-శరత్ చంద్ర
వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
‘‘నీ కొడుకు అలకపాన్పు దిగాడా?’’ మధ్యాహ్నం డ్యూటీనుంచి వచ్చి షర్ట్ విప్పుతూ అడిగాడు రాఘవ. పశు సంవర్ధక శాఖలో పని చేస్తున్నాడు రాఘవ. ‘‘వాడ్నెందుకు సతాయిస్తారు?’’ అంది రజని.
‘‘నీకూ నీ కొడుక్కీ సెంటిమెంట్స్ లేవా?’’ అన్నాడు నిరసనగా రాఘవ. ‘‘నా సెంటిమెంట్ నా కొడుకే..’’ అంది.
‘‘బట్..నా సెంటిమెంట్ మా నాన్నే..’’ అన్నాడు.
‘‘మీ నాన్నకేమయింది ఇప్పుడు? ఆయన పేరును మీరు నిలబెట్టారో లేదో కానీ వాడి తాత కామినేని వరదయ్య పేరు నిలబెట్టేది వాడే.’’అంది.
‘‘ఇక్కడ ఉండి కూడా నిలబెట్టువచ్చు.’’ అన్నాడు.
‘‘ఏంటి నిలబెట్టేది? ఒక బోర్డు మీద మీ నాన్న పేరు రాసి నిలబెటితే చాలా?’’ అంది రజని.
‘‘సర్లే.. ముందు వాడ్ని వచ్చి భోజనం చేయమను.’’ అన్నాడు రాఘవ కొడుకు గదిలోకి చూస్తూ.
‘‘ఎక్కడున్నాడు వాడు!? వాడి ఫ్రెండ్ సమీర్ వచ్చి తీసుకెళ్లాడు’’ చెప్పింది. లంచ్ చేశాక ఆఫీస్‌కు వెళ్లి వచ్చాడు. డిన్నర్ టైమ్ దాటాక కూడా రాలేదు వైష్ణవ్. రాఘవకి పక్క కుదరలేదు. భార్య మొబైల్ చేతికిస్తూ ‘‘ఎక్కడ తగలడ్డాడో వాడికి ఫోన్ చెయ్’’ అన్నాడు ‘‘మీ దగ్గర కూడా ఒక ఫోన్ ఉంది కదా చెయ్యండి..’’ అంది.
ఉడుక్కుంటూ చూశాడు. ‘‘చేశా.. వెధవ ఫోన్ లిఫ్ట్ చేయలేదు..’’ అన్నాడు. ‘‘మీ ఫోన్ లిఫ్ట్ చేయని వాడు నా ఫోన్ ఎందుకు చేస్తాడు?’’ అంది.
‘‘ఇద్దరూ తోడు దొంగలే కదా’’ అన్నాడు.
‘‘మమ్మల్ని నిందించడం మానేసి జరగాల్సింది చూడండి.’’ అంది రజని. ‘‘ఏంటి చూసేది? మధ్యాహ్నం బ్యాంకికి వెళ్లాను. ఇంటి లోన్ వుంది కాబట్టి పది లక్షలకు మించి ఇవ్వలేను. అదీ హెడ్డాఫీస్ పర్మీషన్‌తోనే ఇవ్వాల్సి వస్తుందని మేనేజర్ చెప్పాడు.’’ అన్నాడు.
‘‘ఇది తెలిసే వాడు మీ నాన్నగారి భూమి అమ్మమనేది. వాడికి కావాల్సింది అరవై లక్షలు. అయినా మన తదనంతరం అది వాడికి దక్కాల్సిన ఆస్తే కదా. వాడి కెరీర్‌కు ఉపయోగపడితే మీకు అభ్యంతరం ఏంటి? ‘‘అంది రజని
‘‘నా బాధ నీకు అర్థ్ధం కావడం లేదు రజనీ..’’ అన్నాడు. ‘‘సెంటిమెంట్స్ కడుపు నింపవండీ..’’ అంది.
‘‘ఇంకా నాకు ఏడేళ్ల సర్వీస్ వుంది. రిటైరయ్యాక యాభై అరవై లక్షలకు పైగా వస్తుంది. ఆ డబ్బులన్నీ వాడికేగా’’ అన్నాడు రాఘవ.
‘‘అయ్యోరు వచ్చేవరకూ అమావాస్య ఆగుతుందా? ఈ ఏడేళ్లపాటూ ఏదో ఒక పాతిక వేలతోనో, ముప్పై వేలతోనో వాడిని బతక మంటారా?’’ అంది కోపంగా. ‘‘ఉద్యోగం ఉన్న అమ్మాయిని చేసుకుంటే మరో పాతిక వేలు వస్తుంది. అవి చాలవా బతకడానికి’’ అన్నాడు. ‘‘పిచ్చిమా లోకం’’ గొణిగింది. ఆ రాత్రి వైష్ణవ్ ఇంటికి రాలేదు.
‘‘మమ్మీ.. ఇంటికి రావాలని పించడం లేదు. సమీర్ రూంలోనే ఉన్నాను. నాలో నిమిష నిమిషానికి డిప్రెషన్ పెరిగి పోతుంది. నా కెరీర్ అగమ్య గోచరమైంది. మీరేమో పట్టించుకోరు.’’
కొడుకు పెట్టిన మెసేజ్ భర్తకు చూపించి ‘‘ఏదో ఒకటి చేయండి..’’ అంది. రాఘవకి నిద్రపట్టలేదు. కొడుకు మంకుపట్టు అతడిని అతలాకుతలం చేసింది. డ్యూటీకి సెలవు పెట్టి అక్కడికి సమీపంలో తన తండ్రి పొలం ఉన్న గ్రామానికి చేరుకున్నాడు. బైకుకు స్టాండ్ వేసి పొలంలో ఒక పక్కగా వేసి ఉన్న చెప్టాపై కూర్చున్నాడు. కాస్త దూరంగా అమ్మా, నాన్న సమాధులు కనిపించాయి. చుట్టూ పచ్చటి పండ్లతోట. రమణే సాగుచేస్తున్నాడు. మధ్యలో కూరగాయల సాగు కూడా జరుగుతుంది. అప్రయత్నంగా ఏడుపు తన్ను కొచ్చింది. పసిపిల్లాడిలా ఏడవడం మొదలు పెట్టాడు. ‘‘నిన్ను పోగొట్టుకుంటున్నాను నాన్నా’’ పొలంలోని మట్టి పైకి తీసుకొని అంటున్నాడు. గాద్గదికమైంది రాఘవ స్వరం. వెనుక నుండి ఒక చెయ్యి అతని భుజంపై పడింది. ఎప్పుడొచ్చాడో రమణ.
‘‘ఏంటి రాఘవయ్యా ఏడుస్తున్నావ్’’ ఏమయింది? ఎప్పుడొచ్చావ్. ఫోన్ కూడా చెయ్యలేదే.’’ అడిగాడు ఆందోళనగా. అతడు వచ్చింది కూడా గమనించలేదు రాఘవ.
‘‘ఏంలేదు రమణా..’’ అన్నాడు.
‘‘ఏంలేకుండానే ఎందుకు ఏడుస్తున్నావ్ చిన్నపిల్లాడిలా.’’ అడిగాడు. కాసేపు ఇద్దరి మధ్య మౌనం. మళ్లీ పొగిలి.. పొగిలి ఏడ్చాడు.
‘‘మీ నాయన పోయినప్పుడు కూడా ఇంత ఏడవలేదబ్బా నువ్వు ఏం జరిగిందేంటి?’’ అడిగాడు.
‘‘ఏం చెప్పాలి రమణా! ఈ భూమిలోనే మా నాన్నను చూసుకొని బతికేస్తుంటాను. ఇక ఇప్పుడు మా నాన్నకు నాకూ ‘బంధం’ శాశ్వతంగా తెగిపోతుంది.’’ చెప్పాడు. అర్థ్ధం కానట్టు చూశాడు రమణ. ‘‘మీ నాన్నతో బంధం పోవడం ఏంటి రాఘవయ్యా..?’’ అడిగాడు.
‘‘నాకు మనసు ఎప్పుడు బాగో లేకున్నా ఈ పొలంలోకి వచ్చి కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా! ఇప్పుడు ఈ భూమి పరాధీనం అవుతుంది. అదిగో అమ్మానాన్న సమాధులను కూడా దున్ని పొలంలో కలిపేసుకుంటారేమో’’ అన్నాడు.
‘‘అసలేమీ అర్థ్ధం కావడం లేదు రాఘవయ్యా..’’ అన్నాడు రమణ.
‘‘మా నాన్న జ్ఞాపకాలకు ప్రతిరూపం ఈ భూమి. దీన్ని అమ్మేసి మా వాడ్ని విదేశాలకు పంపాలంట’’ చెప్పాడు రాఘవ
కాస్త అర్థం అయింది రమణకు. రాఘవ కొడుకు విదేశాల్లో చదవడం కోసం జి.ఆర్.ఎ. రాస్తున్న విషయం శ్రావణి ద్వారా తెలుసు రమణకి. ‘‘దానికి ఎందుకు రాఘవా అంత ఇదవుతున్నావు? అబ్బాయి విదేశాల్లో పైచదువులు చదివితే మంచిదేగా? అక్కడ మంచి జీతం వస్తుంది. జీవితం కూడా బాగుం టుంది కదా?’’ అన్నాడు రమణ.
‘‘రమణా..నీకు గుర్తుందో లేదో! అప్పుడు మనం చిన్న పిల్లలం. ఈ పొలం ప్రభుత్వం నాన్నకిచ్చిన రోజు కొండలూ, గుట్టలు, పిచ్చిపొదలూ ఉండేవి. ఎందుకూ పనికి రాదనుకున్న ఈ నేలను చదును చేసేప్పుడు నాన్న చేతులు బొబ్బలు ఎక్కేవి. అమ్మే అన్నం కలిపి నాన్నకు పెట్టేది. అలాంటి ఈ పొలంలో నాన్న సిరులు పండించాడు. ఒక్కోసారి అతివృష్టి మరోసారి అనావృష్టి, ఫలసాయంతో సంబంధం లేకుండా నాన్న పొలాన్నే నమ్ముకున్నాడు. ఒడుదొడుకులతో సేద్యం నడిచేది. అయినా నాన్న సేద్యం వదలలేదు. ఆయన కష్టం ఆయన బిడ్డకు రాకూడదని సన్ను పట్నం పంపి చదివించాడు. ఏదో వానాకాలం చదువుతో గుమస్తా గిరి సాధించు కున్నాను. అమ్మ కాలం చేసింది. అమ్మ పొయ్యిందన్న దిగులుతో నాన్న మంచాన పడ్డాడు.
నాన్న కన్ను మూస్తూ ‘‘అరే రాఘవా.. ఎన్ని కష్టాలు వచ్చినా నీ కన్నతల్లి లాంటి ఈ భూమిని ఎప్పటికీ అమ్మవద్దు. నా ఆత్మ, మీ అమ్మ ఆత్మ ఈ భూమి చుట్టూనే తిరుగుతుంటుందని చెప్పాడు.
ఇప్పుడు ఈ భూమి అమ్మితే తప్ప వాడు విదేశాలకు వెళ్లడానికి నేను డబ్బు సమకూర్చలేను ‘‘చెప్పాడు.
రమణ ఏం మాట్లాడలేదు. రాఘవకొచ్చిన సంకట స్థితి కూడా అర్థమైంది. రాఘవ పొలం తన పొలంలో కలుపుకొని దారి వేసుకోవాలని సర్పంచి చెంగల్రాయుడి ఉద్దేశ్యం. రాఘవ ఇస్తే పక్కనే ఉన్న రమణ కూడా ఇస్తాడని పొంచులు వేసుకొని వున్నాడు.
చాలాసార్లు అడిగినా రాఘవ ఒప్పుకోలేదు. ‘‘మాకు ఈ పొలం సెంటిమెంట్ రాయుడుగారూ’’ అని తప్పుకొనేవాడు
చూస్తుండగానే పొలం ధర పెరిగింది. దగ్గర్లోనే కొత్తగా ఓడరేపు ఒకటి పడ్డంతో భూమి కోటి వరకు ధర పలుకుతుంది. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది.
స్నేహితుడి భుజం మీద చెయ్యేసి ‘‘దిగులు పడకు రాఘవా? కావలిస్తే నా పొలం అమ్మి నీ కొడుకుని ఫారెన్ పంపుదాం.’’ చెప్పాడు. ‘‘నీ కూతురికి కట్నంగా ఇవ్వడానికేగా నీ పొలం అట్టిపెట్టుకున్నావ్..’’ అన్నాడు. ‘‘పర్వాలేదు తీసుకో.. మీవాడు వెళ్లి సెటిల్ అయ్యాకే డబ్బు ఇవ్వు అన్నాడు.
‘‘వద్దు రమణా.. త్యాగాలకు కూడా ఒక హద్దు ఉండాలి.’’ అన్నాడు. ‘‘రాఘవా.. నిజంగా నా పొలం మీద నాకే సెంటిమెంట్సూ లేవు. ఏదో ఉంది కదా అని నీ పొలంతో కలిపి సాగుచేస్తున్నాను. మీ నాయన నిన్ను బడిలోకి పంపితే మా నాయన నన్ను పొలం పనిలోకి పెట్టేసుకున్నాడు. అయినా అంతకు ముందున్న ఓపిక ఉండడం లేదు. మా అమ్మాయికి త్వరలో జాబ్ వస్తుంది. హైదరాబాద్ వెళ్లిపోవాలను కుంటున్నాను. పిల్ల పెళ్లి సమయానికి ఉంటే డబ్బు సర్దు. వెంటనే ఇవ్వకపోయినా పర్వాలేదు. కట్నం తీసుకోని వ్యక్తినే అల్లుడిని చేసుకుంటాను.’’ చెప్పాడు.
‘‘వద్దు రమణా. నీ పొలం కూడా మీ నాన్న జ్ఞాపకమే. నాకు బాగా గుర్తు. మీ నాన్నా మా నాన్న. ఇక్కడి బండల్ని చదును చేసి దుక్కి దున్ని నారు పోసి నీళ్లు పట్టారు. అందుబాటులో ట్రాక్టర్లు లేకపోయినా వాళ్లే కాడెద్దులుగా మారి పొలం దున్నారు. వాళ్ల చెలిమి చావు వరకూ సాగింది. మన చెలిమి కూడా ఈ భూమ్మీదే ఆధారపడివుంది. ఈ పొలం నువ్వు ఏ రాయుడుకో, రాజుగారికో అమ్మేస్తే ఇంత స్వేచ్ఛ పొలంలోకి రాలేవు.’’చెప్పాడు
‘‘వైష్ణవ్.. నీతో మాట్లాడాలి.’’ అంది శ్రావణి.
‘‘చెప్పు..’’ అన్నాడు వైష్ణవ్.
‘‘అరే! దద్ద్యోజనం ఫోన్లో కాదు రా పర్సనల్గా కలుద్దాం.’’ అంది శ్రావణి ‘‘నా బాధల్లో నేనున్నాను శ్రావణీ. నిన్ను కలిసే మూడ్‌లో నేను లేను..’’ అన్నాడు.
‘‘నాకు అంతా తెలుసురా.. ఫారెన్‌లో పి.జి. చేయడానికి పొలం అమ్మి డబ్బులు ఇవ్వమన్నాటగా!’’ అడిగింది.
‘‘ఓ సమాచారం చేరేశాడా! మా ఘనత వహించిన తండ్రిగారు..’’ అన్నాడు.
‘‘పిచ్చోడా.. ఆయన్ని కామెంట్స్ చేసింది చాలు. ముందు ఒకసారి రా.’’ అంది. కాదనలేక వెళ్లి కలిసాడు. ఇద్దరూ సిటీలోని ఒక కాఫీ హోటల్లో కలిసారు.
‘‘నువ్వు అమ్మాలని కోరుకుంటున్న పొలం మీ నాన్న స్వార్జితం కాదు. అంటే మీ తాత వరదయ్యది. మా నాన్న సాగుచేసే పొలం కూడా ఆయన స్వార్జితం కాదు అంటే మా తాత శంకరయ్యది. మీ నాన్నకు మీ తాతయ్య పొలం అమ్మడం ఇష్టం లేదని అర్థం అయ్యాక మా నాన్న పొలం అమ్మి డబ్బు నీకివ్వాలను కుంటున్నాడు?’’ అంది.
‘‘మీ పొలం అమ్మి ఇవ్వడమేంటి? నాన్సెన్స్ కాకపోతే, తాతల ఆస్తులకు మనవళ్లే వారసులు. అమ్ముకోవడానికి నేను హక్కుదారుడిని కూడా..’’ అన్నాడు.
‘‘నీది పిచ్చుక బ్రెయిన్ అని మరోసారి ప్రూవ్ అయ్యింది’’ అంది కోపంగా.
‘‘సరే నాకు జ్ఞానాన్ని ఇవ్వు’’ అన్నాడు వ్యంగ్యంగా.
‘‘మీ నాన్నని నువ్వు అర్థ్ధం చేసుకున్నావో లేదో కానీ మా నాన్నని నేను బాగా అర్థం చేసుకున్నాను. మీ నాన్నకి గవర్నమెంట్ జాబ్ ఉంది. అది చాలు బతకడానికి. మా నాన్నకి ఏ జాబూ లేదు. తన పొలంతో పాటూ మీ పొలం కూడా కౌలుకి తీసుకొనే మా నాన్న వ్యవసాయం సాగించాడు. మీ నాన్నకున్న మరో సెంటిమెంట్ మరొకరికి కౌలుకివ్వకుండా మా నాన్నకే ఇవ్వడం. నాన్నకంటే ఎక్కువ కౌలు ఇస్తామన్నా రాఘవమామ ఒప్పుకోలేదు. ‘‘వద్దు. రమణ జీవనోపాధికి కూడా నా పొలం ఉపయోగ పడుతుంది. వాడు కౌలు సొమ్ము ఇవ్వకపోయినా ఫర్వాలేదు. నా భూమి రమణ సాగుబడిలోనే ఉంటుంది.’’ అని తెగేసి ఊర్లో చాలా మందికి చెప్పాడట. మీ నాన్న స్నేహమాధుర్యం జీవితమంతా రుచి చూసిన నాన్న తాను ప్రాణంగా ప్రేమించిన భూమిని అమ్మి నిన్ను ఫారెన్ పంపించడానికి సిద్ధమయ్యాడు. నీకు తెలుసా.. రాఘవ మామ నీ కోసం పొలం అమ్మాలని డిసైడై పొలం చేజారి పోతుందన్న దుఃఖంతో మీ తాత సమాధి దగ్గర కూర్చుని పొగిలి పొగిలి ఏడ్చిన విషయాన్ని నాన్న అమ్మకు బాధ పడుతూ చెబుతుంటే విన్నాను. నాకే కన్నీళ్లు ఆగలేదురా రాక్షసుడా?’’ అంది కోపంగా శ్రావణి.
వైష్ణవ్ శ్రావణిని అలాగే చూస్తుండిపోయాడు. ‘‘ఉన్న ఆ రెండు ఎకరాలు నాకు పసుపు కుంకాల కింద ఇవ్వాలని అనుకున్నాడు నాన్న. చూడు వైష్ణవ్! మా భూమి అమ్ముకొని నీ ఫిజియో థెరిఫీ కోర్సులో పి.జి చదువుకోవడానికి వెళ్లు. నా వెంటపడుతూ ఉంటావుగా నన్ను పెళ్లిచేసుకో నీ కోరిక కూడా తీరుతుంది. ఇన్నాళ్లు రిజక్ట్ చేసింది ఎందుకో తెలుసా? మన బతుకు తెరువులో వాళ్ల ఉప్పు కూడా ఉంది. మనం ఆ కుటుంబంకి బాధ కల్గించే పని చెయ్యవద్దు అని నాన్న చెప్పాడు. అందుకే నీకు దగ్గర కాలేదు..’’ చెప్పింది శ్రావణి.
వైష్ణవ్ నవ్వుతూ ‘‘అంతా ఒకే గానీ నిన్ను పెళ్లి చేసుకోమని ఆఫర్ ఇస్తున్నావ్ కదూ! అది బాగుంది. పిచ్చి మొద్దూ ఫారెన్ వెళ్లాలి అనుకుందే నిన్ను ఇంప్రస్ చెయ్యడానికి, నువ్వు రెండు మూడుసార్లు అన్నావ్ కదా? నేను ఎన్.ఆర్.ఐ. సంబంధం చేసు కుంటానని. ఎన్.ఆర్.ఐ.గా మారి డబ్బు సంపాదించి నిన్ను ఇంప్రస్ చెయ్యాలి అనుకున్నా. నాన్నకు ఈ భూమిపోతే ఇంకా మంచి భూమి మరో నాలుగు ఎకరాలు కొనివ్వాలి అనుకున్నా. నాన్నకు తాతయ్య పొలం పైన ఇంత ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉంది అనుకోలేదు. బట్ నువ్వు గ్రేట్. నీలా ఆలోచించలేని నా మరుగుజ్జు తనంపై నాకే జాలిగా వుంది శ్రావ్.’’ అని పైకి లేస్తూ ‘‘వన్ కండీషన్ మన తాతయ్యల పొలం మనం ఎప్పటికీ అమ్మకూడదు. భవిష్యత్తులో మన పిల్లలకోసం కూడా’’ అన్నాడు వైష్ణవ్. అక్కడ జనం ఉన్నారని కూడా చూడలేదు శ్రావణి వైష్ణవిని హగ్ చేసుకుంది.
ప్రక్క రోజు బయట ఉన్న భర్తకి రజని ఫోన్ చేసింది ‘‘ఏమయ్యోయ్. వీడి కూడా మీకులాపిచ్చి మాలోకమే. పై చదువుల కోసం ఫారెన్ వెళ్లడట. బడుద్దాయ్ నిన్నటి వరకూ ప్రాణాలు తీశాడు.’’ అంది కోపంగా, మళ్లీ తనే ‘‘ఇక్కడే ఫిజియో థెరిపీ కోసం హాస్పెటల్ పెట్టి వైద్య సేవలు కూడా చేస్తాడట. అంతటితో ఆగకుండా, వ్యవసాయం కూడా చేస్తాడట. పైగా రమణ మామ భూమి కూడా మనదే కదా అంటున్నాడు. వీడేదేదో మాట్లాడుతున్నాడు దెయ్యం పట్టిందేమో మీరు రండి..’’ చెప్పింది రజని.
సరిగ్గా ఆ సమయంలో సర్పంచ్ రాయుడు ఇంట్లో ఉన్నారు రమణ, రాఘవ. ‘‘సారీ సర్పంచ్ గారూ.. మా రమణ భూమి అమ్మడం లేదు..’’ చెప్పాడు రాఘవ.
రాయుడు తెల్లమొఖం వేశాడు. ఆ రోజు ఉదయం తండ్రి దగ్గరకు వచ్చి ‘‘నేను శ్రావణిని పెళ్లి చేసుకుంటాను నాన్నా.’’ అన్నాడు వైష్ణవ్.
ముందు రాఘవకు అర్థం కాలేదు అర్థమయ్యాక ఆ విషయం రమణకి చెప్పడం అతడు సంతోషంగా. ‘‘నా కూతురికేగా ఆ భూమి ఇచ్చేది అమ్మి నా అల్లుడ్ని నేనే ఫారెన్ పంపిస్తా..’’ చెప్పాడు.
రమణ భూమి అమ్మడం ఇష్టం లేకపోయినా అతడి బలవంతం మీదే సర్పంచి గడప తొక్కాడు రాఘవ. ఇప్పుడు భార్య రజని ఫోన్లో మాట్లాడిన విషయం రమణకు చెప్పాడు రాఘవ. వాళ్లు ఆలోచనల్లో ఉండగానే శ్రావణి ఫోన్ చేసింది.
‘‘ఏంటమ్మా.. వైష్ణవ్ ఇక్కడే ప్రాక్టీస్ పెడుతాను అన్నాడట. ఇక్కడేం ప్రాక్టీస్ జరుగుతుంది’’ అడిగాడు రమణ.
‘‘ఆ విషయం తర్వాత మాట్లాడదాం నాన్నా ముందు మీకో ముఖ్య విషయం చెప్పడానికే కాల్ చేశాను. సర్పంచ్ కూతురు రాగిణి నా క్లాస్‌మేట్. ఇప్పుడు తనే కాల్ చేసింది మీరు అక్కడ ఉన్నారట కదా? మీ కాబోయే అల్లుడు వైష్ణవ్ మీకో విషయం చెప్పమన్నాడు. ‘‘అంది. ‘‘ఏంటమ్మా..’’ అడిగాడు. ‘‘మన పూర్వికులైన తాతయ్యల భూమి ఎప్పటికీ అమ్మ కూడదు అని ఆంక్షలు పెట్టాడు. ఆ మేరకు మాకు మధ్య ఒప్పందం కూడా కుదిరింది’’ చెప్పింది. రమణ ఫోన్ స్పీకర్ ఆన్ చేయడంతో అవాక్కై విన్నాడు రాఘవ.
వచ్చేవారం కథ..
సమర్థ
-సుజాతా ప్రసాద్