– సుజాత గోపగోని, 6302164068

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటీ సాధించామని గర్వంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ ‌పార్టీలోనూ భయం నెలకొందా? అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులు రాష్ట్రంలో లేవని ఆ పార్టీ భావిస్తోందా? కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ తెలంగాణలో చాపకింద నీరులా విస్తరిస్తోందని, ఇప్పటికే విస్తరించిందని గుబులు పడుతోందా? ప్రజల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్‌ ‌పార్టీకి అనుకూల అభిప్రాయం లేదని గ్రహించిందా? ఇప్పటి కిప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్తే.. కాంగ్రెస్‌కు కాకుండా భారతీయ జనతాపార్టీకే మెజారిటీ ఆదరణ ఉంటుందని డిసైడ్‌ అయ్యిందా? తెలంగాణలో అధికార కాంగ్రెస్‌ ‌పార్టీ తీరు ఈ సంశయాలను లేవనెత్తుతోంది. ఆ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అవలంబిస్తున్న తీరు, వ్యవహారశైలిపై వాదనలకు బలం చేకూరుస్తోంది.

ఇప్పటికే తెలంగాణలో సర్పంచ్‌ల పదవీకాలం ముగిసింది. గ్రామ పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో మగ్గుతున్నాయి. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత అయినా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారని అందరూ భావించినా.. అనూహ్య రీతిలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్ని కలను అటకెక్కించింది. దానికి కులగణన అంటూ ఓ కారణాన్ని వెతుక్కుంది. కులగణన కారణంగానే ఎన్నికలు నిర్వహించడం లేదని ప్రకటనలు చేసింది. ముగిసిన పరిషత్‌ ‌పాలకవర్గాల పదవీకాలం

రాష్ట్రంలో జిల్లా పరిషత్‌, ‌మండల పరిషత్‌ల చైర్మన్ల పదవీకాలం జులై 3, 4 తేదీల్లో ముగిసింది. వారి స్థానంలో ప్రత్యేకాధికారుల నియామకం చేపట్టారు. జిల్లా పరిషత్‌లకు జిల్లా కలెక్టర్‌లు, మండలపరిషత్‌లకు జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక అధికారులుగా నియమతులయ్యారు. దీంతో రాష్ట్రంలో గ్రామపంచాయతీల మాదిరిగానే మండల, జిల్లాపరిషత్‌లలోనూ ప్రత్యేకాధికారుల పాలన మొదలయ్యింది. 2019 మే నెలలో 539 జడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అదే ఏడాది జులై మూడో తేదీన మండల పరిషత్‌లకు పాలకవర్గాలు ఏర్పడ్డాయి. జులై నాలుగో తేదీన 28 జిల్లా పరిషత్‌లకు.. ఆగస్టు 7న ములుగు, మహ బూబాబాద్‌, ‌ఖమ్మం, భదాద్రి కొత్తగూడెం జడ్పీలకు ఛైర్‌పర్సన్లు, వైస్‌ఛైర్‌పర్సన్లు, సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉందన్న కారణంగా ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసిన ప్రభుత్వం, తాజాగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను, జడ్పీ ఛైర్‌పర్సన్లు, ఎంపీపీల ఎన్నికలను వాయిదావేసి ప్రత్యేకాధికారులను నియమించింది. మండల పరిషత్‌లకు జూలై నాలుగో తేదీ నుంచి జిల్లాస్థాయి అధికారులు ప్రత్యేకాధికారులుగా, ఐదో తేదీన 28 జిల్లా పరిషత్‌లకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు స్వీకరించారు. ఆగస్టు 7వ తేదీన ములుగు, మహబూబాబాద్‌, ‌ఖమ్మం, భదాద్రి కొత్తగూడెం జడ్పీలకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేకాధికారు లుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

స్పెషల్‌ ఆఫీసర్ల పాలనలో స్థానిక సంస్థలు

ఇక గ్రామ పంచాయతీల విషయం చూస్తే.. 2019 జనవరి 21, 25, 30 తేదీలలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 2024 జనవరి 30తో ప్రస్తుత పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. ఎన్నికలు 2024 ఫిబ్రవరి మొదటి వారంలో జరగాల్సి ఉండగా ప్రత్యేకాధికారు లను నియమించి త్వరలో ఎన్నికలు జరపాలని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం భావించింది. ఎమ్మార్వో, ఎంపీడీవో, వ్యవసాయ అధికారి, ఎండీవో, ఎంపీవో తదితర అధికారులు, లేక వీరికి సమానస్థాయి గెజిటెడ్‌ అధికారిని ప్రత్యేక అధికారులుగా నియ మించారు. గ్రామకార్యదర్శితో పాటు వీరికి జాయింట్‌ ‌చెక్‌ ‌పవర్‌ ఇచ్చారు. ప్రస్తుతం ప్రత్యేకాధికారుల ఏలుబడిలో పంచాయతీలు నెట్టుకొస్తున్నాయి. అయితే పార్లమెంటు ఎన్నికలు ముగియగానే పంచాయతీ ఎన్నికలకు నగారా మోగుతుందని భావించారు. రాష్ట్రంలోని 12,769 పంచాయతీలకు, రాష్ట్ర మొత్తం మీద 88,682 పంచాయతీ వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ముందుగా అనుకున్నట్లుగా జూన్‌ ‌మొదటి వారానికి వార్డుల విభజన పక్రియ పూర్తి కావాల్సి ఉంది. రెండో వారానికి రిజర్వేషన్లు ఖరారు కావాల్సి ఉంది. జూలై మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్‌ ‌జారీ అవ్వాల్సి ఉంది. అనంతరం ఆగస్టు 10వ తేదీలోగా ఎన్నికలు పూర్తయి ఫలితాలు కూడా రావాల్సి ఉంటుందని అందరూ అంచనా వేశారు. కానీ, ఆ ఆనవాళ్లు కూడా ఇప్పటికీ కనిపించడం లేదు. అంటే.. పంచాయతీల ప్రత్యేకాధికారుల పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగించడం అనివార్యంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచుల పదవీకాలం జనవరితో ముగియడంతో ఆ వెంటనే ప్రత్యేకాధికారుల పాలన మొదలైంది. గెజిటెడ్‌ అధికారులను ఆయా స్థానాల్లో నియమిం చారు. ఇప్పుడు మండల పరిషత్‌, ‌జిల్లా పరిషత్‌లకూ ప్రత్యేక అధికారులు నియమితులు కావడంతో స్థానిక సంస్థల్లో ఇకపై మొత్తం అధికారుల పాలనే సాగనుంది. ప్రత్యేకాధికారుల పాలన ఆరునెలల వరకు నిర్వహించేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంది. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో ఆరునెలల పాటు గ్రామ పంచాయతీల్లో స్పెషల్‌ ఆఫీసర్ల పాలన పొడిగించనున్నారు.

బీసీ కులగణన సాకు మాత్రమే!

బీసీ కులగణన అంత సులభ సాధ్యం కాదన్న విషయం అందరికీ తెలిసిందే. కులగణన చేపట్ట డానికి చాలా సమయం తీసుకుంటుంది. అలాంటిది కనీసం ప్రతిపాదనలు, మార్గదర్శకాలు, బ్లూప్రింట్‌ ‌కూడా రెడీ కాలేదు. కానీ, ఇప్పట్లోనే కులగణన పూర్తవుతుందని, అది పూర్తి కాగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలోనే పలు బీసీ సంఘాల నాయకులతో సమావేశం కూడా నిర్వహించింది. సూచనలు, సలహాలు తీసుకుంది. అయితే, ఇదంతా అందరి దృష్టినీ మళ్లించేందుకు చేసిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ సాకుతో ఎన్నికలను మరింత ఆలస్యం చేసేందుకు వీలు దొరుకుతుందన్న లోగుట్టు ఉందంటున్నారు. ఒకవేళ నిజంగానే ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందంటే… కాంగ్రెస్‌ అధికారం లోకి వచ్చి ఆరు నెలలు గడిచింది. గ్రామ పంచాయతీ లకు సర్పంచ్‌ల పదవీకాలం ముగిసి దాదాపు ఐదు నెలలయ్యింది. ఇప్పుడేమో మండల పరిషత్‌, ‌జిల్లా పరిషత్‌ల పదవీ కాలం కూడా ముగిసిపోయింది. అంటే.. పంచాయతీలతో పాటు.. పరిషత్‌లకూ స్పెషల్‌ ఆఫీసర్ల పాలన అనివార్యంగా మారి పోయింది. ప్రభుత్వం ముందుగానే కులగణనపై దృష్టిపెట్టి, ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తే.. ఇప్పటికే దాదాపు సగం సర్వే పూర్తయి ఉండేదని.. ఇప్పటికే సర్వే పూర్తయి లెక్కలు అందుబాటులోకి వచ్చేవని అంటున్నారు. అంటే.. ఆ సాకుతో మరింత కాలం సాగదీయొచ్చన్న ఆలోచనలో కాంగ్రెస్‌ ‌సర్కారు ఉండి ఉంటుందన్న చర్చ సాగుతోంది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పంచాయతీ ఎన్నికలను విధిగా నిర్వహించాలి. సాంకేతిక లేదా రాజకీయపరమైన కారణాలతో పంచాయతీ ఎన్నికలను వాయిదా వేస్తే కేంద్రం నుంచి పంచాయతీలకు రావాల్సిన నిధులు నిలిచిపోతాయి. అప్పుడు పంచాయతీల అభివృద్ధి కుంటుపడుతుంది. అయినా గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం గానీ, ప్రస్తుత కాంగ్రెస్‌ ‌సర్కారు గానీ ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్‌ ‌హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా కుల గణన చేసేందుకు అసెంబ్లీ తీర్మానం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉండేవి. అయితే రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి కుదించి.. ఆ ప్రకారమే గడిచిన కేసీఆర్‌ ‌ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిం చింది. దీన్ని సవాలు చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో, వచ్చే పంచాయతీ ఎన్నిక ల్లోపు బీసీ రిజర్వేషన్ల లెక్క తేల్చాలని న్యాయస్థానం సూచించింది. దానికి అనుగుణంగా బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని కాంగ్రెస్‌ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అదే సమయంలో బిసి కులగణన పూర్తి చేసిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు కాంగ్రెస్‌ ‌పార్టీలోని బీసీ నేతలు డిమాండ్‌ ‌చేస్తున్నారు. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు సరైన ప్రాతినిధ్యం కల్పించలేదని అందుకే పాత పద్ధతుల్లోనే రిజర్వేషన్లు అమలు చేస్తే పంచాయతీ ఎన్నికల్లో కూడా బీసీలకు అన్యాయం జరుగుతోందని చెబుతున్నారు. అందుకే ఐదేళ్లకు ఒకసారి వచ్చే పంచాయతీ ఎన్నికలను కొంతకాలం వాయిదా వేసి.. బీసీ జనాభా లెక్కలు తేలిన తర్వాత జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు పంచాయతీలో బీసీలకు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. కానీ, బీసీల కులగణన త్వరగా తేల్చే అంశం కాదు. 52 శాతానికి మించి రాష్ట్రంలో బీసీ జనాభా ఉంది. దీంతో బీసీల లెక్క తెలడానికి ఎక్కువ సమయం బట్టే అవకాశాలు ఉన్నాయి.

అసలు కారణం అదే…

పై కారణాలతో బీసీ రిజర్వేషన్ల అంశంతో ఎన్నికలు ముడిపడి ఉన్నాయని ప్రభుత్వం చెబు తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం కులగణన అనంతరం ఈ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఈ ఆగస్టుతో తెలంగాణ బీసీ కమిషన్‌ ‌చైర్మన్‌, ‌సభ్యుల పదవీకాలం కూడా ముగియనుంది. దీంతో, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసుకునే బీసీ కమిషన్‌ ‌ద్వారానే ఈ లోకల్‌బాడీస్‌ ఎన్నికల కార్యాచరణను నిర్వహించాలన్న ఆలోచనలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఉందన్న చర్చ జరుగుతోంది. ఆగస్టులో బీసీ కమిషన్‌కు కొత్త పాలకమండలిని నియమించి కులగణన చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓ దశలో ప్రకటించారు. దీనిని బట్టి ఆగస్ట్‌లో కొత్తగా బీసీ కమిషన్‌ ‌చైర్మన్‌, ‌సభ్యులను నియమించాక… బీసీ జనగణనకు సంబంధించిన కార్యక్రమం చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు.. క్షేత్రస్థాయిలో అప్పటివరకు బీజేపీకి ఆదరణ తగ్గిపోయే అవకాశం ఉంటుందని.. అప్పుడే ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్‌కు కాస్త ప్రయోజనకరంగా ఉంటుందన్న ఆలోచనలో సర్కారు ఉంటుందంటు న్నారు. అంతేకాదు.. కాంగ్రెస్‌పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన మరికొన్ని హామీల కార్యాచరణ కూడా అప్పటివరకు మొదలుపెట్టవచ్చని, జనంలో అధికార పార్టీకి అనుకూల వాతావరణం నెలకొంటుందని రేవంత్‌రెడ్డి ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. దీనిని బట్టి ఈ ఎన్నికలు ఏడాది చివరి వరకు వెళ్లొచ్చుననే ఊహాగానాలు సాగుతున్నాయి. దీంతో ఏ ఎన్నికలు ముందు జరుగుతాయి? ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలుంటాయా? లేక జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు మొదట నిర్వహిస్తారా? లేక ఈ ఏడాది చివర్లో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకటి తర్వాత మరొకటి వరుసగా నిర్వహిస్తారా? అన్న చర్చ జరుగుతుంది. ఏదేమైనా ప్రస్తుతం నెలకొన్న పరిణామాలను గమనిస్తే.. డిసెంబరు వరకు ఆ పక్రియ కొనసాగే వీలుంది. అంతవరకు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగవు. మరోవైపు.. మండల, జిల్లా పరిషత్‌లలో ప్రత్యేకాధికారుల పాలన మొదలు కాగా.. వాటికి డిసెంబరు వరకు గడువు ఉంటుంది. అప్పటికి ఎన్నికలు జరిగితే 2025 నుంచి కొత్త పాలకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE