21 ‌జూలై గురుపూర్ణిమ

భారతీయ సంస్కృతిలో త్యాగవైరాగ్యాలకూ, జ్ఞాన బలోపాసనలకూ సమ ప్రాధాన్యం ఇచ్చారు. ఈ భావాలకు ప్రతీకప్రాయులుగా, నిలయాలుగా, ప్రచారకులుగా వెలుగొందిన సన్యాసులను, విరాగులను పూజించి తమ జన్మ తరించిందని భావించేవారు. ఆ సముద్ర పర్యంతం భూమిని ఏకచ్ఛత్రంగా పరిపాలించిన చక్రవర్తులు; సమ్రాట్టులు కూడా కేవలం ఈ భావానికి ప్రత్యక్ష రూపులైన వీతరాగ సన్యాసులను పూజించడమేగాక, గృహస్థ, వానప్రస్థానాలనంతరం తాము కూడా సన్యసించి ఈ త్యాగవైరాగ్యాది భారతీయ ధర్మదర్శాలను ప్రచారించి ముక్తిని పొందేవారు.

ఈ నాటికీ మన జాతిలో ఆ భావం నశించిపోలేదు. ఆ భావమే సజీవంగా నిలిపింది. గత వేయేండ్లలో బాధలెదిరించినపుడు మాత్రమే కష్టపడి, సుఖశాంతుల సమయంలో జాతి రక్షణకు తిరిగి విస్మరించినా ఈ త్యాగ వైరాగ్య భావాలను నేల నాలుగు చెరగుల నిర్మించిన సన్యాసులు, విరాగులు, వీరులే ఈ దేశాన్ని కాపాడారు. ఎక్కడివాడైనా, ఎవరైనా – ఎటువంటివాడైనా మరో ప్రశ్న లేకుండా కాషాయాంబరధారిని పూజిస్తారు ప్రజలు. ఆనాడు అలాంటి వ్యక్తులు తమ తపస్సువల్ల, తీవ్ర ప్రయత్నం వల్ల దేశమంతటా ఈ సంస్కృతీ ప్రవాహాన్ని నింపారు. ఎటు చూచినా రెండు వేల మైళ్ల పొడవు, రెండువేల మైళ్ల వెడల్పు కలిగిన ఈ విశాల భూమిలో, 20వేల సంవత్సరాల అతి ప్రాచీన చరిత్రలో ఈ మహానుభావులు దేశాన్ని, ప్రజలను, ఏకీకృతం చేసి, రాష్ట్రాన్ని పటిష్ఠం చేయడానికి చేసిన తపస్సు వల్లనే నేటికీ కాషాయాంబరధారులైన మహాపురుషులంటే గౌరవం ఉన్నది.‘కరతలభిక్షా – తరుతలశయ్యా’ అరచేత రెండు ముద్దలన్నం తినడం – ఏ చెట్టునీడనో పడుకోడం- ఇదీ వారి జీవనం.

ఇలాంటి కఠోర వ్రతధారులైన సన్యాసులే ఈ దేశంలో సనాతనమైన, శాశ్వతమైన మన ఏకాత్మ జీవనాన్ని నిర్మించారు. తమ ప్రతి రక్త బిందువును పిండి దేశానికీ, ధర్మానికి సేవచేసేందుకు ఏ ఉదాత్త ఆదర్శం ఈ మహాపురుషులకు స్ఫూర్తి వచ్చింది? ఆ త్యాగవైరాగ్య భావమే! ఆ భావానికి ప్రతీకయే కాషాయం. అందుకే కాషాయం అంటే రాష్ట్రాత్మకు చిహ్నంగా రూపొందింది. ఆ కాషాయ ధ్వజం భగవాధ్వజంగా రూపొందింది.

‘‘ఈశాంవో వేద రాజ్యం,

త్రిషన్ధే! అరుణైః కేతుభిః సహ

యే అంతరిక్షే, యేదివి,

పృధివ్యాం యే చ మానవః’’                   (అధర్వణవేదం)

(ఓ నిర్మోహి ప్రాణులైన వీరులారా! మీ మీ అరుణ ధ్వజాలను తీసుకొని శత్రువులను తురుమాడడానికి ఒక్కుమ్మడిగా ఆక్రమణ చేయండి.) అని హెచ్చరించుకున్నారు. దేశరక్షణకు మీరర్పించే రక్తాన్ని, ఆ త్యాగాన్ని గుర్తుకు తెచ్చే పతాక నారాధించనున్నారు. (కేతుః ఆరుషం రుజధ్యైః)

ఈ ఆభేదభావం – సమన్వయభావం వేదకాలం నుండి నేటివరకు మన సంస్కృతిలో కన్పిస్తూనే ఉన్నది. మానవ జీవన లక్ష్యాన్ని వివరించేటప్పుడు అన్నిచోట్లా ఇదే భావం కనిపిస్తుంది.

ఈశోపనిషత్తులో ఈ విషయాన్ని వివరిస్తూ ఐహికమైనా, ఆధ్యాత్మికమైనా- ఏదో ఒక మార్గాన్ని మాత్రమే అనుసరించడం గుడ్డితనం అని ప్రబోధిం చారు. ఇదే భారత రామాయణాదుల్లో, సమస్త సాహిత్యంలో కన్పిస్తుంది. ఇందరు వీరులకు తమ రుధిరధారలను కురిపించే పాఠం నేర్పింది ఈ త్యాగవైరాగ్య భావాల ప్రతీకమైన కాషాయమే, ఈ భగవాధ్వజమే.

ఇలా కర్మయోగంతో ఆత్మవికాసం చేసుకొంటూ, గుణసాధనతో, పరిశ్రమతో, ఆధ్యవసాయంతో ఈ పాంచభౌతిక సుఖాల కామాన్ని వదలి ఆత్మకూ, మేధస్సుకూ, శరీరానికీ సమాన ప్రాముఖ్యాన్నిచ్చే పాఠాన్ని కేవలం మన సంస్కృతి మాత్రమే నేర్పు తుంది.

అలాంటి మహత్తరమైనదీ ధ్వజం. వేదకాలం నుంచి భారతకాలంవరకిదే మనకేకైక చిహ్నం. మన సంస్కృతి మధ్యవర్తితత్వాన్ని, సమన్వయ తత్వాన్ని, ప్రకటించేది ఈ ధ్వజమే. విరాగులీధ్వజాన్ని ధరించి సాంస్కృతిక ప్రవాహాన్ని ప్రవహింపజేశారు. వీరులు దీనిని కాపాడారు. ధనాఢ్యులు దీనిని అభ్యున్నత పథాల నడిపించారు. నేడు ఇన్ని భేదా లున్నా ఆ పునీత ఆదర్శాల అడుగు జాడలలో సమాజాన్ని సంఘటించడానికి అనుకూల పరిస్థితులు లేకపోయినా, కాలగతివలన చైతన్యం డీలాపడినా మన ఈ సంస్కృతీ సంరక్షణకై ప్రజలు చూపిన తత్పరత అనూహ్యమైనది.

మహమ్మదీయ యుగంలో, ఆంగ్లేయ యుగంలో ఎన్నిసార్లు ఎన్ని రూపాల్లో మన సమాజాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నాలు జరిగినా, ఎన్ని దురాక్రమణలు జరిగినా ఈనాటికీ అన్ని విధాల దురాక్రమణల నెదిరించి కోటానుకోట్ల ప్రజలు ఈ ఆదర్శాన్ని పాటించేవారున్నారంటే కారణమీ పునీత ఆదర్శమే. ఈ ఆదర్శాన్ని స్వీకరించి ప్రజలలో చైతన్యాన్ని నిలపడానికి శంకరాదులు, సమర్థ గురుజ్ఞాన దేవాదులు జ్ఞాన ప్రవాహాన్ని ప్రవహింపచేశారు. సూరదాస్‌, ‌తులసీదాస్‌, ‌తుకారాం, త్యాగరాయాదులు భక్తి సాగరాన్ని మథించి జాతి రక్షణకు అమృత పయస్సుల నిచ్చారు. ఎందరో మహాపండితులు, కవులు ఎన్నో దివ్యగ్రంథాలు విరచించారు.

అహర్నిశలు ఉత్తమోత్తమమైన కావ్యసాధన చేసినా చివరకు తమ పేరు కూడా పెట్టుకోని మహానుభావులెందరో ఉన్నారు. వారి రచన లీనాటికి జాతికి కోటి రక్షలై వెలు గొందుతున్నాయి. అష్టాదశ పురాణాలు, అనేక స్తోత్రాలు, అనేక కావ్యాలు. ఎవరో రచయిత? ఎంత త్యాగమది? పేరాశించకుండా జీవితాన్ని ధారవోసి మన జీవిత ధారను ప్రవహింపచేసిన పుణ్యమూర్తులు.

ఇందరికీ స్ఫూర్తినిచ్చింది, సమాజసేవకై సర్వమర్పింపనేర్పింది, మన త్యాగ వైరాగ్యయుక్తమైన జ్ఞానంలో పాసనాయుక్తమైన ఆదర్శమే. ఆ ఆదర్శరూపమైన మన కాషాయ ధ్వజమే! ఇది అనాదియైనది! దీని శీతలచ్ఛాయలో నిరాశకు తావు లేదు. బాధలడ్డవు. ఆకలి దప్పులీ సంస్కృతీ ప్రవాహాన్ని అడ్డగించలేవు.

మొన్నమొన్నటి విప్లవయుగం దాకా మనకీ ప్రవాహం కన్పిస్తుంది. ‘వాసాంసి జీర్ణాని యధావిహాయ’ అనే తత్వంతో శరీరమోహం వదలి ఒకచేత పునీత భగవద్గీతనూ, మరొకచేత పిస్తోలునూ ధరించి విజాతీయ ప్రభుత నెదిరించిన ఆ యువక వీరులకు స్ఫూర్తినిచ్చింది ఈ పవిత్ర ధ్వజరూపంలో వెలుగొందిన త్యాగవైరాగ్య, జ్ఞాన బలోపాసనల దివ్య ఆదర్శమే.

నేటికీ ఈ భావాన్ని ఈ వెలుగును ఇచ్చి దేశమంతటా లక్షల కొలదిగా హైందవ సంఘటనకై ప్రయత్నిస్తున్న తరుణ వీరులకు స్ఫూర్తికేంద్రమిదే!

అలా నాటి నుంచి నేటివరకూ మన రాష్ట్రానికీ, మన సంస్కృతికీ, మన సమస్త జీవితానికి మూలధారగా ప్రవహించిన త్యాగవైరాగ్య, జ్ఞాన బలోపాసనలకు ప్రత్యక్ష రూపమైన భగవాధ్వజమే మన జాతికి ప్రాణంగా, చిహ్నంగా నిలిచింది. దీని నీడలో నిర్మించిన శిల్పం జాతీయ శిల్పం! దీని ఛాయలో రచించిన సాహిత్యం జాతీయ సాహిత్యం! దీని నీడన జరిగిన ప్రతిక్రియా కలాపం రాష్ట్రీయ కర్తవ్యం!

దీన్ని ఆరాధించి జీవితంలో రూపొందించుకున్న నాడే ఈ భారత రాష్ట్రం ప్రబల రాష్ట్రంగా నిలువగలుగుతుంది. దీన్ని మహోత్తుంగంగా ఎగురవేయడానికి త్యాగవైరాగ్య, జ్ఞాన బలాలను ఉపాసించినపుడే మన రాష్ట్రం గౌరవశాలిగా అభ్యుదయ శిఖరాలను ఆరోహించగలుగుతుంది.

(బాబాసాహెబ్‌ ఆప్టే ఉపన్యాసం ఆధారంగా

‘పరశు’ రాసిన వ్యాసం. జాగృతి/ 8.7.1955)


భారతీయ సంస్కృతిని రక్షిస్తున్నది కాషాయ జెండా

భారతీయ జీవితానికి గురుస్థానంలో అలంకరింపదగిన ధర్మాచార్యులు, తను మనోధనాల ధర్మస్థాపనకై, సమాజసేవకై, అఖిల మానవోద్ధరణకై పాటుపడిన గురుమూర్తులు ఎందరో ఉన్నారు. కానీ వ్యక్తిని గురుస్థానంలో సమాజమంతటికీ భారతజాతి ఇంతవరకు స్వీకరించలేదు. దోషరహితమై, త్యాగమయ జీవితానికి ఏకైక చిహ్నమై, భారతీయ సంస్కృతికి పవిత్ర ప్రతీకమై వెలుగొందిన భగవద్ధ్వజాన్ని భారతజాతి తన గురుస్థానంలో నిలుపుకున్నది.
వ్యక్తి జీవితం అపరిపూర్ణంగావచ్చు, దోషరహితం కాకపోవచ్చు, కానీ సమస్త భారత జాతి జీవితానికి యుగాల నుంచి దుఃఖంలో, సుఖంలో, సుషుప్తిలో జాగ్రదావస్థలో పవిత్ర స్ఫూర్తిని ప్రసాదించిన పరమ పవిత్ర భగవాధ్వజాన్ని స్వీకరించి భారతజాతి తన తపస్సాధనకు ఫలితాన్ని పొందింది. ఆ ధ్వజం మ్రోల మోకరిల్లి మహర్షులు వేదగానామృతంతో దశదిశలను అమృతమయమొనరించారు. ఆ ధ్వజ సాన్నిధ్యంలో సగరాది షట్చక్రవర్తులు ‘త్యాగేనైకే అమృతత్వ మానశుః’ అన్న పాఠాన్ని నేర్చుకొని మానవునికీ, స్వర్గానికీ నిచ్చెనల కట్టారు. వీర శిరోమణులు ఈ ధ్వజచ్ఛాయలలో, దేశ స్వాతంత్య్రాన్ని హరించవచ్చిన దుష్టశక్తులను తరిమి తరిమి భారతిని స్వతంత్ర దేవిగా ప్రపంచానికి జ్ఞానదాయినిగా చేశారు. ఈనాటికీ హిందూజాతికి ధర్మచిహ్నంగా, భారతీయ సంస్కృతికి పరమపవిత్ర ప్రతీకగా వెలుగొందుతోంది.
సర్వ మానవ సమానత్వాన్నీ, సర్వ మానవ సౌభాతృత్వాన్ని ప్రపంచంలో నెలకొల్పిన భారతజాతి ఆత్మవిస్తృతివల్ల పరాధీనమైంది. పరప్రభుత్వంతో పరధర్మం, పరసంస్కృతి మన నెత్తికెక్కాయి. స్వరూపంలో వినా మరెందునా భారతీయత కాన్పించని దుస్థితి ఏర్పడింది. అప్పుడే శివాజీ, మహారాణాలాంటి త్యాగధనులు మరల ఈ ధ్వజాన్ని ఆకాశాన ఎగిరించారు. ఈ ధ్వజచ్ఛాయలో మొగలు సామ్రాజ్యాన్ని తుత్తునియలు చేసి సమాజాన్ని, ధర్మాన్ని రక్షించారు. కష్టాల నెదుర్కొనవచ్చు, సుఖాల ననుభవించవచ్చు. కానీ అన్ని పరిస్థితిలోనూ జాతి జీవితం కుంటుపడ్డప్పుడల్లా ఉత్సాహాన్నిచ్చి, నరనరాలలో కవోష్ణరక్తాన్ని ఉప్పొంగచేసి, సమరభూమికి నడిపించిన స్ఫూర్తిదాత ఐన ధ్వజాన్ని విస్మరించిన నాటి నుండే మన స్వత్వ విస్మృతి కూడా సంభవించింది. తత్పరిణామమే ఈనాటి సర్వ విస్మృతి.
గురుపూజ పర్వదినాన మళ్లీ మన పవిత్ర గురుమూర్తి మ్రోల మోకరిల్లి ఇన్నాళ్ల విస్మృతిలో చేసిన మహాపచారాలను క్షాళితం చేయాలి. మన తను, మన ధనాలనర్పించి భారతీయ సాంస్కృతిక వికాసానికి కటిబద్ధులమవ్వాలి.

జాగృతి, 10.7.1949

About Author

By editor

Twitter
YOUTUBE