శ్యామల, 51 ఏళ్లు, ఆమె సాహసాలు 15 లేదా 16 ఏళ్ల యువతిని తలపిస్తాయి. తెలుగు ధీరనారి. స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి  తూర్పు గోదావరి జిల్లా  సామర్లకోట. ప్రస్తుతం నివాసం తెలంగాణలోని భాగ్యనగరంలో. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు భారతదేశమంతా గర్వించే సాహసక్రియలు చేశారీమె. ప్రపంచ స్థాయిలో అనంత పేరు ప్రఖ్యాతులను ఇప్పటికే సొంతం చేసుకున్నారు. తన పేరు వినగానే అచల, అపరాజిత, ప్రభ, భవ్య, శక్తి… ఇలా ఎన్నో పేర్లు మనముందు (మనోనేత్రం) వరసగా బారులు తీరతాయి.

ఈ పేర్ల భావార్థాలన్నీ తనలో నిండి ఉంటాయని మనకు కచ్చితంగా అనిపిస్తుంది. ఈమె చేసిన సాహసకృత్యాలు అటువంటివి. ఇదే సందర్భాన శ్యామలా దండక భాగం సైతం మనకు వినిపించి తీరు తుంది. ఎందుకంటే, ఆ దృశ్యరూపం తన జీవితంలో ఉండనే ఉంది!

‘జయజననీ సుధా సముద్రాంతరుద్యన్‌

మణిద్వీప సంరూఢ

బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప

కాదంబ కాంతార వాసప్రియే..’

అని మననం చేసుకున్నపుడు ‘సముద్రం’ మన మదిలో మెదులుతుంది కదా.

చరిత్ర సృష్టించారు. రికార్డు బద్దలు కొట్టారు. అదీ అంతర్జాతీయ స్థాయిన. ఈత క్రీడాకారిణిగా వనితాశక్తిని లోకమంతటికీ చాటిచెప్పారు. జూలై నెల మూడోవారంలో మళ్లీ పయనమవుతున్నారు. ఎందుకని?  మరికొన్ని రోజుల్లోనే ఇంగ్లీషు ఛానల్‌ ఈదడానికి. మీరు చదివింది, చూస్తోందీ, వింటోందీ అంతా నిజమే! సముద్ర ఈతకు ఇంకోసారి సంసిద్ధమైన శూరవనిత! ఇంకా చెప్పాలంటే ` తన జీవితమంతా సాహసాలమయం!

ఇంగ్లీష్‌ ఛానల్‌.. సముద్రం పేరు.

ఈ చరిత్ర ఇప్పటిది కాదు, శతాబ్దాల కిందటిది.

కెనాల్‌ అనేదే ఛానల్‌గా మారినట్లుంది.

కాలువ, తూము కానే కావు. సముద్రాలను కలిపే జలమార్గ రూపం.

మరో మాటలో ‘జలసంధి’.

ఆ తరంగం, దాని పయనం, గమన గమ్యం ఎవరికీ అంతుపట్టనివి.

వర్షం పేరు, జలరాశి పేరు. ఉప్పు నీటి, మంచినీటి ప్రవాహ రూపాల పరమ విస్తార స్థాయి.

మహాసముద్రాలు, సప్త సముద్రాలు, బంగాళాఖాతం వంటి వాటి గురించి విన్నాం, చదివి, వినీ తెలుసుకున్నాం.

లవణ, ఇక్షు, సుర్ర, ఘృత, క్షీర, దధి, ఉదక సముద్రాలకు సంబంధించి పురాణ గాథలు చెప్తుంటాయి. కడలి, జలధి, అబ్ధి, అంబుధి, జలనిధి, సాగరం, పారావారం అని భాషా శాస్త్రాలు వివరిస్తుంటాయి. మొత్తంమీద ఉప్పునీటి భాగాలే సముద్రాలు అయ్యాయి.

ఈ అన్ని వివరాలనీ చిన్ననాడే తెలుసుకున్నారు శ్యామల. సముద్రానికి, తనకి అవినాభావ అనుబంధముందని అప్పటి నుంచే అనిపించేది ఆమెకి. ఇదే అంశాన్ని విజయవాడ ` గుంటూరు ప్రాంతంలోని ఒక ఆశ్రమ ఆవరణలో వెల్లడిరచారు స్వయంగా! అక్కడే ఇటీవల ఆమెకు సత్కారసభ నిర్వహించారు. అంతటి ఘన సన్మానానికి కారణం` ఎంత ఎదిగినా ఒదిగే ఉంటున్న తన వినమ్రత. ఈ వేదిక నుంచి ఆమె మాట్లాడేవి వింటుంటే ఎవరికైనా హృదయం ఉప్పొంగుతుంది.

తనవైన మాటల్లోనే వివరించాలంటే `

‘‘నాది అతిసాధారణ కుటుంబం. అందునా రైతు కుటుంబం నుంచి వచ్చాను. చదువంతా ఊళ్లోనే కొనసాగింది. బాల్యంలోనే నా ఆలోచనలు సముద్రం, అందులో ఈతవైపు మళ్లుతుండేవి.

ఎందుకో, ఏమిటో ఇప్పటికీ చెప్పలేను నేను.

చెరువు, నది, ఇతరత్రా ఈతలు వేరు. మరి సముద్రంలో ఈత?

ఇప్పుడు నేను 1980లో వచ్చిన ఒక నవల గురించి చెప్తాను. నాలుగున్నర దశాబ్దాల కిందటి సంగతి. ఆ పుస్తకం పేరు ‘స్విమ్మింగ్‌ ఇన్‌ ది మాన్‌సూన్‌ సీ.’ పద్నాలుగేళ్ల బాలుడి కథ. అంతరంగ మథనం. ఇటువంటి పఠనాలు నా ఆలోచనల తీవ్రతను పెంచాయి.

ఈతలోకి దిగాలంటే (అందులోనూ సముద్రం లోకి) ఎవరి పటిమ ఏమిటో వారికే ముందుగా తెలిసి ఉండాలి. శారీరక పటుత్వం, మానసిక దృఢత్వం, సవాళ్లను ఎదుర్కొనే ధీశక్తి, లక్ష్యసాధనవైపే చూపు.

నైపుణ్యం, ముందుజాగ్రత్త, నీటితో మమేకత్వం ఉండి తీరాల్సిందే.  అత్యవసర పరిస్థితిలో ప్రాణరక్షణ గురించిన అనుభవ సామర్థ్యం కూడా.

జలప్రాంతాల స్థితిగతుల పరిశీలన ముఖ్యం. ఆ వాతావరణ అవగాహన, ఈత వేళ భారీ వర్షం కురిస్తే ఎలా వ్యవహరించాలి, ఆకాశంలో ఉరుముల వంటివి సంభవిస్తే ఏం చేయాలి…. వంటివి.

అలలు, ప్రవాహ మార్పుచేర్పుల, జలజంతువుల దాడుల మీద సన్మద్ధ స్థితి.  ముందుగానే పరిశీలన జరపడం. అవసరమైన వస్తు సామగ్రిని సిద్ధపరచుకోవడం, అనూహ్య పరిణామాలనూ ఎదుర్కోగలగడం. ఈత ప్రదేశాల సంకేతాలు, హద్దుల పరమైన ముందస్తు అప్రమత్తత. అవసర, అత్యవసర వేళల్లో చికిత్స పొందే / చేసుకునే ఏర్పాట్లు.

అన్ని విధాలుగా ముందస్తు జాగ్రత్తలు. అదే విధంగా నివారక చర్యలు. ఆహార  సంబంధ అలవాట్లు. వ్యాయామ నిపుణత.

ఇలా ఎన్నింటి గురించో నా ఆలోచనలూ, ఆచరణలూ! అలా అని నా అభిరుచులు నాకు మొదట్లో మరికొన్ని ఉండేవి. రచనలు చేయాలని, ప్రదర్శనలు ఇవ్వాలని, వాటికి దర్శకత్వం వహించాలని, ప్రయోగాత్మక చిత్రాలు తీయాలని… ఇంకా ఎన్నెన్నో.

సినిమాలన్నా కూడా అప్పట్లో చాలా ఇష్టంగా ఉండేది. స్టూడియో ఏర్పాట్లు కూడా ఆ రోజుల్లో చేసుకున్నాను. విధి బలీయం అంటారే ` అదే జరిగింది నా జీవితంలోనూ.

నిర్వహణ అవరోధాలు అటుంచి… ఆర్థిక ఇబ్బందులూ చుట్టుముట్టాయి. ఎంత తీవ్రంగా అవి నన్ను చుట్టుముట్టాయంటే ` చివరికి నాకు ఇష్టమైన స్టూడియోను నేనే మూసివేసుకోక తప్పని పరిస్థితి కలిగేంతగా!

ఎన్నో బాధలు పడ్డాను. మానసికంగా కుంగి పోయాను. ‘కలకానిదీ, విలువైనదీ, బతుకూ కన్నీటి ధారలలోనే బలిచేయకూ’ పాటను ఎన్నోసార్లు విన్నాను.

‘అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే’ అన్నదీ మనసులోకి తెచ్చుకున్నాను. శోధించి సాధించడంలోనే ధీరగుణం ఉంటుందని గ్రహిం చాను. ధీరత్వం ఎక్కడుందీ?

సముద్రాన్నే ఈదడంలో, అందుకే మళ్లీ నా చూపులన్నీ పూర్తిగా అటువైపే. ఇప్పటికి నాలుగేళ్ల క్రితం… ఈత నేర్చుకున్నాను. బలంగా, ప్రబలంగా, శక్తిగా, యుక్తిగా, నా సర్వశక్తులూ అటువైపునే. అంచెలంచెలుగా ముందుకు సాగాను.

పాక్‌ జలసంధి. విన్నారు కదూ ఆ పేరును!

తమిళనాడుకి, శ్రీలంక ప్రాంతానికి నడుమ ఉంది కదా అది. యాభైమైళ్ల పైనే ఉంటుంది. పలు నదులు అందులోనే కలుస్తుంటాయి. అందులో ఈదాను. నా ఆశయం సాధించు కున్నాను.

హిందూ మహాసముద్రం, ప్రపంచంలోని అతి పెద్దవాటిల్లో మూడోది. మన భారత ఉపఖండంతో పాటు ఆగ్నేయ, పశ్చిమ ఆసియాలుÑ తూర్పు, దక్షిణ, ఈశాన్య ఆఫ్రికాలుÑ ఆస్ట్రేలియాలకు సంబంధిం చింది. అంతటినీ ముందే అధ్యయనం చేశాను. అంతా తెలుసుకున్న తరువాతే బరిలోకి దిగాను. రెండో వరల్డ్‌ రికార్డు హోల్డర్‌గా స్త్రీలోకాన పేరు పొందాను.

అదేవిధంగా, కాటలినా ఛానల్‌. అమెరికాలో ఉంది. ఆ నీళ్లు గడగడ వణికిస్తాయి. దిక్కుతోచకుండా చేస్తాయి. దరిదాపు నలభై కిలోమీటర్ల మేర ఉంటుందా ` జలప్రాంతం. అందులో 19 గంటల పాటు ఈదగలిగానంటే ` నన్ను నేను అభినందించు కోవాల్సిందే కదా!

గత సంవత్సరం పశ్చిమ బెంగాల వైపు దృష్టి సారించాను. కోల్‌కతా ప్రాంతం అక్కడి భగీరథ నదీ స్థలం. ఎనభై కిలోమీటర్లపైనే ఉంటుందది. అక్కడ 13 గంటల పాటు ఈదాను.

ఇక, ఇదే ఏడాది లక్షద్వీప్‌ భాగంపై చూపులను కేంద్రీకరించాను. ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన ప్రోత్సాహక ప్రచార క్రియాఫలితం. అప్పట్లో ఏకంగా 18 గంటల పర్యంతం ఈదాను. అదంతా కెల్టన్‌` కద్మత్‌ ద్వీప ప్రదేశం. రమారమి 38 కిలోమీటర్ల మేర ఉంటుంది అదంతా.

అందులో నాది ప్రపంచ రికార్డు! అలా చరిత్ర సృష్టించిన అతివను మొదట నేనేనని సగర్వంగా చెప్పగలను. ఇప్పుడిక ` ముందే చెప్పాను కదూ… ఇంగ్లీషు ఛానల్‌. ఉత్తర ఫ్రాన్స్‌ నుంచి గ్రేట్‌ బ్రిటన్‌ను వేరు చేస్తుందిది. అట్లాంటిక్‌ మహాసముద్ర జలసంధి. వందలాది కిలోమీటర్ల పొడవు.

తూర్పువైపున డోవర్‌ జలసంధి ఉంది.

మొత్తానికి ఇది ` ఎంతెంతో జలరద్దీ ఉండే సముద్రమార్గం. ఓడల రాకపోకలు వందల సంఖ్య లోనే ఉంటుంటాయి. సముద్ర జలాల్లో ఈత ప్రాణాన్ని పణంగా పెట్టడమే! ఎంతెంతో సంక్లిష్టత తప్పదు. అనుక్షణమూ ప్రమాదాలు వెంటాడు తుంటాయి.

ఎప్పుడు ఏమవుతుందో కనీసం ఊహించలేం.

ఎంత ప్రాణభయమున్నా` అటువంటి భావనే నా నుంచి వైదొలగి చాలా కాలమైంది. ఇదొక క్రీడ. ఈ ఈతలో నాకు అనంత ఆనందం లభిస్తుంది. లక్ష్యం సాధించిన మరుక్షణం అంతకు ముందటి శ్రమనంతా మరచిపోతాను.  సవాళ్లకు భయపడటం కాదు ` వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలవడంలోనే నాకు సంతోషం.

వచ్చే డిసెంబరులో కాకినాడ సముద్రతీర ప్రాంతాన్ని ఈతకు  ఎంచుకున్నాను. విశాఖ ఆర్‌కే బీచ్‌కీ, దానికీ మధ్య నూట యాభై కిలోమీటర్లు. ఇప్పుడు ఇంగ్లీషు ఛానల్‌. ఇకముందు విశాఖ – కాకినాడ బీచ్‌ల నడుమ జలప్రాంతం.

ఈతలోనే నాకు విజయానందం. ఎంతకైనా సాహసిస్తాను.

‘వనితా! నీ చరితం సాహసభరితం’ పాటను ఇష్టపడతాను. స్త్రీ తలచుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదు అని రుజువు చేయగలగుచున్నాను.’’

ఈ మాటలంటున్నపుడు గోలి శ్యామల కళ్లు  మిలమిల మెరిశాయి. ఆమెను ‘జలశ్యామల’ అని పిలవాలని అనిపించింది. ముందుగానే ఆమెకు ఘన విజయాభినందనం, అభివందనం.

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE