– ఎస్‌. ఘటికచలరావు

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

నెత్తిమీదనున్న కాయగూరల గంప అతికష్టం మీద కిందికి దించింది రంగనాయకి. ఉదయం ఆరుగంటలకల్లా విధుల్లోకి, వీధుల్లోకి వచ్చేస్తుంది, తాజా కాయ గూరలతో.. ముఖ్యంగా తనకు తెలిసిన పది ఇళ్లల్లో ముందుగా కాయగూరలిచ్చేసి ఆ తరువాత మిగతా చోట్లకు వెళ్తుంది. ఆ అలవాటు ప్రకారం గానే ముందుగా వనజ ఇంటికి వెళ్లింది.

‘‘వనజా కాయగూరల అవ్వ వచ్చింది చూడు’’ అంటూ కేశవులు కేక.

అరుపు విన్న వనజ చేతిలో కాఫీ గ్లాసుతో వచ్చింది. వారంలో కనీసం మూడురోజులైనా రాగానే ముందుగా రంగనాయకికి కాఫీ ఇవ్వడం అలవాటు. అదీగాక పండగలకూ, పబ్బాలకూ చేసిన చిరుతిండ్లు కూడా ఇస్తూంటుంది.

ఆమె అభిమానానికి పొంగిపోయి ‘‘ఏ తల్లి కన్నబిడ్డ, నామీద ఎందుకింత అభిమానమో’’ అనుకునేది మనసులో.

వనజ, కేశవులు ఆ ఇంట్లోకి బాడుగకు వచ్చి సుమారు ఏడాది పైనే ఐంది. ‘భార్యా, భర్త, ఒకే ఒక మగబిడ్డ. చూడముచ్చటైన కుటుంబం. నా దిష్టే తగులుతుందేమో’ అనుకునేది.

రంగనాయకి వనజ ఇంటికే ముందుగా వచ్చేందుకు మరో ముఖ్యమైన కారణం వనజ బేరా లాడదు. చెప్పిన ధరకు కొనేస్తుంది. అందువల్ల రంగ నాయకి సహజంగానే ధర తగ్గించే చెబుతుంది. మిగతావాళ్లందరూ బేరాలాడి ఆమె సహనాన్ని పరీక్షించి మరీ కొంటారు. కొన్నిసార్లు అంత బేరమాడినా చివరికి కొనరు.

ఏడాది కాలంగా కాయగూరలు తెస్తున్నా, బాగా పరిచయమై ఉన్నా, ఏనాడూ ఆమె వ్యక్తిగత వివరా లేవీ అడిగి తెలుసుకోలేదు వనజ. అదే విధంగా రంగనాయకి కూడా వనజ గురించిన వివరాలేవీ అడగలేదు. తాను చూసినంత వరకే గుర్తుంచు కుంది. ‘మంచి మనసు, చల్లని చేతులు, ఎక్కువగా విసిగించదు, అంతకన్నా ఇంకేం కావాలి?’ అనుకునేది. అలా వాళ్ళ పరిచయం కేవలం కాయ గూరల వరకే ఉండేది.

 * * * * *

ఉదయం ఎనిమిదౌతున్నా రాని రంగనాయకి కోసం అప్పటికి కనీసం పదిసార్లు లోపలికీ బయటికీ అశాంతిగా తిరిగింది వనజ విసుగ్గా. క్రితం రోజు వచ్చినప్పుడు ఎందుకో కాస్త స్తబ్దుగా ఉన్నట్టనిపించి ‘‘ఒంట్లో బాగాలేదా?’’ అనడిగింది కూడా

‘‘అదేం లేదమ్మా, అప్పుడప్పుడూ అలా ఔతూంటుంది’’ అనేసింది.

‘బాగుంటే మరి ఇవాళ ఎందుకు రాలేదు?’ స్వగతంలో సందేహం వనజకు.

‘‘ఒక్కరోజు కాయలు లేకుంటే మునిగిపోదులే’’ అన్నాడు కేశవులు.

‘‘ప్రతిరోజూ పద్ధతి ప్రకారం భోజనం చెయ్యాలి. అప్పుడే ఆరోగ్యం’’

సంభాషణ పొడిగించ దల్చుకోలేదు. తలుపువద్ద ఏదో అలికిడైంది. ఆశగా వడివడిగా బయటికి వెళ్లింది వనజ.

‘‘నమస్తే మేడం. సార్‌ ఉన్నారా?’’ బైట ఎవరో ఇద్దరు ముగ్గురున్నారు.

నిరాశగా, వాళ్లవంక సందేహంగా చూస్తూ ‘‘ఏమండీ మీకోసం ఎవరో వచ్చారు’’ అన్నది. చదువు తున్న పేపర్‌ పక్కనపెట్టి బయటికి వచ్చాడు కేశవులు.

‘‘నమస్తే సార్‌, చేతన ఆశ్రమం నుంచి వస్తు న్నాం. రెండ్రోజుల క్రితమే పక్కవీధిలో వృద్ధాశ్రమం స్థాపించాం. మీకు చేతనైన సహాయం చెయ్యగలిగితే మంచిది’’ అన్నారు అందులో ఒకరు.

స్వగతంలో కేశవులు ‘ఈ మధ్య ప్రతివాడికీ సమాజసేవ యావ ఎక్కువౌ తూంది’ అనుకుని, ‘‘సారీ సర్‌’’ అనేశాడు వెంటనే.

‘‘మనీ మాత్రమే కాదు సర్‌. మీకు పనికిరాని పాత వస్తువులు, బట్టలు ఇచ్చినా తీసుకుంటాం’’ వచ్చినవాళ్లు తలుపువద్దే పాతుకుపోయారు.

‘‘ఇప్పటికిప్పుడు వెదకాలంటే కుదరదు’’ అన్నాడు. తన అనాసక్తికి సూచనగా.

‘‘ఎప్పుడు రమ్మంటారో చెప్పగలరా?’’ వదిలేట్టు లేరు.

‘‘మీ అడ్రసిచ్చి వెళ్ళండి. ఉంటే నేనే తెచ్చిస్తాను’’ అంటూ చేయి చాచాడు కేశవులు.

వెంటనే తమ చేతిలోని కరపత్రం అతని చేతిలో ఉంచి ‘‘వస్తాం సర్‌. మర్చిపోకండి. వీళ్లందరూ అనాథలు కాదు. కన్నబిడ్డల ఆదరణకు నోచుకోని అభాగ్యులు. అన్నీ ఉండీ ఏమీ లేని నిర్భాగ్యులు. సగంమందికి పైగా అందరికీ పెన్షన్లు వస్తాయి. ఐనా డబ్బే ప్రధానం కాదు. ఆదరణ, ఆలంబన ముఖ్యం. ముదిమి వయసులో వాళ్లు ఎదురు చూసేదదే. ఇలాంటి వాళ్లను ఆదుకోవడంవల్ల మీక్కూడా మానసిక ప్రశాంతత లభిస్తుంది’’ అనేసి వెళ్లి పోయారు. చేతిలోని కరపత్రం వంక చూస్తూ కాస్సేపు నిలబడిపోయాడు కేశవులు.

లోపలినుంచి వచ్చిన వనజ నొసలు చిట్లించి ‘‘ఏమిటది?’’ అన్నది. దాన్ని ఆమె చేతిలో ఉంచి పేపర్లో తలదూర్చాడు కేశవులు. కరపత్రాన్ని ఎగాదిగా చూసి చప్పరించి గిరాటేసింది వనజ.

ఆ రోజు రంగనాయకి రాలేదు. తరువాత రెండ్రోజులు కూడా రాలేదు. మూడోరోజు రంగ నాయకిని చూడగానే ఆత్మబంధువును చూసినట్టైంది వనజకు.

వనజ ముఖంలో ఎక్కడ లేని కాంతి, సంతోషం! కానీ రంగనాయకి ముఖం మాత్రం వాడి ఉంది. ఏదో విషయమై అలవికాని బాధను అనుభవిస్తున్న ట్టుంది.

‘‘ఏంటవ్వా అలా ఉన్నావు? ఏదైనా సమస్యా?’’

లేదన్నట్టు తలూపింది. ఐతే ఆమె కళ్లు చెమ్మగిల్లి ఉన్నాయి. చెప్పలేని బాధేదో ఉంది.

‘‘బిడ్డల్ని కనకపోవడమే మంచిదమ్మా’’ అన్నది కాస్సేపాగి,కళ్లు తుడుచుకుంటూ. హటాత్తుగా వినబడ్డ రంగనాయకి మాటలకు ఉలిక్కిపడిరది వనజ. కొంతసేపటికి తేరుకుని ‘‘ఎందుకలా అంటున్నావు?’’ అనడిగింది.

‘‘ఈ ప్రపంచంలో మనం బతికున్నామంటే అందుకు కారణం మన తల్లిదండ్రులేనన్న కనీస జ్ఞానం కూడా లేకుండా కన్నవాళ్లను అనాథలుగా వదిలేవాళ్లను ఏమనుకోవాలి? రక్తమాంసాలు పాలుగా పట్టి, చెమట చుక్కలను పన్నీటి బిందు వులుగా మార్చి బిడ్డలను అపురూపంగా పెంచితే పెద్దయ్యాక దానికి వాళ్లు చూపే కృతజ్ఞత ఇదా?’’

కూరలమ్మే అవ్వ అనుకుంది గానీ..ఆమెలో ఇంతటి భావుకత్వం, వాక్పటిమ ఉందని ఊహించ లేదు వనజ. ‘‘ఇంతకూ ఏమైందో చెప్పనే లేదు’’ అన్నది.

‘‘ఏముందమ్మా, ఆ పక్కవీధిలో వృద్ధాశ్రమం తెరి చారు. అందులో ఒక్కొక్కళ్లది ఒక్కొక్క కథ. వాళ్లకేమీ సంపాదన లేకుండా కేవలం బిడ్డలమీదే ఆధారపడి ఉన్నవాళ్లు కాదు. చాలామందికి పెన్షన్‌ ఉంది. ఐనా వాళ్లను ఎందుకిలా వదిలేశారో అర్థం కాలేదు’’

‘‘వాళ్ల సమస్యలేమిటో మనకెలా తెలుస్తాయి?’’ సమర్థించాలనుకుంది వనజ. ‘‘సమస్యలేముంటా యమ్మా? ఎన్ని సమస్యలున్నా, తమను కని పెంచారన్న ఇంగితం కూడా లేకుండా ముదిమి వయసులో తగిలెయ్యాలా? ఇంట్లో ఒక పెద్దదిక్కు ఉండడం వీళ్లకు అడ్డమా? సమాజం తమ గురించి గొప్పగా చెప్పుకోవాలన్న యావతో ఒకవైపు అనాథాశ్రమాలకు వేలకు వేలు దానం చేస్తూ మరోవైపు కన్నవాళ్లను వృద్ధాశ్రమాల పాలు చేస్తే ఇక వాళ్లు చేసిన దానానికి విలువేముంది? అలా దానం పొందినవాళ్లయినా సుఖంగా ఉండగలరా?’’

‘ఓహో అప్పుడే వృద్ధాశ్రమం సందర్శించేసిందన్న మాట’ అనుకుని ‘‘వాళ్ల వైపు నుంచి కూడా మనం ఆలోచించాలిగా’’ అన్నది. రంగనాయకి వనజ వైపు అదోలా చూసింది. ఆ చూపుకు వనజ తట్టుకోలేక పోయింది.

‘‘సమస్యలెన్నున్నా కన్నవాళ్ళు భారమైపోతారా? నాకేమో సరిపడలేదు. మీరు కూడా అలా మాట్లాడితే ఎలాగమ్మా?’’ అన్నది రంగనాయకి నిష్ఠూరంగా,

‘‘లోగుట్టు పెరుమాళ్లకెరుక. ఎవరి గొడవలు వారివి, సరేలే కూరలేమున్నాయో చెప్పు’’ అంటూ గంపముందు కూర్చుంది వనజ.

పరధ్యానంగానే గంపను కెలికింది రంగనాయకి. అందులో నుంచి తనకు కావలసిన కాయగూరలు తీసుకుని డబ్బులిచ్చింది వనజ.

మర్నాడు కూడా రంగనాయకి ఆలస్యంగా వచ్చింది. ‘‘ఏంటవ్వా, ఇవాళ కూడా ఆలస్యంగా వచ్చావు. అబ్బాయి బడికి టైమైపోతూంది’’ అన్నది విసుక్కుంటూ.

‘‘అక్కడ వృద్ధాశ్రమంలో ఇచ్చేసి వచ్చేసరికి లేటౌతూందమ్మా. రేపట్నుంచి మరికాస్త తొందరగా అక్కడికి వెళ్తాలే’’ అన్నది.

ఇంతకుముందు తన బోణీ చాలా రాశిjైునదని, హస్తవాసి మంచిదనీ తెగ పొగిడే రంగనాయకి ఇప్పుడిలా మాట్లాడేసరికి వనజ మనసులో ‘ఈగో’ కొద్దిగా దెబ్బతిన్నది.

‘‘అంతేకాదమ్మా, ఇప్పుడక్కడ వంటకు కూడా నేనే కుదురుకున్నాను. వాళ్లందరికీ వండి పెట్టేందుకు నెలకు రెండువేల రూపాయల జీతం కూడా ఇస్తా నన్నారు’’ రంగనాయకి ముఖంలో పట్టనలవిగాని సంతోషం కనిపించింది.

‘‘అంటే కాయగూరల వ్యాపారం మానేస్తావా?’’ ప్రతిరోజూ తాజా కాయగూరలు ఇంటివద్దే తెచ్చి స్తూంటే హాయిగా అనిపించేది. ఇకముందు అలా కాక రెండు కిలోమీటర్ల దూరం ఉండే మార్కెట్‌కు వెళ్లడం తలుచుకుంటేనే నీరసం ముంచుకొచ్చింది వనజకు.

‘‘అబ్బే, అదేమీ లేదమ్మా. మీకొక్కకేళ్లకే కాదుగదా. డజను మందికి ఇస్తున్నాను. ఇప్పుడిక ఆశ్రమానికి కూడా ఇవ్వాలి. ఈ పని ఎప్పటికీ ఉండేదే’’ అన్నది స్థిరంగా.

వనజ మనసు తేలికపడిరది. ‘తనెక్కడికెళ్తే నాకేం, కాయగూరలొస్తాయి’’ అనుకుంది. అప్పట్నుంచీ రంగనాయకిలో ఏదో నూతనోత్సాహం కనిపించ సాగింది. నాలుగు రోజుల తరువాత ఓసారి వనజ ఆమెతో మాట కలిపింది ‘‘మీ ఇంట్లో ఎవరుంటా రవ్వా?’’ మాట్లాడలేదు రంగనాయకి వినిపించ లేదేమో అనుకుని ప్రశ్న రెట్టించింది.

‘‘వినిపించిందమ్మా. చెప్పుకునేందుకు ఎవరూ లేరు. ప్రస్తుతం నేనుండేది కూడా ఈ కొత్తగా పెట్టిన వృద్ధాశ్రమంలోనే’’ అన్నది.

షాక్‌ తగిలినట్టైంది వనజకు. ‘‘నీకెవరూ లేరా? ఇంతకు ముందెక్కడ ఉండేదానివి?’’ ‘‘లేకేం. ముగ్గురు కొడుకులున్నారు. అంతక్రితం బాడుగ ఇంట్లో ఉండేదాన్ని… ఒంటరిగా. ఆయనున్నంత కాలం అందరం ఒక్కటిగా ఉండేవాళ్లం. తరువాత వాళ్లంతా ఎవరికివారే వెళ్లిపోయారు. నేనున్నానన్న సంగతే మర్చిపోయారు. మధ్యతరగతి బతుకులింతే. సంతోషంగా బాధను అనుభవించలేవు, బాధను సంతోషంగా స్వీకరించలేవు. ఆయన బతికున్నంత కాలం రెక్కలు ముక్కలు చేసుకుని ఉన్నంతలో బాగానే చదివించాలని ప్రయత్నించారు. వాళ్లకు చదువులు వంటబట్టకపోతే ఆ తప్పు ఈయనది కాదుగా! ఐనా, మా కోసం ఏం చేశావంటూ దెప్పిపొడిచారు. చివరికి తనకంటూ ఒక పూరి గుడిసె కూడా వేసుకోలేక పోయారాయన. ఆయనుండగానే అందరికీ పెళ్లిళ్లు చేసేశారు. ఆయన అందనంత దూరం వెళ్లాక కన్నతల్లినన్న అభిమానం లేకుండా నన్నిలా వదిలేసి తమ దారి తాము చూసుకున్నారు. పెళ్లవ్వగానే పెళ్లాం బెల్లంగానూ తల్లి అల్లంగానూ కనిపించారు. ఆ వయసలాంటిది. బెల్లంలోని తీయదనం కనిపిం చింది. అల్లంలోని సుగుణాలు కనిపించవు. ఇప్పటికి మూడేళ్లయ్యాయి. అప్పుడప్పుడూ కనబడతారు. దూరపు బంధువులను పలకరించినట్టు పలకరిస్తారు. ఎవరి మానాన వాళ్లు వెళ్లి పోతారు. కోడళ్లు కనీసం పలకరించరు. పిల్లలను పలకరించనివ్వరు. ఎందుకలా చేస్తారో తెలియదు. నేను కూడా ఆడదాన్నే ఐనా వాళ్ల మనసులో ఏముందో తెలుసుకోలేక పోయాను. ఇలా బతుకు ఈడుస్తున్నాను’’ చెప్పడం ఆపి పెద్దగా నిట్టూర్చింది రంగనాయకి.

ఐదు నిమిషాలు స్తబ్దుగా గడిచాయి. గంప నెత్తికెత్తుకుని లేచింది రంగనాయకి.

‘‘నా బిడ్డలు నన్నిలా వదిలేశారంటే అది నా పెంపకంలో లోపమా, వాళ్లను కట్టుకున్నవాళ్ల సామర్థ్యమా అర్థం చేసుకోలేకున్నాను. ఒకే మాట చెప్పదల్చు కున్నానమ్మా. నీక్కూడా ఒక్కగానొక్క కొడుకున్నాడు. వాణ్ణి జాగ్రత్తగా పెంచండి, పెరిగి పెద్దయ్యాక మిమ్మల్ని వదిలేయకుండా ఏం చెయ్యాలో ఇప్పుడే ఆలోచించుకోండి’’ అని బయలుదేరింది.

వనజ మనసులో ఏదో అశాంతి రగులుతూంది. రంగనాయకి మాటలు విన్నప్పట్నుంచీ ఏదో చెప్పలేని అవస్థకు గురవుతూంది. ఆరోజు రాత్రి నిద్రలో ఏవో పలవరింతలు! సరిగ్గా నిద్ర పట్టలేదు. దిగ్గున లేచి కూర్చుని ప్రశాంతంగా నిద్రపోతున్న తన పదేళ్ల కొడుకు వంక తదేకంగా చూసింది వనజ. దిగ్గున లేచి కూర్చున్న భార్యవంక విచిత్రంగా చూసిన కేశవులు ‘‘ఏమైంది వనజా?’’ అనడిగాడు అర్థం కాక,

అతనివంక తదేకంగా చూసి ‘‘ఏం లేదు… ఏం లేదు’’ అనేసి పడుకుంది. ఐతే అనుక్షణం రంగ నాయకి మాటలే గుర్తుకొస్తున్నా విపరీతమైన అశాంతితో కునుకు పట్టలేదు. తమ ఒక్కగానొక్క కొడుకు పెద్దవాడై పెళ్లయ్యాక తమను దూరంగా ఉంచేసినట్టు ఊహించుకుని వణికింది. అల్లారు ముద్దుగా, అతి గారాబంగా పెంచుకున్న కొడుకు అలా చేస్తే తను తట్టుకోగలదా? ఆ ఊహే ఆమెను ఆరోజు రాత్రంతా నిద్రకు దూరం చేసింది.

 * * * * *

నాలుగు రోజులు గడిచాక ఒకరోజు ఉదయం ఎప్పటిలాగే కాయగూరలతో బయలుదేరింది రంగ నాయకి. ఆమె మనసంతా సంతోషంగా ఉందని ముఖమే చెబుతూంది. దివ్య తేజస్సుతో వెలుగుతున్న ఆమె ముఖాన్ని గమనించి ‘‘ఏంటవ్వా, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు?’’ అనడిగింది వనజ.

‘‘ఆశ్రమంలో ఒక పంతులు తన బిడ్డ దగ్గరి నుంచి ఉత్తరమొచ్చిందని సంతోష పడితేనూ అది చూసి నాక్కూడా సంతోషమేసింది. రెండేళ్లయ్యాక ఉత్తరం ముక్క రాశాడట. ఆ బిడ్డకు ఇప్పటికైనా బుద్ధి కుదిరింది. మరో ఉత్తరంలో పిల్చుకెళ్తానని రాస్తే బాగుండు. చూద్దాం ఆ భగవంతుడు ఎలా రాసిపెట్టాడో ఆ ముసలాళ్లకు’’ అంటూ కాయగూరల పని కానిచ్చి బయలుదేరింది రంగనాయకి. అలా మరో వారం గడిచింది.

ఆరోజు రంగనాయకి వచ్చి ‘‘అమ్మా. నేను తీర్థ యాత్రలకు వెళ్తున్నాను. ఓ వారం రోజులు ఎలాగైనా సర్దుకో’’ అన్నది.

‘‘ఎప్పుడు బయలుదేరేది?’’ అన్న ప్రశ్నకు ‘‘ఇవాళ సాయంత్రమే. అన్నట్టు చెప్పడం మర్చాను. ఆ పంతులు వాళ్లబ్బాయి వాళ్లను తీసుకెళ్తానని రాశా డట. దేవుడిన్నాళ్లకు ఆ బిడ్డకు మంచి బుద్ధినిచ్చాడు. ఇప్పుడు కూడా పంతులు వెళ్లనంటాడే! అది కొడుకు రాసిన ఉత్తరం కాదట. కోడలు రాసిందట. ఇంట్లో పనంతా ఒంటరిగా చేసుకోలేక సతమతమౌతూ సహాయం కోసం పిలిపించుకుంటూందేమో అనుకుంటున్నాడు. ఇంటెడు చాకిరీ ఒంటి చేత్తో చేస్తుందా ముసలావిడ, అదీ ఆయన బాధ. కట్టుకున్న దాన్ని అదే కదా కంట్లో పెట్టి కాపాడుకోవడమంటే. వాళ్ళు ఏ ఉద్దేశ్యంతో పిలిచినా, సంబంధాలు తెగిపోయాక పిలిచే పిలుపు, ఆప్యాయతను కూడా సందేహించే పరిస్థితులు వస్తాయన్నది సత్యం. నేనాయనతో చెప్పేశాను, ‘పెద్దాయనా! నాల్రోజులు చూడు, నచ్చితే ఉండు లేకుంటే మీకిక్కడ జాగా ఉండనే ఉందిగా’ అన్నాను. ఏం చేస్తాడో చూడాలి. నేను యాత్రనుంచి తిరిగొచ్చేసరికి అక్కడే ఉంటాడో, వెళ్లుంటాడో తెలీదు. చూద్దాం’’ అంటూ గంప నెత్తుకుని బయలుదేరింది.

 * * * * *

వారం తిరిగాక ఎప్పటిలాగే ఉదయం కాయ గూరల గంప నెత్తినెట్టుకుని ‘‘వంకాయలూ, బెండ కాయలూ’’ అంటూ సాగదీసి అరుస్తూ వచ్చింది రంగనాయకి. అలవాటు ప్రకారం వనజ ఇంటికే ముందుగా వచ్చింది.

‘‘ఏం అవ్వా, అన్నిచోట్లా దర్శనాలు బాగా జరి గాయా?’’ వనజ అనడిగింది గంపలోని కాయ గూరలు పరీక్షిస్తూ, కుతూహలంగా.

‘‘బాగానే జరిగిందమ్మా. అన్నిచోట్లా దేవుడుంటా డంటారుగానీ ఆ స్థలాలకు వెళ్లినప్పుడు కలిగే భక్తి వేరు. ఇక్కడ గుళ్లలో ఆ భక్తి పారవశ్యం రాదు. వెంకటేశ్వరుణ్ణి చూడాలంటే తిరుపతికే, రామయ్యను దర్శించుకోవాలంటే భద్రాచలమే వెళ్లాలి. రంగ నాథుణ్ణి చూడాలంటే శ్రీరంగమే వెళ్లాలి’’ అన్నది పరవశంగా.

అంతలో ‘‘అమ్మాయ్‌, ఇవాళ టిఫిన్‌ ఏం చేద్దాం?’’ అంటూ ఒక పెద్దావిడ బయటికి వచ్చింది. ఆమెను చూసిన రంగనాయకి ఆశ్చర్యపోయింది.

ఆమెను ఎక్కడో చూసినట్టనిపించి ఠక్కున గుర్తుతెచ్చుకుంది. అదే సమయంలో బైట వాకింగ్‌కు వెళ్లి తిరిగొచ్చిన మరొక వ్యక్తిని చూసింది. ఇద్దరూ బాగా పరిచయమున్న వాళ్లే. ‘పక్కవీధి వృద్ధాశ్రమం లోని ప్రకాశరావు దంపతులు’ అంటే… ప్రకాశరావు కేశవులు తండ్రా! వీళ్లు వనజకు అత్తమామలా!

రంగనాయకిని చూడగానే దంపతులిద్దరూ ఆశ్చర్యపోయారు. ‘‘రంగమ్మా. బాగున్నావా? నువ్వే మిటి ఇక్కడా?’’ అంటూ ఆశ్చర్యం వెలిబుచ్చారు.

‘‘రెండేళ్లుగా ఈ ఇలాకాలో అందరికీ కాయగూర లిచ్చేది నేనే గదమ్మా’’ అన్నది. ఆ ముసలి దంపతు లను చూసిన రంగనాయకి మనసు సంతోషించింది. ఐతే అంతలోనే ‘ఇంతకాలం తానెంతో మంచిది అని అంచనా వేసుకున్న వనజ, ఈ వయసుమళ్లిన వాళ్లను తమ కొడుకు నుంచి దూరంచేసిందన్న నిజం జీర్ణించుకోలేకపోయింది. కొడుకు కోడళ్లలో తప్పెవరి దన్న మీమాంసలో పడిన రంగనాయకి ఆ క్షణంలో చూసిన చూపు వనజను నిలువునా దహించి వేసింది.

వృద్ధ దంపతులిద్దరూ లోపలికెళ్లాక, ‘‘అవ్వా, నీ ఉపకారం ఈ జన్మకు మరువలేను. నీ మాటలతో దారితప్పిన నన్ను దారిలో పెట్టావు. రాబోయే తరానికి కావలసినదేమిటో చెప్పి నన్ను మేల్కొలిపావు. అర్థ్ధంలేని భేషజాలతో బంధాలు తెంచుకోవాలను కున్నాను. నువ్వన్నది నిజమే. బాంధవ్యాలు గుర్తించ కుంటే జరిగే అనర్థాలు కళ్లారా చూశాను. వాటికి నేను కూడా కారణమైనందుకు బాధగా ఉంది. నీకు తెలియకుండానే మా కుటుంబానికి మహోపకారం చేశావు’’ అని సజల నయనాలతో రెండు చేతులు జోడిరచింది.

వనజ మాటలకు ఇహలోకంలోకి వచ్చింది. అంటే తన మాటలు ఆమె మనసు మీద ప్రభావం చూపడంవల్ల తనలో పరివర్తన కలిగింది. భవిష్యతులో తనకు కలగబోయే అనర్థానికి భయపడి భర్తకు చెప్పి తనే ఒకటికి రెండు ఉత్తరాలు రాసి వాళ్లను చేరదీయించిందన్నమాట. పరివర్తన సహజ సిద్ధంగా కలిగింది కాకున్నా, ఎలాగైతేనేం తనకు తెలియకుండానే తన వలన ఆ కుటుంబం ఒక్కటైనందుకు సంతోషించింది.

మనసు పొరల్లో ఆలోచనలు మాత్రం వీడలేదు. తన బిడ్డలు తనను చేరదీస్తారో లేదో తెలియదు. ఐతే మార్పు అనివార్యమైన ఈ ప్రపంచంలో తన బిడ్డలు కూడా మారుతారన్న చిన్న ఆశ మాత్రం కలిగించిందా సంఘటన..

ప్రస్తుతానికైతే తనకంటూ ఎవరూలేని పరిస్థితుల్లో కనీసం తనమూలంగా ఇతరులు బాగుపడితే అందులోనే తన ఆనందాన్ని వెదుక్కోవడం మంచిదని పించింది.

‘‘నువ్వన్నట్టు మా అత్తమామలకు పట్టిన గతే నాకూ పట్టకూడదంటే కొన్ని విషయాలు నచ్చకున్నా సర్దుకుపోవాలి. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మా అబ్బాయికి ఇప్పటినుంచే బాంధవ్యాలంటే ఏమిటో తెలిపితే, పెద్ద వాళ్ల ప్రేమాభిమానాలు రుచి చూపిస్తే భవిష్యతులో వాడుకూడా తన పిల్లలకు వాళ్ల నాన్నమ్మ, తాతల గురించిన అనుభవాలు చెప్పేలా చేస్తాడు. సమాజం బలపడాలంటే బంధాలు అను బంధాలు చాలాముఖ్యం’’ అంటున్న వనజ మాటలకు అనాలోచితంగానే తలూపుతూ గంప నెత్తి కెత్తుకుని బయలుదేరింది రంగనాయకి. ఎప్పటికైనా తన బిడ్డలుకూడా వాస్తవాన్ని అర్థం చేసుకుని తనను చేర దీస్తారన్న ఆశ మనసు మూలన ఉదయించింది.

About Author

By editor

Twitter
YOUTUBE