– రాయప్రోలు సుజాతాప్రసాద్‌

‌వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

‌తాను ఆడపిల్లగా పుట్టినందుకు సమర్థకు ఎంతో గర్వం. ఆడతనం అంటే చాలా ఇష్టం. ఏరోజూ ఆడపిల్లగా ప్రకృతి సహజంగా పడే ఏ ఇబ్బందికి బాధ పడలేదు. సమర్థ పెరిగిన వాతావరణం అలాంటిది. కానీ, తను పెరిగిన సమాజం పట్ల పరిశీలనా దృష్టి, అవగాహన ఉండడంతో పుట్టినప్పటి నుంచి ఆడపిల్ల జీవితం మీద అధికారం చలాయించే సమాజం అంటే చాలా అసహనం ఉంది. ఆడపిల్లని ఏ దశలోనైనా, ఏ స్థితిలోనైనా, ఎంత బాగున్నా రంధ్రాన్వేషణ చేసి వేలెత్తిచూపే సమాజం పట్ల చాలా కోపం ఉంది. ఆ సమాజానికి అధిక శాతంలో ప్రాతినిధ్యం వహించే ఆడవాళ్లను చూస్తే మొదట్లో చాలా ఆశ్చర్యం కలిగేది. తరువాత బాధగా మారింది. తల్లి శారద అన్నట్లు ఆడవాళ్లంతా ఏకమయితే చాలావరకు సమస్యలు పరిష్కారం అవుతాయి అనిపించేది. చదువుకుని ఉద్యోగాలు చేసే స్త్రీలలో కూడా కనిపించే ఈ నైజానికి విస్తుపోతుండేది. క్రమేపీ వాళ్లలోని సంస్కార లేమికి జాలిపడే స్థాయికి ఎదిగింది. ఎవరి గురించీ వాళ్ల లోపాలు పరోక్షంగా మాట్లాడకుండా ఉంటే కొన్ని అయినా సమస్యలు తీరుతాయని గాఢంగా నమ్మి, అదే పూనికతో జీవించడంతో సమర్థ అంటే కొంతమందికి ఆరాధన అయితే, కొంతమందికి అయిష్టం! ఏ రకమైన విమర్శకీ దొరకని సమర్థని విమర్శించే అవకాశం దొరికింది. ఉద్యోగంలో టెన్షన్స్, ‌కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువు, అన్నీ కలగలిపి సమర్థను ఛాలెంజ్‌ ‌చేస్తున్నాయి. వాటి ప్రభావం శరీరంపై పడుతూ ఉంది. దానివలన సహనం నశించి..కోపం, చిరాకు పెరిగిపోతున్నాయి. కానీ ఎవరి మీద చూపించలేని పరిస్థితి. ఆ టెన్షన్‌ ఇక శరీర ఆకృతి మీద, ఆరోగ్యం మీద కనపడుతోంది.

                                            * * *

‘‘సమర్థా! నా ప్రాణ స్నేహితురాలు రమ! ఢిల్లీ నుంచి ఈ మధ్యే వచ్చిందిట. మీ పెళ్లి తరువాత నిన్ను చూడలేదు. తను మధ్య మధ్యన వచ్చింది కానీ అది నీ ఆఫీసు టైమ్‌ అవడం వలన నిన్ను కలియలేదు. ఈరోజు నిన్ను కలిసి వెళ్లాలనే వెయిట్‌ ‌చేస్తోంది..’’ అప్పుడే ఆఫీసు నుండి వచ్చిన సమర్థకు స్నేహితురాల్ని పరిచయం చేసింది అత్తగారు మంజుల. ‘‘నమస్తే ఆంటీ!’’ అలసటను కప్పుకుంటూ చక్కటి నవ్వుతో పలకరించి సమర్థ లోపలికి వచ్చింది. వెనకాలే మంజుల వచ్చి ‘‘సరళా! ఫ్రిజ్‌లోంచి పిండి తీసిపెట్టాను. నీ చేత్తో చక్కగా రేకుల్లా దోసెలు వెయ్యి. కొత్తిమీర కారం చెయ్యి. సులభంగా అయిపోతుంది. ఫిల్టర్‌ ‌వేశాను. టిఫిన్‌ అయ్యేసరికి కాఫీ రెడీ చేసెయ్‌!’’ ‌చెయ్యవలసింది టకటకా చెప్పి వెళ్లి పోయింది. ఇక తప్పదనుకుని వంటింట్లోకి వెళ్లి వాళ్లకు టిఫిన్‌ ‌కాఫీ అందించింది. ఈ లోపల మామగారు, మరిది వచ్చారు. వాళ్లకు కాఫీ టిఫిన్‌ ఇచ్చి బెడ్‌ ‌రూమ్‌లోకి వచ్చి మంచం మీద కూలబడింది. రోజూ ఎప్పుడూ తను వచ్చేసరికి లేటే! ఈ రోజు కాస్త త్వరగా వచ్చేసరికి ఇంట్లో పని సరిపోయింది. ఏం జీవితం! విశ్రాంతి కోసం తపించిపోయే జీవితం! ఆరు గంటలు పడుకుని ఎన్ని నెలలయింది? ఎన్నాళ్ల యింది? తను కాస్త ఇష్టంగా, శ్రధ్ధగా కడుపునిండా భోంచేసి!

టైము చూసేసరికి పిల్లలు ట్యూషన్‌ ‌నుంచి వచ్చే వేళ అయిపోయింది. ఇక తప్పనిసరిగా లేచి స్నానం చేసి ఫ్రెష్‌ అయి వస్తుంటే రమ.‘ఽఏమో మంజూ! రవి చూస్తే మంచి పొడవు. నీ కోడలు పొట్టి అయినా చాలా చక్కగా ఉందని చేసుకున్నారు. ఏదీ ఇప్పుడు చూడు! ఎంత ఒళ్లు వచ్చేసింది? ఇప్పుడు ఫర్వాలేదు గానీ ఇలాగే కంటిన్యూ అయితే ఏం బాగుంటుంది? గుమ్మడిగింజలా ఉంటుంది. కళ్లు కూడా చిన్నగా అయిపోయి చాలా మారిపోయింది.’’ అంటోంది. సమర్థకి చాలా కోపం వచ్చింది. ఆవిడకి తనని విమర్శించే అధికారం ఎవరిచ్చారు? ఇంతకీ అత్తగారే మంటారో అని నిలబడి వింది. ‘‘మన కాలంలోలాగ శారీరక కష్టం ఏమన్నా ఉందా? విసరడం, రుబ్బడం, దంపడం, నీళ్లు తోడడం అన్నీ చేసేవాళ్ల . ఇప్పుడే ముంది అన్నింటికీ మిషన్లు. దానికే ఉస్సు! హస్సు! ఏం చెప్తాములే! ఏమన్నా అంటే ఉద్యోగం ఒక మిష!’’ అన్న అత్తగారి అభిప్రాయం విని మరింత నివ్వెర పోయింది. ఇదే అమ్మ అయితే తన వైపే మాట్లాడేది కాదా? అనుకునేసరికి కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి.

సమర్థ సాఫ్టువేర్‌ ఇం‌జనీరు. పెళ్లికి ముందు టైము తన చేతుల్లో ఉండేది. భగవంతుడిచ్చిన తీరైన రూపం, సుధలొలికే మంచి మధురమైన గొంతు, తెలివితేటలు, పనిలో అంకితభావం, మంచి చెడుల విచక్షణ, వెనుక తల్లిదండ్రుల ప్రేమపూర్వక మద్దతు, వెరసి జీవితం చాలా బాగుండేది. కొంచెం హైట్‌ ‌తక్కువన్న మాట తప్ప ఎంచడానికి ఏమీ లేదు.సమర్థ కళ్లు చాలా చక్కటివి. విశాలనేత్రి! అనేవారు. చిన్నప్పటినుంచి ఉమ్మడి కుటుంబంలోనే పెరగడం వలన, ధైర్యంగా ఉమ్మడి కుటుంబంలోకి కోడలుగా వచ్చింది. రవీ వాళ్లే కోరి సంబంధం కలుపుకున్నారు. రవి కూడా సాఫ్టువేరు ఇంజనీరే! అత్తవారింట్లో విలన్లు ఎవరూ లేరు. ‘‘కాకపోతే అత్తవారు.’’ అంతే! మధ్యతరగతి కుటుంబాలలో మనుషులు చెడ్డవారు కారు పరిస్థితులే చెడ్డవి అని అనుభవం నేర్పింది.. ‘‘ఇంతవరకూ జీవితంలో అలిసిపోయాం. ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలి’’ అనుకునే అత్తమామలు. పోటీ ప్రపంచంలో కంపెనీలు మారుతూ ఉంటే ప్యాకేజీ పెరగడం అందరికీ బాగానే ఉంటుంది కానీ ఆఫీసులో పని గంటలు, బాధ్యతలు పెరిగితే ఇంట్లో ఎవరికీ ఇష్టమూ ఉండదు. ఒ.డి.సి.లో చేస్తే వర్క్ ‌ఫ్రమ్‌ ‌హోమ్‌ అన్నమాట లేదు. అరగంట కొకసారి లేచి ఐదు నిమిషాలు నడుద్దామన్నా ఖాళీ లేనంత పని! గంటలు గంటలు కూచుని చేసే పనికి ఒళ్లు రాక ఏమవుతుంది? అప్పటికీ ఆ బాధ పడలేక వేరే ప్రాజెక్టుకి మారింది. తనకి ఒళ్లు వచ్చేస్తోంది అని ఇంకొకరు చెప్పాలా? అసలు లాస్‌ అం‌తా తనదే కదా? తన ఆరోగ్యం గురించి టెన్షన్‌ ఒకవైపు నడుస్తోంది. ఆడది ఈ కొలతలలో ప్యాకేజీలో ఉండాలని నిర్ణయించిన మహానుభావులు కనబడి తేనా? అనుకునేది. ఒకప్పుడేమోగానీ ఇప్పుడందరికీ అవేర్‌నెస్‌ ఉం‌ది. కానీ తనకి ఏది చేయడానికీ టైమ్‌ ఉం‌డదు. అద్దంలో చూసుకుంటే మొహం ఉబ్బడంతో కళ్లు చిన్నవయిపోయాయి. నిద్రలేమికి కళ్ల చుట్టూ డార్క్ ‌సర్కిల్స్ ‌వచ్చేస్తున్నాయి. తల్లి ఎన్నోసార్లు దగ్గరకు తీసుకుని ‘‘నీ గురించి నువ్వు పట్టించుకోరా ఆరోగ్యం జాగ్రత్త!’’! అనేది ఆర్తిగా! రెండుసార్లు సిజరిన్‌ ఆపరేషన్స్! ‌పిల్లలతో రాత్రి నిద్రలేమి. అలసట! అలసట! అలసట! ధైరాయిడ్‌ ‌కూడా వచ్చింది. ఎక్సర్సైజెస్‌ ఎన్నిసార్లో ప్రారంభించడం! ఏదో ఉపద్రవం వచ్చి గండి కొట్టుకుపోవడం! వంట మనిషిని పెట్టినా ఎవరికీ నచ్చదు. రవి కఠినంగా ఏమీ అనకపోయినా ‘‘పెళ్లికి ముందులా అయిపోవా? ప్లీజ్‌’’ అం‌టుంటాడు. రవిలో శారీరకంగా ఏ మార్పు లేదు. పెళ్లికి లాగానే రివటలా చక్కగా ఉన్నాడు. తన టైమ్‌ అం‌తా తన చేతుల్లోనే ఉంటుంది. రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేస్తాడు. ఇంటిపని అక్కరలేదు. పిల్లలను కనే బాధ్యత లేదు. బజారు పని కూడా రవికి చెపితే మామగారు చేసి కొడుక్కి రెస్ట్ ఇస్తారు. తను వర్క్ ‌ఫ్రమ్‌ ‌హోమ్‌ ‌చేస్తే పిల్లలని ఇంటిని చూస్తూ చేయాలి. అదే రవి అయితే రూమ్‌లోకి వెళ్లి తలుపేసుకుంటే అటువైపు ఎవరూ వెళ్లరు. శనివారం వచ్చిందంటే ఇంకా పని! పిల్లలకి నలుగురు తలంట్లు! స్పెషల్స్ ‌చేయాలి. మసాలాలతో పెద్దవాళ్లు తినరు. వాళ్లకి వేరే చేయాలి. ఒక పక్క స్కూల్లో టీచర్స్ అం‌తంత మాత్రం గానే ఉన్నారు.  ఇంటర్నేషనల్‌ ‌స్కూల్‌ ‌పైగా! ఫీజులు లక్షలలో ఉన్నాయి గాని పిల్లల స్టాండర్డ్ ‌మాత్రం తను అనుకున్నట్టు లేదు. వాళ్లకి వేరే చోట ట్యూషన్‌ ‌పెట్టించింది. అదీ అంతంత మాత్రం గానే సాగుతోంది.

భర్తకి, పిల్లలకి, అత్తమామాలకి అందరికీ తన మీద ఎక్స్పెక్టేషన్స్! అవి రీచ్‌ అవడానికి తను ఒళ్లు హూనం చేసుకోవడం! ‘నీ చేత్తో చేసిపెట్టు’ అనేది ఆవిడ ఊతపదం! కానీ మనసులో ఏముంది? అనేది ఈరోజు స్పష్టంగా వింది. తను తేడా లేకుండా తల్లిలాగే చూసినా ఆవిడ తనని కూతురుగా అనుకోరని అర్థమయింది. ఎన్నాళ్లనుంచో రగులు తున్న లావా ఆ రోజే బయటకు వచ్చిన ట్లయింది. వంట భోజనాలు అయ్యాయనిపించి వచ్చి పడు కుంది. సమర్థ సీరియస్‌గా ఉండడం చూసి అందరూ ఏదో జరిగింది అనుకుని, మౌనంగానే ఉండి పోయారు.

మోచేయి కళ్లకడ్డం పెట్టుకుని పడుకున్న సమర్థలో అనంతంగా ఆలోచనలు సాగుతున్నాయి. ఆడది ఒకప్పుడు చదువులేక, ఆర్థిక స్వాతంత్య్రం లేక, అజ్ఞానంతో మగవాడి దాష్ట్టీకానికి బలయ్యంది. ఈ తరం చదువుకుని ఉద్యోగాలు చేస్తూ ఆర్థ్ధిక స్వాతంత్య్రం ఉన్నా సుఖమేది? అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఆడదాని బతుకు సమస్యల మయమేనా? శాంతికి, సుఖానికి, నిర్వచనం వెతుక్కోవడమేనా? సమస్య రూపమే మారుతోంది కానీ శాశ్వతంగా పరిష్కారం కావడంలేదు. ఆడవారిలో ఐకమత్యమూ లేదు. తాము ఒక సమస్యలో ఉంటారు. అయినా మరొకరికి సమస్యగా మారుతారు. ఏంచేయాలి? ఇంత కష్టపడకా తప్పడం లేదు. అయిన వాళ్ల చేత మాటలు పడకా తప్పడం లేదు. ఇంట్లో, బయట హెచ్చరికలు, విమర్శలూ వినకా తప్పడం లేదు. విరక్తి వస్తోంది జీవితమంటే! మండుతున్న కళ్లని గట్టిగా మూసుకుని నిద్రపోవడానికి ప్రయత్నించింది సమర్థ.

మర్నాడు తల్లికి ఫోన్‌ ‌చేసింది. శారద ఫోన్‌ ‌తీసి ‘‘అమ్మలూ! ఎలా ఉన్నావు? అంతా కులాసా యేనా?’’ అని ఆత్మీయంగా ఆడగ్గానే ముందురోజు నుండి పేరుకుని ఉన్న ఉక్రోషం, ఫష్ట్రేషన్‌ ‌కరిగి పోయినట్లు ఏడిచింది.

శారద కంగారు పడుతూ. ‘‘తల్లిగా! ఏమయింది చెప్పవా?’’ అని అడిగింది. ఐదు నిమిషాలు ఎంతో లాలించాక ‘‘అమ్మా! నాకు నేను ఫెయిల్యూర్‌ని అనిపిస్తోంది. జీవితం అంటే విసుగు, చికాకు వస్తున్నాయి. నువ్వు చెప్పు ఎందుకలా ఉంది?’’ అంది నిరాశగా!

శారదకి మనసు అర్ద్ధ్రమైంది. ‘‘సమర్థా! చక్కగా చదువుకుని, మంచి ఉద్యోగంలో ఉన్నావు. ఆఫీసులోనూ అవార్డస్ ‌తీసుకుంటున్నావు. ప్రేమించే భర్త! ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు. ఉమ్మడి కుటుంబాన్ని సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్నావు. సక్సెస్‌కి ఇంక పరిభాష ఏమిటో చెప్పవా? ఇందులో ఏ ఒక్కటి లోపించినా నువ్వు తట్టుకోగలవా?’’ ఒకపక్క ఛీరప్‌ ‌చేస్తూనే తనకున్న ప్లస్‌ ‌పాయింట్స్ అన్నీ చెప్పింది.

‘‘ఈ అలసట భరించలేకపోతున్నానమ్మా! ఏదో తెలియని విసుగు, కోపం వస్తున్నాయి. ఒక్కసారి మన ఊరు వచ్చి నీ ఒళ్లో హాయిగా పడుకోవాల నుందమ్మా!’’ బేలగా నీర్సంగా చెప్పింది. ‘‘తప్పకుండా రా! కానీ ఈ లోపల ఈ చిరాకుకి కారణం తెలుసుకో! మనిషి ఆనందానికి కుటుంబంలోను, సమాజం లోను ఉన్న గుర్తింపే ప్రధానం. దానికి ముఖ్యంగా మూడు కారణాలు ఉంటాయి. మొదటిది శారీరక ఆకర్షణ! రెండు పదిమందిని ఆకర్షించే వ్యక్తిత్వం! మూడు నీ కోసం నువ్వు ఏదన్నా చేసుకుని పొందే ఆత్మానందం. ఇందులో ఏది కోల్పోవడం వలన నీకు అశాంతి కలుగుతోందో నీకు తెలియంది కాదు.. నా బిడ్డ దీనికి సమాధానం వెతుక్కోలేని చేతకానిది కాదు. సమర్థ అంటే నాకంటే ఎవరికి బాగా తెలుసు? సమర్థకి ఇది చేయలేని పనీ కాదు, పరిష్కరించలేని సమస్యా కాదు.’’ ఎంతో విశ్వాసంతో అన్న తల్లి మాటలు సమర్థకు నిజంగానే ఊపిరి పోశాయి.. గట్టిగా ఫోన్‌లోనే తల్లికి ముద్దు పెట్టి ‘‘థాంక్యూ అమ్మా! నేను నా సమస్య పరిష్కరించుకుని మళ్లీ కాల్‌ ‌చేస్తాను. బై! ‘‘అని పెట్టేసింది.

రాత్రి తొమ్మిది అవుతోంది. హాల్‌లో కూచున్న సమర్థ అత్తగారికి, మామ గారికి, మరిదికి, రవికి అందరికీ సస్పెన్సు గానే ఉంది. పిల్లలను పడుకోబెట్టి వచ్చి మాట్లాడతానని ఎవరినీ పడుకోవద్దనీ సమర్థ చెప్పింది. వాళ్లకి చాలా తొందరగా పడుకునే అలవాటుంది. ఏమయి ఉంటుంది అనేది ఎవరికీ తెలీలేదు. సమర్థ వచ్చి ఒక్క నిమిషం మౌనంగా కూచుంది. తరువాత మెల్లగా ‘‘మిమ్మల్ని ఈ టైమ్‌లో ఇబ్బంది పెట్టానేమో తెలియదు. నా మనసులో మాట చెప్పాలి. నాకు రోజులో మీ అందరూ ఉదయం 5.30 నుంచి 6.30, సాయంకాలం నేను ఆఫీస్‌ ‌నుంచి వచ్చాక ఓ అరగంట టైమివ్వాలి.’’ అంది. ‘‘అంటే’’ మంజుల అర్థం కానట్లు మొహం పెట్టింది. ‘‘అంటే ఆ టైములో ఇంట్లో ఏ అవసరానికి నన్ను పిలవకూడదు. ఆ సమయంలో నేను ఎవరికీ ఎటెండ్‌ అవలేను. ఆఖరికి పిల్లలకి అవసరమైనా మీరే చూడాలి. నా ఆరోగ్యం పాడవుతోంది. ఒక యోగ ట్యూటర్‌ని పెట్టుకుంటున్నాను. ఆ టైమ్‌లో యోగ చేసి తీరాలి. లేకపోతే అనారోగ్యం పాలై ‘‘గుమ్మడి గింజ’’ గానే పిలవబడతాను.’’ అత్తగారి వైపు చూస్తూ నార్మల్‌గానే అన్నట్లే అంది. ‘‘అదేమిటి సమర్థా! నిన్నెవరు అంతమాటన్నారు?’’ ‘రవి కాస్త ఆవేశంగానే అన్నాడు.

మంజుల తేలు కుట్టిన దొంగలా ఊరుకుంది. ‘‘పిల్లలకి హోమ్‌ ‌ట్యూషన్‌ ‌మాట్లాడు తున్నాను మావయ్యగారూ! మీరు టీచర్‌ ‌గా రిటైర్‌ అయ్యారు. మీరు అదే రూమ్‌లో ఉండి వచ్చే టీచర్‌ని మానిటర్‌ ‌చెయ్యండి చాలు. మీ పని మీరు చేసుకుంటూ ఒక కంట కనిపెట్టండి. ఇది నా రిక్వెస్ట్! ‌పిల్లలు బాగుపడాలి. నా మాట మన్నించి విన్నందుకు చాలా సంతోషం.’’ చెప్పాలనుకున్నది చెప్పి వెళ్లి పోతుంటే ‘‘మరి సాయంకాలం ఏం చేస్తావు’’ అన్నాడు రవి. చిన్నగా తీయగా నవ్వి ‘‘చేస్తుంటే చూద్దురుగానీ!’’ అని వెళ్లిపోయింది. హాల్‌లో అందరూ చర్చకి ఉపక్రమించారు.పెళ్లయిన ఇన్నేళ్లలో సమర్థ అలా మాట్లాడింది లేదు. బెడ్‌రూమ్‌ ‌లోకి వెళ్తూనే తనని, తన పాటని ఎంతో అభిమానించే తన సంగీతం గురువు గారికి ఫోన్‌ ‌చేసింది. వారంలో శనివారం ఒక్కరోజు ఒక గంట క్లాస్‌ ‌చెప్పమని అడగడానికి. అమ్మ చెప్పినట్టు నా హృదయానందాన్ని నేను మళ్లీ పొందాలి. అందరికోసం కాకుండా తన కోసం కూడా జీవించాలి అనుకుంది దృఢంగా!,

About Author

By editor

Twitter
YOUTUBE