సంపాదకీయం

శాలివాహన 1946 శ్రీ క్రోధి ఆషాఢ శుద్ధ తదియ – 08 జూలై 2024, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


త్వరితగతిన న్యాయాన్ని అందించే విధంగా రూపొందించిన భారతీయ నేరశిక్షాస్మృతి అమలులోకి వచ్చి (జులై 1), దానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేయడం మొదలెట్టినప్పటికీ, అప్పుడే మొదటి కేసు న్యూఢల్లీిలో నమోదైపోయిందంటే, ప్రజలకు కావలసిందేమిటో వేరే చెప్పనవసరం లేదు. వలసవాద కాలంనాటి ఐపిసి, సిఆర్‌పిసీ, ఎవిడెన్స్‌ యాక్ట్‌ స్థానంలో ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినయమ్‌ కొత్త నేరాలు, కఠిన జరిమానాలు, మహిళలు, పిల్లలపై జరిగే నేరాలకు, తీవ్రవాద కార్యకలాపాలకు శిక్షలను పొందుపరిచారు. బహుశ, ఇదే ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉంది. మైనార్టీల సంతుష్టీకరణ కోసం వారి తీవ్రవాద కార్యకలాపాలను ఉపేక్షించేందుకు, ఇటీవలే పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకున్న తాలిబన్‌ తరహాలో మహిళలను శిక్షించేందుకు ఇకపై కుదరదు మరి. నేరం చేస్తే త్వరితగతిన విచారణ చేసి తగిన శిక్షను విధించే దిశగా ఈ చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల వల్ల ఎన్నో.. ఎన్నెన్నో కేసులు తమపై ఉన్నా ఇంతకు ముందులా తమ ధన, కుల,మత బలంతో పార్లమెంటులోకి ప్రవేశించడానికి ఇకపై అవకాశం ఉండక పోవచ్చు కూడా. ఇది ప్రతిపక్ష నాయ కులకు చాలా పెద్ద విషయమే.

వలసవాదకాలం నాటి చట్టాలను మార్చి, భారతీయ చట్టాలను తీసుకురావడం పట్ల ప్రతిపక్షాలకు అభ్యంతరం ఎందుకు ఉండాలో ప్రజలు కూడా ఆలోచిం చాలి. తరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, త్వరితగతిన న్యాయం ఇవ్వాలని చట్టాలు చెప్తున్నాయి. దానికి ప్రతిపక్షాలు ఇంత తీవ్రంగా అభ్యంతరం చెప్తున్నాయంటే, తమ కాళ్ల కిందకు నీళ్లు ఎప్పుడు వస్తాయోనన్న భయం వారిని దహించివేస్తున్నట్టు కనిపిస్తోంది. పైగా, మూడోసారి కూడా తమకు ఆశాభంగాన్ని కలిగిస్తూ, ప్రధాని మోదీ ఎన్నిక కావడంతో ప్రతిపక్షాలు ఆ ద్వేషాన్ని పట్టలేక అనుచితంగా వ్యవహరిస్తున్నాయి.

ఈ చట్టాలను ప్రవేశపెట్టే సమయంలో కావాలనే నానా గందరగోళం చేసి సస్పెన్షన్‌కు గురైన ప్రతిపక్ష ఎంపీలు నేడు, అబ్బెబ్బే మేం లేకుండానే ఈ చట్టాలను ఆమోదించేశారంటూ సోషల్‌ మీడియాలో ట్వీట్లు చేయడం హాస్యాస్పదం. అలాగే, ఈ చట్టాలు ` పాత చట్టాల ‘కట్‌ కాపీ పేస్ట్‌’ అంటూ ఇప్పుడు మాట్లాడుతున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు అప్పుడే ఎందుకు అభ్యంతర పెట్టలేదో వివరించ కుండా వ్యాఖ్యలు చేయడం అసమంజసం. ప్రజలకు సంబంధించిన ఏ చట్టంపైన అయినా తమకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అవి ఏమిటో సభలో తెలిపి, దానిపై చర్చించి, ఆ చట్టాన్ని అడ్డగించినప్పుడు అది ప్రజాహితం కోసం చేస్తున్నా మంటే ఎవరైనా నమ్ముతారు. కానీ, అటువంటివేమీ లేకుండా సభలో చర్చకు ఆస్కారం ఇవ్వకుండా, ప్రభుత్వం చెప్పేది వినిపించుకోకుండా నినాదాలు చేస్తూ, అల్లరి చేస్తే, స్పీకర్‌ మాటలను, ఉత్తర్వులను లెక్క చేయనప్పుడు, వారిని సస్పెండ్‌ చేసి, సభను నడిపించడం మినహా స్పీకర్‌కు మరొక ప్రత్యామ్నాయం ఉండదు. ఈ దిద్దుబాటు వ్యవహారానికి నాయకత్వం వహించిన హోం మంత్రి అమిత్‌ షా వీరి ఆరోపణలను తిప్పికొడుతూ, ‘భారతీయుల చేత, భారతీయుల కోసం, భారతీయ పార్లమెంటు ద్వారా రూపుదిద్దుకోవడమంటే వలసవాద నేరశిక్షాస్మృతి చట్టాలకు ముగింపు పలకడమే. ఈ నూతన చట్టాల ఆత్మ, శరీరం, స్ఫూర్తి అన్నీ భారతీయమైనవే’ అని స్పష్టం చేశారు.

భారతీయ న్యాయ సంహితలో పొందుపరిచిన సెక్షన్‌ 113 (1), ‘భారత దేశంలో లేదా విదేశంలో అయినా భారతదేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వం, భద్రత లేక ఆర్ధిక భద్రతకు ముప్పు వాటిల్లాలన్న ఉద్దేశంతో లేదా ప్రమాదాన్ని తెచ్చే ఉద్దేశంతో కుట్రలు పన్నినా లేదా ప్రజలను హననం చేసేందుకు, ఆస్తులు ధ్వంసం చేసేందుకు బాంబులు, డైనమేట్లు, పేలుడు పదార్ధాలు, విష వాయువులు ప్రయోగించినా, లేదా కరెన్సీని ముద్రించినా, స్మగ్లింగ్‌ చేసినా అతడు తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్టే’ అని నిర్వచిస్తోంది. తీవ్రవాద చర్యలకు మరణశిక్ష లేదా పెరోల్‌ లేకుండా జీవత ఖైదు విధించాలని సంహిత చెప్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయడం నేరంగా పరిగణించడమే కాక పలు తీవ్ర వాద నేరాలకు నిర్వచనాలను సంహితలో ప్రవేశపెట్టారు. అంతేకాదు, పోలీసు అధికారులు అమాయకులపై జులుం చేస్తే బాధితులు నేరుగా మేజిస్ట్రేటు వద్ద ఫిర్యాదు చేసేందుకు అవకాశాన్ని న్యాయసంహిత కల్పిస్తోంది. అలాగే, పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్‌ స్టేషన్‌లో అయినా ఎఫ్‌ఐఆర్‌ నమోదు, ఆన్‌లైన్‌ ద్వారా ఎఫ్‌ఐఆర్‌, సమన్లు పంపడం వంటి సౌలభ్యాలను కల్పిస్తోంది. ‘పౌరుడు మొదట, ఆత్మగౌరవం మొదట, న్యాయం మొదట’ అన్న స్ఫూర్తితో నూతన చట్టాలను రూపొందిం చారు. పోలీసులు ఇప్పుడు తమ దండం (లాఠీ)తో కాకుండా డేటాతో పని చేయవలసి ఉంటుంది,’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ పోలీసు అధికారులను జనవరిలోనే అప్రమత్తం చేశారు.

కింద పడ్డా పై చేయి మాదే అన్న తంతుగా వ్యవహరిస్తున్న్ల ప్రతిపక్షాలు మర్చిపోతున్న విషయం ఒకటుంది. ప్రతిపక్ష నాయకులు పార్లమెంటులో హద్దులు దాటి నిస్సిగ్గుగా వ్యవహరిస్తుంటే అదంతా తమకోసమే అనుకునేంత అమాయ కత్వంలో ప్రజలు లేరు. కానీ, ప్రజలను తప్పు దోవపట్టించేందుకు ప్రతిపక్షాలు అప్పుడే సోషల్‌ మీడియాలో ఈ చట్టాలపై దుష్ప్రచారాన్ని మొదలెట్టేశాయి. వీటి పై అవగాహన కల్పించేందుకు హోం మంత్రిత్వశాఖ చేపట్టిన చొరవలు సరిపో వడంలేదు. సోషల్‌ మీడియాలో న్యాయనిపుణుల ద్వారా వీటి గురించి ప్రజలకు అర్థమయ్యేలా సరళమైన రీతిలో ప్రచారం చేయడానికి దేశ హితాన్ని కోరేవారు ముందుకు రావాలి.

About Author

By editor

Twitter
YOUTUBE