– సావిత్రి కోవూరి
వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
ఉదయం ఆరు గంటలకు ఫోన్ రింగవుతుంటే ఇంత ఉదయమే ఎవరు ఫోన్ చేశారు అనుకుంటు ఫోన్ వైపు చూసింది వాసంతి. ఫోన్ చేసింది దేవకమ్మ ఆంటీ.
ఈవిడ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసిందని ఆశ్చర్యంగా ఫోన్ తీసి ‘‘హలో’’ అన్నది.
‘‘అవతలివైపునుండి హలో, హలో వాసంతి నేను దేవకమ్మ ఆంటీని’’ అన్నది కంగారుగా దేవకమ్మ.
‘‘చెప్పండి ఆంటీ, ఇంత ఉదయాన్నే ఫోన్ చేశారు? ఏంటి సంగతి’’ అన్నది వాసంతి.
‘‘ప్లీజ్ వాసంతి, కొంచెం నువ్వు తొందరగా రాగలవా మా ఇంటికి’’ అన్నది దేవకమ్మ.
‘‘ఆంటీ ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా’’ అన్నది వాసంతి.
‘‘అవునమ్మా శశాంక మాట్లాడట్లేదు.కాళ్లు, చేతులు కూడా కదపలేక పోతున్నాడు. మీ అంకుల్ బిజినెస్ పని పైన బాంబే వెళ్లారు. ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. నాకు చాలా భయంగా ఉంది. నాకు సాయం చేసేటంత దగ్గరి వాళ్లెవరు లేరు ఇక్కడ. నాకెందుకో నీవే గుర్తొచ్చావు. అందుకే నీకు ఫోన్ చేశాను. ప్లీజ్ తొందరగా రా’’ అన్నది దేవకమ్మ ఏడుపు గొంతుతో.
‘‘ఆంటీ మీరేం భయపడకండి. మా ఫ్రెండ్ సుస్మిత డాక్టర్. ఆమెకు ఫోన్ చేస్తాను. అంబులెన్స్ పంపిస్తుంది. మీరు హాస్పిటల్‌కు వచ్చేయండి. నేను డైరెక్ట్‌గా అక్కడికే వచ్చేస్తాను’’ అన్నది వాసంతి.
‘‘సరేనమ్మా. చాలా థ్యాంక్స్’’ అన్నది దేవకమ్మ.
5 నిమిషాల్లో అంబులెన్స్ రావడం, శశాంకను హాస్పిటల్‌కు తీసుకెళ్లడం వెంటవెంటనే జరిగి పోయింది. వాసంతి హాస్పిటల్‌కు వెళ్లే సరికే ట్రీట్మెంట్ కూడ మొదలుపెట్టారు అక్కడి డాక్టర్స్.
వెయిటింగ్ రూమ్‌లో కూర్చున్న దేవకమ్మ దగ్గరకు వచ్చిన వాసంతి ‘‘ఆంటీ, శశాంకకు ఏం కాదు. మీరేం భయపడకండి. మా ఫ్రెండ్ అంతా చూసుకుంటుంది. మంచి డాక్టర్లు ఉన్నారిక్కడ. అసలు ఎందుకలా జరిగింది’’ అన్నది.
‘‘ఏం చెప్పను తల్లీ? వాడు నీకు చేసిన అన్యాయా నికి దేవుడు ఇలా శిక్షించాడేమో. వాడి పెళ్లయి రెండు సంవత్సరాలయింది. పెళ్లయిన నాటి నుండి భార్యా భర్తలిద్దరూ రోజు పోట్లాటలే. అసలు ఆ అమ్మాయికి వీడంటే ముందు నుండి చులకనే ఎందుకో. ఎప్పుడు వాడితో ప్రేమగా ఉన్నది లేదు. ఒక్కరోజూ వాళ్లు సంతోషంగా ఉన్నది నేను చూడలేదు.
రాత్రి కూడా ఇద్దరు పోట్లాడుకున్నట్టున్నారు. గదిలో నుండి గట్టిగా అరుపులు వినబడ్డాయి. ఉదయం లేవగానే సూట్కేసు సర్దుకుని వెళ్లిపోయింది ఆ అమ్మాయి. నేను లోపలికి వెళ్లి చూసేసరికి వాడు స్పృహ లేకుండా పడి ఉన్నాడు. వాడినలా చూసేసరికి నాకు చాల భయమేసింది. నీకు ఫోన్ చేశాను. నీ ఎడల ఈ తండ్రి కొడుకులు కలిసి చేసిన పాపం ఊరికే పోతుందా’’ అన్నది కళ్లు తుడుచుకుంటూ దేవకమ్మ.
‘‘ఆంటీ మీరు బాధపడకండి. శశాంకకు ఏమి కాదు’’ అన్నది ఆమె చేతులు పట్టుకొని.
అప్పుడే బయటకు వచ్చిన సుస్మితతో ‘‘ఎలా ఉంది సుస్మిత అతని పరిస్థితి’’ అన్నది వాసంతి.
‘‘అతను దేనికో బాగా ఆవేశపడ్డట్టున్నాడు. బీపీి పెరిగిపోయి అలా జరిగింది. భయపడాల్సిన పని లేదు. అతనికి ట్రీట్మెంట్ మొదలుపెట్టాము. మెల్లగా కోలుకుంటాడు. ఇప్పుడు నిద్రపోతున్నాడు’’ అన్నది సుస్మిత.
‘‘చాలా థాంక్సమ్మా మీకు. మీ మేలు జన్మలో మరిచిపోను’’ అని చేతులు జోడిరచింది దేవకమ్మ.
‘‘అంత మాట అనకండి. మా డ్యూటీ మేము చేశాము’’ అన్నది సుస్మిత.
‘‘ఆంటీ మీరు ఇంటికి వెళ్లి రండి. ఉదయం నుండి ఏమి తినలేదు మీరు. ఈ లోపల ఏమైనా అవసరం ఉంటే నేను చూసుకుంటాను’’ అన్నది వాసంతి.
‘‘నీవు కూడా వెళ్లు వాసంతి. డాక్టర్ అరవింద్, డాక్టర్ చరణ్ ఉన్నారు. అవసరం వస్తే మేము చూసుకుంటాం కానీ’’ అన్నది సుస్మిత.
‘‘సుస్మిత, నేనుంటాను ఆంటీ వెళ్లి వచ్చేవరకు’’ అన్నది.
దేవకమ్మ వాళ్లతో తొందరగా తిరిగి వస్తానని చెప్పి ఇంటికి బయల్దేరింది.
ఆమె వెళ్లిన తర్వాత వాసంతి పక్కన వచ్చి కూర్చున్న సుస్మిత ‘‘ఏయ్ వాసంతి ఇతన్నే కదా ఐదేళ్ల క్రితం నీవు ప్రేమించింది. మరి పెళ్లెందుకు చేసుకో లేదు’’ అన్నది.
‘‘అవును సుస్మిత, నేను అతను డిగ్రీ ఒకే కాలేజీలో చదివాము. ఇద్దరికీ పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. కాలేజీలో ఏ ప్రోగ్రాం జరిగిన ఇద్దరం పాల్గొనే వాళ్లం. ఆ విధంగా మొదలైన మా ఫ్రెండ్‌షిప్ కొద్ది కాలంలోనే ప్రేమగా మారి, మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. నాలుగు సంవత్స రాల్లో ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడి పెళ్లి చేసుకుందామనే నిర్ణయానికి వచ్చాము. సినిమాలు షికార్లు ఎక్కువయ్యాయి. కాలేజీతోబాటు మా ఇద్దరి ఇళ్లలోను అందరికీ మా ప్రేమ విషయం తెలిసి పోయింది. మా ఇద్దరి పెద్దవాళ్లు మమ్మల్ని విషయం ఏమిటని అడిగారు. మేము ఇద్దరము ప్రేమించు కున్నామని, మా చదువులు పూర్తయిన తర్వాత ఇద్దరం ఉద్యోగాల్లో స్థిరపడ్డ తర్వాత పెండ్లి చేసుకో వాలని అనుకుంటున్నామని చెప్పాము.
మా ఇద్దరి ఇళ్లల్లో మా పెండ్లికి ఏమి అభ్యంతరం చెప్పలేదు. అప్పటి నుండి మా రెండు కుటుంబాల మధ్య స్నేహం, రాకపోకలు ఎక్కువయినాయి. ఆంటీ, అంకుల్ నన్ను అప్పటి నుండే తమ కోడలిలా చూసే వాళ్లు. అలా డిగ్రీ చివరి సంవత్సరం గడిచిపోయింది. అప్పుడే శశాంకకు హైదరాబాద్‌లోను, నాకు బెంగళూరులోను జాబ్స్ వచ్చినాయి.
మా ఇంట్లో నన్నొక్కదానిని పంపించడం ఇష్టం లేక అమ్మానాన్నలు కూడ కొన్ని రోజుల కొరకు నాతో బాటు బెంగళూరుకు వచ్చేశారు.
సరిగ్గా ఆ టైములోనే అంకుల్ వాళ్ల స్నేహితు డొకతను వచ్చి తన ఏకైక కూతురు కిరణ్మయిని శశాంకకు చేసుకొమ్మని అడిగారట. అతని ఆస్తిపాస్తుల గురించి తెలిసిన అంకుల్ శశాంకతో కిరణ్మయిని పెండ్లి చేసుకొమ్మని ఒత్తిడి తేవడం మొదలుపెట్టాడట.
మొదట్లో శశాంక అందుకు ఇష్టపడలేదట. కాని రాను రాను తండ్రి చెప్పే మాటలకు లొంగిపోయి ఉచితంగా వచ్చే సంపదలకు ప్రలోభ పడి కిరణ్మయిని చేసుకోవడానికి ఒప్పుకున్నాడట.
మేము బెంగళూరు వెళ్లిన తర్వాత పనుల ఒత్తిడితో మేము కలుసుకోవడం కుదరలేదు. నేను మా హైదరా బాద్ బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్‌కొరకు ప్రయత్నించడం మొదలుపెట్టాను. నాకు వీలైనప్పుడు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఏదో ఒక సాకు చెప్పి అతను ఫోన్ కట్ చేసేవాడు.
కొన్ని రోజులకు మా కాలేజీ ఫ్రెండ్ ఒకతను కలిసి, ‘‘అదేంటి వాసంతి, మీరు శశాంక పెళ్లి చేసుకుంటారని అనుకున్నాము. కానీ శశాంకకు వేరే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ జరిగింది ఎందుకు’’ అని అడిగేసరికి నేను చాలా ఆశ్చర్యపోయాను.
అప్పుడే నన్ను మా హైదరాబాద్ బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. వెంటనే అమ్మవాళ్లతో హైదరా బాద్ వచ్చేశాను. శశాంకకు ఫోన్ చేసి నన్ను కలుసు కోమని లేకపోతే నేనే వాళ్ల ఇంటికి వచ్చి కలుస్తానని చెప్పాను.
అతను ‘‘నీవు రావొద్దు. నేనే, మనమెప్పుడు కలుసుకునే పార్క్‌కి వస్తాను’’ అని చెప్పాడు.
ఆ రోజు సాయంత్రం పార్క్ కి వచ్చాడు. ‘‘ఏంటి మనము పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా. మరి వేరే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ ఎలా చేసుకున్నావు’’ అని నిలదీశాను.
‘‘తెలిసితెలియని వయసులో ఎన్నో అనుకుంటాం వాసంతి. మన మనుకున్నట్టు అన్నీ జరుగుతాయా’’ అన్నాడు నింపాదిక.
‘‘అదేంటి మనమేమీ స్కూల్లో ఉన్నప్పుడు ప్రేమించుకున్నామా? కాలేజీలో తెలిసి తెలియని వయసు ఎలా అవుతుంది. నేను నిన్నేమీ రెచ్చగొట్టి నీ వెంబడి పడలేదు కదా. నీవే నా వెంటపడి ప్రేమించేవరకు కల్లబొల్లి మాటలు చెప్పి, నిన్ను ప్రేమించేలా చేశావు. మన పెళ్లి గురించి ఎన్నెన్నో కబుర్లు చెప్పావు నీవు. అదంత మరచిపోయావా?’’ అన్నాను.
‘‘అవును అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుందామనే అనుకున్నాను. కానీ తర్వాత ఆలోచిస్తే మా స్థాయికి నీవు తగవని మా నాన్న చెప్పేవరకు నాకు తెలియ లేదు. ఇప్పుడు నేను చేసుకునే అమ్మాయి ఎన్నో కోట్లకు అధిపతి అయిన వ్యాపారవేత్త ఏకైక కూతురు. నిన్ను నేను చేసుకుంటే పెళ్లయినంక కూడ ఇప్పుడెలా ఉన్నానో అలాగే ఉంటాను. జీవితంలో ఏం మార్పు ఉండదు. కానీ మా నాన్న చెప్పిన ఆ అమ్మాయిని చేసుకుంటే నా స్థాయే మారిపోతుంది. కనుక ఏమి గొడవ చేయకుండా నీకు తగ్గవాడిని చేసుకుని సర్దుకుపో. అలా కాదని గొడవ చేసావంటే నీ జీవితమే అల్లరి పాలవుతుంది’’ అన్నాడు శశాంక.
‘‘ఛీ నీ బుద్ధి ఇంత నీచమయినదని తెలుసుంటే ఫ్రెండ్‌షిప్ చేసేదాన్ని కాదు. నా అదృష్టం కొద్ది నీలాంటి వాడి భార్యను కానందుకు చాలా సంతోషి స్తున్నా’’ అని వచ్చేశాను..
మా మాటల్లో పడి దేవకమ్మ రాకను మేము గమనించలేదు. ఆమె మా ముందుకు వచ్చి ‘‘అవునమ్మా ఈ వాసంతే నా కోడలవుతుందని నేనెంతో సంతోషించాను. కాని ఒక రోజు ఆ తండ్రీ కొడుకులు కిరణ్మయి గురించి మాట్లాడుకోవడం విన్నాను. మొదట్లో శశాంక తండ్రికి నీ గురించి చాలానే చెప్పి నిన్ను తప్ప ఎవరిని చేసుకోనని చెప్పాడు. కానీ మా ఆయన కొడుకుతో ‘నీవు వాసంతిని చేసుకుంటే నీకు ఒరిగేదేమి ఉండదు. జీవితంలో ఏమి మార్పు ఉండదు. ఆ అమ్మాయికి ఉద్యోగం తప్ప వేరే ఆస్తిపాస్తులు ఏమి లేవు. అదే నేను చెప్పిన కిరణ్మయిని చేసుకుంటే, వాళ్ల నాన్నకున్న ఆస్తులన్నీ నీవే అవుతాయి. నీ జీవితమే మారిపోతుంది’ అని మభ్యపెట్టి పెళ్లి చేశాడు. ప్రేమించిన అమ్మాయికి అన్యాయం చేయవద్దని, డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుందని నేను ఎంతో నచ్చచెప్ప చూశాను. శశాంక కాని వాళ్ల నాన్న కాని నా మాటలను పట్టించుకోలేదు.
వాళ్ల నాన్న డబ్బులు తమకు వస్తాయన్న ఆశతోనే ప్రేమించిన అమ్మాయిని కాదని, తనను పెళ్లి చేసుకున్నాడని అర్థం చేసుకున్న కిరణ్మయి శశాంకతో సఖ్యతగా ఉండలేకపోయింది. దానితో రోజు పోట్లాటలే. చివరికి నిన్న బట్టలు సర్దుకుని వెళ్లిపోయే సరికి వీడి పరిస్థితి ఈ విధంగా మారిపోయింది. నీకు చేసిన పాపం ఊరికే పోతుందా’’ అన్నది ఏడుస్తూ దేవకమ్మ.
ఆఫీస్‌కు మూడురోజులు లీవ్ పెట్టి రోజు హాస్పిటల్‌కి వచ్చి దేవకమ్మతో బాటు శశాంకకు తోడుగా ఉంటుంది వాసంతి. కోలుకున్నాక డిశ్చార్జ్ అయ్యి వెళ్లేటప్పుడు శశాంక, దేవకమ్మ చేతులెత్తి దండం పెట్టారు డాక్టర్ సుస్మితకు.
దేవకమ్మ ఇంటికి వెళుతూ వాసంతి చేతులు పట్టుకొని ‘‘ఈ ఆంటిని క్షమించమ్మా’’ అన్నది.
వాళ్లు వెళ్లిన తర్వాత సుస్మిత వాసంతితో ‘‘ఏంటే, నీకు ఇంకా శశాంకపై ప్రేమ తగ్గలేదా’’ అన్నది.
‘‘పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అతనిపైన ప్రేమేంటి నాకు. ఎప్పుడైతే అతను వేరే అమ్మాయి మెడలో తాళి కట్టడానికి నిర్ణయించుకున్నాడో, అప్పుడే నా మనసులో నుండి అతనిని తుడిచేశాను’’ అన్నది వాసంతి.
‘‘అలా అయితే, మరి ఇన్ని రోజులు అతనికి అంత శ్రద్ధగా సేవలు ఎందుకు చేసావు’’ అన్నది సుస్మిత
‘‘తోటి మనిషి ఆపదలో ఉన్నాడని తెలిస్తే మనమేదో ఒకటి చేస్తాం. అలాంటిదే ఇదికూడ. ఎంతో కాలం ఫ్రెండ్‌లా మెలిగిన అతడు ఆపదలో ఉంటే చూస్తూ చూస్తూ ఎలా వదిలిపెట్టి వెళ్తాము? మనకు తోచిన సాయం ఏదో అందించడంలో తప్పులేదు. ఈరోజుతో వాళ్లెవరో నేనెవరో’’ అన్నది వాసంతి.
‘‘అతన్ని పూర్తిగా మర్చిపోతే మరి నీవు ఇన్ని రోజులు పెళ్లెందుకు చేసుకోలేదు’’ అన్నది సుస్మిత.
‘‘నా గతం తెలిసి కూడా నన్ను ఇష్టపడే వ్యక్తి, నాకు అన్ని విధాల నచ్చిన వ్యక్తి ఇంకా దొరకలేదు. అందుకే పెళ్లి చేసుకోలేదు. ఒకసారి దెబ్బతిన్న మనిషిని కదా! తొందరపడి ఎవరినంటే వాళ్లను చేసుకోలేను’’ అన్నది వాసంతి.
‘‘అయితే నేను ఒక వ్యక్తిని నీ కొరకు సెలెక్ట్ చేశాను. నీకు నచ్చితే, ఇష్టమైతే చెప్పు. మిగతా విషయాలు నేను చూసుకుంట’’ అన్నది సుస్మిత.
‘‘అదేంటే, నీవు డాక్టర్ గా పనిచేస్తున్నావా? పెళ్లిళ్ల పేరమ్మగా మారిపోయావా’’ అన్నది వాసంతి నవ్వుతూ.
‘‘నేను నిజంగానే చెబుతున్నాను మా హాస్పిటల్‌లో వన్ ఇయర్ నుండి పనిచేస్తున్న చరణ్ తెలుసు కదా. అతను మా దూరపు బంధువు. తల్లిదండ్రులు కరోనాలో పోయారు. తోడబుట్టిన వాళ్లు కాని, దగ్గర బంధువులు కానీ అతనికి ఎవరూ లేరు. అతనికి మిగిలిన బంధువులంటే మా అమ్మా నాన్నలే.
ఈ మధ్యన ఒంటరితనాన్ని తప్పించుకోవ డానికి మా అమ్మ వాళ్ల ఇంటికి ఎక్కువగా వస్తున్నాడు. అమ్మ వాళ్లు కూడా కూడా ఇంట్లోని వ్యక్తి లాగానే అతన్ని ఆదరిస్తున్నారు.
అమ్మ నాకు ఫోన్ చేసినప్పుడు మాటల్లో ‘చరణ్ ఈ కాలం కుర్రాళ్లల లాంటి పిల్లోడు కాదు. చాలా బుద్ధిమంతుడు. అతన్ని చేసుకునే అమ్మాయి ఎవరో చాలా అదృష్టవంతురాలు అవుతుంది. నీ స్నేహితు రాళ్లలో ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చూడు’ అన్నది.
ఏడాది నుండి ఇక్కడ పని చేస్తున్నాడు. పేషెంట్లను చాలా ఓపికగా చూస్తాడు. తన పనేదో తనే కానీ ఇతర విషయాలేవీ పట్టించుకోడు. నీకు ఒకవేళ నచ్చినట్లయితే నాకు చెప్పు అమ్మ వాళ్లతో చెప్పి నేను సెటిల్ చేయిస్తాను. ఏమంటావు’’ అన్నది సుస్మిత.
‘‘అది కాదే, అతనిని నేను ఆ దృష్టితో చూడలేదు. నేను తొందరపడి ఏ నిర్ణయం తీసుకోదల్చుకోలేదు. నా గతం పూర్తిగా తెలిసి కూడా అతను ఇష్టపడితే అప్పుడు ఆలోచిద్దాం’’ అన్నది వాసంతి.
‘‘అయితే నువ్వు తొందర పడాల్సిన అవసరం లేదు. అతను అడపాదడపా మా ఇంటికి, అమ్మా వాళ్లింటికి వస్తూ ఉంటాడు.
నీవు కూడా వచ్చావంటే, తరుచుగా కలుస్తుంటే, అతనెలాంటి వాడో తెలుసు కోవచ్చు. అతనికి కూడా నీవేంటో తెలుస్తుంది. అప్పుడే నీకు అతను నచ్చితే చెప్పు.
అతను ప్రతి ఆదివారం అమ్మ వాళ్ల ఇంటికి తప్పకుండా వస్తాడు. నీవు కూడా అక్కడికి వచ్చావంటే మనందరం కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు. నీవు అతనిని గమనించినట్టుగా కూడా ఉంటుంది’’ అన్నది సుస్మిత.
‘‘నా నిర్ణయం చెప్పే వరకు నీవు ఎవరితో ఈ ప్రస్తావన తీసుకురావద్దు’’ అని చెప్పింది వాసంతి.
‘‘సరేలే. నీవు చెప్పమనే వరకు నేనెవరితోను చెప్పను’’ అన్నది సుస్మిత.
ఆ తర్వాత సుస్మితతో కలిసి వాసంతి తరచుగా వాళ్ల అమ్మ వాళ్ల ఇంటికి వెళ్లడం మొదలుపెట్టింది. ఆ విధంగా చరణ్‌తో మాట్లాడి అతని ఇష్టాయిష్టాలు అతని నడవడిక గురించి తెలుసుకోవడానికి అవకాశం దొరికింది. తను కూడా తన ఇష్టా యిష్టాలేంటో మాటల మధ్యలో చెప్పేది.
కొన్ని రోజులు బాగా గమనించిన వాసంతి సుస్మితతో తనకు అతనిని చేసుకోవడం ఇష్టమేననీ, అతని అభిప్రాయం కనుక్కోమని చెప్పింది వాసంతి. సుస్మిత, చరణ్ ముందర వాసంతి ప్రస్తావన తెచ్చినప్పుడు అతను కూడా వాసంతిని చేసుకోవ డానికి ఇష్టపడ్డాడు.
సుస్మిత తల్లిదండ్రుల పెద్దరికంతో, వాసంతి తల్లిదండ్రుల ఆధ్వర్యంలో చరణ్ వాసంతిల పెళ్లి ఘనంగా చేశారు. సుస్మిత ద్వారా వాసంతి చరణ్‌ల పెళ్లి విషయము తెలుసుకున్న దేవకమ్మ ఎంతో సంతోషించింది.
తర్వాత కొన్ని రోజులకు కిరణ్మయి శశాంక పైన, శశాంక తల్లిదండ్రుల పైన కట్నం కొరకు వేధిస్తున్నా రంటూ కేసు పెట్టింది. అప్పటినుండి పోలీసు స్టేషన్‌లచుట్టూ, కోర్టుల చుట్టు తిరగడమే సరి పోతుంది శశాంక కుటుంబానికి.