‘‘అంతా రామమయం… జగమంతా రామమయం..’’ అంటూ మనం నిత్యం కీర్తించే శ్రీరామచంద్రుల వారి గురించి, ఆదర్శవంతమైన ఆయన జీవిత గాథలను తెలిపే పవిత్ర గ్రంథం రామాయణానికి సంబంధించి నిజానిజాలు, ఆనవాళ్లు, ఆధారాలు, రుజువులు అంటూ ఆ దేవదేవుడు నడయాడిన పవిత్రనేలపైనే చర్చలు, వాదోపవాదాలు జరగడం సనాతన ధర్మం పుట్టినిల్లుగా పిలుచుకునే మన దేశ దౌర్భాగ్యం. ఒకవైపు విదేశీ ఆక్రమణదారుల చేతిలో బందీ అయిన మన దేశ సంస్కృతిని కాపాడుకోవడానికి పోరాడుతున్న దశలోనే, మన నాగరికతకు, చరిత్రకు సంబంధించిన కట్టడాలను లక్ష్యంగా చేసుకొని సాగుతున్న కుట్రలను ఛేదించాల్సిన దుస్థితి ఏర్పడిరది. ఏ సైన్సు, చరిత్ర నేర్పని విధంగా ఆదర్శవంతమైన జీవితాన్ని చూపించిన మర్యాదా పురుషుడు రఘురాముడి గాథలపై అనవసర వివాదాలు రేపడం దారి తప్పిన స్వేచ్ఛకు పరాకాష్ట. ఏ దేశం, జాతి అయిన తమ సంస్కృతిని, వారసత్వాన్ని కాపాడుకోవడానికి, నిలుపుకోవడానికి ప్రాధాన్యమిస్తాయి. ఇందుకు భిన్నంగా మనం మన పౌరాణిక చారిత్రక గాథలను వివాదాస్పదం చేస్తూ బజారున పడేస్తున్నాం.
ఒకవైపు దివ్యమైన రామ మందిరం నిర్మించు కున్న శుభ సందర్భంలో రామాయణంలో కీలకమైన రామసేతు గురించి చర్చ జరుగుతోంది. రావణ సంహారం కోసం లంకకు చేరుకోవడానికి రాముడు నిర్మింపచేసి, నడిచిన రామసేతుపై చరిత్ర, సైన్సు మధ్య యుద్ధం నిత్యం జరుగుతూనే ఉంది. దీనిపై మన రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఆగ్నికి ఆజ్యం పోస్తూ, ఆ వేడితో చలి కాచుకుంటున్నాయి. ఇటీవల ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఉపగ్రహం ఏస్‌శాట్`2 డేటాను పరిశీలించి అది సహజసిద్ధంగా ఏర్పడిరది కాదని మానవ నిర్మాణ మని తేలుస్తూ వంతెన మ్యాప్‌ను విడుదల చేయడంతో రామసేతు మళ్లీ చర్చల్లోకి వచ్చింది. ఈ శాస్త్రవేత్తలు 2018 అక్టోబర్ నుండి 2023 అక్టోబర్ వరకు ఆరు సంవత్సరాలు అధునాతన లేజర్ టెక్నాలజీని ఉపయోగించి సేకరించిన డేటాను పరిశీలించి ఈ మ్యాప్ విడుదల చేశారు. దీంతో ఆ కట్టడం రామసేతే అనే వాదనకు బలం చేకూరింది. భారత్ ` శ్రీలంక మధ్య 29 కిమీల మేర ఈ వంతెన ఉందని, సముద్రగర్భం నుండి దీని ఎత్తు 8 మీటర్లు ఉందని ఇస్రో తెలిపింది. ప్రస్తుతం ఈ సేతు 99.98 శాతం నీటిలో మునిగిపోయి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
రామసేతుకు సంబంధించి సాక్ష్యాలు వెలువడడం ఇది మొదటిసారి కాదు. భారతదేశంలో ఆగ్నేయ తీరంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామేశ్వరం ద్వీపం నుండి శ్రీలంకలోని వాయువ్య దిశలో ఉన్న మన్నార్ ద్వీపాన్ని కలుపుతూ 48 కి.మీలు విస్తరించి ఉన్న రామసేతు సహజంగా ఏర్పడిరది కాదని, దీన్ని రాళ్లతో పేర్చి నిర్మించినట్టు ఉందని పలుమార్లు రుజువయింది. 10వ శతాబ్దంలో మన దేశాన్ని సందర్శించిన అరబ్ యాత్రికులు కొందరు ఇక్కడ వారధి ఉందని పేర్కొన్నారు. రామసేతు 15వ శతాబ్దం వరకు సముద్రమట్టానికి పైనే ఉండడంతో రాకపోకలు జరిగాయి. 1480లో సంభవించిన పెను తుపానుకు ఇది కొట్టుకుపోయింది. ఈ వంతెన లక్షా 25 వేల ఏళ్ల క్రితానిదని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అభిప్రాయపడిరది. ఇక్కడ రామసేతు ఉన్నట్టు నాసా వారు 2002లో తీసిన చిత్రంలో స్పష్టంగా కనిపించింది. రామేశ్వరం, తలైమన్నల్ మధ్య ఉన్న బండరాళ్లను రేడియో డేటింగ్ ద్వారా పరీక్షిస్తే ఇవి 7 నుండి 18 వేల ఏళ్ల క్రితంవని తేలింది. సముద్రపు నీటిపై రాళ్లు తెలుతూ ఇప్పటికీ రామేశ్వరంలో కనిపిస్తుంటాయి. రాళ్లను ఎవరో పేర్చినట్టుగా వారధి నిర్మాణముందని అమెరికాకు చెందిన సైన్స్ ఛానల్ పేర్కొంది. సాంకేతికంగా, శాస్త్రీయంగా ఇన్ని ఆధారాలున్నా కొట్టిపడేసే శక్తులు మన చుట్టూ ఉండడం, వారి మాటలకు ప్రాధాన్యమివ్వడం మన దేశానికే చెల్లింది.
సనాతన ధర్మం పుట్టిన మన గడ్డపై వేదాలు, ఇతిహా సాలు, పురాణాలు, గ్రంథాలు వంటి రచనలు చారిత్రాత్మక ఆధారాలుగా ప్రపంచానికే మార్గదర్శకంగా ఉంటే, మనం మాత్రం సైన్స్, ఆధారాలు అంటూ మన సంస్కృతి పాధాన్యాన్ని మనమే తక్కువ చేసుకుంటున్నాం. రామా యణంలో రామసేతు గురించి స్పష్టంగా వివరించారు. ఈ వారధి నిర్మాణం చేపట్టిన విధానాన్ని కూలంకషంగా తెలిపిన మన ఇతిహాసాలను మనం చిన్నచూపు చూస్తు న్నాం. సీతాన్వేషణలో భాగంగా లంకా నగరానికి వెళ్తున్న శ్రీరామచంద్రుడికి సముద్రుడు దారిచూపుతూ కింది విధంగా చెప్పినట్టు యుద్ధకాండ 22వ సర్గలో ఉంది.
అయం సౌమ్య! నలో నామ తనుజో విశ్వకర్మణః
పిత్రా దత్తవరః శ్రీమాన్ ప్రతిమో విశ్వకర్మణా
ఏషం సేతుం మహోత్సహః కరోతు మయి వానరః
తమహం ధారయిష్యామి తథా హ్యేష యథా పితా
(సౌమ్యుడైన రామా ! వానరయోధులలో ప్రముఖుడైన నలుడు విశ్వకర్మ కుమారుడు, శుభలక్షణములు కలవాడు. నీవు నాయంతటి శిల్పకళానిపుణుడువు కాగలవు ఆని నలుడుకి ఆయన తండ్రి వరాలిచ్చారు. తండ్రివలె ఉత్సాహవంతుడైన ఈ నలుడు కార్యదక్షుడు. ఇతను నాపై (సముద్రము) సేతువును నిర్మించగలడు. నేను దానిని భరించగలను)
సముద్రుడి సూచనల మేరకు శ్రీరామచంద్రుడు నలుడు అనే వానరుడికి వారధి బాధ్యతలు అప్పగించినట్టు పై శ్లోకాల ద్వారా తెలుస్తుంది. అంతేకాక వారధి నిర్మాణంలో సాంకేతిక నిపుణుడైన నలుడి నేతృత్వంలో వానరులు ఎంతో ఉత్సాహంగా సేతు నిర్మాణ పనుల్లో పాల్గొన్నట్టు కూడా యుద్ధకాండ 22వ సర్గలో ఉంది.
తతో తిసృష్టా రామేణ సర్వతో హరియూథపాః
అభిపేతుర్మహారణ్యం హృష్టాః శతసహస్రశః
తే నగాన్న సంకాశాః శాఖామృగగణర్షభాః
బభంజుర్వానరా స్తత్ర ప్రచకర్షుశ్చ సాగరమ్
(వంతెన నిర్మాణమునకు వానర నాయకులు రాముడు ఆజ్ఞను అనుసరించి లక్షలాది వానరులు సంతోషముతో మహారణ్యమున ప్రవేశించి పెద్దపెద్ద వృక్షాలు, కొండ శిలలను ముక్కలుముక్కలుగా చేసి ఆ బండరాళ్లను వారధి నిర్మాణం కోసం సముద్రంలో వేయడానికి తీసుకొచ్చారు) అంటూ రామసేతు నిర్మాణంలో వానర సేనలు ఎంత ఉత్సాహంగా పాల్గొన్నాయో రామాయణంలో చెప్పారు.
విశాలః సుకృతః శ్రీమాన్ సుభూమిః సుసమాహితః
అశోభత మహాసేతుః సీమంత ఇవ సాగరే
(సేతువు విశాలంగా, ధృడంగా నిర్మితమైంది. ఎత్తుపల్లాలు లేకుండా సమతలంగా ఉన్న ఆ వంతెన శోభయమానంగా ఉంది) రామసేన సేతు నిర్మాణ లక్ష్యాన్ని పూర్తి చేసిన విధానం యుద్ధకాండలో వర్ణించారు. రామచంద్రుడి నేతృత్వంలో నిర్మించిన రామసేతు ప్రస్తావన రామాయణంలోనే కాక మహాభారతంలోని అరణ్యపర్వం రామోపాఖ్యానంలో కూడా ఉంది.
ఇత్యుక్త్వాంతర్హితే తస్మిన్ రామో నలమువాచ హ
కురు సేతుం సముద్రే త్వం శక్తో హ్యసి మతో మమ
(సముద్రుడు అంతర్థానం కాగానే రాముడు నలునితో నీవు సముద్రంలో సేతువుని సమర్థంగా నిర్మించగలవు అని చెప్పారు) అంతేకాక శ్రీ రామచంద్రుడు సేతు నిర్మాణానికి వానర సేనకు దశ దిశను నిర్దేశించారు.
తేనోపాయేన కాకుత్‌స్థః సేతుబంధమకారయత్
దశయోజనవిస్తారమ్ ఆయతం శతయోజనమ్
(రామచంద్రుడు పది యోజనాల వెడల్పు, వంద యోజనాల పొడవు గల సేతు నిర్మాణాన్ని పూర్తి చేయించాడు) అని మహాభారతంలో కూడా రామసేతు గురించి వివరంగా వర్ణించారు. రామాయణం కాలం అయిన త్రేతాయుగంలో నిర్మించిన రామసేతు మహాభారతం కాలం నాటి ద్వాపరయుగంలో కూడా ప్రస్తావించారంటే అది ఎంత కాలం చెక్కు చెదరకుండా ఉన్నదో తెలుస్తోంది.
ఇన్ని ఆధారాలున్నా ఇది మానవ నిర్మితం కాదని సహజసిద్దంగా ఏర్పడిన కట్టడమని, కాల్పనికం అని వితండ వాదనలకు, ఇంతకుముందు అమెరికా సైన్స్ ఆధారాలు, ప్రస్తుతం ఇస్రో శాస్త్రవేత్తలు అందించిన డేటా అది రామసేతే అని తగిన రుజువులతో సహా నిరూపించాయి. గతంలో అమెరికా సైన్స్ వారిచ్చిన ఆధారాల్లో అక్కడ పెద్దపెద్ద బండరాళ్లు పేర్చిన కట్టడం ఉందని కూడా తేలింది. ఆ రాళ్లు 7 వేల ఏళ్ల క్రితంవని, ఇసుక 4 వేల ఏళ్ల క్రితందని వీరి పరిశోధనలో తేలింది. ఇసుక కంటే ఆ బండరాళ్లు ఇంకా పురాతనమైనవని ఆ పరిశోధనలో తేలింది. పలు చోట్ల ఇసుక గుట్టగుట్టలుగా ఏర్పడి వంతెనలా కనిపిస్తుందని కొందరు వాదిస్తుంటారు. అయితే వంతెనలో ఉన్న రాళ్లు ఎక్కడినుండి వచ్చాయనే ప్రశ్నకు సమాధానం ఉండదు. రామాయణంలో చెప్పినట్టు రాళ్లు నీళ్లలో తేలుతాయా? అని మరో వాదన కూడా ఉంది. అయితే ఇవి అగ్నిశిలకు చెందిన రాళ్లుగా పలు పరిశోధనలో తేలాయి. వీటికి నీటిలో తేలే స్వభావం ఉంటుందని కూడా శాస్త్రీయంగా నిరూపితమైంది. వారధి నిర్మాణ సమయంలో రాముడు ఆదేశానుసారం వానరులు పలు పర్వతాలను, కొండలను బండరాళ్లుగా ముక్క ముక్కలు చేసి సముద్రంలో వేశారని యుద్ధకాండలో స్పష్టంగా పేర్కొన్నారనే విషయం గమనార్హం.
రామసేతు అంశంపై ఇంతలా చర్చ జరగడానికి ప్రధాన కారణం వానరుల సాయంతో రాముడు నిర్మించిన ఈ వారధిని హిందువులు తమ ఆత్మగౌరవంగా, సెంటిమెంట్‌గా భావిస్తుంటే చరిత్ర, దేశ ప్రజల మనోభావాల కంటే ఆర్థిక, వ్యాపారాలకే ప్రాముఖ్యత ఇచ్చి దీన్ని తొలగించాలని చూడడంతో బ్రిటిష్ కాలం నుండే రామసేతు వివాదం ప్రారంభ మైంది. బ్రిటిష్ పాలకులు ఆడమ్ బ్రిడ్జిగా పిలిచే ఈ రామసేతు వారధిని తొలగించడానికి ప్రయత్నిం చారు. సముద్ర ప్రయాణానికి ఇది అడ్డుగా ఉందని, దీంతో శ్రీలంక చుట్టూ తిరిగి ప్రయాణం చేయాల్సి రావడంతో అధికంగా ఖర్చే కాకుండా, సమయం వృథా అవుతుందని భావించిన నాటి బ్రిటిష్ సర్కార్ రామసేతును తవ్వి ప్రాజెక్టు నిర్మించాలని 1860లో భావించింది. అయితే అది త్రేతాయుగంలో రాముడు నిర్మించిన వారధి కావడంతో అన్నివైపుల నుండి వ్యతిరేకత రావడంతో బ్రిటిషర్లు వెనకడుగు వేశారు. బ్రిటిష్ పాలకులు నయానో భయానో మన సంస్కృతికి గౌరవమిస్తూ రామసేతు తొలగింపును పక్కన పెట్టినా స్వతంత్ర భారత్‌లో మాత్రం వారధి తొలగింపునకు తీవ్రస్థాయిలో కుట్రలు జరుగుతుండడం సనాతన ధర్మంపై దాడిగానే భావించవచ్చు.
దేశ ప్రజలు విశ్వసించే ఇతిహాసాలను, చరిత్రను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా గత ప్రభుత్వాలు హేతుబద్దం లేకుండా మెజార్టీ ప్రజలు విశ్వసించే ధర్మంపై దాడి చేసే వాదనలకే ప్రాధాన్య తనిస్తూ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. 2005లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రామసేతు కట్టడాన్ని తవ్వుతూ సముద్రమార్గం నిర్మించాలని పూనుకుంది. ఆర్థిక ప్రయోజనాలతోపాటు సముద్ర ప్రయాణంలో సమయం కూడా కలిసి వస్తుందని ఇది దేశా పురోగతికి ఎంతో తోడ్పడుతుందని ఆ ప్రభుత్వం చెప్పుకుంది. ఈ ప్రాజెక్టుపై ప్రధానంగా హిందూ సమాజం నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దీనికి తోడు పర్యావరణానికి కూడా ఈ ప్రాజెక్టు హానికరమనే వాదనలు వచ్చాయి. ప్రభుత్వ చర్యలపై హిందూ సంఘాలు, పర్యావరణవేత్తలు నిరసనలు తెలియజేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించాయి.
ఈ సందర్భంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టులో ఒక అఫిడ్‌విట్ దాఖలు చేసింది. ‘‘సముద్రంలో వివాదాస్పదంగా ఉన్న ప్రాంతంలో వంతెనే లేదు. ఒకవేళ దానిని ఎవరైనా నిర్మించి ఉంటే అప్పుడే నాశనం చేసి కూడా ఉండచ్చు. ఈ మధ్య రామసేతు పూజనీయ ప్రాంతంగా మారింది’’ అని కోర్టుకు తెలిపిందంటే వారికి హిందువుల విశ్వాసాలపై ఎంత గౌరవ మర్యాదలు ఉన్నాయో తెలుస్తుంది. సంపూర్ణ మెజార్టీ లేని తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సనాతన ధర్మం వ్యతిరేకి అయిన డీఎంకే ఒత్తిడికి లొంగి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది. హిందూధర్మం అన్నా, రాముడన్నా విరుచుకుపడే డీఎంకే అవకాశం వచ్చినప్పుడల్లా ఈ అంశాన్ని రాజకీయం చేస్తూనే ఉంది. బలహీన మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో తమ పార్టీకి చెందిన టి.ఆర్. బాలుకు కేంద్రంలో రోడ్డు, రవాణా, షిప్పింగ్ మంత్రి బాధ్యతలు అప్పగించి డీఎంకే రామసేతుపై కుట్రలు చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రముఖ హిందూ సాధు సంతువులు ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిస్తే ఆయన మంత్రి టి.ఆర్.బాలును సంప్రదించమని చెప్పారు. అత్యున్నత స్థానంలో ఉన్న ప్రధాని జూనియర్ అయిన మంత్రిని కలవమని చెప్పడం ఆ ప్రభుత్వ కుట్రను తేటతెల్లం చేస్తుంది. రామసేతుపై ఎవరినీ లెక్క చేయకుండా ముందుకు సాగాలని యూపీఏ ప్రభుత్వం నిర్ణయించినా 2007లో పనులను ఆపివేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. అంతేకాక దీన్ని జాతీయ వారసత్వ చిహ్నంగా ప్రకటించాలని సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ కూడా కోర్టు విచారణలో ఉంది.
రామసేతుపై ప్రాజెక్టు నిర్మాణంపై వాజ్‌పేయి ప్రభుత్వంలోనే నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ ఈ నెపాన్ని బీజేపీపై నెట్టడానికి నిత్యం ప్రయత్నిస్తోంది. అంతేకాక మోదీ`2 ప్రభుత్వంలో కేంద్ర మంత్రి జితేంద్ర ప్రసాద్ పార్లమెంట్‌లో ఒక ప్రశ్నకు జవాబిస్తూ రామసేతు ఉందని బలంగా చెప్పడం కష్టమని, పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ సమాధానాన్ని కాంగ్రెస్ తమకు అనుకూలంగా మల్చుకుంటూ అక్కడ రామసేతు లేదనే తమ వాదన నిజమని బీజేపీ ఒప్పుకుందని ప్రచారం చేసింది. కేంద్ర మంత్రి మాటలను అదునుగా తీసుకొని స్టాలిన్ ప్రభుత్వం ఇక్కడ ‘సేతు నిర్మాణం ప్రాజెక్టు’ చేపట్టాలని ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానించింది. తమిళనాడుతో పాటు దేశ ఆర్థిక పురోగతికి కూడా సేతు ప్రాజెక్టు ఎంతో తోడ్పడుతుందని తీర్మానం సందర్భంగా డీఎంకే వ్యాఖ్యానించింది. మనో భావాలను ఆర్థిక లావాదేవీలతో ముడిపెట్టడం మన దేశంలోని రాజకీయ పార్టీలకే చెల్లింది. ప్రాజెక్టును చాలా కాలంగా వ్యతిరేకిస్తున్న బీజేపీ కూడా కొన్ని షరతులతో తీర్మానానికి మద్దతిచ్చింది. వాజ్‌పేయి, మోదీ హయాంలో బీజేపీ రామసేతు కట్టడానికి ఎలాంటి నష్టం జరగకుండా చేపట్టే ప్రాజెక్టుకు మాత్రమే మద్దతిచ్చింది. ఈ షరతును బహిరంగ పర్చకుండా ప్రత్యర్థులు బీజేపీకి కూడా ఇందులో భాగస్వామ్యం ఉందని ప్రచారం చేస్తున్నారు. ఈ అంశాన్ని బీజేపీ కూడా సమర్థవంతంగా తిప్పి కొట్టలేకపోవడంతో వారి వైఖరిపై కూడా సహజంగానే అనుమానాలొస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోదీ రామసేతు ప్రారంభ ప్రదేశమైన అరిచల్ మునైని సందర్శించడం ఇక్కడ గమనార్హం.
మన దేశంలో ఇతర మతాలకు చెందిన ఏ చిన్న కట్టడాలను ముట్టుకోవాలన్నా ఒకటికి వంద సార్లు తర్జనభర్జన పడే మన సెక్యులర్ ప్రభుత్వాలు బుజ్జగింపుల రాజకీయాలతో ఓట్లు రాబట్టడమే లక్ష్యంగా వంద కోట్ల మంది జీవితాలతో పెనువేసుకున్న ఆదర్శపురుషుడు రాముడన్నా, రామాయణం అన్నా వివక్ష చూపుతూ నిర్ణయాలు తీసుకుంటాయి. దీనికి ప్రధాన కారణం మన దేశంలో మెజార్టీలైన హిందువులు రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపరనే నిర్లక్ష్య ధోరణే. ప్రతి అంశాన్ని సైన్స్‌తో, ఆధారాలతో సరిపోల్చుకునే మన కుహనా మేధావులు, సెక్యులర్లకు రామసేతుకు సంబంధించి ఇతిహాసాలైన రామాయణ, మహాభారతంలో ఉన్న ప్రామాణికాలు అంటే ఎలాగు గిట్టదు. పోనీ వీరికి అమెరికా సైన్స్ సంస్థ ఆధారాలు, ఇస్రో శాస్త్రవేత్తల డేటాపై అయినా విశ్వాసం ఉంటుందా అంటే ఆ నమ్మకం కూడా లేదు. సనాతన ధర్మానికి కేంద్రమైన భారతావనిపై రామసేతును కాపాడుకోవడానికి మన సంస్కృతి, చరిత్ర అంటే విశ్వాసం లేనివారి దౌర్భాగ్యానికి ‘ఏమి సేతుర రామా..!’ అంటూ వేడుకుంటూ రామసేతును కాపాడుకోవడానికి మాలో ఐక్యత కలిగించే శక్తినివ్వాలని ప్రార్థిస్తూ మీ కృపా కటాక్షాలు కోరుకుంటున్నాము.
– డా.ఐ.వి.మురళీ కృష్ణ శర్మ, 9949372280