దేశాన్ని దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ బ్రిటిష్‌ వారి నుంచి విభజించు పాలించు అన్న సూత్రాన్ని పూర్తిగా వంటబట్టించుకుంది. మెజార్టీ హిందువుల సాత్విక ధోరణిని ఆసరాగా చేసుకొని, మైనార్టీలను బుజ్జగించడం, హిందువులు ఐక్యమవుతున్నారంటే వారిని కులాలపేరుతో విభజించడం దాని వ్యవహార శైలిగా కొనసాగింది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలోని హిందువులు ముందెన్నడూ లేనంత ఆత్మగౌరవాన్ని, విశ్వాసాన్ని ప్రదర్శిస్తుండడాన్ని ప్రతిపక్ష పార్టీలు సహించలేకపోతున్నాయని ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ లోక్‌సభ ప్రసంగం ద్వారా దేశం మొత్తానికీ అవగతమైపోయింది. ఒక బలమైన వ్యక్తిత్వంగా రూపుదిద్దుకున్న మోదీ ఇమేజ్‌ను ఎట్లా అయినా దెబ్బతీయాలనే పట్టుదలతో ఉన్న ప్రతిపక్షం దిగజారి మాట్లాడిన వెకిలి మాటలు, చేసిన చేష్టలు పార్లమెంటు చరిత్రలోనే అసభ్యమైనవిగా నమోదు అయి ఉంటాయి. హిందువులు నిరంతరం హింస, ద్వేషంలో నిమగ్నమై ఉంటారంటూ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలకు అభ్యంతరపెడుతూ హిందుత్వమంటే భయాన్ని, ద్వేషాన్ని, అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నారంటూ ప్రధాని మండిపడ్డారు. ప్రధాని మోదీ చేసిన రెండు గంటల ప్రసంగంలో కాంగ్రెస్‌ను, ప్రతిపక్ష పార్టీల కాపట్యాన్ని తూర్పారబట్టారు. తన వ్యంగ్యపూరిత ఉపన్యాసంతో అంత వేడిగా ఉన్న సభలో కాస్త నవ్వులు కూడా పూయించారు.

ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్‌ గాంధీ చేసిన ప్రసంగం అతడి పదివికి, హోదాకు తగినట్టుగా లేకపోవడం సరే, బదులుగా, ఘోర అబద్ధాలు, తప్పుడు వర్ణనలు ఆ పదవిని అవమానించాయి. సభలో ఫోటోలను ప్రదర్శించడం, హిందువులపై అతడు చేసిన వ్యాఖ్యలు పార్లమెంటు లోపలే కాదు బయట కూడా అలజడిని సృష్టించాయి. అగ్నివీర్‌, కనీస మద్దతు ధర సహా అతడు ఇచ్చిన తప్పుడు వివరణలు, అతడి కార్యనిర్వహణా పద్ధతులు ఎలా ఉండనున్నవో చూపించాయి. రాహుల్‌కు పార్లమెంటు కొత్త కాదు. అతడు ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు, రెండుసార్లు అధికార కూటమిలో భాగంగా ఉన్నాడు, రెండుసార్లు ప్రతిపక్షంలో ఉన్నాడు. అయితే, బాధ్యత కలిగిన ఒక పదవిని నిర్వహించడం మాత్రం ఇదే తొలిసారి. ఆ విషయంలో అతడు ప్రదర్శించిన ఉత్సాహం కనిపి స్తున్నా, నిర్వివాదంగా బాధ్యత లోపించింది. అత్యుత్సాహం, క్రమశిక్షణా రాహిత్యం, చెప్పిందే చెప్పడం, అన్నింటికన్నా ప్రమాదకరంగా అబద్ధాలు చెప్పడం పెరిగాయి. అతడి ప్రసంగాలలో అసత్యాలు తప్ప విషయం కనిపించడం లేదు.

దిగువసభలో ప్రతిపక్ష సంఖ్య పెరిగిన నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్‌ హయాంలో అసత్యాలు, తప్పుడు సమాచారం, అబద్ధ ప్రచారం ఉంటాయనే విషయం ఏ మాత్రం పరిశీలనాత్మక దృష్టితో చూసేవారికైనా అర్థమైపో తుంది. లోక్‌సభ ఎన్నికలలో తన పార్టీ అత్యద్భుతంగా రాణించిందనే తప్పుడు అంచనాల్లో రాహుల్‌ ఉన్నాడనేది నిర్వివాదం. అయితే, వరుసగా మూడవసారి కూడా తమ పార్టీ వంద స్థానాలను కైవసం చేసుకోలేకపోయిందనే విషయాన్ని అతడు మరుగుపరుస్తున్నాడు. గతంతో పోలిస్తే కాంగ్రెస్‌ మెరుగుపడినప్పటికీ, అది ప్రస్తుతం అహంకారంగా రూపుదిద్దుకుంటున్న దాఖలాలు సభలో రాహుల్‌ గాంధీ ముఖ కవళికలను, ప్రవర్తనను గమనించిన ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. గతంలోనూ అహంకారం ఉన్నా, ఈసారి తానేదో ప్రధాని నరేంద్ర మోదీపై విజయం సాధించానన్న తప్పుడు విశ్వాసంతో వచ్చింది అది.

రాహుల్‌ తన ఉపన్యాసం మొత్తాన్నీ పార్లమెంటరీ ప్రవర్తనా నియమావళి నిర్దేశించినట్టు స్పీకర్‌ను ఉద్దేశించి కాకుండా, తన కూటమి సభ్యులను ఉద్దేశించే ప్రసంగించడం గమనార్హం. అంటే అతడు తన వారికి ఏ అబద్ధాలు ప్రచారం చేయవచ్చో చూపుతున్నాడన్న మాట. ప్రధాని మోదీ మాట్లాడే టప్పుడు గందరగోళం సృష్టించవలసిందిగా ప్రతిపక్ష సభ్యులకు అతడు సైగ చేయడం స్పష్టంగా కనిపించింది. పార్లమెంటరీ నిబంధనావళి పట్ల రాహుల్‌ గాంధీకి గల నిర్లక్ష్యం కొత్తేం కాదు. గత పార్లమెంటుల కాలంలో ప్రధాని మోదీని బలవంతంగా సభలోనే కౌగలించుకోవడం, వేరొక సభ్యుడికి కన్ను కొట్టడం, ఫ్లైయింగ్‌ కిస్‌లు ఇవ్వడం వంటివన్నీ చేయడానికి గాంధీ వంశపు వారసుడిగా తనకు హక్కు ఉన్నట్టుగా అతడు ప్రవర్తించడం అందరికీ తెలిసిన విషయమే. అయితే, అప్పుడు వాటన్నింటినీ అపరణితి కలిగిన వ్యక్తి చేస్తున్న చేష్టలుగా భావించి, అందరూ కొట్టిపారేశారే తప్ప అతడి అహంకారాన్ని గుర్తించలేదు. ఇప్పుడు తనే స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో భవిష్యత్తులో అతడి ప్రవర్తన పార్లమెంటులో ఎలా ఉండనుందో వేరే చెప్పనవసరం లేదు. ఈసారి ఎన్నికలలో కొద్ది ఎదురుదెబ్బ ఎదురైనా, బీజేపీ, ప్రధాని మోదీ దానిని అడ్డుకుంటారన్నది నిర్వివాదం.

అందుకే ఎన్డీయే ఎంపీలను రాహుల్‌ ప్రదర్శించిన వైఖరిని అనుసరించవద్దని ప్రధాని ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి. సభలో క్రమశిక్షణతో వ్యవహరించవల సిందిగా ఆయన తన ఎంపీలను ఆదేశించారు కనుకనే, రాహుల్‌ గాంధీ నిరాటంకంగా, నిర్లజ్జగా ప్రసంగించి తన అసలు రంగును బయటపెట్టుకున్నాడు. గతంలో అనేకసార్లు చేసినట్టుగానే ఈసారి కూడా సభలో హిందువులకు వ్యతిరేకంగా బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేసి రాహుల్‌ గాంధీ తనను తాను ఇరుకున పెట్టుకున్నాడు. కులాలవారీగా హిందువులను విభజించేందుకు, ఎంత జనాభా ఉంటే అంత హక్కు అంటూ నినాదాలు, హిందువులకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ఎంత అబద్ధమో, వాటన్నింటికీ అతీతంగా ఇటీవలే జగన్నాధ రథయాత్రలో పాల్గొన్న హిందువులు నిరూపించారు. ఈ రకంగా విభజించి పాలించాలన్న అన్నది అన్ని వేళలా సాధ్యం కాదని రుజువు చేశారు.

అగ్నిశేషం, రుణశేషం, శత్రుశేషం, రోగ శేషాలను ఉంచకూడదన్న విషయాన్ని ప్రధాని బాగానే గుర్తించారు. అందుకే, రాహుల్‌ గాంధీకి, అతడి వెనుక ఉన్న వారికీ వారి భాషలోనే సమాధానం చెప్తామని తీవ్రంగా హెచ్చరించారు. సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం తప్ప మరొకటి ఎరుగని కాంగ్రెస్‌పార్టీ వారసుడు, కాలానుగుణ హిందువు అయిన రాహుల్‌ గాంధీ లోక్‌సభలో హిందువులను హింసావాదులుగా అభివర్ణిస్తూ చేసిన ప్రసంగానికి ప్రధాని మోదీ ఘాటుగా స్పందించారు. ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నంత సేపూ డాట్‌ డాట్‌ కూటమి చేసిన అల్లరీ, అందుకు రాహుల్‌ గాంధీ ప్రత్యక్ష ప్రోత్సాహం టీవీల్లో చూసిన ప్రజలు వాస్తవాన్ని గ్రహించారు. విభజించడం తప్ప మరొకటి తెలియని రాజకీయ పార్టీల చేతిలో మరోసారి మోసపోయామని గ్రహించి ఉంటారు.

మొత్తం కాంగ్రెస్‌, దానిని ఆవరించి ఉన్న సంస్థలు, వ్యక్తులు ఈ మధ్య ఒక పిల్లవాడిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని ప్రధాని మోదీ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యానం అసలు నిజాన్ని బయటపెడుతోంది. పరిణితి లేకుండా ప్రతిపక్ష నాయకుడు చేసిన ప్రసంగం, అతడి ప్రవర్తన పిల్ల చేష్టల్లా ఉన్నాయంటూ ప్రధాని మోదీ ఎత్తి చూపారు. తాను చేసిన తప్పులు చెప్పకుండా సానుభూతి పొందేందుకు ప్రయత్నించిన బాలక్‌ బుద్ధి (పిల్ల చేష్ట) గోలను నిన్న లోక్‌సభ వీక్షించిందని, రాహుల్‌ శైలిని విప్పి చెప్పారు.

ఈ మధ్య కాంగ్రెస్‌ పార్టీ తామేదో ఎన్నికల్లో అద్భుతంగా రాణించినట్టుగా ప్రచారం చేసుకోవడాన్ని ప్రధాని మోదీ తప్పు పట్టారు. ‘‘వరుసగా మూడవసారి కాంగ్రెస్‌ 100 స్థానాలను మించలేదు. ఈ నేపథ్యంలో పరాజయాన్ని అంగీకరించడానికి బదులుగా, చాలా అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. మాపై ఏదో గెలిచామన్న ప్రచారాన్ని నిర్మించేందుకు వారు యత్నిస్తున్నారు,’’ అంటూ ప్రతిపక్షాల కాకిగోల మధ్య ప్రధాని వారి కుట్రను బట్టబయలు చేశారు.

 రాహుల్‌ వ్యవహారానికి ఉపమానంగా ఒక పిట్టకథను చెప్పి, సభ్యులను నవ్వించారు. ‘‘తనకు 99 మార్కులు వచ్చాయంటూ అందరికీ చూపించుకుంటూ గప్పాలు కొడుతున్న బాలుడి కథ నాకు గుర్తు వస్తోంది. జనం 99 అన్న మాట వినగానే, అతడిని ప్రశంసించి, ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుండేవారు. కానీ, ఆ బాలుడి టీచరు వచ్చి, అతడికి వచ్చింది 100కి తొంభైతొమ్మిది కాదని, 543 లోననే సత్యాన్ని వెల్లడిరచింది. ఆ మూర్ఖపు పిల్లవాడికి అతడు పరాజయంలో ప్రపంచ రికార్డును స్థాపించాడనే విషయం ఎవరు చెప్తారు?’’ అంటూ మోదీ విచారం వ్యక్తం చేశారు.

అంతేనా, బాలీవుడ్‌ సినిమా షోలే నుంచి కూడా కొన్ని పాత్రలను ఉదహరించారు. కాంగ్రెస్‌ నాయకుల ప్రకటనలు షోలే సినిమాను మించి పోయాయి. కానీ ఆ సినిమాలో గుర్తుంచుకోవలసింది మౌసీజీ (అత్త). మేం మూడోసారీ ఓడిపోయాం మౌసీ, కానీ ఇది నైతిక విజయం. 13 రాష్ట్రాలలో సున్నా సీట్లు వచ్చాయి, అయినా నేను హీరోని అన్న చందంగా వ్యవహరిస్తున్నారని ప్రధాని కాంగ్రెస్‌ నాయకులను ఎగతాళి చేశారు.

సానుభూతి పొందేందుకు లోక్‌సభలో కొత్త డ్రామాను వేశారంటూ వ్యాఖ్యానించిన ప్రధాని దాని వెనుక ఉన్న కారణాన్ని కూడా బట్టబయలు చేశారు. ‘‘వేల కోట్ల రూపాయలను అక్రమంగా అపహరించి నందుకు వారు బెయిల్‌పై ఉన్నామని వారికి తెలుసు. ఓబీసీలు దొంగలన్నందుకు శిక్షపడి, దేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో తమ బాధ్యతారహితమైన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పవలసి వచ్చింది,’’ అంటూ రాహుల్‌ పేరును ప్రస్తావించ కుండానే గతాన్ని గుర్తు చేశారు.

అలాగే, అగ్నిపథ్‌ పథకంపైన, కనీస మద్దతుధర పైనా పార్లమెంటును పక్కదోవ పట్టించేందుకు యత్నించడాన్ని మోదీ ఖండిరచారు. ‘‘కనీస మద్దతు ధరకు సంబంధించి అబద్ధాలు చెప్తున్నారు. అనుభవజ్ఞులైన నాయకులు అరాచక మార్గాన్ని ఎంచుకోవడమంటే, దేశం సమస్యల్లోకి పయని స్తోందని తెలియచేస్తోందని’’ ప్రధాని హెచ్చరించారు. అంతేకాదు, పార్లమెంటు సవ్యంగా సాగాలని గత సోమవారం జరిగినదంతా చిరునవ్వుతో మీరు సహించారని స్పీకర్‌ను ప్రశంసిస్తూ, అటువంటి ప్రయత్నాలను ‘బాలక బుద్ధి’ అన్న పేరుతో విస్మరించ కూడదని, దీని వెనుక లోతైన కుట్ర ఉందని కూడా హెచ్చరించారు.

ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి

గత పదేళ్లుగా తమ ప్రభుత్వం ఎంత నిబద్ధతతో పనిచేసిందో, ప్రజలు చూశారని, మూడవ పదవీ కాలంలో పని వేగాన్ని మూడిరతలు పెంచుతాం. పనులు చేయడానికి మూడిరతలు శక్తిని ఉపయో గిస్తాం, మూడవ పర్యాయం మూడిరతల ఫలితాలు వచ్చే హామీ ఇస్తామంటూ, మోదీ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో కూర్చుని, వాదించడానికి ఏమీ లేనప్పుడు, కాకిగోల చేయాలనేది బీజేపీ ప్రత్యర్ధులు నిర్ణయించుకున్నారని మోదీ ఆరోపించారు. ప్రజా నిర్ణయాన్ని నిజాయితీగా అర్థం చేసుకొని, అంగీకరించండి. ప్రజాభిప్రాయాన్ని అంగీకరించి, ఈ కృత్రిమ విజయోత్సవాల వెనుక దాక్కోవద్దని కాంగ్రెస్‌ను విజ్ఞప్తి చేస్తున్నానంటూ మోదీ అన్నారు.

నీట్‌ పేపర్‌ లీక్‌పై మండిపాటు

యువత భవిష్యత్తుతో ఆటలాడుకునేవారెవరినీ విడిచిపెట్టేది లేదంటూ మోదీ హెచ్చరించారు. నేషనల్‌ ఎలిజిబిలిటీ`కమ్‌`ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఎన్‌ఈఈటి) వ్యవహారానికి సంబంధించి దేశ వ్యాప్తంగా నిందితుల అరెస్టులు జరుగుతున్నాయని మోదీ చెప్పారు. ఇటువంటి సంఘటనలను నియంత్రించే విషయంపై ప్రభుత్వం గంభీరంగా ఉందని యువతకు, విద్యార్ధులకు హామీ ఇస్తున్నాను. మా బాధ్యతలను నిర్వర్తించేందుకు యుద్ధ ప్రాతిపదికన వడివడిగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కేంద్రం ఇప్పటికే కఠినమైన చట్టాలు రూపొందించింది, పరీక్షలు నిర్వహించే ఈ మొత్తం వ్యవస్థనూ బలోపేతం చేసేందుకు ముఖ్యమైన చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని వెల్లడిరచారు. ఈ కేసులో ముగ్గురు ముస్లింలు అరెస్టు కావడంతో ప్రతిపక్షం ఇప్పుడు గతుక్కుమంది.

మణిపూర్‌ వ్యవహారంపై

మణిపూర్‌లో అనేక కుటుంబాలు సమస్యలను, కష్టాలను ఎదుర్కొంటున్నాయి. అందులో అనేకమంది తమవారిని కోల్పోగా, మహిళలపై దారుణమైన అత్యాచారాలు జరిగాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేం దుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తున్నాయి. ఈ రాష్ట్రం వెలుగులను చూస్తుందని దేశానికి హామీ ఇచ్చారు. మనందరం కలిసి దానిని ఎదుర్కొందాం, అక్కడ శాంతిని నెలకొల్పుదాం. మణిపూర్‌ను తిరిగి అభివృద్ధి పట్టాలు ఎక్కించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తామని హామీ ఇచ్చారు.దానితో పాటుగా, ఎన్ని అరెస్టులు జరిగాయి, ఎంత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు వంటి వివరాలు ఇచ్చారు. మణిపూర్‌ను, మొత్తం ఈశాన్య ప్రాంతంను పట్టి పీడిస్తున్న సమస్యలకు మూలాలు కాంగ్రెస్‌ రాజకీయాలలో ఉన్నాయని విమర్శించారు.

ప్రతిపక్ష కూటమిపై వ్యంగ్య బాణాలు

ప్రతిపక్ష కూటమిని పొగరుమోతు వంశాల సమూహమని అభివర్ణిస్తూ, వారు భారత్‌ను రెండు శతాబ్దాల వెనక్కి తీసుకువెడతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ద్వేషాన్ని వ్యాపింపచేస్తున్నామన్న వారి ఆరోపణలను తిప్పికొడుతూ, ‘ప్రతిపక్షం లూట్‌కి దుకాణ్‌, నఫ్రత్‌ కా బజార్‌’ చందమని ప్రధాని అన్నారు. ప్రతిపక్షాల విశ్వసనీయతను ప్రశ్నిస్తూ, వారు మనుగడ కోసం కుటుంబ పార్టీ సహా 26 పార్టీల అహంకారం, ఇండియాను డాట్‌ డాట్‌గా విడగొట్టారని అన్నారు. ప్రతి విషయంలోనూ మమ్మల్ని పరీక్షించిన తర్వాత దేశ ప్రజలు ఇచ్చిన నిర్ణయమిది, పదేళ్ల మా ట్రాక్‌ రికార్డును ప్రజలు చూశారు. మానవసేవే మాధవ సేవ అన్న మంత్రాన్ని నెరవేరుస్తూ, పేదల సంక్షేమానికి మేము కట్టుబడి ఎలా పని చేశామో ప్రజలు చూశారు. ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా, వాటిని సమగ్రంగా ప్రజలు ఓడిరచిన వారి బాధను నేను అర్థం చేసుకోగల నంటూ ప్రధాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

రాహుల్‌ అహంకారం

ప్రధానమంత్రి ప్రసంగిస్తున్నంత సేపూ ప్రతిపక్షాలు నిరాటంకంగా నినాదాలు చేస్తూ అడ్డగించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. వారి ఓపికను శక్తినీ మనం మెచ్చుకున్నా, ప్రధాని పదవిని, భారత పార్లమెంటు సంప్రదాయాలను అవమా నించేలా ఉన్న వారి ప్రవర్తన, ఉద్దేశాలు మాత్రం అప్రియంగానే అనిపిం చాయి. ప్రధానమంత్రి మోదీ మాట్లాడు తున్నప్పుడు లేచి నిలబడి, తన తోటివారిని వెల్‌లోకి వెళ్లమని ప్రోత్సహిస్తున్న రాహుల్‌ను లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా మందలించవలసి వచ్చింది. తమ స్థానాలు 52 నుంచి ఒక్కసారిగా 99కి చేరుకున్న హాంగోవర్‌ నుంచి రాహుల్‌గాంధీ ఇంకా తేరుకోలేదని అతడి ప్రవర్తన చూసిన వారందరికీ అనిపిస్తుంది. కొన్ని ఏళ్లుగా తన పరాజయంపై పేలిన జోకులకు ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో, ఉన్మాదంతో కనిపించాడు.

ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించడం, తక్కువ చేసి మాట్లాడడం అన్నీ కూడా ఉద్దేశ పూర్వకంగా చేస్తున్నవే. మోదీని బలహీనపరచి, ఆయనను నిస్సహాయ స్థితిలోకి తీసుకువెళ్లాలన్న పట్టుదలతో ప్రతిపక్షాలు ఉన్నాయి. ఆ రకంగా, మోదీ బలమైన వ్యక్తిత్వం ఉన్నవాడనే ఇమేజీని ధ్వంసం చేయడం ద్వారా ఎన్డీయే మిత్రపక్షాలు ఆయనను విడిచి వెళ్లేలా చేయాలన్నిదే వారి ఆకాంక్ష. ఆ రకంగా ప్రభుత్వం పడిపోతుందన్నది వారి లెక్క. కానీ, ఇక్కడ వారు ఒక్క విషయాన్ని మర్చిపోయారు. నేడు ప్రధాని మోదీ ఇంత కటువుగా, బలంగా ఉన్నారంటే అందుకు కారణం కాంగ్రెస్‌ పార్టీ, వారి చంకలో ఉన్న మీడియా 12 ఏళ్లపాటు ఆయనను వెంటాడి వేధించడమేనన్నది మరచిపోకూడదు.

 ఇంత గందరగోళం జరిగినా, కొత్త పార్లమెంటు 34 గంటల్లో ఏడు సిట్టింగులతో 104 శాతం ఉత్పాదకతను సాధించింది. నిబంధన 377 కింద మొత్తం 41 అంశాలను చేపట్టగా, 73 ఎ నిర్దేశాల కింద మూడు ప్రకటనలు చేయడమే కాదు, 338 పత్రాలను పార్లమెంటులో ఉంచారు. బీజేపీ వంటి రాజకీయ శక్తితో కాంగ్రెస్‌ నిర్లక్ష్యంగా కాక అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి వ్యవస్థను నియంత్రించడమే కాదు, ప్రతి దుష్ప్రవర్తనను, స్కాంను లేదా ద్రోహాన్ని గమనిస్తూ ఉంటుంది.అందుకే ప్రధాన మంత్రి ప్రతిపక్షాలు, దాని ఈకో సిస్టమ్‌ చేసే ప్రతి కుట్రను వారి భాషలోనే సమాధానం చెప్తానంటూ హెచ్చరించిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

ప్రజాస్వామ్యబద్ధమైన ప్రవర్తనేనా?

ఒక ప్రతిపక్ష నేత ఇంతగా అసత్యాలను, ద్వేషాన్ని వ్యాప్తి చేయడం అన్నది ప్రజాస్వామ్యానికి ప్రమాదఘంటికే. తమది గొప్ప విజయమని, బీజేపీది నిర్ణయాత్మక పరాజయమని కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్షాలు భావిస్తుంటే అవి పెద్ద పొరపాటు చేస్తున్నాయి. గోబెల్స్‌ ప్రచారాన్ని మించి అసత్యాలను ప్రచారం చేసి, సత్యంగా చెలామణి చేయాలన్నది రాహుల్‌ ఆకాంక్ష. సోషల్‌ మీడియా అందుకు ఆస్కారమిస్తోంది. ఎన్నికల కాలంలో బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకుంటోందంటూ ప్రచారం చేశాడు. అలాగే, ప్రాణప్రతిష్ఠ సమయంలో ఆ ప్రాంతంలో పేదలనెవరినీ రానివ్వలేదంటూ రాహుల్‌ మరొక పెద్ద అబద్ధం ఆడేశాడు. అగ్నివీర్‌ పథకం గురించి ఆసువుగా అందులో చేరిన యువత గతి అథోగతేనని, మరణించినవారికి కూడా ఒక్కపైసా రాదంటూ మాట్లాడిన మాటలను తర్వాత వీరగతి పొందిన జవాను కుటుంబమే ఖండిరచింది. పార్లమెంటులో ఒక నిర్మాణాత్మకమైన పాత్రను పోషించవలసిన ప్రతిపక్షం, ఇటువంటి విధ్వంసక పాత్రను పోషించడం ప్రజాస్వామ్యంలో శోభించదు.

అబద్ధ ప్రచారం వ్యూహంలో భాగమే

గత పది సంవత్సరాలలో రాహుల్‌ గాంధీ భారతీయ ప్రజాస్వామ్యాన్ని, భారత ప్రభుత్వాన్ని, జాతి ప్రయోజనాలను పలు సందర్భాలలో ఖండిరచాడు, వేళాకోళం చేశాడు. ఇదంతా వ్యూహాత్మకంగా చేస్తున్నాడని అనేకమంది గ్రహించలేకపోయారు. గత ఏడాది మార్చిలో లండన్‌ వెళ్లినప్పుడు, మా ప్రభుత్వం ప్రతిపక్షం ఆలోచనలను చర్చించడానికి ఇష్టపడదు అంటూ వ్యాఖ్యానించిన రాహుల్‌ గాంధీ, ప్రతిపక్ష నేతగా తనకు అవకాశం వచ్చినప్పుడు కేవలం అబద్ధాలు మాత్రమే చెప్తున్నాడు. 2015-19 మధ్య కాలంలో సగటున రెండువందల నలభై ఏడుసార్లు విదేశాలలో పర్యటించాడు. అందులో ఏడుసార్లు పరిగణనలోకి తీసుకోవలసినవి. ఎందుకంటే, అతడు విదేశీ గడ్డపై భారత ప్రభుత్వంపై దాడి చేశాడు, తప్పుడు వ్యాఖ్యలు చేశాడు.

ఇప్పుడు ప్రతిపక్ష నేత బాధ్యతలు తీసుకున్నందున అతడు బాధ్యతగా వ్యవహరిస్తాడని అందరూ ఆశించారు. కానీ అతడి ప్రతి అడుగూ వ్యూహాత్మంగా వేస్తూ, బీజేపీ అత్యద్భుతంగా రాణించిన మౌలిక సదుపాయాల రంగంపై అవిశ్రాంతంగా దాడులు చేస్తున్నాడు. దానిని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్‌ కంకణం కట్టుకుందని, ఢిల్లీ విమానాశ్రయంలో కప్పు కూలినప్పుడు వారు చేసిన అల్లరి బయటపెడుతోంది. అలాగే, దేశభద్రత విషయంలో బీజేపీ అత్యంత శ్రద్ధ పెట్టి ముందుకు వెడుతోంది. అందుకే, ఆ ఇమేజ్‌ను ధ్వంసం చేసేందుకు అగ్నివీర్‌ను అడ్డంపెట్టుకొని నానా అబద్ధాలు ఆడేశాడు. రక్షణమంత్రి వాస్తవాలను సభలోనే చెప్పినా, నమ్మనట్టుగా నటించి, ప్రజల్లో అనుమానాలు కలిగించే ప్రయత్నాలు చేశాడు.

హిందువులు, హిందుత్వ ఒక్కటే

వామపక్ష, ఉదారవాద, ఇస్లామిస్టు లాబీ హిందూధర్మానికీ, హిందుత్వకు మధ్య భేదం ఉందని ప్రచారం చేసినా పెద్దగా విజయవంతం కాలేక పోయారు. కానీ, సభలో చేసిన ప్రసంగం ద్వారా దానిని పునరుజ్జీవింపచేసే ప్రయత్నం రాహుల్‌ చేశాడు. హిందువులలో అయోమయాన్ని సృష్టించి, రాజకీయ లబ్ధిపొందాలన్న ప్రయత్నం నిస్సందేహంగా జరుగుతున్నది. నెహ్రూ కాలంలో సెక్యులరిజం ముసుగు వెనుక నిజాన్ని చెప్పలేక పోవడానికి పరిస్థితులు కలిసి రాలేదు, ఇప్పుడు దానికి సమయం ఆసన్నమైంది. అందుకు హిందువులు కూడా బాధ్యత తీసుకోవలసి ఉంటుంది.

 ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన నాగరికత చెందినవారిగా దానిని కాపాడుకునేందుకు అనేక స్థాయుల్లో పని చేయవలసిన అవసరం ఉంది. రాహుల్‌ గాంధీ ఆ వ్యాఖ్యలు చేసింది బీజేపీని ఇరుకున పెట్టేందుకు మాత్రమే కాదు. విదేశాలలో ఉన్న అతడి యజమానులు భారత సమాజాన్ని ఎలాగైనా విభజించి తీరాలన్న పట్టుదలతో ఉన్నందునే అతడు అటువంటి ప్రసంగాన్ని చేశాడు. ద్వేషం, అరాచకతను దేశంలో ప్రజ్వరిల్ల చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. శ్రీరామచంద్రుడితో అసలు తమకు సంబంధమే లేదన్నట్టుగా డీఎంకే ఇప్పటికే రాగాలాపన మొదలెట్టిన విషయం తెలిసిందే. అసలు రాముడు ఎవరు? దక్షిణాదితో రాముడికి సంబంధం ఏమిటి అంటూ గతంలో డీఎంకే నాయకుడు ఒకడు చేసిన వ్యాఖ్యలు గుర్తుండే ఉంటాయి. దీనిని బట్టి, వీరు కేవలం కులాల మధ్యే కాదు, శైవులు వర్సెస్‌ వైష్ణవుల మధ్య కూడా చిచ్చుపెట్టేందుకు యత్నాలు ప్రారంభించారు. ఈ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు దక్షిణాదిని విభజించాలన్న డిమాండ్‌తో గత ఏడాది కేరళలలో వామపక్షులు, కాంగ్రెస్‌ నాయకులు సదస్సు నిర్వహించారు.

బీజేపీ ఎంపీలలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసేందుకు సభలో రాహుల్‌, ‘మీరు హిందువులు కాదు. ఆర్‌ఎస్‌ఎస్‌ బీజేపీలు హిందుత్వానికి ప్రతినిధులు కాదు,’ అంటూ గొంతు చించుకున్నాడు. కానీ, ఎదుటివారు ఎవరో చెప్పేందుకు హిందూ ధర్మం అనుమతించదు. ఈశ్వరవాది అయినా నిరీశ్వరవాది అయినా వారిని గౌరవిస్తుందే తప్ప నువ్వు ఇది అంటూ వారిని తప్పుగానో, సరిగానో నిర్వచించదు. కానీ, అబ్రహామిక్‌ మతానికి చెందిన రాహుల్‌ గాంధీ చిన్న బుర్రలోకి ఈ విషయం ఎక్కలేదు. తాను ఇక్కడ ఇంత స్వేచ్ఛగా తిరగగలుగు తున్నాడంటే కారణం, హిందూమతంలో గల ఈ సహనమేననే విషయాన్ని అతడు ఇవాళ కాకపోయినా రేపైనా గుర్తించి తీరాలి.

తెలుపు, నలుపులుగా విషయాన్ని విభజించి, ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నది. ఈ విషయాలను సూక్ష్మరూపంలో, సానుకూలంగా అర్థం చేసుకోవడం అవసరం. మనది హిందూయిజం కాదు, హిందుత్వ లేక హిందూ ధర్మం (‘యిజం’ అనేది సంకుచితత్వాన్నే సూచిస్తుంది). ఇది మన దేశీయ తాత్వికతను, విశ్వాసాలను ప్రతిఫలిస్తుంది. నిజానికి హిందుత్వం మతం కాదు, ఒక జీవన విధానం. సుప్రీం కోర్టు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పింది.

 ‘ధారయతి ఇతి ధర్మః’ అంటే మనను నిలబెట్టేది, ఉద్ధరించేదే ధర్మం. ధర్మానికి అనేక పర్యాయపదాలు ఉన్నాయి. మనిషిగా మనం కుటుంబానికి, సమాజానికీ చేయవలసిన పనులు, బాధ్యతలు కూడా ధర్మమే. సత్యాన్ని అనుసరించడం కూడా ధర్మమే. అహింసను, అవసరమైతే సమాజాన్ని పట్టి పీడిరచే దుష్టులను సంహరించడమూ ధర్మమే. ఇంత విస్తృతమైన రీతిలో భారతీయులు దీనిని పరిగణిస్తారు కనుక ఆంగ్లేయులు దీనికి ఒక పదాన్ని ఇవ్వలేకపోయారు. నిజానికి భారతీయ ఆత్మకు ఈ భావనే పొందికను ఇస్తోందన్నది నిర్వివాదం. తన తాత్విక మూలాలను చెక్కుచెదరనివ్వకుండానే, ఇతర మతాలను ఆహ్వానించి, కలుపుకునే సామర్ధ్యాన్ని హిందూత్వం కలిగి ఉంది. అందుకే, దేశంలో ఇన్ని మతాలు, పద్ధతులు కనిపిస్తాయి. కానీ, ఇప్పటివరకూ అవి సమాజం పనిలో ఎప్పుడూ అడ్డురాలేదు.

అలాగే, భారతీయ సమాజానికి ప్రజాస్వామ్య భావన కొత్తకాదు. కౌటిల్యుడి దగ్గర నుంచి వైశాలి రాజులవరకు అందరూ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడారు. తన పేరులో ‘గాంధీ’ అనే తోక ఉండటానికి కారణమైన మహాత్మా గాంధీ కూడా గ్రామీణ రిపబ్లిక్‌ల గురించి మాట్లాడిన విషయాన్ని రాహుల్‌కు ఎరుక కూడా ఉన్నట్టు లేదు. ఈ సనాతన ధర్మం ఎన్నో అంతర్గత, బహిర్గత దాడులను ఎదుర్కొంది. సమాజంలో ఎన్నో ఒడిదుడుకులను చవి చూసింది, అయినప్పటికీ అది నిత్యనూతనంగా ప్రవహిస్తూనే ఉంది. ఆ విషయాన్ని ఎవరైనా రాహుల్‌కు బోధించాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా తమ ధర్మాన్ని గుర్తించాలి.

ఫ్రాన్సు, యుకె వంటి దేశాలలో ఇటువంటి కుట్రలవల్లే వామపక్షవాదులు అధికారాన్ని కైవసం చేసుకున్నా, ఇక్కడ హిందువులు విజ్ఞతతో వ్యవహరించడం వల్లే ఎన్డీయే తిరిగి అధికారంలోకి వచ్చింది. ఇందుకు హిందువులను అభినందించ వలసిందే. ఇదే విజ్ఞతతో ముందుకు వెళ్లినప్పుడు మాత్రమే భారతదేశం తన పునర్వైభవాన్ని సాధించగలదు.

– డి. అరుణ

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE