ఈ ‌లోక్‌సభ ఎన్నికలలో లెఫ్ట్ ‌డెమోక్రటిక్‌ ‌ఫ్రంట్‌ (ఎల్‌డీఎఫ్‌) ‌ఘోర పరాజయానికి ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అహంకారమే కారణమని కేరళ వామపక్ష శిబిరం ఎలుగెత్తి చాటింది. సొంత పార్టీల నేతలే బహిరంగంగా ఆ మాట చెప్పారు. అంతేకాదు, వామపక్షాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, మన బుజ్జగింపు ధోరణి పట్ల ప్రజలలో వెగటు పుట్టడం వల్లనే ఫ్రంట్‌ ‌చతికిల పడిందని కూడా నిష్కర్షగా నాయకులు ప్రకటించారు. ఫ్రంట్‌ ‌నిర్వహించిన పౌర, రాజకీయ కార్యక్రమాలన్నీ కూడా మత సభలను తలపింపచేశాయని తిట్టి పోశారు. మత పెద్దలకు అనవసర ప్రాధాన్యం ఇచ్చారని కూడా ఆరోపించారు. ఇక్కడ మతపెద్దలంటే, ముస్లిం మత గురువులే. ముఖ్యమంత్రి పినరయి కుమార్తె వీణా విజయన్‌ ‌మీద వచ్చిన అవినీతి ఆరోపణలు కూడా ఓటమికి దోహదం చేశాయని ఆ వామపక్ష నేతలే ధ్వజమెత్తారు. పినరయి విజయన్‌ ‌రాజీనామా చేసి అవతలకి పోయి, కొత్త ముఖ్యమంత్రిని ప్రతిష్ఠిస్తే తప్ప పార్టీకి మోక్షం లేదని తెగేసి చెప్పారు. ఫ్రంట్‌ ‌పరాజయం గురించి ఐదురోజులు సుదీర్ఘంగా చర్చించిన తరువాత నాయకులు తేల్చినదేమిటి అంటే, ప్రజల ఆకాంక్షలను పట్టుకోవడంలో విఫలమయ్యాం, ఓడిపోయాం అనే. ఒక వైపు ఫ్రంట్‌ ‌మితిమీరిన బుజ్జగింపు ధోరణితోనే ప్రజలు తమను ఓడించారని చెబుతూనే, ముస్లింలంతా కాంగ్రెస్‌ ‌నాయకత్వంలోని యునైటెడ్‌ ‌డెమోక్రటిక్‌ ‌ఫ్రంట్‌కు మద్దతు ఇచ్చారని నాయకులు చెప్పడం వింతే. అలాగే సంప్రదాయకంగా వామపక్షాల వెనుక నిలిచిన వెనుకబడిన హిందువులలో బీజేపీ చొచ్చుకుపోవడం వల్లనే ఈ ఫలితాలు వచ్చాయని కూడా గమనించింది. జూన్‌ 20‌న ఈ మథనం ముగిసింది. ఫలశ్రుతి: తాను రాజీనామా చేయబోవడం లేదని పినరయి తేల్చి చెప్పడమే.

ఎన్నికలలో దారుణ పరాజయం గురించి జూన్‌ 16-20 ‌మధ్య సీపీఎం రాష్ట్ర సెక్రటేరియెట్‌ ‌సమీక్షించింది. ప్రభుత్వ వ్యతిరేకత ఓటమికి కారణమని ఆ సమావేశం కూడా అంగీకరించక తప్ప లేదు. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు వెలువడగానే పార్టీని  క్షాళన చేసే పని వెంటనే ఆరంభించాలని కొందరు సీనియర్‌ ‌కమ్యూనిస్టు నాయకులు బహిరంగంగానే ప్రకటనలు ఇచ్చారు. అందులో  ఒకటినాటి సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు, పార్టీ పత్రిక ‘దేశాభిమాని’ మాజీ అసోసియేట్‌ ఎడిటర్‌ అప్పుకుట్టం వల్లికున్ను  వ్యక్తం చేసిన అభిప్రాయాలు చాలా తీవ్రమైనవి. పినరయి విజయన్‌ ‌భారతదేశ గోర్బచెవ్‌ అని ఆయన తీర్పు చెప్పారు.

సీపీఎం రాష్ట్ర సెక్రటేరియెట్‌ ఒప్పుకోలు

ఎల్‌డీఎఫ్‌ ‌హయాంలో జరిగిన లోటుపాట్లే ఈ ఎన్నికలలో దారుణ పరాజయానికి కారణమని సీపీఎం రాష్ట్ర సెక్రటేరియెట్‌ అభిప్రాయపడింది (ఆన్‌ ‌మనోరమ, జూన్‌ 19, 2024). ‌ముఖ్యమంత్రి అహంకార పూరిత ధోరణి కూడా అందుకు దోహదం చేసిందని కూడా సాక్షాత్తు, పినరయి సమక్షంలోనే రాష్ట్ర సెక్రటేరియెట్‌ ‌భావించడం నిజంగా వింతే. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్‌ ‌జూన్‌ 19‌న ఇచ్చిన నివేదికలో ఈ విషయాలు ఉన్నాయి. నాయకుల వ్యవహార సరళితో వారు ప్రజలకు దూరమయ్యారని కూడా ఐదు రోజుల ఈ సమావే శాలు గుర్తించక తప్పలేదు. ప్రజల సమస్యలను పార్టీ పట్టించుకోలేదని కూడా అన్నారు. ఇందులో కులం కోణం గురించి కూడా కార్యదర్శి చర్చించారు. ఆది నుంచి పార్టీకి వెన్నెముకగా ఉన్న ఎజువా వర్గం ఈసారి దూరంగా ఉందనీ అత్తింగళ్‌, అళప్పుజ, త్రిశూర్‌ ‌కొజికోడ్‌ ‌ఫలితాలలో అది ప్రతిబింబించిం దనీ పేర్కొన్నారు. రాష్ట్ర సెక్రటేరియెట్‌ ‌సమావేశంలో పాల్గొన్న జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా పరిపాలనకు సంబంధించిన లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. ఎల్‌డీఎఫ్‌ ఓటమి ప్రభుత్వ వ్యతిరేక తీర్పును ప్రతిబింబించడం లేదనీ, బీజేపీ వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి యూడీఎఫ్‌కు ఓటు వేశారంటూ పినరయి చేసిన వాదనను సమావేశంతో అంగీకరించలేదు. అయినా పినరయి తనదైన శైలిలో ఎల్‌డీఎఫ్‌ ‌కూటమి వ్యతిరేక తీర్పు అసలు రహస్యం ఏమిటో చెప్పారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనగల శక్తి కాంగ్రెస్‌కు ఉందని నమ్మి ప్రజలు ఆ పార్టీకి ఓట్లు వేశారు. అంతేకాని ఆ తీర్పు తమకు వ్యతిరేకం కానేకాదు అంటున్నారు పినరయి. అందుకే రాజీనామా ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు.

పినరయి తప్ప అన్యధా శరణం నాస్తి అన్న రీతిలోనే రాష్ట్ర కార్యదర్శి తన నివేదికను సమర్పించారనిపిస్తుంది. జాతీయ స్థాయిలో బీజేపీతో ఇండీ కూటమి పోరాడుతున్నప్పటికీ, కేరళలో మాత్రం కాంగ్రెస్‌కూ, సీపీఎంకూ మధ్య సయోధ్యకు కొన్ని పరిమితులు ఉన్నాయని, కేంద్రంలో కాంగ్రెస్‌ ‌మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రజలు భావించడంతో అటు మొగ్గారని రాష్ట్ర సీపీఎం కార్యదర్శి గోవిందన్‌ ‌చెప్పారు (ది స్టేట్స్‌మన్‌, ‌జూన్‌ 21, 2024). ‌బీజేపీని నిలువరించగలిగే సత్తా కాంగ్రెస్‌కే ఉందని గట్టిగా విశ్వసించడం వల్ల ముస్లిం మతోన్మాదులు కాంగ్రెస్‌కే మద్దతు ఇచ్చారని సీపీఎం కొత్త సత్యం కూడా వెల్లడించింది. జమాత్‌ ఎ ఇస్లామి, ఎస్‌డీపీఐ (నిషిద్ధ పాప్యులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా ఉగ్రవాద ముస్లిం సంస్థకు రాజకీయ విభాగం)  యూడీఎఫ్‌కే మద్దతు ఇచ్చాయని రాష్ట్ర కార్యదర్శి చెప్పారు. క్రైస్తవులలో ఒక వర్గం కూడా బీజేపీకి మద్దతు (ఫలితంగానే, త్రిశూర్‌లో సురేశ్‌ ‌గోపీ గెలిచారని అంటున్నారు) ఇచ్చిందని తేల్చారు. నారాయణగురు ఆశయాలతో ఆరంభించిన భారత ధర్మ జనసేన నిజానికి బీజేపీ/ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధంగానే ఉందని, దీని ద్వారా బీజేపీ కుల సంఘాలను ఆకర్షించిందని చెప్పారు. కానీ ముస్లిం లీగ్‌ ‌మాత్రం ఎల్‌డీఎఫ్‌ ‌వెనుకే ఉంది.

కమ్యూనిస్టు నేతలలో ఉండే ఆధిపత్య ధోరణి, నియంతృత్వ ధోరణి ఏ ఇతర ప్రజ సంఘాలలోకాని, రాజకీయ పార్టీలో కాని సాగదు. అలాంటి విమర్శలు పినరయి మీద కూడా తక్కువేమీ కాదు. అటు పార్టీ వ్యవహారాలు, ఇటు ప్రభుత్వం ఆయన ఉక్కు పిడికిలిలోనే ఉంటాయని చెబుతారు. పైగా ఆయన వ్యవహార శైలిని ప్రశ్నించే, నిలదీసే దీటైన ప్రత్యామ్నాయం పార్టీలో లేదు. కేంద్ర నాయకత్వం ఉన్నా నామమాత్రమే. జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరికి ఛాయ్‌ ‌పైసలు, సిగరెట్‌ ‌ఖర్చులు పినరయి సమకూరుస్తారని ఒక ప్రముఖ జర్నలిస్ట్ ‌చెప్పడం విశేషం. అంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన పింఛన్‌దారుల సంగతి, పౌర సరఫరాలలో జరుగు తున్న లోపాల గురించి ఆయన దృష్టికి తీసుకువెళ్లే వ్యవస్థ లేనేలేదు. నిజానికి ఈ అంశాలే పార్టీని నేలమట్టం చేశాయని నాయకులే చెబుతున్నారు.

పినరయి రాజీనామా కోరిన సీపీఐ

 ఈ దారుణ పరాజయానికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ‌రాజీనామా చేయాలని సీపీఐ కోరింది. కేరళ లెఫ్ట్ ‌డెమోక్రటిక్‌ ‌ఫ్రంట్‌లో కీలక భాగస్వామి సీపీఐ. ఫ్రంట్‌కు చిరకాలంగా నాయకత్వం వహిస్తున్నది సీపీఎం. 2024 లోక్‌సభ ఎన్నికలలో కేరళలో ఎల్‌డీఎఫ్‌ ‌తుడిచిపెట్టుకు  పోవడానికి (మొత్తం 20 లోక్‌సభ స్థానాలలోను పోటీ చేసి ఒక్కటంటే ఒక్క సీటు గెలిచింది) ప్రధాన కారణం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అహంకారపూరిత వైఖరేనని సీపీఐ తిరువనంతపురం జిల్లా కౌన్సిల్‌ ఎలాంటి శషభిషలు లేకుండా విమర్శించింది. అళప్పుజ జిల్లా కౌన్సిల్‌ ‌సమావేశం కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయానికే వచ్చింది. పినరయి పదవికి రాజీనామా చేయకపోతే ఎల్‌డీఎఫ్‌ ‌బతికి బట్టకట్టే ప్రశ్నే లేదని కూడా ఆ రెండు సమావేశాలు తేల్చి చెప్పేశాయి. ఈ ఘోర పరాజయం గురించి ఆ రెండు జిల్లాల కౌన్సిళ్లు జూన్‌ 16‌వ తేదీన సమీక్షించాయి.

ఆ పార్టీ (సీపీఎం) మైనారిటీ పక్షపాతం కూడా ఈ ఓటమికి జతయింది అని కూడా సీపీఐ నీళ్లు నమలకుండా విమర్శించింది. ఇటీవలి కాలంలో సీపీఎం వ్యవహరిస్తున్న తీరును సీపీఐ తూర్పార పట్టింది. ‘సీపీఎం బహిరంగ సభలు మతసభలను తలపించాయి. రాజ్యసభకు అభ్యర్థిని కూడా మైనారిటీ వర్గం నుంచే ఎంపిక చేశారు’ అని సీపీఐ విమర్శిం చింది. ముఖ్యమంత్రి పినరయి కుమార్తెపై వెల్లువెత్తిన అవినీతి విమర్శలు, మంత్రుల అసమర్థత కూడా ఓటమికి తోడ్పడినాయని కూడా సీపీఐ స్పష్టం చేసింది. పోలింగ్‌కు కొంచెం ముందు ఎల్‌డీఎఫ్‌ ‌కన్వీనర్‌ ‌వెళ్లి బీజేపీ నాయకుడిని కలవడం కూడా ఫ్రంట్‌ ‌గెలుపు మీద ప్రతికూల ప్రభావం చూపిందని సీపీఐ చెప్పింది. నిజానికి ఇంతకు ముందే సీపీఐ పినరయిని ‘ధోతీ కట్టిన మోదీ’ అని ఎద్దేవా చేసేది. 19 మంది మంత్రులు పినరయి ఛాయలని మాత్రమే ప్రస్తావించేది. ప్రభుత్వోద్యోగులనీ, పింఛన్‌దారులను ప్రభుత్వం పట్టించుకోకపోవడమూ ఓటమికి కారణమేనని ఆ పార్టీ వెల్లడించింది. రాష్ట్రమంతా ముఖ్యమంత్రి పట్ల వ్యతిరేకతతో నిండిపోయిందని అళప్పుజ సమావేశం అభిప్రాయపడింది. బీజేపీని అధికారం నుంచి తొలగించగలిగే స్థితిలో కాంగ్రెస్‌ ఉన్నదన్న అభిప్రాయమే జనంలో ఉన్నదని  ఆ జిల్లా సీపీఐ కార్యదర్శి టీజే అంజలోస్‌ ‌సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని సరైన తోవలో పెట్టేవాళ్లు సీపీఎంలో ఒక్కరు కూడా లేరని నివేదిక మీద మాట్లాడిన నాయకులు విమర్శించారు. ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ప్రత్యర్థులను ‘స్కౌండ్రల్‌’ ‌వంటి పదాలతో తూలనాడడం ఏమిటని కూడా వారు ప్రశ్నించారు. ఎల్‌డీఎఫ్‌ ఓట్లు కేవలం కాంగ్రెస్‌కే కాదు, బీజేపీ ఖాతాలోకి కూడా పోయాయని వారు చెప్పారు.

బెడిసికొట్టిన కేంద్ర వ్యతిరేక ప్రచారం

రాష్ట్రానికి నిధుల కేటాయింపులో కేంద్రం తీవ్ర వివక్ష చూపుతున్నదన్న ఆరోపణతో నిరుడు రాష్ట్ర ప్రభుత్వమే నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అవే ‘నవ కేరళ సదస్సులు’. ఈ సదస్సులకు మొత్తం పినరయి మంత్రిమండలి కట్టకట్టుకుని వెళ్లేది. రోజుకు నాలుగు సభల వంతున 140 అసెంబ్లీ నియోజక వర్గాలలో బహిరంగసభలు జరిపారు. 36 రోజులు సాగిన ఈ యాత్ర నవంబర్‌ 18, 2023‌న కాసర్‌గోడ్‌ ‌దగ్గర మొదలయింది. ఆర్థికమంత్రి కేఎన్‌ ‌బాలగోపాల్‌ ‌కేంద్రం రాష్ట్రానికి రావలసిన రూ. 57,000 కోట్లు కేంద్రం ఆపేసిందని చెబితే, పినరయి ఆ మొత్తాన్ని రెట్టింపు చేసి చెప్పేవారు. ఆ సమయంలోనే కేరళ పర్యటనకు వెళ్లిన నిర్మలా సీతారామన్‌ ‌కేంద్రం కేరళకు ఒక్క రూపాయి కూడా బకాయి లేదని తేల్చి చెప్పారు. ఒకవేళ బకాయి ఉంటే అది లెక్కలు చెప్పకపోవడం వల్ల మాత్రమే ఆగి ఉంటుందని వివరణ ఇచ్చారు.

బుజ్జగింపు ధోరణికి పరాకాష్ట

కేరళలో ఇటు ఎల్‌డీఎఫ్‌, అటు యూడీఎఫ్‌ ‌రెండూ మైనారిటీల బుజ్జగింపులో పోటీ పడుతూ ఉంటాయి. ఈ విషయాన్ని వివరిస్తూ యోగమ్‌ ‌సంస్థకే చెందిన యోగనాథమ్‌ ‌పత్రికలో నటేశన్‌ ఎన్నికల ఫలితాల తరువాత రాసిన వ్యాసం కలకలం సృష్టించింది. యోగమ్‌ ‌కేరళ సంస్కర్త నారాయణ గురు ఆశయాలతో నడుస్తున్న ఈ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధంగా ఉంటుందన్న మాట కూడా ఉంది. అందుకే నటేశన్‌ ‌వ్యాఖ్యలకు ప్రాధాన్యం వచ్చింది. త్రిశూర్‌, అళప్పుజలతో పాటు కొన్ని చోట్ల బీజేపీకి గణనీయంగా ఓట్లు వచ్చాయంటే కారణం ఆ రెండు ఫ్రంట్‌ల బుజ్జగింపు రాజకీయాలే నని నటేశన్‌ అభిప్రాయపడుతున్నారు. ఆ ఫ్రంట్‌ల బుజ్జగింపు వైఖరితో దిక్కుతోచని క్రైస్తవులు ఈసారి బీజేపీ వైపు మొగ్గారని నటేశన్‌ ‌రాశారు. కేరళకు తొమ్మిది రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. అందులో ఐదు ముస్లింలకే ఇచ్చారు. రెండు క్రైస్తవులకు ఇచ్చారు. సీపీఎం, సీపీఐ రెండూ కూడా ముస్లింలకే రాజ్యసభ సభ్యత్వాలు కట్టబెట్టాయి. అయితే పినరయి మితిమీరిన బుజ్జగింపు ధోరణి ప్రదర్శించారని సీపీఐ ఆరోపించడమే వింత. 2024 లోక్‌సభ ఎన్నికలలోను ముస్లింలు, క్రైస్తవులు అధికంగా ఉన్న మలప్పురం, కొట్టాయం ప్రాంతాల లోను ముస్లిం, క్రిస్టియన్‌ అభ్యర్థులనే నిలిపి, హిందువులు అధికంగా ఉండేచోట కూడా ఆ వర్గాల వారికే టిక్కెట్లు ఇచ్చి హిందువులకు మొండి చేయి చూపారని నటేశన్‌ ఆరోపణ. ఆ విధంగా సీపీఎం, సీపీఐ రెండూ హిందువులలోని వెనుకబడిన తరగతుల వారి నైతిక స్థయిర్యాన్ని దెబ్బతీశారని ఆయన వ్యాఖ్యానించారు. స్వయంగా ఎజువా వర్గానికి చెందిన నటేశన్‌ ‌తమ వర్గం ఎల్‌డీఎఫ్‌ ‌హయాంలో ఎలాంటి లబ్ధి పొందలేకపోయిందని ప్రకటించారు. నిజానికి గడచిన అర్ధ శతాబ్దకాలంగా కేరళలో మైనారిటీలే ఆర్థికంగా, సామాజికంగా ముందడుగు వేశారు. హిందువులలో వెనుకబడిన తరగతుల వారు, ఎస్‌సీ, ఎస్టీ వర్గాలు నిర్లక్ష్యానికి గురైనాయి. కేంద్రానికి వ్యతిరేకంగా సీఏఏ వంటి అంశాలకు విపరీత ప్రచారం ఇచ్చి, ముస్లింలను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో సంప్రదాయక ఎజువా వర్గ ఓట్లను సీపీఎం కోల్పోయింది. ఓబీసీలైన ఎజువాలు హిందువులలో పెద్ద సంఖ్యలో ఉన్నారు.

ఒకనాడు దేశంలో మూడు రాష్ట్రాలలో అధికారంలో ఉండి చెలరేగిపోయిన కమ్యూనిస్టులు (సీపీఎం) ఇప్పుడు కేరళకు పరిమితమయ్యారు. ఇప్పుడు లోక్‌సభలో ఆ వామపక్ష శిబిరానికి ఉన్న స్థానాలు తొమ్మిది. వీరి గెలుపు ప్రభావం ఎంతో ఇప్పుడు ఆలోచించే అవసరమే లేకున్నా, ఓటమిలోను కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేరళ వామపక్ష శిబిరంలో ఇంత అల్లకల్లోలం చెలరేగుతూ ఉంటే దేశంలో మీడియా ఎలా గోప్యంగా ఉంచగలిగింది? పినరయి గురించి అహంకారపూరిత ధోరణి అన్న విమర్శ అంత తీవ్ర స్థాయిలో వెల్లువెత్తినా, ఆయన రాజీనామా చేసి పోతేనే మంచిదని సోదర వామపక్ష సంస్థలు ఎలుగెత్తినా  మీడియాలో ఎందుకు రాలేదు? అదే విమర్శ నరేంద్ర మోదీ మీద చాలా తక్కువ తీవ్రతతో వచ్చినప్పటికీ ఎందుకు మీడియా అంతా ఆ రచ్చ? కమ్యూనిస్టులే గోప్యతకు నీళ్లు వదిలేస్తే, ఎర్రకలాలకి ఎందుకు గోప్యత? కమ్యూనిస్టుల శిబిరానికి లేని దురద కలాలకు ఎందుకు? అధికారం ఇచ్చిన పాపానికి కామ్రేడ్ల అహంకారం ప్రజలు మౌనంగా భరించవలసిందేనన్న సందేశం ఇందులో లేదా?

ఎర్ర ఓటు కొల్లగొట్టిన కాషాయం

కేరళలో 20 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో 18 కాంగ్రెస్‌ ‌నాయకత్వంలోని యునైటెడ్‌ ‌డెమోక్రటిక్‌ ‌ఫ్రంట్‌కు దక్కాయి. ఒకటి సీపీఎం, ఒకటి బీజేపీ గెలుచుకున్నాయి. బీజేపీ వరకు ఇది చరిత్రాత్మక విజయం. ఈ ఎన్నికలలో ఎల్‌డీఎఫ్‌ 3 ‌శాతం ఓటు శాతం కోల్పోయింది. నిజానికి ఎల్‌డీఎఫ్‌ ‌ప్రత్యర్థి యూడీఎఫ్‌కు కూడా రెండు శాతం ఓట్లు (2019 ఎన్నికలతో పోలిస్తే) తగ్గిపోయాయి. అయినా 18 సీట్లతో తుడిచిపెట్టేసింది. అయితే ఎల్‌డీఎఫ్‌ ఓట్లను బాగా కొల్లగొట్టిన పార్టీ బీజేపీ. ఈ పార్టీ తన ఓట్ల శాతాన్ని 3.6 శాతానికి పెంచుకోగలిగింది. త్రిశూర్‌లో నటుడు సురేశ్‌ ‌గోపీ గెలిచారు. నిజానికి శాసనసభ నియోజకవర్గాల ప్రాతిపదికగా ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే 18 లోక్‌సభ స్థానాలలో బీజేపీ ఆధిక్యం చూపింది. ఇందులో 11 చోట్ల 2021 అసెంబ్లీ ఎన్నికలలో ఎల్‌డీఎఫ్‌ ఆధిక్యం చూపింది.

‘భారతదేశ గోర్బచెవ్‌ ‌పినరయి’

సీపీఎం రాష్ట్ర కమిటీ మాజీ సభ్యుడు, పార్టీ పత్రిక ‘దేశాభిమాని’ మాజీ అసోసియేట్‌ ఎడిటర్‌, ‌పార్టీ బహిష్కుృతులలో ఒకరు అప్పుకుట్టం వల్లికున్ను లెఫ్ట్‌ఫ్రంట్‌ ఓటమి తరువాత ‘ది న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ (‌జూన్‌ 9, 2024)‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోని కొన్ని అంశాలు:

భారత రాజకీయ చిత్రపటంలో వచ్చిన పెద్ద మార్పు 2024 లోక్‌సభ ఎన్నికలలో ప్రతిబింబించిం దని వల్లికున్ను అన్నారు. స్వతంత్ర భారతదేశంలో జరిగిన రెండు లోక్‌సభ ఎన్నికలు చరిత్రాత్మక మైనవని, అందులో మొదటివి అత్యవసర పరిస్థితి తరువాత జరిగివని కాగా, రెండో ఎన్నికలు ఇవేనని ఆయన వ్యాఖ్యానించారు. ఒక ఉదాహరణతో దీనిని వివరించారు. పున్నపారా-వయలార్‌ అనే ప్రదేశానికీ కమ్యూనిస్టులకీ అవినాభావ సంబంధం ఉంది. 1957లో ఈఎంఎస్‌ ‌నంబూద్రీ నాయకత్వంలో ప్రభుత్వం(భారతదేశంలో తొలి వామపక్ష ప్రభుత్వం) ఏర్పడినప్పుడు, ప్రమాణస్వీకారోత్సవానికి ముందు మంత్రిమండలి అక్కడికి వెళ్లి తిరుగుబాటులో పాల్గొన్న అమరులకు పుష్పాంజలి ఘటించింది. ఈ ఎన్నికలలో అక్కడ లెఫ్ట్ ‌తుడిచిపెట్టుకుపోవడమే కాకుండా, బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. కన్నూర్‌లో కూడా కమ్యూనిస్టు పార్టీ తరఫున పోరాడి అమరులైన వారు ఉన్నారు. అక్కడి చాలా ఎర్రకోట లలో బీజేపీ అగ్రస్థానానికి ఎగబాకింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తరఫున ప్రధాన పోటీదారుగా ఉంటానని నటుడు సురేశ్‌ ‌గోపీ ప్రకటించడం కూడా ప్రత్యేకంగా చూడవలసిన అంశమేనని వల్లికున్ను అభిప్రాయపడ్డారు. సురేశ్‌గోపి అలా ప్రకటించగలి గారు అంటే, రాష్ట్రంలోని చాలా కమ్యూనిస్టు కోటల మీద బీజేపీ రాజకీయంగా ప్రభావాన్ని చూపడం ఆరంభించందనే చెప్పాలని అన్నారు. ఈ లోపాలను సరిదిద్దుకుని పార్టీ ముందుకు వెళుతుందని తాను విశ్వసించడం లేదని ఆయన తెగేసి చెప్పారు. ఎందుకంటే, తప్పులేమైనా జరిగి ఉంటే దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని మాత్రమే ముఖ్యమంత్రి ఫేస్‌బుక్‌లో చెప్పారు. దీని అర్ధం ముఖ్యమంత్రి తన తప్పును తాను తెలుసుకోలేదనే అనాలని అభిప్రాయ పడ్డారాయన.

సీపీఎం నేతలు, కేరళలో పార్టీ పరిస్థితి గురించి మీ అభిప్రాయం ఏమిటి అన్న ప్రశ్నకు వల్లికున్ను సమాధానం తీవ్రంగానే ఉంది.

కేరళలో (పార్టీ) పరిస్థితి ప్రమాదకరంగానే ఉంది. కేరళ సీపీఎంలో కనిపించే అతి చిత్రమైన విషయం- పదిహేనేళ్లు పినరయి విజయన్‌ ‌పార్టీ కార్యదర్శి. గడచిన ఎనిమిదేళ్లుగా వామపక్ష ప్రభుత్వా నికి నాయకత్వం వహిస్తున్నది కూడా ఆయనే. అటు ప్రభుత్వాన్నీ, ఇటు పార్టీనీ శాసిస్తున్నది ఆయనే. కానీ పినరయి పట్ల విశ్వసనీయత అధ:పాతాళానికి పోయింది. అది సిద్ధాంతపరమైన కారణాలతో జరగలేదు. అవినీతి వల్లనే. ముఖ్య మంత్రికీ, ఆయన కుమార్తెకు వ్యతిరేకంగా న్యాయ సంఘానికి బలమైన సాక్ష్యాలే దొరికాయి. అయితే దీని మీద అంతిమ తీర్పు ఎలా వస్తుందో అది వేరే విషయం. అయినా పినరయి మీద అవిశ్వాస తీర్మానం రాలేదు. ఇక్కడ మనం అర్ధం చేసుకోవలసినది కేరళలో ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం విశ్వసనీయత అంతా అవినీతికి వ్యతిరేకంగా నిలిచినందుకే.

ప్రధాని నరేంద్ర మోదీ చూపించిన మర్యాదను కూడా పినరయి తన అక్రమాలను దాచిపెట్టడానికి కవచంగా వాడుకునే ప్రయత్నం చేశారని వల్లికున్ను మాటల ద్వారా తెలుస్తుంది. అయితే ఇంకో రెండా కులు ఎక్కువ చదివిన మోదీ పినరయి నాటకాన్ని బయటపెట్టిన రీతి ఎలాంటిదో కూడా వల్లికున్ను మాటలలోనే గమనించవచ్చు. 2016లో గెలిచి ముఖ్యమంత్రి అయిన తరువాత పినరయి ప్రధాని మోదీని కలుసుకోవడానికి వెళ్లారు. అప్పుడే మోదీ, ప్రధాని నివాసాన్ని మీ నివాసంగా భావించమని చెప్పినట్టు పినరయి చెప్పుకున్నారు. అయితే బంగారం స్మగ్లింగ్‌ ఎలా జరిగిందో అందరికీ తెలుసునని గడచిన అసెంబ్లీ ఎన్నికలలో మోదీ ధ్వజమెత్తారని వల్లికున్ను గుర్తు చేశారు. అంతేకాదు, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో అయితే ఇంకో అడుగు ముందుకు వేసి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏం జరిగిందో (స్మగ్లింగ్‌లో) అందరికీ తెలుసుననే ప్రధాని విమర్శించా రని వల్లికున్ను గుర్తు చేశారు.

నరేంద్ర మోదీ, పినరయి విజయన్‌ల సమావేశం కేవలం ముఖ్యమంత్రి, ప్రధాని మధ్య మర్యాద పూర్వక సమావేశంగా చూడలేమని వల్లికున్ను అభిప్రాయపడడం విశేషం. ఒక వాస్తవమైన ఆధారంతో చెబుతున్నాననీ, మోదీ అజెండాయే పినరయి అమలు చేస్తున్నారని వల్లికున్ను నిద్ద్వంద్వంగా ప్రకటించారు. అంతేకాదు, పినరయి విజయన్‌ ‌కేరళ గొర్బచెవ్‌ అనుకోవచ్చునా అంటే, కేరళకు మాత్రమే కాదు, భారత్‌కే గొర్బచెవ్‌ అనుకోవచ్చునని కుండ బద్దలుకొట్టారు.

-జాగృతి డెస్క్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE