ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తున్నా, రవాణా ఛార్జీలు పెంపు చిన్నపాటి గృహ యజమానులకు భారంగా మారింది. వర్షాకాలం కావడంతో వరదల వల్ల నదులు, వాగులు, కాలువల్లో ఇసుక తవ్వే అవకాశం లేకపోవడంతో ఇప్పటికే డంప్‌ చేసిన ఇసుకకు భారీగా డిమాండ్‌ పెరిగింది. ఇసుక పరిమితం కావడం, డిమాండ్‌ అధికంగా ఉండటంతో ఇసుక లభ్యత కష్టం అయిపోయింది. రీచ్‌ల వద్ద ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నా, రవాణా ఖర్చులు మాత్రం భారంగా మారాయి. లారీలు, ట్రాక్టర్లు ఉన్న కొందరు యజమానులు తమ బంధువుల ఆధార్‌ కార్డులు తీసుకుని లోడిరగ్‌ ఖర్చుల నిమిత్తం ప్రభుత్వానికి నగదు చెల్లింపులు చేసి ఇసుకను అధిక ధరలకు అమ్ముకుం టున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చిన్న చిన్న ఇళ్లు కట్టుకుందా మనుకునేవారు అధిక ధరలకు కొనలేకపోతున్నారు. ఈ సమస్యకు ప్రభుత్వమే పరిష్కారం చూపాలి. గత ప్రభుత్వ హయాంలోనూ, ఇప్పుడూ ఇసుకను తోలేది ఈ లారీలు, ట్రాక్టర్లే. ఇసుకను బ్లాక్‌మార్కెట్‌లో అమ్మేందుకు ప్రోత్సహించింది వైసీపీ  ప్రభుత్వమే. ప్రభుత్వం ఇసుకను అధిక ధరలకు అమ్మితే వాహనాల యజమానులు కూడా కలసి రవాణా ఛార్జీలు పెంచేశారు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఉచితంగా ఇసుకను సరఫరా చేసే ప్రభుత్వం రవాణా ఛార్జీలపై కూడా నియంత్రణ విధించాలి. అలాగే ఇసుక అక్రమంగా రవాణా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు ఇసుక లభ్యత జరిగే సీజన్‌ను బట్టి స్టాక్‌ పాయింట్ల వద్ద టన్ను ఇసుక రూ.675 నుంచి రూ.800 తీసుకున్నారు. దీనికి అదనంగా స్టాక్‌ పాయింట్లవద్ద సిబ్బంది, అధికారులకు లంచాలు ఇవ్వాల్సివచ్చేది. వెరసి టన్నుకు రూ. వెయ్యి ఖర్చయ్యేది. నాలుగున్నర టన్నుల నుంచి 5 టన్నుల పట్టే ట్రాక్టరు ఇసుకకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ఖర్చయ్యేది. దీనికి రవాణా ఖర్చులు అదనం. వర్షాకాలం డిమాండ్‌ అధికంగా ఉన్నప్పుడు రూ.10 వేలకు తక్కువకు దొరికేది కాదు. 6 చక్రా లుండే లారీలో పది టన్నులు ఇసుకను కూడా ఇలాగే డిమాండ్‌ను బట్టి రూ. 15 వేల నుంచి రూ. 25 వేల వరకు అమ్మారు. 10 చట్రాలుండే లారీలో 18 నుంచి 20 టన్నులు పట్టే ఇసుకను రూ. 35 వేల నుంచి రూ.50 వేల వరకు అమ్మారు. అసలు వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చాక కొత్త ఇసుక విధానం అమలు చేస్తామని చెప్పి జూన్‌ నుంచి ఇసుకను అందకుండా చేసింది. నాలుగైదు నెలలకు ఇసుక విధానం ప్రకటించినా తర్వాత వర్షాకాలం వచ్చింది. 2020 ఫిబ్రవరి వరకు వరదలు కొనసాగు తూనే ఉన్నాయి. దాంతో పది నెలల పాటు ఇసుక లభ్యత కష్టమైపోయింది. దీనిని అసరాగా తీసుకుని వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు ఇసుకను బ్లాక్‌ మార్కెట్‌లో రెట్టింపు ధరలకు అమ్మారు. ప్రజల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం మరల నాలుగుసార్లు ఇసుక విధానం మార్చింది. చివరికి జేపీ వెంచర్స్‌ అనే కాంట్రా క్టరుకు అప్పగించింది.

వైసీపీ అధికారంలో ఉన్న అయిదేళ్లు ఇసుకకు కొరత ఏర్పడటంతో భవన నిర్మాణాలు జరగలేదు. ఈ రంగంపై అధారపడిన 20 రకాల కార్మికులు ఉపాధి కోల్పోయారు.

కూటమి సర్కారు హామీ

ఇసుక లభ్యత సమస్యను గుర్తించిన కూటమి ఇసుకను ఉచితంగా ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఎన్నికల్లో గెలిచాక ఈ హామీని అమలు చేసేందుకు కూటమి సర్కారు మధ్యంతర ఇసుక విధానాన్ని ప్రకటిస్తూ జీవో నం.43ను జారీ చేసింది. దీంతో ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇది పూర్తిస్థాయి విధానం కాదు. త్వరలో సమగ్ర విధానం రానుంది. వర్షాకాలం రావడంతో కొత్తగా రీచ్‌లలో తవ్వకాలు జరిపే అవకాశం లేదు. వరదలు ఆగేవరకు భవన నిర్మాణాలకు ఆటకం ఏర్పడరాదని భావించిన ప్రభుత్వం రీచ్‌లలో నిల్వ ఉన్న 48 లక్షల టన్నుల ఇసుకను పంపిణీ చేయాలని నిర్ణయిం చింది. ఈ మేరకు జూలై 9 నుంచి ఇసుకను ఉచిత పంపిణీ ప్రారంభించింది. ప్రైవేటు అమ్మకాలు, అడ్డగోలు అక్రమ నిల్వలు, బ్లాక్‌ మార్కెటింగ్‌, అక్రమ రవాణాను చట్టబద్ధంగా అరికట్టేలా మార్గదర్శకాలు ఇచ్చారు. ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో గత సర్కారు తీసుకొచ్చిన 2019, 2021 ఇసుక విధానాలను ప్రభుత్వం ఉపసంహరింది. దీని ప్రకారం ఇసుక అమ్మకాల కాంట్రాక్టు రద్దయింది. అలాగే, 18 జిల్లాల్లో ప్రతిమ ఇన్‌ఫ్రా, ఎనిమిది జిల్లాల పరిధిలో జీసీకేసీ కంపెనీలతో గనుల శాఖ అప్పట్లో కుదుర్చుకున్న ఇసుక తవ్వకాలు, అమ్మకం కాంట్రాక్ట్‌ కూడా రద్దయిపోయింది. అయితే, ఆ ఒప్పందం నుంచి తామే స్వచ్ఛందంగా వైదొలగుతా మని ఆ రెండు కంపెనీల ప్రతినిధులు` గనుల శాఖ డైరెక్టర్‌ను కలిసి లిఖితపూర్వక నివేదిక ఇచ్చారు. వాటి నియంత్రణలో ఉన్న ఇసుక డంప్‌లను, స్టోరేజీ యూనిట్లను రెవెన్యూ అధికారుల సమక్షంలో గనుల శాఖ స్వాధీనం చేసుకుంది.

ఇసుక ఉచితమే కాని…

ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తోంది. ఇసుకను వాహనాల్లో లోడిరగ్‌ చేయడానికి, ఇంటి వద్దకు రవాణా చేసుకోడానికి అయ్యే ఖర్చును వినియోగదారులే భరించాలి. రీచ్‌ల వద్ద టన్ను ఇసుక లోడిరగ్‌కు రాజమండ్రిలో రూ.270 వసూలు చేస్తున్నారు. ఇసుక తవ్వకం, లోడిరగ్‌ రూ.30, రీలోడిరగ్‌కు రూ.30, సీనరేజీ రూ.66, జీఎస్టీ 18 శాతం, డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ (డీఎంఎఫ్‌) రూ.19.68, మెరిట్‌(ఖనిజాన్వేషణ నిధి) 2 శాతం, ర్యాంపు నుంచి స్టాక్‌ పాయింట్‌కు రవాణా చార్జీలు కలిపి మొత్తం టన్ను ఇసుక ధర రూ.270గా నిర్ణయించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రూ.290 ఛార్జి చేస్తున్నారు. ట్రాక్టరుకు నాలుగున్నర టన్నులంటే రూ.1,300 వరకు అవుతుంది. ప్రస్తుతం కంచిక చర్లలో ట్రాక్టరు ఇసుక రూ.2 వేల నుంచి రూ.2500 (యార్డు నుంచి రవాణా కలుపుకుని) పడుతోంది. అంటే రూ.700 నుంచి రూ.1,200 వరకు మాత్రమే దూరాన్ని బట్టి రవాణాకు ఖర్చవుతుంది.

స్టాక్‌ పాయింట్ల వాహనాల బారులు

రాష్ట్రంలోని అన్ని ఇసుక స్టాక్‌ యార్డుల వద్ద ఇసుక కూపన్ల కోసం వినియోగ దారులు బారులుతీరారు. ఇసుక కోసం వచ్చిన వారికి అధికారులు ముందుగా కూపన్ల పంపిణీ చేపట్టారు. టన్ను రూ.270 నుంచి రూ.290లకే ఇసుక లోడిరగ్‌ చేస్తుండటంతో వినియోగదారులు పోటెత్తారు. దీంతో స్టాక్‌ యార్డు వద్ద భారీ క్యూ దర్శనమిస్తోంది.

రాజమహేంద్రవరం రూరల్‌, కొవ్వూరు, నిడదవోలు, కడియపులంక, వేమగిరి, కాతేరు, కాకినాడ జిల్లా కరప మండలం ఉప్పలంక, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం, కపిలేశ్వరపురం, తాతపూడి,ఎన్‌టిఆర్‌ విజయవాడ జిల్లాలో గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, నందిగామ, కృష్ణా జిల్లా అప్పారావుపేట, లంకపల్లి, తోట్లవల్లూరు, నెల్లూరు జిల్లా పల్లిపాడు, నెల్లూరు జిల్లాలో కడనూతల, నరసింహపురం, వెంకటాచలం, మర్రిపాడు, నెల్లూరుపాళెం, సంగం, అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం జుంజురంపల్లి సమీపంలో వేదావతి హగరి నది వద్ద, శ్రీసత్యసాయి జిల్లాలో, పెనుకొండ, చిత్తూరు మండలం దిగువ మాసపల్లి, గంగవరం మండలం బైరెడ్డిపల్లి క్రాస్‌ రోడు, కర్నూలు జిల్లా కౌతాళం మండలం గుడికంబాళి, పల్నాడు జిల్లా కొండమోడు, వినుకొండ, తాళ్లాయపాలెం, వైఎస్సార్‌, అన్నమయ్య జిల్లాల్లోని రీచ్‌లకు ప్రాంతాల నుంచి లారీలు, టిప్పర్లు క్యూలు కట్టాయి. జాతీయ రహదారిపై రెండు వైపులా వాహనాలు బారులు తీరాయి. అయిదురోజుల నుంచి అర్ధరాత్రి నుంచి స్టాక్‌ యార్డు వద్ద లారీలు, టిప్పర్లు వందల సంఖ్యలో వేచి ఉంటున్నాయి.

వాహన యజమానుల సిండికేట్‌

ఒకపక్క ఇసుక ఉచితంగా లభిస్తున్నా రవాణా ఖర్చు మాత్రం పెరిగిపోయిందని, నాలుగున్నర టన్నుల ఇసుకను ట్రాక్టరులో 30 కి.మీ.దూరానికి తీసుకువచ్చేందుకు రూ.5 వేలు వసూలు చేస్తున్నట్లు కొందరు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అయితే యార్డు వద్ద ఇసుక కోసం క్యూలో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నందున రవాణాకు కిరాయి ఎక్కువ తీసుకుంటున్నామని వాహనాల యజమానులు చెబుతున్నారు.

ఇదిలాఉంటే, పలు స్టాకు యార్డులో ఇసుక మాయమైపోయిందని ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల సమయంలో యార్డుల వద్ద పెద్దగా నిఘా లేకపోవటంతో మే నెల ప్రారంభంలో అక్రమార్కుల కళ్లు స్టాక్‌ యార్డులపై పడ్డాయి. ఎలాంటి అనుమతులూ లేకుండానే జేసీబీలతో లారీలకు, ట్రాక్టర్లకు లోడిరగ్‌ చేసి, ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి. పోలింగ్‌ ముగిసిన తర్వాత కూడా ఇసుక లూటీ జరుగుతూనే ఉందంటున్నారు. బాపట్లలో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ సోదరుడు ప్రభుదాస్‌ ఇసుకను అక్రమ తరలింపును ఇంకా కొనసాగించడంతో స్థానికుల అడ్డుకున్నారు. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని చోట్ల కూటమి ఎమ్మెల్యేలు కూడా ఇసుకను మాయం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

మరోవంక, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై ప్రభుత్వం కొరడా ఘళిపించబోతోంది. దీనికోసం భారీగా పెనాల్టీలను విధించేందుకు సిద్ధమైంది. వే బిల్లులు లేకుండా ఇతర ప్రాంతాలకు ఇసుక తరలిస్తూ వాహనాలు పట్టుబడితే అధికారులు భారీగా పెనాల్టీలు విధించనున్నారు. మొదటిసారి రూ.పది వేలు, రెండోసారి పట్టుబడితే రూ.10,001 నుంచి రూ.20 వేల వరకు, పది టైర్ల లారీకి రూ.25 వేలు, రెండోసారి పట్టుబడితే రూ.25,001 నుంచి రూ.50 వేల వరకు, పది టైర్లు పైబడిన లారీలకు, యంత్రాలకు మొదటిసారి రూ.50 వేలు, రెండోసారి పట్టుబడితే రూ. 50,001 నుంచి రూ.లక్ష వరకు పెనాల్టీ విధించనున్నారు.

 – టిఎన్‌. భూషణ్‌, సీనియర్ జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE