సంపాదకీయం

శాలివాహన 1946 శ్రీ క్రోధి ఆషాఢ బహుళ పాడ్యమి – 22 జూలై 2024, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదం లోయ నుంచి జమ్ము ప్రాంతానికి పాకడం దేశాన్ని కొత్త కలవరపాటుకు గురి చేస్తున్నది. జమ్ములోని రాయాసీ, దొడా, కథువా, రాజౌరీ జిల్లాలలో ఉగ్రవాదం తన పంజా విసిరింది. దీనితో ఆ ప్రాంతంలోని పది జిల్లాలలో అదనంగా 37 క్విక్‌ రియాక్షన్‌ టీమ్స్‌ (క్యూఆర్‌టీ)ను మోహరించారు. లోయలో వలే ఏదో ఘాతుకానికి పాల్పడి తప్పించుకు పారిపోవడం ఇక సాధ్యం కాదన్న వాస్తవాన్ని ఉగ్రమూకలకు తెలియచేయడమే ఆ మోహరింపు ఉద్దేశం. హిందువులు అధికంగా ఉండే జమ్ము ప్రాంతానికి ఉగ్రవాదం పాకడం తీవ్రంగా పరిగణించాలి. ఆర్టికల్‌ 370 రద్దు తరువాత కుపితులైన పాకిస్తాన్‌, జమ్ముకశ్మీర్‌లోని పాకిస్తాన్‌ అనుకూల శక్తులు ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జమ్ముకశ్మీర్‌ పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌ఎస్‌ స్వెయిన్‌ అన్న మాటలు కొన్ని పాత అనుభవాలను సమీక్షించుకోవడానికీ, కొత్త వాస్తవాలను గ్రహించడానికీ అక్కరకు వస్తాయి.

 పాకిస్తాన్‌ ఉగ్రమూకలను కశ్మీర్‌ పౌర సమాజంలోకి చొప్పిస్తున్నదంటే అందుకు కారణం ప్రాంతీయ పార్టీలేనని జమ్ముకశ్మీర్‌ డీజీపీ స్వెయిన్‌ వెల్లడిరచారు. జూలై 15న జమ్ము ఐఐఎంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆ వాదన చిరకాలంగా ఉన్నప్పటికీ పెద్దగా చర్చకు నోచుకోలేదు. ఇప్పుడు ఆ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి నిష్కర్షగా బయటపెట్టడం వల్ల ఈ వాస్తవం కాస్తయినా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ ప్రాంతీయ పార్టీలు ఎన్నికల ప్రయోజనాల కోసం ఉగ్ర కార్యకలాపాలూ, వాటి నాయకులూ బలపడడానికి దోహదం చేస్తున్నాయని కూడా స్వెయిన్‌ నిర్మొహమాటంగా చెప్పారు. ఇందుకు ప్రాంతీయ పార్టీలతో పాటు, లోయలో ప్రధాన స్రవంతి రాజకీయాలుగా చెలామణి అవుతున్న కార్యకలాపాలు కూడా కారణమేనని ఆ పోలీస్‌ అధికారి చెప్పారు. ఒక పక్క ఉగ్రవాదులను సమర్ధిస్తూనే, మరొక పక్క సాధారణ ప్రజల పట్ల సానుభూతి ప్రదర్శిస్తూ సమాజంలోని అన్ని వర్గాలను కూడా ఈ పార్టీలు మోసగిస్తున్నాయని ఆయన అన్నారు. కశ్మీర్‌ లోయలో నెత్తురు పారిస్తున్న ఉగ్రవాదులు మరణిస్తే వారి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను సదరు నాయకులు పరామర్శించి రావడం సర్వసాధారణంగా మారిపోయింది. జమ్ముకశ్మీర్‌ ప్రాంతం ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలను కూడా ఉగ్రవాద అనుకూల, ప్రభుత్వ వ్యతిరేక పరిణామాలుగా చిత్రించే పని కూడా సాగుతోంది. 2014లో ఇద్దరు బాలికలు ప్రమాదవశాత్తు మునిగిపోతే దానిని ఉగ్రవాద సమర్ధకులు కుట్రగా చిత్రించి లోయలో విధ్వంసం సృష్టించారని, దహనాలకు, దౌర్జన్యాలకు పాల్పడ్డారని గుర్తు చేశారాయన. దీని వెనుక ఎన్నికల ప్రయోజనాలను ఆశిస్తున్న స్థానిక రాజకీయాల పాత్ర ఉందని చెప్పారు.

ఇటీవల పెరిగిన ఉగ్రదాడుల గురించి ప్రస్తావిస్తూ, నిజం చెప్పాలంటే లోయలో గణనీయమైన సంఖ్యలో ఉగ్రవాదులు లేనేలేరని, పరిమితంగానే ఉన్నారని, కానీ అనేక రకాలుగా వాళ్లు తమ ఉనికిని చాటుకుంటూ, తమ చర్యలతో పెద్ద ప్రభావం కనిపించేలా చేస్తున్నారని ఆ పోలీస్‌ అధికారి చెప్పారు. కొద్దికాలం పాటు సద్దుమణిగినట్టు కనిపించిన కశ్మీర్‌ ఉగ్రవాదం హఠాత్తుగా జూలు విదిల్చింది. అదీ నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణం స్వీకరిస్తున్న సమయంలోనే. పైగా హిందూ ఆధిక్యం ఉన్న జమ్ములో. కాబట్టి కొత్త నెత్తుటి కెరటం ఎవరి పనో అర్ధం చేసుకోవడం కష్టం కాదు. 2019లో బీజేపీ ప్రభుత్వం కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం, కేంద్రం చర్యను 2023లో సుప్రీంకోర్టు కూడా సమర్ధించడం లోయలో విధ్వంసక శక్తులకు, దింపుడు కళ్లం ఆశతో ఉన్న పాకిస్తాన్‌కు మింగుడుపడని అంశాలే. అయితే ఆ రెండు పరిణామాలు రెండు తిరుగులేని వాస్తవాలను జాతి ముందు ఉంచాయి. యాభయ్‌ ఏళ్ల పాటు వేర్పాటువాదానికి ఊతం ఇచ్చిన ‘విస్తృత స్వయం ప్రతిపత్తి’, ‘స్వయం పాలన’, ‘స్వేచ్ఛ’ వంటి నినాదాలకు కాలం చెల్లింది. అవి వాస్తవరూపం దాల్చడానికి కాస్త కూడా మార్గం లేకుండా కేంద్రం చేసేసింది. కాబట్టి కొందరు నాయకులు ఇప్పటికీ మాట్లాడుతున్నట్టు 2019 నాటి ముందు పరిస్థితిని తీసుకురావడం కల్ల. నిజానికి 2019 నాటి ముందు పరిస్థితి అంటే కొంచెం తేడాలో 1953 నాటి పరిస్థితిని తీసుకురావా లని అనుకోవడమే. కాలచక్రాన్ని వెనక్కి తిప్పాలన్న భావజాలం ఇది. ఒకే దేశంలో రెండు జాతీయ జెండాలు, రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు అన్న విధానానికి జనసంఫ్‌ు కాలం నాడే గదాఘాతం తగిలింది. ఆ కాలాన్ని తిరిగి మీ ముందు ఉంచుతామని ప్రాంతీయ పార్టీలు, ప్రధాన స్రవంతి రాజకీయవేత్తలు చెప్పడం ప్రజలను దారుణంగా వంచించడమే. గతంలో వలె విధ్వంసం, ఆందోళనలు ఎన్ని చేసినా ప్రస్తుత పరిస్థితిని మార్చడం సాధ్యంకాదన్న వాస్తవాన్ని కొందరు బాగానే గుర్తించారు. ప్రస్తుత ఢల్లీి ప్రభుత్వ దృఢ రాజకీయ సంకల్పం నేపథ్యంలో ఆటలు సాగవన్న వాస్తవికతను నేతలు కాకున్నా వీరు మాత్రం గుర్తించారు. కానీ ప్రధాన స్రవంతి రాజకీయాలు నడిపే పార్టీలు నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ మాత్రం ప్రజలను భమ్రలలో ఉంచడానికి నిన్న మొన్నటిదాకా ప్రయత్నించాయి. 370 ఆర్టికల్‌ రద్దు అన్యాయమని సుప్రీంకోర్టు చెబుతుందనే ఈ పార్టీలు ప్రజలను నమ్మించే పనిలో ఉండేవి. అసాధ్యమని తెలిసినా 370 పునరుద్ధరణను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాయి. ఈ రెండు కుటుంబ పార్టీలకు ఇంకొక ఆయుధం మిగలలేదు. అయితే ఇది అబద్దమనే ఎక్కువ మంది కశ్మీరీలు భావించారని అర్థమవుతుంది. ఇటీవల జరిగిన ఎన్నికలలో వారు పెద్ద సంఖ్యలో పాల్గొనడమే ఇందుకు నిదర్శనం. 2018 నుంచి వాయిదా పడుతున్న శాసనసభ ఎన్నికలకు మరిన్ని అడ్డంకులు సృష్టిస్తూ, తమ పబ్బం గడుపుకోవడా నికి ప్రధాన స్రవంతి రాజకీయాలు, పాక్‌ అనుకూల శక్తులు ఇదంతా నడిపిస్తున్నాయి.

About Author

By editor

Twitter
YOUTUBE