తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడు బొగ్గు చుట్టూ తిరుగుతోంది. ప్రధానంగా సింగరేణి సంస్థ ఈ వ్యవహారంలో నలిగిపోతోంది. ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి లాభాల్లో కొనసాగిన ఈ సంస్థ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆ లాభాల స్థాయి పూర్తిగా దిగజారిపోయింది. అప్పుడు లాభాల్లో ఉన్నందునే సంస్థ ఉద్యోగులందరికీ లాభాల్లో వాటాను ఏటా బోనస్‌గా చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ బీఆర్‌ఎస్ సర్కారు సంస్థను దివాళా తీసే దిశగా తీసుకెళ్లిందన్న విమర్శలు వస్తున్నాయి. కేంద్రం దేశవ్యాప్తంగా బొగ్గుగనుల వేలానికి సంబంధించిన చట్టం రూపొందించినప్పుడు లోక్‌సభలో బీఆర్‌ఎస్ కూడా మద్దతు తెలిపింది. కానీ, గనులు వేలం సమయంలో మాత్రం ఏమీ తెలియనట్లు విమర్శల వర్షం కురిపిస్తోంది. ప్రధానంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అటు కేంద్రంలో బీజేపీని, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారు. గతంలో బొగ్గుగనుల వేలంలో పాల్గొనవద్దని అప్పటి సీఎం కేసీఆర్ సింగరేణి సంస్థకు ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేస్తున్నారు. అది ఒకరకంగా నిరసన తెలపడమే అంటున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వేలంలో పాల్గొనడం సింగరేణి సంస్థకు ఉరి వేసినట్లే అని కూడా కేటీఆర్ అన్నారు.
రాష్ట్రంలోని ఉన్న బొగ్గు బ్లాక్‌లను నేరుగా సింగరేణికి అప్పగించాల్సింది పోయి, వేలంలో పాల్గొని వాటిని దక్కించుకోవడమేమిటి అన్న అంశాన్ని లేవనెత్తుతూ బీఆర్‌ఎస్ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కె. తారక రామారావు జనంలో మరోసారి సింగరేణిపేరుతో సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు. కానీ, కేటీఆర్ ఆరోపణలపై కేంద్రరాష్ట్ర ప్రజా ప్రతినిధులు ప్రజా ప్రతినిధులు స్పష్టత ఇవ్వడంతో అసలు బండారం బయటపడింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వేర్వేరుగా ప్రకటనలు చేసినా, ఆ రెండూ వాస్తవానికి కూడా దగ్గరగా ఉండటంతో నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆలోచించిన కోణం, ఇప్పుడు రాజకీయ ప్రాబల్యం కోసం చేస్తున్న విమర్శల కోణం ప్రజలలకు తెలిసిపోయాయి.
బొగ్గుగనులు (స్పెషల్ ప్రొవిజన్స్) చట్టం- 2015 దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం దేశంలో ఉన్న ఖనిజ సంపదను ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు వేలం ద్వారా అప్పగిస్తోంది. వేలంలో రాయల్టీ ఎక్కువ చెల్లించిన సంస్థకు గనులను అప్పగించే పక్రియ కొనసాగు తోంది. అప్పట్లో బీఆర్‌ఎస్ మద్దతుతో ఉభయ సభలలో ఈ చట్టానికి ఆమోదం లభించింది. ఇన్నాళ్లు ఆ అంశాన్ని బయటకు చెప్పని బీఆర్‌ఎస్. తాను అధికారంలో ఉండగా, కేంద్ర ప్రభుత్వం గనులను వేలం వేసినప్పుడు మాత్రం సింగరేణికి స్థానిక బొగ్గు గనులు నేరుగా నామినేషన్ పద్ధతిలో అప్పగించాలని ఉత్తుత్తి డిమాండ్ చేసింది.
రాజకీయ రగడను చూస్తే.. బొగ్గుగనులకు సంబంధించి కేసీఆర్ చేతికి కూడా మసి అంటింది. ఆయన హయాంలో అభివృద్ధి, కాళేశ్వరం ప్రాజెక్టు, పాలాభిషేకాలు, కాంగ్రెస్, బీజేపీ, మోదీ దండుగ, దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటు న్నారనే మాటలు ఎక్కువగా వినపడేవి. అయితే అభివృద్ధి మాటున ఆయన చిలక్కొట్టుడు చాలా ఉందని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాగితాలు తీసి మరీ చూపిస్తున్నారు. ప్రస్తుతం సింగరేణి బొగ్గు గనులు నిప్పు లేకుండానే భగభగమని మండుతు న్నాయి. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం శ్రావణపల్లి బొగ్గు గనిని కూడా వేలంపాట వేయడం, దానిలో సింగరేణి పాల్గొనడమే. దీంతో అలవాటు ప్రకారం బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్, బీజేపీలపై యుద్ధం ప్రకటించేసింది. కానీ పాత లెక్కలు చూసుకోకుండా యుద్ధభేరి మోగించేయడం చాలా రాంగ్ అని కాస్త ఆలస్యంగా ఆగ్రహించింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి ప్రయివేటీకరణ కాకుండా కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారని, కానీ కాంగ్రెస్, బీజేపీలు కలిసి అమ్మేస్తున్నాయంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. దీంతో కాంగ్రెస్, బీజేపీలు కూడా పాత లెక్కలు బయటకు తీసి, 2021లో గనులు వేలంలో సింగరేణిని పాల్గొననీయకుండా కేసీఆర్ అడ్డుకొని తన సన్నిహితులైన అరబిందో గ్రూప్ ఆఫ్ కంపెనీకి చెందిన ఆరో కోల్, శ్రీ అవంతిక కాంట్రాక్టర్లకు అవి దక్కేలా చేసి, సింగరేణికి నష్టం కలిగించారని ఆ పార్టీలు గుట్టు విప్పుతున్నాయి. •కేసీఆర్ ఇప్పుడు సింగరేణి కోసం మొసలి కన్నీళ్లు కార్చుతున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెర వెనక కథ చెప్పేశారు.
అంతేకాదు.. తమ అనుయాయులకు బొగ్గు బ్లాకులు అప్పగించేందుకే సింగరేణి సంస్థను వేలంలో పాల్గొనకుండా సీఎం హోదాలో కేసీఆర్ ఆదేశాలు జారీచేశారని, అలా.. సింగరేణికి ఒకరకంగా ఉరి వేశారని కిషన్‌రెడ్డి కుండబద్దలు కొట్టారు. ‘సింగరేణిపై బీఆర్‌ఎస్ పార్టీ మొసలికన్నీరు కారుస్తోంది. లాభాల్లో ఉన్న సంస్థను అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుంది. మితిమీరిన రాజకీయ జోక్యంతో సంస్థను ఓటుబ్యాంక్‌గా మార్చుకొని కేసీఆర్ కుటుంబం ఇష్టారాజ్యంగా దోచుకుని సంస్థ ఆర్థిక విధ్వంసానికి పాల్పడింది. సంస్థ అధికారులను పావులుగా చేసుకొని రాజకీయాలు చేశారు’ అని మండిపడ్డారు.కేంద్రం సింగరేణి ప్రైవేటీకరణకు యత్నిస్తున్నట్లు అసత్య ప్రచారం చేశారని, సింగరేణిలో కేంద్రం వాటా 49%, రాష్ట్ర ప్రభుత్వం వాటా 51% కాగా రా•ష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ప్రైవేటీకరణ ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వం చేసిన అవినీతిపై విచారణ చేయించాలని అన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే అత్యంత పారదర్శకంగా బొగ్గు గనుల వేలం జరుగుతోందని వెల్లడించారు. సింగరేణి వ్యవస్థను కేసీఆర్ చిన్నాభిన్నం చేశారని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. 2014లో సింగరేణి అకౌంట్‌లో 3 వేల 500 కోట్ల రూపాయల నిధులున్నాయని, నేడు సంస్థను అప్పులపాలై కార్మికులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన చెందారు. సింగరేణి కార్మికులకు సకాలంలో వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్నప్పటికీ ఏ రోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదన్నారు. సింగరేణిని అభివృద్ధి కోణంలో ఏ రోజు కేసీఆర్ చూడలేదని చెప్పారు. బొగ్గు గనుల వేలం ద్వారా వచ్చే నిధులలో ఒక్క పైసా కూడా కేంద్రం తీసుకోదని, సింగరేణి కార్మికులకు హామీ ఇస్తున్నానని, అన్ని రకాలుగా అండగా ఉంటానన్నారు. సింగరేణినీ కేసీఆర్, కేటీఆర్ ఎన్నికలలో ఉపయోగించుకున్నారు తప్ప, కార్మికుల కోసం ఏం చేయలేదన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు బొగ్గు గనులను 9 దశలుగా వేలం వేశారని, ఇందులో రూ. 37వేల కోట్లు ఆదాయం వచ్చింద న్నారు. ఇందులో ఒక రూపాయి కూడా కేంద్రానికి రాదని, 14 శాతం రాయల్టీ రాష్టప్రభుత్వానికి వస్తుందన్నారు.
వేలంలో పాల్గొనకుండా బీఆర్‌ఎస్ నేతలు సింగరేణికి నష్టం చేశారని,కోల్ బ్లాకులను వారి సన్నిహితులకు కట్టబెట్టడానికే ఇలా చేశారని మరోవైపు.. మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. సింగరేణికి ప్రస్తుతం ఉన్న బొగ్గు గనులు మరో పదేళ్లలో అయిపోతాయని ఆ తర్వాత పరిస్థితేమిటని ప్రశ్నించారు. వేలంలో అయినా బొగ్గు గనులు దక్కించుకోవాలని, త•ర్వాత కేంద్రంపై పోరాడి .. దొరికిన గనులు కేటాయింపు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది.
బొగ్గు బ్లాకులు ప్రైవేటు సంస్థల పాలవు తున్నాయి. బొగ్గు నిక్షేపాలు కళ్లముందే కనిపిస్తున్నా.. ప్రభుత్వ అనుమతి లేనందున వేలం పాటకు వెళ్లలేక, వాటిని దక్కించుకోలేని దీన స్థితి. దీంతో 135 ఏళ్ల చరిత్ర కలిగిన, సింగరేణి సంస్థ ఇప్పుడు ఎటూ పాలుపోనిస్థితిలో ఉంది. వాస్తవానికి సింగరేణికి 2015కు ముందు గోదావరి-ప్రాణహిత లోయలో 600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బొగ్గు నిల్వలపై గుత్తాధిపత్యం ఉండేది. అయితే ఆ తరువాత నుంచి గనుల కోసం కేంద్రాన్ని విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే తొమ్మిది సార్లు వేలం నిర్వహించగా 10వ విడత వేలం హైదరాబాద్‌లోనే జరిగింది.ఇదిలా ఉంటే.. ఓవైపు బొగ్గు నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి. మరోవైపు ఇందులో.. బొగ్గు నిల్వలు ఉన్నట్లు సింగరేణి స్వయంగా అన్వేషించిన బ్లాకులు, అందులోనూ ఆ సంస్థ ఇప్పటికే మైనింగ్ చేస్తున్న బ్లాకుల ముందు, వెనుక ఉన్న బ్లాకులను కూడా ఇతర ప్రైవేటు సంస్థలు ఎగరేసుకుపోయాయి. సింగరేణి మాత్రం ప్రభుత్వ అనుమతి లేక వేలంలో పాల్గొనలేని పరిస్థితిలో ఉంది. అయితే ఎంఎండీఆర్ యాక్ట్-2016లోని సెక్షన్ 17(2)ఏ ప్రకారం దక్కిన ప్రత్యేక అధికా రాలతో బొగ్గు బ్లాకులను రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థకు కేటాయించే విచక్షణ కేంద్రానికి ఉంది. ఈ చట్టం ప్రకారం బొగ్గు బ్లాకులను సింగరేణికి రిజర్వ్ చేయవచ్చు. ప్రస్తుతం కేంద్రాన్ని తెలంగాణ ఇదే కోరుతోంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతోపాటు విపక్షాలు కూడా కేంద్రానికి ఉన్న విచక్షణతో సింగరేణికి బ్లాకులు కేటాయించాలని తాజాగా నివేదించారు.
విశాఖ ఉక్కు కర్మాగారానికి క్యాప్టివ్ మైన్స్ లేనందు వల్ల నష్టాల్లోకి వెళ్లిపోయింది. సింగేరేణిని కూడా అలాగే చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం సింగరేణికి బొగ్గు గనులు కేటాయింప చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే పదేళ్లలో సింగరేణి కనుమరుగు అవుతుంది. కొయ్యగూడెం, సత్తుపల్లిలోని 6 కోల్ బ్లాకులను ను సింగరేణికి కేటాయిస్తే అనువుగా ఉంటుందని ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయమై ప్రధాని మోదీని ఒప్పించాలని కిషన్ రెడ్డిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. అవసరమైతే ప్రధానితో మాట్లాడేందుకు తాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
సింగరేణి సంస్థ ప్రస్తుతం 39 బొగ్గు గనుల్లో మైనింగ్ చేస్తోంది. వీటిలో రానున్న ఐదేళ్లలో 8 భూగర్భగనులు, మూడు ఓపెన్‌కాస్టులు మూతపడ నున్నాయి. ఆ తర్వాత మరో ఐదేళ్లలో అంటే 2032 నాటికి మరో 5 భూగర్భ గనులు, 6 ఓపెన్ కాస్టులు కలిపి… 11 గనులు బంద్ కానున్నాయి. 2037-38 నాటికి ఇంకో 5 గనులు మూతపడనుండగా… 12 గనులకు సింగరేణి కుదించుకుపోనుంది. 2014 నాటికి సింగరేణిలో కార్మికుల సంఖ్య 60 వేలకు పైగా ఉండగా… ప్రస్తుతం 40 వేలకు తగ్గింది. రానున్న 15 ఏళ్లలో గనుల సంఖ్య 12కు తగ్గి.. కార్మికుల సంఖ్య 8వేల మందికి తగ్గిపోయే పరిస్థితి. గడచిన పదేళ్లలో సింగరేణి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.49,666 కోట్లను పన్నుల రూపంలో చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వానికి 9 రకాల ట్యాక్సులు, రాయల్టీల రూపంలో రూ.23,446 కోట్లను చెల్లించగా, కేంద్ర ప్రభుత్వానికి 21 రకాల పన్నుల ద్వారా రూ.26,207 కోట్లు చెల్లించింది. అంతేకాదు.. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో వివిధ గ్రామాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన, సీవరేజీ, తాగునీటి సౌకర్యం, పాఠశాల భవనాల నిర్మాణం వంటి వాటికి జిల్లా మినరల్ ఫండ్ ట్రస్ట్ కింద రూ.3 వేల కోట్లను, సామాజిక బాధ్యత కార్యక్రమాల అమలు కింద భారీగా నిధులు వెచ్చించింది. ఇలాంటి సంస్థ కోసం కేంద్ర ప్రభుత్వం ఉదారంగా గనులు కేటాయించాల్సిన బాధ్యత ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గనుల వేలం పాటతోనే సింగరేణికి మేలు జరుగుతుందని అధికార వర్గాలు అంటున్నాయి. నామినేషన్ పద్ధతిలో పొందిన బ్లాకుల్లో బొగ్గు ఉత్పత్తి చేస్తే 14శాతం దాకా రాయల్టీని రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే అదే వేలం పాటలో అయితే 2022 నుంచి ఉన్న నిబంధన ప్రకారం కనిష్ఠంగా 4శాతం నుంచి పాట మొదలవుతుంది. ఈ మేరకు కోయగూడం బ్లాకును 5శాతం రాయల్టీ, సత్తుపల్లి బ్లాకును 7.5శాతం రాయల్టీ చెల్లించడానికి అంగీకరిస్తూ ప్రైవేట్ సంస్థలు దక్కించుకున్నాయి. ఏ లెక్కన చూసుకున్నా వేలం పాటలో సింగరేణి పాల్గొంటే ఏ గని అయినా 10 శాతం లోపే దక్కేదని అధికారులు గుర్తు చేస్తున్నారు.
-సుజాత గోపగోని
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్