, మిగిలిన నిధుల్లో రూ.3,385.58 కోట్లను వేరే అవసరాలకు మళ్లించారు. దీంతో ప్రాజెక్టు పనులకు నిధుల కొరత ఏర్పడిరది. 2024 మే 31 నాటికి రూ.2,697 కోట్ల బిల్లులు పెండిరగ్‌లో ఉన్నాయి. ఇది భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణం పనులపై ప్రభావం చూపింది’ అని శ్వేతపత్రం వివరించింది. బిల్లులు ఇవ్వకపోవడంతో ఏజెన్సీలన్నీ పనులు నిలిపేసినట్లు తెలిపింది. మరోవైపు ఎగువ కాపర్ డ్యామ్‌లో గ్యాప్‌లను పూడ్చకపోవడంతో 2020లో వచ్చిన వరదల ఉధృతికి దిగువన ఉన్న డయాఫ్రం వాల్ దెబ్బతింది. వాల్ ఎదురు భాగంలో 50 అడుగులకు పైగా గుంటలు పడటంతో డయాఫ్రం వాల్ ఎంత దెబ్బతిందనే దానిపై ఎగువ కాపర్ డ్యామ్‌లో గ్యాప్‌లను పూడ్చకపోవడంతో రెండున్నర సంవత్సరాల తరువాత అంచనా వేసింది. ‘దీనిపై పరిశీలనకు నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్(ఎన్ హెచ్పీసి)ని నియమించారు. ప్రస్తుతం దెబ్బతిన్న ప్రాంతాల్లో రింగ్ బండ్ పద్ధతిలో నిర్మాణం చేపట్టా లని, లేదా మొత్తం గోడ నిర్మించాలని నిపుణులు సూచించారు. గత ఏడాది మార్చి ఐదో తేదీన జరిగిన డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ దీనిని అంగీకరించింది. అందుకు అప్పటి ఏజెన్సీ మేఘా, బావర్ కంపెనీలూ అంగీకరించాయి. అయితే మరమ్మతులు చేసిన తరువాత అది పటిష్టంగా ఉంటుందా?లేదా? అనే అంశంపై ఎన్‌మెచ్‌పీసీ ఎటువంటి హామీని ఇవ్వలేదు. దీంతో ప్రస్తుతం డయాఫ్రం వాల్ తోపాటు నది పొడవున మరొక వాల్ నిర్మించాలని బావర్ కంపెనీ సూచించింది. దీన్ని సీడబ్ల్యూసీకి పంపించగా ,దానిని పరిశీలించిన సీడబ్ల్యూసీ నిపుణులు కొత్త వాల్ నిర్మాణం లేదా మరమ్మతులకు అనుమతించారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. అక్కడ పెండిరగ్‌లో ఉంది’ అని వివరించింది. కొత్త వాల్ నిర్మాణానికి రూ.970 కోట్ల వరకూ వ్యయమవు తుందని అంచనా వేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
రేషన్ బియ్యం మాఫియా అడ్డాగా కాకినాడ
రేషన్ బియ్యం మాఫియాకు కాకినాడ అడ్డాగా మారింది. కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకు ఈ బియ్యాన్ని ఎగుమతి చేస్తూ కోట్లు గడిస్తున్న వైనంపై పౌర సరఫరాల శాఖ కొరడా రaుళి పించింది. ఈ కేసును సీఐడీ విచారణకు అప్పగిస్తా మని పేర్కొంది. ఆహార భద్రత పథకం కింద పేదలకు రూపాయికి కిలో బియ్యం అందిస్తోంది. అందుకు కిలోకు రూ.39 ఖర్చుచేస్తోంది. ఇదే అదనుగా రేషన్ మాఫియా ఈ చౌకబియ్యాన్ని కొల్లగొడుతోంది. సొంతనౌకల్లో సరకు తరలిస్తూ.. విదేశాల్లోనూ గోదాములు కట్టుకుని ఆక్రమాల సామ్రాజ్యాన్ని విస్తరించారు.వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లూ సాగిన ఈ అక్రమాల తంతుకు కీలక శాఖలు ఊతమందిం చాయి. కూటమి సర్కారు ఏర్పాటయ్యాక పాపాల పుట్ట కదిలింది. కాకినాడ రేషన్ మాఫియా అక్రమాలు బయట పడ్డాయి. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పలు సంస్థల్లో సోదాలు చేశారు. వేల టన్నుల అక్రమ నిల్వలు సీజ్ చేయించారు. ఈ అక్రమాల్లో కాకినాడ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం, ఆయన అనుచరులదే కీలక పాత్రని బాహాటంగా వెల్లడిర చారు. సీఐడీ విచారణ చేయిస్తామని వెల్లడిరచడంతో కాక రేగింది.
వైసీపీ ప్రభుత్వంలో అప్పటి కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి రేషన్ వ్యవహారంలో పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయన తండ్రి భాస్కరరెడ్డి పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా, సోదరుడు వీరభద్రా రెడ్డి రాష్ట్ర మిల్లర్ల సంఘం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా, షిప్పింగ్ సంస్థ సంఘం అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. కొందరు మిల్లర్లను, ఎగుమతిదారులను గుప్పెట్లో పెట్టుకుని ఈ వ్యవహారం సాగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు యాంకరేజి పోర్టుతోపాటు పలు గోదాముల్లో 12,915 టన్నుల బియ్యం సీజ్‌చేయడం ఈ సంస్థలు అనుయాయులవే కావడంతో అన్ని వేళ్లూ ద్వారం పూడి వైపే చూపిస్తున్నాయి.
ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో నెలకు 2.12 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేస్తుంటే.. ఇందులో సగం మాఫియా పక్కదారి పట్టిస్తోంది. అర్హత లేనివారికి కార్డులు ఉండడం, వారికి ఈ బియ్యం తినే అవసరం లేకపోవడం మాఫియాకు కలిసొస్తోంది. ఇళ్లకు వెళ్లి బయోమెట్రిక్ వేయించుకుని సరకు పక్కన పెడుతున్నారు. ఊరూరా దళారులు సేకరించిన ఈ నిల్వలన్నిటిని ఓ చోటుకు చేరవేసి పోర్టుల ద్వారా విదేశాలకు తరలించి సొమ్ము చేసు కుంటున్నారు. పోలీసు, రవాణా, పౌర సరఫరాలు, తూనికలు – కొలతలు, వాణిజ్యపన్నుల శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పోర్టు ఇలా అన్ని శాఖల అధికారులూ అక్రమాల్లో సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. పోర్టు అధీనంలోని గోదాము ల్లోనూ చౌకబియ్యం గుర్తించడం.. పోర్టు అధికారులు ఏమీ తెలియనట్లు వ్యవహరించడంపై చర్చ నడుస్తోంది. పోర్టులకు వెళ్లే సరకుల తనిఖీకి వ్యవస్థ లేకపోవడం, అక్కడి పర్యవేక్షక యంత్రాంగం దాసోహమవ్వడం అక్రమాలకు ఊతమిచ్చింది.
కాకినాడ నుంచి ఆఫ్రికా దేశాలకు
రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు నుంచి అడ్డదారిన సేకరిస్తున్న పేదల బియ్యాన్ని కాకినాడ, మచిలీపట్నం రేవల ద్వారా విదేశాలకు తరలిస్తు న్నారు. రేవుల్లో బియ్యం లోడిరగ్, అన్ లోడిరగ్‌కు బిహార్, ఒడిశా కూలీలను వినియోగి స్తున్నారు. గతంలో కాకినాడ యాంకరేజి పోర్టు ద్వారానే బియ్యం ఎగుమతులు ఉండేవి. ఇప్పుడు ప్రైవేటు పోర్టు ద్వారా ఎగుమతుల సామర్థ్యం పెంచి, అదనపు బెర్తుల నిర్మాణానికి అవకాశం ఇచ్చి స్వలాభానికి వాడుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో 400 రైస్ మిల్లులు ఉన్నాయి ఆసియాలో అతిపెద్ద సామర్థ్యం ఉన్న మిల్లులు ఇక్కడ ఉండడం, పౌరసరఫరాల వ్యవస్థ ఒక కుటుంబం చేతిలో ఉండడం కలిసొచ్చిన అంశం. ఐదేళ్లూ వేలకోట్ల అక్రమార్జనకు ఇదే ఊతమిచ్చింది. బాస్మతియేతర బియ్యం ఎగుమతు లపై కేంద్రం నిషేధం విధించినా అక్రమ సేకరణ ఆగలేదు. ఎక్కడి కక్కడ భారీగా నిల్వలు ఉంచారు. నూకలుగా చేసి తరలించే ప్రక్రియ కొనసాగించారు.
రాజధాని నిర్మాణంలో మరో ముందడుగు
రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు పడిరది. ఈ ప్రాంతంలో చేపట్టనున్న గవర్నమెంట్ కాంప్లెక్స్ భవనాలకు 1575 ఎకరాలను ప్రభుత్వం గుర్తించి, ఆ ప్రాంతాన్ని సీిఆర్‌డీఏ నోటిఫై చేసింది. ఈ మేరకు సీఆర్‌డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ గెజిట్ విడుదల చేశారు. సీఆర్‌డీఏ చట్టం సెక్షన్ 39 ప్రకారం బహిరంగ ప్రకటన కూడా జారీ చేశారు. రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం సరిహద్దుల్లోని ప్రాంతాన్ని నోటిఫై చేస్తున్నట్లు ఈ ప్రకటనలో పేర్కొన్నారు. రాజధాని నగరంలోని 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో మొత్తం ప్లానుకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్లాను పరిధిలో ఎక్కడ ఏమి నిర్మించాలన్నా దానికి గుర్తిస్తూ సీఆర్‌డీఏ విడివిడిగా నోటిపికేషన్‌లు ఇవ్వాల్సి ఉంది. 2019కు ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం గవర్నమెంటు కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది. దీనిలో శాశ్వత సచివా లయం, హైకోర్టు, ప్రభుత్వ కార్యాలయాలు ఉండ నున్నాయి. సచివాలయ భవనాల నిర్మాణానికి అడుగు భాగంలో ర్యాఫ్ట్ కూడా వేశారు. మొత్తం 1575 ఎకరాల పరిధిలో వేసిన ఈ ప్లానును అప్పట్లో నోటిఫై చేయలేదు. ఆలోపు ఎన్నికలు రావడంతో ఇతర ప్రక్రియ మొత్తం ఆగిపోయింది. ఇప్పుడు మరలా కూటమి ప్రభుత్వం రావడంతో అమరావతి గవర్నమెంటు కాంప్లెక్స్(ఏజీసీ) నిర్మించబోయే ప్రాంతం మొత్తాన్ని నోటిఫై చేసింది.
ఎన్నికల హామీ అమలు
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం 65 లక్షల మందికి పైగా సామాజిక పెన్షన్ లబ్ధిదారులకు వెయ్యి రూపాయలు పెంచి అందిం చింది. తాము అధికారంలోకి వస్తే ఇప్పుడిస్తున్న రూ.3వేల పెన్షన్‌ను రూ.4వేలకు పెంచుతామని.. దివ్యాంగుల పెన్షన్ రూ.6వేలకు పెంచుతామని కూటమి ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ప్రచారం ప్రారంభించిన మార్చి నెల నుంచి జూలై వరకు మూడు నెలల కాలాన్ని కూడా పరిగణించి అదనంగా నెలకు రూ.వెయ్యి చొప్పున మూడు నెలల బకాయి రూ3 వేలు కలిపి మొత్తం రూ.7 వేలు అబ్ధిదారులకు అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. వివిధ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటు న్నారు. ప్రభుత్వం సామాజిక పెన్షన్ల కోసం ఈ నెల రూ.4,400 కోట్లు వెచ్చించింది.
– టిఎన్. భూషణ్, సీనియర్ జర్నలిస్ట్